గోర్ బంజారా కథలు-2
పాడ్గి (పెయ్య దూడ)
-రమేశ్ కార్తీక్ నాయక్
( 1 )
ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు. తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది.
‘బఱ్ఱె ముందే సూడిది, ఇయ్యాల రేపు అన్నట్లు ఉంది.ఎక్కడ తప్పిపోయిందో’ అనుకుంటా ధపాధప్ అడ్గులు ఏస్తూ నడ్చింది. ఆమె అడ్గులకు పైన అద్దాల ముస్గు నుండి కింద కాలి మెట్టెల దాకా గేణో(ఆభరణాలు) ఆమె గుండె సప్పుడుతో కల్సి టకాటక్కుమంటున్నయి.
అడ్వి నుండి తండాకు అచ్చే దారి మధ్యల ఎండిపోయ్న పొడ్గు సెట్ల కింద ఆడాడ పెర్గిన గడ్డిని తాపీగా మెక్కుతా కన్పించింది బఱ్ఱె.
‘నా పిల్లలు ఇంట్ల ఉండి ఉంటే ఆల్లే ఈ పనులన్నీ సూస్కునేటోళ్లు. బఱ్ఱె రెండు కొమ్ముల్ను అటూ ఇటూ పట్కుని ఈడ్చుకు తెచ్చేటోళ్లు, ఏం సేస్తున్నరో, ఏందో!’ అనుకుంటా తన ఛాతీ మీది నుండి చెయ్యి తిప్పుకుని, “అవును నేను కడ్డు అడదాన్నే”. ఇంకా నా బచ్చి ఖాళీ కాకుండనే పిల్లల్ను హాస్టల్కి పంపిస్తిని.’ అనుకుంటా బఱ్ఱె ముఖాన నడ్చింది. సేవు వాసన పసిగట్టింది బఱ్ఱె. సెవుల్ని కదిలిస్తా బొమ్మలా నిల్సుంది.
“నీకు నేను ఏం తక్కువ సేస్నా” మన్సుల నిష్టూరపడింది. ‘ధా…… హల్యా…….’ అంది బఱ్ఱె మెడల తాడు వట్కుని,రంగురంగుల గవ్వలతో నిండిన ఆ తాడును ఊపుకుంటా కొంచం కద్లింది బఱ్ఱె. సేవు తన సేతిలోని బొక్క గాజుల్తో బఱ్ఱె నడ్డిమీద సర్సింది.
బఱ్ఱె తోకతో తన మీద వాల్తున్న పుర్గుల్ని చెదరగొడ్తు నీళ్ళల రాయి ఏస్తే అచ్చే రింగురింగుల అలల్లా తన ఖాల్డిని(చర్మాన్ని) కద్లిస్తుంది . ‘ఇంగా సాలు నడు’, అన్నట్లు బఱ్ఱె తోక గుంజింది సేవు.
ఏసుకున్న బట్టల బర్వుతో సేవు , కడ్పున ముద్ద బర్వుతో బఱ్ఱె, నడుస్తున్నరు. ‘జప్పన నడువు లండి’, బఱ్ఱె తోక పట్కుని ఇంగోసారి లాగింది సేవు. బఱ్ఱె ఆగమై ఒక్కసారిగా తొందర అందుకున్నది.
సేవు బర్రె ఎన్కనే అగం ఆగం నడ్సింది.ఏడ సేవు కళ్ళు కప్పి పారిపోతదేమో అని. ఆ ఆగంల సేవు కాలి బొటన ఏలు రాయికి తగ్లి సగం గోరు ఊడింది. “చూత్ మరావ్ణి, లంజా, లండి’ అని తిడ్తా కాల్ని దుల్పింది. బఱ్ఱె తోకని చేత్లోకి తీస్కుని, “హల్యా….. హళ్యా…..” అంటూ బఱ్ఱె అడ్గులకు లేస్తున్న దుమ్ముల నడుస్తా, దారి పొడ్గున అడ్డు అచ్చిన తోండలను, కోళ్లను, కోతులను దాట్కుని తండాకు పోయింది.
తండాలో అందరూ ఎవరి పన్లల్లో ఆల్లు బర్రెలను కట్టేసి, వాటి ముందు గింత గడ్డేసి,పొయ్యి ఎల్గించుకుని మక్క రొట్టెలు చేయనికి
పిడియా(పీట) మీద కూర్చున్నరు. దొంగ కోళ్లు ఇంకా కొమ్మల నుండి కిందికి దిగనేలేవు, ఆడాడ గండుపిల్లులు కోడి పిల్లల కోసం ఏటను చాలు చేసినై.. ఇంకా సూర్యుడు మొత్తంగా మాయం కాలే. ‘తన పని ఎప్పుడు అవుతుందో’ అనుకుంటా, బఱ్ఱె కొమ్ములనే గమనిస్తా నడ్సింది. ఇల్లు చేరుకుండ్రు.
ఇంటి ఎన్కాల షెడ్డులో బర్రెనీ ఇన్ప చైనుతో కట్టి బకెట్ నీళ్ళల రెండు పిడికిళ్ల తౌడేసి బఱ్ఱె ముందు పెట్టి అది తాగేదాక ఆగి దాని తల కాడా ఎంట్రుకలకు తట్టుకుని ఉన్న పల్లేరు ముళ్ళను పీకి ఓ దగ్గర కుప్ప పోసింది సేవు.బఱ్ఱె తౌడునీళ్ళు తాగేసి మూతి ముక్కుని నాక్కుంటా సేవు కళ్ళలోకి ఇంకా కావాలి అన్నట్లు సూస్తా ఉంది.
బఱ్ఱె తల నుండి మూతి వేపు ఓ సేతితో నిమిరి, ఏదో తేడాగా అ న్పించి బఱ్ఱె నాల్కను చటుక్కున పట్టుకుని నాల్క కింద ఉన్న నరాలను సూసింది. రక్త సరఫర తగ్గినట్లు అన్పించింది. బఱ్ఱె నాల్కని వెనక్కి లాక్కోనికి గింజుకుంది. ఆమె నాల్కను వదలగానే ఓ నిమిషం పాటు నోరు తెర్వకుండా ఉండిపోయింది బర్రె.
మడ్తలు లేని సేవు ముఖంలోకి మడ్తలు అచ్చినయి. రెండు కళ్ళ అంచులకు కింద బుగ్గల పైన రంగు మారింది, ‘ ఏమైందో బఱ్ఱెకు? ఆమె ముఖం దిగులుతో రంగు మాసింది. ఉహ్…. అంటూ నిట్టూరుస్తా బకెట్ తీసి పక్కన పెట్టి గడ్డి వేసి ముడ్డికి చేతికంటిన బర్రె సొల్లును రుద్దుకుంటా నిల్చుంది సేవు. దూరంగా వ ఇనబడుతున్న నెమళ్ల అర్పులు, వాటి ఎన్క పింఛాల కోసం పర్గులు తీస్తున్న పిల్లల అర్పులు భడ్భడ్ మని విన్పిస్తున్నయి.
బఱ్ఱె మెడ కింద భాగం పై చెయ్యి ఏసి చేతి వేళ్ళతో నిముర్త ఆలోచిస్తూంది సేవు. బఱ్ఱె దాని కొమ్ములతో సేవు చేతిలోని బొక్క గాజులను కద్లించడానికి యత్నం జేత్తాంది. సేవు బఱ్ఱె మెడ నరాల కదిలికలతో దాని ఆరోగ్యాన్ని తూకం ఏసుకుని హాయిగా గాలి పీల్చుకుంది, ఆమె ముఖం లోని మడ్తలన్నీ మాయమైనయ్. ఇప్పుడు ఆమె మన్సుకు ఏమి విన్పిస్తలేదు, కన్పిస్తలేదు. సేవుకు తను ఓ
ఫూన్దిగా(తుమ్మెద) మారిపోయినట్టు అన్పించింది.
ఎడ్మకాలు మీద చీమ కుట్టింది. కుడి కాలితో పుటుక్కున చీమని నల్పి, “బొస్సిర్ కీడి” అంటూ చీమని తిట్టి , “అమ్మయ్యా పనంతా అయిపోయినట్లే ఇప్పుడు సచ్చిపోయిన పర్లేదు”, అనుకుంది. “పొద్దున్న అండినదే రాత్రికి తినేస్తే సరిపోతది కదా,ఇంకా వంట చెయ్య అవసరం లేదు, ఇంట్ల పని గురించి ఆలోచన చేస్తే మన్సంత ఆగం ఆగం అయిపోతది.. ఇప్పుడు ఇంకా ఏమైనా మిగ్లిపోయిందా?” ఆలోచనల పడ్డది సేవు.
బఱ్ఱె గడ్డి లోని పుల్లల్ను ఒక్కొక్కటిగా నముల్తా సేవునే సూస్తాంది. ఘాగరోను కొంచం పైకిలాగి నడ్ము దగ్గర గుచ్చి తల పైనుండి భుజానికి జారిన ఘుంగ్టోని తలపైకి లాక్కుంది సేవు.
