నారిసారించిన నవల-15
డా. పి. శ్రీదేవి
-కాత్యాయనీ విద్మహే
3
భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి భౌతిక ఉనికి కుటుంబ సభ్యులందరూ కలిసి వుండే ఇల్లు. ఇక్కడ ఇల్లు అంటే నాలుగు గోడలు, రెండు మూడు గదులు వున్న నివాస యోగ్యమైన ప్రవేశం అని మాత్రమే అర్థం కాదు. మనుషుల మధ్య సంబంధాలకు బాధ్యతలకు అది ఒక సంకేతం. పెళ్ళి కుదిరితే మగవాళ్ళను గురించి ఇప్పటికి ఒక ఇంటివాడవుతున్నాడన్న సంతోషాన్ని అభినందనను వ్యక్తం చేయటం లోకంలో వుంది . అంటే ఇల్లు ఒక బంధానికి బాధ్యతకు కట్టిపడేసే నిర్మాణమనే కదా అర్థం. ఇల్లు ఆడదానికి పర్యాయపదంగా కూడా వుంది. ఇంటికి దీపం ఇల్లాలే. ఇల్లు చూచి ఇల్లాలిని చూడు మొదలైన మాటలన్నీ ఇల్లు నిలిపేది, ఇంటికి మూలస్తంభంగా నిలిచేది ఆడదేనని సూచిస్తున్నాయి.వీటిని దృష్టిలో పెట్టుకొని కాలాతీతవ్యక్తులు నవలలో కుటుంబం గురించి ఆలోచిస్తే ఆసక్తికరమైన అంశాలు అర్థం అవుతాయి .
ఒకటి – భార్యా భర్త పిల్లలు కలిసి కుటుంబం అనుకొన్నామా . . . ! అలాంటి కుటుంబాలు ఈ నవలలో ఏవీ లేవు . ఆనందరావు ఇందిర తండ్రీ కూతుళ్ళు మాత్రమే వున్నారు . ప్రకాశం ఒక్కడే , కృష్ణమూర్తి ఒక్కడే వాళ్ళ కుటుంబాలు పల్లెటూళ్ళలో వున్నాయి కదా అనుకొంటే ప్రకాశం తల్లి మేనమామ కుటుంబంలో ఆశ్రయం పొందివున్నది తప్ప ఆమెదైన కుటుంబం స్వతంత్రంగా లేదు . ‘నా యిల్లు అనే మాట మరిచిపోయి దశాబ్దాలయింది వెంకాయమ్మకి’ అంటుంది రచయిత్రి ఆమె గురించి చెప్తూ. కాపురానికి వెళ్ళిన మరుసటేడు ఆమెకు కొడుకు పుట్టాడు. కొడుకు మూడేళ్ళ వాడప్పుడు భర్త చనిపోతే అప్పటి నుండి అన్నగారి ఆశ్రయంలో వుంది. కొడుకు చదువు పూర్తిచేసు కొని ప్రయోజకుడై పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడయితే, కొడుకు కోడలు మనవలుతో ఏర్పడే కొత్త కుటుంబంలో జీవితాన్ని గురించిన కలలు కంటుంటుంది ఆవిడ. కృష్ణమూర్తికి ఇల్లంటే భయం . ఇంటివాళ్ళను వీలయినంత తప్పించుకుంటూ తిరుగుతున్నవాడు అని చక్రవర్తి గుర్తించటమే కాదు, ఆ మాట కృష్ణమూర్తితోనే అంటాడు కూడా. ఊరికి వెళ్తున్న కృష్ణమూర్తితో ప్రకాశం మళ్ళీ ఎప్పుడు వస్తావ్ అని అడిగినప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక తిరుగు బస్సులో వచ్చేయాలనిపిస్తుంది . అక్కడ మా ఊరు , మా కుటుంబం అలాంటివి అంటాడు . అంటే స్వేచ్ఛా ప్రియులయిన ఆధునిక యువతీ యువకులను ఇముడ్చుకొనే ప్రజాస్వామిక విశాలతత్త్వం సంప్రదాయ కుటుంబంలో కొరవడిందని అర్థం చేసుకోవచ్చు.
