పరాయి దేశంలో కరోనా

-జానకీ చామర్తి

కుటుంబజీవనంలో గృహిణి గా ఆడవారిపాత్ర మీద నాకెప్పుడూ విశ్వాసము గౌరవము ఎక్కువే. నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోను. నా వాళ్ళతో కలసి నడిచే ఆ ప్రయాణంలో , ఎప్పుడూ వెనుకంజ వేయకూడదనుకుంటూ అందులో భాగంగా ఫిట్ గా ఉండటానికి రోజూ సాయంకాలాలు నడకకి వెడతా. అది నాకు శారీరక ఆరోగ్యమూ, మానసిక ఉల్లాసమూ ఇస్తుంది. 

నిండుగా వర్షపు నీరు కలగలిపి ప్రవహిస్తోంది ఆ ఏరు.  ఏటి ఒడ్డున వేసిన సైకిల్ పాత్ అది. రోడ్డు పక్కన ఉన్న బైసికల్ వే, జాగింగ్ కి వెళ్ళేవారికీ అదే దారి. నేను సాయంకాలాలు నడవడమూ అక్కడే. దారికి ఒకపక్క నదిని వేరు చేస్తూ రెయిలింగ్. ఇంకో పక్క వత్తుగా పచ్చగా చెట్లు. దూరంగా కనిపించే కొండా, అంతస్తుల భవనాలు , రోడ్డు మీద బారులుగా సాగే కార్లూ.

ఆ ముందుకు అలా వెళ్ళి ఓచోట మలుపు తిరగచ్చు . నేను అటుపక్క ఒక్కదాన్ని నడవడానికి భయపడి ఆ మలుపు తిరక్కుండానే వెనుతిరుగుతాను. అసలే ఈ దేశంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేము . పడితే ఇక కుంభవృష్టే.

నిన్నసాయంకాలం నడకకివెళ్ళినపుడు కనిపించారు ఆ తండ్రీపిల్లలు .. నాలాగ నడకకి వచ్చినవారు.

నాకు నినిపిస్తోంది , వాళ్ళ  నాన్న అడిగాడు వాడిని .. పెద్దవాడిని, మలుపు తిరిగి ఆవంతెన దాటి నడుద్దామా అని . పదేళ్ళుంటాయ్ వాడికి,

“నాన్నా! చాలు ఇక నడవను “ అన్నాడు.  వాడికంటేచిన్నవాడు అన్న మొహం చూస్తూనిలుచున్నాడు. వాడి మొహానికికార్టూన్ చిత్రాలతో పసుపుపచ్చనిమాస్కు , అదెట్టుకుంటే వాడు ఇంకాబావున్నాడు.

కరోనా తర్వాత వచ్చిన మార్పు ఇది.  వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న తల్లితండ్రులు , స్కూళ్ళు కి సరిగా వెళ్ళలేక , ఇంటోనే బందీలైన పిల్లలతో కాస్త సమయం గడపటం. పిల్లలకీ మంచిదే, తల్లితండ్రులకూ మంచిదే. దీన్నే కష్టంలో కూడా పొందే ప్రయోజనం అంటారేమో..

వాళ్ళ వెనకాలే నడుస్తున్నా నేను , చీకటి లో కాస్త తోడుకీ ధైర్యానికీ వాళ్ళునడుస్తారేమో.. నేనూ మలుపు తిరిగి వంతెన దాటినడుద్దామనుకున్నాను.   

ఇంతలో మలుపు తిరిగి ముందుకు వెళ్ళకుండానే తండ్రీ కొడుకులు వెనుదిరిగారు, వాళ్ళ వెనకే ఉన్న నేను గబ గబా నడచి వాళ్ళనిచేరుకుని, పెద్ద పిల్లాడితో అన్నానునవ్వుతూ , “ ఏం రానన్నావ్ నువ్వు, నువ్వొచ్చుంటే తోడుగా వంతెన దాటి  నేనూ ఇంకొంచం దూరం నడిచి ఉండేదాన్ని అక్కడ ఏముందో చూసేవాళ్ళము కదా  “ అన్నాను.

వాడికి కొత్తగా తోచాయ్ నా మాటలు.. ఆలోచనలో పడ్డాడు , బహుశా రేపునడుస్తాడేమోలే  అనిపించింది, ఆ వంతెన దాటి ఏముందోచూడటానికి.

