కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

                                                                –  ప్రొ|| కె. శ్రీదేవి

జి. నిర్మలారాణి కథలు

జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదిహేనేళ్ళనుండి కథలు రాస్తున్నారు. జన్మస్థలం కోస్తాంధ్ర ప్రాంతమైనా రాయలసీమ  ప్రాంతీయ జీవితానికి ప్రాతినిధ్యం వహించే “గాజుకళ్ళు” లాంటి కథలు కూడా రాశారు. అనంతపురం నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. ఈమె రాసిన అన్ని కథలూ స్త్రీలకు సంబంధించనవే. “గాజుకళ్ళు”  కథ అనంతపురం వ్యవసాయ కుటుంబంలో వరుస కరువులతో వచ్చిన వ్యావసాయక సంక్షోభాన్ని దాని పర్యవసానంగా గ్రామీణస్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పరిణామాన్ని తత్ఫలితంగా పడిన ప్రభావాలను ఈ కథలో చెప్పారు.  స్త్రీలే కాదు మగవాళ్ళపై కూడా ఈ ప్రభావం అదికంగా వుంది. వ్యవసాయం  మూలపడటంతో, పనులకోసం పట్నచేరిన వాళ్ళు దొంగలుగా జీవితాన్ని వెళ్ళమార్చాల్సిన దీనత్వం కూడా చిత్రించబడింది. ఒకప్పుడు స్వయం సమృద్ధిగా ఎలాంటి లోటు లేకుండా బ్రతికిన గ్రామీణ వ్యవసాయదారులు  ఈనాడు ఎందుకూ కొరగాని వ్యదార్థ జీవులుగా జీవితాన్న్నివెళ్ళ మారుస్తున్న వైనాన్ని ఈ కథలో చిత్రించ గలిగారు.

తండ్రి పక్షవాతంతో మంచమెక్కడంతో పనికోసం పట్నం వెళ్ళిన నాగప్ప అక్కడ పని సంపాదించుకోలేక పొట్ట నింపుకోవటం కోసం జైలు జీవితాన్ని అనుభవిసున్నారు. దాంతో దొంగగా జీవించడం కంటే పల్లెలోనే కూలో నాలో చేసుకొని తన కుటుంబంతోనే గడపాలనుకుంటాడు. పదేళ్ళ తరువాత పల్లెలో అడుగుపెట్టిన నాగప్పకు పల్లెలో చోటుచేసుకున్న కరువు పరిస్థితి ఆశనిపాతం అవుతుంది.

నాగప్ప కళ్ళబడిన ఒక్కొక్క దృశ్యం రాయలసీమ పల్లెల్ని  వాళ్ళ వెతల్ని పరిచయం చేస్తాయి. ఒకప్పుడు సరిగ్గా అన్నం తినడంలేదని “ ఆప్యాయంగా కొసరి కొసరి తినిపించే తల్లి ఆకలంటూ పిల్లలేడుస్తుంటే, ఎప్పుడూ తిండి తిండి నన్ను చంపుకతినండి”.(పుట-34 “గాజుకళ్ళు” – జి.నిర్మలారాణి) అని పిల్లల్ని కొట్టి, తాను ఏడ్చే తల్లుల  నిస్సహాయతను, పేదరికన్ని ఈ కథ తెలియజేస్తుంది.

కూలీ నాలీ  చేసైనా తన చెల్లెలు లక్ష్మీకి, కన్న తల్లిదండ్రులకు అన్నానికి లోటులేకుండా చూసుకోవాలని  ఆశపడిన నాగప్పకు పల్లెలో కుటుంబాలకు కుటుంబాలు పనికోసం వలసపోయాయని తెలిసి విస్తుపోతాడు. కన్నబిడ్డలకు , తల్లిదండ్రులను కాపలాగా పెట్టిపోయిన వారు కనీసం గంజినీళ్ళకు కూడా డబ్బులు పంపలేకపోతున్నారని తెలుసుకోవటంలోని నిర్భరతను రచయిత దృశ్యాలు దృశ్యాలుగా పాఠకులకు దృశ్యమానం చేస్తున్నారు.

ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నపుడు ఇంట్లో నుండి నాగప్పకు తల్లితోపాటు మరో స్త్రీ మాటలు ఇలా వినబడతాయి.

“దుడ్లు కాదే వంటినిండా రోగాలిచ్చినారు. ఆరోగాలు, రొచ్చులకే ఆ దుడ్లన్ని అయిపోయినయ్యి చూడు! వాళ్ళ కోరిక తీర్చలేదని ఎట్లా వాతలు పెట్టినారో చూడమ్మా!…. వాళ్ళు మనుషులు కాదమ్మా రాక్షసులు మనుషుల్ని పీక్కుతినే దయ్యాలంట్లంటోళ్ళు. గిరాకితో సరిగ్గా నడుచుకోలేదని, యజమానురాలు చావగొడుతుంది. నేనింకా చావలేనమ్మా, యాడికైనా పారిపోతా. అదీ గాకుంటే ఇంత విషం తాగి సచ్చిపోదాం”. అంటూ నాగప్ప చెల్లెలు లక్ష్మి హృదయ విదారకంగా ఏడ్చే ఏడ్పులో కరువుయొక్క వికృత స్వరూపాన్ని తత్ఫలితంగా వారు అనుభవిస్తున్న, దుర్భర జీవితాన్ని గ్రామీణ యువతులు కరువు రక్కసి కాటుకు ఏ విధంగా గురవుతున్నారో ఈ కథలో  రచయిత చెప్పడం జరిగింది.

“ఎట్లా బతికిన వాళ్ళం చివరికెట్లా అయిపొయినాం…. తాను చావలేకనే కదా, కడుపు కూటికోసం చిల్లర దొంగతనాలు చేసింది. ఎవరైనా అంతేనేమో! నీతి నియమాలు పట్టుకొని, కూర్చుంటే కడుపెట్లా నిండాల? తమ లాంటోళ్ళు బ్రతికేదెట్లా వళ్ళమ్ముకొనే స్థితికి వచ్చినారంటే జీవితం ఎంతగా చితికిపోయుండాల…. ఏ మగదిక్కు లేకనే కదా ఇట్లా అయిపోయింది.” (పుట 36 “గాజుకళ్ళు” – జి. నిర్మలారాణి)అని తాము ఇన్నిరోజులు ఆచరించిన నీతినియమాల అతిక్రమణకు కారణమైన పరిస్థితుల ప్రాబల్యాన్నిఅర్థం చేసుకుంటాడు నాగన్న. ఈ పై క్రమాన్ని చిత్రించే సందర్భంలో  రచయిత ఆర్థికకారణాలు అంతిమంగా నైతిక విలువల సంక్షోభానికి కారణమౌతున్న, వైనాన్ని కూడా చర్చించటం జరిగింది. మనుషుల మధ్య సహజంగా వుండే మానవీయ స్పర్శ, సెంటిమెంట్లు లాంటి అంశాలు కరువు నేపథ్యంలో ధ్వంసమయి, అమానుష, ప్రవర్తనలకు లోనవుతున్న తీరును, కరువు కారణంగా పర్యవసిస్తున్న పరిణామక్రమాన్ని కూడా నిర్మలారాణి “గాజుకళ్ళు” కథలో ప్రతిఫలిస్తాయి.

