ఒక భార్గవి – కొన్ని రాగాలు -8
ఆనంద భైరవి
-భార్గవి
ప్రాంతాలు వేరైనా ,భాషలు ఒకటి కాకపోయినా కులాలూ,మతాలూ జాతుల ప్రమేయం లేకుండా సమస్త మానవాళికి సాంత్వన నిస్తూ ఆనందాన్ని కలగజేసేది సంగీతం. అందుకే సంగీతాన్ని దైవభాష అంటారు.
దేశాన్ని బట్టీ,ప్రాంతాన్ని బట్టీ,కాలాన్ని బట్టీ —దేశీ సంగీతమనీ ,విదేశీ సంగీతమనీ,కర్ణాటకమనీ,హిందుస్థా నీ అనీ,జానపదమనీ,సంప్రదాయమనీ వివిధ రకాలుగా వర్గీకరించినప్పటికీ, ప్రాథమికంగా సంగీతం ప్రయోజనం ,వినే జనులకు ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ కలిగించడం,ఉద్వేగాలని ఉపశమింప జేయడం
అలా మనసును శాంత పరచి,ఆనందాన్ని కలగ జేసే గుణం వున్న కొన్ని రాగాలలో ఆనంద భైరవిని ప్రత్యేకం గా చెబుతారు.నిజంగానే ఆనందభైరవి స్వరాలలో మనసుని ఊయలలూపే ఒక అపూర్వమైన శక్తి దాగి వుంది,అందులో లీనమైన వారికి అప్రయత్నంగా ఒక సాంత్వన దొరుకుతుంది,అందుకేనేమో మన సంప్రదాయ సంగీతంలోని చాలా లాలి పాటలు ఆనందభైరవి రాగంలోనే వుంటాయి.
భైరవి అనేది ఆదిశక్తి కి వున్న అనేక నామాలలో ఒకటి,ఆనందాన్ని కలగజేసే శక్తి వున్న రాగం కాబట్టి ఆనంద భైరవి అయింది.
ఇది చాలా ప్రాచీనమయిన ,మధురమైన రాగం .ప్రాచీనమైన అని అనడానికి కారణం ఇందాక చెప్పుకున్నట్టు అనేక సంప్రదాయ గీతాలూ,లాలి పాటలూ,జానపద గీతాలూ ఈ రాగంలో వుండటమే అనుకుంటా.
రాగ లక్షణం గురించి చెప్పాలంటే ఇది 20వ మేళకర్త అయిన నటభైరవి నుండీ జన్యము,కొంతమంది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ నుండీ జన్యము అంటారు.ఇది సంపూర్ణ రాగము అంటే ఏడు స్వరాలూ వుంటాయి ,అయితే రాగ ఆరోహణలో స్వరాలు వరసగా రాకుండా వంకరగా రావడం వలన “వక్ర రాగం” అంటారు (సగరిగ మ పదపస–సనిదప మగరిస).అంతే కాదు జనక రాగం లో లేని స్వరం కనక వస్తే దానిని అన్య స్వరం అంటారు,అలా ఒకటి కంటే ఎక్కువ స్వరాలు వస్తే దానిని “భాషాంగ రాగం” అంటారు . ఆనంద భైరవిలో రెండు అన్య స్వరాలు ప్రయోగిస్తూ వుంటారు కొందరు , అప్పుడు దానిని భాషాంగ రాగం అంటారు.ఇంకా చెప్పాలంటే “రీతిగౌళ” లో కూడా ఇవే స్వరాలు వుంటాయి కానీ పాడేటప్పుడు వచ్చే స్వర గుఛ్ఛాల అమరిక వలన అది విభిన్నంగా వినపడుతుంది,అందుకే ఈ రాగాలు పాడేటప్పుడు రాగ లక్షణాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకుని పాడాలి గాయకులు,నిజంగా వారికది కత్తి మీద సామే!
త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితర్ ,శ్యామ శాస్త్రి వీరిని కర్ణాటక సంగీతం లో త్రిమూర్తి త్రయం అంటారు ,వారిలో శ్యామ శాస్త్రి ,కంచి కామాక్షి అమ్మ వారిని తన సోదరిగా భావించుకుని ఆరాధించాడు,ఆయన రాసిన కీర్తనలలో “శ్యామకృష్ణ సహోదరీ “అనే మకుటం వుంటుంది.
