కథా మధురం
పావనీ సుధాకర్
‘పుస్తకాల్లో దాచుకున్న నెమలి పింఛంలా జ్ఞాపకమైన ఓ ‘ప్రయాణం! ‘ కథ!
-ఆర్.దమయంతి
కథా మధుర పరిచయం :
ఆమె మనసులో అతనికొక ప్రత్యేక స్థానం వుంది. అంత మాత్రానికే అతను ప్రేమికుడు కావాలా ?
అతని జ్ఞాపకం, ఆమె మనసు గదిలో గుప్పుమనే మొగలి పువ్వు పరిమళం వంటిది. అయితే ఇంకేం? – ఆ ఇద్దరి మధ్య ఏదో ఎందుకూ ఆ సంభమే అయివుంటుంది.
అంతెందుకు – ఒక స్త్రీ హృదయాన్ని అన్ని వెంపులా ఏలడానికి ఒకే ఒక్కనికి హక్కులుండాలి. అతను మొగుడై మాత్రమే వుండాలి.
ఒక మంచి మగాడు – ఆమె హృదయాన్ని ఆక్రమించుకుని, జన్మంతా అందమైన జ్ఞాపకమై మిగిలిపోడానికి అతను ప్రేమికుడో, బాయ్ ఫ్రెండో, లేదా తాళి కట్టిన వాడో మాత్రమే అయి వుండాలి. పోనీ, కనీసం పైకి చెప్పుకోలేని ఆరాధకుడో, లేదా ఎవరికీ అభ్యంతరం లేని దొంగ పిలుపు మాస్టారూ అని పిలిచుకునే చనువున్నవాడు అయినా అయివుండాలి. కనీసం మాజీ స్నేహితుడో, అయి వుంటం కద్దు. – లేకపోతే కథ ఒప్పుకోదు, కథనమూ తప్పు కాక తప్పదు. కదూ?
ఫెమినిజం అంటే, స్త్రీల పక్షాన నిలిచే ఇజం కావొచ్చు. అంత మాత్రానికే ప్రతి పురుషుణ్ని ద్వేషించమని దానర్ధం కాదు.
నిజానికి ఒక స్త్రీ మనసుని, సాటి స్త్రీ కంటే, మగాడే బాగా చదివి, అర్ధం చేసుకోగలడు. స్నేహ హస్తాన్ని చాచి ఆమెకి సాయం చేయగలడు.
ఎందుకంటే..అతను పుట్టక ముందు నించే – అమ్మ బొజ్జ లో తొమ్మిదినెల్లు పడుకుని భూమ్మీదకొస్తాడు. కళ్ళు విప్పి విప్పగానే అమ్మ స్తన్యం అందుకుని, ఆకలి తీర్చుకుంటాడు. సోదరిలతో ఆడుకుంటూ పాడుకుంటూపెరుగుతాడు. క్లాసులో అమ్మాయిలను వోరకంట గమనిస్తూ, వారి మనసులను ఆనుకుని నడుస్తుంటాడు.
యుక్త వయసులో- యవ్వని పట్ల ఆకర్షితుడై అమ్మాయిలానే అతనూ కలలు కంటాడు. ఆ పై ప్రేమికుడై, ఆ ఆరాధనలో ఆమె సౌందర్య సౌకుమార్య మర్యాదలని వర్ణిస్తాడు. వివాహానంతరం, స్త్రీని సంపూర్ణం గా అధ్యయనం చేసినవాడౌతాడు. ఆడపిల్ల తండ్రి అయ్యాక పరిపూర్ణ జ్ఞానసంస్కారవంతుడౌతాడు.ఆ క్షణం నించి అతను స్త్రీ పరిరక్షకుడౌతాడు.
ఈ జ్ఞానం అంతా క్లాస్ పుస్తకాలను చదువుకున్నంత మాత్రాన అలవడదు. పుంఖాను పుంఖాలు గా ఆదర్శ నవలలు రాయడం వల్లనూ అంటుకోదు.
