బతుకు బీడీలు

-అశోక్ గుంటుక

నా పెళ్లిచూపుల్లో

నాన్నకెదురైన మొదటి ప్రశ్న

“అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?”

లోపల గుబులున్నా

నేనపుడే అనుకున్నా

జవాబు వారికి నచ్చేనని

కట్నం తక్కువే ఐనా

నేనే ఆ ఇంటి కోడలయ్యేనని……….

నీటిలో తడిపి కొంచెం ఆరిన తునికాకు కట్టల్ని

బీడీలు చుట్టే ఆకుగా కత్తిరించాక

ఒక్కో ఆకులో కాసింత తంబాకు పోసి

బీడీలుగా తాల్చి దారం చుట్టేది…….

ఈ రోజుకివ్వాల్సిన వేయి బీడీల మాపుకి

తక్కువైన నాలుగు కట్టల బీడీల్ని

ఇదిగో ఇపుడే చుట్టేశా –

మా అత్త కళ్లల్లో మెరుపుల్ని

ఇట్టే పసిగట్టేశా…………….

బీడీలన్నిటినీ కట్టలుగా కట్టి

వేయి బీడీల మాపు చేసినపుడు

మా ఆయన నన్ను మురిపెంగా

ముద్దుచేసిన ఆనందం………..

పెందలకడ లేచాక

నేను నా బీడీలచాటని తీసికున్న ప్రతీసారీ

నేను నా పాపని మొదటిసారి

పొదిమి పట్టుకున్న అనుభూతి……..

వీధిలోని ఇంతులమంతా పూబంతులమై

ఒకచో కూచుండి బీడీలు చుట్టుతున్నపుడు

పోయినేడంపిన బతుకమ్మ

మా కడ వచ్చి కూచున్నట్టు……

చేసిన ఒక్కో బీడీలకట్ట

ఒక్కో ముద్దబంతిపూవై

గుల్లలోకి సర్దుతున్నపుడు

బంతిపూల బతుకమ్మ పేర్చుతున్నట్టు….

అవును….

ఇదే మా జీవనదృశ్యం

నేను మా కుటుంబం

మా బతుకు బీడీలు…

 

*****

Please follow and like us:

One thought on “బతుకు బీడీలు (కవిత)”

  1. బీడీలతో జీవన నేపథ్యం…. చక్కని చిక్కటి కవిత సర్… నెచ్చెలి థాంక్స్.. 💐🌹🙏

Leave a Reply

Your email address will not be published.