డాక్టర్ శివారెడ్డి కవిత్వం లో “ఆమె” ఒక ప్రధాన అంతః స్రోతస్విని. ఈ “ఆమె” స్త్రీయే. తల్లిగా తన పాత్ర నిర్వర్తించిన మహనీయురాలు. భార్యగా తన వంతు నిండుగా నిర్వహించిన సహచరి. కూతురుగా గారాలు పోయింది. తోబుట్టువుగా అనురాగాన్ని పంచింది. కానీ ఆమె ప్రాధాన్యాన్ని పక్కకు నెట్టి అన్ని విధాల అణగదొక్కుతుంటే ఎంతకాలం ఆమె సహిస్తుంది! పరిస్థితి చేజారిపోతోంది. స్త్రీవాదం మొదలైంది. చిగురించింది. ఉధృతరూపం దాల్చింది.
ఈ స్త్రీవాదం ఇలా ఉద్ధృత రూపం దాల్చక ముందే కె. శివారెడ్డి పురుషాధిక్య పరుషత్వాన్ని నిర్ద్వందంగా నిరసించారు. స్త్రీ పక్షపాతిగా కలం పట్టారు. “చేతివేళ్ల గుహ” అన్న శివారెడ్డి వాడిని ప్రతీక వివాహ వ్యవస్థ పేరుతో పురుషుడు స్త్రీని చేయటం సూచించ బడుతుంది . గుహ అనే మాటలో ఇక్కడ ఆ అర్థం ఉంది.
ఎప్పుడైతే మనం తల్లుల్ని, పెళ్ళాల్నీ, పిల్లల్ని అవమానించటం మొదలు పెట్టామో – అప్పుడే ఆడదాన్ని గోడ పక్కకి విసిరేసి ఒక ముద్ద అడుక్కునే మాంసం ముద్దగా చేసి పారేసాం..(ఆమె ఎవరైతే నేమి .పే 130)
శివారెడ్డి ప్రత్యేకంగా స్త్రీవాదం అని రాయకపోయినా తొలినాళ్ల నుండి స్త్రీని గురించే రాశారు. “శివారెడ్డి గారు రాసినంత విస్తృతంగా స్త్రీ ఇతివృత్త కవితలు రాసిన తెలుగు కవి మరెవరు లేరనే చెప్పాలి”-( పెన్నా శివరామకృష్ణ)
“శిశువుగా, బాలికగా, మగవాడి వంచనకు గురైన అభిమానవతిగా, ప్రపంచానికి ముకుతాడేసి తన వెంట నడిపించుకుపోతున్న ధీరగా, తన ప్రాణాన్ని పంచుతూ పురిటినొప్పులు సహించే మాతృమూర్తిగా, జీవ కారుణ్యాన్ని వర్షించే తల్లిగా, పురుషుడి అన్ని దాష్టీకాలను భరించే నిశ్శబ్దపు పసుపు ముద్ద లాంటి మధ్య తరగతి గృహిణిగా, స్కూటీ గుర్రం మీద దౌడు తీసే నేటితరం విద్యార్థినిగా, యువతిగా, ఉద్యోగినిగా….”
మానవత్వం లో దాగి ఉన్న స్త్రీ తత్వాన్ని ఆకళించుకున్న శివారెడ్డి-
” ఏ స్త్రీ జీవిత మైన
స్థలాలు వేరైనా
భిన్నంగా ఎందుకు ఉంటుంది!
( ఆ.ఎ.పే 130)
అని విశ్వజనీనమైన స్త్రీ తత్వాన్ని ఒక్కమాటలో చెప్తారు.
“ఒకానొక పొద్దుటి పూట” లో –
“నా చుట్టూ జీవన వాతావరణ లాగా మారిన ఆమె
నాలోని చైతన్య వారసత్వ వాతావరణంగా కూడా ఆమె..”
ఇలా శ్రమ సౌందర్యం లోని లాలిత్యాన్ని, సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని “గాలి”కి ముడిపెట్టి-
“గాలి మాత్రం ఆమెను వదలదు ఆమెనంటిపెట్టుకునే తిరుగుతుంది శ్రమలో చమటతో తడిసిన ఆమె వాసన అంటే ఎంతో ఇష్టం”-
అని అన్యాపదేశంగా చెప్పడం శివారెడ్డి ప్రత్యేకత.
