కొత్త అడుగులు – 12

మౌనభాషిణి – అరుణ కవిత్వం

– శిలాలోలిత

ఇటీవలి కాలంలో సీరియస్ పొయిట్రీ రాస్తున్న వారిలో అరుణ నారదభట్ల ఒకరు. ఇన్నాళ్ళ మౌనం తరవాత అంటూ 2016 లో తానే ఒక కవితై మన ముందుకొచ్చింది. ఇది ఆమె తొలి పుస్తకమైనప్పటికీ అలా అనిపించదు. తననీ భూమికి పరిచయం చేసి, నడక, నడత నేర్పిన అమ్మానాన్నలకు అంకితం చేసింది.

ఎం. నారాయణ శర్మకు సహచరి.

మంధనిలో జన్మించి, హైదరాబాద్ లో ప్రస్తుతం వుంటున్న అరుణ కవిత్వంలో అరుణారుణ కిరణమే. తొలకరి చినుకులతో మొదలైన కవితలు 55 వచ్చేసరికి పరాయి వసంతంగా మన ముందుకొచ్చి నిలిచాయి.

ఒక్కొక్కటి  ఒక్కో  ప్రత్యేకత వున్నది. ఎక్కడా రాసినదే రాసిన వైఖరి లేదు. లోతైన భావగాఢత ఈమె స్వంతం. కాలేజీ రోజుల్లో తనలోంచి తొంగిచూసిన భావాలన్నీ రాసుకునే అలవాటున్న ఆమెకు అవే కవితలని తెలిసి ఆశ్చర్యపోయిందట. అప్రయత్నంగా తనలోంచి పుట్టిన అక్షరాలే కాబట్టి, ఈమె కవితలకు అంత సౌకుమార్యం, ఆర్ద్రత, ఆవేశం, ఉద్విగ్నత, వేదాంతధోరణి మొదలైనవి ఎన్నెన్నో వచ్చి చేరాయి అన్పించింది.

ఇప్పుడు రాస్తున్న కవయిత్రులలో పదిమంది పరిణితి నిండిన కవయిత్రులనుకుంటే, వారిలో ఒకరు అరుణ.

నిజానికి అరుణ గురించి నేనెప్పుడో రాయాల్సి వుంది. కానీ ఎందుకు ఆలస్యమైందో తెలీదు. ఇన్నాళ్ళు పట్టింది. బహుశా ఇన్నాళ్ళు మౌనం తర్వాత రాసిందని, చదువుతూ వున్నానేమో.

కళ్ళు మాట్లాడినప్పుడల్లా

కవిత్వమవుతుందని తెలియదు

మనసు పోట్లాడినప్పుడల్లా

మౌనం వహించడం తప్ప!

మేఘ మాలికలు ఘర్షించి వర్షించి

మెరుపొకటి విరిసినట్టుగా కవిత్వం!

వర్షరుతువులో

నిశ్శబ్దాన్ని మోస్తూ మోస్తూ

గుప్పున విప్పిన రాత్ కా రాణీ

తొలికిరణాల వేకువతాకి

తన్మయంతో పుడమిని అభిషేకించే

చెట్లెంతగా పరవశిస్తున్నాయో !

చినుకుల తాకిడికి

ముసిరిన మట్టివాసనలు సోకి

కొత్తగా మొలకెత్తిన విత్తనంలా కవిత్వం !

ఆకాశానికీ నక్షత్రానికీ వున్న బంధం

భూమికీ సంద్రానికీ వున్న అనుబంధం

కోకిలకూ పిచ్చుకకూ మధ్య సంభాషణలా

చైత్రానికి చిగురాకులా మధ్య తీయని సంగమ కవిత్వం !

అలవోకగా ఇలా తన కవిత్వంలో కవిత్వ నిర్వచనాలను చెప్పేసింది. ఇలా చాలామంది కవితల్లో ఇలా నిర్వచన స్థాయిల్లో కవితా పంక్తులుంటాయి. కానీ అవేవీ గుర్తింపబడవు. లెక్కింపబడవు. ప్రపంచానికి అనర్హమైనవిగా నేటికీ భావిస్తున్నారు.

నెచ్చెలిపత్రికలోనైనా ఇలా ఎందరో కవయిత్రులు రాసిన నిర్వచనస్థాయిలో వున్న వాటిని బాక్స్ ఐటమ్ లా పెడితే బాగుంటుందనిపించింది. వీటిని ఒక్కళ్ళే సేకరించడం కొంచెం కష్టసాధ్యం కాబట్టి, అభిరుచి వున్న వాళ్ళందరూ దీన్నొక మినీ ప్రాజెక్ట్ లా భావించి కలెక్ట్ చేస్తే బాగుంటుంది.

