పూర్ణస్య పూర్ణమాదాయ…

-లక్ష్మణశాస్త్రి

                 అర్ధరాత్రి కావస్తోంది. కొండలమీదనుంచి మత్తుగా జారిన పున్నమివెన్నెల యేటి నీటిమీద వులిక్కిపడి, ఒడ్డున ఉన్న పంటపొలాలూ, ఆ వెనక వున్న రబ్బరు తోటలసందుల్లోకి విచ్చుకుంటోంది. ఎటుచూసినా వెన్నెల వాసన. కొంచెం ఎడమగా ఉన్న కొబ్బరి తోటల్లో వెలుగుతున్న  ఆ మంటలోకి కర్పూరం ముద్దలు ముద్దలుగా కురుస్తోంది. చుట్టూ వందల్లో వేలల్లో జనం. ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అమృతం కురిసే వేళకోసం. ఏడాదికోసారి వచ్చే ఆ రాత్రికోసం. వారిని ఆశీర్వదించడానికొచ్చే దేవతలకోసం.    

                          అక్కడవున్న ఆరుగురు చెండ వాద్యకళాకారులు అరగంటనుంచీ తమ వాద్యవిన్యాసంతో ఫ్రేక్షకుల ఉద్విగ్నతను పైపైకి పెంచుతున్నారు ప్రకృతి ప్రతిధ్వనించేలా. పలుచని మేకచర్మంతో చేసిన చెండవాద్యపు మొహమ్మీద చింతబరికెతో   వాళ్ళు చేస్తున్న విన్యాసాలకి జనం పిచ్చెక్కిపోతున్నారు.. బృందంలోని గాయకులిద్దరు ఆ రాత్రి వేదికమీదకి రాబోతున్న దేవతలను కీర్తిస్తూ పాటలందుకున్నారు. వెనుక చెండ వాద్యఘోష. ఆనాటి ప్రదర్శనలోని దేవతల్లో మొదటి దేవత అప్పుడే గుడి ముందర ఏర్పాటుచేసిన వేదికమీదకి వచ్చి మెల్లగా గెంతులతో నృత్యం ఆరంభించింది. ప్రేక్షకులు ప్రదర్శన మొదలైందన్న సూచనగా పెద్దగా అరుపులూ కేకలతో స్వాగతం పలికారు.కళాకారుడిపైకి దేవత వచ్చింది అప్పుడే. మళ్ళీ ఆకాశాన్నంటిన కేరింతలు. దేవత చేతిలోని విల్లమ్ములు భుజానికెత్తుకుని, కత్తి గాలిలోకి ఝుళిపిస్తూ భక్తులమీదకి దూకుతుంటే వెనక్కివెనక్కి తగ్గుతూ మొక్కుతూ దారి ఇవ్వసాగారు. గుంపు మొత్తం ఒక కెరటంలా ముందుకూ వెనక్కూ వూగుతోంది. 

                      గుడి వెనుక, ఏటివొడ్డున వున్న  కొబ్బరిమట్టల పాక ఆనాటి తెయ్యం కళాకారులకి మేకప్ రూమ్ గా వొదిగిపోయింది. తరవాతి ప్రదర్శనకు వెళ్ళే భగవతి అనే స్త్రీదేవత వేషం ధరించిన కళాకారుడు మేకప్ తో ఆభరణాలతో అమ్మవారిని ఆహ్వానించడానికి రడీగా వున్నాడు. మొహానికి ఎర్రని మేకప్, తలకి చమ్కీలతో అలంకరించిన ఎత్తైన కిరీటం…. సింధూరం రంగు లిప్ స్టిక్. 

                             పాక వెనుక పరచివున్న చాపమీద కూర్చుని, ఆరోజు ధరించాల్సిన కాస్ట్యూమ్ రడీచేసుకుంటూ కనిపించాడు నేను కలవడానికొచ్చిన నా హీరో హరిదాసు.  కేరళ ప్రాచీన గ్రామీణ కళారూపం తెయ్యం ప్రదర్శనలో ఆ ప్రాంతంలో చాలా పేరు సంపాదించిన కళాకారుడు. హరిదాసు తెయ్యం కట్టడానికొస్తున్నాడు అంటే ప్రేక్షకులు రెట్టింపవుతారు. ఓ చిన్న తువ్వాలు లుంగీలా మొలకుచుట్టుకుని వెల్లకిలా పడుకొని వున్నాడు. మొహానికీ శరీరానికీ ఓ చిన్నకుర్రాడు రంగులు అద్దుతున్నాడు. ఒళ్ళంతా పసుపురంగు, బుగ్గలకి నారింజరంగు పెయింట్, రంగువాసన ఆ ప్రాంతమంతా ఘుమాయిస్తోంది. కరిగిన బొగ్గుతో కళ్ళచుట్టూ పెద్దగా కాటుకలాంటి గీతా, బుగ్గలమీద పిండిముద్దతో వేసిన మామిడిపండుముగ్గుల్లాంటి చిత్రాలు. హరిదాసు శరీరమే కాన్వాసుగా ఆ కుర్రాడు తన చిత్రకళావిన్యాసం చూపిస్తున్నాడు. 

                   అతనిపక్కనే మట్టినేలమీద సెటిలయ్యాను. అతను వేదికనెక్కడానికింకా టైముంది. హరిదాసు విష్ణువుగా మారిపోకముందే మాటలు మొదలెట్టాను. “షో మొదలెట్టకముందు ఎలా వుంటుంది మానసికస్థితి? దేవుడు వచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? దేవుడు నీ శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నతరువాత ఎలా ఉంటుంది?”  ఇలా రకరకాల ప్రశ్నలు.  

                     “ఇది చెప్పడం చాలా కష్టమండీ”  మొదలెట్టాడు హరిదాసు. “ఇరవయ్యారేళ్లనుంచీ ఇదే తెయ్యం ఆడుతున్నప్పటికీ ప్రతీసారీ అదే టెన్షన్ వుంటుంది. ఇదే మొదటిసారి అన్నంతగా. వచ్చే దేవుడంటే భయం కాదుసుమా. దేవుడు రాడేమోనన్న భయం. మన ఏకాగ్రతలో, వృత్తిపట్ల శ్రద్ధలో ఏమాత్రం లోపం జరిగినా, ఏదో ఓ రొటీన్ గా భావించినా, దేవుడు రాడు. మనం మనస్సును పవిత్రంగా వుంచి, ఆర్తితో పిలిస్తేగాని రాడు.”  

                         ఆగాడు హరిదాసు. కుర్రాడు ఎడమచేతిలో వున్న అరిటాకులోని రంగులు కలుపుతూ ముఖానికి పట్టిస్తున్నాడు. తెరచిన పెదాలకు ఎర్రటిరంగు అద్దుతున్నాడు. 

                     “ ఒక వెలుగు. కళ్ళు బైర్లుకమ్మేటంత తేజస్సు.” అక్కడి మేకప్ కిట్ లో అద్దం లేకపోవడం గమనించాను. 

“బయట వాద్యాలు గుండెలదిరేలా మోగుతుండగా, మేకప్ పూర్తిచేసి, అద్దం తెచ్చి ఇస్తాడు కుర్రాడు. అద్దంలో చూసుకుంటే నాకు దేవదాసు కాదు దేవుడే కనిపిస్తాడు. అదీ, ఆ క్షణంలో ఒక వెలుగు నా మొత్తం వ్యాపిస్తుంది. నా లోపలా బయటా, సర్వం.” 

                     “ఆ క్షణం లో జరిగేదేమిటో తెలుస్తుందా నీకు?”

                      “ఊహూ. ప్రదర్శన అయ్యేవరకూ ఆ వెలుగులోనే వుంటా. నాలోనే వుంటుంది వెలుగు. దైవానికీ నాకూ భేదం కోల్పోతా. మొత్తం ఆయనే నిండిపోతాడు.  నా సమస్యలూ, బంధాలూ, వత్తిడులూ అన్నీ కోల్పోతానా టైములో. నేనొక మీడియం. కరంటు ప్రవహించే వైరులా మారిపోతా.  నేనుండను. నాద్వారా దేవుడే మాట్లాడతాడు. పూజలూ హారతులూ అందుకుంటాడు. ఆట అయ్యాక, ఈ కిరీటం దించి పక్కనబెట్టేవరకూ ఈ స్థితి వుంటుంది.

              “అయ్యాక ఎలా అనిపిస్తుంది?”

                 “సర్జరీ చేసే డాక్టర్ తొలి కత్తిగాటులా”  కత్తితో కోస్తున్నట్టుగా చేత్తో అభినయించిచూపాడు. “సడన్ గా ఒక్కసారిగా అయిపోతుంది. దిగిపోతుంది. అప్పటివరకూ ఏమి జరిగిందో తెలీదు. మన జీవితంలో ఆ కొద్దిగంటలూ మనవికావు. ఎలా గడిపేమో లెక్కతెలీదు. ఓ పెద్ద రిలీఫ్. తలమీంచి పెద్ద బరువు దిగిపోయిన భావన.” 

