పలుకేబంగారాలు
-వసంతలక్ష్మి అయ్యగారి
అమ్మలదినం .. అయ్యలదినం తోబుట్టువుల దినం స్నేహదినం డాక్టర్లదినం , యాక్టర్లదినం యీ క్రమంలో నోటిదినం అంటూ యింకా పుట్టలేదుకదా!
ఏమైనా ప్రస్తుత కాలంలో సర్వేంద్రియాణాం నోరే ప్రధానం!!పదునైనదానోరు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన వాక్కు ను వెలువరించేదానోరే కదా!
అవతలి మనిషిని ఆకట్టుకొనేదీ ఆ నోరే..అల్లంత ఆవలికి నెట్టేసేదీఆ నోరే!
మన జీవితంలో ఎన్నిరకాలు తింటున్నామో..అన్ని రకాల నోటితీరులు ..మాటతీరులు చూస్తుంటాం.
ముందుగా బాహ్యప్రపంచానికి చెందినవి.
రాజకీయనాయకుల ఉపన్యాసాలు..హెచ్చు శృతి ..అధిక శ్రమ..వాళ్ళ నోళ్ళకు!
ప్రవచనకర్తలు,సూక్తులూ పిట్టకథలూ జోడించి చెపుతూ ఆకట్టుకునే కేటగిరీ. కాంట్రవర్సీలున్నా కొట్టుకుపోతాయి!
ఉపాధ్యాయులు,నోబుల్ వృత్తి.జీవితాంతం తమ విద్యార్థుల మదిలో గుడి కట్టించుకుని చిరస్థాయిగా జీవిస్తారు!
సినీ,నాటక,రంగస్థలమీడియా కళాకారులకు వాగ్దేవి ప్రసాదించిన వరం వారిగళం.గళవిన్యాసాలతో వినోదాలు పంచుతారు వీరు!
మాటతో ముడిపడిన వృత్తి వీరందరిదీ.మరి.
మిగిలిన మంది మార్బలం మాటేమిటీ ?
1.”బాగున్నారా..”అన్నపలకరింపులోనే విపరీతార్థాలు.వీరిలో ఓ చెప్పుకోదగ్గ రకం…మీరుబాగున్నారా…పిల్లలు బాగున్నారా..అమ్మానాన్నా…యింకా..యింకా…!!అవతలివారు…ఎవరోఒకరిగురించి..”ప్చ్..వాళ్ళకస్సలు బాగోలేదు..”అనే జవాబొచ్చే వరకూ..కుశలం అడుగుతూ పోతారు.
2. వీరు ఊపిరి సలపకుండా ప్రశ్నలవర్షం కురిపిస్తారు.ఆ విషయాలు తమకెంతవరకు అవసరమనిగానీ,సందర్భోచితమా అనిగానీ యింగితం ఉండదు.ఒకదానికిచ్చే జవాబు పూర్తయ్యేలోగా..రెండోదానికి క్లూ సిద్ధమైపోతుంటుందనమాట.
3.వీరు..తామే ఫోనుచేసి…హలో..అంటూనే..ఏంటి విశేషాలు..చెప్పండిచెప్పండి …అంటారు..పర్సనల్గా కలిసినా వీరి ధోరణింతే…తమ కబుర్లు,కనీసం విశేషాలు మచ్చుకైనా ఒలకపోయరు.నిండుకుండలనమాట.
4.కొంతమందికి entertainment చాలా కావాలి..కానీ వారిదిమాత్రం సైలెంట్ పార్టిసిపేషనే.రెచ్చగొట్టి కూర్చుంటారు.కికికికీ మని నవ్వుతూనే ఉంటారు.
5.వీరికి క్యూరియాసిటీ అధికం.వారిదంతా గుట్టు.అవతలి వారి సమాచారం కోసం పడరానిపాట్లు పడతారు.
