ఆడియో కథలు
మంత్రసాని (కథ)
రచన: కె.వరలక్ష్మి
పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి
తెల్లగా తెల్లారిపోయింది.
ఉలిక్కి పడి లేచి కూర్చుంది లోవ.
పిల్లలు నలుగురూ ఒకళ్ళమీదొకళ్లు పడి నిద్దరోతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లుచాపుకొని విశాలంగా పడుకోడానికి జాగాలేదు.
“లెగండి లెగండి” అని పిల్లల్ని ఒకో చరుపు చరిచి విడిపోయిన జుట్టుని ముడేసుకుంటూ వాకిట్లోకొచ్చింది. లోవని చూడగానే దడిలోపలి పందులు రెండూ గీపెట్టడం మొదలెట్టాయి. తడిక లాగి వాటిని వదిలేసి వచ్చింది.
చూరుకింద కుక్కి మంచంలో ముణగదీసుకుని పడుకున్న సుక్కమ్మ సణగడం మొదలెట్టింది. “అంతే, ఆటిమట్టుకయ్యి పియ్యో పేడో తిని బతకాలిసిందేగాని నాలుగిళ్ళకి తిరిగి నాలుగులొట్లు గెంజట్టుకొచ్చి ఆటికడుపు సల్లబరుద్దామన్న దేసే లేదు”.
అప్పుడే లేచి బైటికొచ్చిన ఆడపిల్లలిద్దరికీ రాత్రి కడిగి బోర్లించిన సేవెండి బిందెల్ని నెత్తిన పెట్టి నీళ్ళు తెమ్మని పురమాయించి వాకిట్లో కళ్లాపి జల్లడానికి పేడకోసం బయల్దేరిన లోవ వెనక్కి తిరిగి ముసిల్దాని వంక కొరకొరా చూసింది.
“ఆ….. నీకూ నీ పందులకీ తాగించటానికి కడవల్లో పోసి దాసుంచేరు గెంజి. మణుసులికే టికాణా లేక సత్తుంటే పందులికి గెంజి తెమ్మంటాది ఈ రంప”.
“రంపనే, నేను రంపనే. అదలాగుండియ్యి. ఈ తలకి మాసిన పేటలో లేపోతే ఒక్కడుగు ఆ పెద్దిళ్ళకేసి ఎల్లకూడదా? రేత్రి తాగిన గెంజిమెతుకులు కడుపులో ఇంకా కూకుంటాయా? అయ్యో ముసిల్ది మంచంలో కదల్లేకుండా ఉంది, దాని ఎదాన్నింత సల్దిగెంజి పోద్దారని గెవనం ఉందా నీకు”.
“మొదలెట్టిందమ్మా సాదింపు, దీన్నోరడిపోనూ, అన్నీ ఉడిగిపోయినోరొకటీ ఉండిపోయిందేటే నీకు రాకాసి మొకందానా! నీ పెద్దిళ్ల మొగుళ్లెవరూ అన్నాలు వోర్చుకొని తింటంలేదు, అందరూ కుక్కర్లలో ఇగరబెట్టుకుంటన్నారు”.
“తల్లి తల్లిలోవమ్మా…” అని కాళ్లబేరానికొచ్చింది సుక్కమ్మ. “ఆ ఈది సివర ఆదమ్మ ఇడ్దెన్లేత్తంది గదే, రెండిడ్డెన్లైనా తెప్పించి పెట్టే, పేణం కొట్టుకు లాడతంది”.
అది విని చిన్నకుర్రోడు చిందులు మొదలెట్టేడు. “నాకూ ఇద్దిన్లే” అంటూ.
“నోర్లు ముయ్యండెహె, ఎదవ సంతని ఎదవసంత. బొడ్లో రూపాయలు మూలుగు తున్నాయి మందంతకీ ఇడ్డెన్లు తినిపించటానికి” కుర్రాణ్ణి విదిలించుకుని పేడ కోసం రోడ్డెక్కింది లోవ.
సుక్కమ్మ రెండు చేతులూ జోడించి ఏడుపురాగం మొదలెట్టింది.
“అమ్మా లోవ తలుపులమ్మ తల్లో తల్లో
బిడ్డల్లేని బతుకైపోనాది తలుపులమ్మ తల్లో
ఎరకల ఎంకడు ఎంత పేరైనోడే తలుపులమ్మ తల్లో
సంతానం లేదంటే నగుబాటైపోతాదని తలుపులమ్మ తల్లో
నీకాడికొచ్చి మొక్కుకున్నామే తలుపులమ్మ తల్లో
రంపల్రాకాసిని నా కడుపునే సేవే తలుపులమ్మ తల్లో
మేపు నీకేం తక్కువ జేసేమే తలుపులమ్మ తల్లో… “
ముసిల్దాని రాగానికి ఖాళీడబ్బా ఒకటుచ్చుకుని గరిటతో దరువెయ్యడం మొదలెట్టేడు పెద్ద కుర్రోడు శీనయ్య. ఆ దరువుకి తగ్గట్టు గెంతులేస్తున్నాడు చిన్నోడు కిట్టయ్య.