                       ప్రదర్శనలో రెండో కళాకారుడు మేకప్ పూర్తిచేసుకుని అద్దంలో చూసుకుంటున్నాడు. భగవతి వేషం. చూస్తుండగానే కాళ్ళగజ్జెలూ చేతిగంటలూ ఘల్లుమనేలా పాదాలను గట్టిగా నేలపై తాటించసాగాడు. ఆ చిన్నగది వులిక్కిపడింది. కదలికల వేగం పెరిగి, వూగిపోసాగాడు. ఒక్కసారిగా, వొంటిపై ఏదో పిడుగు పడబోతే పక్కకు తప్పుకున్నట్టుగా  పక్కకు వొరిగాడు. ఒక్క క్షణం మాత్రమే. మనిషి వూగిపోతున్నాడు. మేకపిల్లను చంపబోయేముందు దాని కళ్లలోకి లిప్తపాటు చూసే చిరుతలా చూస్తున్నాడు. ఆ చూపు ఎవరివైపూ కాదు. అదో చూపు, అంతే! ఒళ్లు వణుకుతోంది. చేతులు కంపిస్తున్నాయి. కనుగుడ్లు వేగంగా అటూయిటూ పరిగెడుతున్నాయి. ఒక జంతువులా, వేటకు బయల్దేరిన మెకంలా, ఓ త్రాచులా విచిత్రమైన భంగిమల్లోకి శరీరాన్ని అలవోకగా మార్చుకుంటూ, ఒక్క ఉదుటున బయటకు దూకాడు భక్తుల్లోకి. ఇద్దరు అనుచరులు కాగడాలు పట్టుకుని అతనివెనుక  పరుగెత్తారు.

                                హరిదాసు మేకప్ పూర్తయినట్టుంది. కాస్ట్యూమ్ ధరించడానికి లేచాడు. అడిగా, “ ఇలా దేవుడి అవతారం ఎత్తడం నీకు ఫుల్ టైమ్ జాబ్?”

                                “ ఊహూ” అతని గొంతులో సన్నని జీర. “ ఏడాదిలో తొమ్మిదినెలలు కూలిపని చేసుకుంటాను. మా కులవృత్తి బావులు తవ్వడం, పూడికలు తీయడం. వారంలో అయిదురోజులు ఆ పని, చివర్రెండు రోజులు తలశేరి సెంట్రల్ జైల్ లో వార్డర్ గా టెంపరరీ వుద్యోగం. కడుపు నిండాలంటే తప్పదుగా. ఈ జైలు పని చాలా ప్రమాదకరం. చస్తూబతకడమే.” 

                    అర్ధం కాలేదు నాకు. 

                  “తలశేరి జైలులో ఖైదీలదే రాజ్యం. చాలామంది రాజకీయనేపధ్యం ఉన్నవారే వుంటారక్కడ. జైలు వారి ఆధీనంలోనే వుంటుంది. రోజూ పేపర్లో ఆ జైలునుంచి ఏదో వొక వార్త వస్తూనే వుంటుంది. రైవల్స్ మీద రోజూ రాత్రులు దాడి జరుగుతూనే వుంటుంది. ప్రత్యర్ధుల కాళ్ళూ చేతులూ తెగుతూనే వుంటాయి. ఇక్కడ రెండు జైళ్లు వున్నాయి. ఆరెస్సెస్ వాళ్ళకోసం తలశేరి, వాళ్ళ ప్రత్యర్ధులు సీపీయమ్ కోసం కన్నూర్ జైల్. ఇరుపక్షాలమధ్యా ఎప్పుడూ కాష్టం రగులుతూనే ఉంటుంది. వాళ్లు ఇటువచ్చినా, వీళ్లు అటెళ్లినా తెల్లారేసరికి కాలోచెయ్యో తెగాల్సిందే.” 

      “మరి ఆపేవారెవరూ లేరా?”

                “ఎప్పుడైనా ఎవరైనా ప్రయత్నిస్తూంటారు. ఈ మధ్య బీహార్ నుంచి వచ్చిన ఓ యెస్పీ గారు ఈ గాంగ్ లీడర్స్ ని దండించే ప్రయత్నం చేశారు. తెల్లారేసరికి అతడి క్వార్టర్స్ కాలి బూడిదయిపోయింది. నేనెవరి జోలికీ వెళ్లకుండా, నా జోలికెవరూ రాకుండా జాగ్రత్తగా నెట్టుకురావడమే. రోజూ చస్తూ బ్రతకడమే.”

                  “ఇక్కడి తెయ్యం ఆర్టిస్టులందరూ ఇంతేనా?” 

                “కదా మరి! అక్కడ చాముండి వేషంలో వున్నవాడు పెళ్లిమండపాలు కడుతూంటాడు. భగవతి వేసినవాడు బస్ కండక్టర్. గులిగాన్ అనే రాక్షసుడు కల్లు తీస్తూంటాడు. డిసెంబర్ నుంచి మార్చ్ వరకూ మేము దేవుళ్లమే. పార్ట్ టైమ్ దేవుళ్లమన్నమాట. ఈ మూడునెలలూ మా జీవితాలు మారిపోతుంటాయి. నాన్ వెజ్ తినం, సంసారసుఖానికి దూరంగా పవిత్రంగా వుంటాం, అందుకే మరి మేము దళితులమైనప్పటికీ, ఈ మూడునెలలపాటు అగ్రవర్ణాలవారూ, నంబూద్రి బ్రాహ్మణులూ క్యూ లో వచ్చి మరీ మా కాళ్లకు మొక్కుతారు.’

                  హరిదాసు ప్రదర్శనకు రడీ అయ్యాడు. అద్దం అందుకుంటూ అన్నాడు,

 “ మూడు నెలలు మాత్రమే ఈ అదృష్టం. అయిపోయినవెంటనే సంచులు సర్దుకుని, కడుపు చేత్తో పట్టుకుని కూలికిపోయే అంటరానివాళ్లమైపోతాము. జైలు జీవితం మొదలు.”                 

                              ****

                      పశ్చిమకనుమలకూ సముద్రానికీ మధ్య వెచ్చగా వొదిగివున్న స్వర్గం కేరళ.  ఇళ్ల పెరళ్ల లోంచి బ్యాక్ వాటర్స్ మీదుగా జీవితం స్రవిస్తూ ఉంటుంది నిత్యం. అక్కడే పాదాలు మూలిగే లోతులో స్త్రీలు బట్టలుతుక్కుంటూ, కూరలు తరుక్కుంటూ, చేపలు కొనుక్కుంటూ కనిపిస్తే, కొంచెం పక్కగా పడవలు బాగుచేసుకుంటూ, కొబ్బరిపీచుతో తాళ్లు పేనుకుంటూ చైనీస్ చాపల వలలు కుట్టుకుంటూ మగవారు, వారి కనుసన్నలలో గోచీలతో బుడుంగుమని నీళ్లలో మునిగి తేలుతూ స్నానాలు చేస్తూ పిల్లలు ఊరంతా అలుముకుని వుంటారు. ఎటుచూసినా బాతులమందలు. తెల్లని కొంగలు బువ్వ వెతుక్కుంటూ అలా వచ్చి వెళుతూ ఉంటాయి. ఇళ్ల దడుల నిండా అల్లుకుపోయిన రకరకాల తెల్ల పువ్వుల తీగలు, కొబ్బరిమట్ట ల మీద ఆరేసుకున్న రంగురంగుల పువ్వుల చీరలూ. ఊరంతా ఒక పెయింటింగ్. ఓ నిశ్శబ్దపు ప్రవాహం.

                 చాలా బాగుంది కదూ వినడానికి చూడటానికి.  కానీ నిజానికి కరడుగట్టిన సాంప్రదాయస్రవంతికీ, కులమతనిర్వచనాలకీ కూడా అంతే ప్రసిద్ధి కేరళ. 19వ శతాబ్ది శతాబ్ది తొలిరోజుల్లో కేరళలో తిరిగిన బ్రిటిష్ యాత్రికుడు డాక్టర్ ఫ్రాన్సిస్ బుచనాన్ మాటల్లో చెప్పాలంటే, క్షత్రియకులమైన నాయర్లు రోడ్డు పై వెళుతుంటే పొరపాటున ఎదురైన దళితుడి తల తెగి నేలతాకాల్సిందే. అది వాళ్ళకి వీళ్ళకి కూడా అంగీకారమే. ఎవరికెవరు ఎంతదూరంలో ఉండాలో, పంచె ఎవరు ఎంత ఎత్తుకి కట్టాలో, తల ఎలా దువ్వాలోకూడా ఓ కట్టుబాటు రూపంలో ఉండేది. 20వ శతాబ్దం తొలి రోజుల్లో కూడా వీధిలోకి వస్తూ, చేతిలో స్వీట్స్ పట్టుకుని తలదించుకుని రానందుకు తల నరికేసిన సంఘటనలు చాలా సాధారణం. రోజులు మారాయి. కులాంతరవివాహాలు వంటివి వినిపించినప్పుడు మాత్రం ఈ నరుక్కోవడాలు అక్కడక్కడా తెరమీదకు మళ్ళీ వస్తూ వుంటాయి.