ఇంటి వేపు నడ్వబోయి బఱ్ఱె తల పై నుండి తోక వైపు పాక్తున్న జంజోడిలను(రక్తం తాగే పురుగులు) సూసి ఆగింది. బఱ్ఱె పొదుగు, తోక కింద, పొట్ట కింద కూడా జంజోడిలున్నయి. తన మెడలో ఉన్న రప్యార్
హార్ నుండి చింటా తీసి ఆ జంజోడిలను వణ్కుతున్న తన సేతితో మెల్లగా పీకుతాంటే, బఱ్ఱె దాని తోకతో లాగి కొడ్తాంది. ఆ దెబ్బలకి సేవు ఘుంగ్టో జార్తా ఉంటే, ఎక్కడ చింటాను బఱ్ఱె పొట్టలోకి గుచ్చేస్తనో’ అనుకుంటా సేవు కాళ్ళు, సేతులు వణ్కడం మొదలైనయి. ఆ తోక ఇసురు గాలికి చలి తగులుతున్నట్లు అనిపిస్తాంది. మొత్తం మీద జంజోడిలను పీకి రాళ్ళతో కొట్టి సంపింది. ఎర్రని గడ్డకట్టిన రక్తాన్ని సూస్తే అవి ఆరుద్ర పుర్గులానే అన్పించినయి. ఇంకా బఱ్ఱె వంటి మీద ఏమి లేదని రూఢిపర్చుకుని అల్సటగా ఊపిరి ఒక్క బిగిన వద్లింది.
‘కాలు మంట పుడ్తుంది. ఏంటా’, అని సూస్తే బొటన వేలు రక్తంతో నిండిపోయి ఉంది. దెబ్బ ఎట్ల తగ్లిందో యాదికి రాలే సేవుకు. బఱ్ఱె ఉచ్చ పోయడం సూసి తన ఫేట్యానీ(ఘఘర) మోకాలి పై దాకా లేపి ఆ ఉచ్చ ధారలో దెబ్బ తగ్లిన కాలివేలిని పెట్టింది. దెబ్బ పై మూత్రం పడగానే ఆ మంటకి ఆమె గుండె ఝక్ ఝక్ మంది. కొన్ని క్షణాల పాటు సల్లంగ నిల్చుని షెడ్డుకు ఎదుర్గా ఉన్న రేకుల ఇల్లును సూస్తూ “యాడియే” అన్కుంటూ ఆ పక్కనే ఉన్న గుడ్సె వైపు సూసింది, ఇంకా పన్లకు పోయ్న ఒళ్ళు తండా చేర్కొనే లేదు. అంతలో ఆకాశంలోకి ఎత్తుగా ఎగ్రనికి ప్రయత్నిస్తున్న నెమలి రెక్కల పై ఆమె నజర్ పడింది, ఆ నెమ్లిని గమనిస్తూ బకెట్ తీస్కుని ఇల్లు చేర్కుంది. సల్లగ కదుల్తున్న వాతావరణంల.
ఇంటి తల్పు చివర్న ఉండాల్సిన ఫుల్యా ఘెణ్హో(తల పై నుండి వీపు పై అలంకరించి దేవుడికి సమర్పించే బిందెన మోసే తల గడ) కింద పడిపోయి ఉంది. దాన్ని పైకి లేపి దుమ్ము దుల్పి మళ్లీ దాని జాగల దాన్ని ఉంచి,తల్పులు తీసి ఇంట్లోకి వచ్చి పిడియా ఏస్కుని దాని మీద కూర్చుని ఇంటి గోడల నుండి లేస్తున్న మట్టి గాలిని పీల్చుకుంది, కాసేపటికే మట్టి వాస్న మాయమైపోయి బఱ్ఱె ఉచ్చ వాస్న తన సుట్టూ నిండి పోయింది. కాలి వేలిని గమ్నించింది, ఊడిన గోరు చట్ చట్ మంటుంటే. ఆ ఊడిన గొర్ని తాబేలు నుంచి దాని చిప్పను పీకినట్లు నిమ్మళంగా ఉడగొట్టింది. రక్తం బుస్సున పొంగి వేలి సుట్టూ జమైంది.కొంత దూరంలో ఉన్న చులో వైపు నడ్సి దానిలోని బూడ్దను తీసి వేలి పై పోసింది. కాసేపటి తర్వాత ఓ లోటా నీళ్ళతో కాలు కడుక్కుని, రంగు మారిన బూడ్దను ఉడ్చీ ఓ ఎండు కొబ్బరి చిప్పల జమ చేసి దాన్ని పొయ్యిల పెట్టీ మళ్లీ పిడియా మీద కూసుంది.
దెబ్బ తగ్లిన ఏలిని సూస్తూ పిచ్చిగా నవ్వింది. ఆ నవ్వుకి కొన్ని కన్నీళ్లు రాల్నాయి, వేలి నొప్పి ఝక్ ఝక్ మంటూ సేవు తలకు సుట్టుకుంది.
దూలానికి ఏలాడుతున్న బొంగు బుట్టను కిందికి తీసి సూసింది,ఎండిన జీడి కాయలు,ఎండిన నేరగాయలు, ఎండిపోయిన సింతసిగురు, ఎండనికి తయారుగున్న మూడు నిమ్మకాయలు ఉన్నయి. వాటి లోంచి ఓ పెద్ద నిమ్మకాయను తీస్కుని ఓ పొక్క చేసి ఆ అంగుటా వేలునీ దాంట్లోకి గుచ్చి బొంగు బుట్టను మళ్లీ దూలానికి ఏలాడదిసింది.
ఇంట్ల చీకటి జమైతా ఉంది. బుగ్గ వెలిగించాలా ? వద్దా ? ఆల్చన జేసి భయంగా కరెంటు షాక్ తగుల్తాదేమో అనుకుంటా నల్లని ప్లాస్టర్ సుట్టిన వైరు వైపు జరుగుతా పోయి లైటు ఏసి, మూలన ఉన్న సంచుల పైన ఉన్న ఓ చిన్న జొన్న మూటను ఇంటి మధ్యలోకి తెచ్చి పెట్కుని, కూర్చుని, వాటిని బాగుచేసే పనిల మున్గిపోయింది.
****
సంగ్యా అచ్చేసరికి సేవు తన పాత టుక్రి నేలమీద పర్చి దాని మీద జార్ ఏస్కొని వాటిలోంచి మట్టి బెడ్డలు ఏరుతా ఉంది.అతని రాకను గమ్నించి సేస్తున్న పనిని ఆపి నిల్చుంది. తలపైన ఉన్న అద్దాల ముసుగు సగం కిందకు జారిపోయింది. మిగ్లిన సగం అంచు ఆమె నడ్ములో నాటుకుని ఉంది. అతడు కాళ్ళు సేతులు కడుక్కుని ముఖం పై తడిని దస్తి తో తుడ్సుకుంటూ ఇంట్లోకి అచ్చిండు. భారీ దేహం, దిట్టంగ ఉన్న ఆకారం. తాగనికి నీళ్ళు ఇచ్చింది,అతడు నీళ్ళు తాగి అంగీ తీసి క్ఖిలాకు అంగీని తగ్లించి,కట్టుకుని ఉన్న దోతిని లుంగిగా మార్చుకున్నడు. ఇద్దరు ఏమి మాట్లాడుకోలేదు, అయినా మాట్లాడడానికి ఏముందని? పిల్లలు ఉంటే ఇల్లే ఇంకోలా వుండేది. సంగ్యా సలికీ భయపడ్తున్నట్లు అడ్గులు ఏసుకుంట ఇంట్లోంచి బయ్టపడి ఇంటి ముందున్న బండ పై కూసుని చీకటిని నింపుకోనికి సిద్ధమైతున్న ఆకాశంలోకి సూస్తూ బీడి ఎల్గించుకుని తాగడం మొదలు పెట్టిండు. చానా పిట్టలు ఇంకా గుట్లకు చేర్కొనే లేవు. సుట్టూ ఉన్న గుడ్సెల నుండి పిల్లల ఏడ్పులు, ఆ ఏడ్పులకి జోడీ జోల పాటలు వినిపిస్తా ఉన్నయి. వాతావరణం సల్లగా ఉంది,అడ్వి నుండి సలి గాలి బర్రు బర్రున తండా వేపు సీటీలు కొడ్తాంది. ఆ గాలి తన సోబతి దూడ, నేమ్లి, పిట్టల అర్పులు మోస్తూ తేస్తాంటే,వింటూ బీడి పొగను వదుల్తా ఉన్నడు సంగ్యా.
సేవు మళ్లీ జార్ సరిచేస్కోనికి కుర్చోబోతూ తన ఘుంగ్టోని తీసి ఆ గోడకు ఉన్న కట్టెకు ఏలాడదీసి మళ్లీ పనిలో పడిపోయింది ,పని చేస్తున్నంత సేపు నొప్పి ఏమి అన్పించలేదు. పని అవగానే నడ్ము పై బర్వు ఎక్కువ అయినట్టు అన్పించి పెయ్యి విర్చుకుని కూసుంది. బైట నుండి సంగ్యా గట్టిగా దగ్గిండు. ఆ దగ్గుకు ఉలిక్కి పడి లేచి నిల్చుని బైటికి పోయింది.తండాలో అంతా మస్కగా ఉంది.ఎవరు బుగ్గలు ఎల్గించనట్లు ఉన్నరు,ఇంకా ఎల్గించరు కూడా అని లోలోపల అనుకుంటా ఆకాశంలో తేలిన సుక్క బొట్లను సూసి, “నడు ఏడు దాటిపోయినట్లు ఉంది”, సలి జోర్ అయితుంది.
