మాటవిన్న మనసు
-విజయ దుర్గ తాడినాడ
‘ఎందుకిలా జరిగింది?’
ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా అనుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.
అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?
ఈ ప్రశ్న కేవలం ఆరు నెలల నుండి నా మనసుని తొలిచేస్తోంది. జరగాల్సినదంతా జరిగిపోయింది. ఊహించనిది జరిగిపోయింది. అంతా కలలా…
అసలు నేను చేసిన తప్పేంటి?
ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోయాడు విరించి….
విరించి…..
అప్రయత్నంగా ఆపేరు పైకి వచ్చేసింది….నాకు మాత్రమే వినబడేటట్టుగా……
ఆ విరించి అందరి తలరాతలు రాస్తే, ఈ విరించి నా తలరాత ఇలా రాసేసి వెళ్ళిపోయాడు.
మాటలో మాటలా…చూపులో చూపులా…..మనసులో మనసులా కలిసిపోయాడు …..ఒకటా, రెండా, ఆరేళ్ళుగా….పేరుకి పక్కపక్క ఇళ్ళవాళ్ళమే అయినా, ఏదో ఒక వంకతో ప్రతిరోజూ పిల్లలందరం ఒకరి ఇంట్లో ఒకరం కలుస్తూనే ఉండేవాళ్ళం. విరించి నాకన్నా ఒక ఏడు పెద్ద, మా తమ్ముడు అజయ్ నాకన్నా ఒక ఏడు చిన్న. విరించి వాళ్ళ అక్క విరాజిత నాకన్నా రెండేళ్ళు పెద్ద. అయినా అందరం కలిసే ఆడుకునేవాళ్ళం. మాది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్. పొదరిళ్ళలాంటి ఇళ్ళు, చుట్టూతా ఖాళీ స్థలం, తీర్చిదిద్దినట్లు ఉండే వాకిళ్ళు, రోడ్లకి ఇరుపక్కలా చెట్లు…చూడటానికి ముచ్చటగా ఉంటుంది మా కాలనీ. పెద్దపెద్ద చెట్ల నీడవల్ల మాకు వేసవిలో కూడా ఎండ కన్నెరగకుండా హాయిగానే గడిచిపోయేది.
విరించి వాళ్ళు మా పక్క ఇంట్లోకి వచ్చేసరికి నేను పదోతరగతి.
ఒకరోజు …
“విరించినై విరచించితిని ఈ కవనం,
విపంచినై వినిపించితిని ఈ గీతం….”
అంటూ పాడుకుంటూ వాకిట్లో ముగ్గేస్తున్నాను.
‘ఓయ్! ఏంటి నా పాట పాడుతున్నావు? ఆఁ!’ అంటూ దబాయింపుగా నడుంపై చేతులు పెట్టుకుని నుంచుని ఉన్నాడు.
‘ఇది నీ పాటేమి కాదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది. మా తాతగారికి ఆయనంటే ఇష్టం, ఆయన పాటలంటే పిచ్చి. పొద్దున్నే తన మొబైల్ లో ఈ పాట పెట్టారు. అదే పాట నోట్లో నానుతూ ఉంది. అయినా.. నా ఇష్టం, నేను పాడుకుంటా. అడగడానికి నువ్వెవరు?’ నేనూ దబాయించా.
నవ్వేశాడు ఆ గడుసరి పిల్లాడు. ‘ఇట్స్ ఓకే. కూల్. నా పేరు విరించి. నిన్నే ఈ ఇంట్లోకొచ్చాం’ అన్నాడు చేయి ముందుకు చాస్తూ.
నేనూ నవ్వి, ‘నా పేరు అభీష్ట. అమ్మ పనిలో తీరిక లేక నన్ను ముగ్గెయ్యమంటే వేస్తున్నా’ అని, ‘షేక్ హ్యాండ్ ఇవ్వలేను. చేతికి ముగ్గు అంటుకుందిగా’ అన్నాను. ‘ఈ రోజుల్లో కూడా ముగ్గా?!! స్ట్రేంజ్!!” అంటూ భుజాలెగరేశాడు. కొంచెం ఎగతాళిగా అనిపించినా నేనే సర్దుకుని చెప్పా.. ‘మా ఇంట్లో బామ్మ, తాతగారు మాతోనే ఉంటారు. అందుకే అన్నీ సంప్రదాయబద్ధంగా జరగాలి. మా అమ్మ అలాగే పాటిస్తుంది. మాక్కూడా అలాగే నేర్పించింది’. అర్థం అయినట్లు తలూపి వెళ్ళిపోయాడు.
