గౌతమి
-కిరణ్ విభావరి
“నాన్నా! అంటరానితనం అంటే ఏంటి నాన్న?” ఆదివారం అని తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చున్న నన్ను నా కూతురు గౌతమి ముద్దు ముద్దు గా అడిగింది. దానికి ఈ సంవత్సరం 9 పోయి పది వస్తోంది. నాలుగో తరగతి చదువుతోంది. మంచేంటో చెడు ఏంటో తెలిసి, తెలియని వయసు. పెద్ద వాళ్లు చెప్పిందే నిజమని నమ్మే అమాయక పసితనం దాని కాటుక కళ్ళల్లో కనిపిస్తుంటే పేపర్ పక్కన పెట్టి దాన్ని ఎత్తుకొని పక్కన కూర్చో పెట్టుకున్నాను.
“ఇప్పుడు నీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది నీకు ఎవరు చెప్పారు ?” దాని బుగ్గలు లాగుతూ అడిగాను.
“మరి మా టీచరు హోంవర్క్ ఇచ్చారు అంటరానితనం మీద ఒక వ్యాసం రాయమని.” చేతిలో పేపరు పెన్ను తో సమాధానమిచ్చింది.
“మనం పిల్లలకి మంచిని నేర్పిద్దాం అంటూనే చెడుని పరిచయం చేస్తున్నామేమో!!” అని అనిపించింది. అసలు వారికి ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థల గురించి చెప్పకపోతే, కులమత బేధాలు గురించి ఆలోచనే రాదు కదా.
“చెప్పు నాన్న?”మా అమ్మాయి మళ్ళీ అడిగింది.
“ఏం చెప్పను తల్లి? మనిషిని మనిషే ముట్టుకోకూడదని చేసుకున్న ఒక దురాచారం. ప్రకృతిలో మరే ప్రాణి చేయలేని ఒక పాశవిక ఆచారం..” అంటూ నాకు తోచినది, నేను చూసినది, అనుభవించింది చెప్పాను. నా చిట్టి తల్లి రాసుకుంటూ పోతోంది.
ఎందుకో ఊరు గుర్తొచ్చింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ గుర్తుకురాని మా ఊరు నా కూతురి ప్రశ్నతో గుర్తుకు వచ్చింది. హైదరాబాద్ వచ్చి 15 ఏళ్ళు అవుతోంది. వచ్చిన మొదట్లో ఆకలితో కడుపు కాలుతున్నా, స్వర్గంలో ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను అంటరానివాణ్ణని ఎవరికీ తెలియదు. అసలు అంటరానితనం అంటే ఏంటో మర్చిపోయేను ఈ మహా నగరంలో. ఇన్నేళ్లలో హైదరాబాద్ను విడిచి నేను మా ఊరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఎందుకో తెలియదు ఊరు గుర్తుకు వచ్చినప్పటి నుండి ఊరు ఒకసారి చూసి రావాలని మనస్సు పీకేస్తోంది. మళ్లీ ఆదివారం కోసం వేచి చూసి బస్సు ఎక్కేసాను. నా సతీమణి కూడా వస్తానని అంటున్నా ఒంటరిగానే పయనమయ్యాను. నా జ్ఞాపకాల దొంతరలను వెతుక్కునే ప్రయత్నంలో నాతో నేనే ఉండాలనుకున్నాను.
గౌతమి… నా గౌతమి.. ఇప్పుడు ఎలా ఉందో! ఇప్పటికీ తను ఆ మురికి కూపం లోనే ఉందా! నేను చెయ్యలేని ధైర్యం ఇంకెవరైనా చేశారా?? ఆమె జీవితంలో వెలుగు నింపారా?? ఒక అసమర్ధునిగా పారిపోయిన నన్ను చూసి గౌతమి ఏమనుకుందో? నన్ను క్షమిస్తుందా?? ఇలా ఎన్నో ప్రశ్నలు కడలిలో కొట్టుకుపోతున్న నేను కండక్టర్ పిలుపుతో లోకంలోకి వచ్చాను.
బస్సు దిగగానే నాలో ఏదో తెలియని ఆత్రం… మనసుకు ఇదీ అని చెప్పలేని అనుభూతి. వేగంగా కొట్టుకుంటున్న గుండెను కొద్దిగా వణుకుతున్న కాళ్లను పట్టించుకోకుండా భారంగా ఊరి వైపు అడుగులు వేశాను. 15 సంవత్సరాల క్రితం నేను విడిచి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. కాకపోతే అక్కడక్కడ గుడిసెల స్థానంలో ఇటుకల మిద్దెలు ఉన్నాయి.
