తెనిగీయం-4

 కేశాభరణం

ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్

స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి 

నల్లకోటు కింద ముతక స్కర్టు, బూడిద రంగు తొడుక్కున్నాను. పైన బ్రౌన్ స్వెటరు వేసుకున్నాను. దానిపై కాస్త జాగ్రత్తగా చూస్తె గాని కనిపించని కంత. నీ సిగరెట్లు వల్లే ఆ కంత పడింది. అందుకే నాకు చాలా విలువైన స్వెట్టరు. లోపల ఒక పొడవైన బనీను…ఆ లోపల ఒక చిన్న బ్రా… చిన్న చిన్న పూలు డిజైను ప్యాంటీ వేసుకున్నా. చాలా చవగ్గా ఫుట్ పాత్ పై కొనుక్కున్నా. ఒక చేతిలో పెద్ద పెట్టె. ఈ చేతిలో బరువును బ్యాలెన్స్ చేసేలా మరో చేతిలో పోర్టబుల్ టైప్ రైటరు. గోతాం లాంటి హాండ్ బ్యాగ్. ఫ్రిబ్రవరి నెల… గాలి కోటు వెనక్కి ఎగిరేలా వీస్తుంది. నేను తొడుక్కున్న ప్లాస్టిక్ రెయిన్ బూట్లు జారుతున్నాయి. విఫల ప్రేమ బాధితురాలిని. ఈ బాధ తప్పించుకోడానికి రైల్వే స్టేషను వెళుతున్నాను. 

          నా దగ్గరే  డబ్బులుంటే ఎయిర్పోర్టుకు వెళ్లి కాలిఫోర్నియాకో అల్జీమర్స్ కో వెళ్ళేదాన్ని. ఇక్కడి నుంచి కాస్త దూరంగా, కాస్త వేడి వాతావరణం ఉండే చోటికి వెళ్ళేదాన్ని. కాని నా దగ్గర ఉన్న డబ్బుతో సేలం వెళ్ళడానికి రావడానికి టికెట్లు పోగా మూడు రోజులక్కడ ఉండగలను. అల్జీమర్స్ కన్నా సేలం వెళ్ళడమే మంచిది. నేనెలాగూ రచయిత నాథానియేల్ హాథోర్న్ పై రిసెర్చ్ చేయాల్సి వుంది కాబట్టే సేలం వెళ్ళడమే మంచిది. ఒక స్కాలర్ గా నేను బతకడానికి ఈ అకడమిక్ పేపర్లు ఎంతో అవసరం. రెండు నెల్లుగా వన్ సైడెడ్ లవ్ తో నాలోని శక్తి సామర్ధ్యాలన్ని చచ్చుబడ్డాయి. నీనుంచి కొన్ని రోజులు దూరంగా వుంటే బహుశా నా ఆలోచనలు గాడిన పడొచ్చు అనుకున్నా కాని తర్వాత అది తప్పని తేలిపోయింది. అటునుంచి ప్రతిస్పందన లేని ప్రేమ, నా జీవితంలోని ఆ దశలో ఆ ప్రేమనే నేను చాలా అనుభూతి చెందాను. నాకు దానివల్ల చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే దానివల్ల కూడా మంచే జరిగింది. ఎలాంటి రిస్కులు లేకుండా అన్నివిధాల మానసిక క్షోభలను అనుభవించాను. ఆ కాలంలో నేను ఆధ్యాత్మికతను చాలా నమ్మేదాన్ని. నాగురించిన నా అమలిన భావన ఒక ఈజిప్షియన్ మమ్మీ లాంటిదని చెప్పాలి. మార్మికతలో చుట్టబడిన వస్తువు లాంటిదని చెప్పాలి. ఆ మార్మికతను తొలగిస్తె ఆ దుమ్ములో పడినా పడొచ్చు, పడక పోనూవచ్చు. కాని అటునుంచి ప్రతిస్పందన లేని ప్రేమ నాది. ఇందులో వివస్త్రను కావలసిన అవసరం లేనే లేదు. 

