కథా మధురం
‘దగాపడిన స్త్రీలకి ధైర్యాన్ని నూరిపోసిన కథ! – ‘కనకాంబరం!’
-ఆర్.దమయంతి
స్త్రీ తను చదువుకున్న చదువు కానీ, పరిజ్ఞానం కానీ తన వ్యక్తి గత జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఉపయోగ పడుతోందా? జీవితం లో అతి కీలక అంశమైన – వివాహ విషయం లో తనకు తగిన భర్తను ఎంచుకోవడంలో స్త్రీ పురోభివృద్ధి నిజం గా దోహదపడుతోందా?
ఉద్యోగం వల్ల పొందే ఆర్ధిక స్వేఛ్చ తో బానిస బ్రతుకు నించి నిజం గా విముక్తి లభిస్తోందా?
అన్ని రంగాలలో ముందంజ వేస్తూ రచ్చ గెలిచి, శభాష్ అనిపించుకుంటున్న ఈ వీర వనిత.. ఇంతకీ – ఇంట గెలుస్తోందా?
విందు వేళ ఇలాటి విషాద ప్రశ్నలు వేయకూడదు. కానీ శోధించాలి. స్త్రీ మనోవెతల వెనక దాగిన కలతల ని చదవలాంటే, అట్టడుగున దాగిన మూల కారణాలను వెదికి పట్టుకోవాలి!
స్త్రీ పురోగతుల మీద చేసే సర్వేలు, వాటి ఫలితాలు అంకెలకి అందినట్టు..
స్త్రీ కన్నీటి గాధలు ఏ నివేదనలకు చిక్కవు. ఎందుకంటే..అవి పైకి కనిపించవు. అంతే కాదు, ఆమె హృదయాన్ని చదివి అర్ధం చేసుకోగల విద్యలేవీ ఏ సిలబసు లో కానీ ఏ యూనివర్సిటీలలో కానీ ప్రవేశపెట్టలేదు.
కానీ, అందుకు ప్రతిగా – కథా సాహిత్యం ఆమె అంతరంగ ఆవిష్కరణకి ఆకాశాన్నే పరిచింది.
కొన్ని కథలు – స్త్రీ సమస్యల కి, మానసిక సంఘర్షణలకీ, సమస్యల వలయాలలో కొట్టుమిట్టాడే బ్రతుకులకీ – అక్షర సాక్షిగా అద్దం పడతాయి.
కథలో జీవితం వున్నప్పుడు..అది మనల్ని జీవింపచేయకుండా ఎలా వుంటుంది? కథలో ఆ పాత్రలే మన జీవితాల్లోనూ సజీవంగా కదులుతున్నప్పుడు, కథ ముగింపు – నిజ జీవితాలకు గొప్ప పరిష్కారాన్ని సూచించకుండా ఎలా వుంటుంది? అప్పుడా కథ గొప్ప కథ కాకుండా ఎలా పోతుంది?
గొప్ప కథ అంటే – చమురేసి, వొత్తేసి, వెలిగించిన దీపం లాటిది.అది – చిమ్మ చీకటి బ్రతుకులలో ఆశా కిరణమై ప్రసరిస్తుంది.
ఇలాటి తపస్సు తో, ఉషస్సుతో కథలు రాస్తున్న వారు మనకింకా మిగిలే వున్నారని చెప్పడానికి నిదర్శనం – శ్రీమతి ఓలేటి శశికళ గారి ‘కనకాంబరం’ కథ.
వన్నెతరగని స్త్రీ బంగారు హృదయ సౌందర్యానికి ప్రతీక లా మెరుస్తూ మన ముందు నిలిచింది.
తప్పక చదవండి.
****
అసలు కథేమిటంటే :
కనక చాలా తెలివైన పిల్ల. . ఆమె చదువులో అలా అలా ఎదిగి ఎదిగీ..
స్టాన్ ఫోర్డ్ లో సీట్ సంపాదించుకునే స్థాయి వరకు ఎదుగుతుంది. ఆ వెనకే మంచి జీతమున్న ఉద్యోగము వస్తుంది. అంతవరకు అంతా బాగానే వుంది. కానీ, అలా పెళ్ళి అంటూ ఎప్పుడు చేసుకుందో సరిగ్గా అప్పట్నించి ఆమె తో బాటు ఆమె జీవితమూ బోల్తా పడిపోతుంది. తను మోసపోయాననుకుని గుర్తించే సరికే..వొళ్ళో ఇద్దరు పిల్లలు. ఆ కన్ ఫ్యూజన్ లొ నే కాలమూ నడుస్తుంటుంది. కాకపోతే – ప్రతి క్షణమూ ఒక నరకం గా.
కారణం ఒకటే. కారకుడూ ఒకడే. ప్రతి స్త్రీ విషాదం వెనక తప్పని సరిగా ఒక పురుషుడుంటాడు. అతను ఎవరో కాదు. మొగుడే అయి వుంటాడు.
ఈమె పరిస్థితీ అంతే!
ఊహ వచ్చిన పిల్లల ప్రశ్నలొక వైపు, అంతకంతకీ పెచ్చుపెరిగిపోతున్న అతని దుర్మార్గాలొక వైపు, ఎలాటి సపోర్ట్ లేకుండా పిల్లల్నేసుకుని ఎటు పోవడం? అందరి మామూలు ఆడాళ్ళకుమల్లేనే, కనక కూడానా!
ఇంట్లో ఎంత నరకముండనీ.. కంట్లో ఒక్క కన్నీటి చుక్క.. ఎవరి కంటా పడకూడదనుకునే మనస్తత్వం కనకది. చేతికి అగ్గి రవ్వ తాకితే కెవ్వు మంటాం..మొగుడు మాటలతో గుండె కాలుతున్నా నోరు మెదపని సహనం ఎలా అబ్బుతుందో ఆడదాని కి అర్ధం కాదు.
ఏ ఇల్లాలైతే గుట్టుగా కాపురం చేసుకోవాలని గట్టిగా కోరుకుంటుందో ఆ ఇల్లాలికే ఎక్కువ పరీక్షలు పెడతాడు దేవుడు కూడా! పక్షపాత వైఖరి కామోసు!
అయితే, ఆమె తన మితి మీరిన సహనం వల్ల ముప్పు తనకంటే తన పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతోందని గ్రహించింది.
చివరికి ఆమె తన పిల్లలని తీసుకుని అతని చెర నించి బయటపడుతుంది. ఒక అగ్ని గుండం నించి బయట పడ్డట్టు..!!
ఒక గోనె సంచీ లో బిగించిన ప్రాణం బయట పడి, గాలి పోసుకున్న ట్టు..ప్రాణ వాయువులందు కున్నట్టు ..ఆమె హాయిగా ఊపిరి తీసుకుంది.
ఇప్పుడామె జీవితం ఎంతో సాఫీగా, హాయిగా సాగిపోతోంది. పిల్లలిద్దరూ ఎదిగారు. విద్యాధికులౌతున్నారు. అంతా సుఖం గా సాగిపోతున్న కాలాన ఆమె కి అతని గురించి న ఒక సంగతి తెలుస్తుంది.
సంఘర్షణ మొదలౌతుంది. తను చేయాల్సింది చేసాక, పిల్లల వంక చూసింది. ఆమె నిర్ణయాన్ని వాళ్ళు హర్షించారా? వ్యతిరేకించారా? ఇంతకీ ఏం జరిగింది? – అనే రహస్యం తెలియాలంటే – కథ చదివి తెలుసుకోవాల్సిందే.
***
కథలో స్త్రీ పాత్రలు – స్వభావాలు, వ్యక్తిత్వ ధోరణులు :
కనకాంబరం లో ప్రధాన పాత్రని పోషించిన ‘కనక..’ గురించే మనం ఎక్కువ గా ముచ్చటించుకుందాం.
ఆమె ఎంత గొప్ప తెలివైన విద్యార్ధీ అంటే, ప్రపంచం లో ప్రతిష్టాత్మకమైన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో అడుగుపెట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ లో ఎమ్ ఎస్ చేసి, అమెరికా లో ఉద్యోగం చేస్తూ పెద్ద అంకెలో సంపాదిస్తున్న కనక – ఓ చవటని పెళ్ళాడటమా? అవును. ఇలా ఎలా జరిగింది అసలు? అని మధనపడుతుంటుంది ‘కనక’ కూడా! ‘ ఏ యూనివరిసిటీ లో చదివావ్?’ అని అయినా కనీసం పెళ్ళికి ముందు అడగలేకపోయినందుకు – తన తెలివి తక్కువ తనానికి చింతిస్తుంది! చాలా అతి మామూలు సాధారణ ఆడపిల్లలా!
ఇలా జరిగిన ఓ సంఘటన ఈ మధ్యే పేపర్లో చదివాను. ఆమె ఇంజినీర్. మంచి ఉద్యోగం చేస్తోంది. పిల్లాడికి చదువుతో బాటు వందలెకరాల భూమి వుందని పెళ్ళి చేసారు. అత్తారింటికి వచ్చిన రెండో రోజే ఆమెకి తెలిసిన పచ్చినిజమేమిటంటే అతనొక లారీ డ్రైవర్. కట్నానికి ఆశపడి మోసం చేసారు. తెలియంగానే తండ్రికి ఫోన్ చేసి పొట్టపగిలేలా ఏడ్చింది. నాన్నా మనం మోస పోయాం అంటూ..ఫోన్ పెట్టేసింది, ఆత్మహత్య చేసేసుకుంది.