ఊరికి స్వాగతం పలుకుతూ పచ్చని చెట్లు పొలాలు ఎన్నున్నా , ఆడవారి కోసం ప్రత్యేకంగా కట్టించిన అంటు గుడిసెలు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి. మా బాత్రూం సైజంత చిన్న గుడిసెలో ఆడవాళ్లు పిరియడ్స్ వచ్చినప్పుడు ఆ మూడు రోజులు ఇక్కడే ఒంటరిగా గడపాలి. ఏ పామో, పురుగో కుట్టినా, ఏ అఘాయిత్యం జరిగినా, ఊరి కట్టుబాట్లకు తలొగ్గి ఇలా బతకాల్సిందే. సృష్టికి మూలం అయిన ఆడదాని రక్తం మా ఊరికి మాత్రం ఇప్పటికీ అపవిత్రం.
నా ఊరు ఇంకా మారలేదా ?? పైకి ఎంతో అందంగా, నగర కాలుష్యాల నుండి దూరంగా ఉన్నా, ఇంకా అవే దురాచారాలా?! ‘ అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ముందుకు కదిలాను.
దారిలో కనిపిస్తున్న వారు నన్ను ఎవరో అన్నట్టు చూస్తూ ఉన్నారు. నేను వారిని గుర్తు పట్టినా పట్టనట్టే ఉన్నాను. ఇక్కడకు నేను వచ్చింది కేవలం నా గౌతమిని చూసిపోదామని అంతేగాని వీళ్ళని పలకరించి పోదామని కాదు. అసలు ఇలాంటి మృగాలను చూస్తుంటేనే ఆనాటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.
***
” అత్తమ్మా! నాకు గౌతమిని ఇచ్చెయ్యవా?? పువ్వుల్లో పెట్టుకొని చూస్తాను” అని నేను అడిగినప్పుడు అత్తమ్మ హాయిగా నవ్వేసింది. ఆ నవ్వులో ఏదో తెలియని బాధ ఉన్నా, ఎందుకో గోదారమ్మ అంత అందంగా ఉంది.
“ఓరినీ పట్టుమని పదమూడేళ్లు కూడా దాటలేదు. ఇంకా రాత్రుల్లో అంగి తడుపుకోవడమే పోలేదు… పెళ్లి కావాలిరా నీకు .. పెళ్లి” ఎప్పుడు విన్నాదో నా మాటలు అమ్మ చీపురు తిరగేసింది. నేను అక్కడ నుండి పారిపోయాను.
సీతారాముల కళ్యాణం హరికథలో విన్నప్పటి నుండి నా పెళ్లి గౌతమి తోనే అని అనేసుకున్నాను. ముద్దబంతి పూలు పెట్టుకొని, ఎర్రని లంగా జాకెట్ వేసుకుని ముత్యంలా మెరుస్తూ , నా పక్కన వచ్చి కూర్చున్న గౌతమిలో నా సీతను చూసుకున్నాను.
“నన్ను పెళ్లి చేసుకుంటావా గౌతమి?” అని అడిగినప్పుడు ముందు నీకు మీసాలు రానీ అప్పుడు చేసుకుంటా” అంటూ నవ్వుతూ పారిపోయిన నా గౌతమి రూపం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది.
***
ఇప్పుడున్న గౌతమి ఎలా ఉండి ఉంటుంది? ఇంకా అలానే అందంగా నవ్వుతూ ఉంటుందా? మోడువారిన తన జీవితం తలచుకుని వాళ్ళమ్మ లానే ఏడుస్తూ నవ్వుతుందా?? అనుకుంటూ గౌతమి ఇంటివైపు పయనమయ్యాను. వారికి ఎదురు ఇల్లే మాది. ఎటువంటి చుట్టరికాలు లేకపోయినా అత్తమ్మ, పిన్నమ్మ అనుకుంటూ అందరూ కలిసి మెలిసి జీవించిన మా వీథిలోకి వచ్చాను.
