ఉత్తరం-6
సింగపూర్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు రాసిన లేఖ
మూలం: ఇంగ్లీష్
స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి
నేపథ్యం:
ఈ ఉత్తరం ……. ఒకరకంగా ….. నా ఆవేదన!
ఓ సింగపూర్ ప్రిన్సిపాల్ ……. తల్లిదండ్రులకు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ ఉత్తరం చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఇది నకిలీ ఉత్తరం. ఏ స్కూల్ ప్రిన్సిపాల్ రాసినాడో వివరాలు ఎక్కడా లేవు. కాబట్టి, అనుభవజ్ఞులు దీనిని నకిలీదిగా తేల్చిచెప్పారు. ఇందులోని భాషతో పాటు …… విషయాలను పరిశీలిస్తే…… ఇది ఇంగ్లీష్ మాతృభాషగా వున్న వ్యక్తి రాసినది కూడా కాదని కొంతమంది అభిప్రాయం.
సింగపూర్ తల్లిదండ్రుల విషయమెట్లా వున్నా …… మన దేశంలో ……. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో …….. తమ పిల్లలు డాక్టర్లు లేదా ఇంజినీర్లు మాత్రమే కావాలనుకొనే తల్లిదండ్రులు …… ఎక్కువగా కనపడుతున్నారు.
ఈ ఉత్తరం రాసినది ఎవరు అనే విషయాల జోలికి వెళ్ళకుండా …… ఆలోచిస్తే ……
పరీక్షల్లో ఓడిపోయి …… ఆత్మహత్యలకి ఒడిగడుతున్న నేపథ్యంలో ….. పిల్లల తల్లిదండ్రులు ….. ఇందులో రాసిన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వాటిని పట్టించుకోవాలి. వారి వారి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మన్యూనతకు గురికాకుండా చూసుకోవాలి.
ఇది తల్లిదండ్రుల బాధ్యత!
ఇది అధ్యాపకుల బాధ్యత!
ఇది సమాజపు బాధ్యత!
ఇది ప్రభుత్వపు బాధ్యత!
గ్రేడులు, మార్కులతో సంబంధంలేని విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం పైన ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి.
***
ఉత్తరం
డియర్ పేరెంట్స్,
త్వరలో మీ పిల్లల పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మీరంతా ….. మీ పిల్లలు మంచి మార్కులతో పాసవాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు.
కానీ, ఒక్క విషయం …. ఈ పరీక్షకు కూచోబోయే పిల్లల్లో ……… ఒక చిత్రకారుడు వున్నాడని గుర్తుపెట్టుకోండి, వాడికి గణితం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళల్లో ….. ఒక పారిశ్రామికుడున్నాడు. వాడు చరిత్ర గానీ …… సాహిత్యం గానీ పట్టించుకోడు.
వాళ్ళల్లో ….. ఒక సంగీత విద్వాంసుడున్నాడు. వాడికి రసాయనశాస్త్రంలో వొచ్చిన మార్కులు పెద్ద విషయం కాదు.
వాళ్ళల్లో ….. ఒక ఆటగాడున్నాడు. వాడికి భౌతికశాస్త్ర విజ్ఞానం కన్నా వాడి శారీరక దారుఢ్యం చాలా అవసరం.
ఒకవేళ మీ అమ్మాయో, అబ్బాయో మార్కులు గొప్పగా తెచ్చుకొంటే ….. అది అద్భుతమే. కానీ ….. అలా కాకపోతే ఆ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని ….. వారి గౌరవాన్ని ….. వారి నుండి దూరంచేయకండి.
“ఇది ఓ పరీక్షే కదా! ఏం ఫరవాలేదు.” ….. అని వారికి చెప్పండి. మార్కులు తెచ్చుకోవడం కాకుండా మరేవో పెద్దపనులు చేయడానికి వారు పుట్టారని వారికి తెలియజేయండి.
వారికి ఎట్లాంటి మార్కులు లేదా గ్రేడులు వొచ్చినా ….. ఆ విషయం పట్టించుకోకుండా వారిని యదావిధిగానే ప్రేమిస్తామని ….. వారిని విమర్శించబోమని వారికి తెలియజేయండి.
దయచేసి, ఈ పని చేయండి. మీ పిల్లలు ప్రపంచాన్ని జయిస్తూవుంటే ….. చూస్తూ వుండండి. ఒక్క పరీక్ష లేదా ఓ తక్కువ మార్కు ….. వాళ్ళ ప్రతిభను, వాళ్ళ కలలను దూరంచేయలేవు.
