రాగో
భాగం-3
– సాధన
ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బాబులు అందరూ గోటుల్ ముందు మంచాల్లో కూచున్నారు. వాళ్ళకెదురుగా గ్రామస్తులు కూచున్నారు. పిల్లలందరూ దాదాపు బరిబాతలనే డ్రైవర్ కసరుకోవడం లెక్క చేయకుండానే ఉరుకులు పరుగులు చేస్తూ దాన్నొక వింత జంతువులా చూస్తున్నారు. ఎవరింటి ముందు వారే అమ్మలక్కలు తమ మగాళ్ళను, బాబులను చూస్తూ నిలబడ్డారు.
తనను దాటేసివచ్చిన ఆ జీపును దాటుకుంటూ రాగో అమ్మలక్కలవైపు నడిచింది.
గోటులకు ఎడమవైపు తూర్పు దిక్కు కొమ్మలూడిపోయి ఆకులు రాలిన అలి (రాలచెట్టు) మర్ర ఎదుగుదల ఆగి నిటారుగా నిల్చుండి బేగర్ (సర్కారిండ్లు) ఇళ్ళను వెక్కిరిస్తుంది.
“ఏం పటేలా! మీరు ఊళ్ళో ఉండి లేనట్టే అయి మేము కట్టిస్తున్న ఇండ్లను పాడుబడ్డ ఇండ్లకింద చేస్తున్నారు. మీ గొడ్లు ఎడ్లు పోయి మరింత పాడు చేయకుండా ఆ కొంపలను కొద్దిగనైనా దేఖ్ రేఖ (చూసుకోవడం) చేయకుంటే ఎట్ల చెప్పు!” నీవు సర్కార్ మనిషివై ఉండి కూడ పట్టించుకోకపోవడం తప్పు కదా అంటూ హెచ్చరిస్తున్నట్లూ, బుద్దరిస్తున్నట్లూ అన్నాడా రేంజర్.
పటేల్ అసలే కోపగొండి. ఈ సర్కార్ సాయబులు ఎవ్వడొచ్చినా తన పని విడిచిపెట్టుకోని అడ్డమైన చాకిరీ చెయ్యాలా అనే తృణీకరం, కోపం మనసులో మెదలగా సర్రున వచ్చింది జవాబు.
“నీ దేఖ్ రేఖ నేను చేస్తే నా దేఖ్ రేఖ ఎవ్వడు చెయ్యాలి?”
అంతమాట విన్న రేంజర్ కోపం ఆకాశన్నంటింది. కానీ తనలో తానే తమాయించుకున్నాడు. ‘ఇదంతా గా అన్నల మద్దతు బిడ్డా చీటికి మాటికి మీరన్నది పడే గతి పట్టింది ఏం చేద్దాం’ అనాల్సిన మాట పైకి అనకుండానే పటేల్ ను పట్టాలపైకి తేవాలన్న ధోరణిలో మరోమాట వెతుక్కోసాగాడు. ఆ
“ఈ గుట్టల మీద ఇండ్లు మీ కోసం కాకుంటే సర్కార్ ఎందుకు కడుతుంది పటేలా?” అంటూనే కొనసాగింపుగా ఈ సర్కార్ చేసే ప్రతి పని మీ మంచికే అన్నట్టు నసగడం మొదలు పెట్టాడు. –
రేంజర్ సర్కార్ మంచితనాన్ని తీసేసరికి తోకతొక్కిన పాములా లేచాడు పటేల్ బిరుజు.