ఎక్కడా పేడ దొరక్క ఝణ ఝణలాడుతూ వచ్చిన లోవ ఇద్దర్నీ చెరోబాదూ బాదింది. అది చూసి ముసిల్ది ఠక్కున రాగం ఆపేసింది. అటు తిరిగి పడుకుని ఆకల్ని మరిచి పోడానికి పాతరోజుల్ని నెమరేసుకోవడం మొదలెట్టింది.
ఆ రోజుల్లో పురుళ్లు పొయ్యటానికి ఊళ్లల్లో ఎరకలసానుల్నే పిలిసేవోళ్లు. గూడెంలో ఇంకా ఇద్దరు ముగ్గురున్నా సుక్కమ్మ సెయ్యి సలవ అని అందరూ తననే పిల్చుకెళ్లేవోళ్లు, సుక్కమ్మ సెయ్యిపడితే సునాయాసంగా బిడ్డ బైటపడతాదని గొప్ప పేరు. సెయ్యి కడుక్కున్న సబ్బు బిళ్ల, సీసాడు కొబ్బరినూనె తననే పట్టుకుపొమ్మనీవోళ్లు. ఎంకడిదీ, తనదీ గుప్పిట్లో లొంగనంత ఉంగరాలజుట్టు, ఎంత కొబ్బరినూనె తెచ్చినా ఏ మూలకి సరిపోయీది కాదు.
బిడ్డ పుట్టడంతో బాధ్యత తీరిపోయిందని ఊరుకునీది కాదు తను. రోజూ ఎళ్లి బాలింతకి కాయం మసాలాలు కాటుకలా నూరిచ్చి, ఒళ్ళంతా పసుపు కలిపిన నువ్వుల నూని పట్టించి, సీమలు దోమలు సేరకుండా పురుటి మంచం చుట్టూ ఎండబెట్టిన ఏపాకుల గుండ జల్లి, సంటి బిడ్డకి నీళ్లోసి, సాంబ్రాణి పొగేసి వచ్చేది. బిడ్డ రోజు రోజుకీ నిగారింపు తేలి జాంపండులా మెరిసిపోతంటే ఆళ్లకీ తనకీ కూడా ఆనందంగా ఉండీది.
పురుటి నీళ్లనాడు అయిదు కుంచాల బియ్యం, ఉప్పు పప్పు కుంకుడుకాయల్తో సమస్తం మూటలు గట్టి ఇచ్చీవోళ్లు కామందులు. కొత్తకోక, రైక గుప్పెడు రూపాయల్తో ఈనామిచ్చీవోళ్లు. బిడ్డకి ఏడాదిపాటు నీళ్లోత్తే నాలుగు బస్తాల వడ్లు ఇంటికంపించీవోళ్లు. తూగలేనమ్మ తూగినంతే పెట్టేది. ఏనాడూ అంతకావాలి ఇంత కావాలని తను ఎవర్నీ బాదించి ఎరగదు.
తరతరాల నించి ఎరకల సానుల కులరుత్తి మంత్రసానిరుత్తే. ఏ ఇంటికెళ్లినా ఎంత ఆదరం, ఎంత మరేద చూపించీవోళ్లు! ఒక పండగొచ్చినా పబ్బం వచ్చినా కబురంపి వండుకున్న పిండి వొంటలన్నీ గంపలోపోసి పంపించీవోళ్లు. ఆనాటి అరిసెల్ని, బూరెల్ని తల్చుకుంటే నోట్లో జిల్లుమని నీళ్లూరతాయి.
ఎంకడు రూపాయికి రూపాయి ముడేసీ రకం. నాలుగు రూపాయిలు కూడగానే ఒక పందిపిల్లని కొని పడేసీవోడు, పందిని పెంచితే పాతప్పులు కొత్తప్పులు తీరిపోతాయనే సావెత ఇయ్యాల్టిదా ఏవన్నానా! నాలుగు సెంట్లు నేలకొని దడికట్టేడు. దొడ్డిని దొడ్డెడు పందులు పెరిగేయి. అమ్మీకాడికి అమ్ముతుంటే కొత్తయి పుట్టుకొచ్చేయి.
“మావా, ఇల్లు కట్టుకుందారా” అనడిగింది తనొకసారి.
“ఇదిల్లు కాదేటీ?” అన్నాడు.
“ఏటిది ఇల్లా, ఈ కంపల గుడిసి?”
