కనక నారాయణీయం -14
–పుట్టపర్తి నాగపద్మిని
కొప్పరపువారు పరీక్ష వివరాలన్నీ కనుక్కున్నారు.
వారి ఆప్యాయత చూసి పుట్టపర్తి చెప్పారు, తాను ఒకే ప్రశ్న మూడు గంటలూ వ్రాసినట్టు!!
ఆశ్చర్యపోవటం కొప్పరపు వారి వంతైంది.
‘ఏందీ?? మూడూ గంటలూ కూచుని ఒకే ప్రశ్నకు జవాబు రాసినావా??’
మౌనవే సమాధానం. తాను ప్రొద్దుటూరిలో అడుగుపెట్టినప్పటినుంచీ, తనకు పెద్దదిక్కుగా నిలిచిన వారిముందు, మరో సమాధానం ఏమిచెప్పగలడు తాను??
ఐతే మరి…రిజల్ట్ వచ్చిందిగదా?? ఏంజెయ్యాలనుందిప్పుడు?? అడిగారు కొప్పరపు సుబ్బయ్య.
‘ఏముంది..మల్లీగట్టుకోవాల పరీచ్చకు!!’ఎవరో అందించారు, పక్కనుండీ!!
‘..ఆ పనేందో తొందరగా జూసుకో పుట్టపర్తీ!!’ అని లేచారాయన, ఇక అందరికీ పుట్టపర్తి గురించి మాట్లాడేందుకు మరో అవకాశం ఇవ్వకుండా!!
పుట్టపర్తి ఇంటికి చేరుకున్నారు. భార్య కనకవల్లి బుడ్డీ దీపం వెలిగించి, భర్త రాకకోసం ఎదురుచూస్తూ కూర్చునివుంది.
అన్యమనస్కంగానే సాపాటు ముగించి నిద్రకుపక్రమించారు దంపతులీద్దరూ!! కానీ పుట్టపర్తి మనసులో ఆవేశాం చల్లారలేదు!!
తాను వ్రాసిన పుస్తకం తనకు పాఠ్యగ్రంధంగా ఉండటం అన్న గొప్ప చారిత్రాత్మక సన్నివేశం !! మూడుగంటలూ ఒకే ప్రశ్నకు సమాధానం తాను వ్రాయటం!! తానేమీ ఆశించి యీ పని చేయలేదు!! అనాలోచితంగానే యీవిధంగా జరిగింది!! ఈ కారణంగానే తాను అనుత్తీర్ణుడవటం!! విశ్వవిద్యాలయ నియమావళి దృష్టి ప్రకారం అది సబబే కావచ్చు. కానీ దిద్దేవారికి ఆ విద్యార్థికి ఆ రచనపై ఉన్న ఇంతటి లోతైన అవగాహన గురించి ఒక్క చిన్న ఆశ్చర్యమూ కలుగక పోవటం,దాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళకపోవటమూ – పేపర్లు దిద్దేవారి ఒక యాంత్రిక లేదా ఉదాసీన పద్ధతిగా అనిపిస్తూ, అసహనంగా ఉంది.
తన అసహనతను విశ్వవిద్యాలయం వారి దృష్టికి తీసుకువెళ్ళే మార్గమేమిటి?? ఠక్కున, తాను శిరోమణి ప్రవేశం లభించనప్పుడు, ఎలుగెట్టి ఆశుకవితా ధోరణిలో సంస్కృతంలో శ్లోకాల రూపంలో తన ఆవేదనను వ్యక్తపరచటం, అప్పటి ప్రాచార్యుడు, కపిస్థలం కృష్ణమాచార్యులకు తన ఆ ఆవేశపూరిత శ్లోకాలు బాగా నచ్చి,వెంటనే వెనక్కి పిలిపించి, తాను కోరిన తరగతికన్నా పై తరగతిలో ప్రవేశo కల్పించటం, కళాశాలలో ఆవిధంగా తన పేరు మారుమ్రోగటం – యీ సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. వెంటనే పడుకున్నవాడల్లా లేచి, మళ్ళీ బుడ్డీ దీపం వెలిగించుకుని, కరణం బల్ల దగ్గర కూర్చుని, వ్రాసుకోవటం మొదలెట్టారు వారు.
నిద్ర పట్ట క అటూ ఇటూ పొర్లుతున్న కనకవల్లి, భర్త ఇలా పడుకున్నవాడల్లా లేచి, మళ్ళీ కరణం బల్ల ముందు కూర్చోవటం చూచి, ఆశ్చర్యపోతూ,మంచి నీళ్ళ చెంబు దగ్గర పెట్టి, తాను వెళ్ళి నడుము వాల్చినా, మదిలో కలకలం.
