ప్రజలత్యాగం
-ఆదూరి హైమావతి
అనగా అనగా అమరపురి రాజ్యాన్ని అమరసేనుడు అనేరాజు ప్రజారంజ కంగా పాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు కష్టమన్నది తెలిక సుఖశాంతులతో హాయిగా జీవించసాగారు.
ఒకరోజున అమరసేనుడు మహామంత్రి త్యాగరాజుతో ఇష్టాగోష్టిగా మాట్లా డు తుండగా ప్రజలకు భగవంతునిపై ఉండే భక్తిగురించీ సంభాషణ మళ్ళింది. అమరసేనుడు “మంత్రివర్యా మన ప్రజలకు భగవధ్భక్తి కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తాను”అన్నాడు.
దానికి త్యాగరాజు “మహారాజా! ప్రజలకు కష్టమన్నది తెలీక పోటాన భగ వంతుని కూడా ఎంత మాత్రం గుర్తుంచు కుని ఉంటారో అని నాకు అను మానం” అన్నాడు.
దానికి అమరసేనుడు “మహామంత్రీ ! మీరు మానాయ న గారి కాలం నుంచీ రాజ్యసేవలో ఉన్నారు. అనుభవజ్ఞులుకూడా. మీరే మన ప్రజల దైవ భక్తి, త్యాగభావం గురించీ ఋజువయ్యేలా ఏదైనా పధకం అమలు పరచండి “అన్నాడు.
దానికి అమోదించి మహామంత్రి రాజాజ్ఞ ప్రకారం ఒక కార్యక్రమం ప్రారంభించాడు.రాజ పండితులతోనూ మిగతా మంత్రులతోనూ మాట్లాడి “ప్రజాక్షేమంకోరి మహారాజుగారు మన రాజధాని నడిబొడ్డున ఒక వినాయ క ఆలయాన్ని నిర్మించి ప్రజలంతా వచ్చిపోయేప్పుడు విజ్ఞాధిపతికి మొక్కు కుంటే వారికి పూర్తి క్షేమం కలుగుతుందని భావించి ఒక వినాయక మందిర నిర్మాణం చేయతలపెట్టారు.కనుక దానికి అవసర మైన ఏర్పాట్లు మనం ప్రారంభించాలి” అని చర్చించి నగరంలో ఒక దండోరా వేయిం చాడు.
“ప్రజలంతా వినండహో!మన మహారాజుగారు ప్రజా క్షేమంకోరి మన నగరం నడిబొడ్డున ఒక వినాయక మందిరాన్ని నిర్మించనున్నారు. ప్రజలంతా వారి శక్తికొద్దీ ధనాన్ని వినాయక ఆలయ నిర్మాణానికి త్యాగభావంతో సమర్పించుకుని వినాయక స్వామి అనుగ్రహానికి పాత్రులు కావలసిందహో!ఆలయ నిర్మాణ ప్రాంతాన ఉంచబడిన నాలుగు దిబ్బాల్లో సొమ్ము సమర్పించు కోండహో! “అనే దండోరావిన్న ప్రజలు , మరునాటినుంచే వరుసలుకట్టి కొంగులచాటున చేతులుంచుకుని సొమ్ము దిబ్బాల్లో వేయసాగారు.
మహారాజు అది తిలకించి “మహామంత్రీ చూశారా! మన ప్రజల దైవభక్తి, రాజభక్తీనీ! మీరు అనుమానిం చారు కానీ మనప్రజలు చాలా ఉత్తములు” అన్నాడు. మంత్రి నవ్వి ఊరుకున్నాడు. అనుకున్న ప్రకారం ఆలయ ప్రాకారం పూర్తైంది. ప్రధాన ఆలయనిర్మాణమూ ఐంది . శిల్పులు మంచి శిలను వెతికి తెచ్చి వినాయక విగ్రహాన్ని చెక్కసాగారు.చుట్టూతా మంటపాల నిర్మాణమూ పూర్తైంది. ఇహ మిగిలింది గర్భగుడిలో వినాయక విగ్రహప్రతిష్టమాత్రమే.