దొరబాబు ఇల్లు ఎదురుపడింది. ఎందుకో నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నెత్తురు జీర కమ్ముకుంది. ఆ నీచుడు ఇంకా దర్జాగా బతుకుతున్నట్టు వాడి భవనం చూస్తుంటేనే అర్థం అవుతోంది. వాడి కొడుకు గిరిబాబు అనుకుంటా అన్ని చేతి వేళ్ళకి బంగారు ఉంగరాలు, మెడలో పెద్ద రుద్రాక్ష మాల ధరించి పనివాళ్ళ మీద అజమాయిషీ చేస్తున్నాడు. మనిషి బాగా లావెక్కాడు. నన్ను చూసి గుర్తుపట్టలేనట్టున్నాడు. ఒకసారి నావైపు చూసి మళ్ళీ వాళ్ళను తిట్టే పనిలో పడిపోయాడు.
వీళ్ళ మూలానే కదా మా లాంటి వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. వీళ్ళ శ్రమదోపిడి వలనే కదా మా బడుగు జీవులు ఇంకా అదే దౌర్భాగ్యంలో బతుకుతున్నారు.
వీరి మూలానే కదా మా అమ్మ చచ్చిపోయింది. నేను గౌతమిని వదిలి పారిపోయాను.
***
అద్దంలో చిన్న చిన్నగా వస్తున్న మీసాలను చూసుకుంటూ మురిసిపోయాను. ఎప్పుడెప్పుడు మీసాలను చూపించి గౌతమిని పెళ్లి చేసుకుందామా… మా ఇంటికి తెచ్చేసుకుందామా… అని పచార్లు చేస్తూ “గౌతమి అంటే నాకెందుకు ఇంత ప్రేమ?!” అని ఆలోచించాను.
ఆమె నవ్వితే విచ్చుకున్న ఎర్ర గులాబీ లాంటి పెదవులను, సొట్ట బుగ్గలను చూస్తూ ఎన్ని యుగాలైనా గడిపేయవచ్చు. ఊరిలో ఎవరికీ లేని నీలాల కళ్ళు ఆమె సొంతం. రెండు జడలతో, పట్టు లంగా వేసుకుని బడికి వస్తుంటే బాపు బొమ్మలా ఉంటుంది. కానీ ఆమె అందం కాదు నన్ను ఆకర్షించింది.. గౌతమిలో ఏదో ఆకర్షణ ఉంది. ఇది అని చెప్పలేను. అది ఏంటో కూడా నాకు తెలియదు.. జీవితాంతం ‘నా గౌతమి ముసలి దయినా సరే ప్రేమించేగలను’ అనే ఏదో తెలియని భావావేశం.
మమ్మల్ని ఎవరూ తాకరు. మేమంతా అంటరానివాళ్ళమంట. మాకు ప్రత్యేకంగా బావి, బడి, వీథి, గుడులు పెట్టేసారు. కానీ వాళ్ల ఇళ్లల్లో పనికి మాత్రం మేమే కావాలి. పొరపాటున మేము వాళ్లని ముట్టుకుంటే వాళ్లకి పాపం తగులుతుందంట. వెంటనే వెళ్లి ఏవేవో పూజలు చేసుకుంటారు. వాళ్లతో స్నేహాలు, ఆటలు కూడా ఉండవు.
అలాంటి మాతో చెలిమి చేసిన గౌతమి అన్నా, మా అమ్మను ఆడపడుచు గా అభిమానించే గౌతమి వాళ్ళ అమ్మన్నా ఎందుకో తెలియని ఇష్టం.
***
“ఎక్కడికిరా పోతున్నావు?” గౌతమిని కలుద్దామని వెళ్తున్న నన్ను అమ్మ అడిగింది.
“గౌతమి వాళ్ళింటికమ్మ…” చెప్పులు వేసుకుంటూ అమ్మకి చెప్పాను. తరుగుతున్న కూరగాయలను పక్కనపడేసి ఒక్క ఉదుటున నా దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కొచ్చింది.
“ఏమైందమ్మా ” అర్థం కాని వాడిలా అడిగాను.
“ఈరోజు నుంచి నువ్వు గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు” అమ్మ హుకుం జారీ చేసింది.
“ఏం? ఎందుకు?” నేను గీరగా ప్రశ్నించాను.
“వెళ్లొద్దు అన్నాను, వెళ్లొద్దు అంతే..” అమ్మ కోపంగా చెప్పింది.
అమ్మకి ఏమైంది? గౌతమి వాళ్ళమ్మతో గొడవ పడిందా? అమ్మ ఎవరితోనూ గొడవ పడదే.. నాన్న చనిపోయాక రెక్కలు ముక్కలు చేసుకుంటూ నన్ను బతికిస్తున్న అమ్మ మీద నాకు బోలెడు ప్రేమ. గౌతమి కన్నా ఎక్కువ. అందుకే ఆమె మాటకు విలువిచ్చి కోపంగా కాళ్లు కొట్టుకుంటూ గుడిసెలోకి వెళ్లి బోర్లా పడుకున్నాను.
