జానకి జలధితరంగం-9
-జానకి చామర్తి
అహల్య ఏకాంతవాసము
ఏకాంతవాసము ( ఐసోలేషన్) .
ప్రస్తుతం ఈ మాట ఎక్కువ వినిపిస్తోంది. తమని తాము వ్యాధి నుంచి విముక్తి పొందడానికి, పరిరక్షించుకోవడానికి , మిగతావారికి కూడా మాటల ద్వారానూ తమ నడవడిక ద్వారా సోకకుండా ఉండటానికి విధించుకున్న ఒక నియమము . ఆ వ్యాధి ఎటువంటిదైనా కావచ్చు గాలిలా తాకేది కావచ్చు , స్పర్శ తో అంటేది కావచ్చు , బలహీనమై మనసును కట్టుపరచుకోలేక సామాజిక దూరాన్ని లేదా కట్టుబాటుని పాటించకపోతే వచ్చే ముప్పు అని కూడా అనుకోవచ్చు.
రామాయణంలో అహల్య కథ తెలియనివారు ఎవరూ లేరు. గౌతమ మహాముని ధర్మపత్ని అహల్య , ముల్లోకాలు లోనూ సౌందర్యరాశి. ఆమె అందానికి ప్రలోభపడి సాక్షాత్తూ దేవేంద్రుడే , గౌతముడు ఇంటలేని సమయాన వచ్చి , అహల్యను మంచిమాటలతోనూ వంచనతోనూ తన దారికి తెచ్చుకుంటాడు తన దానిని చేసుకుంటాడు. పని ముగించుకు వచ్చిన గౌతముడు జరిగిన విషయం గ్రహించి ఇంద్రుని శపించి శిక్షిస్తాడు. అహల్యను విడిచి వెళిపోతాడు. ఆమె పునీతురాలు అయినాకనే తిరిగి వచ్చి కలసి ఉంటానని.గడువు కూడా ఎప్పటిదాకా, రామచంద్రుని ఆగమనం దాకా.
మరి అహల్య .. ఆమె తప్పు చేసిందా.. తప్పుకు బలి అయ్యిందా? రక రకాల భాష్యాలు .. ఆ కథ కి సంబంధించి.
ఒక వాదన , తప్పు చేయడం కి అంటే శారీరకంగా అపవిత్రురాలు అయింది కాబట్టి , ఏకాంతవాసము శిక్ష అంటూ. ఆ విషయం అంతుపట్టదు , అర్ధం కాదు. కాని ఆలోచిస్తుంటే ప్రస్తుతం కోవిడ్ పరంగా పొందే ఏకాంతవాసం కూడా , శారీరక అపవిత్రత కి విధించబడిన శిక్షా అని ఒక అనుమానం.
ఒక వాదన ఇలా కూడా ఉంటుంది,
మనసు మైల పడింది మకిలి అయ్యింది కాబట్టి , బలహీనమైన మనసును స్ధిర పరచుకోవడానికి , తనని తాను గట్టి పరచుకోవడానికి , అహల్య భర్త గౌతమ ముని మౌనంగా , ఏకాంతంగా తపస్సు చేసుకొమ్మన్నాడని. పునరుజ్జీవనం పొందమని.
అంత కీకారణ్యమైన అడవిలో ఆమె ఒక్కత్తే. ఏకాంతంలో , శిల అయినంత స్ధిరంగా, దుమ్ము తెర కప్పుతో మాసిపోయి , ఛాయలా వెలిసిపోయి, పలకరింపు లేక , పిలచినా ఎవరూ పలుకక, స్వీయ నియంత్రణలో , తెలిసో తెలియకో తప్పు చేసావన్న పెద్దల మాట జవదాటక .. తపస్విని అయిన అహల్య , ఒక శేషప్రశ్న లా ఉంటుంది.
ఈ విషయాన్ని ప్రస్తుత ఏకాంతవాసం కి సమాంతరంగా ఆలోచిస్తే.. అహల్య ఎంత కష్టం అనుభవిస్తూ తన ఏకాంతవాసమూ తపస్సు చేసిందో తెలుస్తుంది .
వర్షం కి తడిసింది , ఎండకి ఎండింది , ఒంటిగా ఒంటరిగా జరిగిపోతున్న కాలాలని చూస్తూ గడిపింది, కరిగిపోతున్న సమయాన్ని లెక్కలు వేసుకుంది , పెరిగిపోతున్న వయసును , క్రుంగిపోయే మనసును చిక్కబట్టుకుంది. ఊపిరులు గట్టి చేసుకుంది. హృదయం బలోపేతం చేసుకుంది. ధైర్యం వహించింది. దైన్యం తోసిపుచ్చింది. తనే , తనకి తోడూ నీడ అయింది.
రాబోయే మంచిరోజులకు ఊహల ముంగిటిలో ముగ్గులు వేసింది. తనవారితో కలిసి ఉండబోయే దినాలకు దారులు పరచుకుంది. ఏకాంతం ముల్లులా గుచ్చుతున్నా , జత కలిపే గులాబీ వికసించడానకై ఎదురు చూసింది. శభ్ర యై , భద్ర యై , తాజా శుభోదయం కోసం వేచి ఉండింది.
స్వీయనియంత్రణ చేసుకుంది. మనఃశ్శరీరాలను తమస్సు అనే టాక్సిన్ నుంచి శుద్ధి చేసికుంది. కొత్త ఊపిరి పోసుకుంది.
కారణం ఏదైనా కావచ్చు ఆమె ఏకాంత వాసానికి , ఇప్పటి ఈ కరోనా పరిస్ధితి రావడానికి సరైన కారణం లేనట్టుగా. కాని ఆమె పట్టుదల ధైర్యం స్ధిరచిత్తం సహనం తట్టుకున్న శరీరకష్టం నిర్భయత్వం ఆశావహ దృక్పధం .. ఆచరణ యోగ్యం. ఇన్ని సుగుణాల రాశి ఆ అహల్య , తర తరాలకు తరగని యోగ్యురాలు .
అహల్య తనని కాపాడుకుని, కుటుంబాన్ని కాపాడింది. దిద్దుబాటును , సరయైన బాటను, ప్రపంచానికి తాను ఆచరించి చూపింది. ప్రశ్నార్థకం గా మారిన తన జీవితానికి, అహల్య తనే జవాబు రాసుకుంది ,
శాంతంగా ప్రశాంతంగా అన్నిటికన్నా ముఖ్యంగా, “ ఏకాంతంగా”.
ప్రస్తుత కరోనా కాలంలో మనకీ ఎన్నో శేష ప్రశ్నలు, ఎప్పటికి దొరుకుతుందో జవాబు.ఏదైతేనేమి ..ఇక్కడ అహల్య చేసిన ఏకాంతవాసమూ , తనని తను ఉద్ధరించుకోవడానికి చేసిన ప్రయత్నము అందరకీ ఆదర్శమే .. ముఖ్యంగా అల్లకల్లోలమైన ఇప్పటి కరోనా ని ఎదుర్కొంటున్న పరిస్ధితులలో.
*****