– అసలైన మగాడు అనే పదాన్ని నిర్వచించాల్సి వస్తే, స్త్రీని గౌరవించడం చాత కాని వాడు – అసలు మగాడే కాదు, vaaDotti మృగాడు మాత్రమే – అని చెప్పాలి. పురుషులందు పుణ్య పురుషులెవరయా అంటే-తన కళ్ళముందు ఏ స్త్రీ కష్ట పడుతున్నా చూడలేని సున్నిత మనస్తత్వం గలవాడు, కష్టాల ఊబిలోంచి ఆమెని అమాంతం .. అలాగ్గా ఒక్క చేత్తో పైకి లాగేయగల వాడు – అసలైన మగాడు. నిస్వార్ధమైన సాయమందించి, ఆమె మనసులో దేవుడై నిలిచిపోయేవాడు – వాడు అసలైన ధీరుడు. నాయకుడు. అతను మాత్రమే మగాడు. అందుకు నిలువెత్తు ఉదాహరణ గా ‘ఇతనే ‘ అంటారు రచయిత్రి.
***
అసలు కథేమిటంటే :
పసి పిల్లాణ్ణి వేసుకుని ఆ అందమైన స్త్రీ ఒంటరిగా రైల్ ప్రయాణం కడుతుంది. ఆమెని ఏడ్పిస్తూ కొంత మంది కుర్రాళ్ళు..ఎదురు బెర్త్ మీద కాళ్ళూపుకుంటూ కనిపిస్తారు. వొళ్ళు మండిపోతుంటుంది. సీటు కిందకి లగేజ్ తోసినా, చేతిలో పసి వాడు, వాడి సరంజామా తో ఒక బాగు, మరో భుజాన హాండ్ బాగ్, ఊపిరాడనట్టున్న స్థితి. వొళ్ళో పసివాడి ఏ క్షణం లో అయినా లేవొచ్చు..లేచి ఏడుస్తాడేమో..పాలు పట్టాలి, ఈ బాగ్స్ పక్కన పెట్టాలి..పక్క సీట్లో ఎవరొస్తారో..సీటంతా ఆక్రమించేసావంటారో..రాత్రి కి పసి వాడితో పడుకోవడమెట్లా..అన్నీ బుర్ర తొలిచేసే ప్రశ్నలూ, సమాధానం దొరకని నిశ్శబ్ద సందేహాలు..బెంబేలెత్తి పోయింది. ఉక్కిరిబిక్కిరైపోతోంది. టెన్షన్ తగ్గడానికి కాసింత వేడి వేడి టీ తాగాలని ప్రయత్నం. బాగ్ జిప్ లాగి మనీ తీయలేని అశక్తత..కళ్ళంట నీళ్ళొక్కటే తక్కువ..
సరిగ్గా ఆ క్షణంలో..వచ్చాడు అతను. ఆరడగుల అందగాడు. ఆపద్బాంధవుడిలా, రెండు చేతులూ చాచి, ఆ పసివాణ్ణి అందుకుని, తన విండో సీటి ఆమెకిచ్చి రిలాక్స్ అవమంటూ, టీ వాలా ని పిలిచి వేడి వేడి టీ ఇప్పించి..అన్నిటి కంటే ముఖ్యం గా కోతి మూకని పరోక్షం గా హెచ్చరిస్తూ ‘ఆమెకి తాను వున్నానంటూ..’ అండగా నిలబడి, ఆమె ఊహించని ప్రశాంతతని ఆమె చుట్టూ పరచి, ఆమెకి కోటలా నిలిచి, సైనికుడై, మహరాణికి పహరా కాసినట్టు.. ఎంత నిశ్చింత గా వుందో ఇప్పుడామెకి. పసివాణ్ణి అతని కప్పగించేసి, ఆ రాత్రంతా హాయిగా నిద్రపోయి లేస్తుంది. రైల్ దిగేటప్పు డూ అంతే. ఆ ఆజానుబాహువు, పిల్లాణ్ణి చేతికందిస్తూ లగేజ్ ని ఎంతో సులువుగా కిందకి దించిస్తాడు.