భర్త కోపమూ, ఆవేశమూ కారణంగా, పెళ్ళికి ముందు జరిగిన రెండు మూడు సంఘటనల గురించి చెప్పి, అమ్మ శేషమ్మ తనను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన వైనమూ – అన్నీ గుర్తుకు వచ్చి, ఆందోళిత హృదితో, ఆలోచనల్లో మునిగిపోయిందా ఇల్లాలు!! భళ్ళున తెల్లారింది కూడా!!
మళ్ళీ కొత్త రోజు మొదలు!!
పుట్టపర్తి తాను తయారు చేసుకున్న కాగితాలను జేబులో సర్దుకుని, పదిగంటలకు ఇంటిలోనుండి బయలుదేరి వెళ్ళీపోయారు మామూలుగా!! భర్త ముఖాన యే భావమూ గుర్తించలేక తల్లడిల్లిపోయిందా ఇల్లాలు ఇంటిలో!!
కొన్ని రోజులిలాగే గడిచిపోయాయి, మమూలుగా, కనకవల్లికి!!
కానీ పుట్టపర్తికి అలా కాదు!! విద్వాన్ పరీక్ష తప్పిన సంగతి పొక్కిపోయింది!! కొప్పరపు సుబ్బారావు గార్ర్ తనపట్ల ప్రదర్శించే గౌరవంలో యేమాత్రం మార్పు లేనప్పటికీ, అప్పటికే అక్కడున్న లబ్ధ ప్రతిష్ఠ కవుల శిష్యులు పాఠశాలలో తనగురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసే వ్యాఖ్యల వల్ల మనసు చాలా కల్లోలంగా ఉంది!! కానీ యే రకంగానూ బైటపడకుండా, నివురుగప్పిన నిప్పువలెనే ఉన్నారాయన!!
విద్వాన్ పరీక్ష తాను తప్పిపోయానన్న సంగతి పొక్కినప్పటినుంచీ, ఇటువంటి సూటి పోటి మాటలు అప్పుడప్పుడూ తాను వింటూనే ఉన్నాడు. పోనీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిప్దామంటే, ఎక్కడికి పోవాలో తోచదు!!
పైగా పెద్ద జమాలప్ప తోడ్పాటుతో, కర్ణాటక సంగీత సాధన మళ్ళీ మొదలైంది!! చిన్నప్పుడు తాను నేర్చుకున్న వర్ణాలూ, కీర్తనలూ కాకుండా, కొత్తగా జావళులూ, పదాలూ కూడా జమాలప్ప నేపుతానన్నాడు. మైసూరు చౌడయ్య శిష్యుడీ జమాలప్ప!! ఆయనవలెనే ఏడు తంత్రుల వయొలిన్ చాలా అనాయాసంగా వాయించే జమాలప్ప తనకు యీ ప్రొద్దుటూరులో దొరకడం ఎంతో అదృష్టం!!అదేమిటో, ఇటీవల తనకు కొన్ని కీర్తనలు సొంతంగా రాయాలని కూడా అనిపిస్తూఉంది!! ఇక్కడే ఉంటే, జమాలప్ప సహకారంతో ఆ పని కొనసాగించవచ్చు!!’ ఇదీ పుట్టపర్తి మనసులోని ఘర్షణ!!
ఇదిలా ఉండగా ఒక రోజు పుట్టపర్తి పనిచేస్తున్న కన్యకాపరమేశ్వరి పాఠశాలలో ఒక చెట్టుకింద కూర్చుని పుష్పదంతుని ప్రాకృత రచన గవుడవహో చదువుకుంటూ ఉన్నారు!! తనకెంతో ఇష్టమైన ఆ కావ్యంలోని వర్ణనలూ, ముఖ్యంగా అందులోని వృత్తమూ ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు మరి!!
ఒక బంట్రోతు వచ్చాడు వారిని వెదుక్కుంటూ!! ‘అయ్యా!! కొప్పరపు సారు మిమ్మల్ని పిలుచుకోని రమ్మన్నారయ్యా!!’ అని చెబుతూ!!
పుట్టపర్తి తాను తాగుతున్న బీడీ ఆర్పి, అతని వెంట నడిచారు.
కొప్పరపు వారి గదిముందు, కొందరు పాఠశాల అధ్యాపకులు నిలబడి ఉన్నారు. ఒకరిద్దరు, పుట్టపర్తిని చూసి, చిరునవ్వు మొహం పెట్టినా, కొందరి మొహాల్లో ఏదో అసహనం కనిపిస్తూనే ఉంది పుట్టపర్తికి!! అది వాళ్ళ జన్మ లక్షణం పోనీ అనుకున్నారు ఉదాసీనంగా!!