కల్యాణి ఒక్కతే వుంటుంది. వసుంధర వాళ్ళ పిన్నితో వుంటుంది. వసుంధరకు , వైదేహికి వెనక బలమైన కుటుంబాలున్నాయి. అన్నలు, వదినలు, ఆప్యాయతలు, అధికారాలు అన్నీ ఉన్నాయి. తమ వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించలేని ఆ ఆప్యాయతలు, అధికారాలు ఇద్దరికీ వెగటునే కలిగిస్తాయి. తను ఎవరితో స్నేహాలు చేయాలో, ఎవరిని పెళ్ళాడి ఎటువంటి హోదా గల జీవితం అనుభవించాలో అన్నయ్య సూచిస్తాడు వసుంధరకు. ఇరవై ఐదేళ్ళు వచ్చినా తనకు పెళ్ళి సంబంధాలు చూచి చేస్తామని వెంటపడుతుంటారు వైదేహి అన్నలు . అలాంటి అధికార కుటుంబ సంబంధాల మీద ఇద్దరూ నిరసన ప్రకటించారు. వసుంధర తన పై తక్షణం పెత్తనం చేసే పిన్నిపై ధిక్కారం ప్రకటించింది . వైదేహి అన్నల ప్రవర్తన పట్ల నిరసనగా ఒక రోజు ఇల్లు వదిలి వచ్చింది . .
కల్యాణితో స్నేహం పెరిగి ఆమెకు తన ఇంట ఆశ్రయం ఇచ్చేవరకు వసుంధరకు తన కుటుంబమంటే గౌరవమే వుంది. వసుంధరకు వండి పెడుతూ తోడుగా వున్న పిన్ని ఏమి వ్రాసిందో కానీ పెద్దన్నయ్య వసుంధరను మందలిస్తూ ఒక ఉత్తరం వ్రాశాడు. ఉపకారబుద్ధి మంచిదేకానీ దానివలన లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టుకొనటం భావ్యం కాదని వ్రాశాడు. అన్నయ్యను కాదని తాను ఏదీ చెయ్యలేదని తెలిసివచ్చిన సందర్భం అది. కల్యాణికి తానెంతో కాలం ఆశ్రయం ఇయ్యలేనని గ్రహించాక ఆమె వేరే గది అద్దెకు తీసుకొని బయటకు వెళ్ళటానికి సిద్ధపడితే సరేనన్నది. పుట్టినరోజు నాడు తన దగ్గరకు వచ్చిన కల్యాణిని పిన్ని అవమానించి అర్థరాత్రి బయటకు వెళ్ళిపోయేలా ప్రవర్తించిందన్న కోపంతో వసుంధర పిన్నిని ధిక్కరించింది. ఆ ధిక్కార సందర్భంలోనే ‘ఇల్లూ వాకిలీ గతం వర్తమానం అన్నయ్యలూ అధికారం – అన్నీ ఆమెలో ఆ క్షణంలో ప్రజ్వరిల్లిన క్రోధాగ్నిలో భస్మమైపోయాయి’ అంటుంది రచయిత్రి.
రెండు – కుటుంబం అంటే దానితో పాటు కుటుంబ గౌరవం కూడా వుంటుంది. దానికి భంగం కలిగే విధంగా ఎవరూ ప్రవర్తించరాదు. వసుంధర చక్రవర్తితో , కృష్ణమూర్తితో చేసే స్నేహం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని పిన్ని, ఆమె అన్నయ్య భావించారు కనుకనే ఆమెను హెచ్చరిం చారు. వైదేహి తాము తెచ్చిన పెళ్ళి సంబంధాలను తిరస్కరించటమేకాక ఇష్టం లేదని ఇల్లు వదిలి వెళ్ళటం కుటుంబ గౌరవానికి భంగకరంగా భావించారు ఆమె అన్నలు . వైదేహిని వెతుక్కుంటూ ఇందిర దగ్గరకు ఆమె అన్న ప్రసాద్ వస్తే కుటుంబ గౌరవం గురించి అతడుపడే తపన చూచి ఇందిర విసుక్కొంటుంది . ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిందని పోలీసు రిపోర్ట్ ఇయ్యటానికి వంశగౌరవ కారణంగానే అతను నిరాకరించిన విషయం గమనించదగింది. ఈ కుటుంబ గౌరవ భావన ఈ నాడు ఎంత వికృత రూపం ధరించిందో పరువు హత్యల వర్తమాన దృశ్యం మనకు చూపుతూనే ఉంది.