ఆమె అలా చూస్తుండిపోతుంది అతని వైపు! మాటల్లో చెప్పలేని కృతజ్ఞత తో మనసుప్పొంగుతుంటే..కళ్ళల్లో కమ్మని చినుకౌతుంటే..
అప్పుడు అడుగుతాడు అక్కడకొచ్చిన ఆమె భర్త ‘ప్రయాణం ఎలా జరిగింది ఒంటరిగా?’ అంటూ.
ఇంతకీ ఆమె కి సాయం చేసిన అతనెవరు? ఆమెకేమౌతాడు? ఆ తర్వాత వారిద్దరూ కలుసుకున్నారా? స్నేహం కొనసాగిందా? అయితే అదెలాటి స్నేహం? ఇవన్నీ తెలుసుకోవాలంటే కథ చదివి తెలుసుకోవాల్సిందే! తప్పదు!
*****
కథలో ఆమె పాత్ర :
ఆమె ఒక అందమైన యువతి. వివాహిత. కాపురం ఇంకా కొత్త కొత్త గా వుండంగానే, పిల్ల తల్లైనట్టుంది. ఎందుకంటే, మొగుడికి తానేమిటో, తన ధైర్యమేమిటో ప్రదర్శించి చూపాలనే పిచ్చి పట్టుదల ఇంకా పోలేదు. ఆ మాట ఆమే చెబుతూ ఒప్పుకుంటుంది కూడా. – ‘ఇదే మొదలు పిల్లాడు పుట్టాక వొంటరి గా ప్రయాణించడం! పెద్ధ ఝాన్సీ రాణీ లా ఫీలయ్, వొక్కతే వెళ్ళగలనని బయల్దేరింది. ఇప్పుడు తెలుస్తోంది – ఎంత కష్టవో…ఎంత స్ట్రెస్సో!’ అని తనని తాను మందలించుకుంటుంది కూడా.
స్త్రీలు ఒంటరిగా ఈ ప్రపంచాన్ని చుట్టి రాగలరు కానీ, పసి పిల్ల్లల్తో ప్రయాణించాల్సి వస్తే మాత్రం బెంబేలు పడిపోతారు. అదొక పెద్ద పరీక్ష లాటిదే. ఇది ఎంత నిజమో – ఒంటరిగా పసి కూనతో ప్రయాణించిన ప్రతి ఒంటరి తల్లీ కీ అనుభవైద్యకమే.
స్త్రీలు ఒంటరిగా ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలరు. కానీ ఒక్కోసారి, అతి చిన్న సమస్యని జయించడానికి సయితం శక్తి చాలక, అశక్తులై దిగులుపడతారు.
సరిగ్గా ఈమె పరిస్థితి కూడా అలానే వుంటుంది. ఎంత అసహాయత కు గురి అవుతుందంటే, – ఆ టెన్షన్ కి దాహమై, వేడి వేడి గా టీ తాగాలనుకుంటుంది. కానీ చేతిలో పసి వాడు. భుజానున్న బాగ్ జిప్ తీసి, డబ్బులు తీయాలంటే వీడు నిద్ర లేస్తాడేమో అని భయం..అందుకని టీ తాగడాన్ని మానేస్తుంది ఆ తల్లి.
తొలి సారి తల్లి అయినప్పుడు ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, పసి వాడితో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలకి ఆ తల్ల్లి మానసిక పరిస్థితి కి అద్దం పడుతుంది ఈ పాత్ర.
స్త్రీ కి తన మీద తనకు నమ్మకమున్నట్టే, తన మీద తనకు కోపమూ వేస్తుంటుంది. ఆ కోపంలో తిట్టుకోవడమూ కద్దే. ‘ఇక ఎప్పుడూ ఇలాటి బాడ్ డెసిషన్స్ తీసుకోకూడదని’ ఆమె తనని తాను తిట్టుకుంటుంది.
మరి ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్టు అని ఒక ప్రశ్న మెదులుతుంది మనకి మనసులో.
