యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

నోరు మంచిదయితే…

సుబ్బమ్మ అందరిళ్ళలో వంటచేస్తుంది. భర్త గోవిందు ఎక్కడో ఊరికి దూరంగా వుండే హోటల్లో పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అమ్మాయి. మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకునేది సుబ్బమ్మ. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. వాళ్ళిద్దరినీ వదిలేసి వంట పనులు చూసుకుని వచ్చేది. తను వచ్చేవరకు పిల్లలు ఆకలికి అలమటించిపోయేవారు.  ఏమీ చెయ్యలేని పరిస్థితి. దిగులుగా వుండేది. జీవితాన్ని ఎలా ఈడ్చుకుని వస్తానా అనుకునేది. 

సుబ్బమ్మ చదువుకోలేక పోయానని చాలాసార్లు అనుకుంది. సంపాయించే డబ్బులన్నీ తినడానికే సరిపోయేవి. గోవిందు సహకారం అంతంత మాత్రమే. ఇంట్లోకి ఎంతో కొంత డబ్బులిచ్చేవాడు అంతే. పిల్లలని అస్సలు పట్టించుకునేవాడు కాదు. డబ్బులన్నీ పేకాటలో పెట్టేసేవాడు. ఇంటికి ఎప్పుడో వచ్చేవాడు. ఓ మూలపడి నిద్రపోయేవాడు. మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోయేవాడు. 

పిల్లలని ఎలాగైనా చదివించాలని అనుకుంది. ఇద్దరినీ ముందు ఒక గవర్నమెంట్ స్కూల్ లో వేసింది. తను వంట చేస్తున్న వాళ్ళమ్మాయి సుమన డిగ్రీ చదువుకుంటూ సుబ్బమ్మ పిల్లలిద్దరికీ చదువు చెప్పేది. స్కూలులో చెప్పేది అంతంత మాత్రమే అయినా వీళ్ళిద్దరూ సుమన దగ్గిర బుద్ధిగా అన్నీ నేర్చుకునేవారు. 

సుమన సలహాతో పిల్లలిద్దరినీ ఒక ప్రైవేటు స్కూల్లో వేసింది. ఫీజులు కట్టాలంటే కష్టం కదమ్మా…! నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు అంది. పిల్లలు మాత్రం బాగా చదువుతున్నారు అంది. 

సుమన ఒక రోజు తీరుబడిగా కూచుని సుబ్బమ్మతో సుబ్బమ్మా…! నువ్వు ఇలా వంటలు చేసుకుంటూ కూచుంటే ఏమీ చెయ్యలేవు. ఒక పని చెయ్యి నేను నీకు కొంత డబ్బులు పెట్టుబడిగా ఇస్తాను. నువ్వు బయటికి వెళ్ళి చేసే వంటలు ఇంట్లోనే చెయ్యి. నీకు తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి చెప్పు. అందరికీ ఇళ్ళకి కేరేజీలు తెచ్చిస్తానని చెప్పు. ఒకవేళ పండగలు పబ్బాలు వస్తే పిండివంటలు కూడా చేసిస్తానని చెప్పు అంది. మాటిమాటికి ఇళ్ళకి వెళ్ళి చెప్పాలంటే కష్టం కదా… నాకు ఒక మంచి ఫోను కొనిపెట్టమ్మా… నాకు ఇచ్చిన అప్పులో ఇది కూడా వేసుకో మెల్లమెల్లగా తీర్చేస్తాను అంది. 

సుమన సరేనని ఒక ఫోను కొనిచ్చింది. సుబ్బమ్మకి కావలసిన వస్తువులన్నీ కొనిచ్చింది. సుబ్బమ్మ అందరిళ్ళకీ వెళ్ళి తన ఫోను నెంబరు ఇచ్చి వచ్చింది. శాంపిల్ కి అందరికీ ఒకరోజు వంట చేసి ఇచ్చింది. ఏదో ఒక మూల భయం ఎలా నెగ్గుకు వస్తానా…? అని. కానీ సుమన ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూనే వుంది. 

సుబ్బమ్మకి ఒక్కొక్కళ్ళూ ఫోన్ చేసి కావలసిన ఐటమ్స్ ఆర్డరు చేసేవారు. అలా ఒకళ్ళనుంచి ఒకళ్ళకి సుబ్బమ్మ వంట రుచి తెలిసింది. ఊరగాయల టైములో పచ్చళ్ళు పెట్టిమ్మనే వారు. అసలు టైము లేకుండా అయిపోయింది. తన చెల్లెలిని సాయం తెచ్చుకుంది. తొందరలోనే సుమనకి ఇవ్వవలసిన అప్పు  తీర్చేసింది.

పిల్లలిద్దరూ కాలేజీ చదువులకి వచ్చారు. సుబ్బమ్మకి పెద్ద ఇల్లు అవసరమయింది. అక్కడే పక్కన ఎప్పటి నుంచో ఖాళీగా వున్న ఇల్లుని గురించి వాకబ్ చేసింది. ఆ ఇల్లుగల వాళ్ళు వేరే ఊళ్ళో వుండడంతో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడి మొత్తానికి ఇల్లు అద్దెకి తీసుకుంది. ఒక ఇద్దరు పనివాళ్ళని పెట్టుకుంది. అందరికీ టైం ప్రకారం కేరేజీలు పంపించడంలో చాలా జాగర్తగా వుంటుంది. ఎవరికీ ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకునేది. చాలామంది హోటల్ పెట్టమంటే నాకు దీనిలోనే తృప్తిగా వుంది. ఇప్పుడు నేను నా పిల్లల విషయంలో జాగర్త తీసుకోగలుగుతున్నాను. వాళ్ళని బాగా చదివించుకోగలుగుతున్నాను అని చెప్తుంది. 

పిల్లలు కూడా అమ్మా మా చదువులు అయిపోయాక, ఉద్యోగాలు సంపాదించి నిన్ను ఇంక కష్టపడనివ్వం. నువ్వు ఈ కేటరింగ్ మానేయ్యచ్చు అన్నారు. సుబ్బమ్మ ఒక నవ్వు నవ్వి వూరుకుంది. తన జీవితాన్ని నిలిపిన ఈ పని దైవంతో సమానం. ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకూ చేస్తానని నిర్ణయించుకుంది. 

పిల్లలు ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. సుబ్బమ్మ మాత్రం తన దగ్గిర కేరేజీలు తీసుకునేవాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా అందిస్తూనే వుంది. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందనే సామెతని నిజం చేసింది సుబ్బమ్మ. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.