మూడు- కుటుంబం ఒక భద్రతావలయం. ఆ భద్రత మనసుకు మనిషికి స్వాంతన కలిగిస్తుంది. వైదేహి అన్నలు ఆమె ఒకపూట కనిపించకపోయేసరికి వెతుక్కొంటూ వచ్చి ఆదుర్దా వ్యక్తం చేసిన సందర్భంలో ఇందిర తన గురించి అలా ఆలోచించి తపనపడేవాళ్ళు లేరే అని లోలోపల బాధ పడుతుంది. అంటే కుటుంబాధికారాన్ని వెక్కిరించే ఇందిరకు కూడా కుటుంబం లోని భద్రత వల్ల లభించే వెచ్చదనం పట్ల అపేక్ష వుంది. చక్రవర్తి కల్యాణి పట్ల తన ఆసక్తిని గురించి ఆత్మ విమర్శ చేసుకొంటూ ఆమెకు ఒక నిండైన యిల్లుండి , అమ్మా నాన్న ఉంటే తమతో ఇలా గంటల కొద్దీ మాట్లాడనిచ్చేవారా ? సినిమాలకూ , షికార్లకూ రానిచ్చేవారా ? ఆవిడ గురించి అంతగా ఆలోచించడానికి తనకేం అధికారం ఉంది ? అనుకొంటాడు . కుటుంబం ఆడపిల్లకు రక్షణ అనే భావం ఇక్కడ కూడా కనబడుతుంది .
అయితే కుటుంబం తనమీద తనకు ఏ అధికారం లేకుండా చేయటం పట్లనే ఆధునిక యువతీ యువకులకు అభ్యంతరం వుంది. ఆడయినా మగయినా ఆ అధికార చట్రంలోనివారే . కృష్ణమూర్తి తన కుటుంబం నుండి తప్పించుకు తిరగటంలో, ఆ ఏదో రకమైన అధికారాలు ఒత్తి డులు,వంశగౌరవాలు, ప్రతిష్టలే కారణమై ఉంటాయి. వీటిని నేను లెక్క చేయను అని కుటుంబం బయట తిరగటానికి మగవాడికి విశాల ప్రపంచం వుంది. డబ్బున్న మగవాళ్ళకు అది మరీ సులువు. కృష్ణమూర్తి ఆ రకంగానే తనమీద పెత్తనం చేయబోయే కుటుంబాన్ని తప్పించుకొంటూ ఫెయిల్ అవుతున్న పరీక్షలు మళ్ళీ వ్రాసే నెపంమీద విశాఖను వదలకుండా జీవించాడు అనుకోవాలి . కృష్ణమూర్తికే ఊపిరాడనియ్యని కుటుంబం ఆడవాళ్ళపట్ల మరింత ఇరుకుగా వుంటుంది. ఆ ఇరుకులో మగ్గి మగ్గి ఇక భరించలేనని వైదేహి ఇల్లువదిలితే అది పెద్ద విషయమై పోయింది . ఒకరాత్రి ఇందిర ఇంట్లో తలదాచుకొన్నా, మళ్ళీ ఆమె చేరవలసిన గమ్యం కుటుంబమే అయింది .
