నా జీవన యానంలో- రెండవభాగం- 16

ఆశాజీవులు కథ గురించి

-కె.వరలక్ష్మి

1972లో నేను స్కూలు ప్రారంభించాను, నాలుగేళ్ళ మా అబ్బాయితో కలిపి ఏడుగురు పిల్లల్లో ప్రారంభించినప్పటి నా ధ్యేయం నా ముగ్గురు పిల్లలకీ లోటులేకుండా తిండి, బట్ట సమకూర్చుకోవాలనే, కాని, నాలుగైదు నెలలు గడిచేసరికి మంచి ప్రాధమిక విద్యను అన్ని వర్గాల పిల్లలకీ అందుబాటులోకి తేవడం ముఖ్యమని అర్ధమైంది. అందుకే ప్రారంభంలో మొదలుపెట్టిన పది రూపాయల ఫీజును పాతికేళ్ళైనా మార్చలేదు. కూలి జనాల పిల్లలకి పుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చి ఉచితంగా విద్య నేర్పాను. పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు అది నా బాధ్యతగా అనుకున్నాను.

1980నాటికి మా ఊరికి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వచ్చింది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవాళ్ళ ఇళ్ళల్లో లాండ్ లైన్ ఫోన్లు వెలిసాయి. అక్కడ పనిచేసే ఇంజనీర్ల పిల్లలు మొదలు కేజువల్ లేబర్ పిల్లలవరకు మా స్కూల్లోనే చదివేవారు. అలాంటి కేజువల్ లేబర్ కథే ఇది.

ఈ కథలోని రాంబాబు వాళ్ళ పిల్లవాడినైతే జాయిన్ చేసాడు కాని, ఏనెలా సక్రమంగా ఫీజు కట్టలేకపోయేవాడు. టెంపరరీ జాబ్ కావడం వల్ల నికరమైన ఆదాయం ఉండేది కాదు. పనిచేసిన రోజులకి రోజుకి పదకొండు రూపాయల అరవై పైసలకూలి వచ్చేది.

ఉన్నట్టుండి అతను మూడు నెలలపాటు అయిపులేడు. అంతకుముందు రెండు నెలల ఫీజు కట్టలేదు. ఆ తర్వాత అతనొచ్చినప్పుడు నేను కోప్పడబోయాను. నాకప్పటికి అతని ఉద్యోగమేంటో, ఎంత జీతం వస్తుందో తెలీదు. ఆ సందర్భంగా అతను తన గురించి చెప్పిన కథ ఇది. ఆఫీలో స్టాఫ్ ఎలా మాట్లాడారో నుంచి, అప్పటికి కాకినాడలో బుడంపేటకి ఎలాంటి పేరుందో వరకూ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఆ నెలలోనే తనకి లైన్ హెల్పర్ గా పెర్మనెంట్ ఉద్యోగమయ్యిందని, నెలకి 520రూ జీతం వస్తుందని ఇకమీద ఫీజు బకాయిలేకుండా కట్టేస్తూ ఉంటాననీ ఆనందంగా చెప్పాడు. ఇది జరిగిన 1987 నాటి రేట్ల ప్రకారం లెక్కలేస్తే ముగ్గురు పిల్లల్లో ఆ జంట బతకాలంటే కష్టమే అతి పొదుపుగా జీవిస్తే తప్ప,

అప్పటి ప్రభుత్వం ఇంకో తమాషా చేసింది. టీచర్ ట్రైనింగ్ అయి ఉన్నవాళ్ళకి డైరెక్ట్ గా ఉద్యోగాలివ్వకుండా 380రూపాయల జీతంతో టెంపరరీ టీచర్స్ గా వేసుకుంది. వాళ్ళ జీవితాలు రోజు కూలీలకన్నా కనాకష్టంగా ఉండేవి.

అలా ఆ బతుకుల పరిశీలన నుంచి ఈ కథ పుట్టింది.

ఆశాజీవులు

పల్లె, పట్నం కాని ఊళ్ళో టెలిఫోన్ ఆఫీసది.