భర్త ఆమెతో సంభాషించి వుండొచ్చు. ‘నువ్వు ఒక్కదానివే రాలేవు.’ అనో, ‘నీకు అంత తెలివి లేదులే..’ అని ఉడికిస్తూ ఓ మాట అని వుండొచ్చు.
ఇల్లాలు – మొగుడేమన్నా భరిస్తుంది కానీ, ‘నీ వల్ల కాదులే..నేను నీ పక్కన లేకుంటె నువ్వే పనీ చేయలేవులే..’ అని హాస్యానికో, సరసానికో అన్నాడనుకోండి.. బుస్సుమంటుంది వ్యక్తిత్వం. ఈయనకి అర్జెంట్ గా తనేమిటో ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం ఎంతైనా వుందన్న ఆవేశం ఉబుకుతుంది.
మరి పెళ్ళానికి మొగుడితోనే కదా ఢీ! అందమైన హద్దులో వున్నప్పుడు ఇలాటి పందేలు, పోటీలు, రెచ్చగొట్టుకునే వైనాలు, గెలిచాక, ఆ గెలుపు వెనక తానే అంటూ, మరో సారి గిచ్చుకోవడాలు – కాపురం లో అన్యోన్య దాంపతుల మధ్య చోటు చేసుకునే అందమైన వైరాలు.
ఈ పాత్ర లో ని మరో విశేషమేమిటంటె – ఇతను చాలా మంచి వాడు అని నోటితో చెప్పదు. ఇతని కదలికలనీ, చర్యలనీ, ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన కళ్ళద్దాలతో చూసి రికార్డ్ చేస్తుందంటే – అతను తన సీట్ లో కుర్చోమని చెబుతూ, ఆ సీట్ ని చేతి రుమాలుతో శుభ్రం చేస్తాడు. అంత కేర్ చూపడం ఆమె దృష్టిని, ఆ పైన మనసునీ ఆకర్షిస్తుంది.
కొందరు మగాళ్ళు, మనసులో దురుద్దేశం పెట్టుకుని, పైకి మాత్రం తాను గొప్ప ఆదర్శపురుషుణ్ణి అంటూ సాయమందించడానికి ముందుకురికే వారి తీరు తెన్నులే వేరుగా వుంటాయి. తేలు మీసాల్లాంటి ఆ చేతి స్పర్శలు స్త్రీలకి ముందుగానే బాగా తెలుస్తాయి.
వొళ్ళంతా గండు చీమలు చుట్టుకున్నట్టు.. నల్ల కోర్కెల చూపులకి వొళ్ళంతా కంపరమౌతుంది. ‘ వీడు ఏ తాలూకా వాడో ‘ – అని ఇలా ఇట్టే గ్రహించే గొప్ప జ్ఞాన నిధిని ఆ దేవుడు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించి ప్రసాదించడం గుడ్డిలో మెల్ల లాటి వరం.
ఈ కథలో ఆమె పాత్ర ఎంత గొప్పదంటే – అతన్ని పరిశీలిస్తూ..అతనెలాటి వాడో..ఏ తరగతికి చెందిన వ్యక్తో..నోటితో వర్ణించకుండా నిశ్శబ్దం గా అతను చేసే చర్యలని, పనులని దృశ్యాలు గా చిత్రీకరించి చూపుతుంది. రచయిత్రి రచనా చాతుర్యానికి ఇదొక నిదర్శనం.
ఆమె పాత్ర లో మరో ఔన్నత్యం ఏమిటంటే : ఆపద కాలం లో చెప్పలేనంత సాయం అందించిన అతని పట్ల ఆమె హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిన మాట వాస్తవమే అయినా, ఆ క్షణాన అతన్ని హీరో గా మనకు చూపించినా..ప్రయాణం పూర్తయి, హైదరాబాద్ చేరుకోగానే రిసీవ్ చేసుకోడానికి వచ్చిన భర్తని చూడగానే ఆమె కళ్ళు సంతోషం తో మెరిసాయి అని చెబుతారు రచయిత్రి.