ఓసి పిచ్చిదానా! మనకులవేటి, లోకవేటి? కులం మరిసి పరుగులెట్టకూడదు. ఎరకలోళ్ల గూడెవంటే గుడిసిలే ఉండాలి. మనం పెంచీ పందులికి పెంకుటిళ్లు కడితే నలుగురూ ముక్కు మీద ఏలేసుకుంటారు. అశుద్ధంలో తిరిగే పందులొచ్చి లోగిట్లో ఎలాగ మసుల్తాయి? ఒక వానొచ్చినా వరదొచ్చినా, ఎండకాసినా మన్ది సుట్టుగుడిసి కాబట్టి సూరుకింద సేరి తొంగుంటాయి. అన్నింటికన్నా ముక్కెవైన మాటొకటి సెప్తాను ఇనుకో, మారాజుల్లాగ మనమూ అందలాలెక్కాలని ఎప్పుడూ కోరుకోకూడదు. నలుగురితో నారాయణ కులంతో గోయింద. ఎరకలెంకడు లోగిలి కట్టేడు, ఆడికి కళ్లునెత్తిమీద కొచ్చేయని పెద్దోరెవరూ అనుకోకూడదు తెల్సిందా? ఆరినీడలో అణిగీ మణిగీ ఇలాగ సల్లగా బతుకులెల్లిపోవాలని కోరుకోవాల” అని పెద్ద అరికత సెప్పుకొచ్చేడు.
లేక లేక పుట్టిన లోవ తర్వాత ఇక మరిలేరు. ఈ గంపల గంగిని నెత్తినెట్టుకుని ఊరేగీవోళ్లు. అడిగింది లేదనకుండా జరిపీవోరు. ఎండికంటి, నాను, మొలతాడు, సిగ్గుబిళ్ల అదీ ఇదనేంటి కూతురికి ఒళ్లంతా ఎండినగల్తో నింపేసి ఎత్తుకు తిరిగేవోడు ఎంకడు.
ఇది సిన్నప్పుడు గొప్ప తిండిబోతు. పెద్ద గిన్నిడు కూడు. లోటాడు పందివోర పులుసు ఒక్కర్తే కూకుని తినేసీది. పదేళ్లొచ్చీతలికి ఆయికుడుంలాగ ఒళ్లుగా కనపడీది. పన్నిండేళ్లు రాకుండా లగ్గం సెయ్యకపోతే కులపోళ్లు నలుగురూ నవ్వుతారని తూరుపు దేశాలకెల్లి ఇల్లరికం ఉండటానికి ఒప్పుకున్న అప్పన్నని అట్టుకొచ్చి పిల్లనిచ్చి లగ్గం జరిపించేడు ఎంకడు. లోవ లగ్గపు సంబరాలు ఉప్పుడికింకా ఊరి ఎరకలోళ్లెవరూ మరిసిపోరు. గేసులైట్లు, బుట్టబొమ్మలు, బుట్టగుర్రాలు, మైకుపాటలు ఒకటేటి, అయిదు రోజులు ఇరవై పందుల్ని కోసి బోయనాలెట్టేడు. తాగినంత సారా పోయించేడు.
గొడ్డొచ్చిన ఏళా బిడ్డొచ్చిన ఏళా అంటారు గానీ అల్లుడొచ్చిన ఏళ అనలేదెవరూ. కానీ ఈ కొంపకి అల్లుడొచ్చిన ఏళ కలిసిరాలేదు.
లోవ లగ్గవైన ఏడాది తిరక్కుండా ఊళ్లోకి కొత్తగా డాట్టరమ్మ, డాట్టరయ్య వచ్చి ఆస్పటలు ఎట్టేరు. ఆయాసుపత్రిలో ఇద్దరు నర్సులు, ఇద్దరు కంపోండర్లు ఉండీవోళ్లు. ఆళ్లు ఇంటింటికీ తిరిగి ఆళ్ల డాట్టరమ్మ కానుపులు కష్టం తెలవనీకుండా సేస్తాదని, సూది మందిత్తే నెప్పుల బాద తెలవకుండా ఇట్టే ప్రెసవమైపోతాదని, ఎరకల సానులు చేసీ పురుళ్లు ప్రేణానికి ప్రమాదవని బోదించడం మొదలెట్టేరు.
మొదట్లో ఎవరూ ఇనిపించుకోలేదు గాని ఇనగా ఇనగా మేక కుక్కవుతాది గదా!
పోనుపోను జనానికి ఆసుపత్రి పిచ్చిబాగా తలకెక్కేసింది. అవసరమైతే డాట్టరమ్మ పొట్టకోసి బిడ్డని తీస్తా ఉందని ఇని ఏంటీ ఇసిత్రవని అబ్బురపడిపోయింది తను. అదేటో సూడాలని ఎల్తే అసలు లోపలకే రానివ్వలేదు.
