ఇట్లు మీ వసుధారాణి
ఉత్తరాల వేళ
-వసుధారాణి
ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ,ఉత్సాహం ఎక్కువగా ఉండే బాల్యావస్థలో చక్కటి మార్గదర్శనం చేయటానికి మాకు దొరికిన మార్గదర్శి మా కృష్ణానందం బావగారు.మా రెండవ అక్కయ్యా,బావగార్లయిన సావిత్రి,కృష్ణానందం (ఇద్దరూ జువాలజీ లెక్చరర్లు)వాళ్ళ పిల్లలు చిన్నారి,కిషోర్ తో పాటు నన్ను కూడా వారింట పుట్టిన పిల్లలా చూసేవాళ్ళు.మా బావగారు పిల్లల పెంపకం గురించి మా కాలం కంటే చాలా ముందు ఆలోచనలు చేసి మా ముగ్గురి పెంపకం కొంచెం ప్రయోగాత్మకం చేశారు.
చదువు,ఆటలు వీటితో పాటు లోకజ్ఞానం,ఆత్మవిశ్వాసం,ఆత్మస్ థైర్యం, ఆత్మరక్షణ ఇటువంటి విషయాల్లో శిక్షణనిచ్చారు మాకు.మంచి పనులు,అల్లరిలోకూడా తెలివైన అల్లరి చేస్తే సంతోష పడి పోయే మా బావగారు , మేము తప్పుచేస్తే మాత్రం జస్టిస్ చౌదరి అవతారం ఎత్తి క్లాసుపీకే వాళ్ళు.మా కాలంలో మిగిలిన పిల్లలకు ఊహామాత్రంగా కూడా తెలియని విషయాలు మాకు అనుభవంలోకి తీసుకురావటంలో మా బావగారి హస్తం ఉంది.
మేము రెండు మూడు తరగుతులకు వచ్చేసరికి పోస్ట్ ఆఫీసుకు వెళ్లి కార్డు కొనుక్కుని మా ఉత్తరాలు మేమే రాసుకుని పోస్ట్ చేసుకోవాలని నేర్పించారు.రిజిస్టర్ పోస్ట్ చేయడం, టెలిగ్రామ్ ఇవ్వటం అన్నీ నేర్పించారు.టెలిగ్రాఫ్ మిషన్ పనితీరుతో సహా చూపించారు.మాకు మేమే ఉత్తరాలు రాసుకుని పోస్ట్ చేసుకుని ,పోస్ట్ మ్యాన్ కనపడినప్పుడల్లా వెంకటేశ్వర్లు మాకేమయినా ఉత్తరాలు వచ్చాయా వచ్చాయా అని అడుగుతూ ఉండేవాళ్ళం.మాకు మేమే ఉత్తరాలు రాసుకున్నప్పుడు మనల్ని మనం ఎక్కువ చేసుకోపోతే ఎలా అని స్కూల్ ఫస్ట్ వచ్చినట్లు,రకరకాల ప్రైజులు వచ్చినట్లు రాసుకునే వాళ్ళం.
ఇప్పుడు అంటే పిల్లకి ఈత కొలనులలో తర్ఫీదు ఇచ్చేవారిని పెట్టి మరీ ఈత నేర్పిస్తున్నారు.మాకు మా బావగారు ఈత నేర్పించటానికి ఎంచుకున్న ప్రదేశం నాగార్జున సాగర్ కాలువ.కాలనీ కాలువ అనేవాళ్ళం అక్కడకు తీసుకువెళ్లి మా అంతటమేమే ఈత నేర్చుకోవాలని కాలువలో స్నానం చేయమనే వాళ్ళు . మేము ఈత నేర్చింది ఎలా ఉన్నా ప్రవాహానికి దిగువవైపు చేతులు నీళ్లలోకి నేలకు అనేలా పెట్టి కాళ్ళు నీళ్ళ పైకి తేల్చి చేతులతో నీళ్ళల్లో ముందుకు సాగడం మా ఈత.నీళ్ళల్లో చేప పిల్లల మల్లే ఆడుకునే వాళ్ళం.
సినిమాలు ఈ టాపిక్ లో కూడా మా బావగారి వల్ల మేము చాలా ప్రత్యేకం.నెలకి రెండు సార్లు మా ఊరి ఈశ్వర మహల్ వాళ్ళు తీసుకొచ్చే ఇంగ్లీష్ సినిమాలు పిల్లలు చూడదగ్గ సినిమాలు తప్పకుండా మాకు చూపించే వారు మా బావగారు.గబగబా సాగే ఆ ఆంగ్ల సంభాషణలు మాకు అర్ధం అయ్యేలాగా అనువాదం చేసి చెప్పేవారు.అలా చూసిన సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమాలు,సూపర్ మ్యాన్,టెన్ కమాడ్మెంట్స్ ,చార్లీ చాప్లిన్ సినిమాలు,లారెల్ &హార్డీ ఇలా ఉండేవి.
