ఒక భార్గవి – కొన్ని రాగాలు -7

వలపులు రేకెత్తించే  రాగం వలజి

-భార్గవి

ఒక అందమైన వలలాంటి రాగం వలజి,ఒక సారి వినడం మొదలుపెడితే ,అందులోంచీ ఒక పట్టాన బయట పడలేము.

ప్రత్యూష పవనాలలో తేలి వచ్చే ఈ రాగ స్వరాలను వింటుంటే మనసు నిర్మలమై ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది,అందుకే గాబోలు భక్తి గీతాలనూ,ప్రణయగీతాలను కూడా ఈ రాగంలో కూర్చుతారు

వలజి రాగం లో అయిదే స్వరాలుంటాయి –(సగపదనిస)ఆరోహణలోనూ,అవరోహణలోనూ (సనిదపగస)కూడా,ఈ కారణంగా దీనిని పెంటటానిక్ స్కేల్ అంటారు(ఒౌడవఒౌడవ రాగము).ఇది పదహారవ మేళకర్తయయిన చక్రవాక రాగమునుండీ జన్యము.రిషభము,మధ్యమము (రి,మ)వర్జిత స్వరాలు .ఒక వేళ చతుశ్రుతి రిషభం కలిస్తే ఇదే రాగం “జనసమ్మోహిని” అనే రాగంగా మారుతుంది.శుధ్ధ రిషభం తో కలిస్తే “మలయమారుతం” గా మారుతుంది.ఈ రాగం లోని ధైవతాన్ని తొలగిస్తే మహనీయులు మంగళంపల్లి బాలమురళీ గారు సృష్టించిన “మహతి” రాగం వినపడుతుంది.

ఉదయ కాలాలలో పాడదగిన రాగంగా భావిస్తారు.హిందూస్థానీలో దీనికి సమానమైన రాగం “కళావతి”

ఈ రాగంలో లాల్ గుడి జయరామన్ గారి “చలము సేయ”తిల్లానా,హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ గారి “జలంధర సుపీఠస్తే జపా కుసుమ భాసురే”అనే కృతి పేర్కొన దగినవి.

డా”శ్రీవత్స గారి కృతి “కార్తికేయ కమలేక్షణ శివసుతే” అరుణా సాయిరామ్ గొంతులో వినడం ఒక అనుభవం.శ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మ గారి “శ్రీ గాయత్రీ దేవి సనాతనీ”అనే కృతి చాలా బాగుంటుంది.

తెలుగు,హిందీ,తమిళ ,కన్నడ సినిమాలలో అప్పుడప్పుడూ అరుదుగా వినిపించినా ,ఆహ్లాదంగా అలరించే రాగం

అయితే ఈ పాటల్లో వలజితో పాటు జనసమ్మోహిని ఛాయలు తొంగి చూస్తుంటాయి,అప్పుడప్పుడూ  అన్య స్వరమైన మధ్యమం కూడా పడుతూ వుండటం కద్దు. సినిమా సంగీతంలో యే పాటా ఖచ్చితంగా ఈ రాగం అని చెప్పలేము,అందుకే ఫలానా రాగం ఆధారంగా ఈ పాట చేశారు అని చెప్పడం జరుగుతూ వుంటుంది.

తెలుగు సినిమాలలో కొన్ని పాటలు చూద్దాం

 సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు గారిని స్వరాలు చెక్కుతాడనీ ,ఒక పట్టాన టేక్ ఓకె చెయ్యడనీ ,అనేక టేక్ లు గాయనీ గాయకుల చేత పాడించి వాటిల్లోనుండీ అత్యుత్తమమైన దానిని యేరుకుని రికార్డ్ చేస్తారని పేరు,అందుకనే ఆయనని “స్వరశిల్పి” అంటాను నేను.ఆయన దర్శకత్వంలో,పింగళి నాగేంద్రరావు గారి రచనలో ,శాస్త్రీయ సంగీతాన్నీ,సినీ సంగీతాన్నీ యేది యెలా పాడాలో  తెలిసిఅలా పాడే సవ్యసాచి బాలమురళీ,యస్ .జానకీ స్వరాలలో వినపడే ఈ “వసంత గాలికి వలపులు రేగ”అనే పాట “శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ”సినిమాలోది, వలజి రాగం ఆధారంగా కూర్చినదే

వీరిద్దరీ గొంతులూ ఈ పాటలో వింటుంటే మెత్తని గులాబీ పూల చుట్టూ మొగలి రేకులు చుట్టి అల్లిన పూల జడ గుర్తు రావడమే కాక,బాల మురళీ జిలుగు సంగతుల మైకంలో సొక్కి సోలి పోవడం ఖాయం.