కానీ ఇప్పటికీ దళితులు  తలదించుకొని, మర్యాదగా పక్కకు జరిగి దారి ఇవ్వడం ఓ మర్యాదగా మిగిలిపోయింది. 

ఇలాంటి అసమానతల నేపథ్యంలోంచి పుట్టింది తెయ్యంకళ.

                                    ****

                                       కేరళ జీవితానికీ సామాజికవ్యవస్థ నిర్వచనాలకీ ఒక ప్రతిస్పందనగా, ఒక విలోమంగా ఎదిగిందీ కళ. గమనిస్తే, అక్కడి వ్యవస్థకు బలమైన స్తంభాలైన బ్రాహ్మణులూ, నాయర్ల మీదకి దేవుళ్ళు రారు. అణచి వేయబడిన దళితులమీదకే దేవుళ్ళు రావడం గమనించాల్సిన విషయం. ఈ తెయ్యం  కళ, విధానం మొత్తం అగ్రవర్ణవ్యవస్థకి దూరంగా రూపుదిద్దుకుంది. తెయ్యం ప్రదర్శన ఊరి మధ్యలోని అగ్రవర్ణాల ప్రధానదేవాలయాల్లో కాక, ఊరవతల ఉన్న గ్రామదేవతల గుడుల లో జరుగుతుంది. అక్కడ అర్చకత్వం బ్రాహ్మణులది కాదు, దళితులదే. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రం కొన్ని ఆలయాల్లో తెయ్యం కళాకారులుగా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలను నియమించే హక్కు భూరివిరాళాలు ఇచ్చి పోషిస్తున్న కొన్ని అగ్రవర్ణకుటుంబాలకు ఉంది. అది అంత వరకే, కొంతవరకే.

                      ఈ తెయ్యం శబ్దం సంస్కృతశబ్దం “దైవమ్” నుంచి వచ్చింది. కానీ కొన్ని వాదనల ప్రకారం, ఉత్తర మలబారులోని ఈ తెయ్యం ఆర్యులు కంటే పూర్వమూ బ్రాహ్మణ వాదం కంటే ముందరిదీ అయిన ద్రవిడమత వ్యవస్థలో పుట్టి క్రమేణా హిందూ మతంలోకి వచ్చి చేరినట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణాలు తమ తప్పిదాల వలన వచ్చే ప్రతిఘటనని

ఆధ్యాత్మికమార్గంలోకి మళ్లించి, శాంతంగా ప్రకటించుకునే ఓ సేఫ్టీవాల్వులా ఈ తెయ్యంను కల్పించినట్లు ఓ వాదన. ఒకటి మటుకు సత్యం. సమాజంలోని స్థాయీ భేదాలు సంవత్సరంలో కనీసం కొన్ని రోజులపాటు పూర్తిగా తలకిందులై, బలం హోదాలు తాత్కాలికంగానైనా చేతులు మారి, బలహీనులు కూడా రొమ్ము విదిల్చి బలవంతుడి చేత మొక్కించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ తెయ్యం.

        తెయ్యంలో పాత్రలు విష్ణువు, భగవతి, శివుడు, పార్వతి, యక్షిణులు, దేవతలు, నెత్తురు తాగే రాక్షసులు, నాగదేవత ఒకటేమిటి! కొన్ని సాంఘిక కథలూ ఘటనలూ కూడా పురాణాల్లోకి దూరిపోతూంటాయి. తియ్యా కులానికి చెందిన ఓ దళితబాలుడు ఆకలేసి, ఓ నాయరుకు చెందిన తోటలో చెట్టెక్కి రెండు మామిడిపళ్లు కోసుకుంటాడు. అటునుంచి వెళుతున్న రైతు మేనకోడలి మీద ఓ పండు జారిపడి, పట్టుబట్టలకి రసం అంటుకుంటుంది. నాయర్ కి దొరికిపోతానన్న భయంతో కుర్రాడు ఊరు వదిలి పారిపోతాడు. చాలాకాలం తర్వాత యువకుడిగా ఆ ఊరిలో మళ్లీ అడుగుపెట్టి, చెరువులో దాహం తీర్చుకుంటూ వుంటాడు. నాయర్ వాడిని చూసి గుర్తుపట్టి, అడ్డంగా తల నరికేస్తాడు. ఆ యువకుడు తన జీవితంలో చేసిన పాపం నుంచి విముక్తి పొంది దైవత్వం పొందుతాడు. ఆ ఊరిలో తెయ్యం ప్రదర్శనలో భాగంగా అతను కూడా తరచుగా కళాకారులను ఆ వహిస్తూంటాడు. ప్రజలు దైవంగా మొక్కుతూంటారు. నైతికతకి దైవత్వం అద్దడం ద్వారా అనైతికత పై విజయం సాధించినట్లుగా భావింపచేసి, ఆగ్రహాలు అసంతృప్తులు చల్లార్చే ఓ మ్యాజిక్ థెరపీగా తెయ్యంని నిర్వచించవచ్చునేమో. 

                           ****                                                     

               హరిదాసు తెయ్యం ప్రదర్శన చూసిన రెండు నెలల తర్వాత అతనిని మళ్ళీ కలిశాను. నేను వెళ్లేసరికి అతను గోచీతో పొలంలోని దిగుడుబావి దగ్గర పనిచేస్తూ కనిపించాడు. ఒళ్ళంతా బురద. 

          ” మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను సుమా!”

          నుదురంతా నిండిన చెమట, బురద తుడుచుకుంటూ నవ్వుతూ పలకరించాడు హరిదాసు. “క్రితంసారి తెయ్యం  ఆడుతున్నప్పుడు మా వూరిలో పెద్దాయన ఒకడు,  నంబూద్రి,  నా పాదాలకు మొక్కి ఆశీర్వదించమని ప్రార్థించాడు.  తర్వాత వారం నేను వాళ్ల పెరట్లో బావి తవ్వడానికి వెళితే నన్ను కనీసం గుర్తు పట్టనైనాలేదు. నన్ను మామూలు కూలీగానే చూశాడు. బయట వరండాలో అరిటాకులేసి నాకూ నాతో వచ్చిన నలుగురికీ వడ్డించారు. మాకు వడ్డించాల్సిన వంటలను వేరే గిన్నెల్లో విడిగా తీసుకొచ్చి దూరంనుంచి వారే వడ్డించారు. మా భోజనం అయ్యాక ఆ గిన్నెలలో మిగిలిన అన్నం కూరలూ లోపలికి తీసుకెళ్లక, మాఎదుటే బయట పారబోశారు. నీళ్లు కూడా బాల్చీతో తెచ్చి విడిగా పెట్టారు. తమాషా ఏంటంటే మేము తవ్విన బావినీళ్లతో మేం కాళ్లుకూడా కడుక్కోకూడదు. 

           హరిదాసు చెబుతూ ఆగాడు.  “చాలావరకు వాళ్లూ మారారు, మారుతున్నారు. కానీ ఇలాంటి మూర్ఖులు ఇప్పటికీ ఇంకా ఉన్నారండీ. తెయ్యం వేషంలో నాలో దేవుడిని చూస్తారు. వేషం తీసేశాక నాలో దళితుడే కనపడతాడు వాళ్లకి.”

         ” ఆదిశంకరుడి కి శివుడు దళితుడు గా కనిపించి జ్ఞానబోధ చేసిన కథ తెలుసుగా! అప్పుడు ఈ జ్ఞానం రాబోయే తరాలకి ఎరుకగా ఉండేలా ‘పొట్టాన్ దేవం’, అంటే కిరాతకుడి రూపంలో వున్న శివుడి ఆలయాలు మలబార్ తీరంలో అనేకం ప్రతిష్టించాడు ఆదిశంకరుడు. ఆయన చేసిన స్తోత్రాన్ని ఆ కథని  ‘పొట్టాన్ తెయ్యం’ గా మేము ఆడుతూంటాం. ఇక్కడ చాలా ఫేమస్. ఒక్కసారి  24 గంటలూ ఆగకుండా అదే ఆట సాగుతుంది.”

                          “విముక్తి అంటే అది”  నిట్టూర్చాడు హరిదాసు. “ వెయ్యేళ్ళక్రితం జరిగిందిది. ఈ రోజు కార్ల్ మర్క్సూ అంబేద్కరూ కూడా ఆనాడు శివుడు ఆదిశంకరాచార్యుడికి చెప్పిన విషయాలే మళ్ళీ బోధిస్తున్నారు. అదే సమానత్వం గురించి మాటాడుతున్నారు”. 

