కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

                                                                –  ప్రొ|| కె. శ్రీదేవి

పుష్పాంజలి కథలు

పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ మంచి చదువరి. పరిచయమైన వ్యక్తుల మనస్తత్వాలనూ, ప్రవర్తననూ క్షుణ్ణంగా పరిశీలించడం, వాటిని కథలుగా మలచడం వల్ల కథలలో జీవకళ ఉట్టి పడుతూంటుంది. 

పాతవ్యవస్థ త్వరితంగా మారుతున్న సంధర్భంగా భద్రమహిళలు గుర్తించ నిరాకరించే ’అనైతిక ఉద్వేగాలను ధైర్యంగా పరిశీలించిన కథలు ’ఇదిమల్లెల వేళయనీ…”, ’ఓన్లీ బికాస్ ఆఫ్ దట్’ ఈమె కథల్లో  ప్రేమ, మోహం, ఇష్టం వంటి అనుభూతుల్ని చలం స్టయిల్ లో పరిశీలించారు.అనైతికాలను చాపకిందికి నెట్టేసే ఆత్మవంచన లేకుండా వికారాలుగా గుర్తిస్తారు. కొత్త సమాజం ఎదుర్కొంటున్న కొత్తభావనలను సరికొత్త స్పందనలను  కథలుగా రూపొందించడానికి ప్రయత్నించారు. విషయ వైవిధ్యం వలన హాస్య,చమత్కార పూరితమైన శైలి వలన ఈమె కథల్లో చదివించే గుణం ఉంది.

పుష్పాంజలి రాసిన కథల్లో ఓన్లీ బికాజ్…” అనేకథ వస్తుపరంగా శిల్పపరంగా కూడా చాలా శక్తివంతమైన కథ. ఒక రకంగా ఈ కథా రచయిత ఇందులో conventional  అలోచనల నుండి బయటపడికొన్ని radical  అలోచనలతో రాయటం జరిగింది. సంతానోత్పత్తి, బైగమీ, వివాహేతర సంబంధాలు, ప్రేమ పెళ్ళిళ్ళు వాటి వెనుకువున్న ’radical ఆలోచనలువ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి ఆంతరంగిక ప్రపంచపు కోర్కెలు, వాటి బాహ్య స్పందనలు మహిళా సంఘాలు,జీవత భాగస్వామిని ఎన్నుకోవటంలో అందానికి  Intelect కి వున్న ప్రాధాన్యత లాంటి అనేక అంశాలు ఈ కథలో చాలా Micro Level లో వున్నప్పటికీ చిత్రించటం జరిగింది. అయితే ఎంతో ambitious గా తీసుకున్న ఇన్ని రకాల అంశాలు శిల్పపరంగా కథను కొంత గందరగోళ పరిచినప్పటికీ భావపరమైన(conceptual strength) బలం దాన్ని ఒక మంచి కథగా నిలిపాయి. కథలోని అనేక layers ద్వారా విరుద్ధ స్వభావాలున్న ప్రాత్రలను ప్రవేశపెట్టి వాటి సారన్ని లేక స్వరుపాన్ని అవే బహిర్గతం చేసుకునేటట్లు చిత్రించటంలో ఈ రచయిత విజయం సాధించారు. ఈ సందర్భంలో రచయితకు శిల్పపరమైన సలహా ఒకటి ఇవ్వటం అవసరం. అదేమంటే, కథలో సంఘటన లేక ఘటన ఎంత ప్రాముఖ్యమో, అది ఒకటిగా వుండటం అంతే ప్రాముఖ్యంగల అంశం. అదే సందర్భంలో కథకున్న పరిధిని మించిన సంఖ్యలో ప్రాత్రలను ప్రవేశపెట్టడం కూడా కథాశిల్పాన్ని దెబ్బతీస్తుంది. అవిషయాలు పక్కన పెడితే,ఈ కథ సమాజంలోని అనేక ద్వంద్వ నీతుల్ని, విలువల్ని, కపట ప్రేమల్ని చర్చకు పెట్టడం జరిగింది. సమాజంలో నీతి అనేది అందరూ అనుసరించాల్సిన విషయం. సమాజం అత్యంత సజావుగా సాగేందుకు అవసరమైన అంశంగా ప్రతివాళ్ళూ భావించి నప్పటికీ అందరూ దాన్ని అతిక్రమించటం ఎందుకు జరుగుతుంది? అనేది నిరంతరం సాహిత్యంలో చర్చించాల్సిన విషయం నైతిక అతిక్రమణను నియమ ఉల్లంగనను ఈ కథ స్పష్టంగా ప్రశ్నిస్తుంది.