              మనిద్దరి మధ్య తేడా బాహ్యమైనది మాత్రమే. కాని మనిద్దరి మధ్య నిస్సహాయత ఒకే లాంటిది.  నేను టీచర్ గా వచ్చాను. ఏదో క్లర్కుగా స్ధిరపడాలనుకోలేదు. ఇంకా చెప్పాలంటే నాకు కావలసన దుస్తులు ఫుట్ పాత్ పై కొనాలనుకోలేదు. నువ్వు కూడా అంతే. మనిద్దరం మారుమూల వూళ్ళనుంచే వచ్చాం. ఊర్లోవారికి మన పరిస్ధితి తెలియదు. మనకు వచ్చే చాలీ చాలని స్కాలర్షిప్పులతో మనమేదో గొప్పవాల్ళమైపోతామని, సమాజానికి రుణపడిపోయామని అనుకుంటారు. మనిద్దరం ప్రొఫెషనల్ స్కాలర్లుగా మారాలనుకోలేదు. ఈ స్కాలర్లు చక్కని హైర్ కట్ తో నీట్ గా చేతిలో బ్రీఫ్ కేసుతో బూట్లకంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివుల్లా వుంటారు. అలాంటివారిని చూస్తె మనకు నచ్చేది కాదు.  మనం పనిచేసే బదులు అంటే రిసెర్చ్ చేసేబదులు జర్మన్ రెస్టారెంట్ లో చౌక బీరు కొనుక్కుని తాగుతూ కాలక్షేపం చేసేవాళ్ళం. మనతోటి స్కాలర్ల చదువులు, సెమినార్లపై జోకులేసుకునేవాళ్ళం. 

    మన సమస్యేంటంటే మన చుట్టూవున్న ప్రపంచాన్ని కాని, మన ముందు పరుచుకున్న భవిష్యత్తు కాని మనం ఏమవుతున్నామన్నది మనకు చెప్పలేదు. మనం వర్తమానంలో రైల్వేస్టేషన్లో ఆగిపోయిన ఖాళీ రైలులా మారిపోయాం. ఒకరి నీడను మరొకరు పెనవేసుకుని ఉండిపోయాం.

ఆలోచిస్తూ సేలం లోని ఒక హొటల్ లోకి నడిచాను. రూంలో పరుపు మంచంలా గట్టిగా సమాధిలా వుంది. మర్నాడు ఒక పాత స్మశానానికి బయలుదేరాను. అక్కడ 17వ శతాబ్దం నాటి సమాధులపై రాసిన రాతలేమైనా దొరకొచ్చు, నా రిసెర్చ్ పేపరుకు పనికావచ్చు, నా రిసెర్చ్ పేపరుకు పనికిరావచ్చు. భయట వీధిలో ఎవరు లేరు. నిర్మానుష్య వాతావరణం. రోడ్డుపై కనిపించిన ఒక హోటల్ లోకివెళ్ళాను. ఇంకా బ్రెక్పఫాస్ట్ చేయలేదు. ఎగ్ శాండ్విచ్ ఆర్డరు చేశాను. ఆ హోటల్ లో నాతోపాటు సర్వరు తప్ప ఎవరూ లేరు. వాళ్ళు కూడా నావైపు అనుమానంగా చూస్తున్నారు. అక్కడి నుంచి లైబ్రరీకి బయలుదేరాను. లైబ్రరీ కూడా ఖాళీగా వుంది. ఆ లైబ్రరీ మ్యూజియం కూడా అనుకుంటాను. కొన్ని పడవల చిహ్నాలు, విక్టోరియా కాలం నాటి కేళాభరణాలు కూడా గ్లాసు పెట్టెల్లో ప్రదర్ళనకు ఉన్నాయి. ఇవన్ని ఙ్నాపికల వంటి ఆభరణాలని, స్మశానంలో రోధించేవారికి పంపుతుంటారని అక్కడ కార్డుపై రాసివుంది. 

