ఒక భార్గవి – కొన్ని రాగాలు -6

సింధుభైరవి

-భార్గవి

భైరవి అనేది శక్తి స్వరూపమైన దేవికి వున్న నామాలలో ఒకటి, అందుకేననుకుంటా అమ్మవారి మీద రాసిన ఎన్నో కృతులు ఈ రాగంలో స్వరపరచ బడ్డాయి, పైగా ఈ రాగంలో భక్తి రసం బాగా పలుకుతుండటం కూడా దానికి దోహదం చేసి వుండవచ్చు

ఇది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలున్న ఒక రాగం. హిందుస్థానీలో భైరవి అనీ, కర్ణాటక లో సింధు భైరవి అనీ పిలుస్తారు.  ఇది 8 వ మేళకర్త అయిన హనుమత్తోడి నుండీ జన్య రాగమయినప్పటికీ అన్య స్వరాలలో కూడా సంచారం కలిగి వుండటం చేత భాషాంగ రాగమంటారు. మొత్తం పన్నెండు స్వరాలను ఈ రాగంలో ప్రయోగించే వీలుండటం వలన ఈ రాగంలో బోలెడు రంగులూ, బోలెడు అనుభూతులూ ప్రతిఫలిస్తాయి.

ఒక ఆర్తినీ, ఒక ఎడబాటునీ, కరుణనీ, భక్తినీ, బాధనీ, దుఃఖాన్నీ ప్రతిఫలించే శక్తి వున్న రాగం, అయితే కొంతమంది ప్రణయ గీతాలను కూడా ఈ రాగం లో కూర్చడం విశేషం. ఉదయ కాలాల్లో పాడదగిన రాగంగా భావిస్తారు.కర్ణాటక సంగీతానికి చెందిన కచేరీలలో ఎందుకనో ఈ రాగాన్ని నెరవు, స్వరకల్పన చేసి విస్తరించి పాడరు, కానీ కచేరీ చివరలో ముగింపుగా భజన్స్ గానో, లలిత గీతం గానో పాడతారు. తాన్ సేన్ ఈ రాగానికి విశేష ప్రాచుర్యం కలిపించాడంటారు, మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన సంగీతంలో ఎక్కువగా వినిపించే రాగం అంటే అరేబియన్ సంగీతపు పోకడలలో  అలరించేది ఈ రాగమే నన్నమాట. తెల్లవారుఝామునే మసీదు  నుండీ వినిపించే అజా  ఈ రాగ ఛాయలనే  ప్రతిధ్వనిస్తుందంటారు , దివ్య ఖురాను ను పఠించేదీ ఈ రాగంలోనే అట.

కర్ణాటక సంగీతంలో త్రిమూర్తి త్రయంగా భావించే త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ ఈ రాగంలో స్వరపరిచిన పాప్యులర్ కీర్తన లేవీ  కనపడటం లేదు. అయితే త్యాగరాజస్వామి “దేశీతోడి రాగం”లో కూర్చిన “నమో నమో రాఘవాయ ” దాదాపు సింధు భైరవి లాగే వుంటుంది,త్యాగ రాజు తర్వాత కాలంలో ఈ రాగం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని ఒక భావన.

పురందరదాసు దాసు విరచిత “వేంకటాచల నిలయం” అనే కృతి చాలా పాప్యులర్

నారాయణ తీర్థ తరంగాలలో “కల్యాణ గోపాలం” అనే తరంగం సింధు భైరవి లో స్వరపరచినది ప్రసిధ్ధమైనది.

బాలమురళీ స్వరపరచి గానం చేసిన “నిజగాదసా యదు నందనే క్రీడతి హృదయా నందనే” అనే అష్టపదిని ,ఇష్టపడని వారుండరనుకుంటా

అన్నమయ్య పదాలు శ్రీరంగం గోపాలరత్నం నోట వినడం ఒక అనుభవం అనుకుంటే ,సింధుభైరవిలో చేసిన “సకలం హే సఖి జానామి “వినడం మధురానుభవం, రాగ స్వరూపాన్నంతా కుప్ప బోసిన పదం ఇది.

స్వాతి తిరునాళ్ కూడా ఈ రాగంలో చేసిన కొన్ని భజన్స్ బాగా ప్రచారంలో వున్నాయి,లాల్ గుడి జయరామన్ సింధుభైరవి రాగంలో చక్కని తిల్లానా చేశారు. ఇక హిందుస్థానీ సంగీతంలో ఈ రాగాన్ని భైరవి అంటారని చెప్పుకున్నాం కదా ,పండిట్ జస్రాజ్ దేవీ భక్తుడు ఆయన సింధుభైరవిలో గానం చేసిన “నిరంజనీ నారాయణీ ” అనే భజన్ వింటుంటే శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి,”జై మా” అని ఆర్తితో పిలుస్తుంటే కళ్లలో నీళ్లు గిర్రున తిరుగుతాయి,

పర్వీన్ సుల్తానా గానం చేసిన “భవానీ ,దయానీ” వింటున్నా అదే పరిస్థితి, అదీ ఆరాగానికి వున్న శక్తి. సరైన విద్వాంసుల చేతిలో ఆ రాగం అత్యున్నత స్థాయిలో అనుభూతులని రగిలిస్తుంది.