మహామంత్రి ఒకరోజున”మహారాజా! మనప్రజలు దైవానికి సమర్పించుకున్న ధనాన్ని విగ్రహప్రతిష్టసమయంలో వెచ్చిస్తే వారూ సంతోషిస్తారు. తమకూ ఆనందంగా ఉంటుంది .దిబ్బేలను తెరుద్దామా!” అన్నాడు. మహారాజు అంగీకరించాక ఆలయ సమీపాన తెరలు కట్టించి, దిబ్బేలను బోర్లించి రాజసన్నిధిన లెక్కించను కొందరు ఉద్యోగులను నిమయమించాడు మహామంత్రి.
దిబ్బేలను బోర్లించగానే వాటినుండీ జలజలా రాగి పైసలు రాలాయి. వెతికి చూద్దామన్నా ఒక్క వెండి నాణెంకానీ, బంగారు నాణెంకాని లేనే లేదు. మహారాజుకు దిమ్మతిరిగిపోయింది.తన అంచనాపూర్తిగా తల క్రిందు లైనందుకు వ్యతిరేకమైనందుకు బాధపడ్దాడు. మహామంత్రి ” ప్రబహూ! మీరేం బాధపడకండి. మానాయనగారు తమ తాతగారి హయాంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. ఇదిచూసి గుర్తువస్తున్నది. సెలవియ్యమంటారా! అని అడిగి, మహారాజు అనుమతి తీసుకుని ఇలాచెప్పసాగాడు.
“మహారాజా!తమ తాతగారు మీలాగే ప్రజాక్షేమంకోరి మన రాజ్య సరిహద్దులోనున్న కొండమీది మహాదేవుఁనికి శివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయతలచి ప్రజలందరూ కొండ ఎక్కలేరని భావించికొండ క్రింద కొన్ని పెద్ద పాత్రలు ఉంచి దుమ్ముపడకుండా వాటిమీద గుడ్డకట్టించి, ప్రజలను వాటిలో పాలుపోయమని దండోరా వేయించారు తమలాగే. ప్రజలంతా భక్తిగా చెంబులతో పాలు గొంగులచాటున పెట్టుకుని తెచ్చి పోశారు. తీరా పాత్రలు కొండపైకి చేరవేయను వాటి వాసినలు[ గుడ్డలు]విప్పి చూడగా ఎవరో ఒకరిద్దరు తప్ప అంతా నీరేపోసారు.’అందరూ పాలుపోస్తుండగా, నేనొక్కరినే నీరుపోస్తే ఏమవుతుందిలే, పాలలో కలసిపోతాయి.’అని భావించి అంతా నీరేపోసారు.ఎవరో ఒకరిద్దరుతప్ప ,మహారాజా ప్రజలు తమను తామే ఇలా మోసం చేసుకుంటూ ,ఇది వారి నైజం.అంతా అలాఉంటారనికాదు . సాధారణంగా అలాజరుగుతుంది.కనుక మీరేం బాధపడనక్కర లేదు. “అన్నాడు.
మహారాజు “మహామంత్రీ! మరి ఈ రాగిపైసలన్నీ ఏంచేద్దామం టారు.”అన్నదానికి మహామంత్రి,”మహారాజా! మన ప్రజల త్యాగానికిసాక్షిగా ఒకపనిచేద్దా మనుకుంటున్నాను, తమ అనుమతితో. ‘రాజభక్తికి నిదర్శనంగా ప్రజల త్యాగం’,అని వ్రాసి ఒకపెద్ద పైసానాణెం అచ్చుపోయించి ఈ ఆలయం ముందు ఉంచుదాం.” అన్నాడు.
మహామంత్రి తెలివికి మహారాజు సంతోషించాడు. అలా ఒక పెద్ద రాగి నాణేన్ని అచ్చుపోయించి ఆలయం ముందు ప్రతిష్టించారు.
వినాయక విగ్రహ ప్రతిష్టసమయంలోనే ప్రజలంతా అదిచూసి తమ మీద తమకే అసహ్యం కలుగగా వినాయక స్వామికి దండిగా, మెండుగా తమ శక్తికి తక్కువలేకుండా కానుకలు సమర్పించుకున్నారు.
మహారాజు మహామంత్రి తో సంప్రదించి ఆ సొమ్ముతో పేదలకూ, అనాధ వృధ్ధులకూ,వికలాంగులకూ కొత్తగా నగరానికి వచ్చిన వారికి ఉచిత ప్రసా దాల పంపిణీ అంటే ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశాడు.
*****