ఎక్స్చేంజి రాగానే జె.యి.గారు అందించిన కవరు చూసుకుని రాంబాబు తికమకపడిపోయాడు.

స్లాఫంతా ఎవరి సీట్లో వాళ్ళు అపుడప్పుడే సర్దుకుంటున్నారు. ఆపరేటర్ కమలిని ఎప్పట్లాగే చిన్న అద్దంలో చూసుకుంటూ మూతిని సున్నాలా చుట్టి లిప్ స్టిక్ వేసుకుంటోంది.

”ఏంటోయ్ రాంబాబూ! ఆవదం తాగినట్టు మొహం పెట్టావ్?” అడిగాడు మెకానిక్ రమణమూర్తి.

చటుక్కున అటువైపు నడిచాడు రాంబాబు.

పామును పట్టుకున్నట్టు రెండు వేళ్ళతో కవరు అంచును పట్టుకుని ”దీన్లో ఏముందో కొంచెం చదివి చెబుదురూ” అన్నాడు.

రమణమూర్తి ముఖంలో ప్రశ్నార్థకం తాండవిస్తూండగా కవర్ని చించి లోపలి కాయితాన్ని బైటికి లాగాడు. టైపు చేయబడిన ఆ నాలుగు లైన్ల వెంట రమణమూర్తి కళ్ళు పరుగెడుతూంటే రాంబాబు గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.

“కొంపతీసి ఈ చిన్న ఆధారం కాస్తా ఊడిపోలేదుకదా?”

చదవడం ముగించిన రమణమూర్తి కాయితాన్ని మడుస్తూ “ఏం మనిషినయ్యా బాబూ! టెంత్ క్లాస్ పాసయ్యావ్, ఈ మాత్రం చదువుకోలేవూ? వెనకటికెవడో..”

“అబ్బా, అసలందులో ఏవుందో చెబురూ చంపక”

“చెప్తాను, మరి పార్టీ ఇస్తావా?”

“ఇదేదో శుభవార్తె” అనుకున్నాడు రాంబాబు. జన్మంలో శివరాత్రిలా వచ్చిన ఆ శుభవార్తని ఎంజాయ్ చెయ్యనివ్వకుండా పార్టీ పేరు చెప్పి భయపెడుతున్నాడీ దుర్మార్గుడు అనుకున్నాడు లోలోపల.

“ఏంటోయ్, పార్టీ అడిగేనని తిడుతున్నావేంటి కొంపదీసి” తన జోక్ కి తనే పగలబడి నవ్వాడు రమణమూర్తి.

“చెప్పండి సార్.”

“చెప్తున్నా విను, ప్రస్తుతం నువ్వు చేస్తున్న కేజువల్ లేబర్ ఉద్యోగం నుంచి విముక్తి పొంది, హెల్పర్ గా రూపుదాల్చబోతున్నావ్”

“నిజమా సార్” ఆయన చేతులు పట్టుకుని ఊపేసాడు రాంబాబు.

రూపాయి ముప్పావలా కూలితో కేజువల్ లేబర్ గా మూడువందల అరవైరోజులు పనిచేస్తే హెల్పర్ గా పర్మనెంట్ జాబ్ వస్తుందన్నారు. వరసగా అన్ని రోజులూ పనిచేసే అవకాశం ఏ జె.యి. ఇవ్వలేదతనకి. పనే దైవం అనుకుని కష్టపడి పనిచేసాడు. పట్టువిడవని విక్రమార్కుడిలా ఖాళీ దొరికి, కబురొచ్చినప్పుడల్లా పరుగెత్తుకెళ్ళి పనిచేసాడు. గునపం, పార పట్టుకుంటే చాలు.. విశ్వరూపం ప్రదర్శించి నేలలో గోతులు తవ్వేవాడు. టెలిఫోన్ స్థంభాన్ని అమాంతం పాతేసి అలవోకగా నవ్వేవాడు. చిన్నప్పట్నుంచీ రాంబాబు తిన్నది గంజి అన్నమే అయినా, దేహధారుడ్యం అతనికి వరంలా లభించింది.

