దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు
(ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం “నెల నెలా తెలుగు వెన్నెల” 13 వ వార్షికోత్సవపు సాహితీ సదస్సు ప్రత్యేక ప్రసంగం -జూలై 25, 2020)
–డా||కె.గీత
కృష్ణశాస్త్రిగారి పాటంటే ఒక తియ్యదనం, ఒక గొప్ప మధురానుభూతి, ఒక విహ్వల బాధ!
ఆయన కవిత్వంలో కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయి.
అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా, ముందుగా నేను చిన్నతనంలో నేర్చుకున్న కృష్ణశాస్త్రిగారి పాటల్లో నాకిష్టమైన లలిత గీతంతో ప్రారంభిస్తాను.
ఇది కృష్ణశాస్త్రిగారి గేయసంహిత “అమృతవీణ” లోనిది.
ఒదిగిన మనసునా ఒదిగిన భావమూ
కదిపేదెవ్వరో కదిపేదెవ్వరో ||ఒదిగిన||
కదలని తీగకు కరిగిన రాగము
కరపేదెవ్వరో కరపేదెవ్వరో
ఆ… ఆ … ఆ
కదిపేదెవ్వరో కరపేదెవ్వరో
కరగని మనసునా కదలని తీగెను
కదిపేదెవ్వరో కదిపేదెవ్వరో ||ఒదిగిన||
హృదయము రాయిగా
గళమున రేయిగా
కదలని దీనుని
గతియిక ఎవ్వరో
నాకై ప్రాణము గానము తానై
నడిపేదెవ్వరో నడిపేదెవ్వరో
ఆ… ఆ … ఆ
కదిపేదెవ్వరో కరపేదెవ్వరో ||ఒదిగిన|| (అమృతవీణ)
మా అమ్మగారు, ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి, తన అభిరుచులను పిల్లలైన మాతో పంచుకునేవారు. నాకు సంగీతం, సాహిత్యం పట్ల అభినివేశం కలగడానికి కారకురాలు, గురువు మా అమ్మగారే. ఆవిడకు కృష్ణ శాస్త్రిగారి లలిత గీతాలంటే చాలా ఇష్టం.
నాకు లలిత గీతాలు, జానపద గీతాలు తప్ప ఆవిడ సినిమా పాటలు ఎప్పుడూ నేర్పించేవారు కాదు. అలా సంగీతం, సాహిత్యం నాకు రెండుకళ్లుగా ఉగ్గుపాలతో అబ్బిన విద్యలు.
అలా నేను నేర్చుకున్న మొదటి గీతం
తొలిప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము
వెలుగు గుడి మొగసాల నిలిచె యాత్రా జనము
కోనకోనల గాలి కొసలూర్చె ఆనందం
కోనేటిలో తమ్మి గ్రుమ్మరించె మరందం | | తొలి| |
ఆలయమ్మున గంట అందించె ఆహ్వానం
ఆలపించిన పికము లాలపించెను ప్రణవం | | తొలి| |
గుడిని శంఖము మొరసె విడెను వాకిటి ద్వారం
ఎడద యెడదను నిండె గుడినుండి మా దైవం | | తొలి| | (అమృతవీణ)
నా చిన్నతనంలో మా ఇంట్లో కరెంటు పోయినప్పుడు వెన్నెట్లో కూచుని అందరం పాటలు పాడుకోవడం ఒక తియ్యని జ్ఞాపకం.
వెన్నెలంత అందమైన, ఆహ్లాదమైన ఈ పాట చూడండి –
రెల్లు పూలా పానుపుపైన
జల్లుజల్లులుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా || రెల్లు ||
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా
మరిగే రాధ మనస్సు పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మా వెన్నెల పరచినారమ్మా || రెల్లు ||
కడిమి తోపుల నడిమి బారుల
ఇసుక బైళుల మిసిమి దారుల
రాసి రాసులుగా
ఎవరో పోసినారమ్మా వెన్నెల పోసినారమ్మా || రెల్లు || (అమృతవీణ)
కృష్ణ శాస్త్రిగారి గురించి నాకు తెలిసిన ఓ ప్రత్యేకమైన విషయం చెపుతాను.