          ***

మర్నాడు  ఆ దారమ్మట నడుస్తూ నడుస్తూ వాళ్ళకోసం వెతికాను , ఈరోజు హుషారుగా నడుస్తూ కనిపించారు. నేను నవ్వి చేయి ఊపాను. ముందు వాళ్ళే ఇవాళ మలుపు దగ్గరకు చేరుకున్నారు . మలుపు తిరిగారు. నేనూ గబగబా నడిచి మలుపు తిరిగా , . గుబురు చెట్ల మధ్య నుంచి కనిపించిన దృశ్యం చూస్తూ నేను అక్కడే నిలుచుండి పోయాను .

విశాలమైన పచ్చిక మైదానం లోఅదొక పెద్ద ఫుట్బాల్ కోర్టు . మిడిల్ స్కూలు కు అనుబంధంగా ఉంది. లోకల్ మీడియం వల్ల  అందులో మా ఇండియన్ పిల్లలెవరనీ జాయిన్ చేయకపోవడం వల్ల  , అక్కడ ఒక స్కూలు ఉందని కూడా తెలియదు.  స్కూళ్ళు మూసేసినా ,ఆ గ్రౌండుకు వచ్చి ఆడుకుంటున్నారు పిల్లలు.

కరోనా బెంగతో కరడు కట్టిన మనసుకు ఆ పిల్లలూ , వారి ఆటలు చూస్తుంటే ఉత్సాహం ఆశా పుట్టుకొచ్చాయి. మాస్కులు తగిలించుకునే జాగ్రత్తగా ఆడుతున్నారు. ఎక్కువమంది లేరు నిజానికి , అంతా ఒకే చోట కి చేరకుండా ఆ పెద్ద గ్రౌండ్ లో తలో మూలా రకరకాల ఆటలు ఆడుతున్నారు.

ఆ సాయంకాలపు నీరెండలో ఇటీవల కాలంలో నేను చూసిన అత్యంత మనోహర దృశ్యం అదే అనిపించింది. ప్రపంచంకి కరోనా జబ్బు చేసి నిద్రపోలేదు , ఆడుకునే పిల్లలతో మేలుకునే ఉందనిపించింది. నాతో వచ్చిన తండ్రీ కొడుకులు ఆ మైదానం లోకి చేరిపోయి, ఆ ఆటలు చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. చిన్నవాడు వాడి ఆట వాడు మొదలెట్టేసేడు అప్పుడే. వాళ్ళకి దగ్గరగా వెడితే,  వాళ్ళ నాన్నతో పెద్దాడంటున్న మాటలు వినిపిస్తున్నాయ్“ నాన్నా! రోజూ ఇక్కడకి వద్దాం మనం , బలే బావుంది”అంటూ. వాళ్ళ నాన్న వాడి మాటలకు సరేనని తలూపుతూ నాకేసి చూసి నవ్వాడు. నేనూ నవ్వి అతని పక్కనే గట్టు మీద కూచున్నాను . మామధ్య మామూలు పరిచయాలు, కరోనా కష్టాల పలకరింపులూ  అయ్యాయి.

మా అమ్మాయి అమెరికాలో మాష్టర్స్ చేస్తోందనీ, అబ్బాయి సింగపూరులో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులో ఉన్నాడని విని అతనెంతో సంతోషించాడు. తన పిల్లలు ఏం చదవాలో ఎక్కడ చదవాలో ఇప్పటినుంచీ ప్లాను చేస్తున్నానని చెప్పాడు ఉత్సాహంగా. అది టిపికల్ ఇండియన్ పేరంట్స్ మెంటాలిటీ యే. మేమూ అలాగే ఉండి ఉంటాం ఒకప్పుడు. నేను చిరునవ్వు నవ్వి

“ మీరు ఇప్పుడు నుంచే కంగారుపడక్కరలేదు. ఇంకా ముందు ముందు బోల్డు టైముంది మీ పిల్లల పై చదువులకు” అని చెప్పా. అతనూ నవ్వేసాడు తన కంగారుకు.

నేనూ లేచి  పిల్లలకు బై బై చెప్పేసి , నా దారిన నేను నడుచుకుంటూ వెనక్కి వచ్చేసాను.

నడుస్తున్నానన్నమాటే గాని ఆలోచనలు చుట్టుముట్టాయి. పిల్లలూ చదువులూ ప్రస్తావన నా మనసులో  తాత్కాలికంగా మరుగుపడిన అలజడిని పైకి తెచ్చింది.

అమ్మాయి చదువు ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు వీలవదన్న నిబంధన వల్ల ఆగిపోయేటట్టు ఉంది. యూనివర్సిటీలో పార్ట్ టైం జాబు ఇప్పుడు లేదు. తన ఖర్చులకు డబ్బు పంపాలి. కా కొత్త నిబంధనలతో చదువు కంటిన్యూ చేయగలదా, అసలక్కడ ఉండగలదా? కాని అమ్మాయ్ చదువు మధ్యలో వదిలేసి వెనక్కి వచ్చేది లేదని మహా పట్టుదలతో ఉంది.నేనూ ఆవిషయం ని సపోర్టు చేస్తూ అనుకూలమైన మార్పు వస్తుంది, సహనంతో క్షేమంగా ఉండమనే చెపుతున్నాను రోజూ.

