మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

ఇంకా నలభైశాతం మంది పురుషులు తమ స్త్రీలు సంఘటితం కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు కంపెనీలో ఉద్యోగం  పోతుందని కొందరు భయపడుతున్నారు. నా పనివల్ల నా భర్త పొందిన కష్టాల్లాంటివి తమకి కూడా వస్తాయని కొందరు భయపడుతున్నారు. మరికొందరు తమ భార్యల గురించి జనం చెడ్డగా చెప్పుకుంటారని భయపడుతున్నారు. ఎందుకంటే మా ప్రవర్తన చూస్తూ కూడా నాయకత్వంలోని పురుషులు మమ్మల్ని గౌరవిస్తారని నిజం తెల్సి కూడా ఇంకా కొందరు మా గురించి చెడ్డగా మాట్లాడే వాళ్లున్నారు. ముఖ్యంగా మమ్మల్ని అర్థంచేసుకోని వాళ్ళూ, స్త్రీలు ఇంట్లోనే ఉండాలనీ, తమ కుటుంబం కోసమే బతకాలనీ, రాజకీయాలలో కలుగ జేసుకోవద్దనీ అనుకునే కార్మికులు కూడా ఉన్నారు. ఈ పాతకాలపు మనుషులు ఎప్పుడూ కట్టుకథలు పుట్టిస్తూ వాటిచుట్టూ తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకు మేము యూనియన్ నాయకుల ఉంపుడుగత్తెలమనీ, మేము యూనియన్ కు ప్రేమ వ్యవహారాలు నడిపించడానికే పోతున్నామని వాళ్లు ప్రచారం చేశారు. కనుక ఎంతోమంది కార్మికులు తమ భార్యలను ప్రదర్శనల్లోగాని, సంఘంలోగాని, మరివేట్లోనూ పాల్గొనివ్వలేదు. వాళ్ళు భయపడ్డారు. ముఖ్యంగా వాళ్లు తమ భార్యలు యూనియన్ కేంద్ర కార్యాలయానికి పోవడం ఇష్టపడలేదు.

కాని మాకు యూనియన్ కేంద్ర కార్యాలయమంటే కార్మికవర్గపు సమావేశ స్థానంలాంటిది. అదో గుడి లాంటిది. అది పవిత్రమైనది. ఆ భవనాన్ని నిర్మించడానికి ఎంతో రక్తం వ్యయం అయింది. మేం కార్మికవర్గ సమస్యలు చర్చించడంకోసం యూనియన్ భవనంలో కలుసుకుంటాం. కార్మికులు మమ్మల్ని తమ కామేడ్స్ గానూ, తమ సహచరులుగానూ చూస్తారు. ఇంకేరకంగానూ చూడరు.

ఏదైనా ప్రత్యేకమైనది జరిగినప్పుడు మాత్రమే పాల్గొనే వాళ్లు కొందరున్నారు. 1973లో ఎక్కువ ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ మేమొక ప్రదర్శన నిర్వహించినప్పుడు దాదాపు ఐదువేల మంది స్త్రీలు పాల్గొన్నారు. కాని ఇళ్లకు వెళ్ళగానే ఎంతోమంది కార్మికులు తమ భార్యలను కొట్టి వాళ్లు రాజకీయాలతో చేసేదేమీలేదని ఇల్లాలుగా వాళ్ళ బాధ్యత ఇంట్లో ఉండడమేనని చెప్పారు. ఇది ఎంతదాకా జరిగిందంటే చివరికి మేం వాళ్లను రేడియోలో విమర్శించాల్సి వచ్చింది కూడా. “తమ భార్యలను కొట్టిన కార్మికులందరూ ప్రభుత్వ ఏజెంట్లు అయి ఉంటారు. తమ భార్యలు న్యాయం వైపు డిమాండ్ చేస్తూ వుంటే వాళ్లను వ్యతిరేకించడం అంటే అర్థం ఇదే. చివరికి అందరికీ ప్రయోజనకరం కాబోయే ఒక నిరసనను చూసి వాళ్లేందుకు అంతగా భయపడాలి?”