అప్పుడో పదిరోజులూ, అప్పుడో పదిహేను రోజులూ చొప్పున మూడువందల అరవైకాదు, మూడువేల అరవైరోజులు పూర్తిచేసి చాన్నాళ్ళైంది. అతని కూలి రూపాయి ముప్పావలా క్రమంగా పెరుగుతూ వచ్చి పదకొండు రూపాయల అరవై పైసలైంది.

ఇప్పుడీ హెల్పరు ఉద్యోగానికి నెలకి అయిదువందల ఇరవైరూపాయల జీతం గవర్నమెంటువారు నిర్ణయించినది. ఎప్పుడైనా సెలవు పెట్టినా ఆరోజు కూలి కత్తిరించబడదు. రోజుకి పదకొండు రూపాయల అరవై పైసలు కాస్తా పదిహేడు రూపాయల ముప్పై పైసలుగా మారబోతోంది. అతనికి టీ, సిగరెట్టులాంటి అలవాట్లు లేవు గనక ఆ చిల్లరంతా మిగులే కాకపోతే, ఇరవై ఏళ్ళకే పెళ్ళి చేసేసి, తన ముచ్చట తీర్చుకున్న ముసలాయన ధర్మమా అని ముగ్గురు పిల్లల తండ్రి అతను. ఈ మధ్యనే కొడుకు మీద తన బరువును ఇంకా మోపడం ఇష్టంలేక పరలోకానికి ప్రయాణం కట్టాడు అతని తండ్రి.

“అప్పుడప్పుడూ టి.ఏలూ, డి.ఏలూ ఇంక మనవాడి పని ఝం ఝుకారా భుజాలు చిరిగిన చొక్కాలు వేసుకుని తిరగక్కర్లేదు. పుట్టింట్లో ఉన్న భార్యాపిల్లల్ని వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసి కాపరం పెట్టేస్తాడు” అని అందరికీ వినబడేలా ప్రకటించేసాడు రమణమూర్తి. అందరూ అతని చుట్టూ మూగి “కంగ్రాచ్యులేషన్సోయ్” అని అరిచారు.

“టీలకి ఆర్డరిచ్చెయ్యనా?” రమణమూర్తి.

“ఏఁవిటీ, ఉత్తటీనా? స్వీటూ, హాటుగ …” మరో సుబ్బారావు ఆశగా అడిగాడు. రాత్రి అతను ఆలస్యంగా ఇంటికెళ్ళినందుకు అలిగి అతని భార్య ఉదయం టిఫినేం చెయ్యలేదు. ఆకలి దంచేస్తోంది.

అందరికీ సమాధానంగా ఖాళీ జేబుల్ని బోర్లించేసాడు రాంబాబు.

“అప్పు పెడదామా గురూ?” గుసగుసలాడాడు క్లర్కు అప్పారావు.

“ఆ పని మాత్రం చెయ్యకు. అతను మూడునెలలు ట్రయినింగుకు వెళ్ళి రావాలి. గవర్నమెంటతనికి ట్రైనింగ్ పిరియడ్లో నెలకి వందరూపాయలు మాత్రం ఇస్తుంది. అప్పు పెడితే అయిదో నెల్లోగానీ నీ అప్పు తీరదు” హెచ్చరించాడు లైన్ మేన్ రాఘవరావు.

“అయ్ బాబోయ్” తలవంచుకుని తనపనిలో మునిగిపోయాడు అప్పారావు.

అదుగో – అలా మొదలైంది రాంబాబు మహర్జాతకం.