సంగ్యా తన చేతి గడియారం వంక సూసిండు, “అవును ఏడు అవుతాంది”
“ఇప్పటికే సానా కాలం పోయింది ఆ తిందాం”
ధణిగొణ(భార్యాభర్తలు) ఇద్దరు ఇంట్లకి నడ్సి గిన్నెలు ముందేస్కుని కూర్చున్నరు. ఓ పిడ్కెడు గట్కను ఉంచి మిగ్లింది పళ్ళెంలో వడ్డించి, రెండు కాందా , నాలుగు పచ్చిమిర్చి పక్కనే పెట్టీ ఇచ్చింది.
“ఇన్నిన్ని ఉలిగడ్డలు,మిర్పకాయలు తింటిమనుకో,మళ్లీ అడ్వి బాట పట్టలే, జర ఎన్కా ముందు సూడు” అంటూ రెండు మిర్పకాయలు ఒక కాందా పక్కకి తిస్తాంటే
“అరె బాపు ఖో అంత ఎందుకు పరేషాన్ అయితవు, తిననికి అయిపోతే శికార్కి పోదం ఖో… (తిను)” అంటూ హిమ్మత్ సెప్పింది సేవు.
ఒకరి ముఖాలు ఒకరు సూసుకుంటూ మౌనంగా తిన్నరు. బైట కీచురాళ్ళ ఘాయి(చప్పుడు) విన్పిస్తున్నై.
సంగ్యా థాలి(పళ్ళెం) ఖాళీ కాంగనే గిన్నెలోపల ఉన్న పిడ్కెడు గట్కను సూసి, “సేవు, ఆ గట్క ఎందుకు ఉంచడం ఇవ్వు నేను తినేస్తాను” అంటూ చిన్న పిల్లోడిలా ముద్దుగా అడిగిండు.
“అరె తరతరాలుగా ఉంచుతున్నం, పిడ్కెడే కదా, ఉండనీ, ఎంత తింటవ్”
“హ అలాగే ఉంచుకుంటా పోదం” అంటూ సంగ్యా ఎంగిలి సేతిని కడుక్కునేందుకు లేవబోతూ “అవును ఇంతకీ బఱ్ఱె అచ్చిందా” అడిగిండు.
“నేనే పోయి ఎత్తుకొచ్చిన” అంటూ సేవు ఎటకారంగా అన్నది. సంగ్యా ఏమి మాట్లాడకుండా పళ్ళెం ఆమె ముందు పెట్టీ లేచిపోయిండు.
తను తిని, తన సుట్టు సుస్కుంది.ఏమి కింద పడలేదు మిర్ప ఇత్తులు తప్పించి. వాటిని ఏరి పళ్ళెంలో దులిపింది. గిన్నేల్ని తీస్కుని ఇంటి బైట రాయి పక్కన గిన్నెల్ను పెట్టీ తాటి గోడల స్నానాల అర్ర లోంచి బకెట్ తెచ్చి దాంట్లో ఉన్న సగం నీళ్ళతో బాసన్లు కడ్గుతాంటే,ఆ నీళ్ళలోంచి కప్ప ఆమె సేతి పైకి దూకింది. నీళ్ళలో కప్ప ఉన్నట్లు గమ్నించలేదు సేవు. దూకిన కప్పను సేతి పై నుండి పక్కకు విస్రబోయింది. ఆ కప్ప ఆమె బొక్క గాజుల లోపల్కి దూరింది. కప్ప పొట్ట భాగం ఆమె చేతిపై గిలిగింతలు పెడ్తాంది. ‘సర్లే, చిన్న కప్పే కదా’ అన్కుని మళ్లీ పనిలో పడింది, అటూ బాసన్లు ఇటు ఆమె బొక్క గాజులు గమ్మత్ చేస్తున్నయి. పని అయిపోయే పాటికి ఆయిమె ఆ కప్ప గురించి మర్సిపోయింది. అది ఎప్పుడు తన సేతి పై నుండి దిగిపోయిందో, ఎటు ఎళ్ళిందో తెలియలేదు.
కడ్గిన గిన్నెల్ని తీస్కుని ఇంట్లోకి దూరింది.నీళ్ళలో తడ్సిన అయిమె సేతులు గడ్డ కట్టినట్లు అన్పించినై,రెండు సేతుల్ని గట్టిగా రుద్దుకుని సంగ్యా వైపు సూసింది. అతను పొద్దున్న నుండి ఏమి తినని వాడిలెక్క దీనంగ కూర్చున్నడు, సంగ్యా కడుపు నిండనట్లు ఉంది అన్కుని హండి(మట్టి కుండ) లోంచి తళాయేర్ మాళ్(చెరువు నల్ల మట్టి) తీసి తిననికి ఇచ్చింది. వాటిని తినడం ఇష్టం లేదు అన్నట్లు సైగ చేసిండు. సర్లే ఓ రెండు
అడ్వి ఉల్లిగడ్డలు కాల్చనికి పొయ్యి ఎల్గిస్తు ఉంటే “అద్దు ఇప్పుడు అవసరమేంది ” అంటూ గద్దించిండు సంగ్యా. లోలోపల ఏదో గొణుక్కుంటూ ఓ మూలలో ఉన్న మక్క సంచి ఎన్క నుండి దారు సీసా తీస్తా సేవు తో,
“ఏ చోరీ ఎక్ లోటా పాని లా”
(“ఓ పోరి ఒక లోట నీళ్లు తే”)
ఇద్దరు దారు తాగనికి కూర్చున్నరు. సేవు ఏదో మర్చిపోయినట్లు లేచి ఎళ్ళి ఓ డబ్బా లోంచి కాల్సిన అదోయి(ఉసిల్లు) కొన్ని పేలాలు కొన్ని ఓ చిన్న పళ్ళెంలో ఏస్కొని అచ్చి కూసుంది.
సంగ్యా కొంచం తాగి “మార్ చిచ్చార్ అజ్ కాయ్ ఖాదేకో తీన్ మీన వేగే ఏక్ వనా తోయి జాన్ అవనో”
(నా పిల్లలు ఈరోజు ఎం తిన్నారో మూడు నెలలు అవుతోంది. ఒక్కసారైనా వెళ్ళి చూసి రావాలి)
“అపణ్నియా ఆదో భుకేతి తో రేని, ధ్దాప్పణ కారేచ హాస్టల్మా”
(“మనలాగా సగం ఆకలితో ఎం ఉండరు, హాస్టల్ లో కడుపు నిండా తింటున్నారు”)
ఉహ్… అంటూ గట్టిగ ఊపిరి పీల్సుకుంటూ సేవుతో “కాస్త అరాంసే తాగు, అవునే మన జీవితాల్లో ఈ రాత్రులెప్పుడైన జల్దిన గడ్చినయా ? ” అతడి మాటలు వింటాంది. కళ్ళముందు చీకటి నీడలు బఱ్ఱె కొమ్ముల్లా అన్పించినయి. ఆ చీకటి కళ్ళలో నిండినట్లు అన్పించి కళ్లు రుద్దుకుని,
“కాయ్ ?” అంటూ అడ్గింది.
“అపణ్ దాడేమా రాత్ కన్నాయ్ జల్ది డ్డల్గిచక”అన్నాడు సంగ్యా
(“మన రోజుల్లో రాత్రులు ఎప్పుడైనా తొందరగా గడిచయా?”)
“రాత్ క”(“రాత్రా?”) లేదు, పగళ్లు త్వరగా గడ్సిపోతుంటయి. మన గోర్ కి అల్వాటు అయిపొయింది పని పని…… పని…….., ” అనుకుంటా సీసాను ఖాళీ చేసినారు.
బుగ్గ దగ్గర ముస్రుకున్న పుర్గుల వాసన ఇంటి నిండా నిండిపోయ్నాది. సేవు పుర్గులను ఓ పక్కకు చిపుర్తో నూకి , తన ఘుంగ్టో తల పై నుండి కప్పుకుని, తల్పులకు గొల్లం వేసి, సిల్మెక్కిన కుర్చీల కేంచి దుప్పట్లు తీసి పక్క సద్రింది. ఇంకా నా వల్ల కాదనట్లు ఎంటనే పక్కపై వాలిండు సంగ్యా.
“జాదా కుణ్ పిదే” అడ్గింది సేవు బుగ్గ ఆఫ్ చేస్తూ.
(“ఎక్కువ ఎవరు తాగారు?”)
“ఎవరో ఒకరు, ఇంతకు బర్రెకు మేత వేసినవా”? అడిగాడతను.
“ఉహ్… అప్పుడు ఏసిందే ఇప్పుడు అద్దులే” అంటూ అతడి పక్కన వాలింది. సంగ్యా ఇటూ తిరుగు అన్నట్లు తన సేతిని ఆమె పొట్టపై వేశాడు,
“ఏ చోరీ, నీ మాంసం పాల మీగడలా అనిపిస్తాన్ది, ఇటూ తిరుగు”
“పడుకో, నిద్ర అస్తుంది”
“ఏ చోరీ”
(“ఓ అమ్మాయి”)
“కాయి చోర” అంటూ సన్నని వణుకుతున్న గొంతుతో అంది.
(“ఎంటమ్మాయి”)
ఇక తనెలాగో తిర్గదు ‘సర్లే’, అంటూ కోరిక సంపుకొని ఆమెకి దగ్గరగా జరిగి ఆమె మెడపై ముద్దులిచ్చిన్డు.
“అరె సో అంగ్” అంటూ తన ఘుంగ్టో పూర్తిగా కప్పేసుకుంది.