వాళ్ళక్కడ ఆ అపరచితునితో విడిపోతారు. తప్పదు అన్నట్టు బాధతో కాదు. సంతోషం గా బై బైలు చెప్పుకుని ఎవరి దార్న వాళ్ళు వెళ్ళిపోతారు.
మరి ఇక ఆ హీరో మరుగులోకి వెళ్ళిపోతాడా? ఆమె కి ఎప్పుడూ ఆ రైల్ లో పరిచయమైన అతను గురుతు కు రాడా? మరుపు లోకెళ్ళిపోయాడా? అలా వెళ్ళిపోతే అతను హీరో ఎలా అవుతాడు? పోనీ మళ్ళా పలకరింపులు..జరిగిందే చెప్పుకుని మురుసుకోవడాలూ వుంటే..అదేమంత సబబు గా వుంటుంది పెళ్ళయిన వనితకి? మరి మర్యాద మార్చకుండా, మనిషి మనిషి కి మధ్య గల మ మతాను గంగ అపవిత్రమూ కానీకుండా..అతను అలా నడచి వస్తూనే వున్నాడు..ఆమె అతని జ్ఞాపకాల నదిలో అప్పుడప్పుడు మునిగి లేస్తూనే వుంది..
ఇది ఎలా సాధ్యమూ అన్నది కథ పూర్తిగా చదివితేనే తెలుస్తుంది.
*****
లీడ్ : 1.
ఏం చెప్పిందీ కథ? :
మొత్తం కథ ఎంత ని! పట్టుమని ఒక్క పేజీ దాటింది కాదు. కానీ, కొన్ని వాల్యూంస్ లో చెప్పలేని కొత్త సత్యాలు వున్నాయి.
కథలో సస్పెన్సూ, రొమాన్సూ, హాస్యమూ ఏమీ వుండదు. ఊకదంపుడు కబుర్లూ వుండవు.
మరేం చోటు చేసుకుందీ అంటే -వీటన్నిటికీ మించిన – స్త్రీ అందమైన హృదయాన్ని అవిష్కరిస్తుంది. ఆమె సమస్య చాలా చిన్నదే అయినా చికాకు పెద్దది. ఆ రాత్రి ప్రయాణం నరకం గా మారకుండా ..అతను ఆదుకున్న విధానం ఎంతో హృద్యం గా వుంటుంది. మంచి మగాళ్ళున్నారు అని స్త్రీలకు కాసింత భరోసానిచ్చి, కమ్మని ఆశని రేపుతుంది కథ. ఇదీ – అభినందించదగిన కథాంశం.
అంతే కాదు, అమ్మాయిలు కలలో సైతం కనుగొనలేని అత్యంత సుందరమైన వ్యక్తిత్వ సంపన్నుడైన ఒక కథానాయకుణ్ణి పరిచయం చేస్తుంది -కథ.
***
ప్రయాణం!
– పావనీ సుధాకర్
‘ఛాయ్ ..ఛాయ్ ..’అంటూ ఆ కంపార్ట్ మెంట్ లోకి వచ్చాడు కుర్రాడు-
ఆమెకి ఎప్పుడూ లేనిది వేడి గా ఎమైనా తాగాలన్పించింది..
ఎదురుగా నలుగురు కుర్రాళ్ళు. పైన బెర్తు మీద వూరికే ఎక్కి కూచుని మరో ఇద్దరూ..
కోతి మూక! పక్క కంపార్ట్మెంట్ నున్చి కూడా వొచ్చి ఇక్కడే తిష్ట వేసారు
వెధవలు! తెలిసిన మొహాలే..కాలేజీ లో చదూకునేప్పుడు జూనియర్లు అయ్యుండచ్చు!
దొంగ చూపులు..ఏవో పిచ్చ కామెంట్లు!
“ఏవిట్రా… వంటరి ప్రయాణం? “అంటో, …”చాలా రోజులుగా కన్పించడం లేదు.. ఇక్కడ వుండడం లేదా?” – ఆ వెనకే వెకిలి నవ్వులు…
ఆమె తలెత్తి ఛాయ్ వాలా కోసం చూసింది.