ఇల్లు అని పిలవబడే నాలుగంకణాల పాకలో కొచ్చి ఇంట్లో సామాన్లన్నీ లెక్క పెట్టాడు. అవన్నీ అతని తల్లి తాలుకు సామాన్లు. ఒక బిందె, రెండు కంచాలు, ఒక చెంబు, గ్లాసు, నాలుగు సత్తుగిన్నెలు, వాటిని సంచిలో వేసి మూట కడుతుంటే అతనికి చాలా దిగులేసింది. అతనికి పదేళ్ళ వయసులో పోయిన తల్లి చేతుల్లో మసలిన ఆ సామాన్లంటే అతనికి చాలా ఇష్టం. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని అమ్మెయ్యాల్సి రావడంతో అతని కళ్ళల్లో నీళ్ళూరుతున్నాయి.

మరో సమస్య అతని ముందు నిలిచింది. పక్కా ఉద్యోగం వచ్చాక తీసుకెళ్తాను. పుట్టింట్లో ఉంచిన భార్య వస్తే.. తను అప్పుడు మళ్ళీ ఈ సామాన్లన్నీ కొనగలడా? పేదింట పుట్టిన అతనికి భార్యకి పుట్టింటివాళ్ళు గిన్నెలూ తప్పేలాలూ ఇస్తారని అతను అనుకోవడం లేదు. అలా ఇమ్మనడం ధర్మమూకాదు. ఇంచు మించు ఏడేళ్ళుగా తన భార్యనీ, పిల్లల్నీ సాకుతున్న మామగార్ని మరిక బాధించలేడు. ఆ పల్లెటూళ్ళో పౌరోహిత్యంతోనే బండి లాక్కొస్తున్న మామగారంటే భక్తీ గౌరవము అతనికి. ఇన్నాళ్ళూ ఆయన్ని బాధపెట్టాడు. ఇంకెంత? మూడునెల్లు ఇట్టే తిరిగి, నాలుగో నెలాఖర్లో జీతం అందుకుని భార్యని కాపరానికి తీసుకొచ్చేస్తాడు.

అప్పుడావిడొచ్చి అయ్యగారి నట్టిల్లులా ఉన్న ఈ ఇంటిని చూసి ఏమనుకుంటుందో..?

‘అప్పటి విషయం అప్పుడే చూసుకుందాంలే ‘ అని నచ్చచెప్పుకున్నాడు చివరికి.’

చిరుగులు కనిపించకుండా కుట్టుకున్న జత బట్టలూ, ఒక తుండుగుడ్డా సంచిలో కుక్కుకుని, సామాన్లు అమ్మగా వచ్చిన డబ్బుల్తో కాకినాడ బస్సెక్కాడు రాంబాబు ట్రైనింగుకోసం.

మొదట్రోజు ఊరంతా కాళ్ళరిగేలా తిరిగినా అతనికి అందుబాటులో రూమేదీ దొరకలేదు. రోజంతా ఏ ఎండనబడి తిరిగినా, రాత్రికి తల దాచుకుందుకు ఓ నీడ కావాలిగదా! తిరిగి తిరిగి చివరికి బుడం పేటలో అరవై రూపాయలకి ఓ గది సంపాదించగలిగేడు.

వయసొచ్చినప్పటినుంచి టెలిఫోన్ స్థంభాల కోసం గోతులు తవ్వడం, బరువులు మోసుకెళ్ళడం తప్ప పట్నం బతుకుల బండాలెరగని రాంబాబు రెండోరోజే ఆలస్యంగా రూముకొస్తూ పోలీసుల చేతిలో చిక్కాడు. రైడింగ్ లో దొరికిన విటుడుగా అతని పేరు స్టేషన్ రిజిస్టర్లో నమోదైపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయి బ్రతుకు జీవుడా అని బైటపడేసరికి అతని తలప్రాణం తోకకొచ్చింది. చేతిలో ఉన్న డబ్బులు కాస్తా ఊడ్చిపెట్టుకుపోయాయి.

ఆ పరిస్థితులలో అతన్ని తోటి ట్రైనీస్ ఆదుకున్నారు. వాళ్ళ పుణ్యమా అని రెండుపూటలా భోజనం చెయ్యగలిగాడు.