అలాగ….. మంత్రసానుల నోట్లో కరక్కాయపడింది. కొనాళ్లు బిడ్డలకి నీళ్లొయ్యమని పిలిపించీవోరు. ఆసుపత్రిలో కట్టిన ఏలకి ఏలు గుర్తుకొచ్చి కావోలు ఎరకల సానులకి ఒక పాతకోకతో సరిపెట్టడం మొదలెట్టేరు. అలాగ, వచ్చే బత్తేనికి గండడిపోయింది. మంత్రసానుల బతుకుల్లో నీళ్లొలికి పోయేయి.
లోవ మొదటి బిడ్డని కన్న వారం రోజులకి ఎంకడు పంది కరిసి సచ్చిపోయేడు.
ఏ ద్యాసలో ఉన్నాడో, ఎన్నో ఏళ్లుగా పందుల్ని మేపుతున్న ఎంకడు. ఆటి ఆనుపానులన్నీ తెలిసినోడు, అప్పుడే ఈనిన పంది పొట్ట కింద ఒక కూన నలిగిపోతందని, దాన్ని బైటికి తీద్దారని సరాసరి పందికాడికి ఎల్లిపోయేడు. ఈనిన పంది, కూనల్ని ముట్టుకుంటే చీల్చి చెండాడేస్తాదని తెలుసాడికి. అందరికీ జాగర్తలు చెప్పీవోడు, ఆరోజులాగ సావు తోసుకొచ్చినట్టుంది.
పంది పేట్రేగిపోయి తొనలు తొనల కింద ఎంకడి కండల్ని ఊడబెరికేసింది. రక్తాలు కారుకుంటూ వాకిట్లోకొచ్చి పడిపోయినోణ్ని మంచం సవారి కట్టి జిల్లా ఆస్పత్రికి మోసుకెళ్లేరు. నాలుగు రోజులు బాదపడి బాదపడి పేణం వొదిలేసేడు.
కోరి తెచ్చుకున్న అల్లుడు అనువైనోడు కాకపోయేడు. పది రూకలు కళ్లబడితే తాగేసి జెల్సా చేసేసీరకం. క్రమంగా దొడ్లోని పందులన్ని ఆడి జెల్సాలకి తరిగిపోయేయి. ఆనక సేతిలో డబ్బులాడక పెంకులమిల్లులో మట్టిపనికి కుదురుకున్నాడు. ఎళ్లిన్రోజు ఎళ్లీవోడు లేపోతే లేదు. వారం నాడొచ్చిన బట్వాడా డబ్బులు దాసుకుని తాగుడికి కర్సుపెట్టుకునీవోడు.
‘అయ్యో ఎనకాల పెళ్లం వుంది. నలుగురు బిడ్డలున్నారని ద్యేసే లేదాడికి, కుల పెద్దల చేత కాత్త గడ్డెట్టితేనైనా దార్లో కొత్తాడేమోనని పంచాయితి పెట్టిత్తే ఏవన్నాడు! “ఇల్లరికం, కూకుని తిండవే అని అట్టుకొచ్చి నా బతుకు అద్దాన్నం సేసేసేడు ముసలోడు. నాకేటి ఈ బాదరబందీ? ఉండమంతే ఉంతాను, నేదంతే మాయూరికి పారెల్లిపోతాను” అని డంకా బజాయించి సెప్పేసేడు.
ఇంక చేసీదేం లేక లోవ పురుళ్లు పోసే మెలుకువలన్నీ నేర్చుకుంది. ఏం లాబం. మంత్రసాని పనికి ఎరకల సానుల్ని ఎవళూ పిలవటం మానేసేరు గందా!
నెలజీతాల మీద నర్సులే ఇంటికొచ్చి పిల్లలకి తానాలు కూడా చేయించేస్తన్నారు. ఏటో, కాలం మారిపోయింది. పసిబిడ్డలకి ఒళ్లంతా నూనో నెయ్యో పట్టించి నలుగుపిండితో నలిచి నలిచి తానాలు చేయించీ రోజులు ఎళ్లమారిపోయేయి.
నర్సమ్మల తెల్లబట్టల మోజులో పడి ఎరకల సానులకి శుబ్రం తెలవదంటన్నారు. ఆళ్లకున్న సదుపు ఈళ్లకి లేదని పిర్యాదు.
“కానుపులు సెయ్యటానికి సదువులెందుకో నాకు అంతుపట్టదు” అనుకుంది సుక్కమ్మ.
రక్తంలో కశ్మలంలో సేతులెట్టి చేసే ఆ పనిలో సదువుకున్నోళ్లకి ఆనందవేంటో” అని కూడా అనుకునేది. కాని, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు కనలేక చచ్చిపోయే తల్లులెందరో డాక్టరమ్మల మూలాన బతుకుతున్నారని తెలుసుకున్నాక ‘ఆళ్లకి సేతులెత్తి దండవెట్టాల’ అనేది.