ఆ సమయంలో ఏమీ అనిపించలేదు. స్నేహం పెరుగుతూ ఉంది. వాళ్ళ కుటుంబం, మా కుటుంబం మంచి స్నేహితులైపోయాం. ఫ్యామిలీ పిక్నిక్ లు, కలిసి సినిమాలు, కిట్టీ పార్టీలు, స్లీప్ ఓవర్ లు. అన్నీ హాయిగా సాగిపోతున్నాయి.
***
ఆ రోజు తాత నాయనమ్మల ‘షష్టి పూర్తి మహోత్సవం’ రిసార్ట్స్ లో గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేశారు అమ్మానాన్నలు. సాయంత్రం అందరం రిసార్ట్స్ కి చేరుకున్నాం. వచ్చే అతిథులందరినీ ఆహ్వానిస్తున్నాము నేను, అజయ్.
విరించి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. పన్నీరు చిలికాడు తమ్ముడు. గులాబీ ఇస్తూ ‘వెల్ కం’ చెప్పాను నేను. పట్టు పరికిణీ, ఓణీలో ఉన్న నన్ను చూడగానే విరించి చూపు తిప్పుకోలేకపోవటం నేను గమనించకపోలేదు. ఆ సమయంలో విరించి కళ్ళలో నా కళ్ళు కలిసిన క్షణాన గుండె ఝల్లుమంది. అతని కళ్ళలో మెరుపు. పెదాలపై చిరునవ్వు. అందరికంటే ఆఖరున పువ్వు తీసుకుంటూ ఎవరికీ వినబడకుండా నా చెవిలో చెబుతున్నట్టుగా ‘అమేజింగ్!’ అంటూ లోపలికెళ్ళిపోయాడు. వెళ్ళాడనుకున్నా, కానీ…అక్కడే ఒక పక్కగా గోడకానుకుని, చేతులు కట్టుకుని నన్నే చూస్తున్నాడు నేను తలతిప్పి చూసేసరికి. రెండోసారి గుండె ఝల్లుమంది. అజయ్ చూడనే చూసేశాడు. నాకు మాత్రమే వినబడేలా “అక్కా! ఏంటే వీడు. కొంచెం తేడాగా ఉన్నాడు. ఇంటికెళ్ళేలోపు ఏమైనా జరగచ్చు అనిపిస్తోంది” అన్నాడు భుజాలెగరేస్తూ. నవ్వుకున్నాం ఇద్దరం. అక్కడినుంచి లోపలికెళ్ళాము అందరం. ఫంక్షన్ పూర్తయ్యేసరికి రాత్రి పది అయ్యింది. ఎక్కడివాళ్లు అక్కడికెళ్ళిపోగానే మేము కూడా ఇంటిముఖం పట్టాం.
మర్నాడు ఆదివారం కావటంతో పొద్దున్నే నేను అజయ్ గుడికి బయల్దేరాం. మమ్మల్ని చూసిన విరించి ‘ఎక్కడికి’ అని అడగటం, మా కూడా రావటం జరిగినై. ఇది నాలుగేళ్ళుగా మాకు అలవాటైన పనే. దర్శనం అయి గుడి మెట్ల మీద కూర్చున్నాం. తమ్ముడు కొబ్బరి ముక్కలు చేస్తున్నాడు కష్టపడి. “అభీ!” అని వినబడేసరికి తల తిప్పి చూశాను. “అభీ! ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు. కానీ ఇప్పుడు చెబుతున్నాను, ‘ఐ లవ్ యు’. నీకిష్టం అయితే చెప్పు. ఇష్టం లేకపోతే మాత్రం చెప్పకు, తట్టుకోలేను” అన్నాడు.
ఊహించిన విషయమే అయినా కొంచెం ఆశ్చర్యపోయాను, అతను చెప్పిన తీరుకి, ఆ గొంతులోని మాధుర్యానికీ, మార్దవంగా పిలిచిన ఆ పిలుపుకి.. ఆశ్చర్యం అంటే సరిపోదేమో! వేరే కవులైతే చాలా వర్ణించి ఉండేవారేమో!
బుగ్గల్లో సిగ్గులు, చెంపల్లో కెంపులు, పెదవులపై చిరునవ్వులు…….అంటూ.