నేను పుట్టి పెరిగిన ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. మా ఊరి నించి కృషశాస్త్రి గారి ఊరు చంద్రంపాలెం దాదాపు 20 మైళ్ల దూరంలో ఉంటుంది.
మా అమ్మగారు మా ఊళ్లో దాదాపు 25 సంవత్సరాల పాటు స్కూలు నడిపించేరు. మా స్కూల్లో కాపలాకి ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన్ని పిల్లలందరం “తాతా” అని పిలిచేవాళ్ళం.
తన చిన్నతనం లో చంద్రంపాలెంలో కృష్ణ శాస్త్రిగారింట పనిచేసేవాడినని చెప్తూండేవాడు.
కృష్ణ శాస్త్రిగారిని ‘మా కిట్టయ్య బాబు ‘ అని అంటూ ఉండేవాడు.
అలా తన జ్ఞాపకాల్లో ఉన్న కృష్ణ శాస్త్రిగారి గురించి మా అమ్మకు తాత చెప్తూండడం నాకింకా బాగా గుర్తు-
కృష్ణ శాస్త్రిగారు భోరున వాన కురుస్తూ ఉంటే, చేల గట్ల మీంచి నడచు కుంటూ వెళ్లి శనగ చేలో నిలబడి ఆకాశం కేసి చూస్తూ ఎంతో సేపు ఉండి పోయేవారట-చాలా అందమైన రూపమనీ, ఆయన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించేదని చెప్తూండే వాడు-
ఆయన వర్షంలో ఎందుకు తడిసేవారో నా పధ్నాలుగో యేట తొలి కవిత రాసినప్పుడు అర్థమయ్యింది.
అమితమైన భావుకత్వం మనశ్శరీరాల్లో అనునిత్యం ప్రవహిస్తే తప్ప భావకవి కావడం అసాధ్యం.
కానీ నా దురదృష్టం ఏవిటంటే నాకు సాహిత్య స్పృహ కలిగే సరికి నేను చూడాలనుకున్న కృష్ణ శాస్త్రి గారు, తిలక్, శ్రీశ్రీ, చలం ఎవ్వరూ లేరు.
కృష్ణ శాస్త్రి గారిని చూడలేక పోయినా వారి సాహిత్యాన్ని హృదయంలో ప్రతిష్టించుకుని, వారి పాటలు ఆలపించినప్పుడల్లా వారిని దర్శిస్తూనే ఉన్నాను.
ఇక ఆయన లలిత గీతాల్లో భక్తి లేదా ఆధ్యాత్మిక గీతాల తీరే వేరు-
ఆయన వాడే పదబంధాల తీరు, లాలిత్యం అనితర సాధ్యం-
ఉదాహరణకు-
పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు
నీ వలె సుకుమారములు
నీవలెనే సుందరములు ||పూవులేరి||
తుమ్మెద కాలూననవీ
దుమ్ము ధూళి అంటనివీ
కమ్మగ వలచేవీ
రకరకమ్ముల వన్నెలవీ ||పూవులేరి||
ఆలసించినా పూజవేళ
మించిపోయినా
ఆలయమ్మును మూసి
పిలుపాలింపడు ప్రభువూ||పూవులేరి||
మాలలల్లుటెపుడే
నవసోనలల్లుటెపుడే
ఇక పూలే సోలాలి
తలంబ్రాలల్లే స్వామి పైన ||పూవులేరి||(అమృతవీణ)
కృష్ణ శాస్త్రిగారి పాట చూడగానే గుర్తించగలిగే ఒక విలక్షణ పదజాలంతో ఉంటుంది-
ఈ పాట చూడండి:
చరణాలు చరణాలు ముక్తి సోపానాలు
శరణన్న వారికవి మోక్షభవనాలు ||చరణాలు||
ధరణిసిరి హృదయాల తనరారు చరణాలు
గిరిజేశ్వరాకృతిని కీర్తించు చరణాలు
గిరిచూపు గలవాని నిరసించు చరణాలు
సరయూ నదీ తటిని విహరించుచరణాలు ||చరణాలు||
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన కిరణాలు
సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు
శాంతి కవి నిలయాలు సౌందర్యవలయాలు
సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు ||చరణాలు||
****
ఇక కృష్ణశాస్త్రి గారి జీవితం, రచనలు మొదలైన విశేషాలతో బాటూ ఆయన రాసిన మరిన్ని విశిష్టమైన కవితల్ని, పాటల్ని మీ ముందుంచుతాను.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర వుండే చంద్రపాలెంలో 1897 లోనవంబరు 1వ తారీఖున కృష్ణశాస్త్రి గారు జన్మించారు. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధికెక్కిన సుబ్బరాయ శాస్త్రి గారు అంటే కృష్ణశాస్త్రి గారి పెదనాన్నగారు, ‘తమ్మనశాస్త్రి’గా వాసికెక్కిన వెంకట కృష్ణశాస్త్రి గారు, అంటే కృష్ణశాస్త్రి గారి నాన్న గారు ఆ రోజుల్లో పిఠాపురం సంస్థానంలో విద్వత్కవులుగా వుండేవారు. వీరి ఇంట్లో నిరంతరం సాహిత్య గోష్టి జరుగుతూ వుండేది. అలాంటి వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రిగారు పదవ యేటనే ‘నందనందన ఇందిరానాథ వరదా’ అనే పద్యం రాశారు.