ఏదేమైనా మేము నిజంగా చాలా సాధించాం. ఎంత సాధించామో మీరు కూడా చూడవచ్చు. 1973లో హువానునిలో జరిగిన కార్మికుల సమావేశానికి నన్ను పంపించారు. అక్కడికి గృహిణుల సంఘం నుంచి ముగ్గురు ప్రతినిధులం వెళ్లాం. కాని మిగిలిన ఇద్దరు ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కనుక ఐదు వందల మంది మగవాళ్ళతో నేనొక్కదాన్నే ఉండాల్సి వచ్చింది. ఒక్కొక్కళ్ళకు ఒక్కోగది ఇచ్చేటంత డబ్బు లేకపోవడం వల్ల అక్కడ కొందరికి కలిపి ఒక గది చొప్పున ఇవ్వబడింది. మాకు తలా ఒక మడత మంచం ఇచ్చారు. “ఇంకేం కార్మికులతో కలిసి అక్కడ ఉండొచ్చుగదా” అన్నారు. కనుక నేను వాళ్ళు నాకప్పగించిన మూల వద్దకు వెళ్లాను. మా కార్మికులు ఒక్కళ్ళు కూడా మినహాయింపు లేకుండా పెళ్ళయినదాన్ననీ పిల్లలున్న దాన్ననీ గౌరవంగా చూశారు. ఒక్క గది మాకు పన్నెండు పదమూడు మందికిచ్చారు. మేం కార్మిక వర్గపు సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇదివరకటి సభల్లో జరిగిన సంగతులన్నీ చెప్పుకున్నాం. తాము ఒక స్త్రీతో కలిసి ఉన్నామని వాళ్ళలో ఒక్కరికీ అనిపించలేదు. నా భర్తకు నేనలాంటి పరిస్థితిలో ఇరుక్కుంటానని తెలుసు. అయినా ఆయనకు నాపై అనుమానమేమీ లేదు. ఆయనకు నాపై అపనమ్మకమేదీ లేదు. అందువల్లనే నేను సభలో పాల్గొనగలిగాను. సంఘానికి ప్రాతినిధ్యం వహించి మా సందేశాన్ని అక్కడికి తీసికెళ్ళాను.  స్త్రీల గురించిన ఈ కొత్త భావాలు త్వరలోనే వ్యాపించి మేం పోరాటంలో మా స్థానాన్ని సాధించుకోగలిగాం. ఉదాహరణకు ఎవరైనా ఓ కార్మికుడు యూనియన్లో తాను అడగడం మరిచిపోయిన విషయం చెప్పి “కార్మిక వర్గానికంతటికీ సంబంధమున్న ఈ సమస్యల పరిష్కారాల్ని మీరు ఎందుకు ఆలోచించుకోకూడదు” అని అడిగినప్పుడు ఎంతో సంతోషమవుతుంది. అది మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఈ రకంగానే మేం మా భాగస్వామ్యాన్ని గెలుచుకున్నాం, పెట్టుబడి దారులు జనాన్ని అణచివేస్తూ సంఘటితమై ఉన్నారు. వాళ్ళ స్త్రీలు కూడా లేడీ రొటేరియన్, లేడీ లయన్స్ లాంటి సంఘాల్లో సంఘటితమయ్యారు. ఈ సంఘాలు బొలీవియాలో ఉన్నాయి. బహుశా వేరే దేశాల్లో కూడా ఉండొచ్చు. కనుక మేం కార్మికుల భార్యలం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది కదూ!

సంఘంలో చేరిక

మొదటి నుంచీ నేను గృహిణుల సంఘంలో లేను. వాళ్ళు మాట్లాడేది నాకు నచ్చేది. వాళ్ళ ప్రదర్శనలకు వెళ్ళేదాన్ని. 1961లో జెయిలు నుంచి విడుదలైన తమ భర్తలతో కలిసి ::పాజ్ నుంచి తిరిగొస్తున్నప్పుడు నేను వాళ్ళను చూడ్డానికి వెళ్ళాను. విడుదలైన భర్తలతో వస్తున్న స్త్రీలు ఎంత ఆనందంగా ఉన్నారో నేనప్పుడు చూశాను.