6.వీరు ప్రశ్న అడిగి , వారికి రుచించినా,రుచించనిజవాబు వచ్చినా ఆకాశంలోకి కళ్ళు తిప్పేసి అర్జంటుగా పట్టపగలే తారలు లెక్కించే పనిలోపడి యివతలివారిని అవమానించి ఆనందిస్తారు.
7.వీరు ఓ ప్రశ్న అడిగి జవాబు మొదలయ్యేలోగానే రెండోప్రశ్న వేసేస్తారు.వినడం వారి అభిమతంకానేకాదుమరి!కొండొకచో..రెండోప్రశ్న [పార్టీల టైములో]టర్నింగిచ్చుకుని మరొకరిని పలకరిస్తూ జారుకుంటారు.తిరిగి సీను రిపీట్!
8.ఇవికాక..కలిసిన ప్రతివారిని పలకరించి..వాగ్వాదంలోకి దిగే రకం మరోటి.
గ్రూప్ డిబేటు,సోలో వక్తృత్వం,స్వోత్కర్ష ,సెల్ఫ్ డబ్బా,పాతకక్ష లేవైనా ఉంటే దులిపేసే పని,”మీకేంటమ్మా”టైపు,అన్నవనీ అనేసి ”సా రీ ”అనేమరోటైపు,…..యివన్నీ ఓ కే కానీ..అసలు కేటగిరీ ఓటుంటుందండీ..
వారి మనసంతా కుబుద్ధి,కుట్ర,కుళ్ళే…!!కాని మాటలను తేనెలో ముంచి వినిపిస్తారు..తేనెపూసిన కత్తులు వీరు…చిక్కరు…దొరకరు.
హాఁ..అన్నట్టు బుర్రలోకి వచ్చిన ఆలోచనాతరంగమేదైనా పదిమందితో నోటితో వీలుకానిపక్షంలో యిలా చేతి వేలు తో పంచేసుకునే నాలాంటి నోళ్ళూ ,వేళ్ళూ కూడా లేకపోలేదండోయ్!
ఇపుడు మరో కేటగిరీ కెడదామా !
***
పలుకేబంగారాలు
వీరు పదిమందిలోఎదురుపడినా కర్టెసీకోసమైనా పలకరించరు సరికదా మనం విష్ చేసినా ముడుచుకుపోతారదేంటో!?!అలా అని వారికి నాలుకలేదనో,మాటరాదనో అనుకున్నారో…అవెన్లో అప్పడమైపోగలరు!
వీరు నోరు విప్పాలంటే,ఫలానా గెట్ టుగెదర్ లో ఏ వెయిటింగులాంటిదో సంభవించి,భోజనాలకో,వాయినాలకో తప్పనిసరి డిలే ఉండియుండి,కుర్చీల్లో కాళ్ళుజాపుకుని బృందసభ్యుల లోకాభిరామాయణంమొదలవ్వాలి.అందులో యీ ”ప.బం.”గార్లు దేనికో ఒకదానికి కచ్చితంగా కనెక్ట్ అవుతారు..అచ్చం అయస్కాంతం గుండుసూదిని గుంజిలాక్కున్నట్టు.ఇక చూస్కోండి…వారి ధాటి…!లోకో భిన్న అభిరుచుల్లో కొన్నింటిని తొంగిచూద్దాం.
1]పొ…దు..పు..!!సేవింగు స్కీము టాపిక్ తగలాలంతే..!యిక తిరుగే ఉండదు.బేంకులు,పోస్టాఫీసులు,ఫైనాన్సు సంస్థలవడ్డీరేట్లను కంప్యూటర్లకంటే బాగా విశ్లేషించి చెప్పగలరు.టాపిక్కు మారిందో తాళం పడిపోతుంది..ఆటోలాక్ సిస్టమ్లాగ!
2]కేవలం స్టాకు మార్కెట్ సేవింగులకే స్పందిస్తారు.గత కొన్నేళ్ళ నిఫ్టీ,సెన్సెక్సుల ఉత్థానపతనాలు ఉన్నపళంగా చెప్పేస్తారు.అంతేనా..ఆయా కంపెనీల బాలెన్స్షీట్లను సైతం రివర్స్లో చెప్పేసి..డైరెక్టర్ల పేర్లను సర్నేములతో సహా గుక్కతిప్పేస్తారు.
