మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్

– పి.జ్యోతి

  ఈ ప్రపంచంలో ఎందరో స్త్రీలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కొందర్ని మనం మనకు అనుకూలంగా గుర్తుపెట్టుకుంటాం, మనం అనుకున్న విధంగా కొందరు లేరని ఆశ్చర్యపడతాం. కాని మన తోటి సామాన్య స్త్రీలను వారి పరిధి నుండి అర్ధం చేసుకునే ప్రయత్నం స్త్రీలమైన మనమే చేయం. సమాజం కోరుకునే ముద్రలలో ఇమడలేని స్త్రీలను, మనకు అర్ధం కాకుండా బ్రతికే వ్యక్తులను, మనకు ఆమోదం కలిగించే విధంగా లేని కొందరి జీవితాలను, ప్రపంచం నిర్దేశించే దృష్టితో మనకు ఆమోదయోగ్యం కాని కొన్ని జీవితాలను అర్ధం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయం. అంత అవసరం మనకు ఉండదు. కాని సమాజంలో స్త్రీలకే అర్ధం కాని స్త్రీ జీవితాలను ఒక్కసారి వెలికి తీసి వారిని అర్ధం చెసుకునే ప్రయత్నం జరిగితే తప్ప స్త్రీ జీవితం పై సమగ్రమైన అవగాహన రాదు. ప్రయత్నం మధ్య ఆధునిక సాహిత్యంలో జరుగుతున్నదాఖలా కనిపిస్తుంది. దానికి నిదర్శనమేమా అమ్మమ్మ సుబ్బలక్ష్మిఅనే పుస్తకం. ఐద్వా వ్యవస్థాపక సభ్యురాలు మైధిలి శివరామన్ గారు FRAGMENTS OF A LIFE అనే పేరున పుస్తకాన్ని ఆంగ్లంలో రచించారు. దానినే తెలుగులో వి.వి.జ్యోతి గారు అనువదించారు. తన అమ్మమ్మ జీవితాన్ని సామాజిక చైతన్యం ఉన్న ఒక మహిళ గా అర్ధం చేసుకునే క్రమంలో మరుగున పడిపోయిన ఎందరో మహిళల మౌన రోదనను వాటి కారణాలను విశ్లేషించే గొప్ప ప్రయత్నం పుస్తకం ద్వారా రచయిత్రీ చేయడం జరిగింది. మనకు అర్ధం కాని సామాన్య మహిళల మౌన తిరుగుబాటు కుటుంబం మెచ్చని వారి జీవన దృక్పధం, విధానం వెనుక ఉన్న కారణాలు, వారి నిస్సహాయ స్థితి వీటన్నిటి కారణంగా దెబ్బతిన్న వారి మనసులు మనకు పేజీలలో కనిపిస్తాయి.

సుబ్బలక్ష్మి గారు రచయిత్రికి అమ్మమ్మ, చదువుకోవాలనే కోరిక బలంగా ఉన్నా సమాజ పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయిన నాటి కోట్ల మంది స్త్రీలలో ఒకరు. బాల్య వివాహం, 14 ఏళ్ళ వయసులోనే తల్లి కావడం, చిద్రమైన బాల్యం లో ఏమీ చేయలేని అసహాయత తో వచ్చే కోపం ఆమెను ఒక విధమైన మానసిక స్థితికి నెట్టేసాయి. తాతగారి సహాయంతో ఆంగ్లం, తమిళం పై పట్టు సాధించి, ఆంగ్ల పత్రిక తాతగారికి చదివి వినిపిస్తూ అంగ్ల భాషపై ఆధిపత్యం సంపాదించగలిగారు. తన డైరీ కూడా ఆంగ్లంలో రాసుకునేవారట. ఇక లైబ్రరీల నుండి పుస్తకాలు తెప్పించుకుని చరిత్ర, సైకాలజీ, ఫిలాసఫీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను ఆంగ్లంలో చదువుకున్నారు. వీరి ఆసక్తికి మెచ్చి నియమాలకు విరుద్ధంగా ప్రఖ్యాత గ్రంధాలయాలలో వీరికి సభ్యత్వం కూడా ఇచ్చారని గ్రంధాలయ పితామహునిగా పేరుగాంచిన రంగనాధన్ గారు వీరికి రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తుంది. తన ఇద్దరు కుమారులు మరణించిన తరువాత దుఖాన్ని తట్టుకోలేక ఆమెకు మూర్చలు రావడం మొదలయ్యింది.