“జీ! జీ! నువ్వన్నది నిజం జీ. పదేండ్ల కింద, గొడ గొడ ఏడుస్తున్నా వినకుండా పోరగాండ్లు పుట్టుడులేదు, పెండ్లాం ముట్లుడిగింది అని మొత్తుకున్నా వినకుండ దొరకబట్టి ఆపరేషన్ చేయించి హరిగోస పెట్టుకున్నది మా కోసమే. గీడ, జానెడు భూమి నరుక్కొని దోసెడు విత్తులు ఆలుక్కుందామంటే, పి.ఓ. ఆర్. (ప్రైమరీ అఫెన్సివ్ రిపోర్టు)లు చేసి కోర్టుల దండుగ కట్టేదాక గోమారి తీరుపట్టి విడవకుండ నానా తిప్పల పెట్టింది మా మంచికే. ఉత్తపుణ్యాన ఇంట్లసొచ్చి, సీసెడు కల్లు దొరికిందనీ నాలుగు వందలు నగదు ఇచ్చేదాక మొబిల్ కోర్టువాళ్ళు విడవనిది కూడ బుడ్డ గో ల్లను పెద్ద చేసుకోటానికేనేమో? మా ఊళ్ళె సంఘం లేదు లాటారం లేదు అని నియ్యత్ గా చెప్పంగ కూడ వినకుండా ఇల్లిల్లు గాలిచ్చి అడ్డమైనోళ్ళను నాలుగురికి కారే దాద బిడ్డను ఖరాబు చేసింది మా మంచి కోసం కాకుంటే మరెందుకు చేసింది ఈ సర్కార్? గీ బేగార్ ఇండ్లల్ల సంసారం చేసిన పాపాన పోలేదెవడు. మాకు ఆ ఇండ్లు వద్దు అంటే తెడా మీ మాట వినేది అన్నట్టు మొండిగ మొదలు పెట్టి మీదికెళ్లి ఇదంతా మీకోసమే అనుడు? ‘నీ అక్కా అంటూ ‘కింద మంట పెట్టి మీద నీళ్ళు పోసినట్టుంది’ మీ యవారం” అనే ధోరణిలో తను చెప్పదలచుకొన్నది కోపంగానైనా స్పష్టంగా చెప్పి ఊరివాళ్ళను చూస్తూ “ఏమ్ రా” అన్నాడు.
సహజంగానే, మాడియాలు మాట్లాడేపుడు తను చెప్పుతున్నదంతా నిజమే అని తోడివారితోడ అనిపించుకోవడానికి ఇలా ప్రశ్నించడం అలవాటు.
పటేల్ చెప్పిందాంట్ల వెంటుకమందం కూడ జోల్ (అబద్దం) లేదని గుర్తించిన జనాలు అతి సహజ ధోరణిలో కనుబొమ్మలెగరేసి తల ఒక్కసారిగా పైకెగరేస్తూ వారికి పుట్టుకతో అలవాటైన “ఇంగో” (అవును) అంటూ జవాబు ఇచ్చారు.
“దట్ రా దాకడ్’ (పోదాం పాండి) అంటూ లేచి తువ్వాల దులపసాగాడు పటేల్.
చేతికి దొరికిన బందో, కర్రో కింద వేసుకొని కూచున్న గ్రామస్తులందరు పటేల్ మాట వినగానే లేచి అధికార్లకు నిరసనగా కూచోవడానికి వేసుకున్న ఆ బండో, కర్రో తీసి దూరాన విసిరిగొడుతూ పటేల్ ను అనుసరించసాగారు. ఎవరి గుమ్మాల్లో వాళ్ళుండి చూస్తున్న స్త్రీలందరూ ఎవరికి తోచిన విధంగా వారు అధికార్లను శాపనార్థాలు పెడుతూ, మూతులు తిప్పుతూ, చేతులాడిస్తూ గుడిసెల్లోకి తల దూర్చారు.
క్రింది ఉద్యోగస్థులందరి ముందు గోచిగుడ్డ పటేల్ లో అంతటి సన్యాసం జరిగి, ముఖంలో నెత్తురు చుక్క లేకుండా తయారైన రేంజర్‌ను చూసి దూరంగా నిల్చున్న జీపు డ్రైవర్ ముసిముసిగా నవ్వుకుంటూ మనసులోనే బిరుజు పటేల్‌ను మెచ్చుకున్నాడు. ఘాలు, ఆ అన్నల అండదండలు మరింత బలపడాలని లోలోపల అనుకుంటూనే జీపు దగ్గరికి నడిచాడు.
బుర్… బుర్… బుర్… అంటూ జీపు తుర్రుమంది.