3]పాలిటిక్స్…వీరి ప్రాణం..మోడిగారెన్నిగంటలు నిద్రపోతారు నుంచి..ట్రంపు దొర ఏమందులేసుకుంటాడో చెప్పేయగలరు.వారిభవిష్యవాణి సైతం జోస్యం చెప్పేస్తారు.ఆ రోజు పేపరు అస్సలు చూడక్కర్లేదంతే.
4]సెక్రెటేరియట్ లాంటి పిరజాసంబంధిత కార్యాలయాల్లోఅధికారుల శాఖలు,బదిలీలు ..ఉత్తర్వులు టైపుకాకముందే టకటకా వల్లించేస్తారు.ఏ పనికి ఎటువంటి ఫైరవీ,ఎలా చెయ్యాలోచక్కగా శలవిస్తారు.కాస్త అతిశయోక్తికి వెరవరు.
5]సినిమా రిలీజులు,బాక్సాఫీస్ కలక్షన్లు,హిట్టులు,ఫట్టులూ,ఓవర్సీస్ బడ్జెట్లు,థియేటర్లు,డిస్ట్రి బ్యూటర్లు..లాభనష్టాలు.అలాగే హీరో హీరోయిన్లు,డబ్బింగులు,కమెడియన్లు,విలన్ల జాబితా,జాతకాలు వీరికి కంఠోపాఠం.
6]టీవీ యాంకర్లను,సీరియళ్ళను ఔపోసన పట్టేసి..వాటివయసు,ఎపిసోడ్లనంబరేకాదు..ఏకేబుల్లో ఏనంబర్ చానెల్లో ప్రసారమౌతుందోకూడా చెప్పేస్తారు.
7]గురూజీలు,యాగాలూ,యోగాలూ,బాబాలూ …పిచ్చ కొందరిదైతే…గుళ్ళూ గోపురాలూ,ట్రావెల్స్,టూరిజమ్ అంటే చాలు కనెక్ట్ అయిపోయి తదుపరి ట్రిప్పుకి అప్పుచేసైనా అడ్వాన్సులిచ్చేస్తారు.ప్రవచన కర్తలు,పురాణప్రియులూ కూడా అరుదుగా పలుకే బంగారం కేటగిరీలో దర్శనమిస్తారండోయ్!
8]పెళ్ళిళ్ళూ,పేరంటాలు,నోములూ,వ్రతాలూ…గురించి కదిపారో పూనకాలు తెచ్చేసుకుని విధివిధానాలు అప్పటికప్పుడు మడికట్టుకుని చెప్పేయగలరు.
9]సరేసరి..తెగూతెంపూలేని వంటకాల సబ్జెక్టు ఎవర్గ్రీన్ నాలాంటి కొందరికి.ముందుగా పొయ్ వెలిగించీ..అంటూ పోపుదాకా ఫ్రీ డెమోలే యిచ్చేస్తారు.వడియాలు ఊరగాయలంటే చాలు డాబాలెక్కి ఎండలోకెళ్లి వాటి విధివిధానాలను డెమోలతో చూపగలరు .
10]ఫ్రీ.!!.ఉచితం..!!ఆఫర్లు!! వీరి పెట్ టాపిక్!!నెట్ షాపింగ్ డీటేల్స్..అడిషనల్ !!అమెజాన్ నుండీ పేటియమ్ వరకు..మినిమమ్ ఆర్డర్ నుండి ఆ వారం స్పెషల్స్ చెప్పగలరు.