పాఠశాల గదుల మధ్యనుండీ నడుస్తున్నారు పుట్టపర్తి.
అదుగో..ఆ మలుపు తిరిగితే..వచ్చేస్తుంది..సుబ్బారావుగారి గది!!
ఇంతలో మాటలు..కాస్త చిన్నగా..పుట్టపర్తి నడక వేగం తగ్గించారు.
‘అదుగో..ప్యూన్ పొయ్నాడుగదా పిల్చుకోని రావడానికి!! వస్తాడు..వస్తాడు!! అభినవ వాల్మీకి!! రానీ రానీ!! అయ్యగారి సంగతి ఇప్పుడే తేలిపోతుంది..!!’కిసుక్కున నవ్వు!!
‘మదరాసు విశ్వవిద్యాలయంలో అయ్యగారికి పోస్ట్ వచ్చిందేమో!!’
‘సడేలే!! పరీక్ష పాసయ్యేదానికి రావాల్సిన ముప్పై ఐదు మార్కులకే దిక్కులేదు. ఇంక పిలిచి పీటేసి కూచోబెట్టెదానికీమహానుభావుడేమన్నా కాళిదాసా, భవభూతా??’
తనంటే..ఇంత అసహనముందా ఇక్కడి వాళ్ళలో?? తాను వాళ్ళ జోలికి వెళ్ళనే వెళ్ళడే అస్సలు?? మరెందుకు తనంటే ఇంత కసి వీళ్ళకంతా??
ఎర్రని ముఖంతో మలుపు తిరిగి, ఆ మాటలొస్తున్న వైపుకు చూడకుండా నేరుగా సుబ్బారావుగారి గదిలోకి ప్రవేశించారు పుట్టపర్తి.
‘ఆచార్లూ!! కూచోవయ్యా!! స్కూల్ కేరాఫ్ అడ్రస్ తో నీ పేరిట మదరాసు విశ్వవిద్యాలయం నుంచీ ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చిండాది!! అదేందో చూదు. ఇదో..ఇక్కడే చూడు. ఏమి రాసినారో ఏమో మల్ల??’
దాన్ని వారినుండీ అందుకున్నారు పుట్టపర్తి!!!
రిజిస్టర్డ్ పోస్ట్, పైగా బరువుగానూ ఉంది!!
“ఏముంటుంది అందులో!!’
ఇదీ పుట్టపర్తి మనసులోని ఘర్షణ!!
స్కూల్ ప్యూన్ ఉత్తరం తెరిచి అందించాడు.
సుబ్బారావు గారి ముఖంలోనూ ఉత్కంఠ!!
పుట్టపర్తి మనసులో తాను ఉపాసించే అష్టాక్షరీ నాథుణ్ణి తలచుకుంటూ చదువుతున్నారు. ఆంగ్లంలో ఉన్న ఆ ఉత్తరం సారాంశం చదివి పుట్టపర్తి పెదవులమీద చిరునవ్వు మళ్ళీ విరిసింది!
పుట్టపర్తి వైపే ఆత్రుతగా చూస్తున్న కొప్పరపువారికి ఆశ్చర్యమనిపించింది!!
‘ఏముంది ఆచార్లూ ఆ ఉత్తరంలో??’అడిగారు వారు!!
పుట్టపర్తి నవ్వుతూ, దాన్ని కొప్పరపు వారికి అందించారు. పుట్టపర్తి వైపే ఆత్రుతగా చూస్తున్న కొప్పరపువారికి ఆశ్చర్యమనిపించింది!!
‘ఏముంది ఆచార్లూ ఆ ఉత్తరంలో??’అడిగారు వారు!!
పుట్టపర్తి నవ్వుతూ, దాన్ని కొప్పరపు వారికి అందించారు.
కొప్పరపు వారు దాన్నందుకుని చదివేశారు.
పైనుండీ కిందవరకు వచ్చేసరికి, వారి ముఖంలోనూ ఆనంద తాండవమే!!
‘చదవడం పూర్తి కాగానే, తాను కూర్చున్న కుర్చీలోనుంచీ ఒక్క ఉదుటున లేచి వచ్చి, పుట్టపర్తిని సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు వారు – ముఖం వెలిగిపోతుండగా!!
‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు వేడి వేడి కాఫీ దీసుకురా పో!! ఐనా ఆచార్లూ?? ఈడ గూర్చో!! ఇంతకూ ఏం రాసినావు ఆ యూనివర్సిటీ వాల్లకు??’
(సశేషం)
****
ఫోటో : పుట్టపర్తిని ప్రొద్దుటూరులో ఆదరించిన శ్రీ కొప్పరపు సుబ్బయ్య శ్రేష్టి గారు