ఒక పక్క సాహిత్యకృషి సల్పుతూనే పిఠాపురంలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియట్ ను, విజయనగరం కళాశాలలోను బి.ఎ డిగ్రీని చదివారు.
విద్యార్థి దశలో గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదం, బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రభావం కృష్ణశాస్త్రి గారి మీద ప్రబలంగా ఉండేవి. ‘జయము జ్ఞాన ప్రభాకరా జయము క్రాంతి సుధాకరా’ అనే ప్రార్థనా గీతాన్ని బ్రహ్మ సమాజం కోసం రచించారు.
పెద్దాపురం మిషనరీ పాఠశాలలోను, కాకినాడ పి.ఆర్. హైస్కూలులోను ఉపాధ్యాయుడిగా పని చేశారు. అప్పుడే సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూ ‘జయజయ ప్రియభారత జనయిత్రీ’ అనే అద్భుత దేశభక్తి గీతాన్ని పాఠశాల విద్యార్థుల కోసం రాశారు.
1920లో బళ్లారి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ ‘కృష్ణపక్షం’ గేయ సంపుటిని రాసేరు.
మనందరికీ తెలిసిన ప్రసిద్ధగీతం
“ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా” ‘కృష్ణపక్షం’ లోనిదే.
1922లో భార్య కాలం చెయ్యడం కృష్ణశాస్త్రిగారిని అమితంగా బాధించింది. అప్పుడే “దుఃఖము”, “కన్నీరు”, “వంటి కరుణాత్మక కవితలు అనేకం రాశారు.
తరువాత భావ కవితోద్యమ సారధ్యం వహిస్తూ దేశమంతటా తిరిగారు.
1929లో ‘ఊర్వశి’, ‘ప్రవాసము’ గేయకృతులు ప్రచురించారు. ఆ తరువాత ‘పల్లకి’ పద్య కవితలు, అమృతవీణ’ గేయ మాలికలు, ‘పుష్పలావికలు”’ వ్యాసావళి, ‘బహు కాలదర్శనం’, ‘ధనుర్దాసు’, ‘అరుణ రథం’ మొ.న నాటికలు, ‘మంగళకాహళి’ దేశభక్తి, జానపద గీతాలు, “శర్మిష్ట” గేయ, శ్రవ్య నాటికలు రచించారు.
శాస్త్రిగారు ప్రాచీన, నవీన, ప్రగతి వాదాల “త్రివేణీ సంగమం” అన్నారు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు.
కృష్ణశాస్త్రిగారు గొప్పకవే కాదు గాయకులు కూడా. 1964లో గొంతు క్యాన్సర్ వల్ల మద్రాసులో ఆయన స్వరపేటికను తొలగించారు. “ముసలితనంలో మూగతనం భయంకరం- శిథిలమందిరంలో అంధకారం లాగున “ అని ఆయన ఎంతో బాధ పడ్డారు.
కానీ “మూగవోయిన నా గళమ్మునను గూడ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు” అని ముందెన్నడో రాసుకున్నది నిజం చేస్తూ ఎన్నో పాటలు రాశారు.