సంగ్యా ఆమె కి ఏదో చెప్తూ ఉన్నడు.అతడి మాటలు ఇంటానే నిద్రలోకి జారిపోయింది సేవు.
********
( 2 )
ప్రతిచిన్న ఖాళీలోనూ చీకటి నిండిపోయినాది. ఇంటి నిండా నిశబ్దం. సమయం గడ్సిన కొద్ది ఐసు కొండలు తయారు అయినట్లున్నయి. చల్లని వాతావణం. దంపతులు గొదడిని అటూ ఇటూ లాగుతూ ఉన్నరు ఇద్దరూ. నిద్రమబ్బులో చలి తనకు దొరికిన జాగలని కొర్కనికి సిద్దంగా ఉంది. ఇద్దరు దగ్గరికి జరిగి ఒకరి వీపును ఇంకొకరు గట్టిగా అంటబెట్టుకున్నరు. కొంత సమయం తర్వాత సంగ్యా తనకు తెలియకుండనే గొదడినీ తన సుట్టూ సుట్టేసుకున్నడు. సేవు చలికి తేర్కుని తన ఘుంగ్టొనీ ఛాతీ దాకా దుప్పటిలా కప్పుకుంది.
సేతిలోని బొక్క గాజుల శబ్దం వినగానే తనకెప్పుడూ ఇంకా తను బతికే ఉన్న అన్న భరోసా ఆమెకి కల్గుతూ ఉంటుంది.
చెంపదగ్గర ఉన్న టొప్లి ఏదో ఒక శబ్దాన్ని సృష్టిస్తనే ఉంటది.
రాత్రంతా ఆ శబ్దం సేవు చేవి నిండా పారుతూ ఉంటది. సేవుకు తన వంటి పైన చల్ల గాలి, ఆమె చర్మాన్నంతా గగుర్రోడుస్తున్నయి. సన్నని శబ్దాలు ,ఎవరో ఈల వేసి మరీ పిలుస్తున్నట్లు, మధ్యమధ్యలో నక్క ఊళలు,కుక్క ఏడ్పులు, నిద్రలో సేవు అనుకుంటుంది
“కాలం తన జీవనాడిని నాలో పరీక్షించుకుంటోంది, నిశ్శబ్దంలో ఉన్న అందాన్నీ, ఆనందాన్ని పొందే హక్కు నిజంగా నాకు గాని, నా వాళ్ళకి గాని లేదు”
అనుకుంటూ సెట్టుకొమ్మల్లో నిల్చుని తన శున్యంలోకి తొంగి చూస్తున్న గుడ్లగూబను సూసింది. సలికి ఆ పక్షి గడ్డకట్టుకోపోయినట్లుంది. కంజోర్ అయి జారీ పడింది. సేవుకు ఆ పక్షి తన చెంప మీద పడి కుట్టినట్లు అన్పించింది.నిద్రలోనే చంపను ఛెళ్ మన్పించింది. ఈ సారి తన ఘుంగ్టొను ఇంకొంచం పైకి జరిపి కప్పుకుంది.
******
ఇంటి గోడకు తగ్లించిన ఖాళీ కోడి గుడ్లను బల్లులు పడేస్తున్నయి, ఆ గుడ్లు కింద పడి పగులుతున్నయి, ఆ శబ్దాలు ఇంట్లోని వాతావరణాన్ని మార్చేసినాయి, ఆ సన్నని స్పష్టమైన శబ్దాలు సేవు చెవుల్లో గింగిర్లెత్తుతున్నయి.
ఆమెకు ఎన్నో యాదికి వస్తున్నయి. తలనిండా గుడ్లు నిండినయి. ఏ గుడ్డులో ఏ జీవ్ ఉందో ఆమె దిమాక్కే తెల్వాలే. తపాలో కోసాన దగ్గర జుట్టుకు కిందా జమ అయిన చెమట మెల్లగా అటూ ఇటూ కదుల్తూ కిందికి జారుతున్నట్లు ఆమె మన్సుకు సమజ్ పట్టింది.
చల్లని వాతావర్ణంలో చెమట ఏంటి ? నిజంగా ఇది చలికాలమేనా ? లేక నేను కలగంటున్ననా ? అన్కుంది. ఆమె తపాలో మీద చెమట గద్గలి పెడ్తాంది. కాలిన పెంకమీద సిన్కులా ఆ చమట ఎండిపోతాంది. తన పై ఎవరో చేతబడి చేసినట్లు ఆమెకి అన్పిన్చింది, లేక సూడిదైన తన బఱ్ఱె మీద ఏవో శక్తుల్ని పంపిండ్రని అన్కుని నిద్రలనే ఆల్చన చేస్తా ఉంది.
నిద్రలో ఉన్నా అనుకుంట సపణోల కన్లు మూస్కుని నిద్రపోతాంది సేవు, అటూ ఏలు నొప్పి, సలి పురుగు ఆ ఏల్ని పొడుస్తా ఉంది , ఇటూ తలలో లడాయి, వంటి పైన ఉన్న గేణో సప్పుడు, పక్క నుండి మొగుడి గుర్క.
అర్ధగంటకొకసారి అటూ ఇటూ కదుల్త కలల పట్టాలను మార్చుకుంటాంది సేవు.. నెమళ్ళ అర్పులు, నక్కల ఊలలు మెర్పులా అలా వచ్చిపోతున్నయి.
సంగ్య గురక తన చేవిలోకి , అతడి వేడి ఊపిరి సెగలు ఆమె మెడకు తగుల్తున్నయి. వెచ్చగా తగుల్తున్నయి,ఎంత వేడి ? ఎంతటి వెచ్చదనం ? ఇలాగే ఈ వేడి సెగలు ఈ చీకట్లో నన్ను కాల్చేస్తే బాగుండు అనుకుంటా మెడ నరాల్ని కద్లించి, మెడను తాబెలులా భుజాలకు గుంజుకుంది. అతడి గురక శబ్దం ఆమెని సతాయిస్తుంది.
అతడిని ఏమి అనలేక తన ఘుంగ్టోనీ తల పైనుండి కప్పుకుంది సేవు. కొంచం మెలుకువ అచ్చింది. బర్రెకి గడ్డి వెయ్యాలి. లేవాలా ? వద్దా ? రోజు తెల్లారితే చాలు బఱ్ఱె ఆకలి గొంతు వినబడగానే పేగు కలుక్కుమంటది, ఎవరిదైనా తోటలో దొంగతనానికి ఎళ్ళక తప్పదు. పచ్చగడ్డి, పోనీ ఎండుగడ్డి ఎక్కడని దొరికేది ఉన్న గడ్డంత మేతకు పోయె,మేక ,గొర్రె, ఆవుల మందలు మేసేస్తుంటే ఏమి మిగ్లింది భూమి మీద పెంటికలు, పెండ తప్ప.
ఏడేడి నుండో అందరూ తమ మందల్ని ఇటూ తండా పరిసర ప్రాంతాల్లోకి మేతకు తెస్తరు, అదే మేము వారి తోట ఒడ్డు మీది గడ్డి ముట్టుకున్నా జుర్మానో కట్టాలి. ‘ఏందో’ అనుకుంటా సంగ్యా గురక ఆపనీకి ఓ కాలితో తన్నింది. అతడు ఆ….. అంటూ అటూ తిరిగి ముల్గుతా పడుకున్నడు.
సికట్లో గుడ్లగూబలా సేవుకు అన్ని కనిపిస్తున్నయి. శ్రద్ధగా గాలిలోకి చెవుల్ని పెట్టీ విన్నది, బఱ్ఱె అర్పులు ఏం వినబడలేదు, రోజు రాత్రంతా అరుస్తానే ఉంటది బర్రె. సేవుకు భయం….. మోదాలైయ్యింది.నక్కల మంద గిట్ల బర్రెని చీరి సంపినయా ఎంది ?,లేదు లేదు ఇన్నిరోజులు లేనిది ఈరోజు అట్లెం ఉండదు, సచ్చిన తన యాడీని మొక్కుకుంది,
“యాడి, తార్ బాల్ బచ్చా, గావ్ డ్డోరుణ దెక్ తి రిస్, తార్ బెస్సి ర్ పైలి ఘీతీ తోన ధార్ దూచు” అని మన్సుల అనుకుని తన యాడి ముఖం యాది చేసుకుంది. యాదికైతే అచ్చింది కానీ ఖాట్(చితి) మీద పండుకుని ఉన్న యాడి కన్లల్లా తేలింది.
సలి కాలంల ఆన మొదలైంది, ఆమె కన్లను ఆపుడు ఆమె వశమైతలేదు, ఏడ్చింది…. ఏడ్చింది…. సికటిల ఆమె కను గుడ్లు ఎడ జారిపోతాయో అని భయపడుతూ పందిలా సుర్ సర్ మని అంటా ఉంటే, సంగ్యా సప్పూడు చెయ్యకు అన్నట్లు బుజంతో కదిలిస్తున్నడు.
చాలా సేపటి తర్వాత ఉలుకు పలుకు లేకుండా దుఃఖంల నాని నాని సలికి తేరుకుని బర్రె గురించి ఆలోచనల వడ్డది సేవు.
