నారిసారించిన నవల-14

డా. పి. శ్రీదేవి

-కాత్యాయనీ విద్మహే 

డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 వ తేదీన అనకాపల్లిలో జన్మించిన శ్రీదేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి సాహిత్యం. స్వయంగా కవిత్వం, కథలు వ్రాసింది.1957 లో ఆమె ప్రచురించిన ‘ఉరుములు- మెరుపులు’ అనే కథల సంపుటికి ముందుమాట వ్రాసిన గోరాశాస్త్రి ఆమెను “స్వయం వ్యక్తిత్వం గల ఆత్మవంతురాలు”  అని మెచ్చుకొ న్నాడు. కాలాతీతవ్యక్తులు నవల ఇతివృత్తంలో స్త్రీలలో ఆస్వయం వ్యక్తిత్వ వికాసనాన్నేప్రధానం చేసింది శ్రీదేవి.

 కాలాతీత వ్యక్తులు నవల తెలుగు స్వతంత్రలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికంగా ప్రచురించబడింది . తక్షణమే ప్రతిస్పందిస్తూ  పి. సరళాదేవి ఈ నవలపై విమర్శ వ్రాయటం ( తెలుగుస్వతంత్ర 8-2-1958 ) ఇది ఆనాడు సాహిత్యలోకంలో రేకెత్తించిన ఉత్సుకతకు , చర్చకు , ఉత్తమ అభిరుచికి నిదర్శనం . ఈ నవలను శ్రీదేవి ‘అన్నివేళలా నేనున్నా నమ్మా! అంటూ చెంతనిలిచి చల్లదనమిచ్చే అమ్మకు’  – అంకితం చేసింది. ఆ తరువాత  నాలుగే ళ్లకే  1961 జులై 29 నాడు తన ముప్పైరెండవ ఏట ఆమె చనిపోయింది.

1 

కాలాతీత వ్యక్తులు నవలేతివృత్త గమనానికి  కేంద్రం విశాఖపట్నం.  ఈ నవలలో పాత్రలుగా వచ్చేవాళ్ళలో కృష్ణమూర్తిది విశాఖజిల్లా పాలకొండ ప్రాంతం.  కల్యాణిది తుని దగ్గర నందూరు . ఇందిరది అనకాపల్లి దగ్గర వూరు. ప్రకాశానిది నిడదవోలు దగ్గర వేలివెన్ను. వసుంధర అక్క రాజమండ్రిలో వుంటుంది. ప్రకాశం మేనమామ శేషావతారం రాజమండ్రిలో ఇల్లు కట్టుకొన్నాడు . ఆయన ప్రకాశం కోసం చూసిన సంబంధం రాజమండ్రిదే. చక్రవర్తి స్నేహితుడు డా . గోపాలరావు నెల్లూరులోవున్నాడు. తిరుపతిలో పెళ్ళి చేసుకోవాలనుకొన్న జంటలు  చక్రవర్తి కల్యాణి , కృష్ణమూర్తి  ఇందిర ఆ డాక్టరుగారింట్లోనే కలుసుకొంటారు.అక్కడి నుండి అందరు తిరుపతి వెళ్తారు. ఆ పెళ్ళిళ్ళయ్యాక విశాఖకు తిరుగు ప్రయాణం. ఆ రకంగా విశాఖలో ప్రారంభమై ఆంధ్రదేశంలోని ఊళ్ళల్లోకి విస్తరిస్తూ తిరుపతి దాకా సాగిన ఈ నవలేతివృత్తమంతా ప్రవర్తించింది ఆంధ్రదేశంలోనే . 

కాలాతీత వ్యక్తులు నవల రచనాకాలం 1957. అప్పటికి స్వాతంత్య్రం  వచ్చి పదేళ్ళయింది . భారత రాజ్యాంగం స్త్రీ పురుష సమానతను ప్రతిపాదించి ప్రాథమిక హక్కులు అందరికీ వర్తించేవిగా రూపొందించింది. ఆదేశిక సూత్రాలలో స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక సూచనలు చేసింది. ఆత్మ గౌరవంతో స్వేచ్ఛా స్వతంత్రాలతో  స్త్రీలు బ్రతకటానికి అవకాశాలు కల్పించటం జరిగింది . 14 ఏళ్ళలోపు బాలికలకు ఉచిత విద్య కొరకు రాజ్యాంగం హామీ ఇచ్చింది . పంచవర్ష ప్రణాళికలలో స్త్రీల సంక్షేమానికి అనుకూలంగా పథకాలు రూపొందించబడ్డాయి . 1955 లో హిందూవివాహచట్టం స్త్రీలకు ఇష్టంలేని వైవాహిక సంబంధాల నుండి వైదొలగటానికి వీలుగా విడాకుల అవకాశాన్ని కల్పించింది . 1957 లో వరకట్న నిషేధచట్టం చేయబడింది. ఇవన్నీ స్త్రీలు స్వతంత్ర వ్యక్తులుగా ఎదగటానికి ఏదో ఒక మేరకు దోహదపడ్డాయి. చదువుకొనే స్త్రీల సంఖ్య, ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య కొంత పెరిగింది. సామాజిక రంగాలలోకి వచ్చిన స్త్రీలు  స్వీయ అస్తిత్వం కోసం తపనతో సంప్రదాయ సమాజంతో సంఘర్షించటం ఈ కాలంలో ప్రారంభమైంది. ఈ పరిస్థితులలో ఎదిగి జీవిస్తూ సంఘర్షిస్తూ వున్న స్త్రీల జీవితం కేంద్రంగా శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవలేతివృత్తాన్ని రూపొందించింది.

