సంఘర్షణ
-వసంతలక్ష్మి అయ్యగారి
తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా..
నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి.
లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు చేసుకుని ,లాపుటాపుకి కాస్త దగ్గరలో ఉంటే పిల్లలుస్కైపు లోకొచ్చినా మిస్సవకుండా ఉండొచ్చు..అన్న విషయంతో మొదలు యీ కాను ఫ్లి క్టూ!!
కాఫీటీలు మానేసి పాలో..వుమెన్స్ హార్లిక్స్ తాగి బలం పెంచుకోవాలా?పెద్దలాచరించిన సంప్రదాయాన్ని కొనసాగించాలా?
వంటపని తగ్గించి,పచ్చికూర ముక్కలసలాడ్స్ ,రైతాలూ తినడం పెంచాలా…?ఏమోబాబూ…నాలుగురకాలూతింటున్నామో..యీమాత్రమేనా ఉన్నామనుకోవాలా?
జాబ్ మానేసి యింటిపట్టునుంటున్నందుకు,మధ్యేమధ్యే మనకినచ్చిన చిరుతిళ్ళులాగిస్తూ చిరాతిచిరుకోరికలు కూడాతీర్చుకోకపోతే యెందుకీ బతుకూ?ఉద్యోగం రోజుల్లో పదకొండు కొట్టగానే పనికిమాలిన ప్లాస్టిక్ కప్పులోని కాస్త పిసరు టీ చుక్కలూ..బేంకు ఉద్యోగంలో ఎదురుగా నిలుచున్నకస్టమర్ దేవుళ్ళ కొరకొర చూపులకి చిరాకుపడుతూ,పూర్తిగా చల్లారాకా అటు తాగలేకా,యిటు పారబోసే వీలూ లేక గుటుక్కుమనిపించేవాళ్ళం..?
యిప్పుడా గోల లేనందుకు యింట్లో నాలుగు డబ్బాలూ చక్కపెడుతూ టైమ్ పాస్ చేయకపోతే..రాజీనామా కే సిగ్గుచేటనిపిస్తూ సంఘర్షణ!
ఎండాకాలమొచ్చింది..ఒంటికి చలవ,కాల్షియమ్ రిచ్చ్..అని రాగిజావ తాగుదామా….కష్టపడకుండా చల్లపెట్టెలోంచి తీసిన చల్ల ఆపళంగా తాగేస్తే పోతుందిగా..ఉత్త పనికల్పన కాదూ..!!యిలా శ్రమిస్తూ కూచుంటే వాట్సప్,ఫేసుబుక్కూ సిలబస్ కనీసం పూర్తి చేయలేక పోతున్నాం.
స్వీట్ల కెలాగూ నోచుకోలేదు..కనీసం కారా కోరిక కూడా తీర్చుకోకుండా ఏమిటట యీ జీవితం…?నో..కసితీరా కాకపోయినా కాస్తకాస్త అటొచ్చీ యిటొచ్చీ టకటకలాడించాల్సిందే..!!దీంతో..అతిథులకంటూ తెచ్చుకునే కరకరలు తొంభైశాతం స్వాహా!!మరోమాట..ఎక్కడెక్కడో…అందనంత ఎత్తుల్లో తినుబండారాలూ,డ్రైనట్లూ దాచడం మనకే పని పెంపు..!బులీమియా వ్యాధిగ్రస్తుల ప్రథమ లక్షణం..ఆకలున్నా లేకపోయినా,పనున్నా లేకపోయినా,మనసు ప్రశాంతంగా ఉన్నా..అలజడిగానున్నా…తోచినా తోచకపోయినా…అలా అలా అడ్డమైన సరుకూ ఆపకుండా లోపలకి తోసేస్తూ ఉండడమేనట!వారం సరుకు మరునాడే హాంఫట్!
తరువాతి అంశం.