ఇంకో పాట కూడా బాలమురళీ పాడిందే చిత్రం పేరు “పేదరాశి పెద్దమ్మ కథ” —సంగీత దర్శకుడు యస్ .పి కోదండ పాణి—–“శివ మనోరంజనీ” అనే ఈ పాటలో బాలమురళీ వేగం గా వేసే సంగతులు వింటుంటే మతిపోతుంది,శాస్త్రీయ సంగీతం మీద ఆయనకున్న పట్టు అర్థమవుతుంది.

సినీ ప్రపంచంలో “చక్రవర్తి “గా పిలిచే కొమ్మినేని అప్పారావు మొట్ట మొదట సంగీత దర్శకత్వం చేసిన సినిమా “మూగప్రేమ “.ఇందులో అన్ని పాటలూ అద్భుతంగా వుంటాయి,ముఖ్యంగా వలజి రాగం ఆధారంగా చేసిన “ఈ సంజలో కెంజాయలో చిరుగాలుల కెరటాలలో” అనే ఆత్రేయ రాసిన పాట చాలా బాగుంటుంది,పాడిన వారు పి.సుశీల వెనక ఆలాపన బాలసుబ్రహ్మణ్యానిది.ఇందాక చెప్పుకున్నట్టు అక్కడక్కడ అన్యరాగఛాయలు వినపడతాయి.

ఇక “శ్రీకృష్ణావతారం”సినిమాలో “జగముల నేలే గోపాలుడే “అనేపాట ,యన్ .టి. ఆర్ గారి ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు సంగీత దర్శకత్వంలో తయారయింది,పాడింది ఘంటసాల,సుశీల .సన్నగా తీగె సాగే సుశీల గొంతుకి , సమతూకంగా పాడే కంచుగంట ఘంటసాల కంఠం సంగతి వేరే చెప్పాలా!

పద్మశ్రీ పతాకం కింద తమిళ సినిమా “కాదలిక్క నేరమిల్లై “ని “ప్రేమించు చూడు” గా మలిచారు దర్శకుడు పి.పుల్లయ్య.తమిళంలో బాగా హిట్టయిన తమిళ ట్యూన్లనే యథాతథం గా వాడమని సంగీత దర్శకుడు మాస్టర్ వేణుని ఆదేశించారు,అయితే కనీసం ఒక్క పాటకయినా తన సొంత ట్యూన్ వాడతానని పట్టుబట్టారూ,బతిమాలారూ మాస్టర్ వేణు,చివరికి భార్య శాంతకుమారీ,ఇంకా కొందరూ మాస్టర్ వేణు చేసిన ట్యూన్ బాగుందని రికమెండ్ చెయ్యడంతో సరేనని  ఒప్పుకున్నారు పుల్లయ్య.అలా ఆ సినిమాలో వినపడే ఆ ఒక్క పాట వలజి రాగం ఆధారంగా చేసినదే—-“వెన్నెలరేయి యెంతో చలీ చలీ వెచ్చని దానా రావే నాచెలీ”–ఇంతకూ ఈ పాట పాడింది “వెల్వెట్ వాయిస్ “అని పిలవబడే పి.బి.శ్రీనివాస్  .నిజంగా ఈ పాట ఎప్పుడు విన్నా మాస్టర్ వేణు ప్రతిభ కి ఆశ్చర్యం వేస్తుంది ,మిగతా పాటల బాణీలన్నీ చేసిన యం.యస్ .విశ్వనాథన్ స్థాయికేమాత్రం తీసి పోకుండా వుంటుంది

దేవుల పల్లి కృష్ణశాస్త్రి ఒకసారి రైలు ప్రయాణం లో తన కళ్లబడిన చిక్కని అడవుల సౌందర్యాన్ని చూసి ఉప్పొంగి పోయి రాసిన పాట “ఆకులో ఆకునై,పువ్వులో పువ్వునై ,కొమ్మలో కొమ్మనై,నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా యెట్లైనా ఇచటనే ఆగిపోనా”