ఈ కాలం లో కూడా ఇలా జరుగుతుందా అంత తెలివి తక్కువ గా అని మనం అనుకుంటాం..కానీ మోసాలు అనేక చోట్ల అనేక రకాలుగా వున్నట్టే వివాహ వ్యవస్థ లో కూడ జరుగుతాయి. ఈ పచ్చి మోసాలకు ఎందరో అమాయకురాళ్ళు బలి అవుతున్నారు. అందులో అన్నెంపున్నెం ఎరుగని కనక కూడా.
‘అంత చదువుకున్నది కదా?’ అంటారు..అందుకు జవాబు కూడా కథలో వుంది. చదువుకున్న ప్రతి స్త్రీ కి లోకజ్ఞానం, లౌక్యం, గడుసుతనం వుండదు.
చదువు పూర్తి కాగానే ఉద్యోగం..ఉద్యోగం లో చేరగానే తగిన స్థాయి లో వరునితో వివాహం..అది కాగానే హనీమూన్..ఆ పైన ఇద్దరు నలుగురవడం..ఝామ్మంటూ కాపురం చేసుకుంటూ హాయిగా బ్రతికేయడం..’ అని కల కన్నంత సులభం కాదు ఆడదానికి – పెళ్ళి తర్వాతి జీవితం!
‘కనక’ విషయం లో కూడా అదే జరిగింది. అసలు పెళ్ళి లో ఇలాటి మోసాలు, కపటాలు, అత్త గారి మాటల నాటకాలు వుంటాయని ఆమె కలలో కూడా వూహించి లేదు. పైగా కాలం అంతా ఆమెకి పుస్తకాలలోనే గడిచింది. విషయ పరిజ్ఞానం మీదే దృష్టి నిలిపిన స్కాలర్. ‘ నువ్వేమిటీ, ఈ వెధవతో కాపురమేమిటి..విడాకులిచ్చేయ్..’ అని సానుభూతి చూపిస్తాం కనక వంటి వారి మీద మనం. కాని అది అంత సులభమా? అందులోనూ, ఇద్దరు పిల్లలు పుట్టాక? వారికి తండ్రి లేని వారిని చేసిన నేరమో పాపమో తనకి చుట్టుకోదా? అని వెనకా ముందులాడుతుంది కనక. ఇక్కడే ఈ పాత్ర మెత్తని మనసు మనకు అర్ధమౌతుంది.
తాను జీవితం లో చాలా ఘోరం గా మోసపోయానని తెలిసినప్పుడు గుండె పగిలే దుఃఖం కలిగినా..అది పైకి కనిపించనీకుండా నవ్వు పులుముకుంటానంటుంది – కంక పాత్ర.
కారణం – నలుగురు నవ్వుతారని భయం. ‘కనక మొగుడు ఇలాటి వాడట ‘అని లోకంఅనుకుంటే తల కొట్టేసినట్టౌతుంది..
మొగుడి దుర్మార్గా లని ఇల్లాళ్ళు ఇలా దాచి, కాచడం వల్లనే కొందరి మృగాల హింసలు పేట్రేగిపోతున్నాయి.
మొగుడు కొట్టాడని, బూతులు తిడతాడని నల్గురికీ తెలిస్తే.. పోవాల్సిన పరువు అతనిది కదా? తప్పు చేస్తోంది అతను కదా? తెలిస్తే సిగ్గు పడాల్సింది అతను కదా? మరి ఈ పిచ్చి పెళ్ళాలెందుకండీ?- చేయని నేరానికి, పాపానికి ఇలా బలౌతారు? – అదే తెలీదు. తెలిస్తే ఆమె భార్య ఎలా అవుతుంది. అదే తెలిస్తే..తాళి కట్టించుకున్న ఒకే ఒక్క కారణానికి.. బంధానికి..ఇంత గా జీవితాన్ని ఫణం గా పెడుతుంది?
వినగా వినగా కాకుల రొద చెవులకి అలవాటైపోతుందేమో..చీకటి అడవిలో బ్రతికేయడమూ అభ్యాసమైపోతుందేమో..అందుకే కనక కూడా అలా బ్రతికేయడానికే అలవాటు పడిపోతుంది..పిల్లలు ప్రై యారిటీ లో చాలా మమది తల్లులకు – మొగుడి దుర్వ్యసనాలు..దుష్ట చర్యలు సెకండరీ అయిపోతాయి. కనకలో ఇలాటి వైఖరి స్పష్టం గా కనిపిస్తుంది.
కనక లో మరో గొప్ప సంస్కారమేమిటంటె..ఎవరైనా వచ్చి, ఫలానా ఆవిడ ఇట్టా ట..అట్టా ట అనే మాటల్ని వినడం ఆమెకి పడదు. నచ్చదు. నిజానిజాలు తెలీకుండా ఇలా స్త్రీల మీద నిందలెందుకేస్తారు అని తనలో తను బాధపడుతుంది.
ఈ పరిస్థితి కనక కి మాత్రమే కాదు మనకీ అనుభవమైనదే కదూ?
ఈ పాత్ర నించి నేర్చుకోవాల్సింది ఏమిటంటె..స్త్రీలు స్త్రీని గౌరవించడం నేర్చుకోమని! ఉబుసుపోక చెప్పుకునే మాటల వల్లే చాలా మంది మంచి స్త్రీలు కూడా సమాజానికి చెడ్డ వారుగా కనిపించే ప్రమాదమూ లేకపోలేదు.
నిందవల్లే కదూ? నిప్పు లాటి సీతమ్మ సైతం అగ్ని ప్రవేశం చేస్తుంది?
వెనక చెప్పుకోవడాలను తీవ్రం గా నిరసిసించే పాత్ర – కనక!
ఆడదాని మనసు పువ్వు లాటిదే. కానీ, ఎదురు తిరిగితే అది కత్తి వంటిదే అంటాడు ఒక కవి. – ‘కనక’ మనసు కూడా అలానే మారింది. ఇప్పుడు కఠినమైపోయింది.
భరిస్తోంది కదా అని పెళ్ళాం ఓ పిచ్చిదనుకోవడం..ఆ మొగుడి తెలివితక్కువతనం. తెగే దాకా ఏదీ సాగదీయకూడదు. పెళ్ళాం తాళి బొట్టు తెంచి తన ముఖాన విసిరికొట్టే దాకా ఏ మొగుడూ హింసించకూడదు.
స్త్రీ సహజ గుణ సంపద లలో – ఒకటి – సున్నిత హృదయం! ఇదొక గొప్ప సిరి వంటిది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషుల మీదే ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే..ఆ సహనమే వారి పాలిట శాంతిసుఖాల సౌధం కాబట్టి. సరిగ్గా ఇదే సందేశాన్నిస్తుంది కనక పాత్ర. ఎలా అంటే, ఆమె ఎప్పుడైతే దూరమౌతుందో సరిగ్గా ఆ క్షణం నించే అతని జీవితం గాడి తప్పి గోతిలో పడుతుంది.
బాధ్యత మరువని స్త్రీ – కనక పాత్ర :
స్త్రీ కంటే పురుషుడు బలవంతుడు, ధైర్యవంతుడు అని అంటుంటారు కానీ నిజానికి స్త్రీ లోనే ఆ మనో లక్షణాలు చాలా ధృఢం గా వుంటాయని ‘కనక ‘ పాత్ర చెబుతుంది.
వ్యక్తిగతం గా నాకనిపిస్తుంది..చాలా మంది స్త్రీల తెలివితేటలనీ, వ్యవహార వ్యూహ రచనలనీ, ఆ చాకచక్య చతురతాలను చూస్తున్నప్పుడు..’ఇంత గొప్ప మనిషికి ఆ వెధవ మొగుడి పీడ లేకుంటే.. ఇంకెంత ఎత్తుకి ఎదిగేదో కదా!’ అని.
కనక ని చదివినప్పుడు కూడా ఇలానే అనిపించింది.
ఈ పాత్రలో సర్దుకుపోయే గుణమూ, వున్నంతలో శాంతిగా బ్రతాకాలనే వాంఛ లు కొట్టొస్తూ కనిపిస్తాయి. కాపురంలో చిన్న చిన్న కలతలకే కుంగిపోయే స్త్రీలకు ఈమె ఒక గొప్ప కనువిప్పు గా కనిపిస్తుంది. రోగం రొష్టు, కాపురం గుట్టు కి ‘కనక’ ఓ చిరునామా గా మిగులుతుంది.
కాపురంలో మొగుడి వల్ల వచ్చే కష్టాలకి పరిష్కారం ఏమిటన్నది ఆ భార్యే తేల్చుకోవాలి తప్ప, పదిమందికీ చాటింపు అనవసరం అని కూడా బోధిస్తుంది. నిజానికి ఈ పాత్రస్వభావం మనకి సరిగ్గ ఇక్కడే ఉన్నతంగా కనిపిస్తుంది.
తల్లి గా ఆమె పాత్ర ఎంత గొప్ప గా వుందంటే – వాళ్ళు మామ్మ తాతలకి పరిశుభ్రత గురించి చెబుతున్నప్పుడు ‘కనక’ చేతి సంతకం ఆ పిల్లల మాటల మీద స్పష్టం గా మెరుస్తూ కనిపిస్తుంది.
