నా కవితా వేదిక
-శీలా సుభద్రా దేవి
బాల్యంలో
బుడ్డీదీపం వెలుగు జాడలో
చాపమీద కూర్చుని అక్షరాలు దిద్దిన నాటి
వెలిసి పోయిన జ్ణాపకం
బొంతచేను పై బోర్లానో, వెల్లకిలో
దొర్లుతూనో గెంతుతూనో
పదాలకంకుల్ని ముక్కున కరుచుకున్న
వల్లంకి పిట్టనయ్యాను
అలా అలా
జంటపిట్ట తో జతకట్టి
కొత్త లోకం లోకి ఎగిరొచ్చి
గూట్లో కువకువ లాడేను
ముచ్చట పడి కొన్న డబుల్ కాట్ మంచం
అన్యాక్రాంత మై పోగా
పాత నవారుమంచమే హంసతూలికైంది
మూడు పంటలు ఒడిలోకొచ్చి
అమ్మతనాన్ని ఇస్తే
మూడు విద్యాపట్టాలు చేతిలోకొచ్చి
ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి
దేహార్తితో పాటూ
మనసాకలి తీర్చుకోవటమైనా
కవిత్వాన్ని పొదిగి సాహిత్యాకాశం లోకి
పిట్టలు గా ఎగరేయటమైనా
దృశ్యాల్ని పేజీల నిండా
పంక్తులు గా అతికించటమైనా
మనసారా సాహిత్య సాగరాన్ని
కళ్ళదోసిళ్ళతో చేదుకోవటమైనా
వేదిక మాత్రం
ఎప్పుడూ నా మంచమే
ఇక ఇప్పుడు
సాయం సంధ్య వెలుగులో
ఇంటి నిండా ఓ ఇరవై కుర్చీలు
ఓ నాలుగు టేబుళ్ళూ కొలువు తీరాయి
అయితేనేం
పాపాయి బొమ్మలబల్ల ఒకటి
తాతగారి రంగులు చిమ్మే చిత్రాల టేబుల్ ఒకటి
మునివేళ్ళతో భూగోళాన్ని తిప్పుతూ
ఇంద్రజాల అంతర్జాలపేటిక
ముద్దుగుమ్మ లా కొలువు తీరి
మురిపించే టేబుల్ ఒకటి
ఇంకొకటి మాత్రం
ఇంటిల్లిపాదీ కబుర్లు నంజుకుంటూ
నవ్వులు చిలకరించు కుంటూ
ఆప్యాయతలు పంచుకుంటూ
కడుపుతో పాటూ
హృదయాన్నీ నింపుకునే భోజనాలు టేబుల్
ఇకపోతే
నాకు మాత్రం
నాటికీ నేటికీ అదే!
రూపు మారిన నా హంసతూలికాతల్పమే
మంచం ఆకాశం నిండా
పరుచుకున్న వేనవేల అక్షరనక్షత్రాలు
మిణుకు మిణుకు మంటూ
పద్యాలమాలని ఎప్పుడు అల్లుతుందా అని
మెరుపు కళ్ళతో నాకోసమే
ఎదురు చూస్తూనే ఉంటాయ్!!!
*****
మేడం గారూ !
మీ జ్ఞాపకాలు కవితా రూపంలో మిమ్మల్ని కట్టిపడేసి చదివించాయి. ధన్యవాదాలు.