నిజమే, నా పరిస్థితి కూడా అదే, కానీ ఏవీ బైటకి తెలియనివ్వకుండా మోకాలిపై గడ్డం ఆనించి, కాలి బొటనవేలు గోరుకి ఉన్న ఎర్రరంగుని, ఆ వేలు చుట్టూ తిరుగుతూ, వేలు అనబడే పర్వతారోహణ ప్రక్రియలో పట్టువదలకుండా ప్రయత్నిస్తూ కిందపడుతూ, మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నిస్తూ అష్టకష్టాలు పడుతున్న ఒక నల్లని చీమను తదేకంగా చూస్తూ నిశ్శబ్దంగా నేనూ ….
కొబ్బరిచిప్ప ముక్కలైనా, మళ్ళీ మళ్ళీ దాన్నే మెల్లగా కొడుతున్నట్టు నటిస్తూ ఊపిరి బిగపట్టి మా మాటలు వింటూ అజయ్ గాడు…
కొద్దిసేపటి తర్వాత విరించి ఆ చీమను తీసి, నా కాలిగోరుపై ఉంచి నా కళ్ళలోకి దీనంగా చూస్తూ.. ‘చీమ సక్సెస్.. ప్లీజ్ ఇక నా గురించి ఆలోచించు’ అన్నాడు డ్రమాటిక్ గా….అంతే… అందరం గట్టిగా నవ్వేశాం.
‘అక్కా! ఇంకా ఎందుకే దాస్తావు? చెప్పేయ్, నువ్వంటే అక్కకి కూడా ఇష్టమే విరించీ!’ అంటూ అక్కడి నుంచి ఒక్క అంగలో నాలుగు మెట్లు దూకి, ‘త్వరగా రండి, నేను కింద ఉంటా’ అంటూ పరిగెత్తాడు అజయ్. ఒకరకంగా నా సమస్యకి, సిగ్గుకి పరిష్కారం దొరికినట్టే అయింది.
‘అమ్మ దొంగా, మరి ఎప్పుడూ చెప్పలేదే’ అన్నాడు విరించి నా కళ్ళలోకి చూస్తూ. ‘ముందు నువ్వే చెపుతావని తమ్ముడితో పందెం వేశాను, గెలవాలని చెప్పలేదు’ అన్నాను నవ్వుతూ. ఇద్దరం కిందకి దిగాం కబుర్లు చెప్పుకుంటూ. ప్రతి ఆదివారం దేవుడిని పలకరించే మేము, అప్పటినుంచి రెండు రోజులకొకసారి ఆయన యోగాక్షేమాలడగటం పరిపాటి అయింది. మాతో కూడా అజయ్. వాడు లేనిదే ఎక్కడికీ వెళ్ళే అలవాటే లేదు నాకు. ఒక్కనాడు కూడా తిట్టుకుని, కొట్టుకుని ఎరగం.
అంత మంచి తమ్ముడిని ఇచ్చి నాకు ఎంతో మేలు చేసిన దేవుడు, ఎందుకింత అన్యాయం చేశాడో!
రోజులు సవ్యంగా సాగిపోతున్నాయి. మా రెండు కుటుంబాల స్నేహం అంతకన్నా చక్కగా, చిక్కగా సాగిపోతోంది. ఇంతలో విరించి వాళ్ళ అక్క పెళ్ళిచూపులు జరిగాయి. అమ్మాయి వాళ్లకి బాగా నచ్చింది. చదువు పూర్తి అయ్యాక పెళ్ళి చేద్దాం అని వీళ్ళు, ‘లేదు, ముందు పెళ్ళి చేసేద్దాం, ఆనక చదువు పూర్తి చేస్తుంది’ అని వాళ్ళు. అబ్బాయి అమెరికా వెళ్లిపోవాలట, ఆట్టే సెలవులు లేవు. నెల రోజులలో పెళ్ళి అయి, పిల్లతో సహా అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి అబ్బాయిది. అబ్బాయి చాలా బాగున్నాడు. మంచి చదువు, మంచి ఉద్యోగం. వదులుకోకూడని సంబంధం. వాళ్ళకీ ఈ సంబంధం వదులుకోవాలని లేదు. నాన్నని సలహా అడిగారు అంకుల్. ‘పెళ్ళి చేసేయ్యటమే మంచిది, ఆలోచించకు రాఘవ’ అన్నారు నాన్న.