అంతే కాదు, తండ్రిని ప్రశ్నించేటప్పుడు కూడా! (ఏమిటా ప్రశ్నలు అనేవి కథలో చూడొచ్చు.)
దేవుడు సైతం – చెడుని భరిస్తాడు కానీ విజయం మాత్రం మంచికే దక్కిస్తాడు. కనక లోని దైవత్వ గుణం కూడా అదే. మంచితనం. సహనం. చదువుతో బాటు వచ్చి చేరే విచక్షణా జ్ఞానం..అన్నీ ఆమెని ఆకాశమంత ఎత్తులో నిలబెడతాయి. ఆమె పక్షాన నిలిచి, ఆమె కి అండగా నిలిచింది ఎవరో కాదు..తాను పెంచుకున్న మల్లెపూలవంటి పిల్లలే.
భర్తని విడిచేసాక కనక చాలా తెరిపిన పడింది. కరక్టే. కానీ ఆమె మనసులో ఎక్కడో ఏ మూలో భర్త పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ..అలానే వుండిపోయిందా అనిపిస్తుంది.
ప్రతి స్త్రీ మనసు తెల్ల కాగితం వంటిది. అందులో మొదటి సంతకం – భర్త దే! చెరిపేసినా..ఆనవాళ్ళు మిగిలే వుంటాయి. లేకపోతే అది వివాహ బంధం ఎలా అవుతుంది?
ప్రయాణం లాటి జీవితం లో – అనుకోకుండాభర్త దుస్థితి చెవిన పడుతుంది. ఆలోచించాల్సిన అవసరం లేకున్నా..ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుందంటే..ఆమె ఇంకా అతన్ని మరచిపోలేదేమో అనిపిస్తుంది.
పాత్ర స్వభావాల రంగులన్నీ – ఆ యా సన్నివేశాలనుసారం.. చదువరుల మనసుల మీద ముద్రించుకు పోతాయి.
చెదరిన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి కనక పాత్ర ఒక మార్గదర్శి లా నిలుస్తుంది.
మనకే ఎందుకిలా జరుగుతుందని కుమిలిపోయే స్త్రీలకు కనక పాత్ర ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తుంది. మోసపోవడం దురదృష్టం కాదు. అలానే ఏడుస్తూ చతికిలబడ కూడదు. బయట పడేందుకు యోచించాలి… అనే సలహాన్నిస్తూ, తగిన పరిష్కారాన్ని సూచిస్తుంది కనక పాత్ర.
***
భాస్కరి ( కనక అత్తగారు) :
ఆర్నెల్ల కోసారి మొగుడితో కలిసి అమెరికా ప్రయాణం కట్టి..కొడుకింట్లో చేరి, అడుగడుగునా అరాచకం సృష్టించాలనుకుంటే ఫలితాలు ఎంత దారుణం గా వుంటాయో..భాస్కరి నడవడిక తో తెలిసిపోతుంది.
కోడలి విలువ గ్రహించి, కొడుక్కి చాటుగానో మాటుగానో బుధ్ధి చెప్పాల్సిన ఆ తల్లి.. అజ్ఞానపు గడ్డి మేస్తే..ఎలా వుంటుంది కొడుకి కాపురం? అని చెబుతుంది భాస్కరి పాత్ర.
ఇద్దరి పిల్లల తల్లి అయిన కోడల్ని – ఇంకా పరాయింటి దానిలా చూడటం, కుటుంబం లోని మనిషే కాదన్నట్టు భావించడం..చాలా మంది అత్తగార్ల దౌష్ట్యానికి ప్రతీకలా కనిపిస్తుంది.
కొడుకుని మాటలతో ఎగదోయడం..అతను కోడల్ని మందలించాలని, కేకలేయాలనీ, లేదా ఆమెలో లేని పక్షపాత బుద్ధి ని కొడుక్కి చూపించాలని..అది నిరూపించాలనే ప్రయత్నాలు చేసే అత్తల మనస్తత్వానికి అద్దం పట్టేలా వుందీ పాత్ర. కొంతమంది అత్త గార్లకి కొడుకు పిల్లలు కోడలు పిల్లలు అన్నట్టు, కూతురి పిల్లలు సొంతం అన్నట్టు భావిస్తుంటారు. సరిగ్గా ఆ లక్షణాలే భాస్కరి పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తుంది. కొడుక్కి పూస గుచ్చినట్టు – వూరూ వాడా కబుర్లు ‘ ఆసమ్మ ఊసమ్మ’ కబుర్లు చెపుతూ అతని బుర్ర నిండా బురద పోసే గుణాలు గల తల్లి – మనం ఈ పాత్రలో చూస్తాం.
చాలా మంది అత్తగార్లకి – కొడుకు కాపురం లో సమస్యలు సృష్టిస్తున్నప్పుడు తెలీదు..వాటి విష ప్రభావాలు తన కొడుకు జీవితాన్నే కూలదోస్తాయని. తెలిసి చేసినా తెలీక చేసినా నేరం నేరమే. మర్రి విత్తనం నాటిన చోట, మంచి ఫల వృక్షాన్ని ఆశించడం బుధ్ధి లేని తనమే కదూ? భాస్కరి వంటి అత్తగార్లు గ్రహించాల్సిన నిజం ఇదని..ఈ పాత్ర పరోక్షం గా చెబుతుంది.
సహజం గా అత్త గారు హద్దు మీరుతుంటే మావగారు కనుసైగ చేస్తుంటాడు. ‘అలా మాట్లాడకు..’ అనో, ‘ఇక చాలు. ఆగు. ‘ అనో! చిత్రమేమిటంటే..భాస్కరి సావాసం వల్లో ఏమో కానీ, ఆయనా భాస్కరి కి ‘తానా అంటే తందానా’ అని అంటుంటాడు. ఆమె అదృష్టమో దురదృష్టమో కానీ కొడుక్కి కూడా ఆమే ఏం చెబితే అదే వేదం!
ఒక స్త్రీ తన మాటలతో..నడత తో తన చుట్టూ వున్న వారిని ఎంత గా అయినా ప్రభావితం చేయగలదు. అంత శక్తి మంతురాలు. సందేహం లేదు. కానీ ప్రభావం కాంతి లాంటిదైతే జీవితాలు వెలుగు బారతాయి. చీకటి అయితేనే.. జీవితాలు ఇలా అంధకారమౌతాయి. ఏం జరగినా అన్నిటికీ ఆ ఇంటి ఆడదే కారణం..ఆధారం అని నిరూపించిన పాత్ర – భాస్కరి పాత్ర. చాలా షజమైన విలనీ పాత్ర. ఈమె అలవాట్లు, కుర్చునే విధానం, మాత్లాడే పధ్ధతి – అంతా సజీవం గా కదలాడుతుంటుంది.
****
ఇవీ ఈ కథలోని అంశం, విశేషం, పాత్రల ఔన్నత్యం! తప్పకుండా కథ చదివి, మీ విలువైన హృదయ స్పందనలను నెచ్చెలితో పంచుకోవలసిందిగా మనవి.
వచ్చేనెల మరో మంచి కథ తో కలుస్తాను.
అందరకీ వందనములతో..!
*****
కనకాంబరం
-ఓలేటి శశికళ
“భలే కోడలే దొరికింది”……. పకపకా నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన అత్తగారికేసి ప్రశ్నార్ధకంగా చూసింది కనక, లాప్ టాప్ లో చేస్తున్న పని ఆపి.
అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి, సోఫాలో చేరబడి, ఆటోమన్ ( ottoman) మీద కాళ్లు బార్లా చాపుకుని , టీవీ పెద్ద వాల్యూమ్ లో వింటూ,భార్య చేసిచ్చిన పకోడీలు నవులుతున్న వెంకట్ తల్లికేసి ‘ తరవాతేంటన్నట్టు ‘ చూసాడు.
” ముందా టీవీ కట్టు . చెప్తా”, అంటూ స్థూలకాయాన్ని సోఫాలో చేరేసి. , మంచినీళ్లు తెమ్మని కోడలికి సైగచేసింది భాస్కరి.
గాభరాగా లేచి, డబుల్ డోర్ రిఫ్రిజరేటర్ నుండి చల్లని నీరు గ్లాసులోకి పట్టి తెచ్చిచ్చింది కనక.
ఇచ్చిన నీళ్లు తీసుకోకుండా, ” నీకు చాలాసార్లు చెప్పానమ్మాయ్, నేను ఫ్రిజ్ లోంచి డైరక్ట్ వాటర్ తాగనని. అమెజాన్ నుండి తెప్పించిన కాపర్ బాటిల్స్ లో ఫిల్టర్ వాటర్ పట్టి ఉంచమన్నాగా. పట్టలేదా?”…..కినుకగా అడిగింది భాస్కరి.
భార్యకేసి తీవ్రంగా చూసాడు వెంకట్.
” నాలుగింటికే తగలడతావు కదా ఇంటికి. నీళ్లు పట్టడం కూడా బరువేనా నీకు యూ బిచ్! ”
తల్లిపక్కన కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు ఒక్కసారి తలెత్తి తండ్రికేసి నిరసనగా చూసి, మళ్లీ భయంగా తలదించుకున్నారు పుస్తకాల్లోకి.
