జగదానందతరంగాలు-7

నిజమైన పారితోషికం

రచన: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్

గళం: శ్రీమతి తురగా కనకదుర్గా భవాని

నోటిమీద వేలుపెట్టి వారించాను మాట్లాడొద్దని. స్టెతస్కోపుతో చూస్తున్నాను. బాగా గాలి పీల్చుకొమ్మని, అస్సలు మాట్లాడకూడదని ముందే హెచ్చరించాను. అయినా వినదు ఈ మామ్మ. మాట్లాడ్డం ఒక వ్యసనం తనకి.

అప్పటికే హాస్పిటల్లో చేరి నెలరోజులు దాటిపోయింది. ఈసారి ఎలాగైనా టేబులెక్కించెయ్యాలి. పాపం, ఎన్నాళ్లని ఇలా పడిగాపులు పడుతుంది? బీపీ తగ్గలేదని, సుగర్ కంట్రోలవ్వలేదని అలా నానుస్తున్నాం. అవి తగ్గకపోతే ఆరోగ్యశ్రీ వాళ్లు అనుమతించరు.

చూడటం అయింది. స్టెతస్కోప్ చెవుల్లోంచి తియ్యగానే ‘ఎలగుంది? అంతా కియరైపోయిందా?’ అనడిగింది.

ఒక్క క్షణం ఆ కళ్లలోకి చూస్తే నవ్వొచ్చింది.

‘అంతా బానేవుందిగానీ చుట్టల సంగతేంటి?’ అన్నాను నవ్వుతూ.

‘మానీసానూ? నువ్ సెప్పినకాణ్ణుండి సత్తిపెమానికంగ మరి ముట్టనేదు!’ అంది కళ్లు వెడల్పు చేసి.

‘అబద్ధాలాడకు. నిన్న మధ్యాహ్నం నువ్వూ ఇంకో ముసల్దీ కలిసి ఎదురెదురుగా చుట్టలు ముట్టించుకోడం నే చూసాను. ఇలా అయితే ఇక ఎప్పటికీ ఆపరేషన్ అవ్వదు! ఆ తరవాత నీయిష్టం!’ అంటూ చీకట్లో బాణం వేశాను. కానీ అది తగిలింది.

తను కూర్చున్న బల్లని నా కుర్చీకి దగ్గరగా జరుపుకుని నా ముందుకి వంగి, రహస్యంగా ‘బావూ! వణ్ణం తినీసిం తరవాత ఇంత గొద్ది.. సి…న్న ముక్కెలిగిస్తాను. రొండు సుట్లు పీల్చీసి, గోడకి రాస్సి, సిక్కంలో దాచేస్తను! సత్తెం! నీమీదొట్టు!’ అనేసి, బొడ్లో దోపిన చిక్కంలోంచి ఒక చిన్న చుట్టముక్కని బయటికి తీసి చూపించి, మళ్లీ వెనక్కి జరిగిపోయింది.

‘చూడు మామ్మా! నేను మంచివాణ్ణే! నీకెలాగైనా ఆపరేషన్ చేయించేసి పంపేద్దామనే చూస్తున్నాను. కానీ ఇంకొకాయన ఊరుకోడు. ఇలా చుట్టలవీ కాల్చావని తెలిస్తే ఇంటికి పంపించేస్తాడు. ఆనక నీయిష్టం!’ అంటూ బెదిరించడానికి ప్రయత్నించాను.

కానీ అలాంటి వాటికి లొంగే రకం కాదు తను. ఈ నెలరోజుల్లోనూ తనకన్ని సంగతులూ తెలిసిపోయాయన్న విషయం మాకే తెలీదు. ఈ డిపార్ట్‌మెంట్ మొత్తానికి నేనే హెడ్ అన్న సంగతి తనకెవరో ముందే చెప్పేశారు.

‘నువ్వే పెద్ద డాట్రువంట? నువ్వు సెప్తే ఖాయం చేసేత్తారనీసి నీకాడకే ఎల్లమంది నరుసులమ్మ!’ అంటూ నా హోదాని గుర్తుచేసింది.

తక్కువది కాదు. ఈ హాస్పిటల్ వ్యవహారాలన్నీ బానే ఔపోసన పట్టేసింది.

