ట్రావెల్ డైరీస్ -5

కావేరి

-నందకిషోర్

కావేరి పిలిచి నాలుగురోజులైంది. ఆషాడ వర్షంలో గగన చుక్కి, బారా చుక్కి పోవాలని కోరిక. అక్కడికింకా నీళ్లు రాలేదు. వాన బాగా కురిసి KRS dam(Mandya District) నిండి నీళ్ళొదిలితే తప్ప ఆ జలపాతాలు సొగసుదీరవు. చాలారోజులకి సుప్పమ్మని కదిలించి కావేరి విషయం చెప్పాను. ఆమెని చూడాలనిపిస్తుందే సుప్పమ్మా అంటే ఎవర్రా అది అని నవ్వింది. మడికేరి వెళ్ళమంది. నాతో ఎవరన్నా మనుషులుంటే తనూ వొచ్చేదే పాపం. అంతదూరం ఒక్కతీ రాలేదు.
 
పరిచయం రెండేళ్లే అయినా సుప్పమ్మ (సుప్రియ) నేను చిన్నప్పటి స్నేహితులం.చిన్న పిల్లల్లా గొడవ పడటం, పరుగులెత్తడం తప్ప ఎన్నడూ మోహావేశాలకి చిక్కలేదు. తనకూ నాలాగే తిరగడం ఇష్టం. చూసింది చూసినట్టు చిత్రించడం ఇష్టం. నేను కవిత్వమై నిల్చిపోయిన చోట సుప్పమ్మ బొమ్మలా నిల్చునేది. పద్యాలతో, వర్ణాలతో వసంతాలు చల్లుకున్న రోజుల్లో హిమాలయమంతా తుళ్ళి తుళ్ళి నవ్వేది.
 
శనివారం పొద్దున్నేలేసి మడికేరి బస్సెక్కాను. సగం నిద్ర ఆపుకుని సూర్యోదయానికి ముందే కొండకి చేరాలని నాలుగింటికే బస్సెక్కాను.దాదాపు దగ్గరికి వస్తోందనంగా సుప్పమ్మ ఫోన్. మైసూరుదాక వొచ్చిందట తను. నాన్నని ఒప్పించి తనొస్తాదని నేనూ ఊహించలేదు. నేనింత పొద్దున లేస్తా అని తనూ అనుకోలేదు. ఫోన్ రాగానే దారిలో ఒకచోట ఆకుపచ్చ అడవిలో దిగిపోయాను. అడవి స్నానం చేస్తూ ఉండింది. నన్ను చూడగానే మేఘం కప్పుకొని సిగ్గు పడింది. ఎక్కువసేపు ఉండే వీల్లేక వెనక్కి మళ్ళాను. రెండు గంటల ప్రయాణంలో మైసూరు చేరాను. సుప్పమ్మని కలిసాను. ఏమీ మారలేదు సుప్పి. చూసి దాదాపు యేడాది. నన్ను తిప్పేందుకని టూ వీలర్ తెచ్చింది. తనవల్లే టూ వీలర్ నేర్చుకున్న పాత సంగతి ఒకటి గుర్తొచ్చింది. కుంచె పట్టించి తను నాతో రంగుదిద్దించడం కూడా..
 
*
 
ఇవ్వాళ మైసూర్ అంతా చూపిస్తా నీకని బండి తిప్పింది సుప్పమ్మ. చాముండి కొండమీదకి తీసుకుపోయింది. ఒక వ్యూ పాయింట్లో ఆపి ‘మైసూర్ అంతా ఎదురుగా ఉందిరా నందు’ చూడంటూ నవ్వింది. దాని తెలివికి నేనూ నవ్వుకున్నాను. పదకొండయే వేళ ఆలయం దగ్గర ఉన్నాం. భక్తి సంగతి ఎలా ఉన్నా దేవీ అనే కలవరింత నా జీవితంలో భాగం. అమ్మవారిని చూడటం భలే ఇష్టం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ క్రౌంచ పట్టన చాముండి నాలుగవది. నేను చూస్తున్న వాటిలో ఎనిమిదవది. ఆ కొండదారిలో ఒక చోట ఆగి ఎప్పట్లాగే color pastels , brushes తీద్దామని ఉండింది. శనివారం రద్దీ వల్ల ఆగిపోయాం. కొండ దిగినాక పాలెస్ లేదా జూ చూద్దామని ఉన్నా సుప్పమ్మకి ఎక్కువసేపు ఉండేంత వీల్లేదు. మధ్యాహ్నంకల్లా ‘మండ్యా’కి పోవాలన్నది. తన ఊరు అది. సరే అని కావేరిచూపిస్తే చాలని చెప్పాను.
 