‘అవునన్నయ్యా! చేసెయ్యండి, ఆడపిల్ల ఎంత చదువుకున్నా ఒకరింటికి వెళ్ళక తప్పదుగా, ఇక వాళ్ళు చదివిస్తామని చెబుతున్నారుగా, ఎక్కువ ఆలోచించద్దు’ అంటూ అమ్మ, ‘నేను కూడా అదే చెప్పా వదినా’ అంటూ ఆంటీ…
మొత్తానికి విరాజిత పెళ్ళి కుదిరిపోయింది. ముహూర్తాలు పెట్టేశారు. నేను బి. టెక్ మూడో సంవత్సరం, విరించి నాలుగో సంవత్సరం పరీక్షలు పూర్తి అయ్యి సెలవులులో ఉన్నాము. కాబట్టి పెళ్ళి పనులలో హడావిడి అంతా మాదే. అనుకున్న సమయానికి పెళ్ళి ఘనంగా జరిగిపోవటం, వాళ్ళు అమెరికా వెళ్ళి పోవటం జరిగిపోయినై. ఆరోజు అన్నాను విరించితో ‘ఇక తర్వాత మన పెళ్ళే కదా!’ అని. దానికి సమాధానంగా “ఆగు తల్లీ, అప్పుడే పెళ్ళి దాకా వెళ్ళి పోయావే? ఆడపిల్లలకి అన్నిటికీ తొందరెక్కువే! ఇంకా నా చదువు పూర్తి అవందే! అదంటే ఆడపిల్ల కాబట్టి పెద్దవాళ్ళు తొందరపడి చేసేశారు. నాకట్లా కుదరదు.’ అన్నాడు. నవ్వుకుని వదిలేశాను.
కొంత కాలం నిశ్శబ్దం మా ఇద్దరి మధ్య. నాకు అజయ్ ఎంతో, విరించికి తన అక్క కూడా అంతే. నెలరోజులు గడిచి పోయినాయి.
ఒకరోజు సాయంత్రం నేనొక్కదాన్నే స్కూటీ పై గుడికి బయల్దేరాను. ఎక్కడా విరించి కనబడలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉంది. తీరా గుడికి వెళ్ళినాక అక్కడ కనబడ్డాడు పిట్టగోడపై కూర్చొని ఒక్కడే. గబగబా దర్శనం పూర్తి అయిందనిపించి, మెల్లిగా వచ్చి గోడని ఆనుకుని నిలబడ్డాను. మౌనంగా ఉన్నాడు విరించి.
‘ఫోన్ చేశాను. పలకలేదు’ అన్నాను గొంతు పెగుల్చుకుని, ఇంకా ఏమి మాట్లాడాలో తోచక.
చిన్నగా తల ఊపాడు.
‘అక్కని మిస్ అవుతున్నట్టున్నావు విరీ’ అన్నాను.
మొహం పక్కకు తిప్పుకున్నాడు.
‘ఎలా వచ్చావు?’
‘బైక్’
‘చీకటి పడుతోంది, బైల్దేరదామా’
‘నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తా.”
నేనొచ్చేశాను.
ఆ తర్వాత మేం కలిసి గుడికి వెళ్ళిందే లేదు!
ఇంకో నెల్లాళ్ళు గడిచిపోయినాయి. ఒకటి, రెండుసార్లు మాత్రమే విరిని చూశాను. దగ్గరకెళ్ళి మాట్లాడేలోపే బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఏ అర్థరాత్రికో బైక్ సౌండ్ వినబడేది మళ్ళీ. పోనీ పగటి పూట ఇంటికి వెళితే నిద్రపోతూ ఉండేవాడు. తిరిగి వచ్చేసేదాన్ని. అయినా అంత సీరియస్ గా తీసుకోలేదు. బిజీగా ఉండి ఉంటాడని అనుకున్నా. నా విరించి మీద నా నమ్మకం అటువంటిది.
ఒకరోజు సాయంత్రం ఆంటీ స్వీట్స్ తీసుకువచ్చింది. నేను నా గదిలో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నా. అజయ్ వాడి గదిలో వాడు చదువుకుంటున్నాడు. అమ్మ అంటోంది… “ఏంటీ సంగతి వదినా.. విరాజిత కి ఏమైనా విశేషమా?”..అని,
‘అబ్బే అదేమీ లేదు వదినా, అయినా అప్పుడేనా? మా విరించికి అమెరికా లో మాస్టర్స్ కి సీట్ దొరికింది. రేపు తెల్లవారు జామునే ఫ్లైట్.’ అంటూ….