1963 నుంచి నేను కూడా పాల్గొనడం మొదలు పెట్టాను. ఆ సంవత్సరమే నాయకు లందరినీ అరెస్టుచేసి జైల్లో పెట్టారు. ప్రభుత్వం తల్చుకుంటే నాయకుల్ని ఎప్పుడంటే అప్పుడు జైల్లో పెట్టి నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా నిర్బంధించగలదు. ఎస్కోబార్, పిమెంటెల్ ఇద్దరూ హువానుని నాయకుడు జార్జ్ సరల్తో పాటు కొల్కిరిలో జరిగిన ఒక కార్మికుల సమావేశానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళను వెంటాడి జైల్లో పెట్టారు.

ఈ సంగతి సైగ్లో-20 కార్మికులకు తెలిసింది. సరిగ్గా అదే సమయానికి కటావిలో నలుగురు విదేశీయులు ఉన్నారనే సంగతి కూడా తెలిసింది. అమెరికా రాయబార కార్యాలయంలో కార్మిక వ్యవహారాలు చూస్తూ ఉండే టామ్ మార్టిన్, మరి ముగ్గురు విదేశీయులతో కల్సి కొమిబొల్ యజమానులతో కటావిలో మంతనాలు జరుపుతున్నాడు. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు మొత్తం పది హేడుగురనుకుంటాను. ఈ వ్యక్తుల్ని నిర్బంధించి తద్వారా మన నాయకుల్ని విడుదల చేసుకోవచ్చునని గని కార్మికులకు తట్టింది. కనుక ఒక విందులో ఉండగా వాళ్ళందరినీ మావాళ్ళు పట్టుకున్నారు. విందు మీద తుఫానులా విరుచుకపడి ఏ ఒక్కడ్నీ వదలకుండా అందర్నీ నిర్బంధించారు.

ఒక కార్మికుడు తలలో బుల్లెట్ గాయాలతో మా దగ్గరికొచ్చాడు. అందరం ఎంతో ఆదుర్దాతో ఉన్నాం. ఆయన కార్మిక నాయకుల్ని ఎట్లా చుట్టుముట్టి పట్టుకున్నారో, ఎట్లా వాళ్ళ చేతులు కట్టేసి మొఖాలు నేలకానించి పడేశారో మాకు చెప్పాడు. తాను ఒక గోడమీద నుంచి దూకడానికి ప్రయత్నించానని, జారుతూ ఉండగా బుల్లెట్ తగిలిందనీ ఆ రకంగా తాను తప్పించుకొని వచ్చి ఈ విషయం చెప్పగలుగుతున్నానని చెప్పాడు. తాను బయటికొచ్చేశాక ఒక మిషన్ గన్ కాల్పుల చప్పుడు వినిపించిందనీ అంటే బహుశా నాయకులందరూ చంపేయబడి ఉంటారని ఆయన చెప్పాడు.

తమ నాయకుల్ని చంపేశారని విన్నాక కార్మికులందరూ కోపోద్రిక్తులయ్యారు. దొరికిన నలుగురు విదేశీయుల్ని ఉరితీయాలని వాళ్ళు కోరారు. పొలోమంటూ వాళ్ళను నిర్బంధించిన చోటికి పరిగెత్తారు. పట్నంలోని జనమందరూ కూడా ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తితో కూడలికి చేరుకున్నారు. అక్కడ విదేశీయుల్ని లోపలికి తోలడానికి గని కార్మికులు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు గృహిణుల సంఘం అధ్యక్షురాలు నార్బెల్టా కార్మికులతో కోపంగా మాట్లాడింది. విదేశీయుల్ని అప్పటికప్పుడే చం పేయవద్దని ఆమె కోరింది. “మన నాయకులు ఇంకా బతికే ఉన్నారని నా నమ్మకం”. కనుక వీళ్ళను ఖయిదీలుగా ఉంచి మన నాయకులతో మారకానికి పెట్టాల్సిందేగాని చంపేయ వద్దనీ మన నాయకులు కూడా చంపేయబడ్డప్పుడు మాత్రమే మనం వీళ్ళను చంపాలా లేదా అని నిర్ణయించాలని ఆమె వాదించింది. అప్పటికి అదే చాలా మంచి పని అని మేమను కున్నాం.