11]యిళ్ళ స్థలాలు,అద్దెలు..ఏరియావారీగా రియాల్టీ రంగం రియల్ రీల్ చూపిస్తారు.అమరావతి పరిసరాల రేట్ల గ్రాఫ్ ను గీసి చూపిస్తూ వారికంటూ అటువైపేదైనా జాగా ఉందో..తొమ్మిదో మేఘం దిగి కిందకిరానేరారు..జీవితమంతా మబ్బుల్లోనే!
12]కొంతమందిది నేరాలు..ఘోరాల టాపిక్!!యిన్వాల్వ్ అయిపోతారు సబ్జెక్టులో!Accident లను ప్రత్యక్షప్రసారంకంటేబాగా జీవిస్తూ చెబుతారు.
13]వైజ్ఞానిక రంగం పిచ్చోళ్ళూ ఉంటారు గానీ వారికి శ్రోతలుండరు సాధారణంగా!
14] యిక క్రీడారంగం…గల్లీ క్రికెట్టు జట్టు నుండి ఒలింపిక్స్ వరకూ..స్వర్ణ,రజత,తామ్ర పతకాల లోహాల కారట్ల నాణ్యతాప్రమాణాలగురించికూడా వదలకుండా భంగిమలతోసహా రెచ్చిపోయే జోరూ…హోరూ..యీ ప్రసంగకర్తల తీరు!
15]పే కమిషన్,పెన్షన్,రివిజన్,బేసిక్,డియే,పెరిగినపెట్రో,డీజిల్ ,గ్యాస్ ధరలు ఫేవరెట్ టాపిక్ వీరికి.బక్రా దొరకాలేగానీ..బిరియానీ బనాయించేస్తారు.
16]నవలలు,కార్టూన్లు,కార్లమోడల్స్,లేటెస్టు గేడ్జెట్లు,ఫ్లైట్లు,..యిలా తమతమ హాబీలనుగుక్కతిప్పుకోకుండా వక్కాణిస్తారు.
యివికాక..నోరంటూ తెరుస్తే తిట్లు,క్లాసుపీకుళ్ళూ మరికొందరి నైజం.వారు తెరవకపోవడమే నయమని వారికీ తెలుసు!
మరీహైలైట్లెవరయా అంటే…నోరువిప్పితే ”వైట్ లైస్”…అకారణంగా అబద్ధాలు తన్నుకొచ్చేస్తాయి వీరికి!!నిన్ననే ఒబమా తో సినిమా కెళ్లాననో..హిల్లరీ రమ్మందనో కోసిపారేసే రాయుళ్ళు..వినేవారంతా వీరికి వెర్రివెంగళప్పలే!!
ఇలా మితభాషులనబడే వీరంతా కొన్ని సబ్జెక్టులకే పూర్తిగా అంకితమై,టాపిక్ అయిపోగానే మళ్లీ అత్తిపత్తి లా మామూలైపోతారు !!ఏమైనా..స్పీచ్ సిల్వరూ..సైలెన్స్ గోల్డూ అన్నారు పెద్దలు!!కానీ యీ ”పలుకేబంగారాలు” ??
*****
అయ్యగారి వసంతలక్ష్మి
24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను.
హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను.
పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా 2010 లో గావించాకా పలు టీవీ చానెళ్లలో రాజకీయాలపై ప్రసారమైన కామెడీ కార్టూన్లలో పలువురు మహిళా నాయకుల .. మరెందరో యితరకార్టూన్ క్యారెక్టర్లకు గళపోషణ గావించి తెలుగురాష్ట్రాల్లో ఏకైక మహిళా మిమిక్రీ కళాకారిణి గా పేరు తెచ్చుకున్నాను.
సంగీతమంటే ప్రాణం. వంటిల్లు వదలడం అంటే బాధ!లలితమైనా శాస్త్రీయమైనా ..పాట విని నేర్చుకుని పాడగలిగే ప్రతిభ వుంది. ప్రస్తుతం యేడాదిగా వసంతవల్లరి పేరున యూట్యూబ్ చానెలు పెట్టి పలువురు ప్రముఖుల కథలను నా గళంలో అందిస్తున్నాను.