పౌలస్త్యహృదయం దాశరథి విజయం
-వసుధారాణి
హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’
తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి
ఈ పుస్తకాన్ని చదవటం గొప్ప అనుభవం.సమీక్ష చేయపూనటం గొప్ప సాహసం.బాపు అందించిన బొమ్మ అద్భుతం. హిందీ మూల రచయిత ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి గారి పరిశోధన గురించి ఎంత చెప్పినా సరిపోని విధంగా వంశాలు,భౌగోళిక అంశాలు,ఆనాటి సాంఘిక,రాజకీయ జీవిత వర్ణనలు ఈ పుస్తకాన్ని గొప్ప పుస్తకంగా మలిచాయి.
శాస్త్రి గారి పరిశోధన సారాంశం,ఆయన ప్రతి విషయాన్ని కావ్యస్థాయిలో వివరించిన తీరు వల్ల హిందీలో ఈ పుస్తకం దాదాపు ఎనిమిది వందల పేజీల బృహత్ నవల.ఐతే శోభిరాల బాలా త్రిపుర సుందరి గారు ఆ కావ్య గౌరవం తగ్గకుండా సరళమైన,మృదుమధురమైన భాషని కొనసాగిస్తూనే తన అనుసృజననని 259 పేజీల్లోకి తెచ్చారు.
“శ్రీ రామాయణం” మహాకావ్యం అని అందరికీ తెలిసిందే.ఎన్ని భాషలలో ఎన్ని రామాయణాలు వచ్చాయో కూడా.అయినా ఈ కావ్యం సరి కొత్తగా ఉంది.అడుగడునా అచ్చెరువొందించే ఘటనలు,దండకారణ్య , కైలాస వర్ణననలు అమోఘం.
ఇప్పటి వరకూ ఏ రామాయణం లోనూ చూడని విస్మయపరిచే విషయం రావణుని రాజకీయ కోణం.రక్ష సంస్కృతిని ఏర్పాటు చేయటం కోసం చిన్న చిన్న ద్వీపాలు గా ఉన్న రాజ్యాలను ఈ సంస్కృతి కిందకు తేవటం కోసం అతను చేసిన ప్రయాణం ఈ నవల.
ఆచార్య చతుర్ సేన్ గారి మాటలలో ఈ ‘వయం రక్షామః ‘ గురించి.
“ప్రాచీన వేద కాలానికి సంబంధించిన ,మనకు తెలియని,మనం విస్మరించిన నర,నాగ,దైత్య,దానవ,ఆర్య,అనార్య జాతుల రేఖాచిత్రాన్ని ధర్మం అనే రంగుటద్దాలలోనుంచి చూచి ప్రపంచం అంతా వారిని ఎక్కడో అంతరిక్షంలో ఉన్న దేవతలుగా భావించింది.కానీ ఈ నవలలో వారందరినీ నరజాతుల రూపంలో మీ ఎదుట నిలిపే సాహసం చేస్తున్నాను.అర్ధ శతాబ్ది కాలంపాటు నేను చేసిన అధ్యయన ఫలితంగా ,నా హృదయమస్తిష్కాలలో ఏర్పడిన భావవిచారాధారనంతా ‘ వయం రక్షామః’ లో పుంజీభూతం చేసాను.”
పాఠకులకు రచయిత చేసిన విన్నపమే ఈ నవలలో రాసిన విషయం ఎంత విభిన్నంగా ఉన్నదో తెలుపుతుంది.
శోభిరాల బాలా త్రిపురసుందరిగారు తన మాటలో ఇలా అన్నారు.
” రావణ పాత్రకు ప్రాధాన్యతనిస్తూ ఆచార్య చతుర్ సేన్ అతణ్ణి గురించి ఏమి చెప్పినా,ఎంత చెప్పినా ,ఎట్లా చెప్పినా – కడకు ధర్మానికి విజయం తధ్యం అనే సత్యాన్నే నిరూపించారు.మనిషికి సత్యధర్మాలను ఆచరించటమే నిజమైన శాశ్వతమైన బలం – ఇహానికీ, పరానికీ,నాటికీ,నేటికీ ,ఏనాటికీనీ.”