మెరిసిపోయే చందమామ లాటి అందమైన మొహం!
పెద్ద కళ్ళూ.. చిన్న నోరూ..వొత్తైన నొక్కుల జుత్తూ.. కేపచీనో రంగులో మెరిసే ఆమె వొంటి మీద స్టీల్ బ్లూ శారీ. లైటు వెలుగులో నీ్ళ్ళలా కదుల్తో..
పక్కనే చిన్న క్విల్ట్ మీద నిద్ర పోతో.. నెలల పిల్లాడు.
ఛాయ్ అంటో దగ్గర్లోనే..విన్పిస్తోంది.
పిలవాలా..వొద్దా! – సందిగ్దం.
పర్స్ తియ్యాలి. మనీ తియ్యాలి. ఇవ్వాలి, ఛేంజ్ తీసుకోవాలి.
ఈలోపల పిల్లాడు లేస్తే మళ్ళీ ఈ మూక మందు టీ తాగడం..అదో గొప్ప సర్కస్ ఫీట్! పోనీలే లెట్ గో అనేసుకునేంతలో –
“హలో…ఎక్కడికి ప్రయాణం?అంటో ..కార్నర్ సీట్లొంచి పలకరింపు!
తల తిప్పి చూసిందామె.
అరె! ఇతను తెలిసిన వాడే. ఈ కోతి మూక టెన్షన్ లో పడి చూడనే లేదు!
కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ తమ్ముడు! తనకంటే వో ఏడాది సీనియర్!
పక్క వీధే. తన కొలీగ్ ఇంటి ఎదురింట్లో వుండే వాళ్ళు! పెద్దగొప్ప పరిచయం కాదు..
ఐనా, గొప్ప రిలీఫ్ గా అన్పించింది.
ఆమె ఎక్కడి కో చెప్పింది అతనూ అక్కడికే!
“టీ తీసుకుందాం” టీ కుర్రాణ్ణి ఆపాడతను.
“రెండు టీ ఇవ్వమ్మా..” పర్స్ తీసాడు.
ఆమె కూడా తన పర్స్ మీద చెయ్యి వేసింది.
అతను ఇబ్బందిగా మొహం పెట్టి, వొద్దన్నట్టు చూసాడు.
ఆమె ‘సరే..’ అన్నట్టు నవ్వి వూరుకుంది.
కోతి పిల్లలు గుస గుస గా కిచ కిచ లాడాయ్.
అతను టీ గ్లాసులు రెండూ తనే తీసుకున్నాడు.
“కొంచం చల్లారాక ఇద్దామని..మరీ వేడి గా వుంది…”
ఆమె ‘నిఝవే…’ అన్నట్టు చిన్నగా తల వూపింది..
వొక నిముషం అయ్యాక, ‘వొక పని చేస్తే..బావుంటుంది,’ ఆమె వెంపు చూసాడు..
ఏవిటన్నట్టు చూసిందామె..
“నేను మీ సీట్లో బాబు పక్కన కూర్చుంటా. మీరు నా ప్లేస్ లో కూర్చుని,
టీ తాగి, కొంచం రిలాక్స్ అవ్వండి.” ఆమె జవాబు కోసం చూడకండా లేచి, తన దగ్గరున్న హేండ్ టవల్ తో సీట్ శుభ్రంగా తుడిచాడు.
ఆమె వెళ్ళి ఆ సీట్లో కూర్చుంది. ఆక్షణం ఆ సీట్ ఆమె కి ఏదో గొప్ప ప్రత్యేకంగా.. అన్పించింది-
ఆతను ఆమె ప్లేస్ లోకి మారాడు.
ఎదురుగా కూర్చున్న కుర్రాళ్ళ కి ఇతను విలన్ లా కనిపించాడు.
అప్పుడే ఆమె అతన్ని కొంచెం పరికించి చూసింది.
గంధం రంగు- కొంచెం బ్రవున్ ఐస్. గోధుమ రంగు లాల్చి, చేతికో వాచ్..