చూడబోతే పిల్లాడికి కాలేజీలు మూసేసారు. వాడక్కడ చిక్కడిపోయాడు. ఆ దేశం ఈ దేశం మధ్య విమానరాకపోకలు కు అనుమతి లేదు. వాడి స్నేహితులు వందేభారత్ మిషన్ విమానంలో ఎక్కి ఇండియా వెళిపోయారు. వీడు ఒక్కడూ మిగిలాడు. రోజూ ఏడుపే. “ అమ్మా! నాకు భయంగా ఉంది ఇక్కడ, నేను ఎలాగయినా వచ్చేస్తాను “ అంటూ. వాడిని ఉత్సాహపరుస్తూ నవ్వించే కబుర్లు చెపుతూ , ఒంటరితనం పోగొట్టడానికి నేను వీడియో కాల్ఎ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను ఈమధ్య .

కాని నా మనసులో ఎంత బెంగో ఎంత బాధో. మేమిద్దరమూ ఇక్కడ పిల్లలు అక్కడెక్కడో. పిల్లలు దూరంగా ఉంటే ఎలా ఉన్నారో ఏమి తింటున్నారో అనే బెంగతో పాటు ఇప్పుడు కరోనా జాగ్రత్తలు సరిగా పాటిస్తున్నారో లేదో, వాళ్ళున్న ప్రాంతంలో కరోనా ప్రభావం ఎంత ఉందో, వాళ్ళు సురక్షితంగా ఉన్నారో లేదో అన్న అలజడి,  స్ధిమితం చిక్కనీయడం లేదు. దూరంగా చదువుకుంటున్న పిల్లల తల్లితండ్రులకు ఈ ఆరాటం తప్పదు అనుకుంటూ నిట్టూర్పు విడిచి , నడక వేగం పెంచి గబ గబా ఇల్లు చేరాను.

          ***

పని చేసుకుంటున్న మాధవ డిస్ట్రబ్ అవకుండా, మెల్లగా చప్పుడు చేయకుండా టీ కలుపుకు మగ్గులో పోసుకున్నాను. కిటికీలోంచి కిందకి చూస్తూ తాగుతున్నాను. వర్క్ ఫ్రం హోం కాబట్టి గది తలుపులు వేసేసుకు మరీ పనిచేసుకుంటున్నాడు మాధవ. ఏదో ఫోన్లు కు సంబంధించిన కంపెనీ , ఇండియా నైపుణ్యం బానే ఉపయోగపడుతోంది , మాధవ అలాగే ఇంకొంతమంది ఇండియా ఇంజనీర్ల వల్ల.  ఇక్కడకు వచ్చి ఇంచుమించు నాలుగేళ్ళు కావస్తోంది. చిన్నాడు టెంత్ అవగానే వచ్చాము.

ఏదో అలికిడికి ఉలిక్కిపడి చూసాను, ఎప్పుడొచ్చాడో మాధవ నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ కుర్చీలో కూచునున్నాడు.

“ అరె! కాల్ అయిందా, టీ ఇవ్వనా”

ఇంకో మగ్గులో టీ పోసి ఇచ్చాను. మాధవ ఏదో మధనపడుతున్నాడని తెలుస్తోంది. టీ తాగి మెల్లగా తనే చెపుతాడని ఊరుకున్నాను.

టీ నాలుగు గుక్కలు తాగాక చెప్పడం మొదలెట్టాడు

“ మాలతీ, మా కంపెనీ ఎంప్లాయ్స్ ని తగ్గించేస్తుందిట, బహుశా నా జాబ్ కూడా చెప్పలేము, వెళిపొమ్మనచ్చు”

అయ్యింది, ఈ పిడుగు గురించే అందరమూ భయపడుతున్నది. అది కూడా పడబోతోంది మీద , దైవమా.. ఈ కరోనా జీవితాలలో ఇంత అల్లకల్లోలం సృష్టిస్తోందేమిటి.

నేను వెంటనే ఏమీ మాటాడలేకపోయాను, ఏం మాటాడాలో కూడా తెలీలేదు. ఇక మాధవ మనఃస్తితి ఎలా ఉంటుందో ఊహించగలను.

