నలుపు
-గిరి ప్రసాద్ చెల మల్లు
నేను
నలుపు
నా పొయ్యిలో కొరకాసు నలుపు
రాలే బొగ్గు నలుపు నాపళ్లని ముద్దాడే బొగ్గు
పొయ్యిమీది కుండ నలుపు
నాపొయ్యిపై పొగచూరిన తాటికమ్మ నలుపు
కుండలో బువ్వ నా దేహదారుఢ్య మూలం
నల్లని నాదేహం
నిగనిగలాడే నేరేడు
నల్లని నేను కనబడకపోతే
ఎవ్వరిని నల్లగా చేయాలో తెలీక సూరీడు తికమక
సూరీడు తూర్పునుండి పడమర
నామీదుగానే పయనం
పొద్దుని చూసి కాలం చెప్పేంత స్నేహం మాది
నా పందిరిగుంజకి కట్టిన బఱ్ఱె నలుపు
బఱ్ఱెపై నేను కలిసిపోయిన రంగులు
మేమిద్దరం పోయేదాకా సావాసగాళ్ళం
ఉదయంనుండి రేయిదాకా పొలాలగట్లపై దొంగాటలు
నల్లరేగడిలో రోజంతా గింజకై చెమటలు కక్కిన నల్లని మేను
అలసిన దేహం
నల్లని పొంతలో కాగిన నీళ్ళతో సేదతీరు
నల్లని జుట్టుని తుడుస్తుంటే
నా ఆలి చేతి నల్లమట్టిగాజుల గలగలలు
నల్లని కాటుక తీర్చిదిద్దిన కళ్ళలోని
నల్లని కనుపాపల్లో నేను బందీ ఐన క్షణాల్లో
వాల్చే నల్లతుమ్మ నులకమంచంలో
నల్లని అమాస చీకట్లో మెరిసే చుక్కలపందిరిలో
మేమిద్దరం ఇలలో వేడెక్కి చల్లబడతాం
నలుపంటే ప్రకృతి బంధం
నలుపులేని సృష్టి అసంభవం
జయహో నలుపు
*****