కన్నకూతుర్ని కడుపు నింపుకోవటం కోసం వ్యభిచార గృహానికి తరలించటం అంటే, కరువు యొక్క తీవ్రతను చెప్పడానికి ఇంతకన్నా మించిన ప్రమాణం వుంటుందని ఏ సామాజిక శాస్త్రవేత్త చెప్పలేడు. మరీ ముఖ్యంగా భూసామ్య వ్యవస్థ కనుమరుగు కాని రాయలసీమ పల్లెల్లో ఐదువేలు కోసం కన్నకూతుర్ని వేశ్యగృహానికి పంపడం ఒక ఎతైతే, తీసుకున్న ఐదువేలు తిండితిప్పల కోసం ఖర్చయిపోతాయి. పారిపోయిన కూతురు స్థానంలో తల్లి వ్యభిచార గృహానికి సైతం వెళ్ళడానికిసిద్ధపడడం మరో ఎత్తు. ఆకలి మనుషుల చేత చేయించని ఘోరమైన పనంటూ ఏది లేదన్న కఠిన వాస్తవాన్ని  ఈ కథ నిరూపిస్తుంది.

 కరువు మనుషుల్ని డొల్లలై పోయిన మనుషుల అన్ని విలువలతో పాటు సెంటిమెంట్లనూ పోగొట్టుకుంటారు. కరువులో ప్రాణం నిలబెట్టు కోవడం కోసం ఏ పరిస్థితికైనా సిద్ధపడటం మనిషిలో వుండే దుర్భలత్వానికి ప్రతీక. 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పొట్టకూటి కోసం పడుపు వృత్తికి పంపబడుతున్న పరిస్థితులను అధిగమించలేని పాలకవర్గాల అలసత్వాన్ని సహించే స్థితి మనకెక్కడి నుండి వచ్చిందో, మనల్ని మన స్థితిగతుల్ని కూడా విస్మరింపచేసే వ్యవస్థ పూర్వాపరాల్ని లోతుగా విశ్లేషించుకోవల్సిన సామాజిక సందర్భాన్ని ఈ “గాజుకళ్ళు’ కథ గుర్తుచేస్తుంది.

నిర్మలారాణి కరువు నేపథ్యంలోనే కాక స్త్రీ పురుష సంబంధాల్లోని అసమానతలను ’వికసించిన అంతరంగం’, ’ఎంతెంత దూరం’, ’రిగ్రేట్స్’, ’బొమ్మల పెళ్ళి’, ’మండే అంతరంగం’, ’కొత్త స్పర్శ’, ’మామూలు కథకాదు’, ’మలుపు’ కథల్లో ప్రతిఫలింపజేశారు. 

 ’మానవత్వం కథలో పేదవారికి – పేదవారే  ఆసరాకాగలరన్న వాస్తవాన్ని చెప్పిన కథ. అసలు ఆకలికి అలమటిస్తూ తిండిలేక చచ్చిపోయే దశలో వున్నా తోటి మనిషి కష్టం పట్ల స్పందన కలిగితే, ఆ మనిషి బ్రతుకుతున్నట్లు లెక్కని, ఖరీదైన జీవితం గడుపుతున్నా అటువంటి స్పందన లేకపోతే మనిషిగా బతకనట్లే  అర్థం అంటూ తెలియజేశారు. 

“వికసించిన అంతరంగం” కథలో నిర్మలారాణి ఉద్యోగంచేసే ఆడవారి అవస్థలను వివరిస్తూ వంట పనిలో ఇంటి పనిలో మగవారుకూడా ఆడవారితోపాటు పాలు పంచుకోవడంలో తన భర్తపట్ల తన అత్త ఆడపడుచులు ప్రవర్తనకు – తన తమ్ముడి భార్యపట్ల – తన ప్రవర్తన ఏ మాత్రం భిన్నత్వం కనిపించకపోవడంతో తన తప్పు తాను తెలుసు కోగలుగుతుంది. ఆడవాళ్ళు తమ దాకా వస్తే ప్రవర్తించే తీరులో ఉన్న భేధాన్ని, కుటుంబజీవితంలోని complexity   పాఠకులకు  ఈ కథలో అవగతమౌతుంది. స్త్రీ పురుషుల మధ్య సమానంగా శ్రమ విభజన జరగాలన్న డిమాండు కూడా ఈమె కథల్లో కనిపిస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.