రేపు పచ్చని గడ్డి తేవాలి. ఎటు పోతే బాగుంటది, వర్షాకాలం అయిపోయినాకా ఒత్తుగా పెరిగి పిచ్చి మొక్కలతో నిండిపోయే భూముల్ని ఊహించుకుంటా, ఎప్పుడు భూములు అలా పచ్చగా ఎందుకుండవో,అన్ని కాలాలు అలా పచ్చగా ఉంటే బాగుంటది! అని అనుకుంటా ఏదో అయ్యినట్టు లేచి కూసుంది. మెడ నరాలు గుంజినట్లు అనిపించినయి, గొంతు తడి ఆరిపోయింది.
లేచి నిల్చుని బుగ్గ ఎలిగించి సీసా లోని నీళ్ళు తాగి కాలి బొటనవేల్ను సూసింది, నిమ్మకాయ సంగ్యా కాలి దగ్గర కనిపిస్తే దాన్ని తీసి పొయ్యిలో పడేసి , పగ్లిన గుడ్ల పొట్టును ఓ వైపు ఉడ్సి జాకెట్ చేతి అంచు నుండి కిందికి జారిన రెండు బొక్క గాజులను మళ్లీ పైకి జరిపి బుగ్గ ఆర్పబోతూ,ఆమె సంకలో ఏదో కంతి లాంటిది జమైనట్లు అన్పించింది. ఓ చేతి వేళ్ళతో సంకలో తడ్మి సూసింది. ఎంటనే మొగుడ్ని నిద్రలేపి జాకెట్ తీసి సూపించింది.నాలుగు జంజోడిలు గట్టిగా అతుక్కొని ఉన్నయి. నిద్రమత్తులోనే,చింటా సహాయంతో వాటిని పీకి ఓ దగ్గర పెట్టి
“ఎప్పుడు సూసినా ఆ బఱ్ఱె సుట్టూ తిర్గుతూ ఉంటవు, ఇంగో సూడు నీ బఱ్ఱె నీకు ఏం ఇచ్చిందో”
సమాధానంగా “ఆ నువ్వు మాత్రం ఎడ్లు ఉన్నప్పుడు వాటి ఎన్క తిరగలేదు? పెళ్ళాం, పిల్లలు ఉన్నరు అన్న సంగతి కూడా యాది లేదు నీకు” అంటూ సేవు అంది.
“సరే ఇంకా పడుకో, సలి సంపుతున్నది” అంటూ సంగ్యా ఏమి ఆలోచించకుండా పడ్కున్నడు.
సేవు బుగ్గ ఆర్పి జంజోడిలను తలుపు తీసి బయిట ఇసిరి, వాటి గురించి అలోచిస్తా నిద్రలోకి జారిపోయింది.
********
కుక్కల అర్పులు ఇంటి నిండా నిండిపోయినయి, చెవుల్లో వినబడుతున్నయి. ఇంట్లకు దూరిన పిల్లిని ఏటాడుతు కుక్కలు ఇంట్లకు గిట్ల అచ్చినయా ఎంది ? కల అనుకుని ఊపిరి గట్టిగా పీల్చుకుని వేరే ఆలోచనలోకి మారనికి ప్రయత్నించింది సేవు. కానీ ఆ అర్పులు సేవునీ చుట్టుముట్టినయి. ఇక నుండి కలలు రాకుండా కొడవలిని సరానో కింద పెట్టుకోవాలే అనుకుంట కష్టంగ కన్లు తెరిచి సోయిలకి అచ్చి విన్నది.
ఇంటి ఎన్కాల ఉన్న రేకుల షెడ్డులో బఱ్ఱె సన్నని అరుపు ఇన్పించింది, షెడ్డుకు బైట కుక్కలు మొర్గుతున్నయి. సేవు సంగ్యా చేయిపట్టుకుని
“నిద్రలే బఱ్ఱె అరుస్తుంది”
గురకనాపి సంగ్యా ” హ్మ్ కయ్యే” – అని అటు వైపు తిరిగి పడుకున్నడు. సంగ్యా నిద్రలేవడనీ తనే లేచి బుగ్గ ఎల్గించి, దుప్పటి గిర్కపోయి వేలు నొప్పి అయ్యింది. కిందికి జారిన తన ఘుంగ్టొను తలపై నుండి కప్పుకుని, బ్యాటరీ, ఓ కట్టే తీస్కుని ఇంటి ఎన్కకు ఎళ్ళింది సేవు.
సుట్టూ సీకటి. బ్యాటరీ ఎల్గించింది. కుక్కల కళ్ళు ఆ వెల్తురులో మెరుస్తున్నయి. ఆమెని సూసి కుక్కలు ఇంకా ఎక్కువ అర్వడం మొదలు పెట్టినయి.వాటిని తర్మనికి బ్యాటరీ లైటును వాటి వైపు కొడ్తూ చేతి లోని కట్టెని మూడు సార్లు నేలకు కొడ్తూ ,నాలుగో సారి వాటిపై కట్టెను విస్రింది, కుక్కలన్నీ అక్కడి నుండి కొంత దూరం పరిగెత్తి మళ్ళీ ఎన్కకి తిరిగి మోరగుతున్నయి. .
‘ఏమైంది, అసలేముంది?’ అనుకుంటనే సలికి సతాయిస్తున్న కాలి వేలి దెబ్బని దుల్పి, బఱ్ఱె వైపు లైటు వేసి సూసింది సేవు.
అంతే భయంతో “యాడియే” అంటూ గట్టిగా అర్చి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న తన ససరో రాయులు ఇంటి తలుపు పై చేతితో బాది ఏమి చెప్పకుండనే పరుగెత్తుకు ఎళ్లి మొగుడు సంగ్యానీ పిల్చుకుని అచ్చింది.
ససరో రాయులు నెమ్మదిగా నడుస్తూ వారి దగ్గరికి అచ్చి నిలబడిపోయిండు. బఱ్ఱె కింద పడి ఉంది దానికి ఉపిరాడతలేదు,అది అప్పటిదాకా తిన్న గడ్డి అంతా బైటకు అస్తా ఉంది.
సంగ్యా , రాయులు ఎళ్లి పాలోళ్లను పిల్చుకుని అద్దామనుకున్నరు. కుక్కల అర్పులకు, ఆ ముగ్గురి హడావిడికి సుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మేల్కుని సలికి వణుకుతూ, సలికి పళ్లను కటకట మంటు రానే అచ్చిండ్రు.
పింద్రా(కొండచిలువ) బఱ్ఱె కాళ్ళసుట్టూ మెలితిరిగి మెడ సుట్టూ సుట్టుకుని ఉంది,మధ్యలో పొట్ట బాగా ఉబ్బినట్లు కనిపిస్తాంది. సుట్టూ మన్షులు జమైనారు. అందరూ వాళ్ల వాళ్ళ ఫోన్ బ్యాటరీలను ఎల్గించినారు. రాయులు పోయి రెండు ప్లాస్టిక్ బియ్యం సంచుల్ని తెచ్చిండు.సంగ్యా వెదురు కట్టేల్ని తీస్కుని అచ్చిండు.
బఱ్ఱె కళ్లు తెల్లగా కనిపిస్తున్నయి, కన్నీళ్లు కారుతున్నయి, నోట్లోంచి అరగని గడ్డి , నురగ రెండు బయిటికి వస్తా ఉన్నయి. రాయులు ఆ రెండు సంచుల్ని ఒకదానిలో ఒకటి పెట్టీ ,దానిలోనికీ పాము తలని కట్టే సహాయంతో జార్చి గట్టిగా కట్టేసినాడు.
సంగ్యా తను తెచ్చిన కట్టెలను , సుట్టూ ఉన్న పెద్దవాళ్ళకు ఇచ్చిండు. ఫోన్ ఎల్తురులో , కట్టెలతో ఆ కొండ చిలువని తొల్గించిండ్రు. ఊపిరాడక అది తొందరగానే పట్టు వద్లేసింది. దానిని పక్కకు లాగి కొట్టి కొట్టి సంపిండ్రు.
బఱ్ఱె లేచి గట్టిగట్టిగా మన్షి లెక్క ఊపిరి పీల్చుకుంది.
సుట్టూ ఇంకా ఏమైనా పాములు ఉన్నయా ? సొదలు చేసిండ్రు,ఏమి కన్పించలేవు, ఆడాడ ఉన్న మేకల్ని, బర్రెల్ని, దూడల్ని పట్టిపట్టి చూసినరు, అన్నీ క్షేమమే, ఎవరిళ్లకు ఆళ్ళు ఎళ్ళిపోయినరు.
సంగ్యా రాయులు డోళి కట్టి ఆ కొండచిలువని బుజాన మోస్కుని తీసుకెళ్ళి పీన్గుర్ ఢాబ్ (సేవాల బావి) లో పడేసి వెనుతిరిగిండ్రు.
సేవు వేడి నీళ్ళు పెట్టింది, ఆ మండుతున్న కట్టల దగ్గరే కూసుని సలి కాచుకుంటాంది. వాళ్ళు అచ్చేసినారు, ఆళ్ళకి నీళ్ళు బకిట్లో పోసి మళ్లీ ఇంకో సారి ఇంటి ఎన్కకు ఎళ్లి బర్రెని సూసి అచ్చింది. మన్సు కాస్త నిమ్మలమైంది. ఇంట్లోకి ఎళ్లి ఓ గ్లాసు నీళ్ళు తాగి , సంగ్యా సేతి ఘడిల సూసింది చిన్న ముళ్ళు నాలుగు మీద ఉంది. ‘నాలుగు అవుతున్నది,గంట గంటన్నర వుట్టిగనే గడ్చిపోయింది.’ఇంటి ముందు పెండ నీళ్ళు చల్లి,
“అరె ఇంత పెద్ద బర్రెని ఎట్లా చుట్టుకుంది, దూడల్ని చుట్టుకుంటది కానీ ఇదేం సిత్రమో, ఆ పాము సీకట్లో బర్రెనే దూడగ అనుకున్నట్లున్నది” పాము గురించి ఆలోచిస్తూ మళ్లీ నిద్రపోయింది.