        ఈ కథ ప్రారంభంలోనే narrator ఇలా అంటారు. వంచన…. పరవంచన! ప్రపంచమే ఒక వంచనవీలైనప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఉల్లంఘించే నియమావళి! దానికి బద్దులై వుండాలని నీతులు!!ఈ కథలో పాత్రల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మూడు ప్రధాన ప్రాత్రలు అమృతవర్షిణి, శరత్, గోవర్థన రావుల పాత్ర చిత్రణ చాలా శక్తివంతంగా చేయటం జరిగింది. ముఖ్యంగా  అమృతవర్షిణికి వున్న నవీన భావాలు, assertiveness, emotional, rational అంశాలను సమ్మిళితంగా కలిగివున్న ఆమె స్వభావం గోవర్థనరావు ద్వంద్వ ప్రవృత్తి, శరత్ సంస్కారం, అతని కళాత్మక దృష్టి, భావాల్లో స్పష్టత అన్నీ చాలా చక్కగా రచయిత చిత్రించారు.

  సమాజం ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా బైగమీ అమలవుతుంది. అయితే రెండోవైపు మోనోగమీ ఆదర్శంగా చూపబడుతుంది.ఈ ద్వంద్వ విలువలు సమాజంలో సంక్షోభానికి కారణమయ్యాయి. అయితే ఈ  సంక్షోభాన్ని ఆమోదించి వ్యక్తులు నిర్లిప్తంగా మిగలటంలేదు. తమ separate peace తాము వెతుక్కుంటున్నారు. అయితే ఈ వెతుక్కోవటం జరిగిన తర్వాత తమ అస్థిత్వాన్ని assert చేసుకోవడానికి ఈ రచయిత చెప్పినట్లుగా, “ కుంటిసాకులుఅనివార్యమవుతున్నాయి. ఈ separate peace అనేది పురుషునికి సాధ్యమయి నట్లుగా స్త్రీకి సాధ్యపడదు. స్త్రీలు అందుకు పూనుకోరు.  ఫలితంగా వాళ్ళ  జీవితాలు మరింత సంక్షోభంలో వుంటాయి. నిజానికి కుటుంబ వ్యవస్ఠలోకి పెళ్ళితో ప్రవేశిస్తున్న స్త్రీ క్రమంగా తన జీవితాన్ని అంతం చేసుకునే క్రమం మొదలవుతుందని రచయిత ఉదహరిండంలో అసమంజసం ఎంతమాత్రం లేదు. అసలు పెళ్ళితో అన్ని గుర్తింపులన్ని కోల్పోతున్న స్త్రీలు తమ ఐడెంటిటీ(identity) ని చీరల్లోనో నగల్లోనో పిల్లల్లోనో చూసుకుంటున్నారు. ఈ కుటుంబ చట్రానికి లేక పెళ్ళిఅనే structure కి వెలుపలవున్న స్త్రీలకు కూడా వాటిని ఎరగాచూపి tempt చేస్తున్నారు. రచయిత దృష్టిలో ఈ కథలో కమలిని పాత్ర చేసే పని tempt చెయ్యటమే. పెళ్ళిద్వారా స్త్రీల జీవితాల్లో ఏర్పడుతున్న vacuum కు  అమృత వర్షిణి ఇద్దరు అక్కలు కమలినీ, వరూధినీ జీవితాలు ఉదాహరణలు. అమృత వర్షిణి భావించినట్లు వీళ్ళ జీవితాలు బాగున్నట్లే వుంటాయి. కానీ బాగాలేవు. అంతవరకూ ఓ.కె. ఏది బాగలేదో ఎవరూ చెప్పలేదు. ఫలితంగా ఆ జీవితాన్ని ఆమోదించి గాను జీవితం గడిపేందుకు ఇవన్నీ మారుతాయాఅనే ఒకా నొక నిర్లిప్తత, వీళ్ళ అస్తిత్వానికి ఆధారమవుతుంది. ఈ క్రమం మొత్తాన్ని రచయిత ఈ కథలో కేవలం మూడు నాలుగు వాక్యాల ద్వారా ఆవిష్కరించటం జరిగింది. పై అంశాన్ని సునిశితంగా పరిశీలించిన అమృత వర్షిణి పెళ్ళి పేరుతో ఒకా నొక నియంత్రిత నిర్మాణంలో ప్రవేశించటానికి నిరాకరిస్తుంది.  