ఎంతసేపు అలా పడుకుని ఉన్నానో నాకే తెలియదు చీకట్లు పడుతూ ఉండగా మెలుకువ వచ్చింది అమ్మ కోసం వెతికాను. అమ్మ కనిపించలేదు. ఎదురుగా ఉన్న గౌతమి వాళ్ళ ఇంటి వైపు చూసాను. చాలామంది అక్కడ గుమిగూడి ఉన్నారు. ఆ గుంపులో గోవిందగా నిల్చుని ఉన్న నా స్నేహితుడు రాజుని పిలిచి విషయం ఏమిటని అడిగాను.
“గౌతమి పెద్దమనిషి అయిందంట…” వాడు గుసగుస గా చెప్పాడు.
“అయితే ఏంటి?”చిరాకుగా అడిగాను అసలే నిద్ర మత్తులో ఉన్నాను. వాడు మెల్లగా చెప్తుంటే రెండు మూడు సార్లు అడిగాను.
“ఇప్పుడు గౌతమిని దేవుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు రా. ఇక ఊరి పెద్దలందరికీ ఆమె పెండ్లాం అవుతుంది.” వాడు వివరించి చెప్పాడు.
దేవదాసి వ్యవస్థ గురించి నాకప్పుడు తెలియకపోయినా గౌతమి పడిన నరక యాతన ఆమె నన్ను అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో కలిసినప్పుడు అర్థమయింది.
“మురళి నన్ను దూరంగా తీసుకెళ్ళిపో. నేను దేవుడిని పెళ్లి చేసుకొని మా అమ్మ లాగా బతకలేను. నాకు నాన్న ఎవరో తెలియదు. పాపం అమ్మకు ప్రేమంటే ఏంటో తెలియదు. అందరూ అమ్మను ఒక వేశ్యగా చూస్తుంటే నేను కూడా అలా బతకలేను అనిపిస్తోంది. నన్ను దూరంగా తీసుకెళ్ళి పో మురళి” అభ్యర్థిస్తూ దీనంగా అడిగింది నా గౌతమి.
ఆమె నీలాల కన్నుల్లో మొదటిసారి తడి చూస్తున్నాను. అలా ఆమెను చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళల్లో కూడా నీరు చేరుకుంది. రేపు పొద్దున్న వచ్చే రైలు బండిలో ఆమెతో పారిపోదామని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆమెకి సర్ది చెప్పాను.
పొద్దు పొద్దున్న గుడిలో మంగళ వాయిద్యాలు మోగుతుంటే చప్పున మెలుకువ వచ్చింది. ఈరోజు గౌతమికి దేవుడితో పెళ్లి చేస్తారు కదా అనే విషయం గుర్తుకు వచ్చి గుడి వైపు పరుగు పెట్టాను.
ఊరికి పెద్ద మనుషులు గా చెప్పుకునే పెద్ద మనసు లేని వాళ్లంతా గుడి ముందు గుంపుగా చేరి నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వారిలో దర్జాగా కూర్చున్న దొరబాబు “నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?” అని కోపంగా అడిగాడు.
నేను అతని మాటలు బేఖాతరు చేస్తూ గౌతమి కోసం వెతికాను. దేవుడి ముందు ఆమెని నిల్చోబెట్టి పూజారి ఆమె మెడలో తాళిబొట్టు కట్టబోతుంటే నా రక్తం మరిగిపోతుంది. ఇంకేం ఆలోచించకుండా గుడి లోపలికి వెళ్లాను గౌతమి చేయి పట్టుకు లాక్కుని పారిపోయాను. గుడి పెద్దలు కానీ, ఊరి పెద్దలు కానీ నన్ను ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను అంటరాని వాడిని. నన్ను ముట్టుకుంటే పాపం తగులుతుందని ముట్టుకోకుండా తన మనుషుల కోసం అరుస్తున్నాడు దొరబాబు.
ఊరు దాటేసి రైలు బండి కోసం ఎదురుచూస్తూ నేను గౌతమి ఎవరికీ కనపడకుండా కూర్చుని ఉన్నాము. మేము ఇలా పారిపోతామనే విషయం రాజుకి ముందే చెప్పాను. అమ్మ బాగోగులు కొద్దిరోజులు వాడిని చూసుకోమని, పట్నంలో మంచి పని దొరికితే అమ్మని తీసుకుపోతాం అని చెప్పి ఉంచాను.