( 3 )
సంగ్యా తన స్నానం చేస్కుని తోటకి ఎళ్ళిపోయిండు, పొద్దున్న రెండు గంటలే కరెంట్ ఉంటది రోజు. తన కరెంటు సహాయంతో పక్క వాళ్లు నీళ్ళు తమ తోట లోకి మల్పుకుంటారేమో! అదే అతని భయం, ఆ ఆలోచనతోనే హడావిడి పడుతుంటడు. ఏసిన మిరపకాయ పంటంత సలికి ముడ్చుకుపోయింది. పూలు బానే విచ్చుకున్నయి కానీ పిందే సంగతే ఆలోచిస్తే అతడిలో దిగులు నిండిపోతాంది.
*****
తండాలోకి డుర్రున అచ్చిన మియా బండి హరన్ కి మేల్కుంది సేవు.
ఆరు అయితుంది,నిద్ర నుంచి మేల్కుని జుట్టుని సరిచేస్కుని అలాగే కూసుని ఉంది, కిటికీ సందులోంచి చిల్చుకు అచ్చిన ఎల్తురును సూస్తూ,గాలి దుమ్ము ఆ ఎల్తురులో నిలబడి అక్కడే కదులుతున్నయి,ముక్కులో గిలిగింతై గట్టిగా తుమ్మింది. తన ఎడమ జడ అంచున అల్లిన టోప్లి ఊడి పడింది, ఆ పడిన దాన్ని తీసి ఇంకో బుట్టని ఊడదీసి రెండింటిని ఒక దగ్గర పెట్టి ,ఘుంగ్టోనీ తలపై నుండి కప్పుకుని తలుపు తీసి నీళ్ళు తేవనికి నీళ్ళ ట్యాంక్ దగ్గరికి ఎళ్ళింది.
అక్కడ నీళ్ళ కోసం ఒకటే లడాయి. ఇద్దరు మహిళలు లంజా, లంబ్డి, చూత్ మరావ్ణి, డాక్కి అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టుకుంట ఒకరి మీద ఒకరు మట్టి పోస్కుంటూ ఉమ్ముకుంటున్నరు. బకెట్ నీళ్ళు నిండి కింద పోతున్నయి, ‘ఈ లడాయిలు ఎప్పుడు ఉండేదే మధ్యలో దూరితే ఇంకా అంతే’, అనుకుని నెమ్మదిగా తన బకెట్ తను నింపుకుని ఇల్లు చేర్కుంది, బర్రెకి ఓ బకెట్ నీళ్ళు తాగించింది. తర్వాత వంట పూర్తి చేసింది.
ఎనక నుండి బఱ్ఱె అరుస్తోంది, ఎండెక్కిందని గమనించి ఎనక్కి ఎళ్ళింది. సుట్టూ పక్కల ఉన్న బర్రెలన్ని పోట్ చేరుకున్నయి. సేవు దాని మెడలోని ఇనుప చైనును ఇప్పాలని అన్కుంది. కానీ బఱ్ఱె ఈననికి తయ్యారుగా ఉంది, ఇయ్యాల రేపు అన్నట్లుంది.అడవికి పంపాలా ? అద్దా ? అలోచిస్తూ దాని మెడలోని చైను తీసి దాన్ని పోట్ మీదికి తోల్కపోయింది.
పోట్ ఒక పెద్ద మైదానం , ఆ మైదానం లో ఓ మూల పెద్ద పెద్ద రాళ్ళతో కంచె గోడలు. మధ్యలో చిన్న ఖాళీ- బర్రెలు- లోపలికి పోనికి ,బయటికి రానికి. ఆ పక్కనే ఉన్న మర్రి చెట్టుకింద పెద్ద రాయి మీద మట్యా కూసున్నడు. అతనే బర్రెలను రోజూ అడ్వికి అవతల మేతకు తీసుకెళ్ళి ,ఇంటికి తీసుకొస్తుంటడు .
సేవునీ సూసి మట్యా తన సేతిలోని కట్టెను పక్కన పెట్టి, “బాయి బర్రేని ఎందుకు వదిలినవు అది ఈననికి తయ్యారుందిగా?” అన్నడు మట్యా
“హ అన్న, కానీ రెండు రోజులనుండి సూస్తన్న ఈనుతుందేమో అని అదేం ఇక్కడ అయ్యేట్లు లేదు, ఎక్కడ అవ్వాల్నో అది అక్కడే అవుతది. కొంచం అడ్విలో నా బఱ్ఱె పై ఓ నజర్ ఉంచమంటూ నాల్గు అడుగులు ఏసి మళ్లీ ఎన్కకి తిరిగి బఱ్ఱె వైపు సూసింది సేవు, “నన్నొదిలి ఎళ్ళిపోతున్నావెందుకు ?,నాకు తోడుగా ఉండోచ్చుగా” అన్నట్లు రాముతున్న బఱ్ఱె కన్లను సూస్తూ సేవు, వాళ్ల అమ్మ సెప్పిన మాట గుర్తుకు చేస్కుంది “బెటి ఏదైనా కానీ ఓ సారి వద్దన్నాకా మళ్లీ ఎన్కకు తిరిగి సూడొద్దు” ‘ఉహ్’ అని నిట్టుర్చి గడ్డిలో కరిగి మెరుస్తున్న మంచుల కాళ్ళను తడ్పుకుంటా నడ్సింది.
ఇంటి దారి పొడ్గున ఒదిలిన/పారేసిన ట్టిక్ర్హి ని దాట్కుంటూ సల్లగా తగులుతున్న సెట్ల వైపు సూస్తూ నడ్సింది, సుట్టూ సీతాఫలం చెట్లు , చెట్ల పైనుండి కిందా పైన అటలాడుతున్న ఉడతల్ను సుస్కుంటా “ఒక వేళ అడవిలో బఱ్ఱె మీద వేరే జంతువులు దాడి చేస్తే ఎలా?” అనుకుంట ఆగమైంది కానీ ఎనక్కి పోయి బర్రెని ఎంటబెట్టుకురాలేదు.
( 4 )
అలోచిస్తూ అలోచిస్తూ మెల్లిగా నడ్సింది సేవు, పిల్లలందరూ ఆటలు షురూ చేసిండ్రు, దారి నిండా పెండ, మంచు తడికి మెరుస్తున్న మట్టి, అన్నింటిని గమనిస్తూ తనకు కొంత దూరంలో ఆటలాడుతున్న పిల్లల గుంపులో తన పిల్లల్ను ఊహించుకుంటా నడస్తా ఉంది.
తన ఇంటికి పోయె దారిల అందరూ అట్కాయించినరు. బఱ్ఱె గురించి అడిగిండ్రు, వాళ్ళందరికీ సమాధానం చెప్తూ అందరి సానుభూతి పొందుతూ ఇల్లు చేర్కుంది.
స్నానం చేస్కుని బంజారా బట్టలు ఏసుకుంటే ఎక్కువ సమయం పడుతది, ఆ బరువు మోసే బలం లేదు అనుకుని చీర కట్టుకుని, కొప్పు సుట్టుకుని,గంజిలో ఇంత ఉప్పు ఏస్కుని తాగి ఓ తాడు, కొడవలి తీస్కుని పచ్చని గడ్డిని ఎతుకుతూ తండాకు కొంత దూరంలో పచ్చగా ఉన్న ప్రదేశం వేపు నడ్సింది.
ఆ పచ్చని నేలకు కొంత దూరంలో ఓ కోళ్ళఫారం ఉంది. దాని నుండి కోడి ఈకలన్ని గాలికి చెల్లాచెదురై,కరిగి మెరుస్తున్న గడ్డిపై అంటుకుని పడి ఉన్నయి.గాలి నిండా ఫారం లోంచి పాడైపోయిన గుడ్ల కంపు కొడ్తాంది. దూరంగ నల్లని కొండలు,చెట్లు రాత్రి కురిసిన మంచులో మెరుస్తున్నయి,ఆకాశం నుండి మంచు పరదా కొండల పై పరిచినట్లు ఉంది.
వీలైనంత పచ్చి గడ్డిని బఱ్ఱె కోసం తీసుకెల్లాలని, ఉన్న స్థలం నుండి ఇంకొంచెం ముందు నడ్సింది.
నేలంతా పదన్తో నిండి ఉంది,తనకంటే ముందే ఆడాడ గడ్డిని కోసినట్లు నీడలు కనిపిస్తాన్నై. ‘ఆ మిగిలి ఉంది తన కోసమే’, అనుకుంట ఇంకొంచం ముందుకు నెమ్మదిగా నడ్సింది. ఆ ఉన్న గడ్డి దగ్గరికి, తాటి చెట్లను దాట్కుని తను నిలబడి ఉన్న వైపు వీస్తున్న గాలిని పీలుస్తూ సంతోషంతో నిలబడింది.