కల్యాణిని పరిచయం చేసిన రచయిత్రి కథనాన్ని అనుసరించి చూస్తే ఈ నవల కథ ప్రవర్తించిన నిర్దిష్టకాలం కూడా తెలుస్తుంది . బీహారులో పెద్ద భూకంపం వచ్చిందన్న వార్త ఆ మధ్యాహ్నం గ్రామానికి ఆంధ్రపత్రిక మోసుకొస్తుందనగా , తెల్లవారుజామున నాలుగు గంటలకు అచ్యుతరామయ్య అర్థాంగి ఆడపిల్లను ప్రసవించి, వెంటనే గుండెజబ్బుతో కన్నుమూసింది . ఆ శిశువే కల్యాణి . ( కాలాతీతవ్యక్తులు , ఎమెస్కో బుక్స్ 2002 , పు ; 10 ) బీహారు భూకంపం వచ్చింది  1934 జనవరిలో. ఆ వార్త జనవరి 16 పత్రికలో వచ్చిందని భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి కాంగ్రెసు చరిత్రను చూస్తే తెలుస్తుంది. మధ్యాహ్నం ఆ వార్తను పత్రికలు మోసుకువస్తాయనగా తెల్లవారుఝామున కల్యాణి పుట్టిందంటే అది జనవరి 16 కావాలి . నవలలో కల్యాణి పుట్టినరోజు జనవరి 17 అని వుంది . బీహారు భూకంపం 16 న వచ్చివుంటే 17 అవుతుంది . మొత్తం మీద కల్యాణి పుట్టింది 1934 లో అనేది స్పష్టం. పదిహేనేళ్ళకు కల్యాణి స్కూల్ ఫైనల్ పాసయింది . అంటే అది ( 1934+ 15 ) 1949 అన్నమాట . పదిహేడేళ్ళకు ఇంటర్ పాసయింది . అంటే అది ( 1949 + 2 ) 1951 . ఒక ఏడాది పాటు ఇంట్లోనే వుండి మరుసటి ఏడే వాల్తేరు యూనివర్సిటీలో ఆనర్సులో చేరింది . 1953 లో ఆనర్సులో చేరిందన్నమాట. నవలలో ఆమె కథ భాగమైంది ఇక్కడి నుండే.  

ఆ సంవత్సరం సెప్టెంబరులోనే ఆమె జబ్బుపడింది . డిసెంబరులో తండ్రిని కోల్పోయింది . జనవరి 1954 జనవరి మొదటివారంలో అద్దెగది చూచుకొని వసుంధర ఆశ్రయం  వదిలి వెళ్ళింది . జనవరి 17 న ఆమె పుట్టినరోజు జరుపుకొంది. ఆ రోజు ఆమెకు ఇరవై ఏళ్ళు నిండాయి . ఆరోజే చక్రవర్తితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. వారం రోజుల తర్జన భర్జనల తరువాత అతనిని పెళ్ళాడటానికి అంగీకరించింది . బహుశా ఫిబ్రవరిలో వాళ్ళ పెళ్ళి జరిగి వుండాలి . ఆ రకంగా 1953 జూన్ జూలైల్లో ప్రారంభమైన నవలేతివృత్తం 1954 ఫిబ్రవరిలో ముగిసింది .

 అది మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం అన్న సూచన కూడా నవలలో వుంది. ఇందిర తండ్రి  ఆనందరావు పంచవర్ష ప్రణాళికను వేసిన లాటరీ అంటాడు. గెలుపు ఓటములు చెప్పలేం – గెలుపుమీద ఆశతో ఓపికగా ఎదురుచూస్తే ఫలితాలు రావచ్చు. చేతిలో కాణీలేదని విసుక్కొంటున్న ఇందిరతో ఆనందరావు అన్నమాటలివి . ఇంతకు మించి 1953-54 కాలానికి సంబంధించిన నిర్దిష్ట ఘటనలేవీ ఈ నవలేతివృత్తంలో భాగం కాలేదు . అయితే ఆనాటి సామాజిక స్థితిగతులను  సూచించే అంశాలు అనేకం ఇందులోవున్నాయి. ఆనందమూర్తి స్నేహితుడు భావన్నారాయణ ప్రస్తావన పోలీసు వ్యవస్థలోని అవినీతిని, కాంగ్రెసు రాజకీయాలలో ప్రవేశించిన కల్మషాన్నీ సూచిస్తుంది. మధ్యపాన నిషేధం అమలులో వున్న ఆకాలంలో ఆనందమూర్తి స్నేహితులతో తాగుతూ పోలీసుల కళ్ళబడి జైలుపాలు కావటం గమనించదగింది. 

ఈ నవలలో ఆనందరావు గురించి చెప్పేటప్పుడు మొదటి ప్రపంచయుద్ధం ప్రస్తావన, కల్యాణి గురించి చెప్పేటప్పుడు రెండవప్రపంచయుద్ధం ప్రస్తావన వస్తాయి. కల్యాణి తండ్రి అచ్యుత రామయ్య గురించి చెప్పేటప్పుడు ఉప్పు సత్యాగ్రహం ప్రస్తావన  ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు ప్రస్తావన వస్తుంది. ఇవన్నీ అటు ఆనందరావు మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని , ఇటు అచ్యుత రామయ్య మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్నిఅర్ధం చేసుకొనటానికి సూచికలు అనుకోవచ్చు. 

ఆడపిల్లల చదువుపట్ల పెరుగుతున్న అనుకూల దృక్పథం కల్యాణిని తునిలో వుంచి హైస్కూలు చదువు చదివించటంలోనూ, ఉన్నత విద్యకోసం విశాఖకు ఒంటరిగా పంపటంలోనూ కనబడుతుంది. వసుంధర చదువుకోసం ఆమె అన్నలు స్థితిమంతులు గనుక ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పిన్ని వరుస ఆవిడని వండి పెట్టటానికి మంచీ చెడ్డా చూడటానికి వుంచారు . మగపిల్లలు చదువులకోసం పల్లెలు వదిలి పట్నాలకు రావటం లాడ్లీ గదులల్లోనూ, ఇతరత్రా గదులల్లోనూ వుంటూ హోటలు భోజనం చేస్తూ చదువుకొనటం కృష్ణమూర్తి, ప్రకాశం విషయంలో చూస్తాం . కల్యాణి పెరిగిన తీరు చెప్తూ పదేళ్ళ కల్యాణి గజేంద్రమోక్షం, వేమన శతకం, రుక్మిణి కల్యాణం కంఠస్థం చేసిందని, కరణంగారి కోడలు దగ్గర చిలకమర్తి నవలలు ఎరువు తెచ్చుకొని కూడ బలు క్కుని చదివిందని చెప్పిన విషయం 1940 వ దశకానికి స్త్రీలకోసం ఉద్దేశించబడిన చదువు స్వరూపాన్ని సూచిస్తుంది. ఆధునిక వ్యవస్థీకృత ఇంగ్లీషు విద్యావిధానం కన్న భిన్నంగా స్త్రీలకు ఇంటి దగ్గర చెప్పే చదువు స్వరూపం ఇది. నవల స్త్రీలు చదువుకొనే ప్రక్రియగా స్థిరపడిన విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. 