                      ఓ రెండుగంటల తర్వాత హరిదాసు పని పూర్తిచేసుకుని, ఫ్రెష్ అయ్యి, కన్నూర్ అవుట్ స్కర్ట్స్ లో నేనుంటున్న గెస్ట్ హవుస్ కి వచ్చాడు.  సూర్యాస్తమయం అవుతోంది. వరండాలో కూర్చున్నాం. చాయ్ సిప్ చేస్తూ తనకధ చెప్పడం ప్రారంభించాడు.

                         “ కటిక బీదరికంలో పుట్టాన్నేను. మా నాన్న రోజూ కూలికెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. సీజన్లో నాలాగే, నాకంటే బాగా తెయ్యం ఆడేవాడు. ఈ రోజుల్లో తెయ్యం బాగానే డబ్బులు తెస్తోంది. సీజను బాగుంటే ఖర్చులన్నీ పోను నెలకు పదివేలవరకూ మిగులుతోంది.  కానీ అప్పట్లో రాత్రంతా ఆడితే సంచీడు బియ్యం, పది రూపాయలూ ఇచ్చేవారు.

                     నా మూడేళ్ళ వయసులో మా అమ్మ చనిపోయింది. కాల్లో ఇనపముక్క దిగి సెప్టిక్ అయ్యింది. డాక్టర్ దగ్గరకెళ్లే స్థోమతలేక లోకల్ గా ఉన్న నాటువైద్యుడికి చూపించారు. ఫలితం లేకపోయింది. కేవలం మా పేదరికం వల్లనే అమ్మ చనిపోయింది. అమ్మ జ్ణాపకాలేమిటంటే, చిన్నప్పుడు నన్ను ముద్దుపెట్టుకున్నట్టుగా ఓ చిన్న జ్ణాపకం. ఓ ముఖం. అదే ముఖం చుట్టూ నా చిన్నతనాన్ని పేర్చుకున్నాను. అప్పట్లో మా పేటకి ఫోటోలేవీ?  నాకు గుర్తున్న ముఖం అసలు మా అమ్మదో, అసలదో భ్రమో అనిపిస్తుందిప్పుడు.

                         ఏడాది తిరక్కుండా, అంటే నా నాలుగో ఏట నాన్న మళ్ళీ పెళ్లిచేసుకున్నాడు. నేను మా పిన్నితో ఎప్పుడూ ఉండలేదు. నాన్న మనసులో ఏముందో మరి, నన్ను మా పెద్దమ్మ ఇంటికి దిగబెట్టేశాడు. వేరే వూరు. వాళ్లదో చిన్న రెండుగదుల పాకలాంటి పెంకుటిల్లు. గచ్చులు కూడా లేవు. నా ఖర్చంతా పెద్దమ్మే భరించేది. నన్ను చాలా గారంచేస్తూ పెంచింది పెద్దమ్మ. తనకు ముగ్గురమ్మాయిలూ, ఓ అబ్బాయీ. వాళ్లతో సమానంగానే చూసేది. వాళ్ళంతా నాకంటే పదేళ్ళు పెద్ద.  నన్ను చాలా ముద్దుచేసేవారు. అలా అని నాన్న నన్ను వదిలించేసుకోలేదు. వారానికోసారొచ్చి చూసివెళుతూండేవాడు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఈరోజుల్లోలా కాదు. నాన్నంటే  నాన్నే. నాన్నతో వెటకారాలూ పరాచికాలూ ఉండేవికాదు. చెప్పాలంటే నాకు తండ్రికంటే గురువుగా వుండేవాడు. వచ్చినపుడల్లా నా చదువుగురించీ స్కూలు గురించీ అడిగేవాడు.  నాకు భయమేసేది. ఎందుకంటే నాకు చదువంటే భయం. నాన్న నిశానీ. అక్షరం అబ్బలేదు. అందువల్ల చదువంటే ఎంతో గౌరవమూ భక్తీ తనకి.  

    నాన్నకంటే పెద్దమ్మతోనే ఎక్కువ కాలం గడిపాన్నేను. మరి పిన్ని నా గురించి ఏమనుకునేదో! నాకెప్పుడూ తెలుసుకునే ఆవసరం పడలేదు. తానూ మంచిదే అయివుంటుంది.  

                         బహుశా తెయ్యం నా రక్తంలోనే ఉందేమో. కాకపోతే, చిన్నప్పుడు ఎప్పుడూ నాన్న తెయ్యం అడుతూంటే చూడని నాకు తెయ్యం నేర్చుకోవాలనే కోరిక ఎలా పుడుతుంది! ఎలా బలపడుతుంది! ఆ వయసులోనే ఓ రేకుకి తాడుకట్టి మెడలో వేసుకుని చప్పుడు చేసుకుంటూ తెయ్యం ఆర్టిస్టులా వీధిలో గెంతులేస్తూ తిరిగేవాడినట. వయసు పెరుగుతూన్నకొద్దీ  నాన్నని తెయ్యం ఆర్టిస్టుగా వూరంతా మొక్కుతూంటే, కొలుస్తుంటే, నాకెంతో గర్వంగా ఉండేది. ఆరేళ్లప్పటినుంచీ చుట్టుపక్కల నాన్న ఎక్కడ తెయ్యం చేసినా చూడ్డానికి వెళ్లిపోయేవాడిని. తొమ్మిదీపదేళ్లు వచ్చేసరికి తెయ్యం నేర్చుకుని ఆడాల్సిందేనని నిర్ణయించేసుకున్నాను. పదో పుట్టినరోజునాడు నాన్నను తెయ్యం నేర్పమని కోరాను. “తప్పకుండా కన్నా. కానీ నీ వయసింకా సరిపోదు. ఇంకా బలం కావాలి. లేకపోతే ఆ డ్రెస్సులూ కిరీటాలూ రోజంతా ఎలా మోస్తావు?” నవ్వుతూ తలనిమురుతూ అన్నాడు. 

నిజమే మరి.  కొన్ని కిరీటాలూ ముఖాలూ ఇరవై అడుగుల ఎత్తుంటాయి.  నాన్న చెప్పినట్టే కండలు పెంచసాగాను. ఇనుపరాడ్ కి రాళ్లుకట్టి ఎత్తేవాడిని. కుస్తీలు పట్టేవాడిని. పధ్నాలుగేళ్లవయసులో నాన్న తెయ్యం నేర్పడం మొదలెట్టాడు. మూడేళ్ళ తర్వాత పదిహేడోయేట నా మొదటి ప్రదర్శన ఇచ్చాను. తాళం బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక్కో కధకి ఒక్కో దరువుంటుంది. మూడ్ ని బట్టి దరువు మారుస్తూంటారు. దానిమీద పూర్తి పట్టులేకుంటే తెయ్యం ఆడలేను. తెయ్యం ప్రారంభంలో వచ్చే ప్రార్ధనలూ, దేవుడికధలూ పాటలూ నేర్చుకున్నాను. విష్ణుతోట్టాం ఆపకుండా పాడాలంటే రెండుగంటలు పడుతుంది. అవయ్యాక ముద్రలూ పదాలూ అడుగులూ ఒక్కో దేవుడి భావప్రకటనలూ మేకప్పులూ నేర్చుకున్నాను. కళాకారుడు విద్య మొత్తం క్షుణ్ణంగా నేర్చుకుని, ప్రదర్శించడానికి సిద్ధపడితేనే దేవుళ్ళు వచ్చి ఆవహించేది. లేకపోతే కేవలం వేషంవేసుకుని ఆడే గెంతులాటగానే మిగిలిపోతుంది. నేను కొంచెం ఛాదస్తంగా నెమ్మదిగానే నేర్చుకునేవాడిని. నాన్న ఏనాడూ విసుక్కోలేదు, సరికదా మరింత ఓపికతో నేర్పేవాడు. అందువల్లనేమో నాకు విద్యమీద మంచి పట్టు వచ్చింది. 

                            మొత్తానికి వూళ్లో షావుకారువద్ద అప్పుచేసి నాకోసం మొదటి తెయ్యం డ్రస్ కొన్నాడు నాన్న. నా మొదటి కాస్ట్యూమ్.  తల్లపాలి, అంటే తలమీద కిరీటంలా పెట్టుకునే ఆలంకారం, దానికే ఐదువేలయ్యింది. కాలికంకణాలు వెండివి ఒక్కొటీ రెండువేల అయిదొందలు.

