అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్

-ఎన్.ఇన్నయ్య

ఒకే ఒకసారి భారతదేశం సందర్శించిన మాడలిన్, హైదరాబాద్ లో మల్లాది సుబ్బమ్మ రామమూర్తి మానవవాద దంపతులకు అతిథిగా వున్నది. ఆ తరువాత విజయవాడలో గోరా కుమారుడు లవణం, తదితరులతో కార్యక్రమాలు నిర్వహించింది. 

ఆమె ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించిన ఆమెరికా సుప్రసిద్ధ పత్రిక టైం, అమెరికా ద్వేషించే స్త్రీ అని వర్ణించింది. ఎందుకని ఆమె వీర నాస్తికురాలు గనుక

హైదరాబాద్ లో మల్లాది వారితో వున్నప్పుడు నేను కలసి మాట్లాడాను. తరువాత అమెరికాలో 1992 నుండీ ఫోను ద్వారా అనేక పర్యాయాలు చర్చించాను. ఆమె పాల్ కర్జ్ తో కలసి చేసిన రేడియో, టి.వి.చర్చలు ఆనందించాను. 

1962లో అమెరికా సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పు యిచ్చింది. మాడలిన్ కేసుపై ఇచ్చిన చారిత్రక నిర్ణయం అది. అమెరికాలో స్కూళ్ళలో బైబిల్ ప్రార్థనలు, ప్రవచనాలు మతబోధగా సాగుతుండేవి. అవి రాజ్యాంగ విరుద్ధం అనీ, వాటిని తొలగించి, పిల్లల్ని స్వేచ్ఛగా చదువుకోనివ్వాలని మాడలిన్ కోరింది. దానిపై సుదీర్ఘ విచారణ జరిపి, ఆమె కోరినట్లే పాఠశాలల్లో బైబిల్ పఠనం, ప్రవచనం ఆపేయాలన్నారు. మానవ హక్కుల సంఘాలు, సెక్యులర్ వాదులు సంతోషించారు.   అప్పటి నుండీ స్కూళ్ళలో మతబోధ ఆపేశారు. అది మాడలిన్ సాధించిన చిరస్మరణీయ అంశం.

పిట్స్ బర్గ్ లో పుట్టిన మాడలిన్ ఓ హేర్ బాల్టిమోర్ కు మారి పోరాటాన్ని సాగించింది. అక్కడ నుండి ఆస్టిన్ నగరానికి తరలి అమెరికా నాస్తిక సంఘం స్థాపించి, నడిపించి, రేడియో, టి.వి. కార్యక్రమాలతో బాటు ప్రచురణలు సాగించింది. పాల్ కర్జ్ తో కార్యక్రమాలు నిర్వహించింది. 

మాట మోటు అనిపించినా, వాదబలం హేతుబద్ధంగా వుండేది. వెనుకంజ వేయకుండా రచనలు సాగించింది.  ఆమెను కమ్యూనిస్టు అని ద్వేష ప్రచారం చేశారు. కాని జీవితమంతా నాస్తికురాలిగానే బ్రతికింది. ఆమె కుమారుడు, మనుమరాలు సహకరించగా నిర్విరామ కృషి జరిపింది. పర్యటించింది. ప్రసంగించింది. 

హిందూ సమాజంలో ఏకాకిగా నిలచి పోరాడిన గోరా, పెరియార్ వలె, క్రైస్తవ సమాజంలో మాడలిన్ సాహస జీవన యాత్ర చేసింది.

ఆమెపై సినిమా కూడా తీశారు. మెలిస్సాలీ అనే నటి మేడలిన్ గా నటించగా సినిమా తీశారు. అది నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. 

1995లో ఆస్టిన్ నాస్తిక కార్యాలయంలో మాడలిన్ వద్ద పనిచేసే వ్యక్తి, ఆమెను విహారయాత్రలో దారుణంగా చంపేశాడు. కేవలం ఆమె వద్ద కొంత ధనం, నగదు కాజేయడానికి, దారుణం చేసి, తరువాత శిక్ష పొందాడు. 

మాడలిన్ వారసురాలుగా జాన్సన్ అనే సాహస స్త్రీ నాస్తిక సంఘాధ్యక్షురాలుగా కార్యకలాపాలు నడిపి, మాడలిన్ పేరు నిలిపింది.  1963లో మాడలిన్ ప్రారంభించిన  నాస్తిక సంఘం కొనసాగుతూ, ఆమె పేరు నిలబెడుతున్నది. 

మాడలిన్ ఒక స్త్రీగా అమెరికాలో నిలదొక్కుకుని పోరాడింది. బాల్టిమోర్ లో ఆమె పై ద్వేషపోరాటం చేసిన సంఘద్రోహులకు ఎదురు నిలిచింది.

టెలివిజన్ స్టేషన్ స్థాపించి విపరీతంగా భావ ప్రచారం చేసిన మాడలిన్ రాజ్యాంగ బద్ధంగా పోరాడింది. ఆమెరికాలో స్త్రీలను పురుషులతో సమంగా చూడకపోవడం పట్ల పోరాటం జరిపింది. 

వై ఐ యామ్ యాన్ ఎథియిస్ట్ అనే ఆమె రచన బహుళ ప్రచారం పొందింది. 

స్త్రీలు, మానవహక్కుల వారంతా గర్వించదగిన వ్యక్తి మాడలిన్. ఆమెతో పరిచయం గొప్ప అనుభూతి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.