కల్యాణికి పదకొండేళ్ళు వచ్చేసరికి పెళ్ళికొడుకును వెతకమని పిన్ని చెప్పిన మాటలు ఆడపిల్ల పుట్టిందంటే పెళ్ళే పరమార్థంగా భావించే సామాజిక సంస్కృతిని సూచిస్తాయి . స్వాతంత్య్ర ఉద్యమ చైతన్యం నుండి అచ్యుతరామయ్య ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని ఈ పసిపిల్లకి పెళ్ళా వీల్లేదు అని పిన్నిగారి మాటను కొట్టేసి వందరూపాయలు అప్పుచేసి కూతుర్ని పినతల్లినీ తునిలో పెట్టి చదివించాడు. హైస్కూలు చదువు పూర్తయ్యాక తెలివైన పిల్ల పై చదువులకు పంపండి అని ఒకవైపు టీచర్లు కల్యాణి గురించి చెప్తున్నా పినతల్లి అమ్మాయికి పెళ్లి చేసెయ్యాలని మళ్ళీ గోలచేయటం సమాజంలో ఆడపిల్ల చదువుకున్న అవరోధాన్ని సూచిస్తుంది. వైద్యవిద్య ఆనాటికే ఖరీదైన విద్యగా వుంది. ఎం.బి.బి.యస్ , చదివి లేడీ డాక్టరవ్వాలన్నది కల్యాణి స్వప్నం అయినా అంత చదువుకి నాన్న తూగలేడని లోలోపల కుములుతూనే ఆనర్స్ చదువుకు సిద్ధపడింది . చదువుకొనే ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహాలు చేసి వంశ గౌరవానికి మచ్చ తెస్తారేమోనన్న శంకతో వాళ్ళమీద నిఘావుంచటం హెచ్చరించటం వసుంధర విషయంలో ఆమె పిన్ని ప్రవర్తనలో మాటల లో వ్యక్తమవుతుంది . 

పెళ్ళిళ్ళల్లో కట్నం ఒక ముఖ్యాంశం కావటం కల్యాణికి సంబంధాలు వెతుకుతున్న అచ్యుత రామయ్యగారి అనుభవంలో విషయం . రెండువేల రూపాయల కట్నమైనా లేనిదే కల్యాణికి పెళ్ళి అసాధ్యమని తెలిసి వచ్చాకనే అతను అంతకంటే అమ్మాయిని పై చదువులకు పంపటమే మేలనుకొన్నాడు. వరుల మార్కెటులో ధర వున్నవాడని ప్రకాశం గురించి తెలిసినవాడు కనుక మేనమామ అతన్ని చవగ్గా కొట్టేయాలని చూస్తున్నారని కల్యాణి నుండి ఇందిర నుండి ప్రకాశాన్ని రక్షించుకొని తనఅదుపులో వుంచుకొనాలని ప్రయత్నించి కృతకృత్యు డయ్యాడు.

డబ్బు ఒక ప్రధానమైన విలువగా మారటం , డబ్బు సంపాదనలో స్వపర భేదంలేని స్వార్థపరత్వం వేరూనుకొనటం ఆనాటి సామాజిక పరిణామంలోని అంశం.  రామినాయుడు తనకిచ్చిన వెయ్యి రూపాయలను రామినాయుడు చనిపోయాక శవంతోపాటు వారసులకు అప్పగించినప్పుడు వాళ్ళు డబ్బుగురించి తీసిన ఆరాలు డబ్బే ప్రపంచంగా  వున్న స్థితిని గురించి  డబ్బు చంపుతుంది కానీ చావదన్న కొత్త జ్ఞానాన్ని కల్యాణికి ఇస్తాయి . ప్రకాశం మేనమామ శేషావతారం డబ్బు రూపేణా లాభం లేకుండా ఏ పనీ చేయడు. చెల్లెలి ఆస్తితో చెల్లెలి కొడుక్కు చదువు చెప్పించినా అంతే , ఊళ్ళో పెళ్ళిళ్ళు కుదిర్చినా అంతే , మేనల్లుడి పెళ్ళి స్థిరపరిచినా సరే అన్నింటిలో తనవాటా తనకు రావల్సిందే. ఆ రకంగా డబ్బు సంపాదనా,  సంపదల అభివృద్ధి జీవిత లక్ష్యంగా పనిచేశాడు. అరకులోయ దగ్గర స్థలాలు చవకగా దొరుకుతున్నాయని కొనటానికి విశాఖ వస్తాడు అతను.  విశాఖలో  రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రారంభాలను సూచిస్తుంది ఇది . 

విశాఖపట్నంలో పూర్ణాథియేటర్ , చెంగల్రావు పేట , డాబాతోట , గార్డెన్ వ్యాలీ మొదలైన వాటి ప్రస్తావన నవలాకథకు ఒక వాతావరణాన్ని సమకూర్చగలిగాయి. లక్ష నిట్టూర్పుల లక్ష కన్నీళ్ళ నగరమిది’  అని ప్రకాశం విశాఖ గురించి అనుకొన్నమాట గమనించదగింది . నగరీకరణ క్రమం మనుషుల జీవితాలను ఒంటరివేదనలకు గురిచేస్తున్న విషయం ఇక్కడ సూచితమైంది . ఇలాంటి నగరంలో ఆధునిక యువతీయువకుల జీవిత సంఘర్షణలను చిత్రించింది కాలాతీతవ్యక్తులు నవల . 