తల్లి లాలన , తండ్రి సమర్థన లేని కుటుంబంలో మఠంలో నివాసంలాంటి జీవితం గడిపిన ఇందిరకూ కుటుంబం కావాలి. తల్లి చిన్నతనానే చనిపోయి తనలోకితాను ముడుచుకుపోయిన తండ్రి పెంపకంలోని కల్యాణికి ఆప్యాయతలు పంచే కుటుంబం కావాలి. తలిదండ్రుల నిర్దాక్షిణ్య ప్రవర్తనవల్ల దత్తత పోయి పెంపుడు తల్లి కాఠిన్యంలో మూర్ఖత్వంలో పెరిగి అర్థం చేసుకొని ఆప్యా యత పంచలేని భార్య సహవాసంలో జీవితమే నరకమై అందరినీ కోల్పోయి ఒంటరిగా బ్రతుకు తున్న చక్రవర్తికీ కుటుంబం కావాలి. తండ్రి చిన్నతనానే చనిపోయి మేనమామ ఆశ్రయంలో పెరిగిన ప్రకాశానికి కుటుంబం కావాలి. ఇందిర అయినా, కల్యాణి అయినా చక్రవర్తి అయినా, కృష్ణమూర్తి అయినా అస్తిత్వంలో వున్న కుటుంబ సంబంధ స్వభావాన్ని యథాతధంగా ఆమోదించ లేక పోయారు. ఒకరి మీద ఒకరికి హక్కులు అధికారాలు లేని అప్యాయతలు పంచుకొనే వ్యవస్థగా దానిని పునర్నిర్మించు కొనాలనుకొన్నారు. ప్రకాశం ఒక్కడే యథాతథ కుటుంబ వ్యవస్థాచట్రాన్ని ఆమోదించి ఒదిగి పోయాడు. వసుంధర వైదేహి కూడా కొత్త కుటుంబ సంబంధాలను గురించి కలలు కంటున్నవాళ్ళే. ఆ రకంగా వీళ్ళు తమ కాలం కంటే ముందుండి సమాజాన్ని నూతన చైతన్యంతో ముందుకు నడిపించటంలో కార్యశీలురుగా తమనుతాము తయారుచేసుకొన్నారు . అందువల్ల ప్రకాశం కాలప్రవాహగతిలోపడి కొట్టుకుపోయినవాడయితే మిగిలినవాళ్ళు ఎదురీది కాలాతీత వ్యక్తులైనారు .
4
స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధాలు ప్రేమతో, పెళ్లితో ముడిపడి మాత్రమే కాదు వాటితో సంబంధం లేకుండానూ ఉనికిలో ఉండటం కాదనలేని లోకవాస్తవం. అయితే వాటిని నీతి, అవినీతి అనే విలువలతో తూచటం కుటుంబ వ్యవస్థ స్థిరీకరణతో పాటే మొదలైంది. మగవాడి వంశానికి, ఆస్తులకు వారసుల ఖచ్చితత్వ నిర్ధారణ లక్ష్యంగా స్త్రీల లైంగికత మీద నియంత్రణను ఆశించిన పితృస్వామిక సమాజం అభివృద్ధి పరచిన శీలం,పవిత్రత,పాతివ్రత్యం వంటివిలువల సమాహారం లైంగిక నీతి. పురుషులలో అంతగా పాటింపుకు రాని లైంగిక నీతి స్త్రీల విషయంలో ఖచ్చితంగా పాటించ వలసినది అవుతుంది. లైంగికత విష్షయంలో ద్వంద్వ విలువల పై విమర్శ , స్త్రీల లైంగి కత పై నియంత్రణ పై నిరసన, ధిక్కారం స్త్రీవాద సిద్ధాంతంలో ,ఉద్యమంలో కీలకమైన విషయాలు. పంథొమ్మిది వందల తొంభైయ్యవ దశకంలో తెలుగు సమాజంలో , సాహిత్యంలో వాదవివాదాలకు, సృజనాత్మక ప్రభావానికి కారణమైన ఈ విషయాలు అప్పటికి మూడు దశాబ్దాలకు పూర్వమే కాలాతీత వ్యక్తులు నవల ఇతివృత్తంలో అతి సహజంగా భాగం కావటం ఆశ్ఛర్యం కలిగించక మానదు.