నా జీవితం నాది, అది నాకు కావాలి. దాన్ని నేను త్యాగం చేయలేను

అని చాలా స్పష్టంగా తనను తాను చెప్పుకోవటమే కాదు అలా వుండడానికి  ప్రయత్నిస్తుంది అయితే ఈ నిర్మాణాల వెలుపల తనకొక మంచి స్నేహితుడు అన్వేషించే క్రమంలో అమెకు ఆకాశ్ ఎదురుపడతాడు ఆకాశ్ పై అమె ఇష్టం అతనితో శారీరకంగా కలిసేందుకు దారితీస్తుంది. ఆ తర్వత ఆకాశ్ చేసిన బ్లాక్ మొయిల్  తో అమె,

నా అన్వేషణలో దొర్లిన మెదటి పొరపాటే …. ఆకాశ్!అని అనుకునేట్లు చేస్తుంది. ఆకాశ్ పాత్ర ద్వారా రచయిత పురుషులలో Polymorphous forms ను ఈ కథ బహిర్గతం చేస్తుంది.

ఈకథలో రచయిత అమృతవర్షిణి  సహజాతానికి (Instinct)సమాజ నియమా నికి  మధ్యవుండే సంఘర్షణను చాలా నేర్పుగా చిత్రించటం జరిగింది. ఉదాహరణకు ఒక సందర్భంలో అమె ఇలా అనుకుంటుంది. సృష్టిలో ప్రతిప్రాణికి తన ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కుంది. నేనిలాగే బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ డోన్ట్ డిస్టర్బ్ మి!అంటుంది ఈ డోన్ట్ డిస్టర్బ్ మిఅనే అచేతనలో అంటున్నది సమాజం నియమాల్ని ఉద్ధేశించే. అలాగే  interior monologues  లాంటివి అక్కడక్కడ ప్రవేశపెట్టడం ద్వారా కూడా రచయిత ఈ విషయాన్ని సంకలించటం జరిగింది. మచ్చుకి ఒక, monologue:

అతన్నేంచూసి లైక్ చేస్తున్నావ్? అందం? నిన్నెపుడూ ఆకర్షించదుగా ?! అతని ఇంటలెక్ట్ చూసి! బట్….ఈలైకింగ్ నిన్నెంత దూరం తీసుకుపోతుందో, దీని గమ్యమేమిటో ….. ఆలోచించావా? మనసు నోరు మూసేశాను”,

ప్రేమ, పెళ్ళి మన సమాజానికి కొత్తకాదు. అయితే అవి ఇటీవల కాలంలో అవకాశవాద ఆలోచనల్లో భాగంగా జరుగుతున్నాయి. రచయిత భావించినట్లు కన్వీవినియంట్ గా వాటిని, వాడుకోవటం జరుగుతోంది.ఆహా ఎంత కన్వీవినియంట్ లవ్ మ్యారేజ్! ఒకే కులం, ఒకే మతం ఒకే ఆఫీసులో ఉద్యోగం. ఇది ఒక అరేంజ్ మెంట్ అవుతుందే తప్ప లవ్ మ్యారేజ్ మాత్రంకాదు.అని అమృతవర్షిణి అనుకోవటంకూడా పై క్రమాన్ని బహిర్గతం చేయటంలో భాగంగానే.