మూల నవల రచయిత చతుర్ సేన్,అనుసృజన రచయిత్రి శోభిరాల బాలాత్రిపురసుందరి గార్ల అంతిమ లక్ష్యం ఒకటే అనిపిస్తుంది ఈ నవల గురించి వారి అభిప్రాయాలను చదివిన మీదట. శ్రీ రామాయణాన్ని మహాకావ్య రూపంలో చూసినా, కేవలం అప్పటి నరచరిత్ర ఒక జాతి చరిత్రగా చూసినా అందులోని విలువలు ఇప్పటికీ,ఎప్పటికీ నిలిచిపోయే అంశాలు.వాటి ప్రాభవం ఇప్పటికీ ఎన్నదగినది.
నవల మొదలు పెట్టిన దృశ్యమే అపూర్వం.నవయవ్వని ఒకతె నాలుగు వీధుల కూడలిలో నృత్యం చేస్తుండగా నాలుగు వైపులా ఆబాల వృద్దులు, నరనాగులు, దేవదైత్యులు,గంధర్వ కిన్నరలు,అసుర మానుష ఆర్యవ్రాత్యులు ఆ నృత్యాన్ని తిలకిస్తున్నారు అని.
ఈ దృశ్యం నవలలో వుండబోయే ఒక గొప్ప అసాధారణ అంశాన్ని తెలుపుతుంది. ఈ జాతులన్నీ ఇక్కడ భూమి మీద సాధారణ స్థితిలో ఒకే సాంఘిక జీవితాన్ని గడుపుతున్నవి అని చెప్పకనే చెపుతోంది.
ఆ యువతిని మోహించిన యువకుడు తనని తాను పరిచయం చేసుకున్నతీరు ఇది.” నేను లంకాధిపతి సుమాలి దౌహిత్రుడను ,మా అమ్మ సుమాలి పుత్రిక.”
“రావణుడను పౌలస్త్యవైశ్రవణ రావణుడను.”
“రక్ష సంస్కృతి .కన్యాపహరణం మాకు శాస్త్రవిధి.”
అక్కడి నుంచి కథ ఎక్కడా ఆగకుండా మనని సప్త ద్వీపాలకు తిప్పి వేస్తుంది.బాలా త్రిపురసుందరి గారు వర్ణనలు ఎంత తగ్గించినప్పటికీ ఆయా ద్వీపాల అప్పటి అందాలను చూపించటంలో జాగురుకతను వహించారు.
తను పౌలస్త్యవంశజుడననీ,వైశ్రవణుడననీ పరిచయం చేసుకున్న తేజస్వి,మేధావి అయిన ఆ రావణుడు ఆంధ్రాలయ మహాద్వీపంనుండి వీరులు,సాహసికులు అయిన తన సహచరులను వెంటబెట్టుకుని భారతదేశానికి దక్షిణాన గల సమస్త ద్వీపాలను అంగద్వీపం(సుమాత్రా),యవద్వీపం(జావా),మలయద్వీపం(మలయా),శంఖద్వీపం(బోర్నియా),కుశద్వీపం(ఆఫ్రికా),వారహద్వీపం(మెడగాస్కర్) ఈ ద్వీపాలన్నింటిని మీద అధికారం హస్తగతం చేసుకున్నాడు.తరవాత అతని దృష్టి చతుస్సముద్ర వలయితము ,పెద్ద పెద్ద స్వర్ణప్రాకారాలచే రక్షితము ,సుసజ్జితము అయిన లంకానగరం మీద పడింది.దాన్ని తన రాజధానిగా చేసికోవాలని అతని తలుపు.
