నిశిరాతిరి

– డా. కొండపల్లి నీహారిణి

ఎక్కడినుండి రాలిందో
ఓ చిమ్మచీకటి కుప్ప.
ఎందుకు మౌనంవహించిందో
మనసు కుండలో చేరి.
ఒలకని మేధోమథనం
ఒడవని బతుకుసమరం
ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది?

ఆకలి మంటలవికావు,
అన్నపు రాసుల లేమివీకావు,
ఒళ్ళు చిల్లుపడ్డ దాఖలాలూలేవు.
మృత్యువు ధారాపాతనడకతో
వీధుల్ని శవాలుగా ముంచెత్తుతూ
ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది?

సందులు గొందులు మూగవడినవి
పనిముట్ల సందోహాలు మూలబడినవి
చిక్కాలతో మూతులుముక్కులు
ఆలింగనాలు లేని దూరాలవలెనేనన్న
ఆనవాళ్ళ చిట్టాలిప్పలేకపోతున్నదంటూ…
ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది?

సమరశంఖారావాలు వినిపించని
సమానత్వసద్బోధ పక్కన నిలబడని
తూటాలమాటలు సరిగ్గాపేలని
పౌర ప్రణాళిక రాకెట్లు ఎగరని
వింతస్తబ్దత ఆవహిస్తు సవాలు విసురుతుంటే
ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది?

ఆగ్రహాలెవరిమీద? అర్పణలెక్కడ?
గుండె కరకుదనమంతా విచిత్రజలచరమై పోతున్నది.
వలతో సిద్ధమైన ఒకానొక క్రిమి,
క్రిమిలేయర్ కూ అంతుచిక్కడంలేదట!
బీదపొట్టలుగొట్టే బీభత్సం లక్షల సమాధులపై
వికృత వికటాట్టహాసం చేస్తుంటే
ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.