ఈ నవలలో ఇందిర మగవాళ్ళతో ఇట్టే స్నేహం చేస్తూ, కవ్విస్తూ, వాళ్ళతో సినిమాలకు, షికార్లకు తిరుగుతూ, వాళ్ళచేత ఖర్చుపెట్టిస్తూ కులాసాగా నవ్వుతూ, తుళ్ళుతూ గడిపేసే అమ్మాయి. పైన గదిలో అద్దెకు ఉండే ప్రకాశం, ప్రకాశం కోసం వచ్చే స్నేహితుడు కృష్ణమూర్తి అలా ఆమె జీవితంలోకి వచ్చిన వాళ్ళే. వాళ్ళతో ఆమెకు లైంగిక సంబంధాలు ఉన్నాయి. ఇవి లోకం దృష్టిలో కూడనివి. శీలం లేని స్త్రీగా నిందకు గురిచేసేవి. కానీ ఆ లోకం గురించి, ఆ నిందల గురించి జడవని స్వభావం ఇందిరది. ఆ స్వభావం ఆమెకు ఎక్కడ నుండి వచ్చింది? రోగిష్టి తల్లి, తాగుబోతు, తిరుగుబోతు తండ్రి -’కొంచెం జీవ శక్తి ఎక్కువగా ఉండటాన్న’ ప్రత్యేక రక్షణ, శ్రద్ధ లేకపోయినా పెరిగిన పిల్ల. తండ్రి ఒకనేరంలో జైలుకు వెళ్ళటం, తల్లి మరణించటం కారణంగా ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొనవలసి వచ్చిన యువతి. చదువు అర్ధాంతరంగా ఆపేసి టైపూ, షార్ట్ హ్యాండూ నేర్చుకొని ఉద్యోగం సంపాదించుకొన్న స్వతంత్రురాలు. తండ్రి ఉన్నా అన్నిటికీ తనమీదే ఆధారపడ్డవాడు. ఆయన అవసరాలు తీర్చుకొనటం గురించే తప్ప కూతురి అవసరాల గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు.
“ బతుకులో నాకు కావలసింది ఒకటి, దొరుకుతున్నది ఒకటి” అని ఇందిర ప్రకాశంతో సంబంధం తెంచుకొంటున్న సందర్భంలో అన్నమాట. ఆమెకు కావలసింది ఏమిటి? ఇల్లూ , సంసారం , భర్తా పిల్లలు. కానీ ఆమెకు దొరికినవి ఆఫీసు, ఫైల్సు, తన మీద ఒరిగిపోయి బతికేసే తండ్రి. ఈ పరిస్థితులలో తనకు కావలసింది తానే సంపాదించుకోవాలి. ప్రకాశాన్ని తనవైపు ఆకర్షిం చు కొనటంలో ఉన్న ఉద్దేశం అదే. అతను తనకు ఇష్టమయ్యాక లైంగిక సుఖాన్ని పొందటానికి పెళ్లి వరకు ఎదురు చూడవలసిన అవసరం ఉందని అనుకోలేదు. అతను మేనమామ అధికారాన్ని ధిక్క రించలేడని, ఆయన కుదిర్చిన సంబంధం చేసుకొనటానికి తలవంచి అవకాశం దొరకగానే పారిపోయి వచ్చి బాధ్యత తన మీద మోప చూస్తున్నాడని తెలిసాక ప్రకాశం పట్ల ఆమెకు ఇష్టం పోయింది. ప్రకాశాన్ని పెళ్లి చేసుకొనటం అంటే మరొక బరువు నెత్తి కెత్తుకొనటమే అని అర్ధం అయి అందుకు తాను సిద్ధంగా లేనని చెప్పెయ్యగలిగింది. అట్లా చెప్పటానికి అతనితో ఏర్పరచుకొన్న శారీరక సంబంధం ఆమెకేమీ అవరోధం కాలేదు. జీవులలో లైంగిక ఆసక్తులు సహజాతాలు. ప్రకాశం తో సంబంధం ఏర్పరచుకొనటంలో ఇందిర చూపిన చొరవలో అతను తనకు కట్టుబడి ఉండేట్లు చేయటం అనే వ్యూహం కన్నా యవ్వన సహజ వాంఛల నియంత్రణ పట్ల విముఖతే కారణం. అది వ్యూహమే అయితే ప్రకాశం మేనమామ కుదిర్చిన సంబంధానికి ఒప్పుకొని వచ్చినప్పుడు నాతో శారీరక సంబంధం పెట్టుకొని మరొక పెళ్ళికి ఎలా సిద్ధమవుతున్నావ్ అని అడిగి ఉండేది. ఆమె ఆ విషయమే ఎత్తలేదు. ఒక సారి శారీరక సంబంధం ఏర్పడింది కనుక అతను ఎటువంటి వాడైనా పెళ్ళాడి తీరాలి అన్న కుత్సిత నీతికి తలఒగ్గే వ్యక్తిత్వం కాదు ఇందిరది. పెళ్ళికి వ్యక్తిత్వం కన్నా శీలం ముఖ్యం కాదు. శీలం అన్నది ఒక మాయ. శరీరం ఒక వాస్తవం. అదీ ఇందిర దృష్టి.
