కొత్త అడుగులు – 13

గీతా వెల్లంకి

తెరిచిన కిటికీలోంచి….

– శిలాలోలిత

ఈ ప్రకృతి మొత్తంలో అందమైన భావన ప్రేమ. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును. అన్నదెంత సత్యమో! ప్రేమించడం తెలిసిన వాళ్ళకు అశాంతి వుండదు. ఒక మృదత్వం, సున్నితత్వం, ప్రకృతి ప్రియత్వం, ఊహాశాలిత్వం ఎక్కువగా వుంటాయి. వ్యక్తుల్ని వారి స్నేహాన్ని, ఇష్టాన్ని, ప్రేమను ఒదులుకోడానికి సిద్ధపడరు. ప్రేమనింపిన భావాలున్న వాళ్ళు ఒకవిధంగా చెప్పాలంటే చాలా అమాయకంగా వున్న సందర్భాలే ఎక్కువ. వాళ్ళెంత లలితంగా ఆలోచిస్తారో, మృధువుగా వుంటారో, ప్రపంచమంతా అంతేననుకుంటారు. పసితనం వీరినెన్నడూ వీడిపోదు. చిన్నపిల్లల తత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. మనుషుల్ని తొందరగా దూరం చేసుకోరు. వీళ్ళలో అమాయకత్వం ఏ స్థాయిలో వుంటుందంటే, తము ఆలోచించినట్లు, నిజాయితీగా ఎదుటవాళ్ళు కూడా వుంటారని నమ్మేస్తుంటారు.

కాదని, పరిస్థితులు చెప్పినప్పుడు, ఎదుటవారి అసలు ముఖం, ముసుగు వీడినప్పుడు చాలా గాయపడ్తారు. కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అందుకని ఇలాంటి ప్రేమతత్వం నిబిడీకృతమై వున్న సహజతత్వం వున్న వాళ్ళను గమనించి, మనం వారితో సున్నితంగానే వ్యవహరించాల్సి వుంటుంది. మనుషుల్ని ఇంతగా నమ్మేవాళ్ళు, మనుషుల కోసం జీవిస్తున్న వాళ్ళు అన్ని కళారంగాల్లో కన్పిస్తుంటారు. అలా, కవిత్వరంగాన్ని పరిశీలించినప్పుడు కవి మానసిక స్థితి గతులకు ఆలవాలం కవిత్వంగా  కనిపిస్తోంది. అలాంటి సున్నిత హృదయిని గీతా వెల్లంకి కవిత్వంలోకి ప్రవేశిస్తే, ఎన్నెన్నో అద్భుతాలు, అనుభూతులు మనకు కలుగుతాయి.

ఎంత సున్నితమైన ప్రేమపదాలంటే, పట్టుకుంటే ఆ అక్షరాలెక్కడ జారిపోతాయో నన్పిస్తుందొక్కోసారి. ప్రకృతిలో లీనమై పరవశించి, పలవరించిన కవితాక్షరాలే అన్నీ.

ఈమెకు ప్రకృతంటే ప్రాణం ప్రేమ ఆహారం, అనుభూతులు నిత్యకృత్యం. స్నేహం చెలిమిని గుండెల్లో దాచుకున్న సముద్రమాయె. అందుకని మనం ఈ కవిత్వాన్ని చేరతో ఎంత తోడినా పొంత నిండదు. సముద్రాన్ని ఎవరన్నా ఖాళీ చేయగలరా? ఆకాశాన్ని భూమిమీదకు ఆహ్వానించగలరా? భూమికి రెక్కలొచ్చి ఆకాశంతో కలపగలరా? రాత్రిని వెలుగుమయం, పగటిని వెచ్చని ఉదయంగనే వుంచగలరా? లేరు. చేయలేరు.

కానీ గీత తనకవిత్వంలో ఇలాంటివెన్నో ప్రయోగాలు చేసింది. రకరకాల భావోద్వేగాలను, ఇంద్రధనుస్సుపైకి వెళ్ళి, ఒక్కోరంగును మనపై కవితాక్షరాలతో విసురుతూ, ఏడు రంగులూ పూర్తయినా, కోటానుకోట్ల రంగుల అనుభూతుల్ని చదువరుల మనస్సులోకి విరజిమ్ముకుంటూ వెళ్ళిపోతుంటుంది.