“మాటిమాటికి పొట్ట తడుముకునే ఆ చిట్టి తల్లి పొట్ట లో
ఒక యుద్ధమున్నది
ఒక స్వర్గమున్నది
ఒక దేశమున్నది” ( పే. 83)
పొట్టను తడుముకుంటున్న ఆమె కళ్ళలో ఎన్నో కలలు! ఎంతో ఆశావహదృక్పథం! ఆమె పొట్టలో ఉన్న ‘మరో స్వప్నాన్ని’ చూడగలిగారు శివారెడ్డి. ఆ కవితలు చదువుతుంటే ఆయన ఆలోచనల్లో “ఆమె” ఎంత ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉందో అర్థమవుతుంది.
ఆమె ఎవరైతే మాత్రం అనే కవితా సంపుటిని స్త్రీ మూర్తులందరికీ అంటూ అంకితం చేయటం ఆయన విశాల దృక్పథానికి, వారి మీద ఉన్న గౌరవ భావానికి చెరగని చిరునామా. “ప్రేమించటం స్త్రీకి సహజంగా అబ్బిన గొప్ప లక్షణం. ఆ తత్వాన్ని నేను వీళ్ళ దగ్గర నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను”.( శివారెడ్డి-ఆంధ్రజ్యోతి దినపత్రిక. 8 అక్టోబర్ 2003)
“తొలి నమస్కారం మా నాయనమ్మ కే” అంటూ ” ఆమె నా కవిత్వానికి తొలి గురువు” అని ఆమెను ఆకాశానికెత్తి అందలం మీద కూర్చో బెట్టారు. ఆమె నేర్పిన అపూర్వ విషయాలను క్రోడీకరించి మరీ చెప్పారు. వ్యక్తుల అంతరంగాన్ని చదవగలగడం అనే అపూర్వ నైపుణ్యం ఆమె దగ్గరే ప్రయోగాత్మకంగా నేర్చుకున్నాను అంటారాయన. శివారెడ్డి జీవన విధానం ప్రప్రథమంగా రైతు హృదయం గ్రామీణ జీవన వ్యయం దాన్ని కవితా నయం చేయగల సౌందర్య ప్రతినిధులు ముగ్గురిని అద్భుతంగా చిత్రించారు వారిలో నిజాయితీకి ప్రతినిధిగా వ్యవసాయ పనులు చేయడంలో అందెవేసిన చేయిగా ఆయన మనోవీధిలో ముద్రవేసుకున్నాడు. మరో మహిళ శకుంతలమ్మ, మగవాళ్ళతో పోటీగా ఢీ కొట్టగల ధైర్యశాలి. వీరికి తోడు ఆయన జీవితానికి అండగా నిలబడ్డాడు ఆయన ఇద్దరు భార్యలు. “నా జీవన గమనంలో అప్పుడప్పుడు ఆగిపోయినప్పుడు ‘స్త్రీ’ని తలుచుకొని మరుక్షణంలో మళ్లీ జన్మిస్తూ ఉంటాను” అని అంటారాయన.
ఆమెకందరూ ఉన్నారు తల్లిదండ్రులు, బంధుకోటి, భర్త, పిల్లలు, ఎందరున్నా ఏకాకిగా మిగిలిపోతున్న ఈ దేశం ఆడది “ఆమె”. యుగయుగాల పవిత్ర దాసి “ఆమె”. అందరి జన్మలకు అభివృద్ధికి కారణభూతమైన ఆమె “ఆమె” గానే మిగిలిపోతుంది-
అంటూ ఈ దేశం లో స్త్రీ పట్ల పురుషుల కున్న చులకన భావనను ఎద్దేవా చేస్తారు శివారెడ్డి. “పురుష ప్రపంచాన్ని నీ అరచేతుల్లోనికి తీసుకొని చాచి ఒక లెంపకాయ కొట్టు తల్లి” అంటూ సిగ్గు ఎగ్గు లేని పురుషాహంకారాన్ని పరుషంగా తిరస్కరిస్తారు. ఇంతవరకూ ఈ దుస్సహ పురుష దురహంకారాన్ని సహనంతో భరించినందుకు ఇలా నమస్కరిస్తున్నారు –
” నా మొత్తం శరీరాన్ని రెండు చేతులు గా మార్చి నమస్కరిస్తున్నాను తల్లీ” (పే.23)
ఎంతటి అభిమానం! ఎంతటి అనురాగం !ఎంతటి గౌరవం !
ఆమె ఆది కదా
అన్నిటికంటే గొప్పదైనది తల్లి కదా మనకి దొరికిన తొలి స్పర్శ ఆమె కదా, మన నోట్లో తొలి కొత్త ఇన్ని అమృత బిందువులు చిలికింది ఆమె కదా ! ( పే. 25)
“అన్నీ అబద్ధాల మధ్య బహుశా
ఒకే ఒక్క నిజం ఆమె”. అంటూ
“ప్రవహించే స్మృతుల నదిలో” ఆమె ఔన్నత్యం శాశ్వతత్వాన్ని ప్రాణప్రదమైన జలం ఆమె – అని మరిచిపోలేని స్మృతులు మనం చేసుకుంటారు శివారెడ్డి.