ఇక చేసేదేంలేక ఫిట్ రాస్తూ అడిగాను..

‘ఇంత తెలివితేటలున్నదానివి ఆ పాడలవాటు మానుకోలేవా?’

‘ఏటి సేత్తాం బావూ! ఉట్టుకుట్నే ఆకలి పుడతాది. లెగ్గానే ఏటీ వొండుకు తిన్లేం కదా? టీ తాగుదారంటే మాయదారి రోగం గేసదీ ఉన్నాది! సిన్న సుట్టముక్క నోట్లో పడీసుకుంటే ఆకలదే సచ్చిపోద్ది!’

అటువంటి సమాధానం నేనస్సలు ఊహించలేదు. పాపం కదా?

‘రేపుదయం ఏడింటికల్లా నీకొడుకో, అల్లుడో ఇక్కడుండాలి, హాస్పిటల్లో. ఒకవేళ అవసరమైతే రక్తవఁదీ ఇవ్వాల్సొస్తే ఉండాలి కదా?’ అన్నాను రాయడం ఆపి.

‘ఎవలూ రారు బావూ! అంతపాటోల్లెవరూ నేరు! ఏదొ కూలీనాలీ సేసుకునీ బతికీవోల్లే అందరూనూ! నువ్వే ఏదోటి సూడాల! పోనీ బెడ్డు కొనీసి ఎక్కించేత్తానంటే కొనేద్దారి!’ అంటూ చిక్కం విప్పబోయింది. ఖర్మ! అందులోంచి డబ్బులవీ తీస్తుందనుకుంటానిప్పుడు!

కోపంగా చూసి ‘ఏటి కొనీసి ఎక్కించీడానికి ఇదేవఁన్నా పాల పేకట్టనుకున్నావా? బ్లడ్డు! మనిసి నుంచే వస్తాది. ఇచ్చీవోల్లెవరూ నేపోతే ఆపరేసనాగిపోద్ది!’ అనేశాను.

‘అలగంటెలా బావూ! పోనీ మా బొట్టినట్టుకొచ్చీదా?’ అంది ఆశగా

‘బొట్టెందుకిస్తుంది? ఆడవాళ్లకే నెలనెలా బోల్డు రక్తం పోతూవుంటుంది కద మామ్మా? ఇక వాళ్లెలా ఇస్తారు? మీ అల్లుణ్ణి రమ్మను పోనీ?’ అన్నాను అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ.

‘మగోల్లంటే కాయికష్టం చేసీవోల్లు కద బావూ! బెడ్డదీ నాగేస్తే ఈక్నెస్ అయిపోతారనీసి!’

ఇది తనమాటే కాదు. దాదాపుగా అందరి ఆలోచనా విధానం ఇలానే ఉంటుంది.

‘సరే అయితే, మీ ప్రెసిడెంటుకి చెప్పి ఎవరైనా మనిషిని పంపించమని చెప్పు!’ అన్నాను.

‘ఆడా? ఆ గొల్లిగాడు ఏటీ సాయం సెయ్యడుగానీ, ఎవలో ఒకల్ని నాను రప్పింతాన్లే బావూ! ఆపరేసన్ మాత్రం ఆపీక!’ అంటూ బతిమాలింది.

నిజానికి తనకి కావలసిన రక్తం నిల్వలు సరిపడినంత హాస్పిటల్లో ఉంటాయి. కానీ ఎవరైనా బాధ్యతాయుతమైన వ్యక్తిని బయట ఉంచాలన్నదే నా ఉద్దేశం. లేకపోతే ఏ వెధవా ఎప్పటికీ రాడు. వాళ్లకేదైనా సమస్య వస్తే అనాథల్లా వదిలేస్తారు! చాలా కష్టమనిపిస్తుంది వాళ్లని చూస్తే!

ఈ ప్రభుత్వ పథకాలవీ లేకపోతే ఈమాత్రం వైద్యం కూడా అందకుండా ఎప్పుడో పోతారు.

అనుకున్నట్టే మర్నాడు అల్లుడు, ఇంకో కుర్రాడు కలిసి వచ్చారు. ఆ పక్కనున్నవాడు తనని తాను పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడన్న విషయం నాకు చాలాసేపటి తరవాత అర్ధమైంది. ఎలా ఏడిస్తేనేం, అవసరమైతే రక్తదానం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు సంతకం మాత్రం చేశాడు.