భావకవిత్వపు ఛాయల్లో సారంభంలో కవిసంగమం లో రాస్తున్నప్పుడు అన్పించింది. గీతతో అన్నానుకూడా ఒకసారి. కానీ తాను ఈ కవిత్వంతో తప్ప వేరే కవిత్వ ఛాయలలో ఒదగలేకపోయింది. నామనసు ఇలాగే రాయమంటోంది అన్నది. ఆ స్వచ్ఛతే, ఆ నిరాడంబరతే, ఆ నిజాయితే ఆమెను ఈ రోజు విలక్షణమైన కవియిత్రిగా నిలబెట్టింది.

సాహిత్య ప్రపంచంలో తన ముద్రను రచించుతుంటూ పోతోంది.

ఒకచోట కవిత్వం, కవితారూపాన్ని గురించి ఇలా అంటుంది. కవి ఒక ఉబికే జలం… ఎప్పటికప్పుడు ఊరే ఊటబావికవిత్వం…ఒక నిత్యజీవధార అని.

అమ్మప్రేమ అనే కవిత్వంలో ఒంటిరదుఃఖంలో అసహనంతో, తల్లి తనకు తెలియకుండానే హింసించే వాస్తవాన్ని, కళ్లకు కట్టినట్లుగా చెబుతోంది. మాతృప్రేమ రాహిత్యానికి గురైన పిల్ల మనస్సుతో –

మరో కవితలో మనుషులెక్కడున్నారా అని వెతుకులాటలో మనుషులకంటే శవాలు నయం అని తెల్చేస్తుంది. మానవత్వం కోసం నిరంతరాన్వేషణ కనబడుతుంది.

ప్రేమతుఫాను– కవితలో – గాలికోసం వచ్చిన పండుటాకులు రాలి సవ్వడిచేస్తున్నాయి. నీ అడుగులు ఎక్కడో నా గుండెలో పడి నలిగినట్టున్నాయి.

తన చుట్టూవున్న ప్రకృతితో, వస్తువులతో సరికొత్తగా ఎప్పటికప్పుడు ఊహచెయ్యడం ఈమె ప్రత్యేకత. మౌలాలీకొండగురించి, చరిత్రను వివరిస్తూ రాసిన కవిత.

ఇలా అన్వేషిస్తూ పోతుంటే తనకో నిజంతెలిసిందంట –

వెతకాల్సింది నీకోసం కాదని

తప్పిపోయింది నేనని

నేను దొరికేది నీ హృదయంలోనని నీవే చెప్పావు

పైకి ప్రేమపదాల్లా కన్పిస్తున్నా అంతర్గతంగా విషాదస్వరం, అన్వేషణాస్థితి, ఫిలసాఫికల్ టచ్, ప్రశ్నించే గుణం, దీనికి అంగీకరించని రాజీపడని స్థతి, ఒక ఉద్విగ్నభరిత హృదయం, ఒక ప్రేమపిపాసి, బతుకంతా లక్షలమైళ్ళు నడుస్తూ, నడుస్తూ అలసటతో ఆగి మళ్ళీ కొనసాగుతున్న పయనాలు వెరసి గీత కవిత్వం.

విండోవెర్షన్తాత్వికచింతనతో కూడిన కవిత. కిటికీ ఆత్మను కొత్త వెర్షన్తో మొదలు పెట్టి, మూసిన కిటికీ తెరుచుకున్నప్పుడే డిఫరెంట్ వెర్షన్ మొదలవుతుందంటుంది.

డిప్రషన్ చెట్టుకూడా విలక్షణమైన కవిత.

ఇది ఒక ఎడారి జీవితం

దొరికినప్పుడే నీళ్ళు తాగాలి ఒంటెలాగా!

మనసులో సంతోషపు తడిని నింపి సాగిపోతుండాలి

డిప్రెషన్ చెట్టు ఎదురైతే ఎక్కాలి

జీవితం విలువ తెలియడానికి

వాటిని మనమే కూళ్చేసుకోవాలి మళ్ళీ

మనస్థైర్యం మనకుందని  నిరూపించడానికి

డిప్రెషన్ చెట్టుపై కూర్చున్నా

నాకొమ్మని నేనే నరుక్కొవాలి

కిందపడితే మళ్ళీ లేవగలగాలి అంటుంది.

మచ్చుకు కొన్ని కవితా పాదాలు

నువ్వొస్తే నిజానికి

నేనంటూ మిగలనివ్వని ఒక హరికేన్ వే!