“ఓహో ఇది చిత్తడి నేల. అందుకేనా దీన్ని అదిలేశారు.” అనుకుని తన చీరని మోకాలి దాక జర్పి నడుం దగ్గర నుకింది.
సేతిలోని తాడును పక్కన విసిరి ఆ చిత్తడిలోకి నడ్సింది.
కాళ్ళు మట్టిలో దిగినాయి. ఎంత లోతు దిగాయో తన చర్మానికి తగుల్తున్న తడిని బట్టి లోతు తెల్సుకుంది,కిందికి సూసింది. ఆ మట్టిలో పురుగులు నూనె చుక్కల్లా స్పష్టంగా కన్పిస్తున్నయి.
ఆమె కాలి కింది మట్టిలోంచి నీళ్ళు ఊరుతూ , సలి పుడుతూ ఉంది. పైన లేత ఎండ.
పైన ఎండ కింద తడి ఆమె మన్సుకు హాయిగా అన్పించింది.
హాయిలో సేవు తన కొడవలితో గడ్డిని కోయడం షురూ జేసింది..
బరబరా కోస్తా ఉంది.
దట్టంగా పెర్గిన గడ్డి మెత్తగా ఉండడంతో ఇంకా ఇంకా కొయ్యలనిపిస్తుంది.
కోసింది కోసినట్లు పక్కన తాడు దగ్గర జమ చేస్తా ఉంది, దూరంగ కొందరు మన్సులు గుంపులుగా ఎటో పోతాంటే సిత్రంగా సూసి రాగం తీస్తూ ‘ఇదంతా నాదే’ అన్నట్లు కొస్తుంది. ఆల్లు ఇటు ఆస్తే గడ్డిని ముట్టుకోనియ్యను అనుకుంటనే సేతి పై వెచ్చని ద్రవం ఎంటా అని సూసింది.
సేతిపైన రక్తం!
సేతిలోంచి కొడవలి కిందకి జారింది.
రక్తమంటిన సేతిని సూసింది ఎక్కడ కోస్కొపోయిందో అని.
కానీ తన సేతికి ఏ గాయం కాలేదు.
కింద తను కోస్తూ వదిలేసిన గడ్డిలోకి సూసింది.
గడ్డిలో సేదతీరుతున్న పాము రెండు ముక్కలై పడి ఉంది. చేపలెక్క కొట్టుకుంటూ.
ఆ రక్తం తడిసిన గడ్డిని అక్కడే వదిలేసి ఆ బురద మట్టితో రక్తం మరకలున్న చోటు,ఆ మట్టిని పూస్కుని, మిగిలిన కాస్త గడ్డిని వదిలి అంతకు ముందు కోసి పక్కన పెట్టుకున్న గడ్డి దగ్గరికి అచ్చేసింది. గడ్డినంతా పోగు చేసి తాడుతో కట్టి కొడవలిని ఆ మోపులోకి దూర్చి తలకి ఎత్తుకుని తండా వైపు నడ్సింది.
దారి మధ్యలో ఇంకొందరు మహిళలు కలిసినారు. కొందరు చొప్ప,కొందరు కట్టెలు , ఇంకొందరు గడ్డిని ఎత్తుకుని ఉన్నరు. అందరూ ఏకం అయ్యిండ్రు. వారిలోంచి ధర్మి సేవుతో రాత్రి విషయాన్ని యాదికి తెచ్చింది. వరసకు సేవుకు ధర్మి అత్త అవుతది.
“సేవ్ నీ బర్రె ఎట్లున్నది?”
“బఱ్ఱె బానే ఉంది ఫూపి కానీ కావలసింది ఇస్త లేదు”
సమాధానంగా వన్ను : “అత్తా, ఈ రోజు, నిన్నా, రేపు ఎప్పుడైనా చూస్కో అన్ని దూడలే అవుతున్నయి”
“హ, రెండు సంవత్సరాల నుండి ఒక్క పాడ్గీ పుట్టలేదు నా బఱ్ఱె ఇయ్యాల రేపు అన్నట్లు ఉంది ఏమైతదో తెల్వదు.
మా అమ్మ సచ్చేముందు తన బర్రెనీ ఇచ్చింది. ఆ బఱ్ఱె ఇప్పటికీ నాలుగు సార్లు ఈనింది కానీ అన్నీ పాడ్గాలే. ఒక్క పాడ్గి అయితే ఆ బర్రెనీ అమ్మెద్దామనుకుంటున్న, కానీ అది ఏం ఇచ్చెట్లు లేదు నేనేం దాన్ని అమ్మెట్లు లేను. అంటూ వన్నుతో సేవు సెప్పింది.
“బాయీ… నీకు ముగ్గురు కొడుకులు , నీ బర్రెకు పాడ్గా పుడితే ఎందుకు ఒప్పుకోవు” అంటూ బిజన్ సేవును అడ్గింది.
సేవు బిజన్ తో “నువ్వు అలా ఏం మాట్లాడుతావు?” కోపంగా సూసింది.
పక్క నుండి సోమ్లి బాయి “ఈ చర్చా అంతా ఎందుకు,మనకు తెలవనిదేముంది. మనం బాయిలోక్ మగ పిల్లలను తప్పించి ఆడ పిల్లలను కనకూడదు. మనం పెంచుకునేవి ఆడ పిల్లలను తప్పించి మగ పిల్లలను కనకుడదు”.
“అయిన ఈ అడా మగా లో తేడా ఎంటి ? పిల్లలు పుట్టక ఏడ్వని రోజంటు లేదు నేను, మీరేమో ఇలా.” అంటూ వాపోయింది పీరు బాయి .
ఝమ్మా అది విని గట్టిగా నవ్వింది. నవ్వుతూనే “వారికి కావలసింది ఇచ్చే వరకు, ఎవరు ఎవర్ని ఒప్పుకోరు. మొన్న మా భికి బాయి వాళ్ళ తండాకు పోయిన.నేను పోయిన రోజే నాలుగు పాడ్గిలు పుట్టినయి.ఏంటి ? అన్నింటికీ అలాగే పుట్టడం ? అని అడిగితే చెప్పింది ,పశువుల డాక్టర్ 200 రూపాయలకే సూదులు ఇస్తున్నడు, ఆ సూది మందు బఱ్ఱె కడుపులో పిండాన్ని తయ్యారు సేస్తుంది. అవన్నీ పెయ్య దూడలే అవుతున్నయి”.
“అది బర్రెలకు కడుపు రావడానికి ఇస్తున్నరు అంతే కానీ అడా మగా అంటూ ఏం లేదు ఆ సూదుల్లో” గోజిబాయి తన కట్టెల మోపు నుండి కిందికి జారుతున్న కట్టెను పైకి నూకుతూ అంది.
కొందరు ఆశ్చర్యపోయారు. ఇంకొందరు ఇది మాకేం కొత్త కాదన్నట్లు సూసిండ్రు.
తండా అచ్చేసింది ఎవరింటికి వారు చేరుకున్నరు. సేవు షెడ్డు రేకులపై ఆ మూపూను ఏసి ఇల్లు చేర్కుంది.
( 5 )
షెడ్డు రేకుల పై గడ్డి మోపును పెట్టీ కొడవలి తిస్కుని ఇంటికి పోయింది.కాళ్ళు సేతులు కడుక్కుని ఇంట్లోకి దూరి సేవు తను ఎప్పుడో కోసుకొచ్చిన చీపిరి పుల్లల్ను తన ముందు ఏస్కుని వాటిని సరి చేస్తూ కూర్చుంది, ఎండ తన ముందు ఇంటి తలుపును దాటి ఇంట్లో ఎల్గును నింపేసింది. ఆ ఎల్గుల గాలిలో దుమ్ము బంగారంలా మెరుస్తూ కదుల్తాంది.
చీపురు పుల్లలను వేరుచేస్టాంటే పన్ని వచ్చింది. ” బాయి ఛ్చి క?’
“హ ఉన్నానం”టూ ఇంట్లోకి పిల్చింది సేవు పన్నిని
పన్ని లోపలికి పోయి ఓ లోట నీళ్ళు నింపుకుని గట్ గట్ మని తాగుతుంటే, సేవు “పాపం ఎంత దూరం నుండి ఎంత పెద్ద కట్టెల మోపు మోసుకొచ్చిందో” అనుకుంది.
పన్ని గడ్డం పైన మిగిలిన తడిని తుడ్చుకుని,సేవు పక్కన కూర్చుని, “బాయి” అంటూ మొదలుపెట్టింది,”మన బఱ్ఱెల్ను మేతకు తీస్కపోయిన మట్యా పాము కాటుకు సచ్చీపోయిండట.”
సేవు గడ్డకట్టుకుపోయింది. “నిన్ననే పామును సంపి బర్రెని కాపాడుకుంటిమి, ఆ పాము శాపం మట్యాకి తగిలినట్లు ఉంది” మౌనంగా మన్సులో అనుకుంది.
పన్ని తను అలా చెప్తూనే ఉంది. “అడ్వికి కంసు పిట్టల వేటకి అచ్చిన వారు చెప్పింరట. బర్రెలన్నీ ఎటూ బడితే అటూ ఎళ్లిపోయ్నాయట. మన తండా మన్సులు బర్రెలని ఎతకనికి పోయిండ్రు.”
సేవు గుండె వేగంగా కొట్టుకుంటాంది. ,భయం మొదలయింది. తను చేస్తున్న పనిని ఆపెసి “పన్నీ…. ఇలా జరిగిందేంటి ? ఇప్పుడెలా”, అని ఆలోచనలో పడిపోయింది.