శ్యామశాస్త్రి ఆనందభైరవిని బాగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు ,ఆయన రాసిన చాలా కీర్తనలు ఈ రాగంలోనే వున్నాయి,ఆయన ఈ రాగం లోఅన్య స్వర ప్రయోగం కూడా చేసే వారు.ఆయన రాసిన కీర్తనలలో “మరి వేరే గతి ఎవరమ్మా,ఓ జగదంబ”ప్రఖ్యాతి చెందినవి.
మన సంప్రదాయ గీతంగా ,చాలా మంది ఇళ్లల్లో వినబడే “కస్తూరి రంగ రంగా నాయన్న కావేటి రంగ రంగా”అంటూ సాగే శ్రీకృష్ణ జననం పాట వున్నది ఆనంద భైరవి లోనే
అంతే కాదు చాలా జానపద గీతాలలో అంతర్లీనంగా వినపడేది ఆనంద భైరవే–
మహిళలు పాడుకునే ఎన్నో మంగళహారతులు కూడా ఈ రాగంలోనే వున్నాయి”హారతీ మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతీ మీరేల ఇవ్వరే “అని రేడియోలో వినపడుతూ వుండే పాట అందుకు ఒక ఉదాహరణ,మా ఇంట్లో యే శుభకార్యమయినా పాడే మంగళహారతి “కర్పూర హారతి కరుణతో గైకొను కనకాంబరధరా”కూడా ఈ రాగంలోనే వుందని ఈ మధ్యనే గమనించాను
ఇక లాలి పాటలు సరే సరి.
ఈ రాగంలో సంగీతం నేర్చుకునే విద్యార్థులకి కస్తూరీ పరిమళం లాంటి “కమల సులోచన విమల తటాకిని ,మరాళ గామిని కరిహరమధ్యే “అనే గీతాన్ని నేర్పుతారు
వీణ కుప్పయ్యర్ కూర్చిన “సామి నీపై “అనే అటతాళ వర్ణం కూడా ఆనందభైరవిలో నేర్చుకోవచ్చు
ఇక కీర్తనలూ ,కృతుల విషయాని కొస్తే త్యాగరాజు “క్షీరసాగర విహారా,నీకే తెలియక పోతే ” బాగా పేరొందినవి ,అయితే ఈ రాగం విషయంలో ఒక కథ ప్రచారంలో వుంది. కూచిపూడి భాగవతులు తమ ప్రదర్శన చూసి మెచ్చుకున్న త్యాగరాజ స్వామిని “ఆనంద భైరవి “రాగాన్ని తమకు బహుమతిగా ఇవ్వమన్నట్టు ,అప్పటినుండీ వారి అభ్యర్థన మేరకుఆయన ఈ రాగంలో కీర్తనలు రాయలేదన్నట్టు ,ఈ రాగంలో వున్న కొద్ది కీర్తనలూ ఆయన అంతకు ముందే రాసినట్టూ చెబుతారు ,నిజానిజాలు తెలీవు.
ముత్తు స్వామి దీక్షితర్ నవావరణ కీర్తనల్లోని “కమలాంబ సంరక్షతు,మానస గురు గుహ” చాలా ప్రధానమైనవి.
చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై “మధురా నగరిలో చల్లనమ్మ బోదు దారి విడుము కృష్ణా” అనే జావళీ కూచి పూడి భాగవతుల నృత్యాంశాలలో ముఖ్యమైనదీ,పేరొందినదీ,దీనినే వారు త్యాగరాజు ముందు ప్రదర్శించారంటారు.
“ఇట్టిముద్దులాడె బాలుడేడ వాడే
వాని పట్టితెచ్చి పొట్టనిండ పాలు వోయరే”–అనే పచ్చ కర్పూరం కలిపిన,చిక్కని మీగడ పాలలాంటి అన్నమయ్య పదమూ,
“కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని”—అనే పచ్చి పసుపుకొమ్ములాంటిఅన్నమయ్య పదమూ కూడా వున్నది ఆనందభైరవిలోనేనండోయ్ !
“పలుకే బంగారమాయెనా కోదండ పాణి” అనే భద్రాచల రామదాసు కీర్తన సంగతి వేరే చెప్పాలా?
ఇంక సినిమా పాటలు చెప్పుకోవాలంటే మిగతా రాగాలంత విరివిగా ఈ రాగంలో లేవనే చెప్పుకోవాలి.