నెలాఖరున స్టయిఫండ్ వందరుపాయలు చేతికొచ్చేసరికి అతనికి అంతులేని ఆనందం కలిగింది. అంత డబ్బు ఒక్కసారిగా కళ్ళజూడడం అతనికదే మొదటిసారి. కనీసం వందసార్లైనా కళ్ళకద్దుకున్నాడు. వందనోటును కాగితంలో చుట్టి, సంచికి అట్టడుగున దాచేసి, ఆ డబ్బుతో ఏమేమి కొనొచ్చో కలలు కన్నాడు.

మర్నాడు –

రూంలో ఉన్న ట్రైనీసంతా కలసి తలా డెబ్బై అయిదు రూపాయలు వేసుకుని బియ్యం, పప్పులు తెస్తూ వుంటే, తలాపాతిక రూపాయలు కలిసి ఇంటదైకడుతూ ఉంటేను చూసాకా తన తప్పిదం తెలిసొచ్చిందతనికి. వెంటనే లేచి కాగితం విప్పి, తనవంతుగా వందరుపాయలు ఇచ్చేసాడు.

చివరి నెలలో అయిదు రూపాయలు మాత్రం తీసుకుని, తొంభై అయిదు ఇచ్చేపాడు.

ఆ అయిదు రూపాయలూ అతన్ని అతని ఊరికి చేర్చాయి.

మర్నాడు ఉదయాన్నే లేచిపోయాడు. భుజం మీది చిరుగును పదోసారి కుట్టి, షర్టు వేసుకున్నాడు.

ఏదో తెలియని ఆత్మవిశ్వాసంతో ఆఫీసులోకి అడుగుపెట్టాడు. చిరునవ్వుతో జె.ఇ రూంలోకి వెళ్ళిన అతను ముఖం మాడ్చుకుని వెంటనే తిరిగి వచ్చేసాడు.

“ఎంవోయ్ రాంబాబు. ఎప్పుడు రాక?” రమణమూర్తి పలకరించాడు రాంబాబు వేగిరం అటు నడిచాడు.

“సార్, నేనీ జాబ్ లో జాయినవ్వాలంటే ఆరువేలు డిపాజిట్లు కట్టాలని ఎవ్వరూ ఎందుకు ముందుగా చెప్పలేదు.” నిష్ఠూరంగా అన్నాడు.

“ఇది బావుంది, నీకు తెలుసుకున్నాం. ఏదో, ఇంగ్లీషులో వచ్చిన ఆర్డరు చదవడం రాదంటే సహజం కాని, ఇలా జాబ్ రూల్స్ అంద్ రెగ్యులేషన్స్ తెలియవనుకోలేదు”

“నిజంగా తెలీదుసార్, నన్ను నమ్మండి”

“అయితే, ఇప్పుడేం చెయ్యమంటావ్?”

“మూర్తి సార్, ఇవి చేతులు కావు కాళ్ళనుకోండి. నాకీ సహాయం చేసి పెట్టి నా బతుకు నిలబెట్టండి.” రమణమూర్తి చేతుల్ని పట్టుకుంటూ అన్నాడు రాంబాబు.

“పోనీ ఓ పని చెయ్యి. ఇప్పుడు అర్జెంటుగా ఎల్.ఐ.సీ పాలసీ తీసుకో అది చాలు నీకు సెక్యూరిటీ చూపించడానికి.” రమణమూర్తి ప్రైవేటుగా ఎట్లైసీ ఏజెంటు.

‘ఆయనే ఉంటే మంగలెందుకు? ‘ అని తండ్రి తరచుగా వాడే సామెత గుర్తుకొచ్చింది. కానీ, పైకనలేదు.

“అదీ జరిగేపని కాదంటావ్, ఇంకెలాగయ్యా నీతో?”

“పోనీ ఓ పని చెయ్ కూడదూ” అన్నాడు సుబ్బారావు.

కీ ఇచ్చిన బొమ్మలా సుబ్బారావు వైపు తిరిగాడు రాంబాబు.

“అడుగూడిపోయిన సత్తుగిన్నోటుందా?”

“ఎందుకండీ?” అయోమయంగా అడిగాడు.

