ఊరుపిలుస్తుంది
-కె.రూపరుక్మిణి
అది నివాస స్థలమే
నల్లని మేఘాలు ఆవరించాయి
చుట్టూ దట్టమైన చీకటి గాలులు
ఎక్కడా నిలబడే నీడ కూడా దొరకడం లేదు
కడుపు తీపి సొంత ఊరిని
అక్కడి మట్టి వాసనను గుర్తుచేస్తుంది
ఊరు *ప్రేమ పావురం* లా మనసున
చేరి రమ్మని పిలుస్తోంది
ఆ ..నల్లని దారుల్లో ఎక్కడి నుంచో
వలస పక్షులు దారికాచుకుంటూ
రక్తమోడుతూ వస్తున్నాయి
చూపరులకు ఎదో *కదన భేరీ* మ్రోగిస్తున్నట్లుగా
గుండేలవిసేలా నిశ్శబ్ద శబ్దాన్ని వినిపిస్తున్నాయి
ఏ దారిలో ..ఏ గమ్యాన్ని చేరాలని
తపన పడుతున్నాయో ఆ పాదాలు
మండువేసవిలో దాహం తీర్చే
మానవీయతను వెదుకుతొంది
చెంత చేరదీసి
స్వాంతన చేయలేని మనుషుల మధ్య
బ్రతుకు లేని బడుగు జీవి
పుట్టిన మట్టిని కన్న ఊరిని *సదా స్మరామి* గా …
ఎండమావుల వెంట బ్రతుకు బారాన్ని భయం గుండెలతో *నెల బాలుడి* ని సైతం చేత బట్టి
మరీ ప్రయాణం సాగిస్తున్నాడు
కమిలిన మొహాలు,.. ఎర్ర మట్టిని
బూడిదలా కప్పుకున్న దేహాలు
నలిగిన మనసులు,..చెదిరి బెదిరిన
బ్రతుకుభయంతో ఉన్న వారిని
ఆప్యాయంగా చేరదీయడానికి సిద్ధమై..
పల్లె మాగాణి మనసున్న అమృత పాత్ర లా
మానవీయత ను చాటుకోవలని ఆకాంక్షిస్తూ…
*****
Exlent