* * *
చిన్ననాటి మైని పెళ్ళయ్యాక ఇపుడెలా ఉందో, ఆడుకున్న రోజుల్లో అభిమానించినట్టే ఇవ్వాళ ఆదుకుంటుందా? అనుకుంటూ దారీ తెన్నూ లేని ఆలోచనలతో, పుట్టెడు అనుమానాలతో తడబడుతూ గడపలో కాలుపెట్టిన రాగోను చూసిన మైనీ అమాంతం మీదపడి కావలించుకొంది. ఎగురుతూ, తుళ్ళుతూ ఎక్కడున్నా పెద్ద సందడి చేసే మైనీ ఇపుడు ఇల్లు, సంసారం బరువు మోస్తున్న పెద్ద పేరిలా తయారైంది.
మైని, రాగోలు తెల్లవారగానే కొద్దిగ అంబలి తాగి చెరోబుట్ట చేత పట్టుకొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా అడవి వైపు సాగారు. అడవిలో దొరికే మొర్రిపళ్ళు, తునికి పళ్ళు ఏరుకుంటూ ఎన్నెన్నో చర్చలు నడిపిస్తున్నారు. ఒక్కసారి తిరిగి చిన్నపిల్లలైనారు. ఆనాడు వాళ్లు కలసి తిరిగిన సెలయేళ్ళు, వాగులు, తోగులు ఒకటేమిటి ఏ నీళ్ళల్లో ఎన్ని కసరత్తులు చేసి ఎన్నెన్ని చేపలు, ఎండ్రకాయలు పట్టింది మొదలు ఏ చెట్టు కింద ఏ పండు, ఏ కాయ ఏరుకొని తిన్నది ఎవరెవరితో ఏ ఏ ఆటలాడుతున్న వరకు నెమరు వేసుకున్నాక మైని మనసు ఒక్కసారిగ తనతో ఎదిగిన తన తోటి ఆడపిల్లల వైపు తిరిగింది. ఒక్కొక్కరి గూర్చి అడిగి తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. మామూలుగానే పళ్ళేరుకుంటూ మాటలు పేర్చుకుంటుంది.
“రాగో”
“ఊఁ ”
“కాంతి ఎవరిల్లు చొచ్చిందే” అంటూ ముందుగా తల్లిగారింటి కెదురుగా ఉండే పుంగాటి కాంతి గూర్చి మైని ఆరా తీయ ప్రారంభించింది.
“పుటుల్ వాళ్ళ దగ్గర కల్లు దాగమని దాని అయ్య మేనోళ్ళకిచ్చి పెండ్లి చేసిండు. ఇపుడు పిట్టకసలోనే ఉంటుంది. మొన్న వచ్చినప్పుడు చూస్తే పొట్టతో ఉంది” రాగో బదులు చెప్పింది.
“పాపం. అవ్వ సచ్చినా కూచీ (పిన్ని) ఉన్న దాంట్లో మంచిగానే చూసి పెళ్ళి చేసి గట్టెక్కిచ్చింది” అంటూ మైని కాంతి గూర్చి జాలిపడింది.
మాడియా స్త్రీలకు సహజమైన పద్దతిలో రాగో “హే” అంటూ “ఊఁ” కొట్టింది.
అప్పుడే మైని మనసులో బయ్యక్క తళుక్కున మెరిసింది. ఎందుకోగానీ ఊళ్లోని యువతులందరికి అదంటే సదభిప్రాయం ఉండేది గాదు. తోటివాళ్ళు కాదు, కూడదని ఎంత వారించినా షావుకారి దేవురావు ఇంటికి పోయి పనికి కుదరడం వాళ్ళందరికి ఆమెపై అసహ్యం పెరగడానికి గల ఒకే ఒక కారణం.