2

ప్రకాశం , కల్యాణి , ఇందిర , కృష్ణమూర్తి , చక్రవర్తి , వసుంధరలను చుట్టుకొని పందొమ్మిది వందల యాభైలలో ఆంధ్రదేశంలో ప్రవర్తించింది కాలాతీత వ్యక్తులు నవల కథ. ఈ కథ నడిచే క్రమంలో రచయిత కథనంలో భాగంగానో, పాత్రల ఆలోచనలు, అభిప్రాయాల రూపంలోనో , పాత్రల ప్రవర్తనలపై ఇతర పాత్రల వ్యాఖ్యానాలుగానో,రచయిత వ్యాఖ్యానాలుగానో ప్రేమ, పెళ్ళి కుటుంబం మొదలైన అంశాలపైన చర్చ ఇతివృత్తంతో బాగమై కనిపిస్తుంది. నూతనంగా అభివృద్ధి చెందు తున్న స్త్రీల చైతన్యం, అందులోని వైవిధ్యం కూడా మనకీ నవలేతివృత్తంలో కనబడతాయి . ఈ చైతన్యం దృష్ట్యా పెళ్ళికి నిర్వచనాలు అర్థాలు మారటం కూడా చూస్తాం.  

పెళ్ళివల్ల స్త్రీపురుషుల మధ్య ఏర్పడే జీవితకాలపు బంధం కుటుంబానికి పునాది . ఆ పెళ్ళికి ప్రేమ ప్రాతిపదిక కావాలనేది ఆదునికదృక్పథం.  పెళ్ళి అంటే ఇరుపక్షాల పెద్దలు వధూవరులను ఎంపికచేసి జతపరిచే పద్ధతి . ఇది సంప్రదాయ వద్దతి . ఈ పద్దతి పెళ్ళిళ్ళల్లో దంపతులయ్యే స్త్రీ పురుషుల మధ్య భావాల ఐక్యతకానీ చైతన్యస్థాయిలో సమత్వం కానీ తరచు లోపిస్తుంటాయి . ఈ నవలలో కనిపించే దాంపత్యాల విషయంలో ఇది ఋజువు అవుతుంది . కల్యాణి తండ్రి అచ్యుత రామయ్యగారి గురించి చెప్తూ శ్రీదేవి  అనాకారి మూర్తురాలు భార్యతో ముప్పయ్యేళ్ళు కాపురం చేశాడని అంటుంది . డాక్టర్ చక్రవర్తికి ఇంటరు చదువుతుండగానే అతని తల్లి పన్నెండేళ్ళ పిల్లను చూచి పెళ్ళి చేసింది. అత్తగారు చూపే అభిమానానికి కృతజ్ఞురాలై అత్తగారి కళ్ళద్వారా భర్తను చూచి అతనిని ద్వేషించి సంసారాన్ని నరకం చేసిన ఆ కోడలీని  ఒక నిర్మలమైన మూర్ఖురాలు’ అని పేర్కొన్నది. ఇందిర తండ్రి ఆనందరావుకు లభించిన భార్య ఓ అనాకారి అర్భకురాలు’. 

 అందం చందం ఈడూ జోడూ లేకపోగా చాలా కాపురాలలో మూర్ఖత్వం ప్రధాన లక్షణంగా వున్నట్లు ఈ నవలలో దాంపత్యాల గురించి శ్రీదేవి చెప్పిన మాటలు సూచిస్తున్నాయి . బాల్యవివాహాలు కావటం , ఒకరినొకరు అర్థం చేసుకొనే వాతావరణం , సంస్కారం లేకపోవటం , ఇల్లు తప్ప బయటి ప్రపంచంతో సంబంధమే లేని స్త్రీల విషయంలో అది మూర్ఖత్వంగా రాటుదేలి కనిపించటం దాంపత్యాలను అలా తయారుచేశాయి. ఈ మూర్ఖత్వానికి పరాకాష్ఠ రూపం డాక్టర్ చక్రవర్తి తల్లి. చక్రవర్తికి పెంపుడుతల్లి ఆమె . ఆవిడదీ జలగప్రేమ అంటుంది  శ్రీదేవి . కొడుకును ఎక్కడికీ కదలనివ్వక తన కళ్ళముందుంచుకొనటమే అభిమానం అనుకొంది . అందుకే అతనిని పై చదువుల కొరకు బయటి వూళ్ళకు వెళ్ళకుండా అడ్డుపడింది. గోలచేసింది . పన్నెండేళ్ళ పిల్లను తెచ్చి ఇంటరులో వుండగానే చక్రవర్తికి ఇచ్చి పెళ్ళి చేసింది. ఆ పెళ్ళికి అతను అంగీకరిస్తేనే పై చదువులకు ఆమె అనుమతించేటట్లు షరతు.  కొడుకు చదువు ముగించుకొని వచ్చేసరికి తన అభిమానంతో కోడలిని తనకు నకలుగా తయారుచేసింది . తనకు దగ్గరగా , తనతో స్నేహంగా లేడని తాననుకొని దానినే నమ్మి జీవించి చక్రవర్తికి సుఖం లేకుండా చేసింది ఆ భార్య.తన ఆరోగ్యం పాడు చేసుకొంది . చివరకు క్షయవ్యాధికి లోనయి చనిపోయింది . ఇలాంటి మూర్ఖతలు కుటుంబంలో స్త్రీ పురుషులిద్దరి జీవితాలను భగ్నం చేస్తాయి. ఇది గతానికి సంబంధించినది. మరి ఆధునిక సమాజంలో వైవాహిక సంబంధాలను స్త్రీ పురుషులిద్దరికీ సుఖకరంగా మార్చుకొనటం ఎలా ? దానికి యుక్తవయసు  పెళ్ళిళ్ళు, వధూవరుల ఇష్టంతో చేసుకొనే పెళ్ళిళ్ళు మాత్రమే తగినవి. ఈ విష యాన్ని ఈ నవలేతివృత్తం రకరకాలుగా నిరూపించింది .. 

కాలాతీత వ్యక్తులు నవల కథ ప్రారంభమై ముగిసేసరికి ప్రకాశం పెళ్ళి , కల్యాణి చక్రవర్తుల పెళ్ళి , ఇందిరా కృష్ణమూర్తుల పెళ్ళి జరుగుతాయి . వైదేహి పెళ్ళి విషయం , వసుంధర పెళ్ళి విషయం ప్రస్తావనకు వస్తాయి . 