                                 నా మొదటి ప్రదర్శనరోజున ఎంతో నెర్వస్ అయ్యాను. మంచి తెయ్యం ఆటగాడినవ్వాలని కోరిక. సంప్రదాయతెయ్యంకళకి మరిన్ని రంగులు సమకూర్చాలని. కళాకారుడిగా మనమెప్పుడూ ప్రేక్షకులకు బోరుకొట్టకూడదు. చూడ్డం మానేస్తారు. ప్రతి ప్రదర్శనకీ నన్ను నేను మెరుగుపరుచుకొంటూనే ఉంటాను. నా ప్రేక్షకులకు కొత్త హరిదాసునే అవుతాను.  

                          భయం వేస్తూంటుంది. ఎందుకంటే పైపైన ఆట ఆడేలా పెంచలేదు నాన్న నన్ను. రంగువేసుకుంటే దేవుడు రావాల్సిందే. కేరళలోని ఇతర నాట్యరూపాలైన కథకళి వంటివాటికీ తెయ్యంకూ ఉన్న తేడా ఏంటంటే తెయ్యంలో ప్రతి ఆటకీ కళాకారుడు తన ఊహకు తగినట్టుగా తన ఆటనూ పాటనూ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. రంగుపడ్డాక కళాకారుడు చెలరేగిపోతాడు. గెటప్పులూ మేకప్పులూ నేర్చుకోవచ్చుకాని ఆ తాదాత్మ్యత, దైవంతో మమేకమయ్యేవిధానం అనేవి నేర్పితే వచ్చేవికాదుకదా! కొంత మన అదృష్టం, కొంత గురువు నేర్పరితనం, కొంత పూర్వజన్మసుకృతం.      

                              నా మొదటి ప్రదర్శనలో రుద్రుడు గులిగన్ వేషం ధరించాను. పద్ధెనిమిదడుగుల రాక్షసుడి ఆలంకారం తలపై బిగించారు. దాన్ని బాలన్సు చేసుకొంటూ నాపని నేను చేసుకోడానికి నానాతంటాలూ పడ్డాను.  చెయ్యలేనేమోనన్న బెరుకుతో మొదలెట్టినా మొత్తానికి విజయవంతమైంది నా తొలి ఆట.  మేకప్పేసుకుని, వేషం ధరించి గులిగన్ గుడికెళ్లి దండం పెట్టుకున్నా. సాధారణంగా పూర్తి మేకప్పు అయ్యాక అద్దంలో మన ముఖం చూసుకునేసరికి దేవుడు వస్తాడు. కానీ నాకా అనుభవం ఇంకా ముందే కలిగింది. గుడిలో దర్శనమయ్యాక చేతులు పైకెత్తి ఆలంకారం తడిమిచూసుకున్నా. అంతే. మనం పూర్తిగా తయారయివుంటే దేవుడిని రమ్మని ఆహ్వానం పలికినట్టే. మనస్ఫూర్తిగా దేవుడిని తలచుకుని ఆవాహన చేస్తే, అర్జునుడు పక్షి కంటిగుడ్డుపై గురిపెట్టినంత శ్రద్ధగా పిలిస్తే, దేవుడు వచ్చితీరతాడు.  ఆ క్షణంలో మనం కళాకారుడినుంచి దైవంగా మారిపోతాం. ఆ క్షణం నుంచి నృత్యంచేసేది నేనుకాదు, దేవుడే. 

                                      ఆ తరువాత ఏంజరుగుతుందంటే, ఏమో, ఇదీ అని చెప్పలేను. నేను నా ఉనికిని కోల్పోతాను. నాలోంచి హరిదాసు మాయమైపోతాడు. దేహం, మనసు, ఆలోచన, నేను అనే ఓ ఉనికీ అన్నీ దైవమే.  తెలియని దివ్యశక్తి ఏదో పూర్తిగా ఆవహించి, మనను మననుంచి తీసేసుకుంటుంది. నేను, నా కుటుంబం, నా ఊరు, నా కులం, అప్పుసొప్పులూ ఇవేవీ లేని ఓ శూన్యాన్ని అయిపోతాను. దైవంతో నిండిన శూన్యాన్ని.   

                             తెయ్యం పూర్తయి, వెనక్కి ఈ లోకంలోకి వచ్చాక మాత్రం చాలా బెరుకుగా అలజడిగా ఉంటుంది. నాన్న, నా ప్రేక్షకులు, భక్తులు, నా దేవుడు అందరికీ నా ఆట నచ్చిందా లేదా అని. ప్రతిసారీ నచ్చాలి. లేకుంటే దేవుడు రావడం అదే ఆఖరిసారి అవుతుంది మరి. గంటలపాటు కాస్ట్యూమ్స్ మోస్తూ ఆట ఆడిన అలసట శరీరాన్ని బరువెక్కిస్తుంటే దేవుడితో దేవుడిలో గడపిన ఆ సమయం మొత్తం మనసును తేలికపరచి దూదిపింజలా మార్చేస్తుంటే, అదో విముక్తి. నరాలు తెగిపోయే తలనొప్పి  ఒక్కసారిగా మాయమైపోతే కలిగే విముక్తిలాంటి భావన. నాన్న మేకప్ గదిలోకొచ్చి “బాగా చేశావురా కన్నా, అందరూ అదే అంటున్నారు” అనేసరికి గంటల దప్పిక ఒక్కసారిగా తీరినట్టుగా హాయిగా అనిపించింది. భయాలన్నీ పటాపంచలైపోయాయి. నా జీవితమంతా ఈ తెయ్యంలోనే గడపాలన్న భావన మనసంతా నిండిపోయింది.

                                      ***                 

                                   మరునాడు సాయంత్రం తనపనులు పూర్తిచేసుకుని హరిదాసు మళ్ళీ వచ్చాడు. కన్నూర్ మెయిన్ బజార్ లోని ఓ రెస్టారంట్ లో కూర్చుని అప్పం ఆర్డర్ చేశాం.  రోజంతా కష్టంచేసి  బాగా అలసిపోయి కనిపిస్తున్నాడు. నేనడిగాను. “ బావులు తవ్వడం, తలసేరి జైలులో పోలీసుద్యోగం చేయడం, రాత్రంతా తెయ్యం ఆడడం, ఈ మూడింటిలో ఏది ఎక్కువ అలసటతో కూడిన పని?”

                                     “ఖచ్చితంగా తెయ్యం ఆడడమే” అన్నాడు హరిదాసు. “సీజన్లో ఆర్టిస్టుకి కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర వుండవు. దాదాపు ప్రతిరాత్రీ తెల్లారేదాకా తెయ్యం ఆడుతూనేవుంటాం. అయిటంకీ అయిటంకీ మధ్యకొంచెం విశ్రాంతి, పగలంతా పట్టీపట్టని కునుకూనూ. రాత్రి మళ్ళీ పనిచేయడానికి ఓపిక కావాలికదా. మాకు ఈ అలసటలవల్ల, వత్తిడి వల్ల ఆయుషు కూడా తక్కువే వుంటుంది. యాభై ఏళ్ళు బతికినవాళ్లు చాలా అరుదు. హెవీ కాస్ట్యూమ్స్ జారిపోకుండా వైర్లతో బిగించికడతారు వళ్ళంతా. రక్తప్రసరణ కష్టమవుతుంది. ఇవన్నీ తట్టుకోవడానికి చాలామంది కల్లుకూ మద్యానికీ అలవాటుపడతారు. అదికూడా ఆయుషును హరించేస్తుంది.”

                             “అయితే ఓ విషయం చెప్పాలి. మూడు పనులూ మూడు రకాల కష్టాలు. జైలు ఉద్యోగం భయంకరమైనది. రోజూ చస్తూబతకాలి. శారీరకకష్టం ఉండదు కానీ ప్రతి క్షణమూ టెన్షనే. రోజంతా హార్డుకోరు క్రిమినల్సు మధ్యలో బిక్కుబిక్కుమంటూ తిరగాలి. ఒకటోతారీఖుకిచ్చే ఆరువేల చెక్కుకోసం తప్పితే ఆ ఉద్యోగమంత నరకం ఇంకోటి లేదు. 

                                      ఇక నా రెండో వృత్తి బావులు తవ్వడం, కట్టడం. చిందే నా చెమట నాకు అన్నం పెడుతుంది. చెమటబొట్లు చూసుకోవడంలోని ఆనందం అనుభవిస్తేకానీ తెలీదు. బొబ్బలతో గాట్లతో నల్లగా బండబారిన అరిచేతులు చూపించాడు హరిదాసు.బావిని తవ్వి, చుట్టూ రాతికట్టు కట్టి, నీళ్ళు తోడిచూపించడంలో ఓ తృప్తి ఉంది. నలుగురి దాహం తీర్చడంలోని సంతృప్తి. నా జట్టుని చూశారుగా. రోజూ ఏదో ఓ ఇంట్లోనో పొలంలోనో పని ఉంటుంది. ముఖ్యంగా నంబూద్రీలు, నాయర్ల ఇళ్లలో. 