బయ్యక్క ఈడు మీదున్న పిల్ల కనుక వయసులో ఉండే ఆడపిల్ల లక్షణాలు, బుద్ధులు, కోరికలు క్రమంగా దానిక్కూడ పట్టుకున్నాయి. రాళ్ళ వానకు బోడ తలకు దంటయినట్టు షావుకారి భార్య ప్రసవానికి పోవడంతో పనికి కుదిరిన బయ్యక్క పని పాకాన పడ్డట్టయ్యింది. ఇంకేం. షావుకారమ్మ ప్రసవం అయి తిరిగి కాపురాన్కి వచ్చేసరికి ఇటు బయ్యక్కకు తెలవకుండానే మూడు మాసాలు నిండిపోయాయి. ఏ నోరాగుతుంది? లోకులు కాకులంటారు గదూ! చిలికి చిలికి గాలివాన అయినట్టు ఆ నోటా ఈ నోటా ఈ మాట ఊరు ఊరంతా పలువలు చిలువల్లా పాకిపోయింది. అంత వరకే తెల్సిన మైని తర్వాత బయ్యక్క కేమయిందోనని ఆతృతతో రాగో నడిగింది.
“బయ్యి గొడవెలా తెగిందే రాగో” అంటూనే కిసుక్కున నవ్వింది మైని.
“ఆఁ! నువ్వు నవ్వినట్టే అయ్యింది దాని బతుకు. ఆ షావుకార్లు దొంగలు. మన బతుకులు నాశనం చేస్తారంటే ఓ పట్టాన విన్నది గాదు. ఈడు మీదున్నపుడు జోడు దొరికే దాక ఆగకుండా కొత్తలున్న షావుకారి దగ్గర కొలువు దొరికితే వాడు కలీ చేయకుండా ఎందుకు వదులుతాడు? ఇంకా నయం. మునుపటి రోజులైతే ఊరి పెద్దలు మస్తుగా తాగి షావుకారి కొమ్మే కాసే వాళ్ళేమో. ఇపుడు సంగం అన్నలు నిలబడ్డంతో షావుకారి పప్పులుడకలేదు. భయానికో, అవుసరానికో గానీ ఇంట్లోనే ఉంచుకున్నాడు వాడు. ఆ తర్వాత దానికీ ఓ బిడ్డ పుట్టింది. ఏమైనా కులపు పెండ్లాన్ని చూసుకున్నట్టు దీన్ని చూసుకోడు కదా! జీతం, నాతం లేకుండా పడేసింది తింటూ గాడిది చాకిరి చేసే మనిషి దొరికినట్టయ్యింది ఆ తేలి (గాండ్ల) షావుకారికి, ఇప్పుడిప్పుడు బయ్యికి కూడ అర్థం అవుతుంది. నాకు కలసి ఏడుస్తూ దాని కథంతా చెప్పుకుంది” అంటూ చేతిలో పిడికిలి నిండిన తునికి పళ్ళు గుల్లలో పోసి నడుం ఎత్తి ఒక్కసారి వొళ్ళు విరుచుకుంది. నాలుగు చినుకులు రాలేగాని ఎండ జోరు తగ్గదన్నట్టు జోరు ఎండలకు నోరెండుక పోతున్నందున తెచ్చుకున్న బుర్ర దగ్గరికి రాగో దారి తీసింది. మైని వెనకాలే నడిచింది.
ఎండ విపరీతం. కాళ్ళకు చెప్పుల్లేకుండా పట్టపగలు నడవడం నిప్పులపై నడిచినట్టే ఉంటుంది. బుర్రలో తెచ్చుకున్న నీళ్ళు సైతం ఎండ దగడుకు వేడైతున్నాయి. చిక్కం అల్లని బుర్రలైతే ఆ నీళ్ళు తాగడం ఎండను తాగినట్టే. వడగాడ్పులకు చెవులదురు తున్నాయి. ఇంకా తునికాకులు తెంపే కాలం షురువ్ అయితే ఆ కూలీలు పడే అవస్థలు వర్ణనాతీతం.
చెట్ల ఆకులు రాలిపోయినాయి. ఎక్కడనో దూరాన పచ్చని ఆకులతో పూసుగు చెట్ల నీడ చల్లగుంది. కడుపులో చల్లబడ్డాక ఆ నీడలో కూచొని కాసేపు ఆరాం చేస్తే కునుకు రావడం క్షణం పట్టదు. ఇదేం చిత్రమో గానీ అడవిల అన్ని చెట్ల ఆకులు రాలిపోయినా పూసుగు చెట్టు మాత్రం ఇగురు పెట్టిన ఆకులతో ఎండాకాలమంతా చల్లగుంటుంది. అడవిలో అక్కడక్కడ నీళ్ళ తావుల దగ్గర కొన్ని పొరకలు పచ్చగా ఉన్నప్పటికీ మంచి నీడ దొరకడం కష్టమే. ఈ ఎండలల్లో గడ్డలో బెడ్డలో తేను అడవికి పోయి దారి తప్పి నీళ్ళు దొరక్కుంటే ఎన్నెన్ని పొడి పొడి ప్రాణాలు అడవిలోనే రాలిపోతాయో! అడవిలో వడదెబ్బకు మనుషులే కాదు పనులు కూడ తెర్లైపోతయి.
