షర్మిలాం “తరంగం”
-షర్మిల కోనేరు
వెంటాడే అపరిచితులు
జీవనయానం లో మనకు తారసపడే అసంఖ్యాక జనప్రవాహంలో కొందరుజీవితాంతం గుర్తుండి పోతారు. ఒకపోర్టర్, డ్రైవర్ , రిక్షావాలా ఎవరైనా కావచ్చు.వాళ్ళు చేసిన ఉడతసాయం జీవిత కాలం తలపుల్లో మిగిలిపోతుంది. సహ ప్రయాణీకులు గమ్యంవచ్చినాక దిగిపోతారు. కానీకొందరు మాత్రం మన మనసులో తిష్ట వేసుకుంటారు .ఇలాంటి అనుభవాలు అందరికీవుంటాయనుకుంటాను.
మా నాయనమ్మ ఏడేళ్ళ చిన్నపిల్లగా వున్న నన్ను వెంటబెట్టుకుని వెస్ట్ బెంగాల్ దగ్గర అస్సాం అనుకోండి ఒంటరిగా బయల్దేరింది. మాకు తోడు వస్తాడనుకున్నాయన హేండిచ్చాడు. మా నాయనమ్మకి హిందీ రాదు. హౌరా స్టేషన్లో రైలు మారాలి.
ఇప్పుడు ఏ ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్ పోర్ట్ లోనో చదువు రాని వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కినంత పని. పైగా హౌరా రైల్వే స్టేషన్ ఒక మహా సముద్రం. మోసగాళ్ళు , దొంగలు ఎక్కువనిచెప్పారు. అప్పుడో పోర్టర్ మమ్మల్ని ఆదుకున్నాడు. దేముడల్లే వచ్చి అర్ధరాత్రి జల్పాయిగురీ వెళ్ళే రైలు పెట్టెలోకి ఎక్కించి, వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళాడు.
ఒక సారి నేను పసిపిల్లనేసుకుని పొరుగూరికి లగేజీతో బయల్దేరా. సూట్కేస్ హాండిల్ వూడి పోయింది. బస్ దిగాలంటే ఒక చేతిలో పిల్ల, ఇంకో బ్యాగ్ , సూట్కేస్ ఎలా పట్టుకోను ? ఈలోగా ఓ ధర్మాత్ముడు రిక్షా వాలా రూపంలో ఆదుకున్నాడు. సూట్కేస్ నెత్తిన పెట్టుకుని , బ్యాగ్ తీసుకుని రిక్షా లో ఇంటి దగ్గర దించాడు. ఇంకొకరయితే ఆ అసహాయ స్థితిని ఆధారంగా చేసుకుని ఎంత అడిగేవారో. ఒక్క రూపాయి అడగకుండా దించి తనకు రావాల్సినది మాత్రమే తీసుకున్నాడు. ఆ సాయం చేసిన పుణ్యం మాత్రం పట్టుకుపోయి ఇప్పటికీ గుర్తున్నాడు.
మొత్తం మా నాన్నగారి కుటుంబం మొత్తం ఒక డజను మందిమి కేరళ ట్రిప్ కి వెళ్ళాం. ట్యాక్సీమాట్టాడుకుందామనిచూస్తే”నాన్ దా తెలుంగే !”అంటూ ఒక 30 ఏళ్ళ కుర్ర ట్యాక్సీవాలా పరిచయం చేసుకున్నాడు.
సరే తెలుగువాడినంటున్నాడు కదా అని అతన్నే మేము లోకల్లో తిరగడానికి మాట్లాడుకున్నాం. అతని పేరురాజు.ఒక్కరోజుకోసంమాట్టాడుకున్నాంగానీమేంకేరళలోవున్నవారంచివరికితమిళనాడులోమధురైవరకూవచ్చిమమ్మల్నివైజాగ్రైలుఎక్కించివెళ్ళాడు.అతని బొలోరోలో మొత్తం పిల్లామేకా అంతా కుక్కుకుని ప్రయాణించేవాళ్ళం. మళ్ళీ దానినెత్తిమీదఅంతెత్తులగేజీ.
అయినా సరే విసుక్కోకుండా మమ్మల్ని అపురూపంగా చూసుకున్నాడు.అక్కడతిరిగినన్నాళ్ళూ రామ నామ స్మరణలా రాజు నామ స్మరణ చేశాం.
మేంవచ్చేసేటప్పుడుకన్నీళ్ళు పెట్టుకుంటూ మమ్మల్ని రైలు ఎక్కించాడు. అంతే ఇప్పటివరకూ మేమూ అతనూ కూడా మాట్టాడుకోలేదు. కానీ మాకు కేరళ అంటే రాజు గుర్తొస్తాడు. కొన్ని బంధాలంతే!
ప్రయాణాల్లో కూడా ఆ పదిగంటల్లోనే మన కష్టసుఖాలన్నీ పంచుకుని చేరువవుతారు కొందరు . ఒక దంపతులు రైల్లోపరిచయం అయ్యారు. కుర్రాడు రైల్వేలో, అమ్మాయి ఏదోగ్రూప్పరీక్షలకి సిద్ధమవుతుంది. ఫోన్నంబర్లుతీసుకున్నాం. ఇదిజరిగిచాన్నాళ్ళయ్యింది. మొన్నామధ్యవైజాగ్ లోగ్యాస్లీక్అ య్యింది.అప్పుడో ఫోన్వచ్చింది. ఎలా వున్నారు క్షేమమా ? అని నిజంగా ఎంత ఆనందమేసిందో.
ఫ్లైట్ లో ఒక తమిళియన్ ఆమెతో 13 గంటలు కలిసి ప్రయాణం చేశాను. తను కెనడాలో సెటిల్ అయిన కుటుంబం. ఇండియాలో బంధువుల దగ్గరికి వస్తోందట. నేను అప్పుడు చాలా ఆవేదనలో వున్నాను. కష్టసుఖాలు మాట్లాడుకున్నాం, మీరు నమ్ముతారో లేదో ఒకరి కోసం ఒకరు కన్నీళ్ళు పెట్టుకున్నాం. ఇప్పటికీ నన్ను పలకరిస్తూనే వుంటుంది. మనిషికీ మనిషికీ వుండే ఈ చిన్న చిన్న అనుబంధాలు ఒక్కోసారి మనసుకి ఎంత బలం ఇస్తాయి! అందుకే ఈ అపరిచితులు జ్ఞాపకాల్లో మనని వెంటాడుతూ ఆ బంధాల్ని మరిచిపోనీయరు.
*****
షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.