ఆశ్చర్యపరిచే మల్లాది సుబ్బమ్మ జీవితం
-ఎన్.ఇన్నయ్య
పురాణాలన్నీ పులిహోర వలె ఆరగించిన కొండూరు వారి వంశంలో సుబ్బమ్మ పుట్టారు. ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే పెళ్ళి చేసి పంపారు. తల్లిదండ్రులు 11వ ఏట వివాహం కాగా 13వ ఏట కాపురానికి వచ్చింది. బాల్య వివాహం తప్పుగా భావించలేదు. భర్త మల్లాది రామమూర్తికి 17 ఏళ్ళు. వరుసగా ఐదుగురు సంతానాన్ని కన్నారు. భార్యాభర్తలు తమ తప్పు గ్రహించి దిద్దుకోడానికి ఉపక్రమించారు. అంతటితో జీవితంలో గొప్ప మలుపు తిరిగింది.
రామమూర్తి కమ్యూనిస్టుగా ఆరంభించి, మానవవాదిగా పరిణమించాడు. సుబ్బమ్మకు పూర్తి సహకారం అందించాడు.
సుబ్బమ్మ పట్టుదలగా చదివి బి.ఎ. వరకు ముందుకు నడచింది. అంతే మళ్ళీ వెనక్కు చూడలేదు. తన స్వానుభవాలకు పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అనే రచనలో వివరించారు.
మహిళాభ్యుదయ సంస్థను నెలకొల్పి దూసుక పోయింది. నిర్విరామంగా రచనలు చేసి, 50 పుస్తకాలు రాసింది. వ్యాసాలు, కరపత్రాలు విపరీతంగా బయట పెట్టింది. ఆమె రచనలు కొన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. ఇస్లాంపై విమర్శనాత్మక రచనలు చేసిన సుబ్బమ్మపై ముస్లిం ఛాందసులు దాడిచేశారు.
సుబ్బమ్మ ఉపన్యాసకులుగా ఆరితేరి, మహిళోద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, చురుకుగా పాల్గొన్నారు. తెలుగు వారిలో సుబ్బమ్మ పేరు మారుమోగింది. మద్యనిషేధ కార్యక్రమంలో సుబ్బమ్మ పాత్ర గణనీయంగా సాగింది. ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతురాలైంది. మానవవాద ఉద్యమంలో బాగా కృషి చేసింది. సుబ్బమ్మ స్వీయగాథను ఫియర్ లెస్ ఫెమినిస్టు శీర్షికన ప్రచురితమైంది.
అమెరికా, ఇంగ్లండ్ పర్యటించిన సుబ్బమ్మ అనేకమంది మానవవాదులను కలసింది. తరువాత మహిళోద్యమంలో భాగంగా మహిళాభ్యుదయ సంస్థ స్థాపించి, అనేక సంఘాలకు సహాయం అందించింది.
మల్లాది రామమూర్తి 1999లో చనిపోయిన తరువాత సుబ్బమ్మ ఏమాత్రం పట్టుదల వదలకుండా, మహిళాభ్యుదయ, మానవవాద కృషి చేశారు. 2014లో చనిపోయేవరకూ పట్టుదలగా పనిసాగించారు. ట్రస్ట్ పెట్టి ఆస్తి అంతా మహిళా సేవకు దానం చేశారు.
ఉపన్యాసకురాలిగా మల్లాది సుబ్బమ్మ మంచిపేరు తెచ్చుకున్నారు. ఆశ్చర్యకరంగా పరిణమించిన సుబ్బమ్మ జీవితం అనన్యసామాన్యం! ఆమెతో సన్నిహితంగా మానవవాదిగా పనిచేయడం గొప్ప అనుభవం.
*****