“ఎందుకే మిటయ్యా, అడుక్కుతిండానికి”

“సుబ్బారావుగారూ!”

రాంబాబు అరిచిన అరుపుకి ఆ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఫోన్లో ఎవరితోనో ఎడతెగకుండా మాట్లాడుతున్న కమలిని చేతిలోంచి ఫోను జారిపోయింది. ఆవిడ కాటుక కనురెప్పలు భయంతో రెపరెపా కొట్టుకున్నాయి.

ఆ ఆఫీసులో అందరికీ ఆ గొంతు కొత్తది. చేతులు కట్టుకుని మంద్రస్వరంలో మాట్లాడే రాంబాబు గొంతు మాత్రమే తెలుసు అందరికీ

ఇప్పుడతను అరిచిన అరుపు అరుపులా లేదు. గర్జనలా ఉంది. అగ్ని గోళాల్లా మండుతున్న రాంబాబు కళ్ళనీ, బిగుసుకున్న పిడికిళ్ళనీ చూసి వెనక్కి తగ్గాడు సుబ్బారావు

పళ్ళబిగువున తనను తను కంట్రోల్ చేసుకుని బైటికి నడిచాడు రాంబాబు. వరండాలో నీళ్ళకుండ దగ్గర నిలబడి ఆరుగ్లాసుల నీళ్ళు తాగాడు. కొన్ని నీళ్ళు గుండెల మీద ఒలికీ, కొన్ని లోపలికి పోయి అతన్ని కొంత చల్లబరిచాయి. అక్కడే స్టూలు మీద చతికిలబడి ఆలోచించడం మొదలు పెట్టాడు కర్తవ్యమేమిటని. గడువు లోపల డిపాజిట్లు కట్టకపోతే ఈ అవకాశం కాస్తా చెయ్యి జారి పోవడం ఖాయం వద్దనుకున్నా వచ్చి చెవిలో చొరబడుతోంది లోపలి సంభాషణ.

“అవును.. నాకు తెలీకడుగుతాను గురూగారూ! ఇదేవన్నా బేంకు ఉద్యోగమా పాడా డిపాజిట్లు కట్టించుకోడానికి? ఛఛ పాపం చూడండి, రాంబాబులాంటి వాళ్ళకు ఎంత కష్టమో” సానుభూతిగా అన్నాడు అప్పారావు.

“బాబూ! అవన్నీ గవర్నమెంటు రూల్స్, గవర్నమెంటు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని ఋజువుచేసుకోవడానికి సాక్ష్యాలు. ఈ టెలిఫోన్ సామాన్లు ఉత్తరోత్తరా ఎప్పుడైనా అమ్మేసుకుంటే ఈ డిపాజిటులోంచి కట్ చేస్తారు” చెప్పాడు రాఘవరావు.

”డిపాజిట్టుకన్నా ఎక్కువ విలువైనవి అమ్మేసుకుంటేనో?”

“ఏవిటీ, ఈ పింగాళీ చిప్పలూ, ఈ పనికిరాని బోల్టులూనా?” నిరసనగా అన్నాడు కృష్ణ, అతనింకా కొత్తవాడు. ”అన్నన్నా, అలా తీసిపారేయకు. రూల్సంటే రూల్సేమరి.”

“ఇంతకీ.. రాంబాబు ఏం రెచ్చిపోయాడండీ బాబూ!” సుబ్బారావు.

“ఇలాంటి వాళ్ళు రేప్పొద్దున్న టెర్రరిస్టులుగా మారిపోయినా మారిపోతారు. కావాలంటే ఇది చూడండి.” పేపరు విప్పబోయాడు రమణమూర్తి. అతనికి పేపర్లో వార్తలన్నిటికన్నా పంజాబ్ లో టెర్రరిజమ్ గురించిన వార్తలంటే ఇష్టం. ఆఫీసులో ఎప్పుడూ అందర్నీ చుట్టూ చేర్చుకుని ఆ వార్తలు చదువుతూ, వాటికి చిలవలూ పలవలూ కల్పించి వివరిస్తుంటాడు.