చాలా మర్యాద గా కన్పించాడు- ఆమె కళ్ళకి.
వీళ్ళిద్దరూ కా స్సేపు వాళ్ళకి కామన్ గా తెలిసిన వాళ్ళ గురించి కబుర్లు చెప్పు కున్నారు..టీ తాగుతో…
కుర్రాళ్ళకి సడెన్ గా సిట్యుయేషన్ లో వచ్చిన మార్పు కి కోపం వచ్చి, వేరే ప్లేసెస్ కి వలసెళ్ళి పోయారు.
“గుడ్ రిడెన్స్! మీరు కాస్సేపు రెస్ట్ చెయ్యండి. నేను మెలకువ గానే వుంటాను.”
నాకు ట్రావెల్ లో నిద్ర పట్టదు…” అంటో అతను లేచి తన సీట్లో కి మారి పోయాడు ఏదో పుస్తకం పట్టుకొని.
ఆమె కూడా లేచి పిల్లాడి కి పాలు పట్టించి, ఇతనికి గుడ్నైట్ చెప్పి, నిద్ర లోకి జారి పోయింది. ఇతను మెలకువ గా వున్నాడన్న ధైర్యంతో.
****
తెల్లవారింది.
వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది-
ఆమె కి కంగారు మొదలైంది-
ఇదే మొదలు పిల్లాడు పుట్టాక వొంటరి గా ప్రయాణించడం! పెద్ధ ఝాన్సీ రాణీ లా ఫీలయ్, వొక్కతే వెళ్ళగలనని బయల్దేరింది. ఇప్పుడు తెలుస్తోంది – ఎంత కష్టవో…ఎంత స్ట్రెస్సో!
ఛ..మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకో కూడదు..ల్లోపల్లోపల తిట్టు కుంటో-
సీటు క్రింద నించి బ్యాగ్ బయటి కి లాగింది- పిల్లాడి సామాన్లు అన్నీ సైడ్ పాకెట్ లో సర్దేసింది- బ్యాగ్ కింద నించి తీసి పక్కనే పెట్టుకుంది-
భుజానికి హ్యాండ్ బాగ్ తగిలించుకుంది. స్టేషన్ వచ్చేసింది..
ఈ హడావుడి అంతా చూస్తూన్న అతను లేచి,
“ మీరు వుత్త బాబుని ఎత్తుకుని దిగండి చాలు, నేను మీ బ్యాగు దించు తా..
నాకేం సామాను లేదు! జస్ట్ టేకిట్ ఈజీ..” అంటో ఆమె బ్యాగు అందుకున్నాడు.
హమ్మయ్య..అనుకుని రిలీఫ్ గా వూపిరి తీసుకుని, పిల్లాణ్ణి ఎత్తుకుని లేచిందామె-
ఆమెకి ముందుగా నడచి, అతను దిగి, బ్యాగు క్రింద పెట్టి, ఆమె చేతిలోంచి పిల్లాడిని అందుకున్నాడు.
ఆమె మెల్లగా మెట్లు దిగి, బాబుని అందుకుంటో..
“చాలా థాంక్స్.” అంది. – ఆమె గొంతులో కృతజ్గ్నత!!
“భలే వారే!..ఏం బరువులు మోసానని!..” చిన్న నవ్వు..స్నేహం గా!
**
అంతలో..
“ వొక్క దానివే…చాలా ధైర్యంగా…వచ్చేసావ్” ఆమెని పిక్అప్ చేసుకోడానికి వచ్చిన
ఆమె భర్త, మెచ్చు కుంటో అన్నాడు.
భర్తని చూడ గానే ఆమె కళ్ళలో మెరుపు! సంతోషం!
మావూరి వాళ్ళే!! ఈయన వుండబట్టి ప్రయాణం ఈజీ ఐంది. పరిచయం చే్స్తో ంటే మళ్ళీ కృతజ్ఞత ధ్వనించింది ఆమె గొంతులో..