‘ఎంతసేపుండాలంకుల్ హాస్పిటల్లో?’ అన్నాడు మా రెండోవాడిలా!

ఓరి నీ స్టైల్ తగలెయ్యా! నన్ను టైమడుగుతున్నావా?

‘రేపుదయం వరకూ ఉండాల్సిందే! సంతకం పెట్టేసి పారిపోదామనుకున్నావా ఏం? ముసల్దాన్ని వదిలేసి మీరిద్దరూ చేసే రాచకార్యాలేం ఉన్నాయి? ఇక్కడుండేటట్టయితేనే చేస్తాం. లేకపోతే ఆపేస్తా!’ అంటూ బెదిరించాను.

వాళ్లకి నా కాన్సెప్ట్ లో ఉన్న అసలు పాయింట్ అప్పుడు బోధపడింది. ఎలాగైతేనేం ఒప్పుకున్నారు.

మొత్తానికి ఆరోజు ఓటీలోకొచ్చింది. పాపం, ఎటు పడుకోవాలో తెలీక తలటూ, కాళ్లిటూ పెట్టి పడుకోబోయింది. మా అందరికీ నవ్వొచ్చి, మళ్లీ సరిగ్గా పడుకోబెట్టాం. భయంతో అటూఇటూ తెగ కదిలిపోతోంది.

‘ఓయ్ మామ్మా! ఇదేవఁన్నా డబల్ కాటనుకున్నావా? కిందపడతావు ఎక్కువగా కదిల్తే! అలా పడుకో అంతే!’ అని బీపీ కఫ్ కట్టాను. బీపీ చూస్తే కాస్త ఎక్కువగా ఉన్నట్టనిపించింది.

‘భయపడుతున్నావా మామ్మా? కంగారుపడకు. బీపీ పెరిగిపోతుంది!’ అన్నాను తన అరచేతిని షేక్‌హేండిచ్చినట్టు పట్టుకుని.

‘నువ్వుండగా నాకేటి బయ్యం? మీరే దేవుల్లు! సుబ్బరంగ సేసీయండి బావూ! మరింకేటి నేకుంటా అన్ని తీసియండి!’

‘ఏవన్నీ తీసెయ్యాలి? పేగులైనా ఉంచమంటావా అవీ తీసెయ్యమంటావా?’ అంటూ నవ్వించే ప్రయత్నం చేశాను. అలాచేస్తే బీపీ మళ్లీ మామూలవుతుందని.

అనుకున్నట్టే నార్మల్ బీపీ చూపించింది. వెంటనే అనెస్తీషియా ఇవ్వడం, పొజిషన్ పెట్టడం చకచకా అయిపోయాయి.

మత్తు కావలసిన లెవెల్ వరకూ వచ్చిందోలేదో పరీక్ష చెయ్యడానికి భుజం నుంచి సన్నగా గిల్లడం మొదలెడతాం. ఇలా గిల్లానో లేదో వెంటనే ‘ఓలమ్మో ఓలమ్మో చిక్కీసినావు బాబో!’ అంటూ అరిచింది.

‘ఓర్నీ, ఏంటిమామ్మా? ఇంతోటి నొప్పికే? తాతయ్యెప్పుడూ గిల్లలేదా నిన్నూ?’ అంటూ మోటు జోకొకటి వేశాను. ఇంకొంత కిందకెళ్లి, పక్కటెముకల దగ్గర గిల్లి ‘ఇప్పుడూ? నొప్పుందా?’ అనడిగాను.

కాస్త తక్కువగా ఉందంది. ఇంకాస్త కిందన గిల్లి మళ్లీ అడిగాను..

‘చిక్కావేటి?’ అంది అయోమయంగా మొహంపెట్టి. అంటే ఆ లెవెల్ వరకూ మత్తు వచ్చేసిందన్నమాట. ఇక మొదలెట్టమని సర్జనమ్మ వైపు తిరిగి ‘పండగ చేస్కోండి మేడమ్! ఇక మిమ్మల్నెవరూ ఆపలేరు!’ అనేశాను.