                            ఒక్కోసారి డెబ్భై యెనభై అడుగులలోతుకి వెళ్లాల్సివస్తుంది. నడుముకు కొబ్బరితాళ్ళు కట్టుకు దిగుతాము. తాళ్లు వళ్ళంతా చీరేస్తూంటాయి. అంత లోతుకి వెళ్ళడం ఓ కష్టమయితే, నీరుతగిలాక ఆ బురదమొత్తం పైకి తోడడం ఇంకో చచ్చే చావు. ఒక్కోసారి బావిగోడలు పెళ్ళలుగా కూలిపోతూంటాయి. ప్రాణాలకే ముప్పు అది. చచ్చిబతికినట్టే. భయం. జీవితంలో ఏ పనిచేసినా ఏదో ఓ రూపంలో ఓ భయం వెంటాడుతూనే ఉంటుంది, ఉండాలి కూడా. లేకపోతే మనల్ని దేవుడు పట్టుకోగలడా? పగలంతా బురదకొట్టుకుపోయి ఇంటికెళితే , అరగంటసేపు స్నానంచేస్తే కానీ గడప తొక్కనీయదు మా ఆవిడ. 

                         కూలీగా చెమటకక్కితే సరిపోతుంది. కానీ తెయ్యంలో మన శరీరం, మనసూ ఆత్మా, ఆలోచనా అన్నీ వాడాలి. కధలో మనం లీనమవలేకపోతే కళ్ళలో భావం కనబడదు. గుండెనుండి  సూటిగా కళ్లలోకి ముఖంలోకి నెత్తురు  పారితేనే వందలమంది హృదయాలను మనం కొల్లగొట్టగలిగేది. మరీముఖ్యంగా విష్ణుమూర్తితెయ్యం. మొదటి సీనులో హిరణ్యకశిపుడు నీ విష్ణువెక్కడున్నాడో చూపించమని కొడుకునడిగినప్పుడు నరసింహుడు స్థంభం చీల్చుకువచ్చి రాక్షసుడి కడుపుచీల్చి పేగులుమెడలో వేసుకునే సన్నివేశం ప్రజలమధ్యలో అభినయించడం వెనక వుండే శ్రమ మీకు చూస్తేకాని తెలీదు, చూసినా తెలీదు. మనకెన్ని సమస్యలూ బాధలూ ఉన్నా వాటిని లోపలే దాచిపెట్టి, ఆ కొన్నిగంటలపాటు దేవుడిగా మారిపోవాలి. అయితే ఒక్క విషయం. ప్రజల జేజేలూ నీరాజనాలే కాదు, నా జేబు ఆమాత్రం నింపగలిగేది తెయ్యం మాత్రమే. 

                        మా ఆవిడయితే నన్ను తెయ్యం కళాకారుడిగానే ఎక్కువ గౌరవిస్తుంది. ఊరంతా భర్తను గౌరవించడం ఏభార్యకిష్టముండదు! నిజంగా కళాకారుడి జీవితం ఎంతోమంది ప్రేమకూ ఆరాధనకూ పాత్రమవుతుంది. కానీ ఆ ఆరాధననూ అభిమానాన్నీ వుంచాల్సిన దూరంలో వుంచి, తన వృత్తిపై దృష్టిపెట్టకపోతేమాత్రం జీవితం అభాసుపాలవడం కూడా అంతే నిజం. 

                                 ఇంకో సమస్య ఇక్కడి బ్రాహ్మణవర్గంతో. ఓ ముప్ఫయియేళ్లక్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగు. కానీ ఇప్పటికీ బలం వాళ్ళ చేతిలోనే ఉంది. తెయ్యం చూసి వాళ్లు ఓ రకమైన అసహనానికి గురవుతూంటారు. చాలా తెయ్యం కధలు వారిని విమర్శిస్తూ, వారిలో పశ్చాత్తాపం కలిగించి, మార్పును సూచించే కధనంతో ఉంటాయి. తెయ్యంలో పాడే తోట్టాంపాటలలో పొరుగువారిని ప్రేమించాలనీ, అందరూ సహజీవనం చేయాలనీ, తాము చేసే అరాచకాలకు అగ్రవర్ణాలవారు పంచభూతాల సాక్షిగా శిక్ష అనుభవించితీరతారనీ వర్ణిస్తాయి. దురహంకారం వీడి సమాజంతోపాటు నడవమని కొన్ని పాటలు స్వాంతనగా సూచిస్తే, కొన్ని నిప్పులు కురిపిస్తూ హెచ్చరిస్తాయి. అసలు కధలో భాగంగా బోలెడు నీతికధలూ పిట్టకధలూ దొర్లుతూంటాయి.

                        అనేకవిమర్శలున్నప్పటికీ చాలామంది బ్రాహ్మణులు తెయ్యం అంటే గౌరవిస్తారు. వారి సమస్యలకు ఆలయాలూ అర్చకులూ జ్యోతిష్కులూ చూపించలేని పరిష్కారాలు తెయ్యందేవతలు చూపిస్తూంటారు. కేరళలోని అన్ని హిందూకులాలవారూ, క్రిస్టియన్ ముస్లిమ్ మతస్తులుకూడా తెయ్యంను ఆదరిస్తారు. ఎలా అంటే, ఇతరపూజాప్రదేశాలలో మనం దైవాన్ని మానసికంగానే చూడగలం, కొలవగలం. కానీ తెయ్యంలో దైవాలు మనమధ్య ప్రాణంపోసుకుని నడుస్తారు. మనతో మాట్లాడతారు. మన బాధలు విని, మన కోరికలు తీరుస్తారు. ఈ ఒక్క కారణంవల్లనే సుదూరప్రాంతాలనుంచి శ్రమకోర్చి తెయ్యం చూడ్డానికొస్తారు. వచ్చి గంటలసేపు లైనుల్లో నిలబడి, దైవాలతో మాట్లాడే అవకాశంకోసం ఎదురుచూస్తారు.

            గడచిన పది పదిహేనేళ్ళలో సొసైటిలో చాలా మార్పులొచ్చాయి. పల్లెల్లోని చిన్నాచితకా ఆలయాలన్నీ మూతపడ్డాయి. దేవుళ్లనూ ఆ కధలనూ మరచిపోతున్నారేమో అనిపించింది. కానీ ఈమధ్య రోజులు మళ్ళీ మంచిగా మారుతున్నాయి. తెయ్యంను వదులుకుంటే వూరికి అరిష్టమని జనం అనుకోడం మొదలెట్టారు. మళ్ళీ ప్రతివూరిలోనూ మమ్మల్ని పిలిచి తెయ్యం ఆడించుకుంటున్నారు.      

                         తెయ్యం రూపం కూడా ఇప్పుడు మారుతోంది. చాలా వూళ్లలో చిన్న చిన్న ఆలయాలుకూడా ఎన్నారై స్పాన్సర్లు రావడంతో వైభవంగా తయారవుతున్నాయి. కొచ్చిన్, త్రివేండ్రం నుంచి కూడా ప్రేక్షకులూ టూరిస్టులూ వీకెండ్ గడపడానికి, తెయ్యం చూడడానికి మా గ్రామాలకు వస్తున్నారు. వారికోసం హోటళ్లూ రిసార్టులూ మొదలయాయి. నలుగురు కుర్రాళ్ళకు ఉపాధి. వూళ్లలో తెయ్యం పోస్టర్లూ డీవిడీల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. రాజకీయపార్టీలు కూడా తెయ్యం ఆటలకు మద్దతిచ్చి మరీ ఆడిస్తున్నాయి. ఆరెస్సెస్ అగ్రవర్ణాల పార్టీ అయినప్పటికీ ఓ తెయ్యం దైవాన్ని దత్తతచేసుకొని కధలు ఆడిస్తోంది. అలాగే సీపీయమ్ వాళ్ళు నాస్తికులైనప్పటికీ జనంలో పట్టుకోసం దగ్గిరుండిమరీ తెయ్యం ఆడిస్తున్నారు. ఆదరణ పెరుగుతోంది మళ్ళీ. మా నాన్న టైములోకంటే  ఇప్పుడు నాలుగురూపాయలెక్కువ సంపాదించుకుని, ఇంకొంచెం గౌరవంగా జీవించే అవకాశం పెరిగింది.