ఆ కాలంలో లంకకు అధిపతిగా రావణుని సవతి సోదరుడు ,వైశ్రవణుడు,లోకపాలుడు,ధనేశుడు అయిన కుబేరుడనే యక్షరాజు వుండే వాడు.
కుబేరుని వద్దకు సోదరుడిగా చేరిన రావణుడు తన రక్ష సంస్కృతిని నెమ్మదిగా లంకలో ప్రవేశపెట్టడం , సమూహాలను కలటానికి,ఒక తాటిపై నిలిపి ఉంచటానికి అతను ఏర్పాటు చేసుకున్న రక్ష సంస్కృతి యొక్క నినాదం ‘వయం రక్షామః'(మేము రక్షిస్తాం) .కొన్ని వేల ఏళ్ల క్రితం రాజకీయ సమీకరణలు చేయటం,ఒక నినాదం ఏర్పరచటం ఆశ్చర్య పరిచే విషయం.ఇది చదవగానే అప్పటినుంచి ఇప్పటి వరకూ నాకు తెలిసిన రకరకాల నినాదాలు ప్రపంచ చరిత్రను ,పటాన్ని మార్చిన సమీకరణాలు గుర్తుకు వచ్చాయి.
‘ వయం రక్షామః’ ఈ మాటతో రావణుడు ప్రతి అడుగునూ రక్షసంస్కృతిలో బలపరుచుకుంటూ వెళతాడు.ఓ యుద్ధంలో బంధింపబడి మండోదరి తండ్రి చేత విడిపింపబడి ఆమెను వివాహం ఆడతాడు.రాజ్యకాంక్ష కన్నా మొత్తం నరజాతిని ఈ రక్ష సంస్కృతి నీడలోకి తేవాలనే రావణ ప్రయత్నం స్లాఘించదగిన ప్రయత్నం.
అయితే ఇందుకుకాను అతను ఎంచుకున్న మార్గం,ఆచరించిన రాజకీయ రీతులు అతని గొప్పతనాన్ని వెనక్కి నెట్టాయి.
దండకార్యాణ ప్రాంతంలో అతని స్థావరాలు,కైలాస పర్వతారోహణం అన్నీ అచ్చెరువొందించే విషయాలే!
వచ్చే నెల నెచ్చెలిలో ఈ నవల గురించిన మరింత విస్తృత పరిచయంలోకి వెళదాం.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
ధన్యవాదాలు ..మంచి పుస్తకం అరుదైన అంశంతో కూడినది. అనుసృజన సరళంగా ,సహజంగా ఉంది.
ఆచార్య చతుర్ సేన్ నవల రచనా ఉద్దేశాన్నీ, అనుసృజించిన శ్రీమతి శోభిరాల గార్ల మూల విధేయ గౌరవాన్ని చక్కగా వసుధారాణి గారు వ్యక్తం చేశారు. వచ్చే మీ పూర్తి సమీక్ష కు ఎదురు చూసేలా చేశారు. ఈ గ్రంథావిష్కరణలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య,ఆచార్యా కాత్యాయనివిద్మహే గార్లతో వేదిక పంచుకొని ఈ గ్రంథ సమీక్ష నేను చేశాను.
నిస్సందేహంగా గొప్ప పుస్తకం. వసుధారాణి గారి సమీక్ష అత్యుత్తమం గా సాగుతుంది.
పురుగుల్లో కామెంట్ పెట్టాను
రావణుని రాజకీయ కోణం – రక్ష సంస్కృతి తొలిసారి చదువుతున్నాను. ఆసక్తికరంగా ఉంది. మరిన్ని వివరాలకై ఎదురు చూస్తాను. పుస్తక ముఖచిత్ర పరిమాణం మరీ చిన్నదిగా ఉండి, దాని పై ఉన్న పుస్తక వివరణ చదవటానికి ఇబ్బందిగా వుంది. ముఖచిత్ర పరిమాణం పెంచకోరుతాను.