నా చెవులని నేనే నమ్మలేకపోయాను. తనకి సీట్ రావటం గురించి కాదు. ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా నాతో చెప్పలేదు. అమెరికా….. యూనివర్సిటీ ఎంట్రన్స్……. వీసా……టికెట్….. ప్రయాణం….ఏదీ , ఏదీ నాకు చెప్పలేదు. ప్రతిదీ చర్చించుకునే మేము, ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్న మేము ఈ విషయం గురించి మాట్లాడుకోకపోవడమేమిటి? మా ఇద్దరి జీవితాలలో అత్యంత ముఖ్యమైన ఈ సంఘటన గురించి నాకు మాట మాత్రమైనా తెలియకపోవడమేమిటి? చాలా ఆశ్చర్యపోయాను. అంటే నేనే తనని ప్రేమించానా? మరి తను? నటించాడా? కాలక్షేపం చేశాడా?
మెదడు మొద్దుబారిపోయినట్టనిపించింది.
ఏ పనీ చెయ్యలేని అచేతనత్వం.
తమ్ముడు నా గదిలోకొచ్చాడు.
వాడెందుకో నా చెంపలపై తుడుస్తున్నాడు. చల్లగా స్పర్శ తెలుస్తోంది.
అంటే….ఏడుస్తున్నానా??!! నాకే తెలియదు!!
అరగంట గడిచింది. నాకు స్పృహ వచ్చేసరికి తమ్ముడి ఒళ్లో నేను, నా తలపై నిమురుతూ వాడు.
“ఏంట్రా ఇది? ఏమి జరుగుతోంది? విరించి ఎందుకిలా చేస్తున్నాడు? వెళ్ళి అడగనా?” అన్నాను.
“వద్దక్కా! ఇప్పుడు నువ్వడిగినా చెప్తాడా? అలా చెప్పేవాడే అయితే నీతో సంప్రదించే చేసేవాడు కదా! వెళ్ళకు.” అన్నాడు అజయ్.
వెళ్లేముందు మెసేజ్ ఇస్తాడేమో అనుకున్నా. ఏమీ లేదు.
రోజులు గడిచి పోతున్నాయి. అటునుంచి ఏ వార్తా తెలియట్లేదు. నా కాలేజ్ జరుగుతోంది. వెళ్తున్నాను, వస్తున్నాను. మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తున్నాను…ఎవరకీ వినబడకుండా. జీవితం నిస్సారంగా అయిపోయింది. ఈ కాలం పిల్లలలాగా ‘లైట్’ తీసుకోలేకపోతున్నాను. నేను పెరిగిన వాతావరణ ప్రభావమో, నా మనస్తత్వమే అలాంటిదో, విరించి పై నేను పెంచుకున్న ప్రేమ అంతటిదో తెలియదు. ఈ దెబ్బ నా మనసుపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆకలి వెయ్యదు. నలుగురితో కలవలేను. తమ్ముడితో కలిసి గుడికెళ్ళలేను. మౌనమే నా భాష అయిపోయింది. క్రమంగా నా ఆరోగ్యం క్షీణించసాగింది. బరువు సగానికి సగం పడిపోయింది. కళ్ళకింద నల్లని వలయాలు. లో బి.పి. మొదలైంది. క్రమంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.
అనుక్షణం ఒకటే ప్రశ్న… అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?
ఒకరోజు కాలేజ్ లో సెమినార్ జరుగుతుండగా ధబ్బుమని పడిపోయానుట….ఆసుపత్రికి తీసుకెళ్లారుట…..నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ పైన పడుకుని ఉన్నా. పక్కనే తమ్ముడు సోఫాలో నిద్ర పోతున్నాడు. అమ్మ బత్తాయి జూస్ తీస్తోంది.
నేను లేవటం చూసి, లేచి నా దగ్గరకి వచ్చింది. “ఏమ్మా! ఎలా ఉంది ఇప్పుడు? ఇంతలో ఎంత ప్రమాదం తప్పిందో” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తలూపాను మెల్లిగా. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి రమ్మన్నాను. తమ్ముడు కిందకెళ్ళి కాఫీ తెస్తానన్నాడు. నేనిలా గతంలోకి వెళ్ళిపోయా…సాయంత్రం అయిదు గంటలైంది. నా మనసునిండా ముప్పిరిగొన్న ఆలోచనాతరంగాలకి ఒక్కసారిగా భంగం కలిగించాయి ఎక్కడినుండో వస్తున్న ఏడుపులు. ఈ లోకంలోకొచ్చి పడ్డాను.