“మామ్మా, నూకలజావ తాగుతావేటే’ అని గిన్నెతో పట్టుకొచ్చింది పక్కింటి మాలచ్చి.
చెయ్యందించి లేపి కూర్చోబెట్టి, ఒళ్లో గిన్నెపెట్టి “తాగు” అని వెళ్లిపోయింది.
“మామ్మా నాకో… నాకో…” అని దగ్గర చేరిపోయేరు శీనయ్య, కిట్టయ్య.
కోటా బియ్యపు నూకల జావ కాబోలు, చవి చచ్చిపోయి మందువాసన కొడతా ఉంది. మూడు వేళ్లతో ఒక ముద్దతీసి నోటికి రాసుకుని గిన్నెని పిల్లలకిచ్చేసింది సుక్కమ్మ,
కలిసిరాని కాలం మళ్లీ కళ్లముందుకొచ్చింది.
క్రమంగా ఊరు పెరిగింది. హాస్పిటళ్లూ పెరిగేయి. ఇది పనికాదని, హాస్పటళ్లకిల్లి పని ఇప్పించమని అడిగేవారు తల్లి కూతురూ. అక్కడ కాన్పుల దగ్గర డాక్టరమ్మలకి సాయంగా నర్సులున్నారు పొమ్మన్నారు. కశ్మలం కడగటానికి కూడా ఎరకల సాన్లు పనికి రాకపోయేరు. ఈ పనికి తోటీలున్నారంట.
ఇటు పండక్కో పబ్బానికో ఇళ్లకెత్తే ఓ గారి ముక్కో, ఓ గరిటెడు పరవాన్నమో విదిలించి పొమ్మనేవారు.
రెండు చేతుల్తో రెండు పెద్ద పందుల్ని ఎత్తిపడేసే సుక్కమ్మ కమ్ముకొచ్చిన కాని కాలాన్ని జీర్ణించుకోలేక మనోవ్యాధితో క్రమంగా కృశించిపోసాగింది.
లోవ కడుపున నలుగురు పుట్టినందుకు మొదట సంతోషించినా, ‘దేవుడా, దాన్నెత్తిన ఇంత బలువెట్టేవెందుకురా’ అని ఏడుస్తుందిప్పుడు.
మనవల ఆకలి చూడలేక బుట్ట చంకనేసుకుని యాయవారానికి బయలుదేరింది. ఇంటికో గుప్పెడు గింజలేసినా పిల్లల పొట్టలు ఎళ్ల మారిపోయీవి. సుక్కమ్మ మంచవెక్కేక యాయవారం బుట్ట లోవ చేతికొచ్చింది. అత్తారబతంగా పెరిగిన లోవ అడుక్కోడానికి బయలుదేరిన రోజు కుళ్లి కుళ్లి ఏడ్చింది సుక్కమ్మ. లోవ మధ్యాహ్నం దాకా తిరిగినా సోలెడు గింజలైనా పడేవి కావు బుట్టలో. “దున్నపోతుల్లాగున్నవాళ్లూ అడుక్కోడమే, పనో పాటో చేసుకోరు” అనే సాధింపులు విని విని ఇంక వెళ్లడం మానేసింది లోవ.
కూలికో నాలికో ఎళ్లడం అలవాటు చేసుకుంది. దొరికిన్నాడు తినడం, దొరకన్నాడు కడుపులో కాళ్లెట్టుకుని పడుకోవడం చేసింది కొన్నాళ్లు. రాత బాగుండి నాలుగిళ్లలో పాచిపని దొరికింది. ఎవరాగినా సుక్కమ్మ ఆకలికి ఆగలేకపోతుంది. తెల్లారి లేచిన కాణ్నుంచి ఆకలో ఆకలో అని ఒకటే గోల.
దొడ్డిన దొడ్డెడు పందుల్ని అమ్మేసేడు అల్లుడు. పందుల్లేని దొడ్డెందుకని దాన్నీ అమ్మేసేడు. పందుల్లేని ఎరకల బతుకు పరువులేని బతుకని నలుగురూ నవ్విపోతారని రెండుపందుల్ని మాత్రం ఉంచుతాడు ఎప్పుడూ. అవి పెట్టే పిల్లల్ని అమ్ముకుని జల్సాలు చేసుకుంటాడు.
రోజుల లాగా ఎళ్లమారిపోయినా బాగుండును. పులిమీద పుట్ర లాగా కాని కాలానికి ఇడ్డూరపు రోజులొచ్చేయి.
