“నెచ్చెలి”మాట 

గదిబడి

-డా|| కె.గీత 

“హమ్మయ్య ‘కరోనా పుణ్యమా’ అని, ఈ సంవత్సరం బళ్లు తెరవడం లేదోచ్ “ 

అని సంబరపడ్డ పిల్లలకి ఇప్పుడు ఇంటిబడి వచ్చి గట్టి చిక్కొచ్చి పడింది పాపం!

ఇంటిబడంటే

మఠమేసుకుని వీధిలోకి దిక్కులు చూసే అరుగుబడో  

చెట్టు కింద హాయిగా  లల లలా  అని పాడుకునే  వీథిబడో 

అనుకునేరు! 

పాపం గాలైనా ఆడని “గదిబడి”

అయ్యో గడబిడ కాదండీ, మీరు సరిగ్గానే చదివేరు- “గదిబడి”

అదేనండి ఆన్లైన్  బడి-

అంటే ఉన్నచోటి నుండి అంగుళం కదలనీయనిదనో

కనీసం కాళ్లు చేతులూ ఆడనివ్వనిదనో

మనోవికాసం మాటికేగాని మనోవికారం కలిగించేదనో 

మనందంరం ఇన్నాళ్లూ దూరం పెట్టిన ఆన్లైనన్న మాట!

కానీ సరిగ్గా  చూస్తే 

ఈ గదిబడిని

పకోడీలు తింటూ  చూసే టీవీ సీరియళ్లలా  పాఠాల్ని  ప్రసారం చేసే “టీవీ బడి” అనో 

హోమ్ వర్కుల్ని  సెల్  ఫోను లో  కళ్ళు  పోయేలా  రాయాల్సిన  “స్మార్ట్ ఫోన్ బడి” అనో 

పిలవొచ్చు –

ఏవండీ నాకు తెలీకడుగుతాను 

“స్మార్ట్ ఫోన్” లేని వాళ్లు కూడా ఉన్నారు కదా స్వతంత్ర భారతదేశంలో,

ఇంటింటికో ఫోన్ ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించే వాళ్లని 

ఒక్క ఫోన్ ఎలా సరిపోతుంది మాకు  ఇద్దరు పిల్లలు కదా అని కొట్టుకునే వాళ్లని

ఉన్నదొక్క టీవీ- పాఠాలే చదువుతారా? సీరియళ్ళే చూస్తారా? అని గొప్ప ఉపయోగకరంగా ఆలోచించేవాళ్లని   

పక్కనబెడితే –

ఓ పక్క ఇంచక్కా 

మేష్టార్ల గదమాయింపులు 

టీచరమ్మల వడ్డింపులు 

తప్పించుకున్నా 

పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు 

అనుక్షణం 

పాపం పసివాళ్లకి 

అమ్మ  కనుసన్నలు!

నాన్న గద్దింపులు!!

స్మార్ట్ ఫోను పుణ్యమా అని 

యూట్యూబు పుణ్యమా అని 

అరచేతి పాఠశాలలో దొంగచాటు  వీడియోలు హాయిగా చూసి సంబరపడ్డం మాట అటుంచితే

కరోనా గట్టెక్కేలోగా 

చదువులు వస్తాయో  లేదో తెలీదు గానీ

కళ్లద్దాలు మాత్రం తప్పకుండా వచ్చేటట్టే  ఉన్నాయి  పిల్లలందరికీ! 


*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం- సెప్టెంబర్, 2020”

  1. గడబిడ చదువు…. బాగుంది మేడం నేటి చదువుల తీరు…. 🌹

Leave a Reply

Your email address will not be published.