ఉద్యోగికి దూరభూమి లేదంటూ పొట్ట చేత్తో పట్టుకుని విదేశాలు వచ్చిపడ్డాము. నిజానికి అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ఆశ లేనిదెవరకి. ఇండియాలోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి , పని కోసం కూలీలు వలస పోతున్నారు. మాధవ ఎప్పుడూ అంటూంటాడు

“ మనమూ ఒకరకమైన వలస కూలీలమే    పనికోసం దేశం విడచి వచ్చేసాము” అని.  ఖాళీగా వట్టిచేతులతో వెనక్కూ వెళ్ళలేక , తెగించి ముందడుగు వేయలేక , కొన్ని  చదువు తెచ్చిన అహంకారాలకి , అంతస్ధులనే భ్రమలకు వేలాడుతూ , సాలెగూటిలో చిక్కుకున్న  ఒక మధ్యతరగతి వర్గం మాలాటివారిది. మింగ మెతుకూ కావాలి, మీసాలకు సంపెంగ నూనె కూడా కావాలి. 

“ మరి అయితే ఏమి చేద్దాం?” అడిగాను  గొంతు పెగల్చుకుని.

“ ఉద్యోగం లేక జీతం డబ్బులు రాక  విదేశాలలో ఖర్చులు ఎన్నిరోజులు తట్టుకోగలం  , పైగా వీసా సమస్యలు  కాని వెనక్కి వెళ్ళేందుకు విమానాలు ఏవి, వందే భారత్ విమానాలకు మనమూ రిజిస్టరు చేసుకుంటే , ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చెబుతారు,  అప్పుడు వెనక్కి వెళ్ళాలి, వెళ్ళాక క్వారంటైన్ మిగతావన్నీ ఉంటాయి. తిరిగి వెళ్ళాక నాకు కరోనా గొడవ తగ్గేదాకా కొన్ని నెలలదాకానో ఉద్యోగం దొరకక పోవచ్చు, ఇక్కడున్నప్పుడు కూడా ఖర్చులుంటాయి, పిల్లలకూ పంపాలి” మాధవ తల పట్టుకున్నాడు.

నేను గబుక్కున వెళ్ళి పక్క కుర్చీ లాక్కుని కూచున్నాను. నచ్చచెపుతున్నట్టుగా మాటాడటం మొదలెట్టాను , ఇప్పుడు మొదట నేను చేయాల్సిన పని ధైర్యం చెప్పడమే ననుకుంటూ.

“ నిజమే నాకూ బెంగగానే ఉంది . కాని ఏం చేస్తాం, ఇదేమీ మనం కావాలని సృష్టించుకున్నది కాదు. ఏదో మార్పు వచ్చింది , మనొక్కళ్ళకే కాదు అందరూ కరోనా వల్ల సమస్యలుఎదుర్కొంటున్నవారే .  ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు అన్ని వర్గాలవారూ వారికి తగ్గట్టుగా కరోనా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దానికోసం దిగులుపడి కూచోకండి , ఏదో ఒక దారి దొరకకపోదు”

మాధవ అప్పటికే కొంచం తేరుకున్నాడు , నా మాటలకు  “సరే చూద్దాం “ అంటూ కాస్త చిరునవ్వు నవ్వాడు. 

              ***

పొద్దున్న లేస్తూనే చూసాను మాపాప మెసేజి పెట్టింది,

“ అమ్మా!మా యూనివర్సిటీ కి ఆన్లైన్ క్లాసులకు అనుమతి లభించింది. ప్రస్తుతం మాకు ఏమీ ప్రోబ్లం లేదు. బయటకు ఎక్కువ తిరగకుండా గదిలోనే ఉంటాము, పెద్దఖర్చులేమీ ఉండవు, నా సొంత సేవింగ్స్ లో ఉన్న మనీ  ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాను, డాడ్ ని నాకోసం కొన్ని నెలలదాకా డబ్బు పంపనక్కరలేదని చెప్పు” అంటూ.

రాత్రికి రాత్రే విషయం తెలియగానే మెసేజ్ చేసింది , మమ్మలని కూడా రిలాక్స్ చేయడానికి. నాకు సంతోషం వేసింది “ మా పాప బంగారు తల్లి “ అనుకుంటూ , మాధవకి చూపించాను ఆ మెసేజి. మాధవ కూడా మురిసిపోయాడు, మా పిల్ల కున్న బాధ్యతకు వివేచనకి

“ చూసావా నా కూతురు “ అనుకుంటూ.