కనక గబగబా వంటింట్లోకి పరిగెట్టి కాపర్ బాటిల్స్ లో పట్టిన నీళ్లు, ప్లేట్లో పకోడీ వేసుకుని వచ్చింది. మొహం ముడుచుకునే ప్లేట్ అందుకుంది భాస్కరి.
ఈలోపున వాకింగ్ నుంచి వచ్చిన వెంకట్ తండ్రి గిరి కూడా వచ్చి చమట్లు కక్కుతూ సోఫాలో కూలబడ్డారు.
” ఏం దిక్కుమాలిన అమెరికారా బాబూ! బయట ఒకటే ఎండ, ఉక్కపోతా. ఏదో ఈ పిల్లల కోసం, వాళ్లకు సెలవులని మీరు పిలిస్తే, పడిపడీ సమ్మర్ లో రావలసి వస్తోంది కానీ, ఇండియాలో ఏసీలో కూర్చుని టీవీ చూసుకుంటూ ఉంటే కాలక్షేపం అయిపోతుంది. ఇక్కడ పదయినా రాత్రవదు వెధవది. “…… ఆయనకు మాటకు ముందో ‘ వెధవ ‘ తరవాతో ‘వెధవా’ కలిపితే కానీ మాట్లాడ్డం రాదు. మొహం ఎప్పుడూ ముటముటలాడుతూనే ఉంటుంది.
భార్య ప్లేట్ లోంచి పకోడీలు లాక్కుని తినబోతుంటే , ముక్త …వెంకట్ , కనకల ఎనిమిదేళ్ల కూతురు, ” తాతగారూ! మీరూ, నాయనమ్మా వాకింగ్ నుండి వచ్చి మీ షూస్ , సాక్స్ బయట షూ క్లోసెట్ లో పెట్టరెందుకు? మేమెవ్వరం కార్పెట్ మీద షూస్ తో నడవం. పైగా మీరు హేండ్ వాష్ చేసుకోకుండా తినేస్తున్నారు. మా డాడీ అంతే. జర్మ్స్ ఉంటాయండి. ఇట్స్ బెటర్ యు టేక్ ఎ బాత్ అండ్ కమ్ బిఫోర్ సిట్ట్ంగ్ హియర్”…. ఖచ్చితంగా చెప్తున్న చిన్నపిల్లకు జవాబు చెప్పలేక , ” వెధవ పిల్లలు, వెధవ ముదరమాటలూ, వెధవ పెంపకాలూ”… అంటూ చేతిలో సెల్ ఫోన్ పక్కసోఫా మీదకు విసిరి, విసురుగా మేడమీదకు వెళ్లిపోయాడాయన.
భాస్కరికి కోపంతో మొహం ఎర్రబారింది. కోడలి వేపు తిరిగి, ” దానికి కాస్త మేనర్స్ నేర్పు అమ్మాయి. పెద్దంతరం చిన్నంతరం లేదా! ” అంది.
కనక ఇంకా ఏదో చెప్పబోతుంటే పదేళ్ల మయూర్ అందుకుని, ” తప్పేముంది నాయనమ్మా. అది మినిమమ్ హైజీన్. ఎవరయినా ఫాలో అవ్వాలి. పైగా అంత స్వెటింగ్ తో, స్టింకింగ్ సాక్స్ తో అందరికీ చాలా డిస్ కంఫర్ట్ ఉంటుంది”….ఇలా పూర్తిచేసాడో లేదో” ఫట్” మని నెట్టికొచ్చి తగిలింది వెంకట్ చేతిలోని రిమోట్!
” డాడ్! ” అంటూ పిల్లాడు బాధతో, భయంతో నత్తుతున్నాడు. వెంకట్ లేచొచ్చి మయూర్ ని సోఫాలోంచి లాగి కిందకు పడేసి, కాలితో రెండు తాపులు తన్నాడు. కనక ఒక్కసారి పిల్లాడికి అడ్డం పడి తనుకూడా తన్నులు తినసాగింది.
ముక్త ఏడుపు లంఖించుకుంది. ఉక్రోషంగా , ” వి నో అవర్ రైట్స్. ఐ కేన్ కాల్ 911. “…. అంతే ముక్త జుట్టు పట్టుకుని రెండు చెంపలూ వాయించాడు వెంకట్.
” చెయ్యవే చెయ్యి 911. ఐ డోంట్ కేర్. మిమ్మల్నే తీసుకుపోయి షెల్టర్ హోం లో పడేస్తారు. తిక్క కుదురుతుంది”. ” ఇదంతా ఈ బిచ్ ఇచ్చిన ట్రైనింగ్. నా పేరెంట్స్ మీద నా పిల్లలకు మప్పుతావే” అంటూ కనకను ఒక్కతోపు తోసాడు.
ఇంతవుతున్నా, అడ్డుపడకుండా చోద్యం చూస్తున్న అత్తగారిరేసి నిరసనగా చూస్తూ, పిల్లలను తీసుకుపోయి మేడమీద వాళ్ల బెడ్రూంలో కెళ్లి తలుపేసుకుంది కనక. పిల్లలు అప్పటికే భోంచెయ్యడం మంచిదయింది.
ఏమీ అవ్వనట్టే మరో గంటలో తను వండిన వంటలన్నీ వడ్డించుకుని తింటున్న ఆ ముగ్గురి నవ్వులూ , కబుర్లూ కనకకు వినిపిస్తుంటుంటే మనసు మండిపోసాగింది.
” ఎవరినమ్మా భలే కోడలు అంటున్నావు ఇందాకా?”…. వెంకట్ ప్రశ్న.
” ఆ అదేరా! ఇందాకా నాతో వాకింగ్ కు ఆ పద్మావతిగారు కూడా వచ్చింది. అదే మీ రాజేష్ అమ్మ. వాళ్ల కోడలు స్రవంతి పెద్ద కరోడా. పాపం అత్తగారిని కాల్చుకు తింటోంది. పొద్దున్న ఆఫీసుకెళ్తూ సాయంత్రం తనకోసం వంటచెయ్యద్దని , ఆవిడకూ కొడుకుకూ మాత్రమే వండుకోండని చెప్తుందట. తీరా సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే ఆకలి ఆకలంటూ రాక్షసిలా అత్తగారు వండుకున్న వంటంతా తినేస్తుందట. పాపం ఈమె గోల. మళ్లా అప్పటికప్పుడు వండుకుంటోందంట….” అంటూ.
” అబ్బో! ఆ స్రవంతి పెద్ద రౌడీరాణి. పార్టీల్లో చూడాలి దాని వేషాలూ, చిందులూ. రాజేష్ గాడు పెద్ద కొజ్దా. పెళ్లం నాటకాలన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తాడు. లోపల చచ్చేంత ఇన్ సెక్యూరిటీ నా కొడుక్కి”…. తల్లీతండ్రి ముందు యధేచ్ఛగా బూతులు వాడుతూ చెప్తున్నాడు వెంకట్.
పిల్లల గదిలో కౌచ్ మీద పడుకుని కిందనుండి వినిపిస్తున్న మాటలు వింటోంది కనక.
పాపం స్రవంతి. హుషారయిన అమ్మాయే కానీ ఏరోజు హద్దుమీరి ప్రవర్తించే అమ్మాయి కాదు. ఆమె భర్త రాజేష్ భార్యని చాలా ప్రేమిస్తాడు. అవసరమైన స్వేచ్ఛనిస్తాడు. స్రవంతి ఇప్పుడు తొమ్మిది నెలల ప్రెగ్నెంట్. వచ్చే వారం తన డ్యూడేట్.
అమెరికాలో ఆఖరిరోజు వరకూ ఆఫీసుకెళ్లి పనిచెయ్యక తప్పదు.
పాపం మొహమాటానికి తనకు వంట వద్దని చెప్పి ఉండచ్చు.
ఆకలేసి అత్తగారు వండుకున్నది తినివుండచ్చు. దానికి ఆమె అత్తగారు ఇంత ప్రచారం చెయ్యాలా! కోడల్ని చూసుకోడానికి వచ్చిన మనిషి.
రాజేష్ స్రవంతి పాపం ఇద్దరి సంపాదనతో రాజేష్ తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చారు.
తల్లి ఏమడిగితే అది కొంటాడు రాజేష్. అలాంటిది కోడలు గుప్పెడు మెతుకులు తింటే దీనికి రచ్చా!!
అదే తన కూతురుంటే ఆ స్థానంలో ఆమె అలాగే మాట్లాడేదా!!
మనసంతా చేదుమాత్ర మింగినట్టయింది కనకకు.
నిద్రలో ఏదో కలవరిస్తోంది ముక్త.
కనకకి చాలా మనసుకష్టంగా ఉంది.
అమెరికాలో పిల్లల రక్షణకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు.
అలాంటిది వెంకట్ కు ఒక చట్టమంటే భయం లేదు, మనస్సాక్షి అంతకన్నా లేదు.
నిరంతరం మండుతూవుండే అతని క్రోధాగ్నిజ్వాలల్లో సమిధలు తనూ, తన పిల్లలూ.
ఆ కోపాన్ని యధాశక్తి రెచ్చగొడుతూ అతని తల్లీతండ్రీ!
