చిత్రం-16

-గణేశ్వరరావు 

‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ వాటిని చిత్రించడం! అభయారణ్యంలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీ ముందు ఒక లేడి దూకడం చూస్తారు, చేతిలోని కెమెరా తో ఫోటో తీయడానికి ప్రయత్నిస్తారు. అదే మీరు ఒక చిత్రకారుడు అయితే..ఆ దృశ్యాన్ని కళ్ళల్లో నిలుపుకుంటారు, దాన్ని కాన్వాస్ పైకి ఎక్కించడానికి మీకు కొన్ని గంటలు పడుతుంది. vacation అనే సినిమాలో హీరో కారులో ఎన్నో రోజులు ప్రయాణం చేసి గ్రాండ్ కెన్యాన్ చేరుకుంటాడు, తీరా దాన్ని నిమిషంలో ఫోటో తీస్తాడు ! అరకు లో తిరుగుతూ అందాలను చిత్రించడం గొప్ప అనుభూతి కదా! అనుభూతి చిత్రకారులు నది ఒడ్డునో..కొండ అంచునో కూర్చుని బొమ్మలు వేస్తారు. అమెరికాలో ఈ పధ్ధతి వేళ్ళూనింది. డాక్యూమెంటరీలు వచ్చాయి, కొన్ని పత్రికలూ వస్తూ ఉన్నాయి, ఆర్ట్ గ్యాలెరీలు ఉన్నాయి, పోషకులున్నారు. 3 నెలలకోసారి వీరంతా ఒక చోట చేరి మూడు రోజులపాటు ప్రదర్శనలను నిర్వహిస్తారు, దూర ప్రాంతాలనుంచి ఆర్టిస్ట్ లు వస్తారు, నచ్చిన వస్తువును – లాండ్స్కేప్ ను ఎన్నుకుంటారు, ఓ 3 చిత్రాలను కాన్వాస్ పైకి ఎక్కిస్తారు, ఆఖరి రోజు ఆ చిత్రాల ప్రదర్శన ఉంటుంది, పేట్రన్స్ తమకు నచ్చిన పెయింటింగ్స్ కొనుక్కుంటారు. అన్ని విశేషాలతో ఒక ప్రత్యేక సంచిక వస్తుంది, చిత్రాల ఫోటోలు అందులో ఉంటాయి. కలెక్టర్లు పత్రికలోని ఫోటోలు చూసి కొనుక్కుంటుంటారు.

 కొలరాడోలో plein art festival జరిగిన అప్పుడు  అక్కడ నివాసం ఏర్పరచుకున్న అరుణ అక్కడకి వెళ్ళింది.. 50 మైళ్ళ దూరం. చిన్న ఊరు. 500 ఇళ్ళు, సుమారు 2 వేలజనాభా. ఊరిపేరు cripple creek, ఒక దూడ కంచె దాటడంలో గోతిలో పడి ఒక కాలు విరగ్గొట్టు కుందట! అందుకే ఆ పేరు! దగ్గర్లోనే విక్టర్ సిటీ ఉంది. 18వ శతాబ్దం చివరిలో ఇక్కడ బంగారం గనులను కనుక్కున్నారు, 400 మిలియన్ డాలర్ల బంగారం తీశారు, పని ఆగిపోగానే, కార్మికులూ అధికారులూ క్రషర్లనీ, ఇళ్ళనీ వదిలివెళ్లిపోయారు. ఇప్పుడు టూరిస్ట్ లు వెయ్యి అడుగుల లోతు భూగర్భంలోకి వెళ్లొచ్చు, అప్పుడు వాడిన పనిముట్లను, గోల్డ్ మైన్ ను, మ్యూజియం ను చూడొచ్చు. ఇటీవల మళ్ళీ ఖనిజాల తవ్వకం మొదలెట్టారు. ! అన్నట్టు స్థానికులు ఇలా వచ్చిన వారికి ఇంట్లోని ఒక గది తాళం ఇచ్చేస్తారట.  స్పాన్సర్స్ ఇచ్చే వేల డాలర్ల ప్రైజులనీ పేట్రన్స్ కొనడాన్నీ పట్టించుకోరు. వీళ్ళు బొమ్మలు వేస్తుంటే చూ డటానికి పలు ప్రాంతాలనుంచి జనం వస్తారు.  

ఒక  గని కార్మిక కుటుంబం వదిలేసి వెళ్ళిపోయిన ఒక ఇంటి బొమ్మను గీయడానికి  అరుణఎంచుకుంది  . పాత సామాన్లు నిండిన గదులు..ఇంటి వెనక కారు టైర్లు..పెరట్లో పిచ్చిగా మొలిచిన గడ్డి..ఒకప్పుడు కుటుంబాలు కాపురాలు చేసేయన్నదానికి నిదర్శనంగా పోర్టికోలో వేలాడుతున్న దీపాలు, ఇంటి పై కప్పు పై డిష్ యాంటెనా లు! ఒక ‘ghost town’ ను ఇలా చిత్రంలో  చూడటం   ఒక గొప్ప అనుభూతే!

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.