జ్ఞాపకాల సందడి-16

-డి.కామేశ్వరి 

మనం ఒక మొక్కనాటితే పెరిగి పువ్వులో, కాయో పండో ఇవ్వడానికి కొన్ని ఏళ్ళు  పడుతుంది. కడుపులో బిడ్డ ఎదిగి బయట పడడానికి తొమ్మిదినెలలు పడుతుంది. బియ్యం అన్నం అవడానికి అరగంటన్నా పడుతుంది. ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. ఆఖరికి పాలనించి నెయ్యి కావాలంటే పెరుగవాలి, చిలకాలి,  వెన్నతీయాలి, నెయ్యికాచాలి. అన్నీ ఎంతో కష్టపడితే తప్ప ఫలితం చేతికందదుకదా!

మరి దేముడిని మనం ఒక కొబ్బరికాయ కొట్టేసో, పది ప్రదక్షిణాలు చేసేసి, హుండీలో డబ్బులు వేసేస్తే , గుండుకొట్టించేసుకంటే దేముడు మన కోరికలు తీర్చేస్తాడా?

పరీక్షో , ఉద్యోగమో, పెళ్ళో, పిల్లలో, వీసాలో, పదవులో అడగ్గానే  ఇచ్చితిని పొండు అనేయడానికి ఆయనేం వెర్రివాడా. బ్యాంక్లో మనడబ్బు దాచుకుంటేనే  వడ్డీ ఇవ్వడానికి ఏడాది పోనీ ఆరునెలలో మూడునెలలన్నా  పడుతుందిగదా!

దేముడుగారు ఇన్ని కోట్లమంది కొట్టే కొబ్బరికాయలు లెక్కెట్టుకోవాలి, హుండీలోడబ్బులు , గుండులు, అన్ని లెక్కలు పెట్టుకోవాలి. బ్యాంకు లో చెక్కుకుపడగానే కాష్ అవదుగదా! మనం ఇచ్చేదంతా దేముడుగారి అకౌంట్లో  క్రెడిట్ అయ్యాక, మనం చేసే పాపాలు , తప్పుడుపనులు , అన్ని డెబిట్లో జమఅవుతుంటాయిగదా  క్రెడిట్ , డెబిట్ సరి చూసి బేలన్స్ షీట్ తయారు చేయాలిగదా.

పుణ్యాలలో మళ్ళీ షార్టర్మ్ , లాంగ్ టర్మ్ డిపాజిట్ లాగా , స్వార్ధచింతనతో చేసే పూజలు , దానాలకి తక్కువ పెర్సెంట్ పాయింట్లు , బంగారంలాటి మొగుడో పెళ్ళామో రావాలని , పండంటి కొడుకు పుట్టాలని  మంత్రిపదవో , కనీసం ఎమ్మెల్లే పదవో, ఉద్యోగంలో టాప్ పోస్ట్ , ఐఏఎస్ పాసవ్వాలనో , అమెరికా వెళ్లాలనే కోరికలుకొరుతూ చేసే పూజలకి , దాన ధర్మాలకి చాల తక్కువ పాయింట్లన్నమాట .

అదే నిజమైనభక్తి , నిస్వార్ధ చింతనతో , చేసే పూజలు దానాలకి ఎక్కువ పాయింట్లు, నిజాయితీగా దేముడా  నేనిన్ని పాపాలుచేసాను , నన్ను క్షమించు నా పాపాలు కడుక్కోడానికి చేస్తు న్న ఈపూజలు దానాలు స్వీకరించు అని పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తూ చేసే వారికి మీడియం పాయింట్లు…..ఇలా ఎన్ని లెక్కలు చూసుకోవాలి పాపం ఆ చిత్రగుప్తుడు  అదే మన కంప్యూటర్ అదే దేవలోకంలో చిత్రగుప్తుదంటారు .

అపుడే వున్నాయి మనకు గూగుల్ గట్రా. లేకపోతే  ఇన్నికోట్ల జానాభా పాపపుణ్యాల లెక్కలు ఎలా తేల్చేవారు. మన బాలన్సుషీట్  తయారయ్యాక  మన మిగుళ్లు తగుళ్లుచూసి మనకు ముట్టాల్సినది ప్రాప్తి సిద్ధిరస్తు  అని ఫైనల్ సంతకం యెముడుగారు పడేశాక మనకు చెందాల్సినవి దక్కుతాయి.

ఇంత తతంగం ఉండగా ఒక కొబ్బరికాయ కొట్టేస్తే  దేముడు కరిగిపోడు, వరాలిచ్చేయడు.

అంచేత మంచిపనులు చేస్తూవుండండి. ఎంతప్రాప్తం అన్నది దేముడు చూసుకుంటాడు , మన పెద్దలు ఏనాడో చెప్పారుకదా ఇదంతా ..పరీక్షరాయడం  నీ పని.  ఫలితం నీ చేతిలోలేదు అంతే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.