భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు

-పి.జ్యోతి

నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో కొన్ని సంవత్సరాలు ఉన్న బ్రిటీషు మహిళ గా మేరీ టైలర్ గుర్తు ఉండిపోయింది. పుస్తకం మళ్ళీ రీప్రీంట్ అయ్యింది అని తెలుసుకుని ఇది మళ్ళీ చదవాలని కొన్నాను. ఒక విదేశీ మహిళ మరో దేశపు కాల మాన, సామాజిక, రాజకీయ పరిస్థితులను ఇంత క్షుణ్ణంగా ఎలా విశ్ళేషించగలిగిందా అన్న ఆశ్చర్యం కలగక మానదు ఇది చదువుతుంటే.

బ్రిటన్ దేశస్తురాలు మేరీ టైలర్ జర్మనీ లో ఇంజనీరింగు చదువుతున్న అమరేంద్రను మొట్టమొదటి సారి కలుసుకుంది. విదేశీ వ్యామోహం వదిలి తన దేశం కోసం ఎదో చేయాలనే తలంపుతో తన పేద దేశానికి వెళ్ళీపోతున్న అమరేంద్ర అంటే గౌరవం కలిగి అతని కోరిక మన్నించి భారత దేశాన్ని చూడాలని పర్యటించాలని మేరీ ఇక్కడకు 1970 లో వచ్చింది.  ఇక్కడి పేదరికం ఆమెను విపరీతంగా కలచివేసింది. అందరు విదేశి పర్యాటకుల లాగా తాజ్ మహల్ చూడడానికి ఆమె ఇష్టపడలేదు. దాని కన్నా రిక్షా వాని పేద దీన స్థితి వైపు ఆమె దృష్టి మళ్ళి మళ్ళీ ప్రసరించేది, ఆలోచించేదిఅమరేంద్ర ని వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలని అనుకుంది. అయితే ఆమెను, అమరేంద్రను మరి కొందరు స్నేహితులను నక్సలైట్లు అనే ముద్ర వేసి ప్రభుత్వం అరెస్టు చేసింది. బీహారులో హజారీబాగ్ జైలుకు అలా మేరి చేరుకుంది. ఇక్కడే 5 సంవత్సరాల పాటు ఆమె ఉండవలసి వచ్చింది. తరువాత ఆమె అమరెంద్రను మళ్ళి ఎప్పటికీ కలుసుకోలేకపోయిందిజైలులో ఉండగానే ఆమె తల్లి మరణించడం, దుర్భర జైలు పరిస్థితులు, అందులో మగ్గిపోయే పేద ప్రజల జీవితాలను దగ్గరగా ఉండి పరిశిలించడం ఆమెని పూర్తిగా మార్చివేసాయి. జీవితం పట్ల భవిష్యత్తు పట్ల ఆమె దృక్పధం మారిపోయింది.

జైలులో అధికారులు ఇవ్వనిదానికోసం అనవసరంగా అర్రులు చాచకు. అది నీకు ఇవ్వకుండా నిరాకరించామనే సంతృప్తి నువ్వు వాళ్ళకు దక్కనివ్వకు. వేరే ఉపాయమేదో స్వయంగా చూసుకోఅన్న సిద్దాంతాన్ని ఆపాదించికుని ఒక రెబల్ గానే ఆమే తన జైలు జీవితాన్ని గడిపింది. జైలులో పేద ప్రజల జీవితాలని వారి పరిస్థితులను ఆమె నిశితంగా పరిశిలిస్తూ అమరేంద్ర మరియి మిత్రుల పోరాటాన్ని ఆ మార్గాన్ని వారు ఎన్నుకోవడం వెనుక ఉన్న సామాజిక, ఆర్ధిక కారణాలను వెతికే ప్రయత్నం చేసింది. పేద స్త్రీల మూఢ నమ్మకాలు, వారు జీవితాన్ని గడుపుతున్న దయనీయమైన సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిస్థితులు ఆమెను కలవర పెడుతూనే ఉన్నాయి. అక్కడి పేద దళిత స్త్రీలలో ఒకరిగా బ్రతకడానికి ఆమె చాలా కష్టపడింది. నమ్మకం లేకపోయినా పాపటిలో కుంకుమ పెట్టుకుని వారి అభిమానాన్ని నమ్మకాన్ని సంపాదించి, ప్రత్యేకతలు లేకుండా వారి మధ్య జీవించడానికి ఆమె తనను తాను పూర్తిగా మార్చుకుంది. పేద ప్రజలు జైలు బయటా, లోపలా ఒకేలాంటి జీవితం గడుపుతున్నారని ఆమెకు అర్ధం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఓటు కోసం డబ్బు ఆశించే వారి పేదరికం, దేశ రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి అవగాహన ఏర్పరుచుకోవడానికి వారికి మాత్రం తోడ్పడదని, అమాయకుల శ్రమ ని దోచుకుని బ్రతికే కొందరి నాయకుల రాజకీయం వీరికి అర్ధం కావడానికి చాలా సమయం పడుతుందని ఆమె అర్ధం చేసుకోగలిగింది.