వెంకట్ తన పిల్లల దృష్టిలో తనెంత దిగజారిపోతున్నాడో తెలుసుకోలేక పోతున్నాడు.
ఏనాడూ అతను పిల్లల పట్ల తన బాధ్యత సరిగ్గా నిర్వహించలేదు.
తన మగతనానికి టోకెన్స్ ఆఫ్ మెరిట్ లాగా వాళ్లని ప్రదర్శిస్తాడు నలుగురిలో.
పిల్లల రెండు సిజేరియన్లకూ కనక తల్లిని రానివ్వలేదు వెంకట్.
ఆర్ధికంగా తక్కువస్థాయిలో ఉన్న ఆమె అమెరికాకి స్వంతగా వచ్చే పరిస్థితిలో లేదు.
కనక తన సంపాదననుండి తల్లికి టికెట్ కొందామనుకుంటే వీల్లేదని వెంకట్ అడ్డుపడిపోయాడు.
పిల్లాడికి మూడవనెల వచ్చాకా అత్తమామలు వచ్చారు.
కానీ కనకచేత ఎదురు చేయించాడు వాళ్లకు.
మూడునెలల పిల్లాడిని డే కేర్ లో పెట్టుకుని, సాయంత్రం తెచ్చుకునేది.
వాళ్లు మేము చూస్తామని ఒక్కమాటనలేదు. వెంకట్ చెప్పలేదు.
ఏం చేసుకున్నా వారిద్దరి మటుకూ, కొడుక్కీ చేసేది అత్తగారు.
కనక, పాపం పచ్చిబాలింత్రాలయినా తన వంట తను చేసుకుని తినేది.
రాత్రంతా పిల్లాడితో సరిపోయేది.
వెంకట్ అడ్డగాడిదలా గుర్రు పెట్టుకుని నిద్రపోయేవాడు. పిల్లాడిని కాసేపు ఎత్తుకునేవాడు కూడా కాదు.
ముక్త డెలివరీకి కొంచెం తెలివి తెచ్చుకుంది కనక.
తమ కమ్యూనిటీలోనే ఉంటున్న తన తల్లి స్టూడెంట్ రజనీ వాళ్లమ్మగారు తనకు సాయం చెయ్యడానికి ముందుకు రావడంతో, ఆవిడకు తన జీతంలోంచి నెలకు వెయ్యిడాలర్లిచ్చి , తన ఆరువారాల మెటర్నటీ లీవ్ అయిపోయాకా, పిల్లలిద్దరినీ ఆవిడకప్పగించి ఆఫీసుకు వెళ్లేది.
ఆమె డబ్బు వద్దని నిరాకరించినా, అది ఆమె సర్వీస్కు చాలా తక్కువని చెప్పి, ఒప్పించి ఇచ్చేది.
పాపం ఆవిడ కన్నతల్లిలా కనక వచ్చేసరికల్లా వంటకూడా చేసేసి ఉంచేవారు.
కనక ఇలాంటి ఏర్పాటు చేసుకోడం, తన జీతంలోంచి వెయ్యేసి డాలర్లు వృధా చెయ్యడం చూసి మండిపోయేవాడు వెంకట్.
ముక్త ఐదునెలల పిల్లగా ఉన్నపుడు ఆమె తిరిగి ఇండియాకు వెళ్లిపోగానే, తన పేరెంట్సుని పిలిపించి, పంతంగా వారికీ వెయ్యి డాలర్లూ ఇప్పించేవాడు.
బంతిలా ఉన్న ముక్త, అత్తగారి సంరక్షణలో కోలిక్ ఫీవర్, ప్రైమరీ కాంప్లెక్స్ తో పుల్లలా అయిపోడంతో పిల్లని మళ్లీ డే కేర్ లో పెట్టుకోవచ్చింది కనకకు.
పిల్లాడి స్కూల్, పాప డే కేర్, తన ఆఫీస్ టైమింగ్స్ కూ పొంతన దొరకక కనక చాలా ఇబ్బంది పడిపోయేది.
కనీసం వెంకట్ పిల్లలను ఇంట్లో దిగబెట్టే సాయం కూడా చేసేవాడు కాదు.
కనక మంచితనం, వెంకట్ క్రూరత్వం కనకకు కొందరు మంచి అర్ధం చేసుకునే మిత్రుల్ని సంపాదించి పెట్టింది.
వాళ్ల పిల్లలతో పాటూ మయూర్ ని ఇంట్లో దింపేవారు.
ముక్తను కనక ఆఫీస్ నుంచి తెచ్చుకునేది.
పొరపాటున ఎవరయినా మిత్రురాలి భర్త పిల్లాడిని దిగపెడితే కనక్కి ఆరోజు నరకమే! ” వాడెందుకు దిగపెట్టాడు? వాడికీ నీకూ ఎలా పరిచయం? వీడు ఆ యెధవ కొడుకా కొంపతీసి? ఆఫీస్ లో భాగవతాలకు తోడు ఇక్కడా మొదలు పెట్టేసావా యూ బిచ్…. ” ఇలా సాగిపోతుంది అతని వాక్ప్రవాహం.
కనకకి ఒళ్లు చచ్చిపోతుంది అలాంటి మాటలు పడాలంటే.
నోరు విప్పి గట్టిగా అరవాలని ఉంటుంది. ” నోరుమూసుకోరా ! ” అని….. కానీ ఆమె సంస్కారం, భర్తంటే ఎనలేని భయం, ఎలాంటి దన్నూ లేని తన కుటుంబనేపధ్యం ఆమెకు నోరు పెగలనివ్వవు.
ఆమె మెతకతనం అతనికి మరింత అలుసూ, వినోదం.
ఏ పార్టీకెళ్లి వచ్చినా ఇంట్లో ఒకటే గొడవ.
ఎవరయినా పలకరించడం పాపం. వాడు నీకెలా తెలుసూ? అంటూ.
మళ్లీ అక్కడ నవ్వుతూ ప్రెండ్స్ కు పరిచయాలు చేస్తాడు. ఆ తరవాత అవతలతను షేక్ హేండిస్తే నువ్వు నమస్కారం పెట్టకుండా వాడి చెయ్యెందుకు పట్టుకుని ఓ పిసికేస్తున్నావ్, ” అంటూ వెకిలిగా ప్రశ్నిస్తాడు చెవిలో.
అలా అని అంటీ ముట్టనట్టుంటే అదో గొడవ. అందరిలో పెట్టి తనో కంట్రీబ్రూట్ నని, పార్టీ మేనర్స్ తెలీదని ఈసడిస్తాడు!
అలా మాట్లాడితే అక్కడ అందరూ ఎంటర్ టెయిన్ అవుతారనుకుంటాడు.
పదే పదే భార్యని” ఏయ్ లూజర్”, ” ఏయ్ లూజ్”… అని పిలుస్తూ, ప్రతీ చిన్న తప్పుకూ భార్యనీ, పిల్లల మీద కోపంతో అరుస్తూ, అవమానించే అతనంటే వారి పరిచితులందరికీ కంపరం.
వారి కళ్లలో తనపట్ల కనిపించే సానుభూతిని భరించశక్యం కాదు కనకకు. అందుకే తను సంతోషంగానే ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. పిల్లలూ ఏనాడూ ఇంటివిషయాలు బయట చెప్పరు.
ఆకలికి కడుపు నకనకలాడుతుంటే, కిందకెళ్లింది కనక.
రాత్రి రెండయ్యింది. డైనింగ్ టేబిల్ మీద
ఎక్కడికక్కడ వదిలేసిన గిన్నెలూ, కంచాలూ, డ్రింక్ గ్లాసులూ!
మూడు డ్రింక్ గ్లాసులు చూసి విరక్తిగా నవ్వుకుంది.
ఒకసారి వెంకట్ బాస్, అమెరికన్ ఇచ్చిన పార్టీలో సభ్యతకోసం చేతిలో పెట్టిన వైన్ గ్లాస్ పట్టుకుని పార్టీలో తిరిగినందుకు కనకకు ఇంటికి రాగానే వెంకట్ పెట్టిన పెంట గుర్తొచ్చింది.
అదే వెంకట్ తన తల్లికి స్వయంగా వైన్ పోసి అందిస్తాడు ఆవిడ అందానికీ, ఆరోగ్యానికీ మంచిదని.
మామగారి ఆశీస్సులు పుష్కలం భార్యవిషయంలో.
తినడానికి ఏమీ మిగలకపోవడంతో చల్లపాలలో సిరియల్ వేసుకుని తినేసి, ఒక అరటిపండు తినేసి పైకి వెళ్లింది కనక.
నిద్రపట్టక మేడమీద పేటియో మీదకు వెళ్లింది. పుచ్చుపువ్వులా పరుచుకుని వెన్నెల.
ఇంటి వెనకాల నదీపాయలో వడివడిగా రాళ్లనొరుసుకుంటూ ప్రవహిస్తున్న నీటిసందడి తప్ప, అంతటా ఆవరించిన ప్రశాంతత.
సేదతీర్చే అమ్మమాటలా , పిల్లతెమ్మెరొకటి చల్లగా తాకి, వత్తయిన ఆమె నల్లని కురులను సుతారంగా ఆమె మొహం మీదకు తోసింది.