ఈ పాటకు లలిత సంగీతంలో అనేక మంది అనేక రాగాలు కట్టి పాడారు,అందులో వలజి రాగంలో పాడేది బాగుంటుంది.దాసరి నారాయణరావు గారు తీసిన “మేఘసందేశం” లో కొన్ని దేవులపల్లి వారి గీతాలను రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ట్యూన్ చేసి వాడుకున్నారు ,అప్పటికి దేవులపల్లి మరణించి చాలాకాలమయింది,అంటే ఆయన ఈ సినిమాకోసం ప్రత్యేకంగా రాసినవి కావు ఈ పాటలు.

అలా తీసుకున్న గీతాలలో ఈ వలజి రాగం ఆధారంగా ట్యూన్ చేసి పి.సుశీలతో పాడించిన “ఆకులో ఆకునై” చాలా బాగుంటుంది, సంగీత దర్శకుడుగా రమేష్ నాయుడు సత్తా గురించి యెంత చెప్పినా తక్కువే

హిందుస్థానీ సంగీతంలో వలజి కి సమానమైన రాగం “కళావతి” అని చెప్పుకున్నాం కదా,హిందీ సినిమాలలో ఈ రాగంలో యెక్కువగా ఖవ్వాలీలకు వాడినట్టు కనపడుతోంది

 ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ ,మధుర గాయకుడు మహ్మద్ రఫీ చేత “దిల్ దియా దర్ద్ లియా” సినిమాలో పాడించిన పాట “కోయి సాగర్ దిల్ కొ బెహలాతా నహీ”కి “కళావతి “రాగమే ఆధారం అయితే అక్కడక్కడ “జన సమ్మోహిని” రాగ ఛాయలు వినపడతాయి.రఫీ ఈ విరహ గీతాన్ని పాడిన తీరు  ప్రేమికుల హృదయాలనే కాదు  సంగీత ప్రేమికుల హృదయాలను కూడా కొల్లగొట్టి తీరుతుంది.

నా అభిమాన సంగీత దర్శకుడు రోషన్ ,ఆయన్ని అందరూ ఖవ్వాలీల స్పెషలిస్ట్ అంటారు.గాయకుడు మన్నాడే యేం చెబుతాడంటే ,సుదూర ప్రాంతాలనుండీ ఖవ్వాలీ గాయకులని రప్పించి ,వారు పాడే పధ్ధతిని ఆకళింపు చేసుకుని మరీ ఖవ్వాలీ బాణీలను తయారు చేసే వాడట రోషన్ .ఆయన “బర్సాత్ కీ రాత్ “సినిమాలో మన్నాడే,రఫీ,ఆశా,సుధా మల్హోత్రా లతో రూపొందించిన”నా తో కారవా కి తలాష్ హై” అనే ఖవ్వాలీకి కూడా “కళావతి” నే ఆధారం,ఇంకా ఈయనే “చిత్రలేఖ” సినిమాలో చేసిన “జియారా” అనే ఖవ్వాలీ కూడా “కళావతి”లోనే అద్భుతంగా చేశారు.

ప్రయోగాలకు పేరు గాంచిన ఆర్ .డి .బర్మన్ “హమ్ కిసీసే కమ్ నహీ” సినిమాలో “యే అగర్ దుష్మన్ “అంటూ రఫీ ,ఆశా లచేత పాడించిన ఖవ్వాలీ వున్నది “కళావతి”లోనే.

లక్ష్మీకాంత్ ప్యారే లాల్ “ఖిలౌనా “అనే సినిమాలో లతా చేత పాడించిన “సనమ్ తూ బేవఫా  కే నామ్ సే “అనే ఖవ్వాలి కి ఆధారమైన రాగం కూడా కళావతినే

ఎ.ఆర్ రహ్మాన్ “స్వదేశ్ “సినిమాలోచేసిన పాట “యే తార వో తార హర్ తార ” కి కూడా “కళావతి”నే ఆధారం

ఇవి “వలజి” రాగం గురించిన కొన్ని విశేషాలు మాత్రమే —-ఈ పాటికి మీకు వలజి రాగం ఎంత అందమైన వలో అర్థమయివుంటుందనీ,ఈ పాటలు వింటూ మీరు ఆ వలలో చిక్కి ఆనందించాలని ఆశిస్తూ —–


*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.