మరణానికి కానీ మరే ఇతర భయంకర కష్టానికి కాని చలించలేని విధంగా తయారయిన వారి జీవితాలు, ఆమెను పరదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న తన ప్రస్తుత స్థితి కన్నా ఎక్కువ కలవర పెట్టాయి.భారతీయ కులవ్యవస్థను అర్ధం చేసుకోవడానికి ఆమె చాలా శ్రమ పడింది. నాలుగు కులాల హిందూ సమాజం రెండు వేల అయుదువందల ఉపకులాలుగా, శాఖలుగా ఎలా వికృత రూపం దాల్చిందో తెలుసుకుని కుల నిర్మూలానికి తన వంతు పని జైలులోనే మొదలెట్టిందిజైలు లో ఖైదీల స్థితి గతుల మెరుగు కోసం నిరాహారదీక్షలు చేసి తన చుట్టూ ఉన్న వారి కోసం తన వంతుగా మానవ కర్తవ్యాన్నినెరవేర్చడానికి తనకు సహేతుకం అని అనిపించిన మార్గాన్ని ఎన్నుకుని పోరాడింది. రాజకీయ ఖైదీల పట్ల ప్రభుత్వం చూపే వైఖరి నక్స్ లైట్ల పట్ల ఉండకపోవడం, వారి పై జరుగుతున్న హింసాత్మక ఇంటరాగేషన్లు అన్నిటిని విపులంగా రాస్తూ దుర్భరమైన జైలు పరిస్థితులను గురించి కూడా రాసారు ఈ పుస్తకంలో. 137 మంది ఖైదీలను ఉంచాల్సిన చోటు 700 మందిని కుక్కి పెట్టడం, అక్కడి పరిస్థితులలో తమను తాము బ్రతికించుకోవడానికి ఖైదీలు చూపించే దగాకోరుతునం, ఇవన్నిటినీ విశ్లేషిస్తూ రాసుకుంటూ వెళ్ళారు ఆమె.

జైలు వ్యవస్థ  ఖైదీలలోని మానవత్వాన్నిఎలా ద్వంసం చేస్తుందో కొన్ని ఉదాహరణలతో ఈ పుస్తకంలో రచయిత్రి  చెప్పడం జరిగింది. కనీస వైధ్య సౌకర్యాలు లేక మరణిస్తున్న ఖైదీల పట్ల ప్రభుత్వం ఉదాసీనత గురించి కూడా చెప్తారు. జైలులోని అగ్ర కులస్థులు తక్కువ స్థాయి పనులకు నిమ్న కులాల ఖైదీలను వాడుకోవడం, వారిని హీనంగా చూడడం, పై సంపాదన కోసం అధికారులు నీచమైన పనులు చేయడం, ఖైదీల తిండి, నిత్యావసరాల వస్తువులపై వ్యాపారం జరగడం, లంచగొండితనం, వీటన్నిటి మధ్య పేద ప్రజలు కాపాడుకునే మంచితనం, మానవత్వం గురించి రాస్తూ తనకు అర్ధం అయిన భారత దేశాన్ని మన ముందుకు తీసుకువస్తారు ఆమె. “బ్రతుకు బాధల గురించి నాకెంత తక్కువ తెలుసో నేను జైలులో తెలుసుకున్నానుఅని రాసుకున్నారు ఒక చోట. సమాజ శ్రేయస్సు కోసం పని చేసి అగ్ర వర్ణపు, ఉన్నత స్థాయి స్త్రీలు తమ చుట్టు పక్కల స్త్రీల పట్ల సానుభూతి లేకుండా జీవించడం వీరు గమనిస్తూవారి తక్షిణ అవసరాలు తీరిపోయి ఉంటే అసలు పేద ప్రజల కోసం ఆందోళన చేసేవారేనా వీరుఅని కూడా ఉన్నత వర్గ స్త్రీ ఖైదీల గురించి విశ్లేషిస్తారు. జైల్లో కూడా తమ స్థితిగతుల కోసం మాత్రమే ఉద్యమించారు కాని ఇతర తోటీ స్త్రీల గురించి వారు ఆలోచించట్లేదనే వేదన చాలా చోట్ల కనపరిచారు.