అంత అందమైన పరిసరాలను అనుభవించలేని తన అశక్తతకు విసుగు కమ్మి, చికాకుగా జుట్టు పైకి తోసుకోబోతుంటే…….. ” అందాల చందమామకు మబ్బుల పరదాలు కూడా అప్పుడప్పుడూ అందమే…..” గతంలో తనంటే విపరీతంగా ఇష్టపడే తన ఆరాధకుడి మాటలు గుర్తొచ్చాయి ఆమెకు.
అతను తనను కనకాంబరంగారూ అని పిలిచేవాడు. ఎందుకలా అంటే భలే గమ్మత్తుగా చెప్పేవాడు. కనకాంబరానిది వాడని అందంట. సువాసనపూలతో చేరి వాటి అందాన్ని ద్విగుణీకృతం చేసి, తను తావిని ప్రోవి చేసుకుంటుందట. తేలికైన కనకాంబరం ప్రతీ స్త్రీ ఇష్టంగా తలను తురుముకుంటుందట. ఆఖరికి దేవుడు కూడా కనకాంరమాలను ధరించాకే తృప్తిపొందుతాడట………కళ్లల్లో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో అతను మాట్లాడే మాటలు తనకు చాలా నచ్చేవి. ఆమాటలకో రూపమిచ్చే సాహసం, ఉద్దేశ్యం తనలో లేకపోయింది.
పుచ్చపువ్వంటి వెన్నెలలో మల్లెల గోలెం పక్కనే చిక్కని కాషాయంలో పూసి తేలికగా గాలికి ఊగిసలాడుతున్న కనకాంబరాలను ప్రేమగా తాకింది కనక ఏదో అదృశ్య గతప్రేమపాశమొకటి మనసుకు గాలం వెయ్యగా!!
” అసలు ఏం ఆస్వాదించింది తను జీవితంలో! పరుగులు ! పరుగులు! కొన్ని సాధించడానికి, కొన్నిపరుగులు పారిపోడానికి!!
ఏవో అందలాలు అందుకోవాలనే ఆత్రుత. అందుకోకపోతే స్థంబించే జీవితమంటే భయం. పేదరికం భయం. అస్థిత్వం కోసం పేరాశ”…. తనని తనే ద్వేషించుకుంటోంది కనక.
తన తల్లితండ్రులకూ, అన్నలకూ అంగీకారంకాని కులంలో అబ్బాయిని పెళ్లి చేసుకుంది కనక తల్లి. రెండు వైపులా దిగిరాలేదు.
తల్లీతండ్రీ చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కనకనూ, ఆమె తమ్ముడినీ ఐదేళ్ల తేడాతో కన్నారు. తండ్రి స్థానిక దూదిమిల్లులో సూపర్ వైజర్ గా పనిచేసేవాడు. తల్లి టీచర్!
కనకకు జీవితంలో గుర్తుండే ఆనందక్షణాలన్నీ ఆమె బాల్యంలో అన్యోన్యమైన తల్లితండ్రుల సమక్షమే!
తమ్ముడు యశ్ పుట్టడం, తండ్రి లంగ్ కేన్సర్ తో ఆ ఏడాదే చనిపోవడం, మిల్లువారిచ్చిన లక్షరూపాయిలూ పిల్లల భద్రతకు దాచి, కనక వాళ్లమ్మ తల్లీతండ్రీ తానై పెంచడం….. కనక జీవితాన్ని ఓ పెద్దబాధ్యతలోకి నెట్టేసింది మానసికంగా.
అక్కరకు రాని బంధువులు ఆమెలో మరింత అభద్రతను పెంచారు.
చదువే జీవితమై పోయింది.
స్టేట్ రేంకులు, ఉచిత కార్పొరేట్ విద్యనూ, ఆపై అత్యుత్తమ ఐఐటీనీ ఆమె ముంగిట్లో పెట్టాయి.
దేశీయ కంపెనీలు మంచి ఉద్యోగ ఆఫర్లిచ్చినా, ఆమెలోని తృష్ణ స్టాన్ ఫోర్డ్ కు పరుగులెత్తించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ లో ఎమ్ ఎస్ చేసి, జీవితంలో చదువు తప్పా మరోలోకమూ, లౌక్యమూ తెలీని ఆమె దొరికిన మొదటి ఉద్యోగంలోనే బే ఏరియాలో కుదురుకుపోయింది.
ఈ లోపున యశ్ ఎమ్ ఎస్ కోసం వర్జీనియా చేరడం, తల్లికి పుట్టింటి వారు దగ్గరవడం చాలా సహజంగా జరిగిపోయాయి.
యశ్ మీదున్న ఆశతో కనక మేమమామ కనకకోసం ఈ వెంకట్ సంబంధం తెచ్చాడు.
కనక కన్నా ఏడేళ్లు పెద్ద.
తల్లి కులమే!
బే ఏరియాలోనే ఆర్కిటెక్ట్ గా సాఫ్ట్ వేర్ కంపనీలో పని చేస్తున్నాడు.
ఎత్తుగా తెల్లగా, స్మార్ట్ గా ఉన్న వెంకట్ ఆడపిల్లకూ జీవితంలో ఛాయిస్ లుంటాయని తెలియని కనకకు ఓకే అయ్యాడు.
ఒత్తయిన తలకట్టు, అందమైన కళ్లు, ఎత్తుగా, ఆరోగ్యంగా, తనకన్నా ఒకఛాయ తక్కువున్న కనక వెంకట్ కు ఆనకపోయినా, అప్పటికే శతాధిక పెళ్లిచూపుల అప్రతిష్ట వల్ల, తనకన్నా వందవేల డాలర్లు ఎక్కువున్న కనక ఉద్యోగం బాగా ఆనడంతో , కట్నం ఇవ్వరని తెలిసినా ఒప్పుకున్నాడు.
వెంకట్ అమ్మానాన్నలకూ యశ్ తో తమ కూతురుకి కుండమార్పిడి చెయ్యచ్చనే ఆశ , తప్ప కనక మీద ఎలాంటి అభిమానమూ లేదు.
పైగా భాస్కరికి కనక పేరంటే చాలా చీదర. కనకను ఆ పేరుతో పిలుస్తుంటే తమ ఇంట్లో పనిచేసే అదే పేరున్న పనిపిల్ల గుర్తొస్తుందని వేళాకోళంగా ఈసడించేది.
అది కనక బామ్మ కనకమహాలక్ష్మి పేరు. తండ్రి ప్రేమతో అపురూపంగా పెట్టుకున్న పేరు. అమెరికాలో కొలీగ్స్ అందరూ పిలవడానికి సౌకర్యంగా ఉందని మెచ్చుకునే పేరు. అంత చక్కని పేరు వీళ్లకు చేదుమాత్ర అయింది.
పెళ్లికి ముందు వెంకట్ క్వాలిఫికేషన్ అడగడానికి మొహమాటపడ్డ కనకకు ఆ తరువాత అతని భీమవరంలో ఎక్కడో ఓ మారుమూల ఇంజినీరింగ్ కాలేజీ డిగ్రీ, మరెక్కడో న్యూమెక్సికోలో చేసిన ఎమ్ ఎస్ సంగతి తెలిసాకా పెద్ద ఆశ్చర్యం కలిగలేదు. పెళ్లయిన వారంలోనే అతని సాంకేతికజ్ఞానం మీద ఆమెకు ఒక అవగాహన వచ్చేసింది.
కనక తన కన్నా అకాడమిక్ గా ఎన్నో రెట్లు ఎత్తులో ఉందని, అభద్రతో కూడిన అహంకారం చూపించడం వెంకట్ అలవాటుగా చేసుకున్నాడు.
ఆమెకు ఏ విధంగా వెంకట్ ను భర్తగా గౌరవించి అంగీకరించాలో తెలియడం లేదు. అతనిలో పేట్రేగిపోతున్న స్త్రీవాంఛ, మితిమీరిన తాగుడూ, కృూరత్వం రానురానూ కనక జీవితాన్ని మరింత నరకప్రాయం చేస్తున్నాయి.
ఆఫీస్ లో కొత్తగా చేరిన అమ్మాయిలను తెగ ఇబ్బందిపెడతాడు తన ఫ్లర్టింగ్ తో!
ఆదివారం అయ్యేసరికి వాళ్లందరినీ నయానో భయానో ఒప్పించి హైకింగ్ అని ట్రెకింగ్ అనీ జారుకుంటాడు.
ఏ మాల్ లోనో కనిపించిన తెల్లఅమ్మాయిలను ఏదో వంకను పలకరించడం , ఆబగా వారి చెయ్యందుకోవడం, లేదా పెకింగ్ చెయ్యడం …. వాళ్ల మొహాల్లో తాండవించే అసహ్యాన్ని కూడా పట్టించుకోని లేకితనం.
పిల్లాడు తండ్రిచేష్టలన్నీ నిరసనగా చూస్తుంటే కనకకు అతనిమీద మరింత కంపరం పెరిగిపోతోంది.
ఆ స్త్రీల ప్రస్థావనలు చేస్తూ అతను చేసే దాంపత్యం ఆమెకు నరకప్రాయంగా ఉంటోంది.
***
ఏమీ పట్టని కాలం మరో మూడునెలలు పరిగెట్టింది. అత్తమామలు మరో పదిరోజుల్లో ఇండియా తిరిగి వెళ్తారనగా వినాయకచవితి వచ్చింది.