ఆ ఆభరణాలు, వాళ్ళు మరణించిన తర్వాత జుట్టుతో పాటు కత్తిరించి తీశారా అని అక్కడున్న మహిళను అడిగాను. నా వైపు కాస్త కోపంగా చూస్తూ తనకు తెలియదని చెప్పింది. నేను బయటకు వచ్చినప్పుడు ఒ మధ్య వయస్కుడు తలుపు దగ్గర కలిశాడు. అతను కూడా హోటల్ లో వున్నాడనుకుంటాను. డ్రింక్ ఆఫర్ చేశాడు. నేను నో ధ్యాంక్యు అన్నాను. నేను మరొకరితో పాటు వచ్చానని చెప్పాను. కాని ఆ మాటలు చెబుతున్నప్పుడు నాకు అర్ధమైనదేందంటే నేనిక్కడికి వచ్చింది నేను అనుకున్నట్లు నీకు దూరంగా వెళ్ళాలని కాదు, సంపూర్ణంగా నీతోపాటు వుండాలని, నీ భౌతిక ఉనికి కన్నా ఎక్కువగా నీతో వుండడానికి. భౌతికంగా నువ్వు వుంటే నీ జడత్వం బాధిస్తుంది. కాని నేను ఒంటరిగా వున్నప్పుడు నేను నా రొమాంటిక్ ప్రపంచంలో విహరించగలను. 

మూడు రోజులు బయటకు వెళుతున్నానని నీకు చెప్పాను. ఈ సేలం పట్టణంలోని శూన్యమంతా నువ్వు నింపేశావు. అదృష్టవశాత్తు సాయంత్రం రైలు దొరికింది. ఆ రైలు పట్టుకుని వచ్చేశాను. నేను బోస్టన్ రైలు స్టేషను నుంచే ఫోన్ చేశాను. నేను త్వరగా వచ్చేసినా నువ్వు చాలా కాజువల్ గా తీసుకున్నావు. నీలో సంతోషమూ లేదు. ఆశ్చర్యమూ లేదు. టెన్నిసన్ రాసిన లాక్స్ లీ హాల్ కవితలో అస్పష్టతపై బహుశా నువ్వు అప్పుడు రిసెర్చ్ పనిలో వున్నావు. ఆ రోజుల్లో అస్పష్టత చుట్టూ అలుముకుని వుండేది. మనం చార్ల్స్ నది వరకు నడుచుకుంటూ వెళ్ళాం. మంచుతో ఆడుకున్నాం. అప్పట్లో అదంతా స్వేఛ్ఛ అనుకున్నాం. కాని అది ఒక హిస్టీరియా అని ఇప్పుడు తెలుస్తోంది. 

మనిద్దరం వుంటున్న ఇండ్లలో మనతోపాటు చాలాముంది వుండేవారు. మనకు ఒంటరిగా వుండే అవకాశం లేదు. మనిద్దరిలో ఎవరికీ కారు లేదు. లోకల్ హోటల్ కి మనం వెళ్ళలేము. మనమిద్దరమే గడపాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి. ఈస్టర్ కు న్యూయార్క్ వెళ్ళాలని అనుకున్నాం. అంతకు కొన్ని రోజుల ముందే నువ్వు న్యూయార్క్ వెళ్ళావు. నేను నా రీసెర్చ్ వ్యాసం పూర్తి చేసి వస్తానన్నాను. కాని నువ్వు కూడా మూడు వ్యాసాలు ఇవ్వవలసి వుంది. కాని నువ్వు పట్టించుకోకుండా వెళ్లిపోయావు.  నువ్వు మీ ఊరి స్నేహితుడితో వుంటే నేను న్యూయార్క్ వచ్చి సింగిల్ రూం తీసుకోవాలని మనం ప్లాన్ చేసుకున్నాం. దాని వల్ల ఎవరికీ అనుమానం రాదు. అంతకుముందు ఎప్పుడు న్యూయార్కుచూడలేదు. సూట్కేస్ మోసుకుంటూ ఎండలో చెమటలు కక్కుతూ దారిలో నీకు ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఎత్తలేదు. దారిలో కనిపించిన ప్రతి ఫోన్ బూతు నుంచి నీకు నీకు ఫోన్ చేశాను. ఆ టెలిఫోను బూతుల్లో ఎక్కడో నీ పుస్తకం మరచిపోయూను. అదొక్కటే నీకు సంబంధించిన గుర్తు నాదగ్గరుంది. రూంతీసుకున్నాను. హోటల్ క్లర్కు అనుమానంగా చూశాడు. రూంలో నీకేమయిందో అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ప్రతి అరగంటకొకసారి నీకు ఫోన్ చేశాను. అంతకంటే ఇంకేంచేయగలను. నువ్విచ్చిన నెంబరు తప్పేమో అనుకున్నాను. చివరకు సాయంత్రం 7గంటలకు ఎవరో మహిళ ఫోనెత్తింది. నీగురించి అడిగినప్పుడు నవ్వింది. ఆ నవ్వులో సంతోషం లేదు. ఎవరో పిల్ల నీకోసం అని నిన్ను పిలిచింది. నువ్వు వచ్చిమాట్లాడినా నీ గోంతు సంతోషంగా లేదు. ఎక్కడున్నావు, నీకోసంఫోన్ చేస్తుంటే ఎత్తవే అన్నాను. నా ఫ్రెండుదగ్గరున్నాను, నిద్రమాత్రలుమింగితే హోస్పటల్ కి తీసుకువెళ్లానన్నావు. నువ్వు ఫ్రెండంటే మగ ఫ్రెండనుకున్నాను. వెనుక ఆమె తిడుతున్నట్లు నాకు వినిపించింది. నా కాళ్ళు చల్లబడిపోయినట్లనిపించింది. నువ్వు చెప్పినట్లు ఆమె నీ పాత స్నేహితురాలు కాదు, నీ ప్రేయసి. ఇప్పుడు నీతో వున్న ప్రేయసి. ఆమెనిన్ను ప్రేమిస్తుంది. అందుకే నిద్రమాత్రలు మింగింది. ఎందుకంటే ఈ రోజునేనొస్తున్నానని తెలిసింది. 