ఈ కథలో అత్యంత కీకకాంశం శరత్  అమృత వర్షిణీల మధ్య ఏర్పడబోయిన సంబంధం, అది విఫలమైన తీరు. శరత్ పట్ల అమృత వర్షిణికి ఏర్పడుతున్న ప్రేమను, ఇష్టాన్ని రచయిత చాలా భావుకతతో చిత్రించటం జరిగింది.కథ ముగింపులో నిజంగా అటువంటి భావుకత అత్యవసరం. అతనితో మాట్లాడకపోయినా నిర్విరామంగా అతని గురించి ఆలోచిస్తూ అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్న అమె అతన్ని శారీరకంగా కలువబోతున్న సందర్భంలో అతనన్న అమృతా షాలిని బదులు నువ్వేనా భార్యవైయుంటే, నేనెంతో అదృష్టవంతుడనై యుండనాఅనే మాటలు అమె మానసిక ప్రప్రంచాన్ని చెల్లాచెదురు చేస్తాయి. ఈ సంక్షోభానికి, అమెలోని డిప్రెషన్ కు రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి అమెకు అన్పించింది. అన్ని విషయాల్లో అతనికి దీటైన షాలిని జీవిత భాగస్వామి కావటం అతని అదృష్టంగా భావించింది.శరత్ గలగలపారే సెలయేరైతే, అమె నిండుగా ప్రవహించేనది”.అని అభివర్ణిస్తుంది. అటువంటిది షాలిని స్ధానాన్ని అతను అంత తృణ ప్రాయంగా చూడటం అమృత వర్షిణికి షాక్. అదే సందర్భంలో అమె అతని దగ్గర ఒకానొక దివ్యానుభూతికి లోనుకాబోతున్న సందర్భంలో అతనికి భార్య వుందనే విషయ  జ్ఞానం ఆమె అతని నుంచి పారిపోయేందుకు కారణమైంది. పై రెండు కారణాలలో రెండవ కారణం బలమైనదనిపిస్తుంది. అందువలన Holeheartedగా తనని అర్పించుకోవడానికి సిద్ధపడ్డ అమె (ఓన్లీ బికాజ్)” only because” of that fact తో దూరమౌతుంది. ఏ సంస్కారం ఉందని అతనికి దగ్గరయిందో ఆ సంస్కారం అతనిలో లేదని తెలిసిన క్షణం అతనికి దూరమవుతుంది.

సమాజంలో అమలులో ఉన్న విలువల్ని ప్రశ్నించే స్త్రీల మీద, అతిక్రమించే స్త్రీ పాత్రలను గురించి రాసేటప్పుడు రచయిత ఒకానొక సంశయానికి సందిగ్ధతకు లోనువుతారు. ఫలితంగా ఆలోచనల్లో నిర్ధిష్టత కొరవడుతుంది రచయిత మరీ concentrate అయినపుడు అటువంటి పాత్రల తీరుతెన్నులపై ఆమాత్రంగా నయినా విమర్శ వుంటుంది. ఈ కథ అందుకు అతీతంగా  రాయటం జరిగింది. పాత్రలను ముఖ్యంగా అమృతవర్షిణీ, శరత్ పాత్రలను వాళ్ళ instinct కి ఎక్కువ  ప్రాధాన్యత ఇచ్చి నడపటం జరిగింది. చెప్పే విషయాలపట్ల ఎంతో conviction వుంటే తప్ప అది సాధ్యపడదు. ఈ విషయంలో పుష్పాంజలి conviction intiguity ప్రతివాక్యంలో కనబడుతుంది.

మంచికథ. మంచి థీమ్. మార్పు అనివార్యం అని సంతృప్తిగా ఊపిరి పీల్చుకోగలిగిన కథ ఇది. పేరు పెట్టడంలో ఇంకొంచెం, ఆలోచించింటే బాగుందని పిస్తుంది. మరకలో మెరుపులు  మరకాకేమిటి? మరక కూడా మంచిదే అని Surf Excel Advertisement చేస్తున్నా మనమింక మరక పదాన్ని వాడుతున్నామంటే, అంత ఆరోగ్యకరం కాదేమోననిపిస్తుంది. ఈకథలో పేరుమాత్రమే అభ్యంతరకరం.  కథ, కథనం, అన్నీ చక్కగా  కుదిరిన కథ ఇది.