                          ఈ తరం, రాబోయే తరం ఖచ్చితంగా మా నాన్నతరం కంటే తెయ్యం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తోందని చెప్పొచ్చును.  వెనకటిరోజుల్లో సిటీప్రజలు తెయ్యం ఒక మూఢనమ్మకమనీ, ఒక ఋగ్మత అనీ, దళితుల గోల అనీ కొట్టిపడేసేవారు. కానీ ఇప్పుడు తెయ్యం అప్డేట్ అవుతోంది, దానిపట్ల ప్రజల్లో ఆసక్తి కూడా పెరుగుతోంది.  పోట్టాం తెయ్యాను భయంకరరోగాలను సైతం తగ్గిస్తుందనీ, ఇంకొన్ని కధలు చూస్తే ఉద్యోగం వస్తుందనీ, పిల్లలు పుడతారనీ ఇలా ఎవరి దర్శనం వారిది, ఎవరి నమ్మకం వారిది.  ఈమధ్యనే ఓ బ్రాహ్మల అబ్బాయి నా ఇంటికి వచ్చి, ఆరేళ్ళనుంచి ఉపాధి లేక రూపాయి ఆదాయం లేదని, ఎన్ని గుడులచుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదనీ, నా తెయ్యం చూసి దేవుడికి మొక్కినాక ఇరవైనాలుగ్గంటల్లో కలక్టరాఫీసులో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. వాళ్ళు తరాలతరబడి ఆర్చిస్తున్న గుడి, దైవం ఇవ్వలేనిది ఒక్క తెయ్యం ఇచ్చిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు.         

                        నా తర్వాత నా ఇద్దరు పిల్లలూ ఈ విద్యను అందుకుంటారని నమ్మకం ఉంది. ఒకరికి అయిదూ, ఇంకోడికి మూడూ. వాళ్ళు ఇప్పటినుంచే ఆసక్తి చూపిస్తున్నారు. ఓ ఉత్తుత్తి తెయ్యం ఆడుతూ నన్ను దరువు వేయమంటూంటారు. నాకెంతో హాయిగా వుంటుందామాటకి. కానీ వాళ్ళ భవిష్యత్తు? స్కూలుకెళుతున్నారనుకోండీ, చదువుపై దృష్టిపెడితే కుదురుగా సంపాదించుకోవచ్చు, సుఖపడొచ్చు.  కానీ మళ్ళీ వేరే వృత్తుల్లోకెళితే కులవిద్యను పూర్తిగా వదిలేస్తారేమోనన్నదిగులు కూడా వుంది. నాకు తెలిసిన చాలామంది తెయ్యం ఆర్టిస్టుల పిల్లలు చదువుకుని ఉద్యోగాలకెళ్లిపోయారు. శలవులకు వూరొచ్చినా అరుగులమీద నుంచుని పిల్లలకు దూరంనుంచి తెయ్యం చూపిస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. చదివితే రేపు నా పిల్లలూ ఇంతేనా అని దిగులేస్తుంది. ముద్ద గొంతు దిగదు. చూడాలి ఏంజరుగుతుందో!”

                          ****  

                                      తొమ్మిదినెలల తరువాత క్రిస్మస్ నాటికి మళ్ళీ కన్నూర్ వెళ్లా హరిదాసును చూడడానికి. మళ్లీ తెయ్యం సీజను. గత ఏడాది హరిదాసు తెయ్యం చేసిన గుడిలోనే, మళ్ళీ ఈ ఏడాదీ తెయ్యం చేసే రోజునాడే అతడిని కలిసేలా ప్లాను చేసుకున్నాను. రాత్రి ఆట అయిపోయింది. ఆరోజు ఆటకింకా టైముంది. రాత్రి జనం కళ్ళు నులుముకుంటూ తోట ఖాళీచేస్తుంటే, పగటిజనం ముందుగాచేరి బాగా కనబడే చోటు బుక్ చేసుకుని కూర్చుంటున్నారు. ఓ పక్కన షామియానాల కిందవున్న ప్లాస్టిక్ కుర్చీలు నిండుతున్నాయి. మేకప్ రూముగా మారిన పాకముందు కొందరు ఆర్టిస్టులు బళ్లమీద కూర్చుని ఆవులిస్తున్నారు. పక్కనున్న తోపులో ఒకతను తాటాకుచాప పరుచుకుని ఓ కునుకు లాగేస్తున్నాడు. లోపల హరిదాసు విష్ణుమూర్తితెయ్యం కోసం రడీ అవుతున్నాడు.  ఈలోగా బయట గుమిగూడిన భక్తులతో పిచ్చాపాటీ కబుర్లు మొదలెట్టాను. 

                            సుశాంత్ కి ఓ ముప్ఫయియేళ్లుంటాయి. సౌదీలో రెండేళ్లు సివిల్ వర్క్స్ చేసి బాగా సంపాదించుకొచ్చాడు. తనపని పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగొచ్చినందుకు  భక్తితో ఈరోజు తెయ్యంషో ను స్పాన్సర్ చేస్తున్నాడు. పక్కనే అతని బాల్యస్నేహితుడు షిజు వున్నాడు. చెన్నైలో రైల్వేస్ లో చేస్తున్నాడు. తెయ్యం కోసం ఫ్రెండుతో కలిసి వచ్చాడు. “నాకు పదమూడేళ్ళవయసులో కాన్సర్ అని చెప్పారు డాక్టర్లు. నాన్ హాకిన్స్ లింఫోమా. చెన్నైలో కీమోథెరపీ తీసుకున్నా. లాభం లేదని చెప్పేశారు డాక్టర్లు. ఇక్కడకి దగ్గర్లోనే మావూరు. మా తాతగారు తెయ్యం కి వచ్చి భగవతికి మొరపెట్టుకున్నారు. బాబుకేమీ అవ్వదని, నెలలో తగ్గిపోతుందని దీవించింది భగవతి. అమ్మవారి శక్తి డాక్టర్లచేతుల్లోకి ఎలా ప్రవహించిందో తెలీదుకానీ, అద్భుతంగా, వారాల్లో రికవరయ్యాను. మీ వైద్యశాస్త్రం ఏం సమాధానం చెప్పగలదు దీనికి? కేవలం అమ్మభాగవతి దీవెనలే తగ్గించాయని మేమంతా నమ్ముతాము. అప్పటినుంచి ప్రతియేడూ ఇక్కడ జరిగే ప్రతిప్రోగ్రాముకీ చెన్నై నుంచి మిస్సవకుండా వస్తున్నాం.”

                               మేము మాట్లాడుతూండగానే వాద్యాలు మోగడం ప్రారంభమైంది. చెవులు దద్దరిల్లే ధ్వని. జనంలోకెళ్లి ముందువరసలో కూర్చున్నా. ప్రార్ధనాగీతం మొదలైంది. మొదట చాముండి బయటకొచ్చింది. నేనింతకుముందు చూసిన దేవతకంటే భయంకరంగా వుంది. క్షుద్రదేవత అన్నమాట. ఎర్రటిముఖం, నల్లటికళ్లు, తెల్లటిచేతులు, బొద్దుపెదాలు, ఎర్రటి ఇనుపగుండెలు. చేతిలో తాటిమట్టలతో చేసిన రంపంలాంటి ఆయుధం. గుండెలమీద బాదుకుంటూ బుసలుకొడుతూ జనం ముందుకు వచ్చింది. గెంతుతూ, దూకుతూ అటూయిటూ తొండలా నిక్కిచూస్తూ అలజడిగా గుడిచుట్టూ ప్రదక్షిణం చేసివచ్చింది నోరు పెద్దగా తెరుస్తూ మూస్తూ. తెరచినపుడల్లా చేతిలోని ఆయుధాన్ని గాలిలోకి ఝుళిపించి పెద్ద రంకెలాంటి ధ్వనిచేస్తూ. చాలా అలజడిగా ఉద్విగ్నభరితంగా, రెస్ట్ లెస్ గా వుంది ఆ పాత్ర. జనం ముందు తిరుగుతూ, తన కళ్లలో కళ్లు కలిపి చూసినవారిదగ్గర ఆగి, కళ్ళు పెద్దవి చేసి, ఓ క్షణం తీక్షణంగా చూసి, ముందుకు సాగుతోంది. ఇద్దరు అర్చకులు చాముండి ముందుకొచ్చి నమస్కరించి అందించిన పెద్దముంత కల్లు ఒక్క పట్టులో తాగి, ముంతను గాల్లోకి విసిరి ముందుకుసాగింది.       