***
కింద నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. మెల్లిగా లేవగలిగాను. కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాను. చూస్తే … ఎదురు గుడిసె బైట ఒక కుర్రాడు మంచం మీద పడి ఉన్నాడు. ఆ పక్కన అతని తల్లి, చెల్లి కూర్చుని ఏడుస్తున్నారు. అతని తండ్రి హాస్పిటల్ సెక్యూరిటి గార్డ్ తో మాట్లాడుతున్నాడు…ఇక్కడికి తీసుకురావటానికి అనుకుంటా….తల్లి ఏడుస్తూ మధ్యమధ్యలో అంటోంది….. “ముదనట్టపు పేమ, పేమించాడంటా, అది కాదందని పేనం తీసీసుకోవాలనుకున్నాడమ్మ, మాయదారి పేమలు, ఎందుకు పనికొత్తాయి నైనా, నన్నేటి సేద్దారి అనుకున్నావు? సెల్లిని ఏటి సేద్దారి అనుకున్నావు? నైనా! నీ మంచికి పనికిరాని పేమ ఏ మాత్తరం గొప్పదిరా బిడ్డా?”
చెల్లి నడవలేదనుకుంటా…పాకుతున్నట్టు ముందుకు జరిగి అతని మొహానికి దగ్గరగా వచ్చి ఏడుస్తోంది…. “అన్నియ్యా నెగరా…నన్ను, అమ్మని సూడ్రా ఓ పాలి. ఆ పిల్ల నిన్ను మోసం సేసి ఎల్పోనాదని నువ్వు మమ్మల్ని ఓగ్గీసి ఎల్పోదారనుకుంటే అది మోసం కాదేట్రా?” … ఎవరో నా చెంప మీద ఛెళ్ళున చరిచినట్టనిపించింది.
ఇక ఆ కన్నతల్లి బాధ వర్ణనాతీతంగా ఉంది.
ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా తనువు చాలిస్తే ….
చేతికంది వచ్చిన కొడుకు నిశ్చేతనంగా పడి ఉంటే ….
ఏ తల్లి పరిస్థితి అయినా అంతే కదా మరి!
అమ్మ, నాన్న గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు జలజలా రాలాయి. భుజం మీద చెయ్యి పడగానే తలతిప్పి చూశాను. అజయ్ కాఫీ కప్పుతో నిలబడ్డాడు. “సాయంత్రం డిశ్చార్జి చేసేస్తారట, నాన్న ఆఫీస్ నుండి వస్తూ తీసుకు వెళ్తారట” అన్నాడు.
ఇంటికెళ్ళిన తర్వాత బామ్మ ఎర్ర నీళ్ళు దిష్టి తిప్పి పారబోస్తూ “ ఆడపిల్లలకి అంతంత చదువులెందుకురా? అంటే నా మాట విన్లేదు. ఇప్పుడు చూడండి బంగారమంటి పిల్ల ఎంత పీక్కుపోయిందో!” అంటూ ముక్కు చీదేసింది. వెంటనే తాతగారు “చదువుకోకుండా, నీలాగా వత్తులు పేనుకుంటూ కూర్చోమంటావా? ఆడపిల్లలైతే ఏంటి? చదువుకోవాలి, ఉద్యోగాలూ చెయ్యాలి, అవసరమైతే ఊళ్ళు కూడా ఏలాలి. దానికోసం బాగా తినాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పండు తల్లీ! రేపటి నుంచీ నీకు నేనే దగ్గరుండి తినిపిస్తానురా. సరేనా!” అంటూ దగ్గరకు తీసుకున్నారు. కొంచెం గిల్టీగా అనిపించినా మనసుకు హాయిగా అనిపించింది. ఎవరూ నన్ను గుచ్చిగుచ్చి ఏమీ ప్రశ్నించలేదు. అందరూ నాతో చాలా మాములుగా ఉంటున్నారు. నేను మామూలు మనిషిని అవ్వటానికి అది చాలావరకు
సహాయపడింది. పరీక్షలు పూర్తయిపోయినాయి. కాంపస్ సెలెక్షన్స్ లో అనుకున్నట్టుగానే పెద్ద ఐ.టి. కంపెనీలోనే ఉద్యోగం దొరికింది. రెండు రోజుల్లోనే చేరిపొమ్మన్నారు. అమ్మ, నేను, అజయ్ షాపింగ్ చేసి, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాము. ఉద్యోగంలో చేరిపోయాను.