మన జాతి సమైక్యత ను ఉద్దేశించి ఆ మధ్య టి.వీ లో అనేక మంది గాయకులు పండిట్ భీమ్ సేన్ జోషి,బాలమురళీ తదితరులు నటిస్తూ గానం చేసిన “మిలే సుర్ మేరా తుమ్ హారా” కు ఆధారం ఈ రాగమే.!

ఎన్నో లలితగీతాలు ఈ రాగంలో కూర్చబడ్డాయి,లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీ దేవి గానం చేసిన “దయచూడుమయా తిరుమల నిలయా” వింటుంటే దయా రసం ఒలికి పోతున్నట్టు వుంటుంది.

జానపద గీతాలలో కూడా ఆనంద భైరవి తో పాటు విస్తారంగా ఉపయోగింపబడ్డ రాగం.

ఇక సినిమా సంగీతం విషయానికొస్తే యే భాషలోనయినా హిందీ లో గానివ్వండీ, మన తెలుగు  లో కానివ్వండీ,తమిళం లో గానివ్వండీ —సినిమా పాటలలో వివిధ రసాలను రక్తి కట్టించేలా,వివిధ సంగీత దర్శకుల చేత,  చాలా విస్తారంగా వుపయోగించ బడిన రాగం

మచ్చుకి కొన్ని ఉదాహరణలు చూద్దాం—

విరహాన్ని సూచిస్తూ చేసిన పాటలు———

 “*అనురాగాలు దూరము లాయెనా”—–విప్రనారాయణ—-భానుమతి, ఎ.యమ్ .రాజా —యస్ .రాజేశ్వరరావు.

“*జబ్ దిల్ హీ టూట్ గయా “—కె.యల్ .సైగల్ —షాజహాన్ —నౌషాద్

 *”నీ పేరు తలచినా చాలు “—-పి.సుశీల—ఏకవీర —-కె.వి.మహాదేవన్ .

*”లాగా ఛునరీ మే దాగ్ ఛుపావూ కైసే “–మన్నాడే–దిల్ హీ తో హై–రోషన్ (మన్నాడే పాడిన ఈ పాట యెన్ని సార్లు విన్నా తనివి తీరదు నాకు )

*జైసే రాధా నే మాలా జపీ శామ్ కీ—లతా—తేరేమెరే సపనే —-యస్ .డి బర్మన్

శృంగార గీతాలు—–

*.”వ్రేపల్లియ యెద ఝల్లన పొంగిన రవళీ”—–పి.సుశీల,యస్ .పి.బాలు—సప్తపది—–కె.వి.మహదేవన్

*.సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా నీవాయె—-పి.సుశీల—గుండమ్మ కథ-ఘంటసాల

.* రావె రాధ రాణీ రావె—జిక్కీ,ఘంటసాల –శాంతి నివాసం—ఘంటసాల

.*యాల యాల దిల్ లేగయా —మన్నాడే,లతా–ఉజాలా—శంకర్ జై కిషన్ .

.*హస్ తా హువా నూరానీ చహరా —-లతా,కమల్ బారోత్ —పారస్ మణి—లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

వేదనా భరిత గీతాలు—–

*నిన్నటి దాకా శిల నైనా నీ పదము సోకి నే గౌతమి నైనా—పి.సుశీల–మేఘసందేశం—-రమేష్ నాయుడు

*ఏమని పాడెదనో ఈ వేళ—పి.సుశీల–భార్యాభర్తలు—-యస్ .రాజేశ్వరరావు.

*ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికించి రాణించునా—పి.సుశీల–జరిగిన కథ —ఘంటసాల

*ఆప్ కీ యాద్ ఆతీ రహే రాత్ భర్ —ఛాయా గంగూలీ–గమన్ –జయదేవ్

*సావరే సావరే –లతా –అనూరాధ–రవిశంకర్

*నేనొక సింధు–పి.సుశీల–సింధుభైరవి—ఇళయ రాజా

ఉత్తేజ కరమైన గీతాలు

*జ్యోత్ సే జ్యోత్ జగాతే చలో —–ముఖేష్ ,లత –సంత్ జ్ఞానేశ్వర్ —లక్ష్శీకాంత్ ప్యారేలాల్.

*వందే మాతరమ్ —లతా, హేమంత్ బృందం—-ఆనంద మఠ్ –హేమంత్ కుమార్

భక్తి గీతాలు——-

*నడి రేయి యే జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో—-జానకి,ఘంటసాల–రంగులరాట్నం–రాజేశ్వరరావు,బి.గోపాలం.

*కాట్రినిలే వరుమ్ గీతం —యం యస్ సుబ్బలక్ష్మి —మీరా–కల్కి కృష్ణమూర్తి.

*జయ పాండురంగ ప్రభో విఠలా—-పి.సుశీల–సతీ సక్కుబాయి—యం.ఆదినారాయణ రావు.

చూశారు గదా యెన్ని రకాల అనుభూతులను ఈ రాగం రేకెత్తించ గలదో ,ఇన్ని రకాలుగా  పరిశీలించడం వలన రాగ స్వరూపం బాగా బోధ పడే అవకాశముంది.

మచ్చుకు కొన్ని మాత్రమే ఉదాహరించాను ఇంకా యెన్నో పాటలను సంగీత దర్శకులు ఈ రాగం ఆధారంగా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

మనసును రాగరంజితం చేసే ఈ సింధుభైరవి ఈ పాటికి మిమ్మలను తన మాయాజాలంతో కట్టి పడేసి వుంటుందని భావిస్తూ—–


*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.