కల్యాణి  ఒక్కత్తే యీ జీవితానికి అర్ధం అనుకొన్న ప్రకాశం, యిద్దరం ఒకరికొకరం తోడు అని,  ఇక నీకు ఒంటరితనమే లేదని కల్యాణికి నమ్మకం ఇచ్చిన ప్రకాశం కల్యాణి తండ్రికి జబ్బుగా వుందని వూరెళ్ళగానే కల్యాణి గురించి ఆలోచిస్తూనే ఆమెకు అవసరమైతే డబ్బు పంపగల తాహతు తనకుందా అని ఆందోళన పడుతూనే ఇందిర సాన్నిహిత్యంలో ఆ ఆందోళన మరిచిపోతూ అన్ని విధాలా ఏకాకిని నన్ను విడిచి పెట్టకు అంటూ ఇందిరను దగ్గరకు తీసుకొని ఆమెతో సంబంధం ఏర్పరచుకొన్నాడు. మేనమామను ఎదిరించే ధైర్యంలేక అతను చూపించిన అమ్మాయిని పెళ్ళాడటానికి సిద్ధపడ్డాడు. ఇందిరా , కల్యాణి  ఎవరూ వీళ్ళంతా ? వాళ్ళకు పనికివచ్చే మగాడికి ఉచ్చులు పన్నేరకం అని వాళ్ళమీదకే నేరం తోసేసి అమ్మకోసం , మేనమామకోసం అని తన ప్రవర్తనకు ఒక సంబద్ధతను సమకూర్చుకొని రాజమండ్రి పిల్లను చేసుకోవడమే మంచిది అనుకొంటాడు . ” ఎన్నటికైనా సంప్రదాయంలో యిమిడి జీవించడంలోనే సుఖముంది . . . ” అన్న నిర్ధారణకు కూడా వస్తాడు . పెళ్ళిద్వారా కొత్తరకం సంబంధం ఏర్పరచుకొనాలన్న ఆశయంకానీ , ప్రయత్నం కానీ ప్రకాశంలో అసలు లేవు . అలాంటి ఆలోచనకు , ఆశయానికి , ప్రయత్నానికి వ్యక్తి బాధ్యత, సంస్కారం ఎంతో ముఖ్యమైనవి. తన జీవితానికి తాను బాధ్యత వహించగల స్థాయి ప్రకాశానికి లేదు . తాను చదువుతున్న మెడిసిన్ చదువువల్ల ఒంటరిగా వుంటున్నందువల్ల ఒకసారి కల్యాణిని , ఒకసారి ఇందిరను తాను పెళ్ళాడాలనుకొన్నాడు కానీ అతనెప్పుడూ స్వతంత్రుడు కాడు.  మేనమామ దయాధర్మాల మీద ఆధారపడి వున్నానని అతనెప్పుడూ మరిచిపోలేదు. తన ఆస్తిమీద ఫలసాయాన్నే అతను తనకోసం ఖర్చు పెడుతున్నాడని తెలిసి కూడా మేనమామను ఎదిరించ లేకపోయాడు. మేనమామ అధికారానికి, సంప్రదాయానికి అతనెప్పుడూ బానిసే . స్వతంత్ర ప్రవృత్తి లేనివాడు కనుకనే ప్రకాశం పెళ్ళి విషయంలో ఆధునిక దృక్పథంతో ప్రవర్తించలేక పోయాడు. స్వతంత్ర ప్రవృత్తిలేనివాడు కనుకనే ఇందిర అతనిని అసహ్యించుకోంది . తిరస్కరిం చింది .

 సంప్రదాయంలో సుఖముంది అని ప్రకాశం పెద్దలు కుదిర్చి చేసే పెళ్ళికి తలవంచితే వైదేహి ఎదురీతకు ప్రయత్నించింది . స్కూల్ ఫైనల్ నుండే చదువు మానిపించి ఆమెకు పెళ్ళి చెయ్యాలనుకొన్నారు . బి.ఏ. దాకా కూతుర్ని చదివించాలన్న తల్లి సంకల్పం వల్ల చదువు సాగింది . కానీ పెళ్ళి ప్రయత్నాలు మాత్రం సాగుతూనే వున్నాయి . అన్నలు ఏదో సంబంధం తేవటం ముక్కూ మొహం తెలియనివాడిముందు పెళ్ళిచూపులకు కూర్చోనని ఆమె ప్రతిసారీ గోలచేయటం నడుస్తున్న చరిత్ర. పాతికేళ్ళు దాటి ఉద్యోగం చేస్తున్నా ఆమెకీ బాధ తప్పలేదు. పెళ్ళి సంబంధాలు తేవటం, పెళ్ళి చూపులకు సెలవు పెట్టమనటం , వాళ్ళ గొంతెమ్మ కోరికలు పెళ్ళికి ఆటంకం కావటం జరుగుతూనే వుంది . ఒక ఏడాదిలో యాభై మందికి తనను చూపించారని ఇందిరతో ఎప్పుడో ఆమె చెప్పుకొన్నది. నా యిష్టం వచ్చిన వాడిని నేను చూసుకుంటాను అని ఆమె నిక్కచ్చిగా చెప్పినా వాళ్ళు వినిపించుకోక పాతపద్ధతిలోనే ప్రవర్తిస్తుంటే ఇల్లు వదిలి వచ్చేసింది . పెళ్ళిళ్ళను కుదిర్చే సంప్రదాయ పద్ధతి మీద ఆధునిక స్త్రీ ప్రకటించిన నిరసనగా ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు . 