కాసేపటికి నా కొడుకూ తనూ తక్కువ తినలేదని తేల్చాడు. ఫేస్ టైం లో కాల్ చేస్తూ

“ మమ్మీ! ఇవాళ నేను  పకోడీలు చేసాను , మా కొరియా రూమ్మేట్ కి తెగ నచ్చేసింది. వాడు సుషి చేసాడు , రెండూ కలిపి తింటే అదిరిపోయిందనుకో. రేపు పలావ్ చేయడానికి వెజ్ తెచ్చుకున్నాను , వంటలు చేయడంలో బలే మజాగా ఉంది, నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, నేను ఛెఫ్ నైపోతున్నా, కరోనా అయిపోయి నేనొచ్చినపుడు మీకివన్నీ వండిపెడతాను” అంటూ దడ దడా చెప్పేస్తుంటే, టీ కలపడం కూడా రాని పుత్రరత్నం , కరోనా పుణ్యమాని ,  వండుకు తింటూ బాగా కాలక్షేపం చేస్తున్నాడని , ధైర్యంగా ఉన్నాడని నాకూ బెంగపోయి హుషారుగా అనుకున్నాను నేనూనూ “ నా కొడుకు” అనుకుంటూ. వింటున్న మాధవ అన్నాడు,

“ పిల్లలు మనకంటే ముందున్నారు, మారిన పరిస్ధితులకు ఎదుర్కోవడానికి . మొదట కొంచం కంగారుపడినా బాగానే ఎడ్జస్టు అయ్యారు కరోనా కాలానికి తగినట్టుగా”

లాస్ట్ బట్ నాట్ లీస్టు లాగ ఆ శుభవార్త అంది , ఊరట కలిగింది మాకు. మాధవ కంపెనీ రిట్రెంచ్మెంట్లు ఆపుచేసిందని, కాని ప్రస్తుత కరోనా ఆర్ధిక మాంద్యం వల్ల ఉద్యోగులు  తగ్గించిన జీతాలతో  ఉద్యోగాలు కంటిన్యూ చేయవలసి వస్తుందని.  “ హమ్మయ్య! సమస్య తీరింది ప్రస్తుతానికి” అని ఇద్దరమూ ఊపిరి పీల్చుకున్నాము.

              ***

ఆరోజు  నడకకు వెళ్ళాను, కేరింతలు కొట్టుకుంటూ నా ముందే నడుస్తున్నారు ఆపిల్లలు. “ నాన్నా.. రా ..రా ! అంటూ అస్సలు తటపటాయించకుండా  మలుపు తిరిగి , ఆ ఆట మైదానం లోకి చొరబడ్డారు. హాయిగా పరుగెట్టి ఆడుకుంటూ, మధ్యలో అక్కడ మిగతా ఆటలు  ఆడుతున్న వారికి కూడా చప్పట్లు కొడుతున్నారు. గట్టు మీద కూచున్న వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటూ అడిగాను

“ రోజూ వస్తున్నారా ఇక్కడదాకా”

వాళ్ళ నాన్న నవ్వి

” వచ్చే దాకా పిల్లలు ఊరికోవడం లేదండీ, నడవడం దూరమైనా వెడదామనే అంటున్నారు” అన్నాడు.

నేనూ కాసేపు  అక్కడే కూచుని  ఆటలు చూసాను.  వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు అనుకున్నాను మనసులో

“ జీవితపు నడకలో కూడా మలుపులు ఉంటాయి . ఏ మలుపు లో ఎలా ఉంటుందో అని అనుమానపడుతూ భయపడుతూ ముందుకు వెళ్ళకుండా ఎలా ఆగిపోతాము.  ఇప్పటికి ఈ కరోనా అనే మలుపు వచ్చింది ప్రపంచం దారిలో. ఆగి పోలేము, వెనక్కి తిరిగీపోలేము .. ముందుకు సాగడమే. మలుపులో ఎదురయ్యేవాటిని  ఎదుర్కోవడమే. కరోనా మలుపు  కొన్ని కొత్త కొత్త జీవితపాఠాలు నేర్పుతోంది .  ఉన్నంతలో సంతోషించడం నేర్పుతోంది. ఆడుకోవడమూ నేర్పుతోంది , పోరాడటమూ నేర్పుతోంది”

తిరిగిన మలుపుతో నా నడక  కొంచం కష్టమనిపించినా, ఆగిపోకుండ ముందుకు నడవ గలుగుతున్నందుకు  మాత్రం నామీద నాకు నమ్మకమూ ఆత్మవిశ్వాసమూ పెరిగాయి. ఈ కరోనా .. ఎంతెంత దూరం..ఇంకెంత దూరం.

                                                                       *****

Please follow and like us:

One thought on “పరాయి దేశంలో కరోనా (మలుపు ) (కథ)”

Leave a Reply

Your email address will not be published.