బుర్రలోని నీళ్ళు నోట్లో వంచుకొని బుక్కెడు పుకిలించి ఉమ్మేసి ఆ తర్వాత లోపల కొద్దిగా చల్లగా ఉన్న నీళ్ళు నాలుగు బుక్కలు గటగట మింగారు రాగో, మైనీలు. మిగిలిన నీళ్ళల్లో నుండి దోసిళ్ళలో పోసుకోని మొగంపై చల్లగా చల్లుకున్నారు. రాగో పైట కొంగుతో మొగం తుడుచుకుంటుంటే మైని అదే పనిగా చూస్తుండి పోయింది. తాను కూడ చీర కట్టుకున్న రోజులు కళ్ళల్లో కలలా మెదలుతుంటే, తన ప్రస్తుత ఆకారాన్ని చూసుకుని మనసు చిన్నబుచ్చుకుంది. రాగో పైట అందివ్వబోగా వారిస్తూ, తాను చుట్టుకున్న చిన్న టవలను కాస్తా పైకి లేపి తల మోకాళ్ళ వరకు వంచి మొగంపై మిగిలిన నీటి బిందువులను తుడుచుకొంది.
“రాగో దట్” (నడువు) అంటూ మైని నీటి బుర్ర జబ్బకు తగిలించి ఊరు దారి పట్టింది. రాగో కూడ నడవడానికి నెత్తిపై బుట్ట పెట్టుకుంది.
జబ్బలకు బుర్రలు తగిలించుకొని నెత్తిపై గుల్లలు పెట్టుకుంటున్న మైనీ రాగోలను చూస్తూ ఒక యువ జంట బిరబిరా దాటేసింది. వారిరువురి హడావిడి చూసి రాగో తనలో తానే నవ్వుకుంది. ఆ చిరునవ్వును గుర్తించిన మైని పరిహాసంలోకి దిగింది.
గుట్టల మీద భార్యాభర్తలు సాధారణంగా ఇళ్ళల్లో కలుసుకునే అవకాశాలు చాలా తక్కువ. ఆ పాటి గుడిసెల్లోనే పెద్దలు, పిల్లలు వారితో జతగా పెళ్ళయిన జంటలు కాపురం చేయాలంటే ఎలా కుదురుతుంది? పెద్ద పెద్ద ఇళ్ళు, ప్రత్యేక గదులు లేనివారు తమ అవసరాలు తీర్చుకోడానికి అడవిలోకి పోవడం తప్ప మరో మార్గం లేదు కదా! అలాగే వారు ఆదివాసులు. కాయ, పండు, ఆకు అలము, కట్టెపొరక కోసం పొద్దస్తమానం అడవిలో తిరగకుంటే వెళ్ళదు. ఆడ మగ కలసి పనులు చేసుకోకుంటే మరీ గడవదు. అడవిలో సంచరిస్తూ, పనులు చేసుకుంటూ, కాపురం చేయడమనేది వారి అవసరం.
“రేపు పెళ్ళైతేగానీ ఈ నవ్వడం తెలవదు” అంటూ మైనీ రాగోకు ఒక చురక అంటించింది.
“ఆలేదట్” (సరే పద) అనుకుంటూ అడుగులు వేయసాగారు.