“నీ ఆనయైన స్వామీ” అన్న పాటలో
నీ ఆనయైన స్వామీ
నా ఔదలనిడికోనా
పోనీలే నీ దయ ఇంతేనని అన్నానా || నీ ||
మాట తీసుకుని నాకు
మౌన మొసగినావు
మౌనమందు కొని నీకు
గానమియ్యమంటావు || నీ ||
నా కంఠము చీకటైన
ఈ కృష్ణ రజని తుదిని
“నాకయి నీ చెయి చాచిన
నా కానుక ఇంతే గద!
ఈ కొంచెపు పాటే గద!” || నీ || (అమృతవీణ)
అంటారు.
స్వరపేటిక తొలగించిన తరువాత కృష్ణశాస్త్రి గారు కాలంచేసే వరకు, అంటే దాదాపు పదహారేళ్ల పాటు ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏం చెప్పాలన్నా కాగితం మీద రాసి చూపించే వారు. ఎన్నో ట్రంకు పెట్టెలనిండా ఆయన రాసిన నోటుబుక్కులున్నాయని వారి అబ్బాయి, ప్రఖ్యాత వ్యంగ్యచిత్రకారులు, సాహితీవేత్త ‘బుజ్జాయి’ (ఆయన పేరు కూడా సుబ్బారాయ శాస్త్రి గారే) శ్రీశ్రీ గారితో అన్నారట.
కృష్ణశాస్త్రిగారు అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు.
ఆయనకి అనేక సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1976లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డునిచ్చి గౌరవించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది. 1978లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే అవధుల్లేని ప్రేమ, అనంతమైన అనుభూతి, అలవికాని వేదన మిళితమైన కరుణ రస మాధుర్యం.
ఆయన కవిత రాసినా, పాట రాసినా పదాల ఎంపికలోని విశిష్టత మనసుల్ని కట్టిపడేస్తుంది.
గొప్ప లాలిత్యం కృష్ణశాస్ర్తి గారి పాటల్లో ప్రధాన లక్షణం.
వేచి చూడడంలోని బాధని, ఆనందాన్ని ఏకకాలంలో చెప్పే పాట “అలికిడైతే చాలు”.
అలికిడైతే చాలు ఆశతో నాకనులు
వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ ||అలికిడైతే||
కమ్మతావుల తోడ నెమ్మదిగ ననుచేరి
నీలి ముంగురులలో గాలి ఊయల లూగ
వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ ||అలికిడైతే||
కనులు మూసే నేను కలత నిద్దుర పోవ
జాజిపూవుల మాల జారి చెక్కిలి తాక
వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ ||అలికిడైతే||
రోజాలు కోయగా తోటలోనికి పోగ
కొంటె ముల్లొకటి నా కొంగు చివరను లాగ
వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ ||అలికిడైతే||
పాటలో అనుభూతిని గాఢంగా జొప్పించడం అనేది కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.
“ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని” శ్రీశ్రీ శ్లాఘించారు.
ఇక్షు అంటే చెరకు. అర్ణవం అంటే సముద్రం.
శ్రీశ్రీగారే “కృష్ణశాస్ర్తి పలుకుల్లోని తీపి రస పిపాసువులకు ఎక్కడో ఉందనుకునే ఇక్షు సముద్రాన్ని వెతుక్కోవలసిన అగత్యాన్ని తొలగిస్తుంది “ అని చమత్కరించారు కూడా.
కృష్ణశాస్ర్తిగారు రాసిన ఏ పాట విన్నా రాసినప్పటి భావోద్వేగం అదే మోతాదులో శ్రోతల హృదయాల్లో కలగడం గమనార్హం.
అతి సుకుమారమైన ప్రణయ విరహ గీతాలతో బాటూ, గొప్ప తేజస్సుని, ఉత్సాహాన్ని నరనరాల్లో రేకెత్తించే దేశభక్తి గీతాలు రాసిన ఘనత కృష్ణశాస్ర్తి గారిది.