వానల కాలంలో పిల్లాజెల్లా జొరాల్తో మంచాలెక్కితే దానికి కారణం పందులే అంటన్నారు. మురిక్కాలవలెక్కువై దోమలు పెరిగిపోతే దానికి కారణం పందులేనంట. ఆరుబయలు అశుద్ధాల్ని శుభ్రం చేసే పందులే లేకపోతే ఊళ్లన్నీ కంపుగొట్టిపోతయ్యని ఏలిన వారికి ఎరుకలేకో ఏమో ఉన్నట్టుండి కనబడిన పందుల్ని కనబడినట్టు కాల్చి పారేయమని ఆర్డర్లేస్తున్నారు.
దొడ్లున్నావోళ్లు చచ్చీ చెడి ఆ నాలుగురోజులూ మూసి పెడుతున్నారు. అయినా, పందుల్ని ఆపడం ఎవడితరం? దడుల్ని ఇరగ్గొట్టుకుని లగెత్తుకు పోతాయి. పందుల్ని మేపుకొనే వాళ్లెంతమందికి దొడ్లుంటాయి? బతకడానికి గ్రాసం లేక పల్టీలు కొడతా ఉంటే పందుల పెంపకం ఎవడి తరం? ఏదో అలాగ నాలుగు పందిపిల్లల్ని కొనుక్కోడం, ఊరి మీదకి వదిలెయ్యడం, పంది బాగా బలిసేక అమ్ముకుంటే నాలుగు డబ్బులొస్తాయి.
మనిషన్నాక ఒక కన్ను నొవ్వచ్చు, కాలునొవ్వచ్చు. ఎప్పుడేం అవసరం వస్తాదో చెప్పలేం కదా! అలాంటి కష్టసమయంలో ఆదుకునేదే పందుల పెంపకం. ఎరకలోళ్లకయ్యి దాచుకున్న సొమ్ముల్లాంటియ్యి. ఆటిని చంపి పారేస్తుంటే పందులు పెంచేవోళ్లందరికీ జీవాలుడిగిపోతున్నాయి.
అందుకే అలాంటి సందర్భాల్లో దగ్గర్లో ఉన్న చిట్టడివిలోకి పందుల్ని తోలేసి వస్తున్నారు. నాలుగు రోజులు అందమ్మట అందమ్మట దుంపలు, రాలిపడిన కాయలు కొరికి బతికితే, ఆ గండం గట్టెక్కేక ఇంటికి తోలి తెచ్చుకుంటున్నారు.
బూమీ పుట్రా ఉన్నవోళ్లందరూ ఆకాశం కేసి చూస్తా వానలుపడాలని కోరుకుంటుంటే, పందులున్నోళ్లు మాత్రం వానలు పడొద్దని, ఒకవేళ పడ్డా జొరాలు రావద్దని ఎయ్యిదేవుళ్లకి మొక్కుతున్నారు.
అదంతా ఎపుడిష్టం? దేముడు కురిపించీవోనని ఎవడాపగల్డు?
వానలు పడనూ పడ్డాయి. జొరాలు రానూ వచ్చేయి.
ముందుగా ఊళ్లో మాంసం కొట్లూ, చేపల దుకాణాలు ఎత్తించేసి ఇంక పందులమీద పడ్డారు మారాజులు.
ఉప్పందగానే రేతిరికి రేతిరి గప్పుచిప్పుమని పందుల్ని అడవిలోకి తోలేసేరు ఎరకలోళ్లు.
కాని కాలానికి ఉపద్రవం రాసిపెట్టుంటే ఎవడూ తప్పించలేడని… కమ్మల దాసోళ్ల బులినాగన్న పందులు నాలుగు ఊళ్లోకి పారొచ్చేయంట, ఆటిని గవుర్మెంటోళ్లు యదాప్రెకారంగా చంపేసేరు. బులినాగన్న ఇంటందరూ లబోదిబోమని శవం ఎళ్లినట్టు ఏడ్చి మొత్తుకున్నారు.
“అయిందేదో అయిపోయింది, కర్మం అలాగుంది” అని కులపోళ్లందరూ ఎల్లి ఆళ్లని ఓదార్చి వొచ్చేరు.
రాత్రి కల్లు పాకలకాడ పుట్టింది ముసలం.
బులినాగన్నకి ఎవడో చెప్పేడంట, సుక్కమ్మల్లుడు అప్పన్నగాడు నీ పందులు ఊళ్లోకి రాగానే సంపీవోళ్లకి ఉప్పందించేడు” అని.
“అవును, ఆసూకీ సెప్పినోడికి పందికి పది రూపాయలిత్తారు. ఆడసలే తాగుబోతెదవ” అని మాదగాని చిట్టియ్య వత్తాసు పలికేడు.