“నన్ను కని అమ్మ వెళ్ళిపోయింది” – ఆ వెలితిని దాచి పెట్టుకోలేక
“నాతో బాటు ఓ మాటనూ
కని వుంటుంది
మొదటి చనుబాల చుక్కలు నాతోబాటు మాటనేతాపి వుంటుంది …..
అంటూ తన కవితా ప్రశస్తి కి ప్రతిభకు తన తల్లి తనకు తోబుట్టువు గా మాటను కూడా పని ఉంటుంది అనటం ఆయనలోని స్త్రీవాద భావజాలానికి జయకేతనం కావటం యాదృచ్ఛికం కాదు.
” కలం పట్టుకున్నప్పుడన్నా
అమ్మ కాకపోతే అక్షరాలెట్టా బతుకుతాయి
ఎట్టా ఎదుగుతాయి
ఎట్టా ఎగురుతాయి…( పే.29)
“తల్లి కో బహుమతి” అనే ఖండికలో తల్లి రుణం తీర్చుకోవడం బహుమతులతో తేలదని ఆమె గొప్ప హృదయం ముందు ఏ బహుమతులు అయినా చిన్న పోతాయని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన తొలుత ఊహించిన బహుమతి – 9 నెలలు కడుపులో ఉయ్యాల లూపినందుకు ప్రతిగా – ఉన్ని పరుపు పరిచిన ఉయ్యాల ఇవ్వ చూపటం! ఆమె మీద కాలేసి దిండుగా ఆమె పక్కలో పడుకున్నం దుకు ‘గాలిదిండు’ ఇవ్వాలనుకోవడం! కోరిన 50 రకాల వంటకాలను పెట్టినందుకు ఫైవ్ స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన భోజనం పెట్టేందుకు ఊహించటం! తను మందులు కొనుక్కోకుండా తనకు పుస్తకాలు కొనిపెట్టిన ఆ రోజులకు గుర్తుగా తాను రచయిత కాబట్టి ఒక వెయ్యి పేజీల నవల అంకితంగా ఇవ్వ చూపటం! తాను విధవరాలై తనకు వధువును చూసి పెళ్లి చేసిన అమ్మకు – వాళ్ళావిడ తో కలిసిన ఫోటో తల్లికి బహుమతి ఎందుకు ఇవ్వకూడదు…. ఇన్ని బహుమతుల్లో ఆమెకు ఏది నచ్చుతుందో, ఏది మెచ్చుతుందో అని తెలుసుకో చూసిన కవికి “చెవులకి పైన చెంపుల దగ్గర ఆ తెల్లటి పూలేమిటిరా, ఆరి దేవుడా కాస్త నల్లరంగు కొనుక్కొని వేసుకోరా తండ్రి” అనే సలహా లో తన కొడుకు క్షేమం గురించి ఆరాటపడే గొప్ప హృదయం ముందు ఎన్ని బహుమతులు అయినా బలాదూరే అని అనుకుంటాడు. అంత సీరియస్ గా నడుస్తున్న కవిత ఒక్కసారి చివరి వాక్యంతో నవ్వు పుట్టించినా, అందలి హృదయం గాంభీర్యం ముందు బహుమతులు అన్నీ ముక్కచెక్కలు అయ్యాయి. స్త్రీలోని మాతృ స్థానానికి అక్షర నివాళులు అర్పించారు శివారెడ్డి.
“ముళ్ళు”అనే కవితలో ఈ వ్యవస్థలోనే చెప్తూ.…
“ప్రస్తుతపు ఈ పరిస్థితిలో
ముళ్ళు తప్ప ఇంకేమి మొలవ్వనీ
వ్యవస్థాగత జాడ్యాల మధ్య
ముళ్లు తప్ప ఇంకేమీ మొలవ్వనీ”..
వ్యవస్థాగత జాడ్యాలు- అన్న మాటల్లోనే సంఘంలోని దురాచారాల రోగాల్ని, ఆర్థిక అసమానతల్ని, ఎగుడుదిగుడుల్ని, గుచ్చిగాయం చేసే ముళ్ళుతో పోల్చారు కవి.
శివారెడ్డి కవిత్వహృదయాన్ని పట్టుకున్నారు.బాగా రాసారు.అభినందనలు సుశీల గారూ