ఇల్లు వదిలిన వైదేహి ఇందిర ఇంటికి వచ్చింది . సాయంత్రం ఆఫీసునుండి ఇందిరవచ్చి విషయం తెలుసుకొంటుంది. సంభాషణా సందర్భంలో ఎవడైనా స్వప్న సుందరుడు ఉన్నాడా ఏమిటి కొంపతీసి అని అడుగుతుంది ఇందిర . అలాంటిదేం లేదంటూనే అంతటి అదృష్టమా అంటుంది వైదేహి. అంతటి అదృష్టమా అని అనటంలో ఆ అదృష్టం తనకు దొరకలేదన్న నిస్పృహ ధ్వనిస్తుంది. తనకు తాను ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడే అదృష్టం అవకాశం తనకు లేకపోయాయన్న చింత ఆమెలో వుంది. అందుకనే ఆమె నా కలాంటి ఆశలులేవు. ఉన్నా అవి జరగవు అని అనగలిగింది – ఇందిర నొక్కి నొక్కి అడిగితే అతనికి ఇదివరకే ఎప్పుడో పెళ్ళయి పోయింది . అంచేత అవన్నీ మరిచిపోయాను పూర్తిగా . . . అంటుంది . అంతేకాదు ఇప్పుడు నేను సుమారయిన ఏ మొగాడితోనైనా సుఖపడగలను. కాని మావాళ్ళు తీసుకొచ్చే బృహస్పతులందరూ చెల్లని కానీల్లాంటివాళ్ళు. మా అన్నయ్యల మనస్తత్వంతో వెతికితే అలాంటివాళ్ళే దొరుకుతారు మరి  అందుకే నా బాధ ” అని చెప్పిన విషయం గమనించదగింది. వాళ్ళ అన్నయ్యల మనస్తత్వం ఏమిటి? అమ్మాయిని అన్ని సమయాల్లోనూ అతి భద్రంగా కాపాడాలనే మనస్తత్వం కుటుంబ గౌరవం అంటే పడిచచ్చే తత్త్వం. అలాంటి మనస్తత్వం, తత్త్వం వున్న వరుడినే వాళ్ళు తీసుకు వస్తారు . అలాంటి వాళ్ళతో జీవించటం సాధ్యంకాదని వైదేహి వాటిని తిరస్కరిస్తుంది. ఆధునిక యువతి తాను ఒక వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకొని ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొనటానికి అవకాశం వుండే పెళ్ళిని వాంఛిస్తున్నదని వైదేహి ప్రవర్తన స్పష్టం చేస్తుంది . 

వసుంధర కృష్ణమూర్తితో ప్రవర్తిస్తున్న తీరు పై పిన్ని వ్రాసిన ఉత్తరానికి జవాబుగా , తానే వచ్చాడు వసుంధర అన్నయ్య . ఒక గౌరవ వంశానికి చెందిన విద్యావతి ఎలా నడుచుకోవాలో తన తాహతుకి తగిన వరుడు ఎటువంటివాడై యుండాలో , వివరించి చెప్పిపోయాడు . కృష్ణమూర్తి పట్ల తన ప్రవర్తనలో ఏమైనా ప్రత్యేకత వున్నదా అని వసుంధర తరచి చూచుకొంది. ఒకవేళ ఉందను కొన్నా దానిని విపరీతంగా చూచి హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఏముందని అనుకొంటుంది .  “తనలోని స్త్రీత్వం మేలుకుంటే ఆ బాధ్యతలూ మంచి చెడ్డలు తనవి కావా ? అయితే తనకింక వ్యక్తిత్వమనేది ఎక్కడుంది ? ” అని వసుంధర అనుకొన్న మాటలు ముఖ్యంగా గమనించదగినవి . పెద్దలు కుదిర్చి చేసే పెళ్ళిలో స్త్రీ పురుషులిద్దరికీ ఏ బాధ్యతా లేదు. తమ జీవితానికి తాము బాధ్యత వహించాలనుకొనటం ఆధునిక యువతీ యువకుల లక్షణం. వసుంధర ఆ కోవలోదే . తానే పురుషు డితో సంబంధం, బంధం ఏర్పరచుకొన్నా తన స్వంత బాధ్యత మీద ఏర్పరచుకొనాలనే దృష్టి ఆమెలో వుంది. తమ జీవితాలకు తాము బాధ్యత వహించలేకపోవటమంటే వ్యక్తిత్వాన్ని వదులు కొనటమే అన్నది ఆమె విజ్ఞత . 

ఈ విజ్ఞతను జీవితం పొడుగునా ప్రదర్శించిన వాళ్ళు కళ్యాణి,ఇందిర. ప్రకాశాన్ని తన తోడు గా ఎన్నుకొనటంలో కల్యాణి  స్వీయ వ్యక్తిత్వమే కనబడుతుంది. ఎవరి ప్రేరణలు ఎవరి ఒత్తిడులు లేవు. తన శారీరక మానసిక వేదనలకు ఊరటనిచ్చే సానుభూతి, స్నేహం అతని నుండి లభించాయి కనుక ఒకరికొకరం తోడుగా వుందాం అన్న అతని పిలుపుకు ప్రతిస్పందించింది . పరిణామాలకు బాధ్యత వహించింది. ఊరు వెళ్ళి వచ్చేలోగా ప్రకాశం మారిపోతే ఆ విషయం మీద అతనిని ఏమీ ప్రశ్నించకుండానే తప్పుకొంది. చక్రవర్తి తనపట్ల చూపిస్తున్న ఆసక్తిని, శ్రద్ధను పట్టించుకోనట్లే ప్రవర్తించినా తన ఒంటరివేదనకు ఊరటకొక ఊతగా అతనిని చేసుకొంది . అతను తనను పెళ్ళాడతాడా  పెళ్ళాడడా అనే ప్రశ్నే లేకుండా అతనికి తనను అర్పించుకొంది . ఆ రకంగా తన జీవితానికి సంపూర్ణ బాధ్యతను ఆమె తీసుకొన్నది . 

తనకు కావలసింది ఆర్ధిక భర్తకాదు. ఆ మాటకొస్తే భర్త అనే మాటలోని సాంఘిక అర్థాన్ని అమలులో పెట్టే వ్యక్తి కూడా కాదు ” అని కల్యాణి అనుకొన్న మాటలు గమనించదగినవి . భర్త అంటే భరించేవాడు అన్నది పాత మాట.  ఆధునిక స్త్రీ ఆర్ధిక స్వతంత్రతను  కోరుతున్నది. అందువల్ల ఆమెకు ఆర్ధిక భర్త అవసరంలేదు. అట్లాగే పెళ్ళి స్త్రీకి ఒక సాంఘిక గౌరవాన్ని కల్పించే వ్యవస్థ అంటారు. మగవాడు స్త్రీకోసం పెళ్ళిని ఆమోదిస్తే స్త్రీ సంఘం కోసం పెళ్ళిలోకి వస్తుంది. అయితే ఆధునిక యువతి తనదైన సామాజిక కార్యక్షేత్రాన్ని ఎన్నుకొని ఒక ప్రత్యేక వ్యక్తిగా ఎదగటానికి , గుర్తింపు పొందటానికి తహతహలాడుతున్నది. అటువంటప్పుడు ఆమె సాంఘిక హోదాకోసం పెళ్ళాడవలసిన అవసరం లేదు. ఈ రకమైన ఆధునిక యువతీ లోకానికి ప్రతినిధిగానే కల్యాణి  ఆర్థిక అవసరాల కోసం, సాంఘిక ప్రయోజనాలకోసం అయితే తనకు పెళ్ళి , పెళ్ళివల్ల లభించే భర్త అవసరం లేదని చెప్పగలిగింది. కృష్ణమూర్తి స్నేహితుడుగా మునుసుబు రామినాయుడికి వైద్యం చేయటానికి వచ్చి, బాధ్యతతో తమతోపాటు ఆసుపత్రిలో వుండి తనకూ స్నేహితుడు ఆత్మీయుడు అయి, ఒంటరి వేదనలో అండగా నిలబడి ధైర్యం చెప్పిన డా. చక్రవర్తిని పెళ్ళాడటానికి సిద్ధపడింది భర్త హోదాలో తనను అతను ఎలా స్వీకరిస్తాడోనని సందేహిస్తూ ఊహిస్తూనే అందుకు సిద్ధపడింది . 

పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళిలో తన తల్లి కోణం నుండి తనను అంచనా వేసిన భార్యతోటి కాపురంలో సుఖమన్నది ఎరుగని చక్రవర్తి కల్యాణిని తనుగా ఎంచుకొని పెళ్ళాడటానికి సిద్ధపడ్డాడు . గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రామినాయుడికి సేవలు చేస్తున్న కల్యాణిని నిస్సహాయ స్థితిలో  చూచాడు . జాలిపడ్డాడు. జాలిపడటం ఆమె కసహ్యం అని తెలిశాక గౌరవం పెంచుకొన్నాడు. ఆమె లేనిదే తనకు జీవితం లేదనుకొన్నాడు. భర్తగా తనకు కొత్త హోదా ఇవ్వటానికి భయపడుతున్న కల్యాణిని అర్థం చేసుకొన్నాడు. భర్త అంటే అధికార హోదా . . . స్నేహితుడుగా ఆత్మీయుడుగా చక్రవర్తి ఇప్పటివరకు చూపిస్తున్న అభిమానం, గౌరవం భర్త హోదాలో కూడా చూపగలడా అనేది సందేహం. తనమీద తనకు తప్ప ఎవరికీ, చక్రవర్తికి కూడా హక్కులేదన్న స్వాభిమానం కల్యాణిది . ఇది తెలిసి పెళ్ళికి సిద్ధపడ్డాడు చక్రవర్తి.  ఆమె భయం సహజమైనదన్న గుర్తింపు , అది హామీల వల్ల పోదన్న చైతన్యం, కలిసి జీవించటంలో కొన్నాళ్ళకు పోతుందన్న నమ్మకం చక్రవర్తికి వున్నాయి . ఆధునిక యువతికి భర్తగా వుండటానికి తన అధికార స్వభావాన్ని వదులుకొనవలసిన అవసరాన్ని గుర్తించి అందుకు తగిన ఆచరణను జీవిత లక్షణంగా చేసుకోవటమే చక్రవర్తి సంస్కారం . ఇటువంటి సంస్కారం కలిగిన చక్రవర్తి వంటి పురుషులు అటువంటి స్వాభిమానం, హక్కుల చైతన్యం కలిగిన కల్యాణి వంటి స్త్రీలు స్వయం నిర్ణయంతో చేసుకొనే పెళ్ళి చక్కని కుటుంబానికి పునాది కాగలదని ఆశించవచ్చు. 

ఇందిరకు కావలసిన భర్త అన్ని విధాల బలవంతుడైన ఓ మొగాడు. ‘నేనున్నానులే నీకేం భయం లేదు, నీ సమస్యలు , బరువులు అన్నీ నామీద పడేయ్ అనగలిగే పెద్ద ఛాతీ మొగాడు అవసరమైతే తనకోసం సమస్తమూ వదులుకోగలిగే మొగాడు అయివుండాలి. మగవాళ్ళ తత్త్వం తెలుసు ఇందిరకు. మగవాళ్ళు అంటే  స్త్రీ ఒయ్యారం ఒలకబోస్తే కరిగిపోయే వాళ్ళు, ముద్దు ముద్దుగా తమ సమస్యలు చెప్తే  తీర్చటానికి సిద్ధపడేవాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు,  వెంబడిపడి తిరిగే వాళ్ళు – అని ఆమెకు అనుభవంలో తెలిసివచ్చింది. ఇలాంటి లక్షణాలకు అతీతంగా మనిషిలాగా తోటి మనిషిగా భార్యపట్ల ఆదరంతో ప్రవర్తించగలిగినవాడు కావాలి. అన్ని విధాలా బలవంతుడైన మొగాడంటే భౌతికంగానే కాదు బౌద్దికంగా కూడా బలవంతుడయి వుండటం అని ఇందిరభావం.ప్రేమ పెళ్ళికి ప్రాతిపదిక అన్న భావన వ్యక్తం చేసిన స్త్రీ కూడా ఇందిరే. ప్రకాశం పిరికితనాన్ని అసహ్యించుకొంటూ తిరస్కరించే సందర్భంలో ఆమె ప్రేమకోరిన త్యాగం చెయ్యలేని వాళ్ళు ప్రేమకి అనర్హులు . . . అని వెనకటికి ఎవడో అన్న మాటను తాను అన్నది . ప్రకాశం ప్రేమకి అనర్హుడని ప్రకటించింది . ఈ నవల మొత్తం మీద ఇక్కడ తప్ప ప్రేమ అనే మాట మరెక్కడా ప్రసక్తి కి రాలేదు.  