దయచేసి, డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే ప్రపంచంలో సంతోషకరమైన వ్యక్తులు అని అనుకోకండి.
***
ముగింపు:
నేను రిటైరై ఎనమిదేళ్ళు గడచిపోయినా ….. ఇప్పటికీ ….. అడపా దడపా కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఏదో సలహాల కోసం నన్ను సంప్రదిస్తుంటారు.
ఒకటవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తండ్రి ….. ఆ అబ్బాయి ఇంగ్లీష్ ఉచ్చారణ పట్ల తెగ మదనపడిపోతూ ….. దానికి మార్గాలు నన్ను వెతకమంటాడు.
మరో తల్లి ….. ఎంత చెప్పినా వినకుండా మా అమ్మాయి ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతాను అంటున్నది ….. అట్లా వొద్దు ….. ఇంజినీరింగ్ చేయమని దానికి చెపుతారా ….. నేను మీ వద్దకు తీసుకొస్తాను అంటుంది.
ఇట్లా ఎన్నెన్నో ….. కథలు. మరెన్నో వ్యథలు.
ఇందుమూలంగా ….. తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి!
మీ పిల్లలకు ఏ విషయాలు ఆసక్తికరమైనవో ….. మీరు గమనిస్తూ వుండండి. వారికి ఆసక్తి వున్న విషయాల పట్ల ….. వారిని కార్యోన్ముఖుల్ని చేయండి. పుస్తకాలను, ఆటవస్తువులను వారికి అందుబాటులో వుండేట్లు చూడండి.
ఉపన్యాసం-6
పఠనానందం
వక్త: విలియం లియాన్ ఫెల్ప్స్
స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్
నేపథ్యం:
అమెరికన్ రచయిత, విమర్శకుడు, విద్యావేత్త ….. విలియం లియాన్ ఫెల్ప్స్ ఏప్రిల్ 6, 1933 లో చేసిన ఈ రేడియో ప్రసంగంలో పుస్తకప్రేమికుల భావాల్ని చాలా తాదాత్మ్యంతో చెప్పారు.
అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేసిన ఫెల్ప్స్ అనేక పుస్తకాలు రాశారు …… ప్రసంగాలు చేశారు.
ఆయన పుస్తకాలు, ప్రసంగాల నుండి అనేక కొటేషన్స్ తీసుకోబడ్డాయి.
ఈ ప్రసంగంలోని ….. “Books are of the people, by the people, for the people.” అనే వాక్యం ….. అబ్రాహం లింకన్ “గెట్టిస్ బర్గ్ అడ్రెస్” లోని కొటేషన్ ….. “Government of the people, by the people, for the people.” ను గుర్తుకు తెస్తుంది.
***
ప్రసంగ పాఠం
మానవాళికి లభించిన అన్ని నిధుల్లో ….. పుస్తకాలు చదివే అలవాటు చాలా గొప్పది. అరువు తెచ్చుకొన్న పుస్తకాలకన్నా మన స్వంత పుస్తకాలు మనకు ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అరువు తెచ్చుకొన్న పుస్తకం మన ఇంట్లో అతిథి వంటిది. దానిని మనం చాలా పవిత్రంగా చూడాలి. దానికి ఏ విధమైన చెరుపు జరగడానికి వీల్లేదు. మన ఇంటికప్పు కింద అది ఉన్నంతకాలం ….. దానికి కష్టం వాటిల్లకూడదు. మనం దానిని అజాగ్రత్తగా వదలివేయకూడదు; దానిపైన మనము ఏమీ రాయకూడదు ….. పేజీలను మడవవద్దు. మన స్వంత పుస్తకంలాగ దాన్ని చూడకూడదు. ఒకవేళ ఎప్పుడైనా అట్లా జరిగినప్పటికీ, మనం దాన్ని తిరిగి ఇవ్వవలసిందే.