మైని గుడిసె చేరాలంటే ముందు వారి పొలం దాటాలి. ఆ బాట వెంట నడుస్తున్న వారిద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. సర్కార్ వారు చదును చేసిన తమ పొలంలోని కుంటను చేరుకున్నారు. నీళ్ళు ఇగిరిపోయిన కుంటలో బురద కూడ ఎండిపోయి పగిలి నెర్రెలు వాసి ఉంది. బీటలు వారిన ఆ నేల పై పొర వొదలొదలుగా ఉంది. ఆ నెర్రెల్లో నడిచినందున విరిగినకాడికి పెద్దలైనాయి. కట్టెక్కేముందు మైని రాగో చూడకుండా గబుక్కున వంగి నాలుగు బిడ్డలు అందుకొని గుల్లలో వేసుకుంది. అయినా, రాగో చూడనే చూసింది.
“ఎందుకా దొంగతనం. ఇవాళ చెప్పకపోతే రేపైనా బయటపడదా. నాతో చెప్పి ఉంటే నేనే పెంకలో వేపుడు చేసి పెట్టేదాన్ని కదా!” అంటూ సంఘాను ఆప్యాయంగా దెప్పిపొడిచింది రాగో.
నెలతప్పిన వారి నోరు అనేక రుచులను కోరుతుంది. మామూలు రోజుల్లో ముట్టుకోవడానికి కూడ మనసొప్పని చిరుతిళ్ళకు నోరూరుతుంది. ఉసిరి, మామిడి, చింతలాంటివి కావాలని ప్రాణం కొట్టుకుంటారు. రకరకాల రుచులతో ఏదైనా అపురూపంగానే తింటారు. ఇంటివారు కూడ ఇలాంటప్పుడు వారి కోర్కెలను తీరుస్తారు. ఈ మట్టిబెడ్డల్లో కూడ అన్నీ పసందుగా ఉండవంటారు. చెదలు పుట్టమన్ను తినడానికి మనసొప్పక వండ్రుమన్నవుతే మరీ ఎక్కువగా తింటారు. అదీ వేపుడు చేసుకొని తినడం మరింత రుచి. వర్షాకాలం నేలంతా తడిసిపోయి పొడిబెడ్డలు దొరకడం కష్టం. ఉపాయం ఉన్న ఆడవాళ్లు ఆ కాలంలో జొన్నలు, వడ్లు ఇతర ధాన్యంలో ఉండే మట్టిబెడ్డలను కూడ వదలకుండా చాలా జాగ్రత్తగా దాచుకొని తృప్తిగా తింటారు పాపం.
“రాగో నాన్సు బాగున్నాడే” తటాలున అడిగింది మైని.
మాటలు అటుపోవద్దని ఇంత సేపు జాగ్రత్త పడుతున్న రాగోకి మైని ప్రశ్న మెరుపులా తగిలింది. ఇంకేమేమి అడుగుతుందో. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఏ ప్రశ్నకు ఏ జవాబు చెప్పడమో తెలియదు. కలతపడ్డ గతమూ, దిక్కుతోచని భవిష్యత్తు ఒకేసారి తుఫానైనట్టయింది.
జరిగిందంతా మైనికి చెప్పాలా? వద్దా. తన సమస్య విని మైని ఏం అంటుంది. ఓదారుస్తుందా, చీదరించుకుంటుందా? తనదే తప్పంటుందా? ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? సంఘాకు నిజం చెప్పితే మరో నాలుగు రోజులు ఇక్కడే ఉండనిస్తుందేమో. మైనికి తన సంగతంతా చెప్తే అది తన మొగుడికి చెప్పకుండా ఉంటుందా? అతడు తన తల్లిదండ్రులకు కబురు చేయకుండా ఉంటాడా! అదే జరిగితే తండ్రి మళ్ళీ తనని తన్ని లాక్కపోడా? ఇక్కడి యువకులకు తన స్థితి అర్థమైతే వెంటపడకుండా వదలుతారా? ఇన్ని అనుకుంటూనే రాగో కలలో మాట్లాడినట్టు “ఇంగో” అను మాత్రం అనగలిగింది. రాగో వాలకానికి గాభరపడ్డ మైని అప్పటికి మరి చాలించుకుంది.
ఈ ఆలోచనలతో తల వేడెక్కిన రాగో మైనికి ఏ విషయం చెప్పకుండానే అక్కడి నుండి ఆ తెల్లవారి మకాం మార్చాలనుకుంది.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.