అయిదు సంవత్సరాల తరువాత బ్రిటీషు ప్రభుత్వం సహాయంతో ఆమే విడుదలయ్యి, దేశం వదిలి స్వదేశం వెల్లవలసి వచ్చింది. కాని భారత దేశంలోని ప్రజల జీవన పరిస్థితులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి, అందుకే తన అనుభవాలను ఇలా పుస్తక రూపంలో తీసుకు రావలసి వచ్చింది. భారత దేశాన్ని ఒక పర్యాటకురాలుగా కాక ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఈమె అధ్యయనం చేసారు అనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతుంటే. నాటికీ నేటికీ దేశ పరిస్థితులలో, జైలు స్థితి గతులలో పెద్ద మార్పులేమీ లేవన్నది మనకు ఇది చదివితే అర్ధం అవుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఆమె ను విడుదల చేయడం జరిగింది, ఎమర్జెన్సీ విధింపబడడానికి కారణమయిన రాజకీయ స్థితి గతుల గురించి కూడా పుస్తకంలో చర్చ కనపడుతుంది. భారతదేశ స్థితిగతుల గురించి రాస్తూనేడు రాజ్యం చేస్తున్న అమానుషత్వాన్ని, అన్యాయాన్ని, వ్యతిరేకించి ప్రతిఘటించే వాళ్ళ గొంతు నొక్కేయటానికి యీ ప్రభుత్వంగానీ, మరే ప్రభుత్వం గానీ కొనసాగించే నిరవధిక నిర్భంధాలు, దారుణ చిత్రహింసలు, స్వేచ్చాపహరణలూ భారతదేశపు సమస్యల్ని పరిష్కరించ జాలవు. మొత్తం ప్రజలని పురుగుల్లా పరిగణించే ప్రభుత్వం వున్నంత కాలం.. మనిషి చావుకు కారణం ఆకలాఅర్ధాకలా అని ఎడతెగకుండా నిరర్ధక చర్చోపచర్చల్లో నిర్ధాక్షిణ్యంగ కాలహరణం చేస్తూ దమన నీతితో రాజ్యమేలుతున్న ప్రభుత్వం సాగుతున్నంత కాలం యీ దేశపు వ్యధ ఆరదుఅని రాసుకున్నారు.

చాలా వరకు దేశాలను చూడాలని వెళ్ళే వ్యక్తులు ఆ దేశ భోగోళిక సౌందర్యం, సహజ వనరులు లేదా ఆ దేశ కళలు, సంస్కృతుల పట్ల ఆకర్షితులవుతారు. చాలా కొద్ది మంది మాత్రమే అక్కడ మానవ జీవన పరిస్థితులను, వారి జీవన పద్దతులను, వారి స్థితి గతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది అందరూ చేయలేని పని. ఈ దృష్టి ఉండాలంటే విశ్వమానవ ప్రేమ హృదయంలో ఉండాలి. లాటిన్ అమెరికాను పర్యటించిన ఒక యువకుడు ఆ ప్రయాణం అనంతరం ఒక తిరుగుబాటుదారుడిగ మారి ఎందరికో చే గువెరా గా స్పూర్తి నిచ్చాడు. ప్రియురాలికి ఒక కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి వారాలని మొదలెట్టిన ఈ ప్రయాణం అతని వ్యక్తిగత ప్రేమ మార్గం నుంది మరల్చి సామాజిక ప్రేమ వైపు పయనించడానికి తోడ్పడింది. దీనికి కారణం సమస్త మానవజాతి అభివృద్ది వారి జీవన ప్రమాణాల పట్ల ఉన్న అతని ఇష్టం. అసలు మానవ జీవితాలను పరిశీలిస్తూ తమను తాము ఒక దేశానికో ప్రాంతానికో రాష్ట్రానికో లేక ఊరికో పరిమితం చేసుకునే వ్యక్తి దృష్టి చాలా సంకుచితమైనది. ఇది మన ఊరు. మిగతావారి గురించి నాకెందుకు అనుకునే వారు మంచివారే కాని ఇది నా ప్రపంచం నాకు అందరి సౌఖ్యం ముఖ్యం అనుకున్న వారు మహానుభావులు. వీరి ఆలోచనలు, ఆదర్శాలు అందుకే వారుపుట్టిన ప్రాంతాల వరకు మాత్రమే పరిమితం అవలేదు. ఎందుకంటే వీరు వసుదేవకుటుంబం అనే పదానికి నిర్వచనాలుగా జీవించారు. ఒక చే, ఒక కొట్నిస్, ఒక మెండేలా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక మథర్ థెరిసా ఇలా ఎందరో ప్రపంచాన్ని అన్ని భౌగోళిక సూత్రాలకు అతీతంగా ప్రేమించగలిగారు. మేరీ టైలర్ అనుకోకుండా ప్రేమ పెళ్ళి కోసం తాను  నమ్మిన మనిషితో ఈ దేశం వచ్చి ఈ దేశ పరిస్థితులను పరిశిలింఛి ఆ క్రమంలో అరెస్ట్ అయినా అమెలో ఆ విశ్వ మానవ ప్రేమ కుచించుకుపోలేదు. తాను జైలు నుండి బైటపడడమే ముఖ్యం అనుకుంటూ రాజకీయం నడపలేదు. జైలులోని సాటి ఖైదీల జీవితాల నుండి ఈ దేశాన్ని అర్ధం చేసుకుంటూ వారు తనను వారితో కలుపుకోకపోయినా, అనుమానంగా చూస్తున్నా వారి బాగు కోసం ఏమీ చేయగలదో అది చేసే ప్రయత్నం చేసింది. ఈ అద్భుతమైన వ్యక్తిత్వం కోసం ఈ పుస్తకం చదవాలి. చాలా పాత ఎడీషన్ వైలట్ కలర్ అట్టతో నా బాల్యంలో నేను చదివిన గుర్తు. ఇప్పుడు ఇది కొత్త ముస్తాబుతో రావడం సంతోషం.


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.