అంతే, బులినాగన్న అగ్గిమీద గుగ్గిలమైపోయి ఆడి గుడిసెకి లగెత్తి పెణకలో ఉన్న పందుల్ని నరికే కసాయి కత్తిని బొడ్లో దోపుకుని సారా కొట్టుకాడికి లగెత్తేడు. అక్కడాడు కనపడక పోయీసరికి అదే పరుగుమీద తిన్నంగా సుక్కమ్మ ఇంటి వాకిట్లో కొచ్చి నిలబడ్డాడు.
అప్పటికే తాగొచ్చి గుడిసె గుమ్మంలో జోగుతున్న అప్పన్నని జుట్టుపట్టుకుని లెగదీసి ఆడి జేబులో చెయ్యేట్టేడు. మూడు ఐదు కాయితాలు బైటికొచ్చేయి.
అది చూసి లోవ “ఓరి సచ్చినోడా! జోబులో డబ్బులుంచుకునే బియ్యానికి డబ్బుల్లేవని అబద్దాలాడతన్నావా, నీ మొకం దాసెయ్యా” అని తిట్లకి లంకించుకుంది.
అంతే, బులినాగన్న అసలే ఏడిమీదున్నాడేమో, అప్పన్న జేబులో డబ్బులు కనపడేసరికి ఇంక రుద్రావతారమెత్తేసి అప్పన్నని ఎనక్కి తోసి, బొడ్లో కత్తిని లాగి ఆడిమెడమీద ఒక్కవేటు ఏసేసేడు. మెడమీద బలమైన వేటుపడిన పందిలాగ రక్తంలో గిలగిల కొట్టుకుని ప్రాణాలు వదిలేసాడు అప్పన్న.
జరిగిందేంటో అర్థమయ్యేక కదల్లేని సుక్కమ్మ తప్ప అప్పటిదాకా చోద్యం చూస్తున్న జనాలందరూ కకావికలైపోయి దొరికిన దారినల్లా పట్టుకుని పరుగులెట్టేసేరు.
అది చూసేక సుక్కమ్మకి నడుంలో ఏ కొంచెమైనా పట్టు అనేది ఉంటే అది కాస్తా వదిలేసింది.
బులినాగన్నని పోలీసులు పట్టుకుపోయిన వార్తని పేపర్లో చదివి “వెధవ పందుల కోసం మనుషులు నరుక్కోవడం ఏమిటో” అని నాగరికులంతా ముక్కున వేలేసుకున్నారు.
లోవ చేత పని చేయించుకునే పెద్దిళ్లవోళ్లందరూ పొద్దు పొడిచే ఉదయ సంధ్యవేళ, సాయంకాలం అసుర సంధ్యవేళ మొగుడు చచ్చిందాని మొహం మూడునెల్లదాకా చూడకూడదని, అందాకా పనిలోకి రావద్దని కబురు పెట్టేరు. హడలెత్తిపోయి తనకి బదులుగా ఆడపిల్లలిద్దర్నీ పంపింది. ‘పిల్లలు పని బాగానే చేస్తున్నారు కాని గుంట పిల్లల్చేత పనులు చేయించుకుంటే కేసవుతుంది” అని తిప్పి పంపేసేరు.
అదిగో, అక్కణ్నుంచి మొదలయ్యేయి పాట్లు.
ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడిన లోవకి చేద్దామంటే పనిదొరక్క, కుటుంబం గడిచే దారిలేక కటకటలాడుతున్నారు.
పోనీ మిల్లులో పనికెళ్దామంటే మిల్లులన్నీ మూతబడ్డాయి.
ఎప్పట్నుంచో పనుల్లో ఉన్న జనాలందరూ ఉన్నకాడికి గిన్నెలు, మంచాలు అమ్ముకుని ఊరొదిలి ఎక్కడెక్కడికో వలసలు పోతున్నారు.
దారీ తెన్నూ కానరాక విలవిల్లాడుతున్న లోవ దగ్గరికి ఒకరోజు మధ్యాహ్నం ఊరిచివర హైవేపక్కన పాకలో ఉండే నీలమ్మొచ్చింది.
తన పేరిప్పుడు నీలవేణి అంట, మంచి బలమైన మనిషి. ఒకప్పుడు అప్పన్న చేసే మిల్లులోనే పని చేసేది.
వాలుజడలో మూరెడు కనకాంబరాల మాల పెట్టుకుంది. నలుపురంగు అంచున్న తెల్లచీర కట్టింది. దట్టంగా పౌడరు పూసుకుని కళ్లనిండుగా కాటుక, మెరిసే బొట్టు పెట్టుకుంది. ఎదిగిన కొడుకు పెళ్లాంతో కాపరం చేసుకుంటున్నాడు. ఆడి సంపాదన ఆడికే చాలక పిల్లిమొగ్గలేస్తున్నాడు.
పాత పరిచయాన్ని పురస్కరించుకుని “ఏం మరదలా, బాగున్నావా?” అని పలకరించింది లోవని.