ముందైతే KRS Dam దగ్గర వేణుగోపాలస్వామి ఆలయం కావేరి back waters లో ఉంటాదని అక్కడికి తీసుకెళ్తా అని అంది. ఈ కృష్ణరాజసముద్రపు వేణుగోపాల ఆలయానికీ పోవాలని హొయసలుల కాలంనుండి అనుకుంటున్నాగానీ, మరునిమిషంలో నిమిశాంబ గుర్తొచ్చి నిమిశాంబని చూస్తా అన్నా. “ఏమిరా నందు, నిమిశాంబ కూడా పిలిచిందిరా నిన్ను” అంటూ నవ్వింది సుప్పి. నిజం చెప్తే ఇంకా నవ్వుద్దని చెప్పలేదు. తన తెలుగు భలే ముద్దు.
 
అరగంటలో శ్రీరంగపట్నం చేరిపోయాం. కావేరిని రెండు పాయలుగా చేరి మళ్లీ కలుస్తాది శ్రీరంగపట్నంలో. ఆ పట్నం చిన్న ద్వీపంలాగా ఉంటాదని పురాణ వర్ణన. ముందు ఆ రెండు వంతెనల మీద కాసేపు ఆగాము. ఆపైన నిమిశాంబ దగ్గరికి పోయాము. నిమిశాంబ దేవీని చేరుకునే వంతెన మీద ఆగితే కావేరి నేను ఎదురుపడ్డట్టు ఉన్నది. కావేరి బాగా అలసిపోయి ఉన్నది. Brahmani Kite ఒకటి గాల్లో ఎగరటం ఆపేసి గాలితో పాటు అటూ ఇటూ ఊగుతున్నది. పక్షులు రెక్కలు విసురుతూ అలసిన దేవేరిపైన సేవగా తిరుగుతున్నాయి. కాసేపు మౌనంగా ఉన్నాను. లోకం మబ్బుపట్టి ఆపైన కొద్దిగా చినుకుపడింది. Gangai nadippuraththu godhumai pandam, Kaveri vetrilaikku maaru kolvom అని రాగం తీస్తుంటే ‘ఎవర్రా నందు నీ కావేరి, దొరికిందా?’ అన్నది సుప్పమ్మ. “గంగానదీతీరపు గోధుమలు తెస్తే కదా నేను! మారుగా ఏమన్నా అడగటానికి”…పరధ్యానం చెదిరిపోతుంటే ఇంకా లేదన్నాను.
 
*
 
నిమిశాంబ ఆలయం గంజాం అనే చిన్న ఊర్లో కావేరి గట్టుకు ఉంటుంది. సుప్పమ్మ లోపలికి రాలేదు. నేను త్వరగానే నిమిశాంబదేవీ దర్శనం చేసుకున్నాను. ఒక్కో అంచెలో ఒక్కో రంగు పూలమాలతో కేవలం ప్రసన్నమైన వదనమొకటే కనిపించేలా దేవిని అలంకరించారు. మల్లెలకి మల్లెలకి మధ్యన గులాబీలు కెంపుల హారాల్లా, మల్లెలకి ఇరుపక్కల బంతిపూలు పచ్చల హారాల్లా అగుపించాయి. ప్రార్ధనగా చూస్తూనే శిల్పికి అన్యమనస్కంగా దండం పెట్టాను. ఉబికిన చెంపలమీది మెరుపు నిద్రపోయే పసిదానిలా ఉంచడం ముచ్చటేసింది. పూల రెక్కల తడి, దేవి కన్నీటి చుక్కల్లా ఉండటం కూడా. నిమిషమే ఎదురు నిల్చున్నా శ్రీచక్రం చుట్టూ చిందిన కుంకుమ, దాని పక్కనే చిందిన దీపం వెల్తురు కళ్ళని పట్టుకుని వదల్లేదు.
 
నిమిశాంబకి దూరం పోతుంటే దారిలో వర్షం. ఈ సారి వొచ్చిన దారి కాకుండా వేరే దారిలో పోయాం. దరియా దౌలాత్ బాగ్ దారిలో. ఇందాకటి గులాబీపూలు ఎక్కడివోకూడా అర్ధమైంది. ఆ దారినిండా గులాబీ తోటలు. సమయం దాటిపోతుందని, ఎక్కడా కాసేపు కూర్చునే చోటులేదని హోటల్ కోసం వెతికాం. వెతుకుతూనే జల్లులో తడుస్తూ దాదాపు మండ్యా శివార్లలోకి వొచ్చేసాం. ఓ జైన్ దాబాలో లంచ్ కోసం ఆగాం. బ్యాగ్ తీసి తన కొత్త బొమ్మలన్నీ చూపించింది సుప్పమ్మ. నేను తూర్పు కనుమలో, తను పశ్చిమ కనుమలో ఇన్నాళ్లు చూస్తున్న దృశ్యాలు ఒకటే అయినందుకు, నేను ఇంద్రావతి మీద తను శరావతిమీద ఒకేరోజు ఉన్నందుకు ఆశ్చర్యపోయాను.
 