“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? “ (కృష్ణపక్షము)
అన్న వారే
సుభాష్ చంద్రబోస్ కోసం –
“ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార
ఏకాకి నిశీధి నొడుచు తరుణకాంతి ధార
జయపతాక! యువ పతాక! వియదాపగ వెడలు నౌక
ధగధగా స్వతంత్ర విభాతాకాశము
నొసట పొడుచు అరుణారుణ తార” (మంగళ కాహళి) అని ఉత్తేజపూరిత గీతాన్ని రాసేరు.
“కవిత్వం ఒక ఆల్కెమీ- దాని రహస్యం కవికే తెలుసు
కాళిదాసుకు తెలుసు- పెద్దన్నకు తెలుసు
కృష్ణశాస్త్రికి తెలుసు- శ్రీశ్రీ కి తెలుసు” అన్నారు తిలక్.
వసంతాగమనాన్ని మాధవీలత పెళ్ళి తో పోల్చి చెప్పిన ఈ పాట చూడండి.
ఈ పాటని బెజవాడ గోపాలరెడ్డి గారి వివాహ సందర్భంలో రాస్తే, కృష్ణ శాస్త్రి గారి మేనగోడళ్లు వింజమూరి అనసూయగారు, సీత గారు బాణీ కట్టి పెళ్ళిలో పాడారట.
మధోదయములో మంచి ముహూర్తము
మాధవి లతకూ పెళ్ళీ పెళ్ళీ
మాధవి పెళ్లికి మల్లె మాలతీ మందారం పేరంటాళ్ళూ || మధోదయములో||
కొమ్మకొమ్మకొక సన్నాయి
రెమ్మరెమ్మకొక గవాయి
కొమ్మారెమ్మా కలసి మెలసీ
మామిడి గుబురంతా ఒకటే హాయి || మధోదయములో||
నందన వనమే పందిరి అయితే మసృణ కిసలయ మంటపమైతే
మనసు కుసుమాలే మాలికలైతే మాధవి లతకూ మాధవ దేవుడు
మంగళ సూత్రం కడతాడూ || మధోదయములో|| (అమృతవీణ)
ఇలా గవాయి, మసృణ, కిసలయం వంటి మర్చిపోయిన ఎన్నో పదాలు, మనకు తెలీని గొప్ప పదాలు కృష్ణశాస్త్రి గారి గీతాల ద్వారా పరిచయమవుతాయి.
“ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ-
కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ” -అన్నారు చలం గారు.
అలా ఎందుకు అన్నారో మనందరికీ ఈ లలితగీతాలు విన్నాక అర్థమైదనుకుంటున్నాను.
*****
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
Chala manchi vishayalu teliparu. Nenu bejawadwada gopala Reddy women’s academy lo 2003 lo degree chesanu. Ayana peru malli ikkada vindam chala happy ga anipinchindi.
Thank you Bhagyalakshmi garu
చాలా బాగా చెప్పారండి. శాస్త్రి గారి కవిత్వం నిత్య నూతనం
అద్భుతంగా చెప్పారు గీత గారూ.. కృష్ణ శాస్త్రి గారి కవిత్వం నిత్య నూతనం.
ఎంత బాగా చెప్పారండీ గీతగారూ..చదివినంతసేపు వారితో పాటు ప్రయాణించినట్లు, ఆ ఫీలింగ్స్ అన్నీ అనుభవిస్తున్నట్టే ఉంది. పాటల ఎంపిక , వాటి పరిచయం ఎంతో బాగుంది.
గీత గారు అద్భుతమైన వ్యాసం.దేవులపల్లి వారంటే తెలుగు వారందరికీ ప్రాణమే గా. మీరు వ్యాసం కోసం ఎంచుకున్న గీతాలు చూస్తున్నప్పుడు మీ సాహిత్య అభిలాష అర్ధమౌతుంది పాఠకులకు🙏మీ తొలి గురువు సాహితీ వేత్త మీ అమ్మగారవడం మీ సాహితీ ప్రతిభ గొప్పతనం తెలుస్తుంది.మీకు హృదయపూర్వక శుభాభినందనలు💐అమ్మ గారికి నమస్సులు🙏లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శ్రీదేవి గారూ!
మీ ఆత్మీయ ప్రతిస్పందనకు ధన్యవాదాలు శ్రీదేవి గారూ!
నమస్కారం
Namah sumanjalulu🙏🙏🙏💐💐💐