సుబ్బలక్ష్మి గారి భర్త చాలా చదువుకున్నవారే కాని ఆయన ఆంగ్ల వైద్యాన్ని విశ్వసించని కారణంగా ఆమెకు సరైన వైద్యం జరగలేదు. సుమారు నాలుగు దశాబ్దాలు ఆమె రోగంతో ఇబ్బంది పడ్డారు. కొన్ని కారణాల వల్ల ఆసుపత్రిలో ఎవ్వరి అండలేక వైద్యం కోసం రెండు నెలలు ఒంటరిగా ఉన్నారట. అప్పుడు గ్రేస్ అనే ఆమె వీరికి మంచి స్నేహితురాలయ్యింది. ఆమెతో చాలా కాలం ఉత్తరాలు నడిచాయి. కూతురు పంకజం చదువును భర్త వ్యతిరీకిస్తే పుట్టింటికి వెళ్ళి సోదరుడు సహాయంతో బిడ్డను చదివించారు. అక్కడే స్వాతంత్రోద్యమాన్ని పరిశీలిస్తూ కొన్ని కార్యక్రమాలలో పాల్గోన్నారు. చివరి దాకా ఖద్దరే ధరించారు. తన చూట్టూ జరుగున్న ఉద్యమాలను పరిశిలిస్తూ వ్యక్తిగా ఎదిగారు. కాని పుట్టింటి వారు ఆమెను మళ్ళీ భర్త వద్దకు పంపించారు. భర్తతో శారీరిక సంబంధాన్ని ఇక కొనసాగించననే మాట మీద ఆవిడ భర్త ఇంటికి చేరి ఆఖరిదాకా ఒంటరిగా పుస్తకాలు, ప్రకృతే జీవితంగా ఇల్లే ప్రపంచంగా బ్రతికారు.

ఆ నాటి మాములు తల్లుల లాగా తన మనసులోని భావాలను ప్రకటించలేని ఆమె, అందరు అమ్మమ్మలగా ప్రేమను వ్యక్తీకరించలేని ఆమె మనసుకు తగిలిన గాయాలను, నేడు ఒక మహిళ గా  విశ్లేషించే ప్రయత్నంలో జరిగిన మేధోమధనంలో రచయిత్రికి సమాజం మరియు కుటుంబం స్త్రీ ఎదుగుదలను నియంత్రించే బలమైన సాధనాలుగా కనిపించాయి.   స్త్రీని అవి ఎంతటి వేదనకు  గురుచేయగలవో , మనిషిని జీవముండగానే ఎలా మృత ప్రాయంగా అవి మార్చగలవన్నది పుస్తకం ద్వారా బిగ్గరగా ఆలోచించగలిగే అవకాశం మనకు రచయిత్రి కలిగించారు. ఆనాడు ఎవ్వరికీ అర్ధం కాని తిక్క మనిషిగా మిగిలిపోయిన ఎందరో స్త్రీల మౌనం వెనుక వారి మూగ వేదన, తిరుగుబాటు అర్ధం అవుతే ఎన్ని ఘోరాలు సమాజం, సాంప్రదాయం పేరున జరిగి ఉంటాయో అర్ధం చెసుకోవచ్చు. “నేను పద్నాలుగేళ్ళకే తల్లిని అయ్యాను తెలుసాఅని మనవడితో ఆక్రోశంతో చెప్పే ఒక స్త్రీ మనసులోని బాధ తెలుసుకునేంతగా ఇప్పటి సమాజం కూడా ఎదిగిందా అన్నది ప్రశ్నార్ధకరమే.