సుక్కమ్మ మంచం మీద ఇటు ఒత్తిగిల్లి ఎగాదిగా చూసింది నీలమ్మని.
“ఏం బాగులే. ఇదిగో ఇలాగ…. అని మూలిగింది లోవ. “ఈ కుర్రెదవల్ని పెంచడమెలాగో దారీతెన్నూ కానరాకుంది”.
“ఏటో తమ్ముడు పోయేడని తెల్సిన కాణ్నుంచి నిన్ను పలకరించటానికి రావాలని ప్రయత్నం, ఉప్పుడుకైంది”.
సుక్కమ్మ గొంతులోకి రాని దగ్గు తెచ్చుకుని గట్టిగా సకిలించింది. ఎప్పుడూ తల్లిని తీసి పారేసే లోవ ఆ సకిలింపు ఇని తల్లికేసి భయం భయంగా చూసింది.
ఆ మాటా ఈ మాటా అయ్యేక, వెళ్లేముందు పిల్లలు నలుగురి చేతుల్లో నాలుగు పదులెట్టింది నీలమ్మ. వాళ్లమొహాలు ఆనందంతో విచ్చుకున్నాయి.
వెళ్లిపోతున్న నీలమ్మని “వదినే, ఆగు” అని పిల్చింది లోవ.
ఆగిన నీలమ్మ దగ్గరకెళ్లి “నాక్కూడా ఏదన్నా ఒకదారి సూపించవా” అంది. లోవ కళ్లల్లోకి నీళ్లు ఉబికి వచ్చేయి.
నీలమ్మ జాలిగా లోవ భుజం తట్టింది. “బయ్యం పడకు, మనలాటి దిక్కూ దివాణం లేనోళ్లందరికీ ఆ దేముడెట్టిన వరం అయివే, దానిమీద నడిచే లారీలూను. ఏం సేస్తాం సెప్పు. మనసు రాయి సేసుకోవాల” అని ఓదార్చింది. “రాత్రికి ఒంటికి సబ్బు రాసుకుని నీళ్లోసుకుని ఉతికిన సీర కట్టుకుని నాపాక కాడికొచ్చేయ్” అంది.
లోవ వెనక్కి తిరిగి తల్లివైపు చూడకుండా ఇంట్లోకెళ్లి తలుపేసుకుంది.
వాళ్లెంత గుసగుసగా మాట్లాడుకున్నా సుక్కమ్మ పాముచెపుల్లో ఆ మాటలన్నీ పడ్డాయి.
ఉన్నట్టుండి సుక్కమ్మ ఏడుపురాగం మొదలెట్టింది.
దేవుడా! ఓరి మాయదారి దేవుడా!
పుట్టించీవోడివి నువ్వే అంటారు దేవుడా!
నేను పుట్టీటప్పుడు నా తల్లికడుపులోని మురుగు నీటిని సీల్చుకుని ఎలాగ బైటికొచ్చేనో నాకు గెవనం లేదు దేవుడా!
ఉప్పుడీ తోలుతిత్తి మురిగ్గుంటలోపడి ఈ పేణం ఒకటే కొట్టుకులాడతంది దేవుడా!
నీకే గనక నిజంగా మంత్రసాని పని వచ్చుంటే
ఈ మూలబడిపోయిన దేహంలోంచి దేవుడా
జీవుణ్ణి సునాయాసంగా బైటపడెయ్యి దేవుడా
అప్పుడే నీ సేతి సలవ రుజువౌతాది దేవుడా
నీ మొగోడితనం రుజువౌతాది దేవుడా
దేవుడో… ఓరి మాయదారి దేవుడో….
*****
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, జనవరి 23, 2004
పులికంటి కృష్ణారెడ్డి అవార్డు
*****
అయ్యగారి వసంతలక్ష్మి
24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను.
హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను.
పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా 2010 లో గావించాకా పలు టీవీ చానెళ్లలో రాజకీయాలపై ప్రసారమైన కామెడీ కార్టూన్లలో పలువురు మహిళా నాయకుల .. మరెందరో యితరకార్టూన్ క్యారెక్టర్లకు గళపోషణ గావించి తెలుగురాష్ట్రాల్లో ఏకైక మహిళా మిమిక్రీ కళాకారిణి గా పేరు తెచ్చుకున్నాను.
సంగీతమంటే ప్రాణం. వంటిల్లు వదలడం అంటే బాధ!లలితమైనా శాస్త్రీయమైనా ..పాట విని నేర్చుకుని పాడగలిగే ప్రతిభ వుంది. ప్రస్తుతం యేడాదిగా వసంతవల్లరి పేరున యూట్యూబ్ చానెలు పెట్టి పలువురు ప్రముఖుల కథలను నా గళంలో అందిస్తున్నాను.