రైలు రాలేదు కానీ రాజు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. వాణ్ణి చూసి మేము ఇద్దరం నించున్నాము. వాడి వెనక ఊరి మనుషులు ఎవరైనా వచ్చి గౌతమిని నా నుండి తీసుకు పోతారేమో అని గౌతమి చెయ్యి బలం గా పట్టుకున్నాను.
వాడు రొప్పుతూ ఏడుస్తూ నా ముందుకు వచ్చి మోకాళ్ళ మీద పడ్డాడు.
“అరే రాజు ఏమయిందిరా?”నాలో కంగారు మొదలైంది.
“మీ అమ్మ….. మీ అమ్మ…. చచ్చిపోయింది రా…. చంపేశారు వాళ్ళు. నువ్వు గుడిలోకి వెళ్ళావని వాళ్ల గుడిని నాశనం చేసావ్ అని … మీ గుడిసెను తగలబెట్టే సారు.”
వాడు చెప్పడం పూర్తి చేయక ముందే నేను గౌతమి చేయి వదిలేసాను.
“అమ్మా!” అంటూ ఏడుస్తూ ఊరివైపు పరుగు పెట్టాను. గౌతమి ని ఒంటరిగా వదిలేసి అమ్మ కోసం, అమ్మ చివరి చూపు కోసం పడుతూ లేస్తూ , అరుస్తూ పరుగులు తీస్తూనే ఉన్నాను.
కొద్ది దూరం వెళ్ళగానే నా స్నేహితులు ఎదురయ్యారు “అరె మురళి, మీ అమ్మ చనిపోయింది. నువ్వయినా నీ ప్రాణాలు దక్కించుకో. పారి పోరా వాళ్ళు నిన్ను చంపేస్తారు పారిపో….” అంటూ ఊళ్ళోకి వద్దామని ప్రయత్నించిన నన్ను నా స్నేహితులు వెనక్కి పంపేశారు.
వెనక్కి వచ్చి చూస్తే గౌతమి లేదు. రాజుగాడు ఏడుస్తూ గౌతమిని వాళ్ళ అమ్మ వచ్చి తీసుకు వెళ్లిపోయింది అని చెప్పేడు.
ప్రాణం మీద తీపి తోనో, లేదా తెలిసీ తెలియని వయసు అవటం మూలానో నేను భయంతో హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కేసాను. దయగల వ్యక్తి పరిచయంతో నా కథ తెలుసుకొని ఆయన చూపించిన సానుభూతితో నా జీవితం మలుపు తిరిగింది. ఆయన కూతురిని పెళ్లి చేసుకుని సంఘంలో ఒక గౌరవ స్థానానికి ఎదిగాను.
మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు నా గౌతమిని చూడాలనిపించింది.
గౌతమి ఇంటి వైపు మరలాను.
వీథి మొదలులో రాజు ఎదురు పడ్డాడు. వాడు నన్ను గుర్తు పడతాడా లేడా?! అని వాడికి ఎదురుగా నవ్వుతూ నిల్చున్నా.
గుర్తు పట్టేసాడు ఆ బక్క పీనుగ. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అంతే బక్కగా పీలగా ఉన్నాడు.
“మీరూ…నువ్వు మురళి..” ప్రశ్నాపత్రం లా ఉన్న వాడి మొహం చూసి పక్కున నవ్వేను.
“భలే గుర్తు పెట్టేసావ్ రా” నవ్వుతూ బదులిచ్చాను.
“అరే మురళి ఏమైపోయావ్ రా? ఇన్ని యేళ్ళు ఎక్కడున్నావ్ ఎలా బతికావు?? చాలా మారిపోయావు రా…. ఆ గడ్డాలు మీసాలు… హీరోలా ఉన్నావు…. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా??” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ కౌగలించుకున్నాడు.
“గౌతమి ఎలా ఉందిరా?” వాడి ప్రశ్నకు సమాధానంగా ప్రశ్ననే అడిగాను.
“……” వాడు మౌనంగా నాకు దూరం జరిగాడు.
వాడు ఏమనుకున్నా నేను వచ్చింది కేవలం గౌతమి కోసమే ఆమెను చూడాలని ఆత్రంగా వచ్చాను.
“చెప్పరా నా గౌతమి ఎక్కడ?” వాడిని మళ్లీ అడిగాను.