తండ్రి జైలు శిక్ష అనుభవిస్తుండగా ఒంటరిగా ఉన్న ఇందిర ఆఫీసు నుండి వస్తూ రోడ్డు మీద తనకోసమే ఎదురు చూస్తున్న కృష్ణమూర్తితో కలిసి ఇంటికి వచ్చిన నాటి రాత్రి అతను అక్కడే ఉండిపోతాడు. ఇందిరను ఎన్నిటికో ప్రశ్నించాలి, ఆమె ప్రవర్తన మీద తీర్పులు ఇయ్యాలని వచ్చిన కృష్ణమూర్తి కి ‘ నా బతుకులో ఆక్షేపించ దిగింది ఏదీ లేదు’ అని ఆమె చెప్పిన మాట హాయిగా ఎక్కడికక్కడ సదుపాయంగా బతకటమే జీవితాశయంగా చేసుకొన్న వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తాయి. ఆమె జీవిత కథ విన్నాక, జీవితం పట్ల ఏ క కాలంలో లాలసను, నిర్లిప్తతను కూడా ప్రదర్శించగల ఆమె వ్యక్తితం అర్ధమయ్యాక ఆమె పట్ల తన ఆరోపణలు అన్నీ అర్థరహితం అని తెలిసి వచ్చి ‘ఈవిడలో అసహ్యించుకోదగినది ఏముంది?’ అన్న విచికిత్సలో పడి ఆమెను ప్రేమించటం మొదలు పెడతాడు. ఆ రాత్రి కృష్ణమూర్తి ఆమె శారీరకంగా సన్నిహితమవుతారు. అందులో తన వాంఛా పరితృప్తి, ఆనందం ఉన్నాయి. కనుక దానిని అతి సహజ విషయంగానే స్వీకరించింది ఆమె.
కృష్ణమూర్తి కూడా ఇందిరా లాగానే ‘జీవితంలో నాకు కావాల్సింది వేరు దొరుకుతున్నది వేరు’ అనుకొనే రోజు ఒకటి వచ్చింది. అది ఇందిరతో కలిసి ఒక రాత్రి వాళ్ళింట్లో గడిపిన తరువాత. సరదాగా తిరిగే అతనికి, చాపల్యాలు అనేకం ఉన్న అతనికి ఇందిర జీవితం, కలయిక రెండూ స్వస్వరూప జ్ఞానం కలిగించాయి. తనకు వసుంధర కావాలనిపిస్తున్నా ఆమెకు తాను తగినవాడిని కాదని తెలిసి వచ్చింది. ఇందిరను దక్కించుకొనటమే ఇప్పుడు తాను చేయకవలసిన పని అని స్పష్టం అయింది. తన పట్నపు వ్యామోహాలు, ప్రవర్తనలు అన్నీ పునర్విచారణ చేసుకొంటే ‘ఇందిర తన స్థాయి మనిషి’ అని స్ఫూరించింది. ఒకళ్ళ బలహీనతలు ఒక్కళ్లకు తెలిసిన తామిద్దరూ పెళ్లాడటం సమంజసం అనిపించి అందుకు ఆమెను ఒప్పించాడు. ఆ రకంగా అతను ‘ద్వంద్వ లైంగిక నీతి’ చట్రాన్ని బద్దలు కొట్టిన వాడయ్యాడు. ఇందిర శీలం అతని ఆలోచనలోకే రాకపోవటం గమనించదగినది. ఇందిర శీలం ప్రశ్న వస్తే తన శీలం కూడా ప్రశ్నించదగిందే కదా అన్న ఆత్మ వివేకం అందుకు కారణం అయి వుంటుంది. ఇది ఆధునిక మానవులు అలవరచుకొనవలసిన వివేకం అన్నది శ్రీదేవి అవగాహన.