“అది సరేనండి, మనం అంతా కలిసి రాంబాబుకి ఏదైనా సాయం చెయ్యలేమంటారా?” అడిగాడు కృష్ణ,

“బాబూ! ఆ మాటకొస్తే మనమంతా ఆ రాంబాబుకన్నా ఏవీ మెరుగ్గాలేం. కాకపోతే ఇస్త్రీ గుడ్డలేసుకుని నీట్ గా కనిపిస్తూ లోకాన్ని మభ్యపెట్టేస్తున్నాం. ఏ నెల జీతం ఆనెల ఫస్ట్ తారీఖునే అప్పులవాళ్ళందరికీ పంచెయ్యడం, మళ్ళీ ఫస్టెప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డం, బ్రహ్మచారివి కాబట్టి ఏవైనా దాచావేమో నువ్వే ఆ సాయమేదో చెయ్యి.”

కృష్ణ మరిమాట్లాడలేదు.

“ఇంకో సంగతి, చిన్నదో చిటుకుదో తలదాచుకునేందుకు సొంతగూడు అతనికొక్కడికే ఉందీ ఊళ్ళో. నెలనెలా జీతంలో మూడోవంతు అద్దెకింద జమకడుతూంటే ప్రాణం ఒకటే కొట్టుకుంటుంది నాకు. ఇప్పటి ఈ మండిపోతున్న రేట్లలో మనలాంటి వాళ్ళు దాచేదేవుంటుంది?”

చెవిలో దూరుతున్న సంభాషణను నిర్లిప్తంగా వింటూ ఉన్న రాంబాబుకు రమణమూర్తి అన్నమాటలో తలలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. చివాలున లేచి పరుగెత్తినట్టే బైటికి వెళ్ళిపోతున్న రాంబాబుని వరండాలో స్థంభానికానుకుని బీడీ కాల్చుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయిన అటెండరు గంగరాజు ఆశ్చర్యంగా చూసాడు. రాంబాబు గుడెసె పక్క మేడలో ఉంటున్న షావుకారు సత్తిరాజు మేడపక్క దిష్టిబొమ్మలా ఉన్న గుడిసెను కొనేసి అక్కడివరకూ తన కాంపౌండువాల్ ను పెంచేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు.

ఆ తరుణం ఇప్పుడొచ్చింది.

అవసరం రాంబాబుది కాబట్టి సరిగ్గా ఆరువేలకి ఒక్క పైసాకూడా ఎక్కువివ్వలేదు సత్తిరాజు.

ఆరువేలూ కట్టేసి, అర్జెంటుగా ఉద్యోగంలో జాయినైపోయాడు రాంబాబు.

ఊరంతా తిరిగి తిరిగి నూట ఏభై రూపాయలకి గదినర్ర అద్దె ఇల్లు సంపాదించి భార్యనీ, పిల్లల్నీ తీసుకొచ్చి సొంతకాపురం పెట్టాడు. దాంతో బాటు పచారీ కొట్లో, బియ్యం కొట్లో అప్పుకూడా పెట్టాడు. పుట్టింట్లో ఉనప్పుడు రాంబాబు అప్పుడప్పుడు ఇచ్చిన పదీ పరకా దాచి ఉంచింది మహలక్ష్మి. ఆ డబ్బుల్తో మొదటి నెల జీతం అందేవరకు ఎలాగో గడిపేసారు.

ఆరోజు ఫస్టు తారీఖు.

జీతం అందుకున్న రాంబాబుకి చాలా గర్వంగా ఉంది. గాలిలో తేలిపోతున్నట్లుంది. నరాలన్నీ తీగలుగా మారి సంగీత స్వరాలను ఆలపిస్తున్నట్టుంది. జేబు ఎంతో బరువుగా అనిపిస్తోంది.

మాటలేవిటి? అయిదువందల ఇరవైరూపాయలు.