                                    చాముండి కల్లు తాగుతూండగానే వాద్యాల దరువుమారి, కొత్త వేగం అందుకుంది, కొత్త పాత్ర రాకకు సూచనగా. షడన్ గా రెండో పాత్ర ప్రజలముందు ప్రత్యక్షమైంది.  ఏడుపడగల కిరీటానికి రెండు పెద్ద చెవిరింగులు వేళ్లాడుతున్నాయి. నుదుటిమధ్యలో పెద్ద చక్రం, ఛాతీపై అలంకారంగా పెద్ద మెటల్ డిజైను. ముంజేతికి తాటి ఈనెలూ పువ్వులూ ఆకులతో అలంకరించిన మాలలూ. అవును, అతడు హరిదాసే. మొదట నేనే గుర్తుపట్టలేదు. పూర్తిగా మారిపోయిన రూపంలో హరిదాసు. కళ్ళు పెద్దవిచేసి అందరినీ పలకరిస్తున్నాడు. నెమ్మదిగా తాత్వికంగా ఆచితూచి మాట్లాడే హరిదాసు నేడు అందరినీ ఆశీర్వదిస్తూ గంభీరంగా ముందుకు సాగిపోయే దైవంలా మారిపోయాడు. గాలిలోకి ఎగురుతూ, పల్టీలుకొడుతూ గుడిచుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేసొచ్చాడు. అప్పటికి వాద్యాల హోరు కొంచెం తగ్గింది. చాముండి  గుడిద్వారం బయట ఓ పక్కన రొప్పుతూ కూర్చుంది. విష్ణుమూర్తితెయ్యం ముందువరసలో కూర్చున్నవారిని పలకరిస్తూ లయతప్పకుండా చిందులేస్తున్నట్టుగా నడుస్తూ, ముందుకు సాగుతోంది. జనం గౌరవసూచకంగా లేచినిలబడి తలవంచి నమస్కరిస్తున్నారు. ఓ చేత్తో విల్లమ్ములూ ఓ చేత్తో ఖడ్గం పట్టుకొని  భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఖడ్గం అంచును భక్తుల చేతులకు తాకించి ఆశీర్వదిస్తున్నాడు. “శుభం జరుగుతుంది”, “అంతా మంచే జరుగుతుంది” లాంటి మాటలు మలయాళంలో జనాంతికంగా అంటూ ముందుకెళుతున్నాడు. “చెడురోజులు త్వరలో అయిపోతాయి”, “దేవుడు అంతా చూసుకుంటాడు”, “నీ కుటుంబం సంగతి నే చూసుకుంటా”, “ఏడవవద్దు, కష్టాలు త్వరలో తీరిపోతాయి” ఇలాంటి భరోసాలు ఇస్తూ మధ్యలో సంస్కృతశ్లోకాలూ మంత్రాలూ చదువుతూ గుడివైపు తిరిగాడు. చాముండితో పోలిస్తే విష్ణుమూర్తితెయ్యం చాలా ప్రశాంతంగా హుందాగా, ధైర్యం కలిగించేలా వుంది. వచ్చి, గుడిముందు చాముండికి ఎదురుగా కూర్చున్నాడు. 

                         పూజారులొచ్చి సాష్టాంగప్రణామం చేసి, కల్లు అందించారు. ఒక్కగుక్కలో తాగి, ముంత పక్కనబెట్టాడు. దర్బారు మొదలైంది. ఇద్దరు దేవతలముందూ మొక్కుకోవడానికి భక్తులు బారులుతీరారు. విష్ణుమూర్తి ముందు పెద్ద క్యూ తయారయింది. బాగా ధైర్యమున్న కుర్రవాళ్లూ ముసలి స్త్రీలూ చాముండి దగ్గర చేరారు. ఒకరితర్వాత ఒకరు వచ్చి దైవాలకు తమకష్టాలు చెప్పుకుంటున్నారు. ప్రతి సమస్యకూ విష్ణుమూర్తి తనదైన శైలిలో పరిష్కారం చెబుతున్నాడు, ధైర్యం చెబుతున్నాడు. “మీ కుటుంబానికేమీ కాదు”, “వారంలో మీ అమ్మాయినుంచి శుభవార్త వింటారు”, “నేను చూసుకుంటాను కదా” , “ మీ కొడుకులిద్దరూ బాగానే సెటిలవుతారు, కంగారుపడి పిచ్చిపనులు చేయబోకండి”, “అమ్మ నాన్న మాటవిని, పరీక్షలకు బాగా చదువు, మంచి భవిష్యత్తుంది నీకు”  ఇలా ఎంతో మందికి ఎన్నో భరోసాలు.

                             అలా ఓ  రెండుగంటలకి లైన్లు తగ్గాయి. ఓ అయిదునిముషాల నిశ్శబ్దం తర్వాత ఒక్కసారిగా వాద్యఘోష మిన్నంటింది. దేవతలిద్దరికీ రెండు కొబ్బరికాయలిచ్చారు. వారు గుడిలోనికి తొంగిచూసి కాయలు ఒక్క దెబ్బకి పగలగొట్టారు. ఇదరికీ రెండు కత్తులందించారు. రెండు కోడిపెట్టలను తెచ్చారు. ఇంకో భక్తుడు పళ్ళెంతో అన్నం తెచ్చి నిలబడ్డాడు. ఒక్కవేటులో కోళ్ల తలలు తెగిపడ్డాయి. వాద్యఘోష మరోసారి మిన్నంటింది. రక్తంతో అన్నం తడిసింది. కళాకారుల ముఖాలూ బట్టలనిండా రక్తం చిందింది. ప్రదర్శనకు క్లైమాక్స్. భక్తులు పారవశ్యంతో ఊగిపోతున్నారు. కత్తులు దించారు. గిలగిల కొట్టుకున్న జీవాల మొండేలు ఆగి నేలకొరిగాయి. గుడిచుట్టూ మరోసారి ప్రదక్షిణ చేసి, ప్రేక్షకులూ భక్తులూ చేతులెత్తి అభివాదం చేస్తూండగా కళాకారులు గ్రీన్ రూమ్ కేసి నడిచారు.            

                         చేతులు పైకెత్తి నుంచుంటే, ఆసిస్టెంటు కుర్రాళ్లొచ్చి అలంకరణలు తొలగించసాగారు. నేను అక్కడకు చేరుకునేసరికి విష్ణుమూర్తి వెళ్ళిపోయి హరిదాసు మిగిలాడు. కళ్లుమూసుకుని ఆయాసంతో రొప్పుతున్నాడు. ఒళ్లంతా చెమటలు, రక్తం. మెల్లగా కళ్లుతెరిచాడు. పలకరింపుగా నవ్వాడు. “ విష్ణుమూర్తి పూర్తిగా వెళ్లిపోయాడా, లేక ఇంకా కొంచెం మిగిలేడా?” అని ఆసక్తిగా అడిగాను. 

                     “ లేదు.మొత్తం అయిపోయింది. ఆ వేషంతో, ఆ క్షణాలతో నాకిప్పుడు ఏ సంబంధమూ లేదు. విపరీతమైన ఆకలి, అలసట, కొంచెం తేలికతనమూ ఇవే ఇప్పుడున్నవి. చాలా అలసటగా ఉంటుంది.”

                   “తరువాతి ప్రదర్శన ఎప్పుడు?”

             “ఈ రాత్రికే. బస్సెక్కితే ఇక్కడికి మూడుగంటల ప్రయాణం”

             “రాత్రంతా వుంటుందా?”

             “అంతే కదా! తప్పదు మరి. ఉపాధికోసం ఈ సీజన్లో ఇలాగే పగలూరాత్రీ తేడాలేకుండా కష్టపడాలి. ఏడాదంతా ఎదురుచూసేది ఈ సీజను కోసమే.” 

              చాముండి వేషం వేసిన కళాకారుడు గెటప్ తీసేసి, స్నానం చేయడానికి కాలువకెళుతూ, వస్తారా అని కళ్లతో అడిగాడు. అతనికి వెళ్లమని కళ్లతోనే సైగ చేశాడు హరిదాసు. 

 “ఈ రెండు నెలలూ సంతోషంగా వెళ్లిపోతాయి. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకెళ్లి తెయ్యం చేయడంలో ఎంతో ఆనందం వుంటుంది. గర్వంగా ఉంటుంది. తెయ్యం వల్లనే నాకింత గుర్తింపు దొరుకుతోంది. సీజనైపోతే నాకో గ్లాసు టీ కూడా ఎవరూ ఇవ్వరు, పలకరించరు. అదే సీజన్లో అయితే ఎవ్వరూ హరిదాసును చూడరు. అందరికీ నేనో దైవాన్ని. ఓ నడిచే ఆలయాన్ని. ఓ ధైర్యాన్ని.

                         మేకప్ కుర్రాడు ముఖానికున్న రంగులనీ చెమటా రక్తాన్నీ గుడ్డతో తుడిచాడు.

                        “వెనక్కి డ్యూటికెళ్లడం భారంగా అనిపిస్తుందా?”

                       “చాలా”,  దిగాలుగా అన్నాడు హరిదాసు.

 “కానీ తప్పదుగా! ఎవరికి వాళ్ళం మళ్లీ మా మా పనులకు పోవాలి. బస్ కండక్టరుగా , బావికూలీగా, జైలుస్టాఫ్ గా. బయటి ప్రపంచంతో బంధం తెగిపోతుంది. పదినెలలూ గొడ్డులా కష్టపడుతూ, మళ్ళీ సీజన్ కోసం ఎదురుచూస్తూండడం.”

         హరిదాసు మౌనంగా ఏటికేసి నడిచాడు.

          “ అవును. వచ్చే పదినెలలూ చాలా కష్టంగా గడుస్తాయి. కానీ తప్పదు. అది వాస్తవం. ఇది తప్పించుకోలేని శిక్ష. అసలు జీవితమే అంతగా!!!!!!!”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.