                            మర్నాడు కూడా నువ్వు రాలేదు. నేను బోస్టన్ వచ్చేశాను. ఒక్క కార్డుముక్క రాశావు. నేను నేవీలో చేరాలని వెళ్ళాను. వాళ్ళు తీసుకోలేదు. ఒక చిన్న రెస్టారెంట్ లో ఉద్యోగంలో చేరాను, బెల్ టవర్ పై నుంచి దూకి చావడం కన్నా అది మంచిదేకదా… ప్రమతో… 

అని రాళావు, నువ్వు ఆట పట్టిస్తున్నావా…అని కూడా అనిపించింది. నువ్వు నన్ను సరైన పధ్దతిలో విడిచి వెళ్లలేదు. నువ్వు నా చుట్టుపక్కలే వున్నట్లుంది. ఘాటైన దుర్గంధంలా, నా ఆశలను ఛిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లే వున్నావు. మనం ఎప్పుడూ మన శత్రువెవరో ఖచ్చితంగాగుర్తించలేము. నాకు పెళ్ళయింది. నా పెద్దచదువు, దానివల్ల వచ్చినహోదా, నా ఇద్దరు పిల్లలు, ఇవేవీ నువ్వు మెచ్చుకునేవి కావులే. డబ్బు వచ్చింది, ఖరీదైన బట్టలొచ్చాయి. 

న్యూయార్క్ లో జరిగిన అలాంటి కాన్ఫరెన్సులో నిన్నుచూశాను. చాలా పెద్ద కాన్ఫరెన్సు. ఎజెండాలో నీ పేరు చూసి మరెవరో అనుకున్నాను. కాని అది నువ్వే. కాస్త లావయ్యావు. నన్ను చూస్తావనుకున్నాను, కాని చూడలేదు. నేనే నీదగ్గరికొచ్చి పలకరించాను. నన్నిలా చూస్తానని అనుకోలేదన్నావు. నా కొత్త అవతారం, నాదుస్తులు, నా హెయిర్ కట్ ఇవన్ని నిన్ను బెదిరిస్తున్నట్లు నన్నో శత్రువులా చూశావు. 

                 నేను ఆ కాన్ఫరెన్స్ నుంచి ఇంటికొచ్చను. ఇంటికి నేనొచ్చినప్పటినుంచి ఇంటి సెల్లారును నువ్వే ఆక్రమించుకున్నావు. నిన్ను తరిమేయాలని నేను ప్రయత్నించాను. కాని నువ్వు కాదనరాని నిజంలా అక్కడే వున్నావు. నిన్ను చూస్తె బాధతో పశ్చాత్తాపంతో కదలని జఢంలా అక్కడే వుంటున్నావు. ఇంకెప్పటికీ కదలలేనివాడిలా.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.