ఇప్పుడు అమ్మలేదు

అమ్మచీరతో కుట్టిన బొంతవుంది

కప్పుకుంటే

అందులోంచి అమ్మవాసన వస్తూనేవుంది

  ఎప్పటికీ నీతోవుండాలని కాదు నా ఆశ

గడిపిన కొద్ది క్షణాలైనా మరుపురానిదైతే చాలు

  నా కనురెప్పల్ని కప్పుకొని

నన్ను కవిత్వంగా మారుస్తూ

…. నీ స్మృతిలో విస్మృతిరాలిని చేస్తావు

    తులాభారం ఒక్క హృదయంతోనే

తూగుతుంది

ప్రేమ తక్కెడ ఉందేమో కనుక్కుందామా

మరి !

          నాలుగు దిక్కుల నుండీ

ఒకేసారి సూర్యోదయమైనట్లు

… నీవొక వెలుగు నదివై నాలో నిండిపోయావు !

          ఆ తీవ్ర ఉద్వేగ స్రవంతిలో

ఆకాంక్ష భరిత ఒత్తిళ్ళలోని చైతన్యాన్ని

తోసుకుంటూ…

…. నది దారి మర్చిపోయింది.

సాగరం ఎదురుచూస్తుందేమో మరి !

          నిన్ను చూసిన ఉద్వేగంలో

నేను జలపాతాన్నైపోతానేమో !

మేఘాలు

నీ మీంచి నా ప్రేమనీ

నా మీంచి నీ ప్రేమనీ

మోసుకెళ్ళేటప్పుడు

మిణుగురులు మెరుస్తాయి !

….

ఎక్కడో ఒకచోట ఆకాశం కుప్పకూలుతుందేమో

ప్రేమ లేని చోట !

          జీవిత క్షణాలు విచ్ఛిన్నమై

మరో జీవితంలోకి వలస పోతున్నప్పుడు కూడా

నువ్వు తప్పిపోయిన ఆకాశాన్ని వెతుకుతావు

నువ్వే ఆకాశం అని ఎప్పటికీ తెలుసుకోవు

చాలా కవితల్లో ఫిలసాఫికల్ టచ్ ఎక్కువ. ఇంతటి నిర్మలమైన ప్రేమను పొందిన వారి ఘనత విలక్షణమైనది. ఈ స్వచ్ఛరూప ప్రేమ శిఖరం దొరకడమే ఒక అపురూపం. ఈజ్వజ్వల మాన కిరణ సందోషమే ఆమె హృది. నేలనింగీ తరతరాలుగా ప్రేమకాంక్షలతో ఎగిసిన భావోద్వేగ సందోషమే ఇవన్నీ.

రేవతీదేవి కవితల్లో వున్న భావగాఢత, సారూప్యత, చాలాచోట్ల కన్పిస్తుంది. ఈ రాత్రికి నన్నిలా మిగలనీ అంటూ తారాస్థాయిని చేరిన ఉద్వేగి భావ శకలాన్నీ బతికిన కవిత.

నీ నుండి వెళ్ళలేను

నాలో నేనుండలేను

నేనే నీవై పోయానేమో అసలు

ఏమిటిదీ… నీ గురించి ఇంతగా …

ప్రేమ తీవ్రతను తెలిపన కవిత.

నిరీక్షణ క్షణాలుకవితలో ఊహలన్నీ కొత్తవి. ఉద్వేగ నేహధారిణి నక్షత్రాలతో రాలేవని వత్తిడికి రాలిపోతాయేమో, ఆకాశం శూన్యంగా తెల్లవారుతుందేమోనని దిగులువస్తుంది. అతడు లేని క్షణాల్ని తలుచుకుంటూ, కనుచూపుమేరలో నువ్వుండాలంటే రెప్పలు మూసుకుని ఉండడమే అనేస్తుంది. విషాధ ఛాయల్ని రానివ్వదట. ఆమె అక్షరాలు ఎంత లలితమంటే, ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీటినుంచి అతడు జారిపోతాడేమో అని భయమట. ఆమె హృదయంలోకి దారి కనబడాలంటే, చిరునవ్వుని దివిటీలా వెలిగిస్తుందట. నిశ్శబ్దాన్ని ఇష్టపడే నాలో అలవికాని రోదన ధ్వని అంటుంది.