వాడు పెదాలు బిగించి ఆకాశం వైపు చూశాడు. ఎంతో బాధలో ఉన్నట్టున్న వాడి కళ్ళను చూసి నాకు నా గౌతమి గురించి భయం వేసింది.
“చెప్పరా ??” మళ్లీ అదే అడిగాను.
ఏం చెప్పాలి రా గౌతమి చచ్చిపోయిందని ఎలా చెప్పాలిరా?” మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ అరుగు మీద కూర్చొని ఏడుస్తున్నాడు.
ఏయ్ తమాషాలు చేయకురా నిజం చెప్పరా” బాధ గుండెల్లోంచి తన్నుకు వస్తుంటే , నేను విన్నది నిజం కాకూడదని అడిగాను.
” నువ్వు వదిలి వెళ్ళిన రోజే గౌతమి చచ్చిపోయిందిరా. నేనే చంపేశాను… నా మూలాన చచ్చిపోయింది….” పాపంతో బరువెక్కిన మనసుతో వాడు మథన పడుతూ చెప్పాడు.
మెదడు మొద్దుబారి పోయి, అలా నిలిచి ఉండిపోయాను వాడు మళ్ళీ చెప్పడం ఆరంభించాడు “ఆరోజు నిన్ను ఊరివైపు పంపించేసాక దొరబాబు వచ్చాడు. నన్ను బెదిరించి, గౌతమిని తనతో తీసుకు వెళ్లి పోయాడు. నీకు చెప్తే మళ్లీ నువ్వు ఊరిలోకి వెళతావు అని… వాళ్ళు నిన్ను చంపేస్తారేమో అని నేను చెప్పలేదు.”
నేను వాడి చెప్పే మాటలను మౌనంగా వింటున్నాను నా కళ్ళు నాకు తెలియకుండానే కన్నీళ్లతో మసకబారి పోయాయి.
“ఆ తర్వాతే తెలిసిందిరా నేను గౌతమిని దొరబాబుతో పంపి ఎంత తప్పు చేశానో. దేవుడితో పెళ్లి అని చెప్పి తీసుకువెళ్లారు కానీ దెయ్యంతో కాపురం చేయాలి అని నాకు తెలియదురా …” వాడు ఇంకా చెబుతూ పోతున్నాడు. ఆ రాత్రి దేవుడితో పెళ్లి అయ్యాక ఆమెను దొరబాబు అత్యాచారం చేశాడు. ఆ రాక్షసుడు చేసిన పనికి తెల్లారి కల్లా గౌతమి శవమై పడి ఉంది. ఈ పిచ్చి ఊరి జనం కూడా కానీ ఆ నీచుడిని పోలీసులకి పట్టి ఇవ్వకుండా , గౌతమి గురించి తప్పుడు కూతలు కూసారురా…”
వాడు చెప్తున్న మాటలు నా మదిలో బాణాల్లా గుచ్చుకుంటుంటే మౌనంగా వెను తిరిగాను.
రాముల వారి గుడి ముందు వున్న మర్రిచెట్టు బెరడు మీద “మురళీ -గౌతమి”…అని నేను చిన్నప్పుడు చెక్కిన ఆనవాలు మాత్రం మా కథను ఇప్పటికీ ఊరి వాళ్ళకి చెపుతూనే ఉంది.
*****
ఆర్ట్ : మన్నెం శారద
నేనో సైకాలజీ విద్యార్థినిని. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. సాహిత్యపరంగా ఇంకా ఏడాది కూడా నిండని నా సాహితీ కాలంలో ఇప్పటి వరకూ 30కు పైగా రచనలు చేశాను. కొన్ని పత్రికల్లో ప్రచురితం అయితే మరికొన్ని బహుమతులు తెచ్చిపెట్టాయి. రచయిత రాయకున్నా పర్లేదు కానీ చదివి తీరాలి అని నేను బలంగా నమ్మిన సిద్ధాంతం. అందుకే నేనో నిత్య విద్యార్థినిని.
Nice touching story .baga rasaaruu..
చాలా బావుంది కిరణ్ , నీ కలం నుంచీ వెలువడిన మరో ఆణిముత్యం.
బాగుంది
నైస్ స్టోరీ కిరణ్
చాలా బాగుంది ….👍👍.సమీక్ష రాసే సమయం లేదు…కానీ అక్షరాల మాలలు కనిపిస్తే వదల బుద్ది కాదు…నీ కథ ఒక అరుదైన పువ్వులా వుంది…