“ఏ పనైనా చేసేముందే మనం కూలంకషంగా ఆలోచిద్దాం ఎందుకంటే ఇది గ్రామంలో ఒక భయంకరమైన హత్యకాండకు దారితీయవచ్చు” అని ఆమె చెప్పింది. కార్మికులకు ఏం చేయాలో తోచలేదు. “మరి ఈ విదేశీయులు మన ఖయిదీలుగానే ఉండేటట్టు కాపలా బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని వాళ్ళడిగారు. ఎందుకంటే టామ్ మార్టిన్ ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నాడని గ్రీన్ బెరెట్స్ తో, క్రైమ్ఏ సెస్తో శిక్షణ పొందాడని కనుక వాడే క్షణంలోనైనా తప్పించుకోగలడనీ కార్మికుల అనుమానం. ఎవరూ ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగాలేరు.

అప్పుడు మహిళలు ముందుకొచ్చి తామా బాధ్యత తీసుకుంటామని గొప్ప ధైర్యంతో ప్రకటించారు. అప్పుడక్కడ ఇరవైమంది స్త్రీలున్నారు. అప్పటికప్పుడే వాళ్ళు తమ పని మొదలెట్టారు. ఖైదీలను యూనియన్ లైబ్రరీలో బంధించి నాన్ బెర్టా రేడియోలో మాట్లాడింది. తక్షణమే స్త్రీలందరూ తమ తమ బాధ్యతలు నిర్వర్తించడానికి ముందుకు రావాల్సిందిగా ఆమె కోరింది.

“మిత్రులారా, మన నాయకులు అరెస్టయి ఉన్నారు. గని కార్మికుల భార్యలుగా మనం వాళ్ళకు మద్దతునివ్వాల్సి వుంది” అని చెప్పింది. వాళ్ళను విడిపించుకోవడం కోసం తాము కొందర్ని ఖైదీలుగా పట్టుకున్నామని, వాళ్ళకు స్త్రీలు కాపలా కాయాల్సి ఉందని కనుక అందరూ సాయపడాలని వివరించింది. స్త్రీలందరూ కాపలా బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుందని ఆమె పిలుపిచ్చింది. ఆమె చెప్పింది చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేమిక వెంటనే మా పని మొదలు పెట్టాం. ఆ రాత్రి కొందరు స్త్రీలు అక్కడ కాపలా కాశారు. ఆ రాత్రంతా నా భర్త ఇంటికే రాలేదు. పని నుంచి తిరిగొస్తాడు గదా అని నేనెదురుచూస్తూ కూచున్నాను. ఆయనేమో రానేలేదు. ఇట్లా ఇదివరకెన్నడూ జరగలేదు కనుక నేను ఇంట్లోనే ఏడుస్తూ ఎదరుచూస్తూ ఆయనకేమైందో అని ఆదుర్దాపడుతున్నాను.

మర్నాడు పొద్దున్నే ఏదో ఓ చిన్న ఫలహారం తయారుచేసుకొని నా భర్త కోసం వెతుకుతూ ఆయన పనిచేసే చోటికి వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళు కార్మికులందరూ వెళ్ళిపోయారనీ, ఏ ఒక్కరూ పనిచేయడంలేదనీ సమ్మె నడుస్తున్నదనీ చెప్పారు. “యూనియన్ కేంద్రకార్యాలయానికి వెళ్ళి అక్కడ నీ భర్త గురించి అడుగు. బహుశా ఆయన కాపలాకాస్తున్నాడేమో” అని వాళ్ళు చెప్పారు.

నేనప్పుడు యూనియన్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నన్ను లోపలికి పోనిచ్చారు. స్త్రీలు ఎంత బాగా పనిచేస్తున్నారో నేనక్కడ చూశాను. వాళ్ళు నన్ను మొత్తం సోదా చేశారు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.