అదే మన పుస్తకాలే అయితే ….. ఎలాంటి లాంఛనాలు పాటించకుండా ఎంతో ప్రేమాభిమానాలతో ఆత్మీయంగా చూసుకొంటాము. పుస్తకాలు ప్రదర్శనకోసం కాదు ….. వాటిని వాడాలి. పుస్తకాన్ని తెరచి, తలక్రిందులుగా పెట్టలేని పరిస్థితి గానీ …..దానిమీద మనం అనుకొన్నవిధంగా ఏదైనా రాయలేని పరిస్థితి గానీ లేదా టేబుల్ పైన పెట్టడానికి భయపడే పక్షంలో గానీ ….. మనం ఆ పుస్తకాన్ని స్వంతం చేసుకోగూడదు. మనకిష్టమైన వాక్యాలను పెన్నుతో గానీ, పెన్సిల్తో గానీ మార్క్ చేసుకుంటే ….. ఆ వాక్యాలను బాగా గుర్తుపెట్టుకోగలుగుతాము. ఆ తర్వాత ఎప్పుడైనా త్వరగా వెతకగలుగుతాము. అది …… అరణ్యంలో ….. మనం ఏనాడో నడిచివెళ్ళిన దారిని గుర్తుపట్టడం లాంటిది. మన బౌద్ధిక దృశ్యాలను, మన మునుపటి స్వయాన్ని నెమరువేస్తూ ….. తెలిసినదారిలో వెళ్ళే ఆనందాన్ని తిరిగి పొందగలుగుతాము.
ప్రతివారు ….. యవ్వనంలోనే ఓ సొంత లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాలి. తనకు స్వంత ఆస్తి కావాలనుకునే మానవుడి సహజ ప్రవృత్తి అది. ఎలాంటి చెరుపులేకుండా ….. అన్ని ప్రయోజనాలను పొందే ఈ అలవాటును అలవరచుకోవచ్చు. ఎవరికివారే సొంతంగా …… తలుపులు, తాళాలు లేని పుస్తకాల షెల్ఫులు ఏర్పాటు చేసుకోవాలి. పుస్తకాలన్నీ ….. కంటికి కనపడేట్లు, చేతికి అందేట్లుగా వుండాలి. గోడలకు మనం చేసే అన్ని రకాల అలంకరణలకన్నా పుస్తకాలే చాలా బాగుంటాయి. అవి రంగులో, రూపంలో వాల్ పేపర్ల కన్నా వైవిధ్యం కలిగివుంటాయి. వాటి రూపురేఖలు ఆకర్షణీయంగా వుంటాయి. వాటికొక్కదానికి ఒక వ్యక్తిత్వం వుంటుంది. అందువల్ల ….. మనం గదిలో ఒంటరిగా చలికాగుతున్నపుడు కూడా …… మన చుట్టూ మన దగ్గరి స్నేహితులు వున్న అనుభూతికి లోనవుతాము. అవి అక్కడవున్నాయనే భావనే ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజితంగా వుంటుంది. వాటినన్నింటినీ మనం చదవక్కర్లేదు. నేను ఇంట్లో వున్న సమయాల్లో … ఆరువేల పుస్తకాలు వున్న గదిలోనే ఎక్కువ మొత్తంగా గడిపాను. కొత్తవాళ్లెవరైనా వొస్తే ….. వాళ్ళు తప్పనిసరిగా అడిగే ప్రశ్నకు నా దగ్గర ఓ జవాబు సిద్దంగా వుంటుంది.
“ఈ పుస్తకాలన్నీ చదివారా?”
“కొన్ని పుస్తకాలు రెండు సార్లు.”