గౌరీగణేశ వ్రతం చేసుకుని అక్కగారికి పుట్టింటి పసుపుకుంకాలు ఇవ్వడానికి యశ్, కనకతల్లి, యశ్ భార్య అఖిల వచ్చారు.
అక్కలాగే చాలా తెలివైనవాడు యశ్. అమెరికాలో మాస్టర్స్ అయ్యాకా రెండేళ్లు పనిచేసి కెల్లాగ్స్ లో ఎంబీయే చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.
అతనికి అప్పటికే అఖిలతో ఒక స్నేహితుల ఇంట్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
అఖిల యశ్ ను అతని ఎంబీయే సమయంలో తను ఉద్యోగం చేస్తూ ఆర్ధికంగా ఆదుకుంది.
యశ్ కు బోస్టన్ లో మంచి వెంచర్ కాప్టలిస్ట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం రాగానే తల్లిని ఒప్పించి అఖిలను పెళ్లి చేసుకున్నాడు.
యశ్ కు తమ కూతుర్లను చెయ్యాలని ఆశలు పెట్టుకున్న కనక మేనమామలూ, అత్తమామలూ యశ్ కాదనడంతో కక్షలు సాధించడం మొదలుపెట్టారు.
కానీ అవన్నిటికీ అతీతంగా అతను ఎదిగిపోయాడు.
తల్లికి సకల సౌకర్యాలూ అమర్చి ఆమెజీవితం సుఖవంతం చేసాడు.
ఎప్పుడూ కనకే పిల్లలతో బోస్టన్ వెళ్లేది.
ఈసారి పనిఒత్తిడి వలన రాలేనంటే యశ్ వాళ్లే వచ్చారు.
ఊహించినట్టే వాళ్లకు మర్యాదలూ లేవు మన్ననలూ లేవు. ఎలుక మీదా పిల్లి మీదా పెట్టి విసురుతున్న సూటిపోటి మాటలు తప్పా.
వెంకట్ కు యశ్ సాధించిన విజయాలంటే కడుపుమంట.
మాటల్లో విషపుసొనలు ఒలికిస్తాడు.
గౌరీగణేశ వ్రతం అవ్వగానే యశ్ , అఖిలతో కనకకు, ఆమె కుటుంబానికీ విలువైన బహుమతులూ, డబ్బుకవర్లూ ఇప్పించింది కనకతల్లి.
అక్కడే ఇప్పి చూసుకున్న వియ్యపురాలు అసంతృప్తితో పెదవి విరిచింది.
వెంకట్ కావాలనే మాటల్లో పెట్టి యశ్ ను తను ప్రారంభిద్దామనుకుంటున్న కన్సల్టన్సీకి అతని కంపెనీనుంచి పెట్టుబడి కావాలని ప్రపోజల్ పెట్టాడు వెంకట్
బావగారి తెలివితేటలూ, శక్తిసామర్ధ్యాల అంచనా ఉన్న యశ్ అది తన పరిధిలోకి రాదని, చేయించలేనని నిర్మొహమాటంగా చెప్పేసాడు.
మొండివాదనతో మొదలుపెట్టిన వెంకట్ మాటలు రెట్టిస్తూ కనక శీలం గురించీ, ఆమెతల్లి దుష్ప్రవర్తన గురించి, అతని కుటుంబవిలువల గురించి దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. వాటికి ఆజ్యంపోస్తూ అతని తల్లితండ్రులు.
భరించలేని యశ్ బావగారి కాలర్ పట్టుకున్నాడు కోపంతో. అంతే యశ్ రెండు చెంపలూ పేలిపోయాయి. అతని మెడపట్టుకుని వీధిగుమ్మం దాకా ఈడ్చి బయటకు తోసేసాడు వెంకట్.
ఊహించని ఈ పరిణామాలకు అవమానభారంతో, క్రోధంతో ఊగిపోతూ యశ్ అక్కకేసి చూసి…… ” వీడిని ఇంకా భరిద్దామనే అనుకుంటున్నావా? ఎవరికోసం!? నువ్వేంటి? నీచదువూ, హోదా ఏంటి? ఈ పనికిమాలినవాడికి ఊడిగం చేస్తూనే ఉంటావా? సర్వస్వతంత్రదేశంలో ఉన్నాము. మానవహక్కులకు విలువిచ్చే దేశంలో. ఈ బానిసత్వం నీకు అక్కరలేదు. మనకు ఏ బంధువులూ లేరు నిలతీయడానికి. నీ పిల్లలకే ఈతండ్రి అక్కరలేదు. వదిలిపడేయ్! ఆ వెధవకు కావలిసిన నీ ఇల్లు వాడి మొహానే కొట్టి బయటకు ఫో! నేను కాప్స్ ని పిలవగలను. పెంట చెయ్యడం ఇష్టం లేక ఊరుకున్నా”….. కోపంతో రొప్పుతూ చెప్తున్నాడు.
అఖిలవచ్చి కనక భుజం మీద చెయ్యేసి దయగా… ” వదినా! మేమున్నాం నీకు. ఆలోచించకు.”…. అని చెప్పి బయటకు వెళ్లిపోయింది.
ఎప్పుడూ అల్లుడూ, వియ్యాలారి ఆగడాలకు గడగడలాడుతూ, కూతురికి నచ్చచెప్పుకునే కనకతల్లి కొడుకుకు జరిగిన అవమానాన్ని తీసుకోలేకపోయింది. ” ఛీ!!” అని అల్లుడిని కోపంతో నిరసనగా చూస్తూ అఖిల వెనుకే వెళ్లిపోయింది.
***
” అమ్మా! బ్యూటిఫుల్ వ్యూ కదా ఇక్కడ నుంచి చూస్తుంటే”…… ముక్త చూపిస్తుంటే, గాలికి ఎగిరిపోతున్న ముంగురులు వెనక్కి తోసుకుంటూ ఊకొడుతోంది కనక.
అప్పటికి వారం రోజులుగా మయూర్ , ముక్తలను తీసుకుని భారతదేశం పర్యటనలో ఉంది కనక. తను పుట్టిపెరిగిన మాతృదేశం, తమ మూలాలను తనలో పొందుపర్చుకున్న , ప్రపంచ సంస్కృతికీ, తత్వదర్శనానికీ మూలాధారమైన కర్మభూమిని ఊహ తెలుస్తున్న తన పిల్లలకు చూపించాలని తీసుకొచ్చింది కనక.
జీవితంలో మొట్టమొదటిసారి సంకెళ్లు తెంచుకుని పంజరాల్లోంచి బయటపడ్డ పక్షుల్లా ఉన్నారు ముగ్గురూ!
కనక కష్టార్జితంతో కొన్న మిలియన్ డాలర్ల ఇల్లు లాక్కొనీ, పిల్లల కస్టడీ తనకు అక్కరలేదని కనకకే వదిలేసి , విడాకులిచ్చ్చేసాడు వెంకట్.
పిల్లలతో టెక్నికల్ డైరక్టర్ గా ఇంకా పెద్ద ఉద్యోగానికి మంచిజీతంతో మారి, సియాటల్ లో స్థిరపడింది కనక.
బయటకొచ్చేసిన ఐదేళ్లలో పిల్లలు ఒక్కసారీ తండ్రిని తలుచుకోకపోవడం కనకకు చాలా ఆశ్చర్యమేసింది. పిల్లలకు కావలసింది ప్రేమ,ప్రశాంతతతో కూడిన సమృద్ధి. అది తల్లిదగ్గర పుష్కలంగా ఉంది వారికి.
మైసూర్లో చాముండేశ్వరిని దర్శించాకా, దసరా ఉత్సవాలకు దీపతోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న మైసూర్ రాజసౌధాలకు అబ్బురంగా ఆలోకిస్తున్న కనక మౌనాన్ని ఛేదిస్తూ మయూర్ ఒక్కసారిగా….
” అమ్మా! వాళ్లు రాజేష్ అంకుల్ ఫామిలీలా ఉన్నారు కదా!” అన్నాడు, తమ పక్కనే నిలబడి ఫోటోలు తీసుకుంటున్న భార్యా, భర్త, ఇద్దరు పిల్లలను చూపిస్తూ!
” స్రవంతీ!”…… కనక పిలుపుకు ఒక్కసారి ఉలికిపడి తిరిగిచూసింది ఆమె! ఆ సంజచీకట్లో కనకాంబరంలా మెరిసిపోతున్న కనకను చూసి ఒక్కసారి ” కనకా! అని చుట్టేసుకుంది స్రవంతి. కుశలప్రశ్నలు అయ్యాకా, స్రవంతి… ” కనకా! నీతో వాల్యూమ్స్ మాట్లాడాలి. మేము ప్రాజెక్ట్ మీద రెండేళ్లకు ఇండియా వచ్చాము. నువ్వు మా ఇంటికొస్తే మాట్లాడుకుందాము.
” లేదు స్రవంతీ! మేము రేపు కేరళ వెళ్తున్నాము. నా మొబైల్ నంబర్ తీసుకో. ఫోన్లో మాట్లాడుకుందాం”…… అంటూ, రాజేష్ ను పలకరించి, వాళ్ల పిల్లలను ముద్దుచేసి, శెలవు తీసుకుంది కనక.
ఆరోజు రాత్రే స్రవంతి కాల్ చేసి చెప్పిన విషయాలు కనకకు నిద్రను దూరం చేసాయి.