ఇక ఆటలు కూడా మా కోతికొమ్మచ్చులు ,ఉడుం ఆటలు ఇలాంటి ఆటలతో పాటు టెన్నిస్, టేబుల్ టెన్నిస్,చెస్ ఇలాంటి ఆటలు కూడా నేర్పించి ఆడించేవారు. షాపులకు వెళ్లి వస్తువులు తెచ్చుకోవడం,నాణ్యత పరిశీలించి మరీ ఎలా కొనుక్కోవాలి నేర్పించారు.ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే సాహసాలు చేయటం ఉదా :మూడవ తరగతిలోనే మేము దీపావళి అప్పుడు తారాజువ్వలు అంటిచి చేత్తో పట్టుకుని విసిరివేసేవాళ్ళం.
మంచి ,శుభ్రమైన ఆహారం తినటం.శారీరకశ్రమ కలిగించే ఆటలు ఆడటం మాకు నేర్పిన క్రమశిక్షణ. ఆడపిల్లలం , మొగపిల్లలం అందరం సైకిల్ నేర్చుకోవాలి అని పాపం మేము ఆయన సైకిల్ ని ఎన్నిసార్లు కిందపడేసినా రిపేరు చేయించుకునే వారు కానీ మమ్మల్ని సైకిల్ నేర్చుకోవాల్సిందే అని చెప్పేవారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వారి డిపార్ట్మెంట్ అభివృద్ధి పథకాల్లో భాగంగా పెద్ద పెద్ద తపాలా డబ్బాలను మా వూర్లో నాలుగు రోడ్ల కూడళ్లలో చాలా ఏర్పాటు చేశారు.
నిలువెత్తు తపాలా డబ్బాలు మా కళ్ళ ఎదుటే రూపుదిద్దుకోవటం చూసిన మాకు ఆ తపాలా డబ్బాలో వేయటానికి మాకు మేమే రాసుకునే బోరింగ్ ఉత్తరాలు కాకుండా , వేరే ఇంకెవరికి అయినా ఉత్తరం రాయాలని కోరిక కలిగింది.వేరే ఊరులో వుండే వారికి రాస్తే వాళ్లు చదివేది మాకు ఎలా తెలుస్తుంది. అందువల్ల ఉత్తరం మజా మాకు ఏమి ఉంటుంది.
అందుకని ఊళ్ళో ఉండే వారికే సాధారణ ఉత్తరం కాకుండా ఓ అసాధారణ ఉత్తరం రాయటం ద్వారా మా ఉత్తరం వారిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో చూడాలి అనుకున్నాం.పిల్లలకి రకరకాల కారణాలకు బోలెడు మంది శత్రువులు వుంటారు ఎందుచేతనో!
ఇక మా ఉత్తర ప్రహసనం మొదలు ముందు ఉత్తరం ఎవరికి రాయాలో ఎంపిక అయింది.తరువాత ఏమి రాయాలో కూడా.మా బావగారి తర్ఫీదు వల్ల ఫ్రమ్ అడ్రెస్ రాయక పోతే మనం ఎవరో తెలియదు అని తెలుసుకున్నాం కదా, అందుకని ఫ్రమ్ అడ్రెస్ లేకుండా మేము అనుకున్న వ్యక్తికి , అనుకున్న సంగతులు అన్నీ రాసాం.
ఉత్తరం చేరిందా?
మా వీపులు విమానాలు అయ్యాయా?
వివరాలు వచ్చే నెచ్చలిలో ‘ఇట్లు మీ వసుధారాణిలో.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
కౌముది మాగజైనులో ‘జీవితరంగం’ వ్రాస్తున్న స్వరాజ్య పద్మజ గారు మీ అక్కగారా? మీరు వ్రాస్తున్న అమ్మమ్మగార్ల విశేషాలు, భాష ఒక్కలానే వున్నాయి. చాలా బాగా వ్రాస్తున్నారు. ఎంత స్ఫూర్తిదాయకమైన బాల్యం మీది!!
థాంక్యూ రమణి గారు….నెచ్చెలి లో ఇంకా వెనక్కి వెళితే ‘ఇట్లు మీ వసుధారాణి’ ఇంకా ఉంటాయి.
థాంక్యూ సర్..నెచ్చెలిలో ఇంకా వెనక్కి వెళితే ఇట్లు మీ వసుధారాణి నెల నెలా ఓ కబురు అందిచింది .
Hello 👋 Madam,
Just today, I have seen your story, very nice 👍 story. I really enjoyed and immersed in the experience which you wrote about the’Letters’.
awaiting for the next ….!!!
thank you 🙏