సొంత బుర్ర ఆలోచనలు ఉండి అవి ఎదగకుండా నియంత్రించే వాతావరణంలో, వారి బుద్దిని, మనసుని కట్టడి చేసే సమాజం మీద వారు చేసిన తిరుగుబాటును అర్ధం చెసుకునే స్థాయిలేక, అర్ధం చేసుకున్నా మార్చగలిగే, ప్రశ్నించే శక్తి లేక ఇటువంటి అర్దం కాని స్త్రీలందరినీ వింత వ్యక్తులుగా, తిక్క వ్యక్తులుగా ముద్ర వేసి మర్చిపోతారు వారికి సంబంధించిన వారు. కాని తిక్క వెనుక భారమైన గుండెలను, వాటికయిన గాయాలను చూడాల్సిన అవసరం ఇకనన్నా ఉంది అని, స్త్రీల చర్యలను కాదు, వాటి వెనుక ఉన్న వారి అసహాయమైన పరిస్థితులను అధ్యయనం చేయకుండా స్త్రీల జీవితాలను, ఆలోచనలను మార్చలేమనే నిజం ఇటువంటి పుస్తకాలు చదివితే కలుగుతుంది. స్త్రీల జీవితాలను పరిశిలీంచే దృష్టిలో మార్పు వస్తుంది

జీవితంలో కొన్ని ఘన విజయాలను సాధించిన స్త్రీలు అదృష్టవంతులే. వారి విజయాల వెనుక వారి పోరాటం ఉంది. కాని అన్ని పోరాటాలు ఫలితాలను ఇవ్వవు. కుటుంబ స్త్రీలు చేసే పోరాటం ఎవరికీ అర్ధం కాదు. తమ జీవితాలపై నియంత్రణ తమ చేతిలో లేని విధంగా జీవించిన స్త్రీలు మనకు ఎన్నో తరాల నుండి కనిపిస్తారు. పితృ స్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ప్రాధాన్యం లేని వీరి జీవితాలలో వారు సాగించిన మౌన పోరాటాన్ని చూడడానికి, అర్ధం చేసుకోవడానికి, ఎంతో ఓపిక, విశ్లేషించే సామర్ధ్యం గల నేటి తరం స్త్రీలు ముందుకు రావాలి. ఆ ఎందుకూ పనికిరాని జీవితాలలో వారి అసక్తతను నిరాసక్తను వారు ఎదుర్కున్న పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. ప్రతి మనిషికీ మేధ ఉంటుంది కదా. ఆలోచించడం మనిషి సహజంగా చేసే పని. కాని తమ మేధను ఆలోచించకుండా నియంత్రించుకోవలసిన వారి కారణాలను అర్ధం చేసుకుంటే మనం గొప్పగా చెప్పుకునే కుటుంబాల మధ్య ఎంతో క్రూరంగా నలిగిపోయిన జీవితాలు కనిపిస్తాయి. ఆ స్త్రీలు నిజంగా అలా బ్రతకాలని కోరుకున్నారా? కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ నీతి మధ్య ఐచ్చికంగా నలిగిపోయారా అన్నది వారి జీవితాలను పరిసీలిస్తూ మనం వేసుకోవలసిన ప్రశ్నలు. ఈ నవల చదివిన తరువాత మన ఇంట్లోని అమ్మమ్మలు, బామ్మలు గుర్తుకు వస్తారు, వారిని మనం ఎప్పుడన్నా అర్ధం చేసుకునే ప్రయత్నం చేసామా? వారి జీవితాలను వారు ఇష్టపూర్వకంగా గడిపారా? నోరు విప్పి చెప్పనంత మాత్రాన వారిలోని మౌన వేదనను మనం పట్టించుకోకుండా ఎందుకు వదిలేసాం? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ కలుగుతాయి. కారణం సుబ్బలక్ష్మి లాంటి స్త్రీలు మనకు మన గతంలో కనిపిస్తారు. ఏ ఫామిలీ ఫోటోలోనే, మూలన పడేసిన పాత వస్తువుల జ్ఞాపకాల మధ్య వారు కనపడుతూనే ఉంటారు. ఒక్క క్షణం ఆగి వారి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటే వారికి పురుషులు కాదు మనం స్త్రీలుగా చేసిన అన్యాయం అర్ధం అవుతుంది. అది అర్ధం చేసుకోకుండా స్త్రీ స్వాతంత్ర్యం గురించి పూర్తి అవగాహన పొందలేం. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.