ఈక్వేషన్అనే కథలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైంగిక  వేదింపులను చిత్రించిన కథ. స్త్రీవాద దృక్పధంతో గల రచయితలు issues ని తీసుకునేటప్పుడు challenging గా తీసుకోవాలి తప్ప, పరిష్కారం కాదు. అలా చిత్రించడం అధికారంతో, దర్పంతో, deal చెయ్యడం ద్వారా సమస్య పట్ల పాఠకుల focus పక్క దారి పడుతుంది. ధనవంతులైన భర్తలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్న భర్తలున్న స్త్రీలకు మాత్రమే రక్షణ దొరుకుతుందన్న అర్థం స్పురించడం స్త్రీ వాద దృక్పధమున్న రచయితలు అందించే marriage ఇదేనా అన్న సందేహం కలుగుతుంది. ఆఫీసర్ల భార్యలకు మాత్రమే చిత్తచాపల్యం గల మగవాళ్ళు జడుస్తారన్న wrong message pass చేసినట్లవుతుంది.

స్థానిక భాషలపై ఆంగ్ల భాషా ప్రభావం, తల్లి భాషను ఆదరించిన వాళ్ళే ఆభాషలో మాట్లాడటం నామొషీగా భావించడానికి, ఆక్రమంలో తమ సంతానంపై వత్తిడి తేవడానికి వ్యక్తుల మొజును కారణంగా చూపడం సర్వ సాధారణం. ప్రపంచీకీరణ విస్తరించిన క్రమంలో ప్రాతీయ భాషలు క్రమంగా కనుమరుగవడానికి విశ్వవ్యాప్తంగా కనిపించే కారణాలు చాలా సంక్లిష్టమైనవి. వాటిని ఈకథలో స్పర్శించలేదు. సరికదా చాలా dramatic గా బొమ్మ చేసిన ఆయుర్వేద వైద్యంతో డాక్టరు కూడా చేతులెత్తేసిన తరుణంలో బొమ్మ ఆయుర్వేద వైద్యం నీరజ అనే మహిళా పాత్ర భాషలోనే చెప్పాలంటే, ఆకు వైద్యంతో అతను   బ్రతకడం అతడు మినిస్టరవటం, బామ్మ మనవడు చదివే పాఠశాల తనిఖీకి రావడం,  కతంతా నాటకీయంగా కొనసాగుతుంది.

వైరుధ్యం’’,”తడిరెండు కథలు, మానవత్వం పట్ల విశ్వాసాన్ని పెంపొంది౦చే కథలు వ్యక్తులు రకరకాల నేపథ్యాల, ఆవరణాల నుంచి వచ్చిన వాళ్ళు. తమను బలహీన పరుస్తున్న పరిస్థితుల్లో క్రూరంగా ప్రవర్తించి. ఆ తరువాత కలిగే పశ్చాతాపం మనుషుల  వ్యక్తిత్వాన్ని ఎంతగా వెలిగిస్తుందో నిరూపించడానికి చాలా కథలలో పుష్పాంజలి ప్రయత్నించారనడానికి ఈ కథే ఉదాహరణ. 

*****

Please follow and like us:

One thought on “కథాకాహళి- పుష్పాంజలి కథలు”

  1. ఇదీ మంచి సమీక్ష అంటే! శ్రీదేవిగారు సునిశితంగా కధని, పాత్రలని, పాత్రల బాహ్య అంతర మనస్తత్వాలని విశ్లేషింఛడం చాలా బాగుంది. దాదాపు పుష్పగారి కధే చదివినంత వివరం గా చెప్పారు, అంతేకాక మూలకధని, రచయిత్రి ఇతర రచనలని చదవాలన్నంత ఉత్సుకతని కలిగించారు. శ్రీదేవిగారికి అభినందనలు.
    పుష్పాంజలి గారి ఇతరరచనలు తెలుపగలరా!

Leave a Reply

Your email address will not be published.