విషాద నిషాదము

నవమ భాగము – స్వర నీరాజనాలు

-జోగారావు

ఏమిచ్చిందీ జీవితం ?

రోషనారాకు ?

అన్నపూర్ణాదేవి కి ?

పదునాల్గేళ్ళ వయసు వరకు తండ్రి అదుపాజ్ఞలలో ఉంటూ, నేర్చుకున్న సంగీత విద్య తదుపరి డెభ్భయ్యేడేళ్ళ జీవితానికి పునాది వేసింది.

కానీ…ఆ తరువాత డెభ్భయ్యేడేళ్ళ జీవితం విషాద భరితమే అయ్యింది . సుఖము, సంతోషము, ఆనందము, ఉల్లాసము దూరమైన దుర్భర జీవితమే అయ్యింది కదా !

నేర్చుకున్న సంగీతమే ఆమె అంతిమ శ్వాస వరకూ తోడుగా నిలిచింది .

మధ్యలో జీవితములో ప్రవేశించినవారు మధ్యలోనే నిష్క్రమించేరు.

స్వార్థముతో కొందరు వస్తే, అవసరానికి కొందరు చేరితే, అందరూ అవసరము తీరేక ఒంటరిని చేసి వెళ్ళి పోయేరు.

జీవితము అంటే, తన కొఱకు తక్కువ, అన్యుల కోసము ఎక్కువ బ్రతకడమేనా?

కేవలము అన్యుల అవసరాలను, ఆకాంక్షలను తీర్చడానికేనా జీవితం?

జీవితంలో సమయానికి ముందే అందిన మాతృత్వం ఒడిదుడుకులతో సాగి, జారిపోయింది.,

ఆకర్షణల వలయాలకు వశమయి వేసిన ఏడడుగులనూ సప్త సముద్రాలకు ధారాదత్తము చేస్తూ వైవాహిక బంధములను త్రెంచుకొంటూ ఎగిరి పోయిన స్వేచ్ఛ కేవలం భర్తకేనా ?

ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానము రాదు ఈ జీవితము నుండి.

అన్నపూర్ణాదేవి సార్థక నామధేయురాలిగా అనునిత్యము సంగీత భిక్ష ప్రసాదించడానికేనా ఏభయ్యేళ్ళకు పైగా ఆకాశ గంగకు అంకితమయ్యింది ?

అబల కాదు కనుకనే ఎన్ని కష్టములు పైన పడినా ఆత్మ స్థైర్యముతో జీవితమును కొనసాగించిన అన్నపూర్ణాదేవి మనకు ఆదర్శము కావాలి.

అమ్మా అన్నపూర్ణా దేవీ!

మీరు బ్రతికి ఉండగా, అండగా మేము లేము.

మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు.

మీ ఉనికిని గుర్తించలేదు.

మీరు మరణించిన వెంటనే శోక సందేశాలనిచ్చి మా ఉనికిని చాటుకున్నాము.

నిజానికి, జీవితము మీకు ఏదీ ఇవ్వలేదు.

మీరే మీ శిష్యుల ద్వారా ఎన్నో తరాలకు అపూర్వ సంగీత భిక్షను ప్రసాదించి మమ్మల్ని  ధన్యులను చేసేరు.

అమ్మా !

అన్నపూర్ణాదేవీ !

మీకివే మా స్వర నీరాజనాలు !

పద్మ భూషణ్ డాక్టర్ అన్నపూర్ణాదేవి ప్రథమ వర్ధంతిని 13 అక్టోబర్ న జరుపుకుని మనం కూడా ఆవిడకు నివాళులు అర్పించుదాము.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.