జలపాతం (పాటలు) -3
తూరుపోడో చందురయ్య
-నందకిషోర్
కట్టమీదీ కన్నె బొత్తా
కన్నె బొత్తల్ల కేరి గెబ్బె
కేరిగెబ్బెల కల్లుదాగు పిలగో
తూరుపోడో చందురయ్య
ఎడ్లు ఎడ్లు కూడిరాంగ
దుక్కిటెడ్లు దున్నిరాంగ
కాలి దుమ్ము కంట్లపాడె పిలగో
తూరుపోడో చందురయ్య
|కట్టమీదీ|
బువ్వ తింటే బుడ్డు బుడ్డు
గడక తింటే గంజి గంజి
రొట్టె తింటె రోత పుట్టే పిలగో
తూరుపోడో చందురయ్య
దగ్గరుంటే వెచ్చ వెచ్చ
దూరముంటే పచ్చి పచ్చి
పాడు ఈడు కచ్చగట్టె పిలగో
తూరుపోడో చందురయ్య
|కట్టమీదీ|
నీళ్ల రేవు నీళ్లు ముంచి
నీళ్లబిందే లెత్తుకుంటే
అల్లిపువ్వు అలిగినాది పిలగో
తూరుపోడో చందురయ్య
పొరకలన్నీ ఏరుకొచ్చి
పొయ్యిలోన మంటయేస్తె
ఇప్పగాలి గుప్పుమంది పిలగో
తూరుపోడో చందురయ్య
|కట్టమీదీ|
ఒడ్డుమీదా గడ్డికోసి
గడ్డిమోపు లెత్తుకుంటే
మోటబాయి కదురునవ్వె పిలగో
తూరుపోడో చందురయ్య
నాట్లు వేస్తే నడుము నొప్పి
కలుపు దీస్తే కాళ్ళ నొప్పి
పొట్టకొచ్చే పొద్దు రాదు పిలగో
తూరుపోడో చందురయ్య
|కట్టమీదీ|
చెరువుకిందా చేప పొచ్చు
చింతకిందా కొంగ రెట్ట
మబ్బుకింద మైల చీర పిలగో
తూరుపోడో చందురయ్య
ఇంటికాడా ఇరుగు పొరుగు
మంచెకాడా పురుగుపుట్ర
తాటికమ్మలె సాటుజేసె పిలగో
తూరుపోడో చందురయ్య
|కట్టమీది|
(…తాటికల్లు రిమ్మ దిరిగినాదో
తూరుపోడో చందురయ్య/
…సుక్కపొద్దు కన్నుగప్పినాదో
తూరుపోడో చందురయ్య)
(* బొత్త- తాటి బొత్త; కేరి గెబ్బె- తాటికాయల్ని కప్పి ఉంచే మూకుడు కేరి= సందు, గిబ్బె= గుబ్బకి వాడుక భాష, గుండ్రనిది, పైకప్పు)
*****
ఆర్ట్ : మన్నెం శారద