రెండు వారాలు గడిచిన తర్వాత, అజయ్ ‘గుడికెళదామా అక్కా?’ అన్నాడు. నాక్కూడా వెళ్ళాలనిపించింది. గుడిలో అడుగుపెట్టి, చెప్పులు విడిచి, పూలు, కొబ్బరికాయ కొంటుంటే ఆ పూలకొట్టు రాజమ్మ అడిగింది.. ‘ఏమ్మా! బాగున్నారా! ఈ మద్దె అవుపట్నేదు’ అని. చిరునవ్వు తప్ప ఏమీ మాట్లాడలేకపోయా. పూజారిగారు చక్కగా గుర్తుపెట్టుకొని మరీ మా నామగోత్రాలతో అర్చన చేసేశారు. “అభీష్ట అభీష్ట సిద్ధిరస్తు!” అంటూ దీవించారు. అజయ్ ఉడుక్కుంటూ “అంకుల్! నన్ను మర్చిపోయారా? పక్షపాతమా?” అన్నాడు. పుజారిగారు నవ్వుతూ… “లేదులేవోయ్. నిన్నెలా మర్చిపోతాను! అక్కయ్య చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని!” అన్నారు, కొబ్బరిచిప్ప, పూలు చేతిలో పెడుతూ.
ఇద్దరం వచ్చి మాకు ఇన్నేళ్ళుగా అలవాటైన మెట్లపైన కూర్చున్నాం.
కొంతసేపు మౌనం తర్వాత అజయ్ అన్నాడు ….
“అక్కా! చూశావా! పూలకొట్టు రాజమ్మ, చెప్పుల స్టాండ్ వెంకన్న, తోటమాలి, పూజారి గారు… అందరూ … అందరూ ఎంత మాములుగా పనులు చేసుకుంటున్నారో! ఎవరో రాలేదనో, రోజూ వచ్చేవాళ్ళు కనబడట్లేదనో వాళ్ళ పనులు ఆపుకోలేదే!
మన జీవితంలో పరిచయం అయిన ప్రతివ్యక్తి మనల్ని ప్రభావితం చేయకూడదు అక్కా! మన జీవితాన్ని శాసించే హక్కు ఇతరులకి మనం ఇవ్వకూడదు. వీళ్ళంతా నీ జీవితంలో ఎప్పటినుంచో ఉన్నవాళ్ళే. వీళ్ళని ఎలా భావిస్తావో, అలానే విరించి కూడా. అతను లేడనీ, నిన్ను కాదని వెళ్లిపోయాడనీ అగాథంలో కూరుకుపోతావా? అతనేమైనా నీ జీవిత గమనాన్ని మార్చగల నియంతా?
అక్కా! స్నేహితులు, చుట్టాలు, అంతకు మించిన ఆప్తులు…ఎవరైనా సరే నీ ప్రయాణంలో సహచరులు మాత్రమే…వారిని గౌరవించు, అభిమానించు, అవసరమైతే సహాయం చెయ్యి, కావాలనిపిస్తే కొంచెం త్యాగం చెయ్యి…అంతేగాని నీ నిండు జీవితాన్ని అర్పించాలనుకోకు. నీ జీవితాన్ని సార్థకం చేసుకో”
కొంచెంసేపు ఎవ్వరం మాట్లాడలేదు. మళ్ళీ తనే అన్నాడు… “ఆఁ అభీ! నువ్వు రైటింగ్ లో దిట్టవి. మంచి బ్లాగర్ వి. చాలా బాగా రాస్తావు కదా! నీ అనుభవాన్ని నీ, నాలాంటి యువతతో ఎందుకు పంచుకోకూడదు? ఆలోచించు”
అజయ్ ఆలోచన ఎంతో నచ్చింది. వెంటనే కార్యరూపం దాల్చింది. పుస్తక ప్రచురణ పని అజయ్ తన భుజాలమీద వేసుకుని, తన స్నేహితుల సహాయంతో పూర్తిచేశాడు. అనుకున్నదానికంటే ఎక్కువగానే అమ్ముడు పోయాయి. రెండో విడత ప్రచురణ కూడా జరిగిపోయింది. అభినందనలు వెల్లువెత్తాయి నా మెయిల్ బాక్స్ కి. కేవలం ముఖప్రీతి కాకుండా సలహాలు, సూచనలు ఇస్తూ, ముందుముందు నానుండి ఎలాంటి రచనలు ఆశిస్తున్నారో వివరిస్తూ సాగుతూ ఉండేవి ఆ మెయిల్స్.
నా మరో ప్రయాణం రచయిత్రి రూపంలో మొదలైంది అనుకోకుండా. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత రాత్రిపూట మెయిల్స్ చూడటం, తీరిక సమయంలో రాసుకోవటం నా దినచర్యగా మారిపోయింది.
అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు ఇదంతా చూసి.
నా రచనలు కథలు కావు. భగ్న ప్రేమ కవితలూ కావు. నా మనోసాగర భావకెరటాలవి.