శ్రీరంగపట్నంలో చూడాల్సినవి ఇంకా మిగిలే ఉన్నాయి. సుప్పమ్మని దింపి వెనక్కిమళ్ళాను. ఉన్న కొంచెం సమయంలో అన్నీ చూడటం కుదరదని తెలుసు. తప్పకుండా చూడాల్సింది రంగనాథునొక్కణ్ణే. ముందు దరియా దౌలాత్ బాగ్కి వెళ్ళాను. ఫ్రెస్కోస్, ఫ్లోరల్ పాటర్న్స్ బాగున్నాయి. రాజప్రసాదాల, గుర్రాల బొమ్మలు కూడా. రంగులు పాలిపోయి ఉండటం కొంత బాధనిపించింది.
 
*
 
నాలుగింటికేమో రంగనాథ ఆలయం తెరుస్తారు. నేను వెళ్లేసరికి అయిదయింది. ఆ ఎత్తైన రాజగోపురం మీదికి కళ్ళు సారిస్తే చూపు ఆకాశంలోకి పోతుంది. అప్పటికే నల్లని మబ్బు, సూర్యాస్తమయపు వెల్తురు ఛాయా కలిసి అభిషేకజలంతో నిండిన రాగిపాత్రలా ఉంది ఆకాశం.
 
రంగనాథుని చేరాలంటే రాతి మంటపాలు దాటి కదలాలి. రాతిమంటపంలో ఉన్నప్పుడే వాన. చుట్టూ పైకప్పు ఉండటం వల్ల కేవలం ధ్వజస్థంభం ఉన్న దగ్గరే కనిపిస్తోందా వాన. చతురస్రాకార ఖాళీలో దేవుని కరుణ తుంపరై రాలుతున్నట్టు ఆ దృశ్యం అద్భుతం.నిజానికి క్యూ ఇంకా మెల్లగా కదిలితే బాగుండనిపించింది. గర్భగుడికి చేరువకాగానే నిలువెత్తు రంగనాథుడు నిద్రపోతూ కనిపించాడు. కాటుకలు అంటంటి కారునలుపైన దేవుడని రాసుకున్నానెప్పుడో. వాడే. వాడి కళ్ళ మీది తెలుపు వర్ణం ఎవరో పెట్టిన చివరి ముద్దులా తోచింది
 
గుడి బయటకి వొచ్చి నడుస్తుంటే మైదానంలో తెల్లగుర్రాలు, వాటిపై పిల్లాన్ని ఎక్కించి పక్కనే నడుస్తున్న నాన్నలు కనిపించారు. నేను మైసూరు దాకా త్వరగా పోవాల్సి ఉన్నందున గుర్రం ఎక్కిపోలేదు. బస్సెక్కి అరగంట నిద్రపోతే మైసూరు లేపింది. మైసూర్లో రాత్రి sound n light show కళ్ళకి నిజంగా వేడుక. అది నల్లని మేఘాకాశం కింద రంగుల దీపోత్సవం. శ్రీరంగపట్నం కథ ఒకపక్క, నేనున్న గ్రహంనుండే తప్పిపోయి వొచ్చిన మనిషి సందేశాలు ఇంకో పక్క.. ఆ ఒక్క గంట భలేగా గడిచింది. లైట్ షో చివరలో అన్ని దీపాలు ఒకేసారి వెలిగించిన్నప్పుడు అంతా నిశ్శబ్దం. నిద్రని కమ్ముకొచ్చే నిశ్శబ్దం.
 
అవును. ఆదివారం పొద్దున లేసి మాత్రం ఏం చేస్తాను ? కొండకోసమో, నదికోసమో, మనిషికోసమో.. ప్రయాణం.
 
 
**
సమయమే చాలదు సరసమాడే గడియ

సమయాంబ నీ స్పర్శలోన మాయ

నిమిషమే నిలువదు నిదురపోయే గడియ
నిమిశాంబ నీ స్మరణలోన మాయ

క్షణమైన ఒప్పదు కౌగిలింతల గడియ
క్షణాంబా నీ స్పర్ధలోన మాయ

కన్నుతడి చన్నులు
ఆరు మాయ

ప్రియసఖీ!
కావేరి నీళ్ల మాయ

****

Photo: Ranganathaswamy Temple,  Srirangapatnam

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.