ఇది వాస్తవికమైన, ఊహించలేని సమాధానం. నిజానికి ….. జీవంతో వుండి, శ్వాసిస్తూవుండే భౌతికమైన స్త్రీ పురుషుల్లాంటి స్నేహితులు వుండరు. చదవడం పట్ల నాకున్న శ్రద్ధ నన్ను ఎన్నడూ ఒంటరివాణ్ని చేయలేదు. అవి ఎట్లా చేయగలవు? పుస్తకాలు ప్రజలవి….. ప్రజల కోసం ప్రజల చేత రాయబడినవి. అజరామరణమైన చరిత్రలో సాహిత్యం ఓ భాగం. అయితే ….. ఈ పుస్తకమిత్రులతో ఒక లాభమున్నది. మీరు అనుకొన్నప్పుడల్లా ….. ప్రపంచపు సంపన్న సమజాన్ని ఆనందించవచ్చు. చనిపోయిన గొప్పవాళ్ళు మనకు అందనంత దూరంలో వుంటారు. బ్రతికున్నవాళ్ళూ అంతే దూరంలో వుంటారు. నిద్రలో గానీ, ప్రయాణంలో గానీ వున్న ….. మన స్నేహితులు, పరిచయస్తులు కూడా అదే దూరంలో వుంటారు. కానీ ….. మన స్వంత లైబ్రరీలో, ఏ సమయంలోనైనా ….. సోక్రటీసుతో ….. లేక ….. షేక్స్పియర్ తో ….. లేక ….. కార్లైల్ తో ….. లేక ….. డ్యూమాస్ తో ….. లేక ….. డికెన్స్ తో ….. లేక ….. షా తో ….. లేక ….. బారీతో ….. లేదా ….. గాల్స్ వర్దీ తో మాట్లాడొచ్చు. ఈ పుస్తకాల్లో ఈ మనుషుల గొప్పదనాన్ని మనం చూడవచ్చుననడంలో సందేహం లేదు. వాళ్ళు మనకోసం రాశారు. వాళ్ళు “తమంతట తామే చాలా శ్రమించారు.” మనల్ని ఆనందపరచేందుకు ….. ఒక మంచి ముద్రవేసేందుకు వాళ్ళ శాయశక్తులా కృషి చేశారు. ఒక మంచి నటుణ్ణి ప్రశంసించే ప్రేక్షకులుగా మనం వారికి అవసరం. కాకపోతే ….. వాళ్ళు పులుముకొన్న రంగుకు బదులు వాటి వెనుక వారి హృదయాంతరాళల్లో దాగివున్న వారి అస్తిత్వాన్ని మనం చూడాలి.
***
ముగింపు:
ఏదైనా ఒక విషయం ….. అది చెప్పబడిన కాలమాన పరిస్థితులు ….. చెప్పినవారి మానసిక, విజ్ఞాన స్థితిగతులను బట్టి ….. పరిశీలించవలసివుంటుంది. ఏనాడో ….. ఎవరో ….. మూడు విషయాల గురించి ఇలా చెప్పారు.
పుస్తకం వనితా విత్తం గతం గతః
అధవా పునరాయతి ….. జీర్ణాచ బ్రష్టాచ ఖండశః!
ముఖ్యంగా పుస్తకాల విషయం ……. పుస్తకాలు తీసుకెళ్ళినవారు తిరిగి ఇవ్వకపోవడం ….. ఇచ్చినా వాటిని నలిపివేసి ఇవ్వడం ….. దాదాపు పుస్తకాలు కొని, అరువు ఇచ్చేవారందరికీ అనుభవయోగ్యమే.
ఇక ఇందులో రకరకాల పర్వాలు! ఆది పర్వం, అరణ్య పర్వం లాగ ….. ఇచ్చాను గదా అని దబాయింపులు!
పుస్తకం పోయింది ….. కొనిస్తాను.
వాడికిచ్చాను గదా ….. వాడు నీకివ్వలేదా?
ఫోన్ చేస్తే పలకకపోవడం.
ఏదో చాలా కష్టాల్లో వున్నాను అని చెప్పడం …..
చివరికి నీ బోడి పుస్తకం ….. అనే అంత దూరం వెళ్తుంది కథ!
****
ఘనపూర్ (స్టేషన్)–వరంగల్ జిల్లా, తెలంగాణ వ్యవసాయదారుల కుటుంబంలో జననం. ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లీష్), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుండి ఇంగ్లీష్ బోధనలో సర్టిఫికెట్కోర్స్ –32 సంవత్సరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఇంగ్లీష్ బోధన. 2011 లో ‘హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్’ గా ఉద్యోగ విరమణ. ఇంగ్లీష్ ఎడిటర్ గా; ఇంగ్లీష్ రైటింగ్, స్పీకింగ్, IELTS శిక్షకుడిగా అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, పాలిటెక్నిక్ పిల్లల కోసం ఇంగ్లీష్ పుస్తకాల రూపకల్పన చేసి, వాటికి అనుగుణంగా టీచర్ బుక్స్ వ్రాశారు. ‘టీచ్ ద టీచర్’ శిక్షణనిచ్చారు. 2014 లో “ఇంగ్లీష్ గ్రామర్ ఫండాస్” అనే టైటిల్ తో పుస్తకం (విశాలాంద్ర ప్రచురణ) వ్రాశారు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి.
Reddy garu
Nice article. Sir
=================
BUCHIREDDY gangula
Thank you Buchi reddy garu.