మనిషి బ్రతకటానికి ప్రేమ కావాలి. నిజమే. ఆ ప్రేమ ఆపోజిట్ జెండర్ నుండి వచ్చినపుడు మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమ అనబడే ఆకర్షణ భంగపడిననాడు, జీవితమే వృథా అని బాధపడుతూ కూర్చోకూడదు.
నిజానికి విరించి చేసిన పనే సరైదేమో. నన్ను మోసం చేసి వెళ్లిపోయాడని చాలా బాధపడిన నేను అతనిని అభినందించటం కొంచెం వింతగానే ఉండచ్చు. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ, పెళ్లి అంటూ కాలక్షేపం చేసేసి, జీవితాన్ని భార్యాపిల్లలతో ఆనందంగా గడపాల్సిన సమయంలో ఆర్ధిక ఇబ్బందులతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ జీవితాన్ని నిస్సారంగా, నిర్జీవంగా గడుపుతున్న జంటలు ఎన్నో. విరించి ఆ పని చెయ్యకుండా తెలివితెచ్చుకుని పారిపోయాడు. నేనే ‘ప్రేమ, ప్రేమ’ అంటూ సెన్సిటివ్ గా ఫీల్ అయి, జీవితాన్ని పాడుచేసుకోబోయాను. కానీ త్వరగానే బైట పడగలిగాను నా కుటుంబ సహకారం వల్ల.
‘నా జీవితం పదిమందికీ ఒక గుణపాఠం కావాలి’ లాంటి బరువైన సినిమా డైలాగులు చెప్పను. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా సమస్యల్ని పరిష్కరించుకోవాలో వివరించటమే నేను చేసేది.
ఈ మాటలన్నీ పెద్దవాళ్ళు చెబితే పిల్లలకి నచ్చకపోవచ్చు. క్లాసు పీకుతున్నారు అనిపిస్తుంది. ‘ఈ పెద్దవాళ్ళున్నారే …’ అంటూ ఏవో సినిమా డైలాగులు మొదలుపెడతారు.
నా ద్వారా యువతలోకి చాలా చక్కగానే చేరినాయి. యువతరమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా చదువుతున్నారనే విషయం నాకొచ్చే మెయిల్స్ వల్ల అర్థమయ్యింది. అజయ్ కి థాంక్స్ చెప్పాలి ఈ విషయంలో.
***
ఒకరోజు ఉదయాన్నే అమ్మ నిద్రలేపుతూ “అభీ! త్వరగా లేచి, తయారవ్వు, పదింటికి నిన్ను చూసుకోడానికి పెళ్ళి వారొస్తున్నారు” అన్నప్పుడు……
అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు వెలిసింది….
లేచి త్వరత్వరగా తయారయ్యాను…నాకిష్టమైన లేత గులాబిరంగు షిఫాన్ చీర, ముదురు గులాబి రంగు డిజైనర్ బ్లౌజు వేసుకున్నా. దానిపై రూబీ సెట్ పెట్టుకుని నాకు నేనే నచ్చేశాను. నా మనసు నా మాట వింది. నన్ను అలా చూసిన అమ్మ చాలా సంతోషపడింది, ‘దట్స్ మై గాల్’ అంటూ…అజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కళ్ళతోనే అభినందిస్తూ.
నా ఎంపికలో లోపం ఉన్నప్పుడు, తల్లిదండ్రుల ఆలోచనలకు అంగీకారం తెలపడంలో తప్పేమీ లేదనిపించించింది. వారికి నా బాధ్యతను అప్పగించటం ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. తోడుగా నా తమ్ముడు….నాకింకేం కావాలనిపించింది!!
*****
ఆర్ట్: మన్నెం శారద
అందరికీ నమస్కారములు. నా పేరు విజయ దుర్గ తాడినాడ. నేను గత 20 ఏళ్ళుగా తెలుగు ఉపాధ్యాయినిగా, తెలుగు హెచ్.ఓ.డి గా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పని చేస్తున్నాను. మొక్కలను పెంచటంతో పాటు రచనా వ్యాసంగం నా అభిరుచులు. ఇప్పటిదాకా ‘పోస్ట్ చెయ్యని రచనలు’ రాసుకుని, దాచుకోవటం అలవాటు. నా తొలి అడుగు ‘నెచ్చెలి’ తోనే వేయటానికి అనుమతిచ్చిన సంపాదకులకు, ఇతర అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉన్నత లక్ష్యాలతో సాగుతున్న ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రికకు నా మనఃపూర్వక అభినందనలు.