“మట్యాకి ముగ్గురు ఆడపిలలలు కదా?” సేవు పన్నిని అడిగింది
“హ హావ బాయి”
“అరె, అసో కాయ్ వేగో, దేవో, దేవో కణ్ దోకాచా పనన్ ఉ కాయ్ అపనేన్ దేకేని, ఓర్ ఉప్పర్ తిన్ పస్సి ధుడ్ పడన్ మట్యార్ తీని చోరిర్ ఉసురు లాగియ” దుఃఖం నిండిన గొంతుతో ఇద్దరు కాసేపు మట్యా అతని పనితనం గురించి మాట్లాడుకున్నరు.
సేవు, పన్ని ఇద్దరు ఇంటి బయట అచ్చి నిలబడి దారి అంచుల్ని సూస్తున్నరు. మధ్యాహ్నం అయిపోయింది, గాలి నిండా బూగలు నిండిపోయినయి, ఆకాశంల గద్దలు తిరుగుతున్నయి.
సేవు తనకేమీ తోచక చిన్న బట్ట తెచ్చి దాని మీద గుండ్రటి అద్దం కుడుతు కూసుంది.
సేవుకి ఆకలైత లేదు, దూపైత లేదు .సమయం గడుస్తా ఉంది. తండా లోకి ప్రవేశించిన నెమళ్ళు అడవి బాట పట్టినయి. బఱ్ఱెకి ఏమైనా అయిపోయి ఉండోచ్చు. తన బఱ్ఱె గురించి తనకూ బాగా తెలుసు మన్షి లేకపోతే అది దాన్కి అందంగా కన్పించిన చోటుకు ఎళ్ళిపోతుంది.అంతకు ముందు ఒక బర్రెని ఇలాగే పోగట్టుకుంది, ఆ భయం ఆమెని ఎంట తరుముతానే ఉంది. సేవు బర్రె ఈననికి సిద్దంగా ఉన్న సంగతి మర్చిపోయింది.
సూస్తా ఉంది దారి వైపు. పన్ని తను ఎళ్ళిపోతానంటూ లేచింది. సేవు “ఏం పోతావు ఆగు జర సాయంత్రం కావోస్తావుంది పదా అన్నం తిందా”మంది.
పన్ని “లేదు బాయి నాకు గుండె దడగా ఉంది లేక లేక ఓ దూడ కొన్నాను,కొని వారం కూడా అయిత లేదు,అది ఎక్కడ దారి తప్పిపోతదో, ఎళ్తాను” అంటూ ఇంత నీళ్ళు తాగి ఎళ్ళిపోయింది.
సేవు ఇంట్లో కుప్పగా ఉన్న చీపురు పుల్లల్ని ఒక వైపు ఏరి, కొంచం అన్నం తిని ఇంటి బైట కూసుని పిల్లలతో తిరుగుతున్న కోడిని గమనిస్తూ కూసుంది. కన్లకు ఏది సరిగ్గా కనిపిస్త లేదు. కుడ్దాం అనుకుని తెచ్చిన ఆ బట్టను పక్కన పెట్టేసింది.
కాసేపటికి బర్రెల మంద తండా లోకి అచ్చినయి. సేవు లాగా వేచి చూస్తున్న బాయిలెందరో లేచి నిల్సుని వారి వారి బర్రెలను గుర్తు పట్టి ఊపిరి పీల్చుకున్నరు. కానీ సేవు ఊపిరి ఆగినట్లైంది.
తన బఱ్ఱె లేదు.
మామూలుగా మందలోంచి తండాలోకి ముందు అచ్చేది సేవు బర్రెనే.
కళ్ళలోంచి కన్నీళ్లు జారనికి సిద్దంగా ఉన్నయి,ముక్కు నాసికాలు తడిగా మారినాయి.
వస్తుందేమో అన్న పీర్తి ఉంది.
కానీ కన్నీళ్లు ఆగుత లేవు.
కళ్ళు కనిపిస్తలేవు, కన్నీళ్లు నిండిపోయినాయి.
తడిగా అనిపించిన ముక్కుని తుడ్సుకుంటూ తలను విదిల్చింది. కంట్లో నీళ్ళు రాలి, కళ్ళు కనిపిస్తున్నయి.
దూరంగా సంగ్యా తన సేతిలో దూడని ఛాతీకి దగ్గరగా ఎత్తుకుని నడుస్తాంటే అతడి ఎన్కాలే నడుస్తా వస్తుంది బర్రె.అప్పటి దాకా బాధ తో ఉన్న సేవు మన్సు నిమ్మల పడింది. ముఖం మీద నవ్వు అచ్చి సేరింది.
అంతలోనే మళ్లీ ఇంకో అన్మానం. ‘ఆ దూడ పాడ్గి నా లేక పాడ్గా’, అంటూ గాలికి ఊగిపోతున్న కాగితం అయ్యింది.
సంగ్యా దగ్గరికి అచ్చేసిండు.
అచ్చి రాంగానే దూడను కిందికి దింపి బఱ్ఱెను కట్టనికి తాడు కోసం ఎన్క రేకుల షెడ్డుకు నడ్సిండు.
సేవు దూడ తోక లేపి సూసింది.
అది పాడ్గా!
మన్సుల గట్టిగా అనుకుంది. ఈసారి బఱ్ఱెను దూడను రెండింటిని కల్పి ఎంతోస్తే అంతకు అమ్మేసి ఇంకో బఱ్ఱె కొనాలి.
“మనుషులకు మగ పిల్లలు పుట్టనికి మంత్రాలు,మందులు ఉన్నట్లు, బఱ్ఱెలకు ఉండి ఉంటే బాగుండేది” అనుకుంటా నిరాశతో బర్రెనీ దూడను రేకుల షెడ్డుకు తీస్కపోయిది.
బర్రె దూడను నాకి నాకి శాప్ చేసింది, బర్రె తోక కాదా పేగు ఇంకా ఎలాడుతునే ఉంది, కడుపు సన్నబడి బొక్కలు తెలినయి, బర్రె నుండి కౌసు కౌసు వాసన అస్తాంది.
సేవు వేడి నీళ్లు పెట్టీ బర్రెకు స్నానం సేయించింది.
నల్లని చర్మం పై నీళ్ళు త్వరగా ఎండిపోయినయి
పనైతే చేస్తుంది కానీ మన్సు ఇంకో దగ్గర ఉంది.
వంట నూనెలో ఎల్లి పాయలు ఏసి పసుపు ఏసి మస్లించి, అది సల్లారాక బఱ్ఱె తోక భాగంలో ఆ నూనె పూసింది.
ఏదో గుర్తొచ్చినట్లు ఇంట్లోకి పోయి ఓ వెదురు బుట్ట , పిడికెడు బూడిద తీస్కుని షెడ్డుకు చేర్కుంది.
వెదురు బుట్టను దూడ తలపై టోపీలా పెట్టీ ,తెచ్చిన బూడిదతో బఱ్ఱె పెయ్యి పైన అడ్డంగా తోక నుండి మెడ వైపు ఆ బూడిదతో గుండ్రంగా గీత గీసింది.
దూడ తనని తాను దృఢంగా నిలబెట్టుకోనికి ప్రయత్నిస్తా ఉంది.
నిలబడలేక కింద పడిన దూడ మూతికి బుట్టను కట్టి దాని నాల్గు కాళ్ళకు ఉన్న తెల్లని రబ్బరు వంటి మెత్తని పదార్థాన్ని ఒలిచింది.
ఆ ఒలిచిన రబ్బరు పదార్థాన్ని బఱ్ఱె నోటికి దగ్గరగా పెట్టింది,బర్రెకు వాసన సూపించి వాటిని ఓ కాగితంలో సుట్టి దానిని పారెయ్యనికి తండా ఎన్కాల ముళ్ల కుప్ప వైపు నడ్సింది. ఆ సుట్టిన కాగితం కుక్కలకు దొరకకుండా ముళ్ల కంపలో ఏసి వెనుతిర్గింది.
కొంత దూరంల తన ముందు నుండి సంవత్సరం క్రితం కరువు వల్ల సచ్చిన బర్రెల, ఆవుల మందా గుంపుగా పరిగెత్తుకు ఎళ్తుంటే బండబారింది సేవు. వాటిని సూస్తు, ‘ఆ మందలోని ఒక్క పెయ్యదుడ అయిన నా వైపు వస్తె బాగుండు’, అనుకుంటూ మంద దాటిపోయాక సూర్యుడు దుల్పుకున్న దుమ్ముల నిరాశ పడుతూ తన మన్సుల నుండి
పా…………… డ్గి
పాడ………………గి
పాడ…….…………… గీ అనే అవాజ్లను వింటూ ఇల్లు చేర్కుంది.
****
తన తెగ అయిన బంజారా గురించి రాస్తున్నాడు. 2018లో బల్దేర్ బండి (ఎడ్ల బండి) అనే కవితా ఈ సంకలనాన్ని వెలువరించాడు. ప్రస్తుతం ఆ పుస్తకంలోని జారేర్ బాటి (జొన్న రొట్టెలు) కవిత SR&BGNR GOVT DEGREE ART’S AND SCIENCE COLLEGE , ఖమ్మంలో పాఠ్యాంశంగా ఉంది. కవిత్వమే కాకుండా కథలు కూడా రాస్తున్నాడు.