చిత్రం-14
-గణేశ్వరరావు
లాండ్స్కేప్ పెయింటర్స్ ఉన్నప్పుడు సీస్కేప్ పెయింటర్స్ కూడా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది?
అసలు ప్రకృతి దృశ్యాలలో కనిపించేవే మూడు ప్రధాన దృశ్యాలు : నేల , నీళ్లు, కొండలు! ఈ మూడిటినీ కలిపి గీసిన బొమ్మలు ఎన్నో ఉంటాయి.
కేవలం కడలిని చిత్రించే చిత్రకారిణులు ఉన్నారు. వారిలో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ – ఫీబీ సొండెర్స్ . ఆమె చిత్రాల్లో కనిపించే అలల వయ్యారం మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది.
సముద్రం ఒడ్డున నిల్చున్న మనల్ని ‘మీకు ఏం కనిపిస్తోంది?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘ఏముంది, నీళ్లు..కనుచూపు మేరా కనిపిస్తూన్నవి నీళ్ళే!’ అని జవాబిస్తాం. అదే ఫీబీ అయితే ‘సముద్రం గుండె కొట్టుకోవడాన్ని చూస్తున్నాను’ అంటుంది. ‘ ఎగిసి పడే కెరటాలను ఒడిసి పట్టుకుంటుంది, గాలి ఉధృతాన్ని చిత్రిస్తుంది, ఒడ్డుని తాకే కెరటాల నృత్య భంగిమలను చిత్రిస్తుంది, సాగర సౌందర్యాన్ని తన చిత్రంలో నిక్షిప్తం చేయగలదు. నీటి అలల ఉధృత్వం తో పాటు, వాటి అశక్తతనూ తన కుంచెతో కాన్వాస్ పై కనబరచగలదు, అలలు ఒడ్డును తాకడానికి ఎగసి పడతాయి, ఎంతో పైకి లేచి, అదే వేగంతో క్రిందకి పడిపోతాయి, ఒక దాన్ని మరొకటి ఒరుసుకుంటాయి, దీన్ని చిత్రించడం – మాటల్లో చెప్పేటంత సులువు కాదు, మెరుపు వేగంతో తళుకు లీనుతూ ఎగిసి పడే సముద్ర కెరటాలు ఫీబీ బొమ్మల్లో అవి సృష్టించే కల్లోలం తో పాటు కనబరిచే ప్రశాంతత నీ ప్రదర్శిస్తాయి, ఫీబీ తాను కనబరిచే ప్రతిభనీ మనం ఊపిరి తీసుకునే విధానం తో పోలుస్తుంది. ఆమె చిత్రాల్లో వాస్తవికత ఉంటుంది, అనుభూతి ప్రధానమైన చిత్రాలు కూడా అవి. మొత్తం మీద ఫీబీ సముద్ర దృశ్యాలు – ఒక సాగరమథనం, కళాకారుని ‘సరస్వతి’ ! చూడగల కనులే ఉంటే ఈ చిత్రంలో అసామాన్యమైన సౌందర్యాన్ని చూడొచ్చు, వినగల చెవులే ఉంటే గంభీరమైన అలల ధ్వని ని వినొచ్చు
*****