“మరీ ఎక్కువ చెబుతున్నారు.” – చిన్నగా నవ్వి, “మరి వుంటాను” అని సెలవు తీసుకున్నాడు అతను-
“మంచిది.. మేం కూడా వుంటాం మరి” అంటో చేతులు వూపి వీళ్ళదారిన వీళ్ళు వెళ్ళి పోయారు- అంతే…కథ..
*****
వీళ్ళు మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కలవరు—
ఎందుకంటే,
వీళ్ళు బంధువులు కాదు- స్నేహితులూ కాదు.
పైగా పెద్ద గొప్ప పరిచయవూ కాదు-
ఇదీ ఏదో కాకతాళీయమైన కలయిక – ఈ ప్రయాణంలో.
నిఝంగానే వాళ్ళెప్పుడూ వొకరికి వొకరు జీవితంలో మళ్ళీ తారసపడలేదు.
కానీ కలవలేదు అనుకోవడం పొరబాటే!..
అదేవిటో ఆమె ఎప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నాఆ కార్నర్ సీట్లో
అతను వేడి వేడి ఛాయ్ తో ఆమెని కలుస్తూ నే వుంటాడు.
జీవితం లో కొన్ని అతి చిన్న పరిచయాలు కూడా చి్న్నప్పుడు పుస్తకాల్లో దాచుకున్న నెమలి పింఛాల్లా ..
మనసు మారుమూలల్లో వెచ్చగా వొదిగి దాక్కుంటాయ్.
పుటలు తిరిగినప్పుడల్లా మెరుస్తోనే వుంటాయ్..
మరువం ధవనంలా..పరిమళిస్తూ నే వుంటాయ్…జీవితమంతా పరచుకొని!

(ఈ కథ ఈమాట.కాం లో ప్రచురితమైంది)
***
రచయిత్రి పరిచయం:
పావనీ సుధాకర్
పుట్టింది, పెరిగింది ఆమలాపురం
పేరెంట్స్: లేట్ శ్రీ పి.డి. విల్సన్, హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లిష్, శ్రీమతి పి.డి. కృప కుమారి, టీచర్, రైటర్-
చదువు: శ్రీ కోనసీమ-యస్ కె బి ఆర్ కాలేజ్, ఆంధ్రాయూనివర్సిటీ వైజాగ్
ఇంగ్లీషు లెక్చరర్ గా కొన్ని సంవత్సరాలు పని చేసాను ఇండియాలో-
ముప్ఫై ఏ్లళక్రితం ఇండియా వొదిలి న్యూజిలేండ్ వెళ్ళి పోయాం మావారి వుద్యోగ రీత్యా-
పాతికేళ్ళ క్రితం అమెరికా వచ్చేసాక, ఐటి లోకి మారిపోయి సాఫ్ట్ వేర్ క్వాలిటీ యెష్యూరెన్స్ మేనేజర్ గా పనిచేస్తూ, ప్రస్తుతం న్యూజెర్సీ లో నివాసం.
మావారు సుధాకర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమ్మాయి నీహ కర్టిస్ న్యూస్ ఏంకర్- క్లీవ్ లేండ్ ఒహాయో.
అబ్బాయి అనూప్ ఇంకా చదువు- మెడికల్ స్కూల్-చికాగో.
రైటర్ గా అంటే –
వంద పైని కథలూ, గుర్తులేనన్ని కవితలూ, 5నవలలూ, అనేక వ్యాసాలు, అనువాదాలు, చాలానే రాసాను.
ప్రముఖ సంపాదకులు నా రచనలను మెచ్చుకుంటూ ‘ఔరా!’ అంటూ ప్రశంసించిన సందర్భాలే నాకు గొప్ప గొప్ప అవార్డ్స్ తో సమానం.
ఒకప్పుడు – లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వార పత్రిక గా పేరు గాంచిన ఆంధ్ర భూమి వార పత్రిక ముఖ చిత్రమై నిలవడం ఓ రైటర్ గా నేనందుకున్న గొప్ప గౌరవ పురస్కారం గా భావిస్తాను.
తెలుగులో తిలక్, చలం రచనలంటే చాలా ఇష్టం.
*****
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.