అమ్మనేర్పిన నాలుగు పిండివంటలూ అడపా తడపాచేసుకోకపోతే..ఛీఛీ..మనం ఆడవారమేకాదు..!టచ్ లో లేకపోతే ఆకాస్త చేయాలన్నా దడ రావడం ఖాయం!!
ఆఁ..పిల్లలైనా దగ్గరలేరూ..డబ్బాలునింపుదామంటే..!
హా..అయినా యేంటిట..నూనెలో దేవేదీ..?.గంటలతరబడి వంటింటి వేడిలో మగ్గుతూ..!!నాలుగడుగుల్లో….విజయా,వెల్లంకి,అభిరుచీ,నారాయణా అంటూ మిఠాయి షాపులవారు యీగలు తోలే మిషన్లు కూడా పెట్టి పిలుస్తుంటేనూ!
నెలకి మాయిద్దరికీ ఒక్క నూనెపాకెట్టే అవుతుంది.అంతకంటే తక్కువెలాసాధ్యం చెప్పండి. వేపుళ్ళు కాకపోయినా పోపులకైనా నూనె కావాలా? నీళ్ళ పోపులేమైనా ఉంటాయా!!అయినావిడ్డూరమేంటంటే….యీమధ్యచేయించిన వైద్య పరీక్షల్లో.fatty liver అంటూ ఎత్తిపొడుపు రిపోర్టొకటొచ్చింది లెండి.అసలు సమస్యకి వైద్యానికెడితే…కొసరు లాగ!గాడిదగుడ్డుకాదూ..అని దాన్ని పట్టించుకోదలచుకోలేదులెండి.
సినీమా హాలు కెళ్ళి ఒకటే సినిమా కట్టేసినట్టు కూచుని చూసి ..వస్తూవస్తూ హోటలు హంగుల తిండి తిందామా… యింట్లో మనకి నచ్చిన భంగిమ లో కుర్చీలు మారుస్తూ,రిమోట్ తిప్పేస్తూ,యిష్టాను సారం ఖండాంతర సినీమాలు సైతం ఖండఖండాలుగా వీక్షిస్తూ..ప్రకటనల వేళ పలురకాలు సేవించడమా.?
యివన్నీ ఒక ఎత్తైతే,వ్యాయామానికి..సమయం కేటాయించడం ఓ గండమే !యిది యీ జన్మకి సాధ్యమయ్యే లా కనిపించడం లేదు.ఖాళీ పొట్ట తో చేయాలి.కడుపులో ముద్దపడందే ఊపిరి పీల్చడానికే శక్తి చాలదు..ప్రాణాయామం దేవుడెరుగు!” ఓ ”వయసు మళ్ళిన నాలాంటి వారు,నిపుణుల పర్యవేక్షణ లోనే ఆసనాలు వేయవలే..!ఈ రూలే నన్ను కాపాడుతోంది ఈ conflict నుండి.యోగా లో రెచ్చామో…మొదటికే మోసమాయే!
మన వయసెంతో అన్ని నిముషాలు మౌనంగా కూర్చోవాలట మెడిటేషన్ పేరుతో.దీనికి ఖాళీ పొట్టతో పనిలేదట!ఈ ఒక్కటీ వద్దుబాబూ అంటామెందుకో కదా ?దీనిని దాటవేసడానికి నెపం కరువైంది గా!
పోనీ కదా యిదేదో బాగుందంటే..సుమారు గంట..మౌనమే?!?సరే ..చపల చిత్తం తో కూర్చుంటే..నేచెప్పినసకలసంఘర్షణలఉత్తుంగతరంగాలతోపాటూ,అవధులు,పరిధులూ తోసిరాజనివిశ్వమంతా మూడోకంటి దగ్గర ప్రత్యక్షం!!ఎలా చెప్పండి??
యిలా ఎన్నని చెప్పనూ..అంతూ దరీ లేకుండా…?యివి కేవలం మచ్చుతునకలే సుమండీ!!వెండితెర చిత్రాలనూ,బుల్లితెర సీరియల్ కతలను మించిన సంఘర్షణలు కళ్ళు మూస్తే నా సొంతం!
*****