ఈ డబ్బంతా ఒక్కసారిగా భార్య చేతిలో పోస్తే చాలా సంతోషిస్తుంది. తనలాగే మహలక్ష్మి కూడా ఇంత డబ్బును ఒక్కసారిగా చూసుండదు.

పాప, మహాలక్ష్మికి ఒక చీరకొనిపెట్టాలి. ఆవిడకున్న మూడు చీరలూ జీర్ణస్థితిలో ఉన్నాయి. పిల్లలకి కూడా కొనాలి. ఆ మాటకొస్తే తనకి మాత్రం ఈ భుజాలు చిరిగిన చొక్కాలు తొడుక్కుని ఆఫీసుకి వెళ్ళడం సిగ్గుగా ఉంది.

అతని కలలింకా పూర్తికాకుండానే ఇల్లొచ్చేసింది.

అప్పుడే మొహం కడుక్కుని బొట్టు పెట్టుకున్నట్టుంది, మహలక్ష్మి పాత చీర కట్టుకున్నా, నలిగిన కాగితంలోని పాల ముత్యంలా శుభ్రంగా ఉంది. పెద్దపిల్లలిద్దర్నీ కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దిస్తోంది. చంటిదాన్ని ఒళ్ళో వేసుకుని నిద్రపుచ్చుతోంది.

రాంబాబును చూసి, పాపాయిని పడుకోబెట్టి, నవ్వుతూ ఎదురొచ్చింది. జేబులో డబ్బు తీసి భార్య చేతిలో పెట్టి బరువు దించుకున్నట్టు ఫీలయ్యాడు రాంబాబు.

“నీకు నచ్చిన చీరొకటి కొనుక్కో” అని కూడా అన్నాడు.

మహాలక్ష్మి నవ్వింది. వేరుగా కాపరం పెట్టకపోయినా, ఆ అమ్మాయికి అప్పటికే ఇల్లు చక్కబెట్టుకోవడం క్షుణ్ణంగా తెలుసు.

నూటయాభై రూపాయలు భర్తచేతికిచ్చి ఇంటివాళ్ళకి అద్దె ఇచ్చేసి రమ్మంది. మరో నూటయాభై రూపాయలు బియ్యం కొట్లో ఇచ్చేసి, మళ్ళీ అప్పు తెప్పించింది.

వంద భర్త చేతికిచ్చి ఒక జత బట్టలు తెచ్చుకోమంది.

చివరికి పచారీ కొట్లోని సరుకుల ధరలు గుర్తుకొచ్చి ఆమె గుండె గుభేలుమంది. చేతిలో మిగిలిన నూటఇరవై రూపాయలు పాపాయి పాలకి సరిపోతాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా భార్యాభర్తలిద్దరూ తర్జన భర్జనలు పడి ప్రస్తుతానికి కనీసం మరో రెండు వందలు అప్పుచేస్తే కానీ గడవదని తేల్చుకున్నారు.

రెండో తారీఖు ఉదయాన్నే రాంబాబు అప్పు ఇచ్చేవాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు.

అప్పుడే స్నానం చేసిన మహలక్ష్మి దేవుడి పటానికి దండం పెడుతూ

“భగవంతుడా! చుట్టాల్నీ, పిలవకుండా వచ్చే చుట్టాల్లాంటి రోగాల్నీ మా ఇంటికి రానీకు” అని కోరుకుంటోంది. అంతకాలం తమని ఆదుకున్న ఏకైక బంధువు ముసలి తండ్రి కళ్ళల్లో మెదిలాడు ఆమెకి.

కనుకొలుకుల్లో నిలిచిన నీటి చుక్కల్ని గోటితో మీటేసి నవ్వుతూ పిల్లల్ని లేపడానికి వెళ్ళింది.

(పిల్లల కాన్వెంటు చదువులు, సినిమాలులాంటి ‘లగ్జరీస్ ‘ కలలోకి కూడా రాని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని టెంపరరీ టీచర్స్ కి ఈ కథ అంకితం. వాళ్ళ జీతం 380రూపాయలు) 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.