ప్రారంభంలో స్త్రీపురుష సంబంధాల విషయంలో కల్యాణిది సంప్రదాయ దృష్టే. ప్రకాశం తనకు ఇచ్చిన ప్రేమను విశ్వాసాన్ని విస్మరించి ప్రవర్తించటం గురించి వేదనతో వసుంధరతో మాట్లాడుతున్నప్పుడు ‘ కూడని చనువేదీ అతన్ని నా దగ్గర నుండి తీసికొనివ్వలేదు’ అంటుంది కల్యాణి. పెళ్ళికి ముందు లైంగిక ఆసక్తులను నియంత్రించుకొనటం అనే సంప్రదాయ ‘లైంగిక నీతి’ చట్రంలో కళ్యాణి ప్రవర్తించిందన్నమాట. కృష్ణమూర్తి గురించి వసుంధరకు ‘కొంచెం విలాస పురుషుడు’ అని చెబుతుంది. అటువంటి కళ్యాణి పుట్టినరోజు నాడు వసుంధర ఇంటికి వెళ్లి వాళ్ళ పిన్ని చేసిన అవమానానికి తట్టుకోలేక తక్షణం ఆ పది గంటల రాత్రి వసుంధర వద్దంటున్నా వినక ఇల్లు దాటి వచ్చి దగ్గరలో ఉన్న చక్రవర్తి ఇంటికి వెళ్లి తన దుఃఖోద్వేగాలు తోసుకొని ప్రవాహంలా వచ్చిన తరుణంలో ఊరడిస్తున్న అతనికి అతి సహజంగా దగ్గరై పోయింది. పెళ్లి గురించిన ఆలోచన లేకుండా చక్రవర్తి తో సంబంధం లోకి వెళ్లటంగానీ, వెళ్ళాక అతనితో పెళ్లి గురించి వెంపర్లాడక పోవటంలో గానీ కల్యాణి వ్యక్తిత్వం పరిణామం చెందటం కనిపిస్తుంది. ‘ ఇన్నాళ్లకు తన జీవితం ఫలించింది. తన ఒంటరితనం తొలగి పోయింది. తనిప్పుడు లేచి హాయిగా నిలబడాలి. ప్రపంచాన్ని చూసి చిరునవ్వు నవ్వాలి” అనుకుంటుందామె. లైంగిక సంబంధాలు వ్యక్తుల మానసిక శారీరక సహజ ఆరోగ్య వృద్ధికారకాలుగా చూడటం ఇక్కడ గమనించవచ్చు.
లైంగిక సంబంధాలు సహజ మానవీయ సంబంధాలలో భాగమనీ వాటిని అలక్ష్యం చేయటమో, అతిగా నియంత్రించటమో, అతి ప్రాధాన్యతను ఇయ్యటమో సరైన పద్ధతి కాదని, స్త్రీపురుషుల మధ్య మానవత్వ వికాసానికి అవసరమైన సాధనంగా వాటికి ఒక గౌరవ ప్రతిపత్తి ఉన్నదని డాక్టరు కూడా కనుక శ్రీదేవి ఇంత చక్కగా ఇతివృత్తంలో భాగం చేసి చెప్ప గలిగింది. మనుషుల సంస్కారాలు ప్రజాస్వామిక విలువలైన ఇచ్ఛ, సమానత , స్వతంత్రత ల ప్రాతిపదిక మీద అభివృద్ధి చెందటాన్ని ఆశించిన కాలం కన్నా ముందున్న రచయిత్రి శ్రీదేవి.
(ఇంకా వుంది)
****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.