“మంచిదినమూ నేడే మహరాజుగా రమ్మనవే “అనే మూవనల్లూరు సభాపతయ్య విరచిత జావళీ “స్వర్గ సీమ” సినిమాలో భానుమతి పాడింది, నాగయ్య సంగీత సారథ్యంలో,దీని గురించి వి.ఎ.కె .రంగారావు గారు చాలా సార్లు చెబుతుంటారు.
“మిస్సమ్మ” సినిమా లో “శ్రీ జానకీ దేవి శ్రీమంత మలరె” ,పింగళి నాగేంద్ర రావు రచన,సంగీతం యస్ .రాజేశ్వరరావు—అసలు పెళ్లే కాని కన్నె పిల్లకీ శ్రీమంతం జరుపుతూ పాడే ఈ పాటతో కథ ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది
“బంగారు పాప” లో “తాథిమి తకథిమి తోల్ బొమ్మా తోం తకతై తకతై మాయబొమ్మా” కి రచనా, వరసా బాలాంత్రపు రజనీ కాంతారావుది అయితే సినిమాలో ఆయన పేరుండదు, ఈ తాత్త్విక గీతాన్ని పాడింది మాధవపెద్ది సత్యం ఈ సినిమాకి సంగీతం కూర్చింది అద్దేపల్లి రామారావు
“శ్రీ కృష్ణార్జున యుధ్ధం” లో బి.గోపాలం,స్వర్ణలత పాడిన “అంచలంచలు లేని మోక్షము “అనే పాటకి ఆధారం ఆనంద భైరవి–రచన పింగళి,సంగీతం పెండ్యాల
ఘంటసాల సంగీతం సమకూర్చిన “పెళ్లిచేసి చూడు” సినిమాలో ఒక జోలపాట వుంది,పామర్తి ,జి.వరలక్ష్మి,పి.లీల కలిసి పాడతారు,అదికూడా ఆనంద భైరవి ఆధారంగా చేసినదే
“ఆనంద భైరవి” సినిమాలో “పిలిచిన మురళికి పలికిన మువ్వకు” —రచన వేటూరి ,సంగీతం రమేష్ నాయుడు,చాలా చక్కగా వుంటుంది
రమేష్ నాయుడు సంగీత సారథ్యం లోనే “చిల్లర కొట్టు చిట్టెమ్మ “చిత్రంలో బాలూ,జానకీ పాడిన “సువ్వీ కస్తూరి రంగ,సువ్వీ కావేటి రంగ” కి ఆధారం ఆంద భైరవి ,ఈ పాట రచన దాసం గోపాల కృష్ణ
“బడిపంతులు “చిత్రానికి ఆచార్య ఆత్రేయ రాసిన “మీ నగుమోము నా కనులార కననిండు “అన్న పాటకి కె.వి.మహదేవన్ ఆనంద భైరవిలో బాణీ కట్టి సుశీలతో పాడిస్తే అది అద్భుతమైన హిట్టయ్యింది
“మెరుపు కలలు” చిత్రంలో ఎ.ఆర్ .రహ్మాన్ సంగీత కూర్చిన”అపరంజి మదనుడే ” ని శ్రావ్యంగా పాడింది అనూరాధా శ్రీరామ్
ఇన్ని ఛాయలలో ,ఇన్ని విధాలుగా మీ ముందు పరచిన ఆనందభైరవి మీకు ఆనందాన్ని కలిగించి వుంటుందని భావిస్తూ–
*****
వృత్తి వైద్యం—-MBBSDA
ప్రవృత్తి—–సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి,అభిరుచి
బదరీ పబ్లికేషన్స్ తరుఫున ప్రచురించిన పుస్తకాలు
1.ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు వి.ఎ.కె. రంగారావుగారి వ్యాస సంకలనం “ఆలాపన”
2.కస్తూరి నరసింహ మూర్తి గారి ఉమర్ ఖయ్యా మ్ రుబాయీల తెలుగు అనువాదం “మధుకన్య”
3.టాగూర్ “గీతాంజలి”కి తెలుగు అనువాదం,ప్రఖ్యాత చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ వర్ణ చిత్రాల సహితంగా——స్వీయరచన
4.వివిధ విషయాల గురించి రాసిన వ్యాస సంకలనం “ఒక భార్గవి”—స్వీయ రచన
5.అమెరికా,గుజరాత్ ల ప్రయాణవిశేషాలను వివరించే “ఒక భార్గవి-రెండు ప్రయాణాలు”—-స్వీయ రచన