స్త్రీలుగా తమయుద్ధం తాము చేయడమే కాక, సమాజంతో కూడా యుద్ధం చేసే నైపుణ్యాన్ని ఈ కవితలు సాధించాయి. అప్రయత్నంగా పుట్టిన కవిత్వంగా అన్ని పార్శ్వాలను తడిమిన కవిత్వంగా భావించొచ్చు. కుటుంబాలలో, ఆలోచనా విధానాలలో మార్పురావాలని, మానసిక చైతన్యం రావాలని భావించింది.

సెన్సారింగ్ ను దాటిన బలమైన వ్యక్తీకరణ ఈమెది. ఒకసారి రాసిన పదాన్ని, ఉద్విగ్నక్షణాల్లో పుట్టిన ఆ కాంతి అక్షరాల్ని మార్చడానికి అరుణ మనస్సు తొందరగా అంగీకరించదు. తనలోని సహజాతాలే కవితాక్షరాలనే నమ్మిక. తన అక్షరాలు తనవే కావలన్న తపన.

మనకెందుకులే అనే కవిత వ్యంగ్యాన్ని నింపు కవిత. రైతుగురించి అద్భుతమైన చిత్రణ చేసింది. అలాగే పరాయి వసంతం కూడా మర్చిపోలేని కవిత. 93 లో వచ్చిన నీలి మేఘాలుతర్వాత ఆ స్థాయిలో పుస్తకం రాలేదు. కాని రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే అరుణలాంటి ఎందరో కవయిత్రులను రికార్డు చేయాల్సిన బాధ్యతకూడా వుంది.

కరోనా కాలమ్దాటిపోతే నేను చేయాలనుకున్న ప్రాజెక్ట్ అది.

ఏదీ ప్రశాంతత కవితలో –

పువ్వులాంటి నువ్వు

వాడిపోవటం గమనించవేం!

ఉదయంను చీకట్లను

భుజానికెత్తి పరుగే సుఖమని

మగాడిని ఎంతటి బద్ధకానికి బానిసను చేసావు!

కేవలం స్వేచ్ఛ భ్రమలో

నిన్ను నువ్వు ఎంత కోల్పోయావు!

గతం కొంతైనా నీకోసం మిగిలింది

ఇప్పుడేముంది

చీకటిని

చేతుల్లోకి ప్రేమగా ఎత్తుకొని

నీకు నువ్వు శూన్యమైపోవడం తప్ప!

ప్రస్తుతం మగడు బ్రతికిలేడు

మొగుడు మాత్రమే మిగిలాడు!

ఇది చదువుతుండగానే సావిత్రిగుర్తొచ్చింది. ఆ పదాల వేడి, వాడి గుర్తొచ్చాయి.

అరుణలోని ఆప్టిమిజాన్ని  ఇలా అంది జవాబు కవిత్వంలో

‘‘’’ అంటే అబల … అణగారడం కాదని

అధిగమించడం అని చెప్పు

‘‘’’ అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కాదని

ఆలోచనా విచక్షణ అని చెప్పు!

ఇంకెందుకు ఇలాగే వున్నావు

నిద్దురలే

నువ్వు కోరిన లోకం నీ కోసం ఎదురుచూస్తుంది!

గాజు బొమ్మ కవితలో …

ఏరోజు కారోజు శుభ్రపరుస్తున్న వేషంతో పాటు

కమ్ముకున్న మేఘాలను శుద్ధిచేస్తూ

దుమ్ము పేరుకుపోయిన మనసును దులిపేయాల్సిందే…

ముందుకు నడవడం కోసం!

స్త్రీల జీవితాల్లో మార్పురావాలంటే, మానవ జీవితాలు సుఖశాంతులతో నిండాలంటే, సహజీవన సౌందర్యాన్ని పొందాలంటే, తనకు తానుగా మారాలనీ, పురుషుల సైతం మారాలనీ, అప్పుడే రేపటి రోజులు బంగారు కాంతులౌతాయనే భావనని, ఆకాంక్షను చాలా చోట్ల చెప్పింది. రెండవ పుస్తకం త్వరలో తేవాలనీ, మానవ జీవన పరిమళాన్ని ఆకాంక్షించే అరుణను, ఆమె కవిత్వ మార్గాన్ని అభినందిస్తూ….

*****

Please follow and like us:

2 thoughts on “కొత్త అడుగులు-12 (మౌనభాషిణి – అరుణ కవిత్వం)”

Leave a Reply

Your email address will not be published.