వెంకట్ ను అమెరికానుండి డీపోర్ట్ చేసారట. ఇప్పుడు అతను భారతదేశంలోనే ఉన్నాడట.
కనకతో వివాహబంధం తెగిపోగానే, వెంకట్ మరింత పతనదశకు దిగజారేడట. ఎప్పుడూ ఉన్న తాగుడూ, తిరుగుడుకు తోడు , కసీనోల్లో జూదం కూడా మొదలుపెట్టాడట. వెనిజులా నుండి వలస వచ్చిన ఒక చాలా చిన్న వయసున్న అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకుని డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడట. ఎవరో ఫ్రెండ్ తో చేరి ఉద్యోగాల కన్సల్టన్సీ మొదలుపెట్టి , హెచ్-1B స్కామ్ లో ఇరుక్కొని అరస్ట్ అయ్యాడట. భారీమూల్యం చెల్లించడానికి ఇల్లమ్మి, అప్పులు తీర్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదుట. ఆ వెనిజులా అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందట. ప్రభుత్వం అతని గ్రీన్ కార్డ్ కేన్సిల్ చేసేయడంతో ఇండియా వచ్చేసాడట.
అతని నేరచరిత వలన ఏ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోతే. , తన తల్లితండ్రుల ఇల్లమ్మి బిజినెస్ మొదలుపెట్టి, దాంట్లో కూడా నష్టాలపాలయ్యాడుట.
బెంగుళూరు వచ్చి రాజేష్ ను ఏదయినా జాబ్ చూడమని ప్రాధేయపడ్డాడుట. ప్రస్థుతం రాజేష్ స్నేహితులు వైజాగ్ లోనడుపుతున్న చిన్న సాఫ్ట్ వేర్ కంపనీలో ముప్ఫైవేలకు ఉద్యోగం చేస్తున్నాడట. తల్లీతండ్రితో అక్కడే చిన్న రెండు బెడ్రూంల ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడట. ఒకప్పటి అందగాడూ, పొగరుబోతు వెంకట్ కాదట. వ్యసనాలు అందాన్ని తినేస్తే, చేసిన ద్రోహాలు జీవితాన్ని తినేస్తే మిగిలిన జీవచ్ఛవంట వెంకట్! చివరిరోజుల్లో సేవింగ్స్ అన్నీ కొడుకుచేతిలో పోసి, కానీకి ఠికాణా లేని చచ్చినపాముల్లా ఉన్నారుట అతని తల్లితండ్రులు .
” నువు పనిచేసే కంపనీ హైదరాబాద్ బ్రాంచ్ లో ఏదో మేనేజ్ మెంట్ పొజిషన్ కు అప్లై చేసాడట. నీచేత రికమెండేషన్ చేయించమని రాజేష్ కాళ్లుపట్టుకున్నాడు. చచ్చినా ఆ పని చెయ్యనన్నాడు రాజేష్. చడామడా తిట్టాము. నీకూ, పిల్లలకూ చేసిన నయవంచనకు భగవంతుడు వెంటనే చూపించాడు వాళ్లకు”….. స్రవంతి ఆవేశంతో చెప్తూనే ఉంది.
ఆ మర్నాడు కొచ్చి చేరడంతోనే కనక పిల్లలతో ఆరోజు తనకు మీటింగ్స్ ఉన్నాయని, వాళ్లను ఆ ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో కాసేపు గడపమని పంపేసింది. రాత్రంతా నిద్రలేక కళ్లు మెరమెరలాడుతున్నాయి. కాసేపు కళ్లుమూసుకుని ఆలోచించింది. దీర్ఘంగా నిశ్వసించి ఫోన్ పట్టుకుంది చేతిలోకి. …. అంతే ఆమెలోని పనిభూతం ఆమెను ఆవహించేసింది. ఎవరెవరికో ఫోన్లు, ఈ-మెయిల్స్, మీటింగ్ లు! ఆరుగంటలు నిర్విరామంగా చేస్తూనే ఉంది. పిల్లలతో కిందకు రెస్టారెంట్ లో లంచ్ చేసాకా, వారిని హోటల్ గైడ్ తో బయటకు పంపి, మళ్లీ ఫోనందుకుంది. ఈసారి హైదరాబాద్ లో తన లాయర్ తో!
కొచ్చి సముద్రతీరంలో సూర్యాస్థమయం చూసొచ్చి, తల్లి ఇంకా పనిచేసుకోడం చూసి మయూర్ ఆలోచనలో పడ్డాడు. లీలగా ఆమె ఫోన్ సంభాషణల సారం అర్ధమవుతోంది. ఏదో చెప్పాలని ఉంది …. కానీ తల్లి నేర్పిన సభ్యత, విలువలు నోటికి సంకెళ్లేస్తున్నాయి.
కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సాలలో పర్యాటక స్థలాలు చూపించాకా, తిరుపతిలో స్వామిదర్శనం చేయించి….. తిరిగి అమెరికాకు పిల్లలతో ప్రయాణమయ్యింది కనక.
విమానంలో తన పక్కసీట్లో కూర్చున్న మయూర్….. తండ్రిలా స్ఫురద్రూపి, పదిహేనేళ్లకే ఆజానుబాహువుగా ఎదిగిన తనకొడుకు.. తన విలువలన్నీ ప్రోవుకున్న నూనూగుమీసాల నవయువకుడు… తనతో కొద్దిసేపటి కింద అన్న మాటలు మరీమరీ మననం చేసుకుంటోంది కనక.
” అమ్మా! నాకు తెలుసు! నువ్వు అతనికి మీకంపెనీలో ఉద్యోగం వేయించావని, హైదరాబాద్ లో నీ అపార్ట్ మెంట్ అతని పేరెంట్స్ కు గిఫ్ట్ డీడ్ చేయించావని. నిజానికి నీ స్థానంలో ఉన్న వేరెవరైనా వాళ్లను కలలో కూడా తలుచుకోరు. కానీ నువ్వు ” క్షమయా ధరిత్రివి” ….. ! నువ్వు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత….. ఇన్ని పాత్రలు పోషించినా వాళ్లు నిన్ను వదిలేసారు. కానీ నువ్వు “కరుణేషు కనక”వి, క్షమయా ధరిత్రివి. అది వాళ్ల అదృష్టం. మళ్లీ నీదయ వాళ్లకు పనికొచ్చింది.
దసరాల్లో మనం చాలా దేవి మందిరాలు చూసాం. దుష్టశిక్షణ-శిష్టరక్షణ కదమ్మా.. జగన్మాత చేసింది. మరి నువ్వేంటి అతనికి మళ్లీ ఇలా….??? ” తెలుగూ, ఆంగ్లం కలగలిపి… పట్టుదలగా నేర్చుకుంటున్న సంస్కృతాన్ని మేళవించి.. ఆవేశంతో నిలదీస్తున్న కొడుకుకేసి వాత్సల్యంగా చూస్తూ ఆతల్లి..” అతను నాబిడ్డలకు తండ్రి. నాకు వెలకట్టలేని ఆస్థిగా మీ ఇద్దరినీ నాకు ఇచ్చేసాడు. దానికి నేను ఆమాత్రం మూల్యం చెల్లించచ్చు మయూర్! నాదేశం నాకు నేర్పిన గొప్పగుణం క్షమ, మానవత్వం! జీవితంలో కోర్ట్ కాగితాలు తేల్చలేని మానసికబంధాలు కొన్ని ఉంటాయి. తెంచుకుంటే తెగేవి కాదవి! “…..
విమానం కిటికీ లోంచి చూస్తుంటే , సంజ కెంజాయ సంతరించుకుని, ఆకాశమంతా కనకాంబరంలా ఉంది. తల్లి దయార్ద్రహృదయానికీ, వితరణకూ చలించిపోయిన ఆ కొడుకు తల్లికేసి అపురూపంగా చూస్తూ…. ” అమ్మా! నాకు నువ్వే జగన్మాతవు. కనకమహాలక్ష్మివి. కనకదుర్గవు. కనకధారవు”! ….
కొడుకు ఉత్తేజాన్ని మురిపెంగా చూస్తూ మనసారా నవ్వేసింది.
ఆ యిద్దరు పిల్లల్లో ఎంతో సభ్యతాసంస్కారాలతో పెరిగిన తనూ, తన తమ్ముడే కనిపించారు కనకకు. చెట్టు విషప్రాయమైనా తనకు అమృతఫలాలనిచ్చిన భగవంతుడికి మనసులోనే నమస్కరించుకుంది.
ఆమె మనసు ఇప్పుడు హాయిగా ఉంది. ఋుణానుబంధ శేషమేదో తీరిపోయినట్టు!!
*****
రచయిత్రి పరిచయం :
శశికళ ఓలేటి
స్వస్థలం : విశాఖపట్టణము
చదువు: ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి M.Sc.
రచనలు : ఫేస్ బుక్ మాధ్యమంగా 150 వరకూ కధలు, కవితలు, పద్యాలు.
ప్రచురించబడినవి: ఆంధ్రభూమి, విపుల, ఆంధ్రజ్యోతి, తెలుగుతల్లి కెనడా, మధురవాణి( అమెరికా), సంచిక, కథామంజరి! ( ఇవన్నీ బహుమతులు వచ్చిన కథలు)
*****
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.