మనసేమో ఖాళీగావుంది

నింపడానికి నా దగ్గర ఉప్పునీటి జలపాతాలున్నాయిప్పుడు

మోడువారిన నా గుండె చిగురించడానికి సిద్ధంగానే వుంటుంది.

ఆల్చిప్పల్లో తయారయ్యే ముత్యాల్లా

నామనసులో రాలిన నీ మెమోరీలు

నిన్నుతలుచుకున్నప్పుడల్లా

నేనే ఒక ఆల్బమ్ నై పోతుంటా

ఎన్నిసార్లు చూసుకున్నా

మరపురాని మెమొంటోలా నువ్వుంటావు

ఇలా చెప్పుకుంటూ పోతీ ఈ ఆధునిక ప్రేమకావ్య వర్షంతో మనందరం మునకలేస్తునే వుంటాం. ఆకాశం గొడుగుపడుతుందట. నది మనసులోంచి వస్తుందట. ఇలా రకరకాలుగా భావ విన్యాసాలతో గీత మనల్ని అబ్బురపరుస్తునే వుంటుంది. గీతకు పదేపదే వచ్చే పదాల సమూహాల కొన్నున్నాయి. అవి ఆమె నీడలా కన్పిస్తుంటాయి. సముద్రం, అమ్మ, ఆకాశం మిణుగురులు, నక్షత్రాలు, నదులు, సముద్రాలు, ఇలా అనేకం. భాషలో కొత్తదనముంది. అర్థాలు కొత్త అర్ధాన్నిఇచ్చి ఆశ్చర్యపరుస్తాయి. గీతలోని రచనాశక్తి 15 ఏళ్ళనుంచి ప్రారంభమై, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత గత రెండేళ్ళుగా కవిత్వం రాయడం మొదలుపెట్టింది. అనడం కంటే, కవిత్వమే ఆమెను ఆరగించి కాస్తోందనొచ్చు.

ఇది కేవలం భౌతికమైన ప్రేమగురించి కాదు. మానసికమైన ప్రేమ, తోడొకరుంటే వచ్చే ఆత్మతృప్తి, సృష్టిలో అన్నింటికంటే విలువైన ప్రేమగొప్పతనాన్ని గురించి అభివర్ణించిన ఆధునిక కావ్యమిది. ఏలూరులో పుట్టి, ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్న గీత MNC లో ఉద్యోగం చేస్తోంది.

వర్సం చేసే మామూలు చర్యలో కూడా తనను కడిగే వర్సం కురవడం మానేనంది అంటుందొక చోట ఉద్విగ్నతతో.

అప్పుడప్పుడు చీకటి

కొంత ఏకాంతమూ అవసరమే

మనసు ప్రక్షళన కావడానికి !

ఇదిగో… ఇక్కడోమూసేసిన కిటికీలోంచి

సన్నగా వెలుతురు పడుతోంది

తెరుద్దాం రండి

కొత్త ఆకాశం చూడ్డానికి !

అంటూ గీత తొలిపుస్తకంలో ఆహ్వానగీతం పలుకుతోంది అందరికీ. రండి మీరందరూ పుస్తకం తెరిచాక మీలోకి మీరు జారిపోతారనడంలో సందేమం లేదు. గీత కవిత్వానికంత శక్తీ భావసాకుమార్యం కూడావున్నాయి.

*****

Please follow and like us:

5 thoughts on “కొత్త అడుగులు-13 (తెరిచిన కిటికీలోంచి….)”

  1. చక్కని ప్రేమ కవితాఝరిని పరిచయించారు శిలాలోళిత.అమ్మా..

    .. అభినందనలు గీతాజీ

  2. Good review on Geeta’s love poetry…
    కొత్త ప్రేమాకాశం ఎప్పుడెప్పుడు చూడాలాని మనసు ఉవ్విళ్లూరుతోంది💖💖

  3. ఎంత బాగా రాసారో….గీత కవిత్వం ప్రేమాక్షరాల్లో ప్రవహించే వేదన, వెతుకులాట…ఒకానొక అలుపెరుగని ప్రయాణం. తన కవిత్వం తత్వాన్ని చాలా బాగా పెట్టుకున్నారు శిలాలోలిత గారు. ఇరువురికీ
    హృదయపూర్వక అభినందనలు

  4. చాలా బావుంది మేడం విశ్లేషణ…..
    గీతా వెల్లంకి గారు అభినందనలు

Leave a Reply

Your email address will not be published.