ఇందిర ప్రేమను కోరుతున్నది . తనను ప్రేమించేవాడు దేన్నయినా వదులుకొనటానికి సిద్ధ పడి వుండాలనుకొన్నది. చక్రవర్తి మేనమామను, మేనమామ అధికారాన్ని, ఆయన అధికారంలో వున్న ఆస్తిని దేనిని వదులుకొనే ధైర్యం చేయలేకపోయాడు. కనుక అతనిని తిరస్కరించింది . కృష్ణమూర్తి తనకోసం కుటుంబాన్ని , బంధువులను , సంఘాన్ని వదులుకొనటానికి సిద్ధపడి తనను పెళ్ళికి ఒప్పించాడు. ఇందిర అతని ప్రేమను ఆ కారణం చేతనే విశ్వసించగలిగింది. అతని ఆ త్యాగమే అతనిమీద ఆమెకు ప్రేమను కలిగించింది. ఈ పెళ్ళివల్ల కృష్ణమూర్తి ఇతరత్రా ఏమి నష్టపడ్డా తనవల్ల మాత్రం నష్టపడకూడదనుకొన్నది.  అతని సంతోషం కోసం ఏం చెయ్యటానికైనా సిద్ధపడింది. అయితే వ్యక్తిత్వాన్ని మాత్రం చంపుకోలేనని ప్రకటించింది.  తన అవసరాలను గౌరవించటం నేర్చుకొమ్మని కృష్ణమూర్తికి సూచించింది. తన యిష్టానికి తనను వదిలినప్పుడే ఇద్దరికీ సుఖం అనీ లేకపోతే అది ఇద్దరికీ నరకమేనని హెచ్చరిస్తుంది . 

కృష్ణమూర్తికి ఆడపిల్లలంటే వ్యామోహం. ఇందిరను చూచిన మొదటిసారి ఎవరోయ్ ఆ మెరుపుతీగ’అని ఆమె పట్ల కుతూహలం ప్రకటించటంలో, ఇందిరతో మాటలు కలపాలని ఉత్సాహం  చూపటంలో, ఇందిరతో వీలయినంత సేపు కాలక్షేపం చేయటంలో, షికార్లు చేయటంలో, ఇందిర   తండ్రితో మామయ్యగారూ అని వరుసకలిపి మాట్లాడటంలో, ఆనందరావు అవసరాలు తీర్చటానికి డబ్బు ధారళంగా ఖర్చు పెట్టటంలో – కనిపించేది ఇదే. ‘అందంగా ఆకర్షణీయంగా నవ్విస్తూ కవ్వి స్తున్న ఇందిర అతనికొక ఆటబొమ్మగా కనిపించింది.హాయిగా ఆడుకొన్నాడు.కానీ కల్యాణి తండ్రి  చచ్చిపోయి, తిరిగివచ్చాక ఇందిర ఇంట్లో ఉండలేనని వెళ్ళిపోయిన సందర్భంలో ఆ సంగతి తెలిసి నప్పుడు ఎక్కడికి వెళ్ళింది?ఎందుకు వెళ్ళింది? అన్న ప్రశ్నలు తనను తొలిచివేస్తుండగా కృష్ణ మూర్తిలో మొదటిసారిగా ఆడవాళ్ళ మనసును గుర్తించే చైతన్యం మేల్కొన్నది . కల్యాణిది మెత్తని మనసు అని గ్రహించి ఆమెకు సాయపడాలని ప్రయత్నించాడు. తనలాగే కల్యాణి పట్ల స్నేహభావం ప్రకటించి సాయంగా నిలబడ్డ వసుంధరను అభిమానించాడు. ఇందిరను అందమైన శరీరంగా మెరుపుతీగగా ఆటబొమ్మగా మాత్రమే చూచిన కృష్ణమూర్తి దృష్టి కల్యాణి పట్ల, వసుంధర పట్ల అందుకు అతీతంగా మనసు గురించి, మనుషుల గురించి ఆలోచించేదిగా పరిణమించింది . ఇందిరకు ఆమె తండ్రికి అవసరాల కోసం డబ్బు ధారళంగా ఖర్చు పెట్టినప్పుడు అది తన విలాసం కోసమే . కానీ కల్యాణి కోసం అతను డబ్బు ఖర్చు పెట్టటానికి సిద్ధపడటం కేవలం ఆమెకోసమే . ఆమె చదువు కొనసాగి ఆమె బ్రతుకు ఆమె బ్రతకటానికి చేయుత నియ్యటం కోసమే. వసుంధరతో మాట్లాడే సందర్భంలో   ‘ఇవ్వడానికి చేతిలో దమ్మిడీ లేకపోవచ్చు . కాని మనస్సు యివ్వడానికేం ఖర్మ . . ?’ అంటాడు కృష్ణమూర్తిమనసు గురించి ఆలోచించే స్థితికి చేరుకొన్నాకనే ఇందిర అతనికి కొత్తగా అర్ధం అయింది. బ్రతుకులో నిలబడటానికి,నిలదొక్కుకొనటానికి నిత్యపోరాటం చేస్తున్న ఇందిరకు తోడుగా నిలబడటం తన ధర్మంగా భావించి ఆమెను పెళ్ళికి ఒప్పించాడు. అందులోనే తనకు మనశ్శాంతి వుందని నమ్మి ప్రవర్తించాడు. మనమేలు కోరేవాళ్ళనీ , కష్టసుఖాల్లో మనల్ని ఆదుకునే వాళ్ళనీ సంతోష పెట్టటమే తన పద్ధతిగా ప్రకటించిన కృష్ణమూర్తి ఇందిరను సంతోషపెట్టి తాను సంతోష పడగలిగిన సంస్కారాన్ని పెంచుకొంటాడని ఆశించవచ్చు . 

ప్రేమ అనే మాటను ఉపయోగించకుండానే పెళ్ళికి స్త్రీ పురుషులిద్దరి మధ్య వుండవలసి నది సమాన మేదో మానసిక చైతన్య స్థాయి అని, గట్టిగా ప్రతిపాదించింది  ఈ నవల.  ఒకరిపట్ల ఒకరికి స్నేహం తప్ప, స్వయంగా, స్వచ్ఛందంగా స్వీకరించిన బాధ్యత తప్ప ఒకరిపై ఒకరికి అధికారాన్ని యిచ్చే వ్యవస్థ పెళ్ళి కాదని కొత్త వ్యాఖ్యానం ఇచ్చింది. భర్తకు భర్త కావటంవల్ల భార్యపై సంక్రమించే సంప్రదాయ హక్కులను, అధికారాలను రద్దుచేయటానికి స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం  అత్యవసరం, అనివార్యం అని నొక్కి చెప్పింది కాలాతీత వ్యక్తులు నవల. 

 (ఇంకా వుంది) 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.