మామ్మ నా చెయ్యి పట్టుకుని ‘నువ్వెక్కడికీ ఎల్లక!’ అంది అకస్మాత్తుగా.

‘నేనిలా నీ చెయ్యట్టుకు కూర్చుంటే బీపీలవీ ఎవరు చూస్తారు? ఏం ఫరవాలేదు. పడుకో! ఏదన్నా ఇబ్బందుంటే నోటితో చెప్పు. చేతులవీ కదపకూడదు. సరేనా?’ అంటూ సర్దిచెప్పి కాసేపు కుర్చీలోకి చేరాను. ఆపరేషన్ జరుగుతోంది.

పావుగంట తరవాత తను కాస్త కదులుతున్నట్టనిపించింది. ‘ఏం మామ్మా? ఏమైంది, కదులుతున్నావేం?’ అంటూ కళ్లమీద గంతలు తీసి అడిగాను.

‘ఈవలేస్తంది బావూ! కొద్దిగా నీల్లు తాగుతాను!’ అంది నీరసంగా.

‘నీళ్లు తాక్కూడదే! బాటిల్లోంచే నీళ్లవీ ఎక్కేస్తాయి. కాసేపటికి తగ్గిపోతుంది. ఫరవాలేదు పడుకో!’ అన్నాను. అయినా వినలేదు. కొంచెం నాలుక తడపమని బతిమాలింది. సరేనంటూ ఒక డిస్టిల్డ్ వాటర్ ఆంప్యూల్ చిదిపి కౌబాయ్ సినిమాల్లో బందీగా వున్న హీరో నోట్లో పోసినట్టు ఆరేడు చుక్కలు పోశాను. తపతపా చప్పరించేసి ‘మరికొద్దీగ..!’ అంటూ బతిమాలింది.

‘ఇంకానయం. అన్నేసి తాక్కూడదు. మళ్లీ కక్కుతావు!’ అంటూ కోప్పడ్డాను.

‘నువ్విక్కడే ఉండు బావూ!’ అంటూ మళ్లీ చెయ్యిపట్టుకుంది. సున్నితంగా విడిపించుకుని, సెడేట్ చేసేశాను.

ఆపరేషన్ అయిపోయిన తరవాత కళ్లమీద గంతలు తీసి, ఏం మామ్మా? ఏయే దేశాలు తిరిగొచ్చావు? గురకలు గురకలు పెట్టేసావు!’ అన్నాను తన గాజు కళ్లలోకి చూస్తూ!

‘ఇంకా సెయ్యనేదా?’ అంది చేతులూపుతూ.

‘అయిపోయిందీ? నీకు తెలీలేదా?’ అన్నాను

‘పోబ్నం తెలిసిందేటి? లోన కాయేదో ఉందనీసి సెప్పింది మావూల్లో ఏనియమ్మ!’ అంది అమాయకంగా.

‘కాయుంటే నీకేటి, పండుంటే నీకేటి? ఇంక నీకే కష్టవూఁ నేకుంట సేస్సింది డాట్రమ్మ! దణ్ణవెఁట్టు ఓపాలి!’ అన్నాను తన రెండు చేతులూ పట్టుకుని పైకెత్తుతూ!

మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్న ఆ ముడుచుకున్న చేతుల వెనక తెరుచుకున్న హృదయం కనబడింది మాకు.

జీతానికి పనికొచ్చే వాళ్లమే అయినా ఇవన్నీ జీవితానికి పనికొచ్చే సందర్భాలు! ఆ తృప్తి ముందు ఏ అలవెన్సులూ, ఇంక్రిమెంట్లూ, బోనస్సులూ కూడా పనికిరావు! ఇరవయ్యేళ్లనుంచీ అదే ఘనమైన పారితోషికం!

*****

ఆర్ట్ : రీనా 

Please follow and like us:

2 thoughts on “జగదానందతరంగాలు-6(ఆడియో) నిజమైన పారితోషికం”

  1. చాలాబాగుంది . భవానీ గారు తూరుపు యాసలో యెంతోబాగా చదివారు .

    1. హృదయపూర్వక ధన్యవాదాలు వసంతలక్ష్మిగారు! తనకిది తొలి ప్రయత్నం. మీ ప్రశంసలు లభించాయంటే బావున్నట్లే.

Leave a Reply

Your email address will not be published.